పంచతంత్రి/చతుర్థాశ్వాసము

చతుర్థాశ్వాసము

శ్రీనిలయకటాక్ష! కులో
ద్యాననవవసంత! సంతతానంద! మరు
ద్ధేనునిభదానగుణ! ల
క్ష్మీనారాయణ! మనోజ్ఞకీర్తిప్రసరా!

1


వ.

లబ్ధనాశంబను చతుర్ధతంత్రం బాకర్ణింపుము.

2


క.

తనుఁ బొందిన యర్ధము సాం
త్వనపున్ వచనములచే వదలు నేవాఁడే
ని, నతండు మోసపుచ్చఁబ
డును నక్రవిభుండు మర్కటునిచేఁ బోలెన్.

3


గీ.

అన నితాంతకౌతుకాయత్తచిత్తులై
యక్కుమారకులు ప్రియంబుతోడ
నతనిఁ జూచి పల్కి రనఘాత్మ! మా కిది
చెవులపండు వొదవఁ జెప్పవలయు.

4


వ.

అనిన మహాత్ముండగు నావిష్ణుశర్మ యిట్లని చెప్పందొడంగె.
మున్ను పుడిసిఁటం బట్టి మ్రింగిననాఁటి బన్నంబు వాపుకొనుటకొఱకుఁ గుంభ
సంభవు నొడిసిపట్టికొన, దిశాభాగమ్ముల వెదుకఁజూచు బాహుదండమ్ము
లన గంధవహప్రేరితంబులై యొండొండ సముద్దండవేగమ్ములై చనుదెంచు
నిడుదతరంగములును, చండకిరణపరితాపంబున నభోమార్గంబునఁ బ్రకాశిం
పక శీతలజలక్రీడావినోదంబుల ద్రుళ్ళింతలిడు తారకంబులన నంతకంతయు
నెగయు నంబుకణజాలమ్ములును, [1]సవనపవనభుగ్యోక్త్రవిరాజితంబగు
మందరమహీధరభ్రమణభారమ్మువలన, మహాయాసంబు నిండిన వృద్ధశ్రవు
నిట్టూర్పులవలనం బొడమె నన, వెడవెడ దిగ్భ్రమణం బాచరించు నావర్తంబు
లును, నిజాంతర్గతవిజృంభమాణబాడబశిఖిశిఖాభయోపప్లవంబుచేతం
బెగ్గిలి కూయిడు నఖిలజంతునివహంబన నితాంతబధిరీభూతరోదోంత
రంబులగు నతిభయంకరనిర్దోషంబులును, నఖిలజగదధీశ్వరమహనీయకీర్తి

పుంజంబులు తనయొడలం జల్లిన విధంబున మహాసిత హరిహరి హలధర
హీరహార హరికర్యమృత ఋక్ష మరున్నదీశ్వేతాబ్జ.............శారద నీరద
నారదపారద హిమవత్కైలాస శశికరపాండురంబులగు డిండీరషండంబులును,
గలిగి యతిమనోహరంబై పుండరీకాక్షు జఠరంబునుంబోలె భువనపూర్ణంబై,
వారవధూనికేతనంబుంబోలెఁ బ్రబలభుజంగసంకీర్ణంబై, మధ్యమలోకంబు
నుంబోలె ననేకభూభృత్సకులంబై గ్రహమండలంబునుబోలె మీనమిథున
కర్కటభాసురంబై, నాకంబునుంబోలె దివ్యవాహినీసమాశ్రయంబై,
పొలుపొందు నజ్జలధివేలాసమీపంబున,—

5


చ.

కల దొకమేఁడిమ్రాను మధుగర్భ మనన్, దనయందు జంతుభృ
త్ఫలములు విష్ణుదేహమునఁ బద్మభవాండములట్ల పుట్టువున్,
నిలుకడ, చేటు, నొంద ధరణిన్ గ్రతుకారణమై ద్విజవ్రజం
బులకు నభీష్టదంబయి నభోమణిచుంబితదీర్ఘశాఖమై.

6


క.

ఆతరువున వానరసం
ఘాతముతో నొక్కవృద్ధకపిపతి వినయో
పేతుడు బలవర్ధాఖ్యా
ఖ్యాతుఁడు విహరింపుచుండుఁ గౌతుక మొదవన్.

7


వ.

తత్కపివరుండును నితాంతమధురంబులగు నౌదుంబరఫలమ్ము
లనుభవింపుచునుండు, నొక్కనాఁడు నిజశయనతలమ్మున నొక్కమేఁడి
పండు పడి నిలువక యకూపారవనమ్ముల నిర్ఘోషమ్ము వొడమం బడియె
నయ్యెడ,—

8


మహాస్రగ్ధర.

పటువాలక్షేపజంఝాపవనవశమునన్ భైరవావర్తముల్ ప్ర
స్ఫుటము ల్గా, బుద్బుదంబుల్ భుగభుగనినదోద్భూతము ల్గా, విశాలో
ద్భటవీచుల్ ఖండము ల్గా, బహుతరమకరాధ్యక్షుఁ డేతెంచె, గంగా
తటినిశాంతర్గతుండై తనరు జవమునన్ దద్ధ్వనిన్ విన్నమాత్రన్.

