పంచతంత్రి/పంచమాశ్వాసము

పంచమాశ్వాసము

గ్రంథపాతము

ఆ.

.............................................
.............................................
..............................ల్లఁ దిరుగున
కులము గాంచి శోకకలితుఁ డగుచు.

1


చ.

నకులము నాత్మ నమ్మి నరనాథునియొద్దకు బోవునంత, న
ర్భకుని వధించె, దీని జముపాలికిఁ బుచ్చెదనంచు ఱోఁకటన్,
బ్రకటితరోషుఁడై యడంచి ప్రాణములం బెడబాపి, యింటిలో
నికిఁ జని కాంచె నంత, ధరణీసురముఖ్యుఁడు సర్పఖండముల్.

2


క.

వెండియుఁ బొదిగిఁట నాడుచు
నుండిన బాలకునిఁ జూచి, యుర్వి నకాండో
ద్దండతర [కోపవశతను]
దండించితిఁ జూడ నివ్విధంబున, నకటా!

3


సీ.

చిఱుగజ్జెమ్రోఁతలు చెవుల పండువు గాఁగఁ
                    దేఁకువ వెనుక నేతెంచు విధము,
చప్పు డాలించి మీసలు దీటుచునుఁ జెంతఁ
                    గూర్చుండి, నిక్కి కన్గొను తెఱంగు,
కలుఁగుల విహరించు నెలుకలుతండమ్ము
                    నెమకి పట్టుకవచ్చు నేర్పు కలిమి,
విషవైద్యుఁ డాడించు విషధరమ్ముల ఘర్ఘ
                    రారావమున డాయ నరుగు బాగు,
దలఁచి మదిలోన నెట్లోర్తు దైవ మిట్టు
చేసె, నానేర మెంతని చెప్పవచ్చు!
కలుషవశత నసంప్రేక్ష్యకారినైన
నన్ను దిగనాడిపోయితే! నకులముఖ్య!

4

వ.

హిత వాచరించిన నిన్ను నెఱుంగ లేనైతినని, బహువిధంబులఁ
బొగులుచు నాత్మబుద్ధి నిందించుచున్న యవసరమ్మున, సస్యసేని చనుదెంచి
హతంబైన నకులంబును, ఖండితభాగంబైన సర్పంబును గనుఁగొని, యిది
యేమని? జీవితేశ్వరు నడిగిన, నతండు గద్గదకంఠుండై నిట్టూర్పు నిగుడించుచుఁ
దద్వృత్తాంతంబంతయు నెఱింగించె, నంత పుణ్యచారిణియగు నబ్భామిని
దేవశర్మవదనమ్ముపైఁ జూడ్కి నిలిపి, యల్లన నిట్లనియె,—

5


గీ.

అధిప! యెవ్వఁడేని నపరాధియైనను
ద్రుంపవలయు నతని దోసమనక,
మున్ను వైశ్యు నొకని, నెన్నంగ మంగలి
నొకనిఁ జంపె రాజు ప్రకటితముగ.

6


క.

అన విని పాఱుఁడు సతితో,
వనితా! యాకథ యెఱుంగవలయును, నాకున్
వినిపింపుమనిన, నాసఖి
తనభర్తకుఁ జెప్పఁ దొడగెఁ దాత్పర్యమునన్.

7


సీ.

మును పొక్కనగరమ్మునను వైశ్యుఁ డొక్కఁడు
                    సౌవర్ణి యనువాఁడు సతియుఁ దానుఁ
గాపురం బటు సేయఁ గలుగక కలిగెను
                    గడసారి, సుతుఁడు చొక్కముగ నతఁడు
పుట్టిన పదిదినములకు, నాతని తల్లి
                    జముఁ గొల్వ వేగంబ జనిన పిదపఁ,
దల్లిగండం బని తండ్రి యెత్తుకపోయి
                    యూరి బయటను వానిఁ బారవైవ
భూమిదేవి సతీరూపమునను వచ్చి
వైశ్యబాలకు నెత్తుక వాంఛతోడఁ
జన్ను గ్రోల్చియు బోషింపఁ జతురవృత్తిఁ
బ్రబలె నానాఁటికిని వాఁడు భౌమి యనఁగ.

8


వ.

అంత నాభౌమియు భూరక్షణంబునం బెద్దవాఁడై స్వకులనిలయంబున
వివాహంబైన భామవలనఁ గుమారకుఁ గుమారికలం బడసి యున్నయెడ,—

9

గీ.