9


వ.

ఏతెంచి శింశుమారాభిధానుండగు తద్గ్రహాధిపతి యుద్య
దరుణమండలం బాగ్రహంబునం గ్రహించు రాహుగ్రహంబన నౌదుంబర
ఫలమ్ము చేకొని భక్షించి పునః ఫలాహారమనోరథమ్ముల నచ్చట నుండఁ
గతిపయదినమ్ములు చనియె నంత,—

10


క.

బలవర్ధుఁడు తనతోడుతఁ
జెలిమి మనఃప్రియము వొడమఁ జేసి యెడనెడన్

ఫలములు రాల్పఁగఁ దిని నిజ
కులకాంతను మఱచి నక్రకుంజరుఁ డుండన్.

11


ఉ.

ఆమకరేంద్రుభార్య విరహానలతప్తశరీరయై, నిజ
స్వామి విధంబెఱింగి నిముసమ్మున రమ్మని దూతి నంప, ను
ద్దామజవమ్మునం జని ముదమ్మున వానరమైత్రిచేత ని
ష్కామతనున్నవానిఁ గని, క్రమ్మఱ నాయకతోడ నిట్లనున్.

12


గీ.

శింశుమారుండు వానరస్త్రీలతోడ
మైత్రి యొనరించి యన్యమ్ము మఱచి కేళి
సేయఁదొడఁగినవాఁడని చెప్పి దూతి
మిన్నకుండెను, నక్రభామిని తలంక.

13


వ.

అంతఁ బురుషవియోగంబున నక్రభామిని హృదయమ్ములో మద
నాగ్ని ప్రజ్వరిల్లి కాల్పం బొగలెగయ, మనంబను పరమసఖుండు వెలికిం
దెచ్చెనన, వేఁడినిట్టూర్పుగాడ్పున నధరపల్లవంబు గంద, నాక్రోశితభర్తృక
యగు మకరవధూటి వెండియుం దనచేడియం బనిచిన నదియును శింశు
మారుసమ్ముఖమ్మునకుం జని సతివాక్యమ్ములు పతి కెఱిగించిన, నతఁడును
బెద్దకాలమ్మునకుఁ గుటుంబినియొద్దకుఁ బోవువాఁడై తనప్రాణసఖుండగు
బలవర్ధనున కెఱింగించి యతనిచేత నామంత్రితుండై మధురమ్ములగు
నౌదుంబరఫలమ్ములు సంగ్రహించుకొని వచ్చు నవసరమ్మున,—

14


సీ.

దవ్వుదవ్వున వచ్చు తనజీవితేశ్వరు
                    నది సూచి మిథ్యా౽మయంబు దనకుఁ
గల్పించుకొని సఖీగణము విన్నదనమ్ము
                    దాల్చి సేవింపంగ దంభవృత్తిఁ
నొడలెఱుంగనిరీతినున్న కుటుంబినిఁ,
                    బొడగాంచి పరవశంబునఁ బ్రగాఢ
సంశ్లేష మొనరించి సర్వాంగకమ్ములు
                    పుణికి మనోజాగ్నిఁ బొరల నపుడు
దుఃఖవారిధివీచులఁ దొట్రుపడుచుఁ
గన్నుదొవలను గడునశ్రుకణము లురుల

నధికమగు చింత మనమంత నలిమికొనఁగ
గ్రాహముఖ్యుండు గద్దదకంఠుఁ డగుచు.

15


ఉ.

ఈదురవస్థ నొందుటకు నేమి కతంబని తత్సఖీతతిన్
సాదర మొప్పఁబల్కఁగ, నసాధ్యత దోఁపగ దీనిఁ [2][దీర్పఁ]గా?
రాదన, నక్రవల్లభుఁడు ప్రాణములైనఁ దృణమ్ములట్ల నిః
ఖేదముతోడ నిత్తు సతికిం దగదేహగుణమ్ము చేసినన్.

16


వ.

అని వివర్ణవదనుండై పలవించుచుండ, నంత పతిమనఃప్రియం
బెఱింగి పరిచారికాజనం బిట్లనియె, ఎందేనియు నొక్కబాహాటశాస్త్రపారంగ
తుండగు చికిత్సకుం డేతెంచి భవత్కళత్రంబు కరంబు పట్టి చూచి నిదా
నించి యిట్లనియె,—

17


క.

ఈనీచరోగ మరయ, న
హీనవిషము మాడ్కి నెక్కు, నెచ్చటనయినన్
వానరహృదయము దొరకిన
మానుననుచుఁ జెప్పిచనియె మకరాధిపతీ!


వ.

అని చెప్పిన సఖీజనమ్ముపలుకులు విని యతఁడు తనహృద
యంబున..............గా దలంచె, —

18


క.

అపగత సుకృతులు నొకనికి
నెపమిడి యందఱును గూడి నెఱిఁబన్నిన పా
పపుదలఁపు ఘనులకైనను,
కపటంబని తెలియరాదు కరణిక లక్ష్మా!

19


ఉ.