బంధురంబగు దారిద్య్రబాధచేతఁ
దన్ను దిట్టుక దుఃఖసంతాపుఁ డగుచు,
విధిని దూరుచు నొకనాఁడు వేఁగుఁబోక
నిద్ర నొందినవేళను భద్రముగను,

10


వ.

అధికతరదారిద్ర్యదుష్కృతాపహారియగు నొక్కదివ్యపురు
షుం డావైశ్యునిస్వప్నంబున వచ్చి, తనదేహశాంతులు తటిల్లతలన, నద్భు
తంబుగా నిలువంబడిన నావణిక్కు భయసంభ్రమంబుల నతనికిఁ బ్రణామంబుఁ
జేసిన నమ్మహాత్ముండును బ్రసన్నహృదయుండై యతనిం జూచి యోవత్స!
మీ తల్లియగు నిల నన్ను నీకడ కనుప వచ్చినవాఁడ, నీదారిద్య్రనాశంబు
సేయవచ్చిన యోగిశ్రేష్ఠుండ, నీవును నీనిలయంబున నొక్కదీపిక యమర్చు
కొని వేదికమీఁదఁ గూర్చున్న, భవదీయగృహంబునకు భిక్షార్థంబు మువ్వురు
భిక్షుకు లేతెంతురు. వారలం జూచినయప్పుడు కరుణారహితహృదయుండవై
హస్తమ్మున లగుడమ్ము సంధించుక యామువ్వుర వధింపుము, వారల
కాయంబుల యందుండి మూఁడుకొప్పెరల ధనం బేతెంచు, నది నీ కబ్బు
దానం జేసి నీదారిద్ర్యమ్ము సర్వమ్మునుం బోవు నిది నిశ్చితార్ధమ్ము తొలి
కొండకుఁ, జండకిరణుం డేతెంచుచున్నవాఁడు, ప్రభాతంబున నేఁ జెప్పినవిధం
బాచరింపుమని చెప్పి, యతండు తిరోహితుండయ్యె నయ్యవసరమ్మున,—

11


ఉ.

ఆతఁడు మేలుకాంచి హృదయమ్మున నద్భుత మందుచుండి ప్ర
ద్యోతనుఁ డైంద్రదిక్ఛిఖరిఁ దోఁచినయప్పుడె, తీర్ధమాడి ప్ర
ఖ్యాతిగ వేదికాసనమునందు సుఖాసనుఁడయ్యు, చేతుల
న్నాతతమౌసల మ్మొకటి యడ్డయియుండఁగ, నద్భుతంబుగన్.

12


చ.

కరముల దండమ్ము ల్మెరయఁ, గాయరుచుల్ వెలికుబ్బ, బాలభా
స్కరకిరణమ్ములన్ దెగడఁగా నరుదెంచిరి మందహాసభా
సురవదనారవిందులయి చూచుచు మువ్వురు భిక్షు, లంబరాం
తరమున నుండి నిర్జరులు ధాత్రిఁ జరింపగ వచ్చిరో! యనన్.

13


వ.

అయ్యవసరమ్మున నావణిక్కు నామువ్వురు భిక్షులం జూచి
స్వప్నంబు ......... యమదండంబునుం బోలిన భుజాదండంబున నమర్చియున్న
ముసలంబు నెత్తి భయంబు లేక యాభిక్షుకత్రయమ్ము వధియించునప్పుడు
వారలదేహమ్ములందుండి మూఁడు కొప్పెరల ధనం బుదయంబయ్యె నంత,—

14

క.

ఆకుణపత్రయ మొక్కట
జోకగ భూఖాతమందుఁ జొప్పించి తనున్
రాకొమరు లెఱుఁగకుండగఁ
బ్రాకటముగ ధనము నింటఁ బాతుక యుండెన్.

15


వ.

ఇట్లు వైశ్యుండు లబ్ధద్రవ్యుండై సకలదారిద్య్రవిచ్ఛేదమ్ము చేసి
సర్వసౌఖ్యము లనుభవింపుచు బ్రాహ్మణపూజాతత్పరుండై బంధుజనపారి
జాతుండనఁ గళత్రలోలుండై సుఖంబుండినంత,—

16


క.

ఆకోమటికిని వశుఁడై
తేఁకువ నొకక్షౌరకుండు ధీయుతుఁడై, తా
జోకను బనిసేయుచుఁ దే
[1]జోకీర్తులు వెలసియుండు, సురుచిర మహిమన్.

17


క.

ఆమంగలి కోమటిసతిఁ
ప్రేమంబునఁ దగిలి యుండఁ, బ్రీతిని వణిజుం
డామంగలిసతిఁ గూడుక,
తామును నన్యోన్యసతులఁ దగులుక యుందుర్.

18


వ.

ఇట్లు త్రైవర్ణికక్షౌరకు లొకరొకరిభార్యలం గూడుక వినోద
మ్ములు సలుపుచుండునంత, నొక్కనాఁటిరాత్రి నాపితుఁడు కోమటి
భార్యతోఁ గూడి యుండి యిట్లనియె, భామా! భవద్గృహమ్ము పూర్వమ్ము
వలె గా దిప్పుడు వస్త్రాన్నంబులకుఁ గొదువలేక యుండిన యట్లున్నది యీ
విధం బెఱిఁగింపు మనిన, నది యిట్లనియె,—

19


గీ.

ముగురుభిక్షులు మాయింటి కగణితముగ
వచ్చియుండంగ మాసెట్టి వారిఁ బట్టి
చంపివేసినకతమున సకలధనము
కలిగియున్నది మా కని కాంత చెప్పె.

20


క.

చెప్పిన మాటలు మంగలి
తప్పక విని తాను నట్ల తాలుతుననుచు

న్నొప్పుగఁ జని యంగడిలో
గొప్పగఁ దిరుగాడు భిక్షుకుల ముగురిఁ గనెన్.

21


గీ.

చూచి వారలఁ ౙంపంగ సొరిది నరిగి
భిక్ష మిడియెద రమ్మంచుఁ బిలిచి తెచ్చి,
తనదు నిలయమ్ములోనికి ధార్మికులను
దెచ్చి బంధించి చంపగఁ దివురుటయును.

22


క.

ఆసన్న భిక్షు లెఱిఁగియు
మోసంబని కూతలిడఁగ, మూగుర నొకనిన్
వే సమయింపగ, నంతటఁ
గాసిలి తలవరులు వచ్చి కని రవ్వారిన్.

23


వ.

ఇట్లు భిక్షుద్వయాంబష్ఠులఁ దలవరులం గనుంగొని యాపీనుఁ
గెక్కడిది యని యడిగిన యాజోగు లిట్లని తమవృత్తాంతంబుం జెప్పిన, నా
మంగలిం బట్టికొని రాజసన్నిధికిం దోడ్కొనిపోయి వాఁడు చేసిన దుర్వ్యవ
సాయంబు రాజునకు విన్నవించిన నతండు నాపితుని శూలప్రాప్తుం జేయు
మనిన, నాతలవరులు వానిం బంధించుకవచ్చునెడ, నాయంబస్ఠుం డిట్లనియె —

24


గీ.

నేన కాదు, యిట్టి నీచకృత్యము భౌమి
చేసినాఁడటన్న, వాసి నెఱిఁగి
వానిఁ బట్టుకొనియు వసుమతీపతి సమ్ము
ఖమునఁ బెట్టుమనియె [ఁగడఁక] నతఁడు.

25


వ.

ఇట్లు ధవుఁ డాగ్రహమ్మునఁ ద్రైవర్ణికాంబష్ఠకుల నిద్దఱిని శూల
ప్రాప్తులం జేసి వారిభార్యలవృత్తాంతంబుఁ జారులచేత విని, వారలమేనఁ
దైలాంబరమ్ములు చుట్టి యగ్నిఁ దగిలింపించె నంత—

26


క.

కావున నీవును నకులము
జీవము ద్రుంచితివి గాన చేడ్పడ నిన్ను
న్నావిధము సేయవలెనని
దేవియుఁ బతి కెఱుఁగఁ జెప్పి ధృతి నిట్లనియెన్.

27

క.

అమలసుకృతములకుం ద్వరి
తము, దారుణమైన దుష్కృతములకు నాల
స్యము, సేయవలయు ఘనులకుఁ
బ్రముదితహృదయమున, నూత్న భరతాచార్యా!

28


క.

ఇది కార్య మిది యకార్యం
బిది యగు నిది కాదు నాక యెవ్వఁ డొనర్చున్
దుది వానిక్రియలు చెడు బూ
డిదయం దజ్ఞానమున నిడిన హుతమువలెన్.

29


ఆ.

నీవు బిడ్డవోలె నెఱి నకులమ్మును
బెంచి నిరపరాధి ద్రుంచితయ్య
విశ్వసింపలేని వేదుఱు చెడిపోవు
శిష్యయుగమువోలె సిద్ధముగను.