భానుఁడు శీతభానుఁడన, పట్టపగల్ నడురేయటన్న, సు
జ్ఞానుల చంచలాత్ములన, సత్యము గల్లయటన్న, నట్లయై
కానబడున్ మనోజశర[గాహితచిత్తులకున్] దలంప భా
మానికరమ్ముచేత, గుణమండన! విఠ్ఠయలక్ష్మధీమణీ!

20


ఇంద్రవజ్రము.

ఆనక్రముఖ్యుం డపు డాత్మలోనన్
దానెంచి చింతింపుచు ధర్మమెల్లన్

బోనాడి మిత్రుం గపిపుంగవుం బే
లై, నేఁడు హింసింతు నటంచు నెంచెన్.

21


వ.

వెండియుఁ దనమనంబున నిట్లని విత్కరించె.

22


క.

బలవర్ధుఁడు నాతోడన్
ఛలరహితుండగుచుఁ జెలిమిసారెకుఁ జేయున్
గలుషమతి నయ్యు నాతనిఁ
బలుకణఁచెదనంచుఁ దలఁచి పాపుఁడనైతిన్.

23


వ.

అని వివేచించుకయుండం గ్రమ్మఱ భార్యపై మోహమ్ము డగ్గఱిన,

24


సీ.

ఊహింప మిత్రసందోహమ్మునకు, నారఁ
                    బండిన సస్యమ్ము, బాంధవులకుఁ
గనుపండు వొనరించుఁ గల్పమహీజంబు,
                    వంశహేమమునకు వన్నె, గేహ
లక్ష్మికి నెంతయు లాలితంబగు భూష
                    ణంబు, వయస్యాజనంబులకును
దంగేటిజున్ను, బాంధవుల పాలిఁటికిని
                    ఫలియించు మించుతపఃఫలమ్ము
గాన, గుణమణిపూర్ణసాగర మనంగఁ
దగుకళత్రంబు, కరుణచే ధనమునట్ల
వసుమతీస్థలిఁ బాలింపవలసియుండు
లక్షణోపేంద్ర! విఠ్ఠయలక్ష్మ చంద్ర!

25


వ.

అని తనహృదయమ్మున వినిశ్చయంబు చేసికొని బలవర్ధన
హృదయార్ధియై దయాశూన్యుం డగుచు శింశుమారుండు వానరహృద
యమ్ము దెచ్చెదనని సఖీజనమ్మునకుం జెప్పి యంపించుక మందమందగమ
నమ్మున నౌదుంబరతరుసమీపమ్మునకు వచ్చునపుడు.

26


గీ.

వానరవరేణ్యు డప్పుడు వానిఁ జూచి
యొయ్యనొయ్యనఁ జనుదెంచుచున్నవాఁడ
వేమి యనవుడుఁ గైతవ మెఱుకపడక
యుండ, మృదువాక్యములఁ బల్కె నొప్పుమిగుల.

27

ఉ.

ఆరయ నెవ్వరైన నొకయర్ధవశమ్మునఁ జెల్మి సేతు, రిం
పారఁగ, నిష్ప్రయోజనుఁడవై కపిపుంగవఁ నీవు నాయెడన్
గారవ మొప్ప మైత్రి బహుకాలము సల్పితి, విక్రమంబునన్
నీరమణీయధర్మ మవనిం బొగడొందదె! సజ్జనాళిచేన్.

28


వ.

కావున నీతోడి సఖ్యం బేను జేసి పెద్దకాలం బాయె, నీపుణ్యమ్మున
మధురమ్ములగు నౌదుంబరఫలమ్ములు మెక్కి సుఖంబున్నవాఁడ, మున్ను
నీ కెఱింగించి యేను మన్నిలయంబునకుం జనుసమయంబున నాభార్య
శరీరంబునకు వ్యాధి దొడంగి దుర్బలయై పడియున్నం జూచి, నీసముఖంబున
కేతెంచినవాఁడ, నిట్టి యార్తిచేతంబడిన నాకు నీవు దప్పఁ బరమబంధుండు
లేఁడు, నాభార్యను నాయందలి లక్ష్మిని నీక్షింపకున్న, మత్సంతోషంబు
నిష్ఫలంబు.

29


క.

తనలక్ష్మి దలఁప శాత్రవ
జనమున కతిభీతి, బంధుసమితికి సత్యం
బును ప్రీతిగాఁ, జరించుట
ఘనునకు నిది భూషణంబు గరణిక లక్ష్మా!

30


వ.

అది గావున నీవును మత్ప్రాణసఖుండ వగుటం జేసి మన్నిలయంబు
నకు రావలయు. మామకచరమభాగావరూఢుండవై చనుదెమ్మన, నక్కీశ
వరుండును నతికుతూహలమానసుండై యట్ల కావించె, నంతం గ్రూరమాన
సుండగు నక్రవిభుండును వానరుని వీఁ పెక్కించి సరిత్పతి జలమ్ములం దేలి
చనుచు, మిత్రవధాభిలాషంబు తనమనంబునం బొడమి హృదయంబు గలం
చినం, గించిద్విషాదంబున మెల్లనఁ దనలో నిట్లనియె—

31


ఉ.

అక్కట! ప్రాణమిత్రు నిటు నాలికినై దయలేక మిక్కిలిన్
మక్కువవోలెఁ దీపియగు మాటల తేటల మోసపుచ్చితిన్
దిక్కుల నుగ్రకర్మమగు తెంపునఁ నే డపకీర్తి నొందితిన్,
నిక్కము బుద్ధిలేక యని నెవ్వగఁ జెంది, యతండు వెండియున్.

32


ఉ.

అంబుధి నిమ్నతాగుణము, నభ్రమహోన్నతి [3][యెన్మిదౌది]శాం
తంబుల భూవిశాలతయుఁ, దథ్యముగా నెఱుఁగంగ వచ్చినన్

శంబరవైరి [4][తప్తులకుఁ] ౙామలకైతవగుప్తమైన భా
వంబు లెఱుంగరాదు గురువైభవ! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

33


వ.

ఏతద్విధం బెఱింగియు నెఱుఁగనేరక ప్రాణపదంబైన మిత్రునిం
బొలియింపఁబూనితినను పలుకులు నించుకించుక వినంబడిన, నక్రపతివీఁపుపైఁ
బోవుప్లవగవరుండును భయమ్ము నొంది చేయునది లేక విషణ్ణచిత్తుండై కట
కటా! నాబుద్ధికి మోసంబాయెఁ దరుచరులకు శరచరులకు నెక్కడనైన
స్నేహమ్ము సంఘటిల్లునె! కుడిచి కూర్చుండి యీదుర్బుద్ధివెంట నీవిష
మధ్యంబున కేల యేతెంచితి! నని పశ్చాత్తాపంబు నొంది శింశుమారా! యింత
పర్యంతమ్ము నేబుద్ధి తలపోసితి వని యడిగిన, నతండు కపటోపాయమ్మున
నెఱింగింపకున్న, వానరుండు తనహృదయంబునఁ బెట్టుకలఁగి,—

34


గీ.

వీనిహృదయంబు బుద్ధి వివేకమున
యెఱిఁగికొనియెద, నీతనితెఱఁగు మిగులఁ
గైతవనిగూఢమై నాకుఁ గానవచ్చెఁ
జెంతనాడిన పలుకులు చెప్పకున్న.

35


క.

అని నక్రవిభునితో ని
ట్లను, మిత్ర! భవత్కళత్ర మచ్చటఁ గుశలం
బున నున్నదె! యన నాతం
డను నెక్కడి కుశలమని నయంబున మఱియున్.

36


సీ.

గదముచే మిగుల నంగద నొందియున్నది
                    మాంత్రికు ల్వైద్యులు మాన్పనోప,
రననొకించుక శంక, నా, వలీముఖసఖుఁ
                    డిప్పుడు కర్తవ్య మెయ్యదనిన!
మావారిలో నొక్కమంచిచికిత్సకుం
                    డేతెంచి యిట్లెల్ల నెఱుఁగజెప్పి
యరిగె, వానరహృదయమ్మునఁగాని యీ
                    మందు లొసంగిన మానదనుచు,
నేఁడు భార్యఁబ్రీతి నీకతంబున రక్ష
సేయవలయుననిన, స్వీయవధము

తప్పదకట ముదిసి ముప్పున నీరీతి
చేటుపొంది తనుచుఁ జింతచేసె.

37


క.

అని నక్రమునకుఁ గర్మము
లనుభవహేతువులు బ్రహ్మకైనను హృదయం
బున చింతారహితుండై
ఘనమగు మతిఁ గెల్చి మెలఁగఁగాఁవలయు నిలన్.

38


వ.

అని [పలికి] యిన్నీచుం డిక్కార్యమ్ము మన్నివాసంబు ..............
రాక తొలంగదు మన్నిలయంబు చూడ రమ్మని నన్ను నమ్మించి తెచ్చి
నట్టేటం బుట్టిముంచె వీనిమధురవాక్యమ్ములకుఁ జెవిఁ దోరగిలఁబెట్టిన నా
యంత వెఱ్ఱి లోకమ్మునం గలండె! యింతపర్యంతమ్మును సమస్తవానరులు
గొలువ నౌదుంబరసింహాసనమ్మునం బేరోలగమ్ముండి కడపట నీనీచు,
మొసలిచేత వృథానిమిత్తంబునం బట్టువడితినని చింతాక్రాంతుండై దుఃఖించి
వెండియు ధైర్యం బవలంబించి యొక్కసంభ్రమంబు గల్పించుకొని మిత్రుఁడ
వగు భవత్కళత్రంబు బ్రతుకుట సంతసంబుగాదె! యిక్కార్యంబు మున్నె
ఱింగింపవైతివి, మదీయంబగు హృదయంబు నౌదుంబరభూరుహమ్మునఁ
బదిలమ్ము చేసియున్నయది. మనమిద్దఱమును మగిడిచని తదౌషధమ్ము
గొనివచ్చుట కర్తవ్యంబని వెండియు నతం డిట్లనియె,—

39


క.

కుటశాఖాగ్రములన మ
ర్కటహృదయము లుండు, నంగకంబులు వేఱె
చ్చటనైనఁ, దెలియుమన, న
క్కుటిలమతియుఁ బల్కె నక్రకుంజరుఁ డంతన్.

40


గీ.

మర్కటాగ్రణి! యామేడిమ్రానిమీఁది
హృదయ మిప్పుడు గొని వేగ మేగుదెమ్ము
వేడ్క మన్మనోరథము గావింపు, మగిడి
పోదమని వానిఁ దోడ్కొని పోవునంత.

41


వ.

ప్లవగవరుండును, భయసంభ్రమంబులు మనంబునం బెనఁగొన
మగిడిపోయి యౌషధమ్ము దెత్తమని యతనికి బోధించి యతని యంసం
బెక్కి సాగరతీరమ్మున కేతెంచి యచటినుండి భూమిపైకి లంఘించి గ్రక్కున

నత్తరు వెక్కి మానసమ్ము డిందుపఱచుకొని పుత్రమిత్రకళత్రభృత్యామా
త్యులం గనుంగొని, నేఁడు నాచావు దప్పె, నేఁ జేసిన భాగ్యవశంబున మిమ్మం
దఱం గ్రమ్మఱం జూడఁగంటినని వారలకుం జెప్పి, భూజమూలమ్మున నున్న
నక్రేశ్వరుం జూచి శింశుమారా! నాగుండియ యీతరుశాఖాగ్రమ్మున
నున్నది నీ వెక్కి తెచ్చుకొమ్మని పకపక నగి హాస్యమ్ము చేసి యిట్లనియె,—

42


క.

హృదయము కర్ణంబయ్యెను,
మద మణఁగిన ఖరముగాను మకరాధిప! నే
ర్పొదవ విడివడియుఁ గ్రమ్మఱ
మది వొదియుట కనిన, శింశుమారుం డనియెన్.

43


వ.

నాకైతవం బెఱింగి వెడ్డు పెట్టి తిరిగితివి నీయంత నేర్పరి భూలో
కమ్మునం గలఁడే! అయినను మేలు దలంచినవానిమీఁదం గీడు దలంచినఁ
దుదకెక్కునె! కృతఘ్నుండనని, వెండియు నిట్లనియె,—

44


గీ.

కలుషమతినైన నాకు నీకథ యెఱుంగఁ
జెప్పి సంతోషచిత్తుగాఁ జేయుమనినఁ
బ్లవగముఖ్యుండు రోషమ్ము వాసి యప్పు
డతనివదనమ్ముఁ జూచి యిట్లనుచుఁ బలికె.

45


సీ.

ము న్నొక్కకాననంబున మృగేంద్రుండు గో
                    మాయుప్రభుం డాత్మమంత్రి గాఁగఁ
జరియించు నపుడు కుంజరమాంసతుందిలం
                    బగు మేన నొక్కనాఁ డతఁడు కుక్షి
రోగియై సచివవరునిఁ జూచి యో భద్ర!
                    రాసభ హృదయకర్ణములు గలుగ,
నిలుచుఁ జేతనములు, దలపోయ, లేకున్న,
                    వశముగాదని పల్క, వాఁడు సూచి
అధిప! యెచ్చోట నుండిననైన వెదకి
తీపుమాటలఁ దేలించి తెత్తు మీకుఁ
బ్రియము సొంపార నని చెప్పి, నయముతోడ
బాసి చని యొక్కపట్టణప్రాంతమునను.

46

మ.

వెనువెంటన్ రజకుండు మందగతుఁడై వేమాఱు దోలంగ మా
సినచీర ల్దనవీఁపుబంటిపయి వాసిన్మించు పెన్వామియో!
యనఁ, గాన్పింపఁగ, నొక్కగార్దభము దుఃఖావేశభావంబునన్
జనుదేరం గని, జంబుకాధిపతి యుత్సాహమ్ముతో నత్తఱిన్.

47


క.

తనభాషాచాతుర్యం
బునఁ దన్మతి గలఁచి సింహముఖ్యుని కొప్పిం
చిన, నాతఁడు బలురోగం
బున భీషణమైన లావు వోవుట చేతన్.

48


వ.

పాపభీతింబోలె నంగకమ్ములు వణఁక, నుపాయహీనంబగు సంభ్ర
మంబున భక్షింపంజూచిన, నాకీ లెఱిఁగి యాగాడిద పారిపోయిన, మృగేం
ద్రుఁడు జంబుకప్రవరుం గ్రమ్మఱఁ జూచి యిది విధివశంబున రాసభంబు నాకు
సిద్ధింపక, పోయిన పోకయై పోయెననిన, నతం డిట్లనియె,—

49


మత్తకోకిల.

చింత యేటికి నీమనమ్మున సింహసత్తమ! భీతి వి
భ్రాంతి నుధ్ధతిఁ బారినట్టి ఖరంబుఁ దెచ్చెద, నన్ను ధీ
మంతుఁగాఁ దలపోయుమంచు, నమాత్యుఁ డప్పుడు దుష్కృత
స్వాంతుఁడై చని, దానిఁ గాంచి వచఃప్రియంబున నిట్లనున్.

50


క.

ఈరజకు నంశుకమ్ముల
ధారధుకంధరత కంటెఁ బరికింపఁగ, న
ల్పారంభమె! మృగవంశో
ద్ధారకుసేవ యని, మఱి యతఁడు నిష్ఠురతన్.

51


గీ.

గార్దభత్వము నీమదిఁ గానబడియె
దైవ మీనేర్చుఁగాక సంతసము, తళ్లు
గుడువనేర్చునె! యకట చేకూరినట్టి
భాగ్యసంపద నేరమిఁ బాసికొంటి.

52


వ.

మృగరాజు సమ్ముఖమ్మున వనంబులో నీవును మద్విధంబున నతనికి
మంత్రివై యిచ్ఛావ్యవహారమ్ములఁ బరితుష్టిం బొందక, సమస్తజనమ్ముల
మలినవస్త్రమ్ములు మోవ, నీకుఁ బ్రియంబై నిష్కారణంబ మగిడి చనుదెంచు

టకు గతం బెయ్యది? మందబుద్ధీ! నా కెఱింగింపుమనిన నాగార్దభం బిట్ల
నియె,—

53


క.

మృగరాజు నన్ను భక్షిం
పుగతిన్ డాసినను, బారిపోయితి ననినన్,
మృగధూర్తకపుంగవుఁ డొ
ప్పుగ దానిం బోలఁ జూచి పొందుగఁ బలికెన్.

54


వ.

గార్దభేశ్వరా! మృగరాజుసన్నిధిని నీగుణమ్ములు ఘనమ్ము
లుగా నే వర్ణించిన, నమ్మహాత్ముండు ప్రియపూర్వకంబుగా నిన్ను నాలింగ
నంబు సేయ డగ్గఱిన, నది నీ కవిరోధి యని యెఱుఁగనేరక, పారి వచ్చి
తివి. నష్టైటెశ్వర్యంబున కిది గడగుఱుతు గాదే! యని, వెండియు నిట్లనియె,—

55


క.

ధర మతిమంతులకైనన్
బరికింప శుభమ్ములందు బహువిఘ్నంబుల్
పొరయున్, దత్ర్పారంభము
కరము వెలయఁజేయవలయుఁ, గరణిక లక్ష్మా!

56


క.

అనిన మదిఁ బొంగి రాసభ
మనఘా!, నీవెంట వత్తు ననిన, నతఁడు ర
మ్మని వెసఁదోడ్కొని తనదు వి
భునిసాన్నిధ్యంబుఁ జేర్చె బుద్ధినిపుణతన్.

57


వ.

అయ్యవసరమ్మునం దనకోర్కె సఫలమ్ముఁ జేసిన జంబుకనాథుం
గౌఁగిలించుక యతనివాచాస్ఫూర్తికి మెచ్చి రాసభంబును దగ్గఱం బిలిచి
పంచత్వమ్ము నొందించి, జంబుకవరుం జూచి నిత్యకర్మం బాచరించి వచ్చి
యౌషధమ్ము సేవించెద, నే వచ్చునంతకు నీఖరశవంబు పదిలంబని చెప్పి
చనునంత,—

58


గీ.

ఎట్టి యౌషధంభొ! యిది మృగేంద్రుని పాలు
సేయ నేలయనుచుఁ, జేరి రాస
భంబు హృదయకర్ణభక్షణం బొనరించి
యుండె నెలమి జంబుకోత్తముండు.

59

వ.

అప్పుడు మృగవిభుం డాచమనంబు సేసి యరుగుదెంచి, గర్దభంబు
డగ్గఱి దానిహృదయకర్ణంబులు లేకుండుట వీక్షించి గోమాయువుం జూచి
దీనిహృదయకర్ణంబులు గానమని యడిగిన, జంబుకం బిట్లనియె,—

60


చ.

ఖరము మృగేంద్రవర్య! చవిగల్గిన మత్కపటప్రభాషలన్,
గరమటు మోసపోవునె! మనమ్మున మిక్కిలి గుండె కల్గినన్,
వరమతి [నిన్ను సేరుటకు] వచ్చునె! యన్న, నతండు చింతతోఁ
బొరలుచునుండ, జంబుకవిభుండును గౌతుకమందె నాత్మలోన్.

61


అది గావున నెఱిఁగి యెఱిఁగి, వెఱ్ఱి ఖరంబుగాను మృతురాకృత
పుణ్యఫలమ్మున నీచేఁ జిక్కు విడివడి బ్రతికితిఁ, గృతఘ్నుండవగు నీతోడి
సఖిత్వం బింతియి చాలు, నిష్కల్మషుండగువానికి దైవంబు సహాయంబగు
నని తన్ను నిందించు వానరేంద్రుం గని శింశుమారుండు లబ్ధనాశనంబగు
టకు మనమ్మున సంతాపించుచుఁ దనమందిరంబున కరిగెఁ దదనంతరంబున
వానరపుత్రుండగు సుశర్మయనువాఁ డేతెంచి, తండ్రికిం బ్రణామం బాచరించి
తదనుమతంబున శాఖాగ్రంబునఁ గూరుచుండి తన్మంత్రివరులచే శింశుమార
వృత్తాంతంబంతయు విని, కోపాటోపంబున జనకవిరోధిం బొరిగొనవలయు
నని చింతించి తండ్రి కిట్లనియె,— అయ్యా! శింశుమారుండు పాపి వానిం
బొరిగొనక యేల పొమ్మంటివి! అపకారికి నుపకారంబును, నుపకారికి నపకా
రంబునుఁ జేయుట ధర్మవిరోధంబు. ము న్నొకవిటుండు వేశ్యం బొరిగొన్న
యట్లు, వాని వధింపవలయుననినఁ గుమారునకుఁ దండ్రి యిట్లనియె,—

62


గీ.

పుత్ర యిట్టికథయుఁ, బూర్ణమ్ముగా నాకుఁ
దేటపడఁగ నెఱుఁగఁ దెల్పుమనిన,
నతఁడు చెప్పఁదొడఁగె, నాకథావృత్తాంత
మలరి విన్న మోహ మావహిల్ల.

63


సీ.

జనక! చెప్పెద విను చతురాంగి యన నొక్క
                    వారభామిని మరువారువంబొ!
యన నొక్కపట్టణంబున నుండు దానికి
                    నిద్దురకును నూఱుగద్దెణములు
నిత్తురు పల్లవు, లీయంగఁ దల్లియుఁ
                    దానును భోగేచ్ఛఁ దగిలియుండ

నొక్కవిటుండును నక్కమలాయతా
                    క్షినిఁ గూడి మోహమ్ము [5]కొమరు మిగిలి
పగలు రేయను భేద మేర్పరుపలేక
దానిపసలను దగిలి నిత్యంబు నొకఁడు
మదనకదనమ్ములోపల సదమదముగ
మునిఁగి పోరాడుచుండ నామోహనాంగి.

64


వ.

ఆభుజంగపుంగవున కేలుబడియై యితరవిటుల నొల్లక, యవ్వేశ్య
తనకుఁ గలిగిన సకలపదార్ధమ్ములు నతనికి నెదురువెట్టఁ, దన్మాత యంతయుం
గనుంగొని యసహ్యంబునఁ గూఁతున కిట్లనియె,—

65


ఆ.

కొమ్మ! నూఱుమాళ్లు గో రొక్కనాఁటనే
తెచ్చుదాన వీవు తెలివి బెగడి
ముసలి ముందటికిని మొగ్గితి వయ్యయో
వీని విడిచి సుఖము వెలయఁగనుము.

66


వ.

అని చెప్పిన తల్లిమాటలు కూఁతురు సరకుగొనకయున్నఁ, దదంబ రా
పట్టిం జేకొని, దీని వెఱ్ఱిఁ గొని వీనిం గీటునం బొరిగొనవలయునని, యుద్యోగిం
చిన, నావగ్గుపల్కు లాభుజంగుం డాకర్ణించి వేశ్య యెఱుంగకుండ, నొక్క
సర్పశవంబుఁ దెచ్చి నిద్రించుచున్న లంజతల్లి వక్త్రరంధ్రమ్ములోఁ దల
వెట్టి తద్భోగంబు సాఁగిల విడిచియున్న సమయమ్మున — తదనంతరంబ,—

67


ఆ.

వేశ్య తల్లిఁ జూచి వేఁదుఱి విటునితోఁ
బాము గల దటంచుఁ బయి ననంగఁ
నతఁడు ముసల మెత్తి యాముదుసలిమీఁద
మొత్తె గ్రుడ్లు వెళ్లి ముండ ౘావ.

68


వ.

ఇట్లు విరోధియగు వేశ్యాంబను విటుండు వధించి ప్రియురాలిం
జూచి సఖీ! సర్పము విదళించితి భవన్మాతయు సర్పమ్ముతోఁ గూడ నిరయ
మ్మున కరిగెనని చెప్పిన, నావేశ్యయుఁ బ్రలాపించి భుజంగునిఁ గూడి సుఖం
బుండెనని జనకునితో పుత్రుఁడు చెప్పిన విని యావానరుం డిట్లనియె.—

69

గీ.

పుత్త్ర! యెట్టిడైనఁ బొలుపొంద సేమమ్ముఁ
జేసెనేని యతనివాసి యెఱిఁగి
మనుప లెస్స కీఁడు గనుపించెనేనియుఁ,
జంపవలయు విప్రుౙాడ తెలిసి.

70


వ.

అది యెట్లని యడిగిన, బలవర్ధనుండు సుతున కిట్లనియె - ము న్నొక
పట్టణమ్మున తపోనిధియగు వృద్ధవిప్రుండు గలఁడు. అతండు నిత్యమ్మును
కాననమ్మునకుఁ జని, జంబుకషండంబున కాశీర్వాదంబుఁ జేసి, యక్షతలిడి
వచ్చుచుండ నొక్కనాఁడు నక్కలెల్లఁ గూడుక విప్రో త్తమా! నీయభిలాష
యెఱింగింపు మన నతండు తన కొక్కపాఁడిమొదవు గావలెనని విన్నవించిన,
[నవియు] నెందేనియు నొక్కయాలమందకుం జని, యొక్కధేనువుం దెచ్చి
విప్రుని కిచ్చిన నతండును సంతోషాతిశయమ్మున నిలయమ్మున కేతెంచి,
గోదుగ్ధపానమ్మున సుఖంబున్న, నక్కడ నొక్కనాఁడు,—

71


క.

ధేనువు విడివడి లాయము
లోనికిఁ జని కసవు దినిన, లోఁగక హరిర
క్షానిపుణులు బంధించిన,
దాని నెఱిఁగి బ్రాహ్మణుండు ధారుణిపతితోన్.

72


క.

చెప్పిన, విడుమని రాజును
నప్పన యిచ్చినను హరుల యధ్యక్షులు నీ
గొప్ప[యగు] తేఁజి (యీనె]ను
జెప్పఁగ నీమొదవు, ననుచుఁ జెప్పిరి పతితోన్.

73


వ.

అశ్వరక్షకులపలుకు లాలించి, ధరణీధవుండును, విప్రునిఁ బరిహ
రించిన, నతండును రాజద్వారమ్మున నిలువంబడి, నాకు గోమాయువులిచ్చిన
యీగోవును గుఱ్ఱం బీనెననుట, యన్యాయంబని మొఱయిడిన, నచ్చటివార
లట్లేని నక్కలం దోడ్కొని వచ్చి, మొదవు దోలుకొనిపొమ్మని పరి
హాసమ్ముఁ జేసిన, నాపాఱుండును జంబుకంబు లున్నయెడకుం జని తన
వృత్తాంతమ్ముఁ జెప్పిన, నా నక్కలు తమలో నొక్కవృద్ధగోమాయువు
నంపిన బ్రాహ్మణునివెంట నది వచ్చి రాజు హజారమ్మునఁ గూర్చున్న యవ
సరమ్మున,—

74

క.

ధరణీసురుఁ డచ్చటి యా
నరపతి కెఱిఁగింప, నతఁడు నక్కలవన్నీ
స్థిరమతి నేవని! యడిగిన
శరనిధి కాలంగ నార్పఁ జనిరని చెప్పెన్.

75


వ.

ఇట్లు వృద్ధజంబుకంబు చెప్పిన రాజు విని యెచ్చటనైనను సము
ద్రంబు గాలం జొచ్చునే! యందులకు నక్క లార్పం జనునే యని నవ్విన, నా
గోమాయు వెక్కడనైనను గుఱ్ఱమ్ము లావుల నీనునే! యని ప్రతివాక్యమ్ము
లాడి, నరనాథా! అశ్వరక్షకులు దుర్బుద్ధు లట్టివారలభాషణమ్ములు విని
నీవును విప్రునిగోవు నపహరించితి వనిన, విని యాభూపతి యాగ్రహమ్మునఁ
దననగరిజాగిలమ్ములచే జంబుకంబు విదళింపంబంచిన, నదియును నా సన్న
యెఱిఁగి కాననమ్మున కరిగె మఱియును,—

76


క.

తదనంతరమున బ్రాహ్మణుఁ
డుదితుండై యావు నడుగ నొప్పుగ వాని
న్నదయుండై బంధించిన,
మదయుతుఁడై శాప మిచ్చె మహిపతి వొలియన్.

77


ఆ.

మొనసి బ్రహ్మతేజమున రాజు వొలియించి
ప్రజ్వరిల్లుచున్న బ్రాహ్మణునిని,
రాజ మంత్రివరులు రప్పించి విడిపించి,
యావు నిచ్చి పంప, నరిగె నతఁడు.

78


వ.

ఇట్లు విప్రుండు ధేనువుం జేకొని సుఖం బుండెనని బలవర్ధనుండు
తనసుతున కెఱింగించిన కథ, విష్ణుశర్మ నృపనందనుల కెఱింగించె నంత,—

79


మ.

సతతప్రాభవకృష్ణరాయధరణీచక్రేశకారుణ్యవ
ర్ధితలక్ష్మీవిలసన్నిశాంత! సకలార్ధివ్రాతసస్యావళీ
హితహస్తాంబుద! మేరుధీరకుహనా.................
హతిపద్మాప్త! సమగ్రధీరగుణవిఖ్యాతాఖిలాశాంతరా!

80

క.

కమలభవకులపయోనిధి
సముచితమాణిక్య! బంధుజనమందార
ద్రుమ! దిగ్భామా[సంతా]
నమనోజ్ఞయశోదుకూల! నయసంగణనా!

81


స్వాగతము.

దానకర్ణ! మురదానవవైరి
ధ్యానతత్పర! బుధాశ్రయ! మిత్రో
ద్యానమాధవ! దయాకర[మూర్తీ!]
మానినీనివహమన్మథరూపా!

82

గద్య. ఇది శ్రీభారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రిపుత్ర,
సుజనవిధేయ, భానయనామధేయ ప్రణీతంబయిన పంచతంత్రి యను
మహాప్రబంధంబునందు చతుర్థాశ్వాసము

  1. "సవనవన" అని మూలము.
  2. "కూతగా" అని మూలము
  3. “యేనుయెన్మి" అని మూలము.
  4. "తూఁపులకు" అని మూలము.
  5. యతిభంగము