30


అది యెట్లని యడిగిన సతి యిట్లనియె ము న్నొక్కగిరిసమీపం
బున నొక్కవనంబు గల దందు సిద్ధవటుండను యతి గలం డాయోగి తపో
జ్ఞానసంపన్నుండై విలసిల్లుచుండ, సితాసితులను నిద్ద ఱమ్మహాత్ము నాశ్ర
యించి పెద్దకాలమ్ము శుశ్రూష సేయుచుండ నతండును వారలభక్తికి మెచ్చి
సితునకుఁ గూ యను నక్షరంబును నసితునకు దా యను నక్షరంబునుంగా
నిద్దఱికి ద్వ్యక్షరి యుపదేశించి వారలం జూచి శిష్యులారా! యిమ్మంత్రం
బులు మీ కభీష్టమ్ము లిచ్చుఁ జనుండని యనిపినఁ, బెద్దయగువాఁ డున్నత
లోకేక్షణుం డయ్యెఁ గనిష్ఠుండు నధోలోకేక్షణుం డయ్యె ని ట్లొండురులమన
మ్మున నిశ్చయించుకొని గురువుచే నిమంత్రితులై, వియల్లోక పాతాళలోక
మ్ములకుం జనిరంత,—

31


ఆ.

పెద్దయగు సితుండు దద్దయు నొకవిమా
నంబుమీఁద నెక్కి తుంబురుండు
వోలె చనియు నన్నిభూములు వెసఁ జూచి
దిగువసీమఁ జూడ ది[విరి భువికి].

32


వ.

వచ్చుచున్నంత—

33

క.

అసితుఁ డధోలోకమ్ముల
విశదమ్ముగఁ జూచి, మింటివీథులఁ జూడన్
వెసఁదిరుగుచు రథమెక్కియుఁ
గసుగు వడక వచ్చుచుండఁ గనె తనయన్నన్.

34


వ.

అట్లంబరతలమ్మునఁ—

35


ఆ.

చూచి మ్రొక్కి లేచి సురుచిరమ్ముగ మన
గురువు మంత్రశక్తి కుదురు కతన
నిట్టి భాగ్యమహిమ యింపుతో నబ్బెను
ననుచుఁ గౌఁగిలించుకొనుచు మఱియు.

36


వ.

అన్నా! మనగురువు చెప్పిన మంత్రమ్ము లొకరికొకరు విను
నట్లుగా నుచ్చరించవలయు, నీ మంత్రమ్ము నాకుఁ జెప్పుము, నా మంత్రమ్ము
నీకుఁ జెప్పెదనని పల్కి, పెద్దయగువాఁడు గూ యని చెప్పె, పిన్నయగువాఁడు
దా యని చెప్పె, రెండక్షరమ్ములు గూర్చి పలుకనది దుర్ధ్వనియైన, నయ్యిరు
వురు రోసి యిట్టి యాభాసమంత్రంబుల నీనీచుండు మన కెఱిగింపవచ్చునే!
యని గురువును నిందించిన నాయాకాశపథమ్మున నుండి యయ్యిరువురు
రథంబులతోడ, భూతలంబునం బడి చచ్చి యమలోకమ్మున కరిగి రంత.

37


సీ.

మొదల విశ్వాసమ్ము పదిలమై యుండంగ
                    నా మంత్రమునఁ గల్గె నమరచర్య,
పిదప విశ్వాసమ్ము పేఁదయై యుండిన
                    నామంత్రమునఁ జచ్చి రవనియందుఁ,
గావున గురువు నేకథను జెప్పిననైన
                    విశ్వసించుచు నుంట శాశ్వతంబు
నీవు ముంగిసమీఁద నెనరు లేకుండంగ,
                    నఘసంచయమ్ము ని న్నలమికొనియె


గీ.

మనుజుపుట్టువుఁ బుట్టి యేమనుజుఁడైన
నొనర నవుగాము లరయక యుండెనేని
శిష్యుచేతను గురువు చచ్చిన విధమ్ము
వచ్చు నతనికి నని చెప్పె వారిజాక్షి.

38

క.

చెప్పిన పని విని యాకథఁ
జెప్పుమనిన మోహనాంగి చతురతతోడన్
దప్పక [పతి కీవిధమున]
గొప్పగు మతిఁ జెప్పఁదొడగెఁ గోరికలూరన్.

39


సీ.

నానాథ! విను మున్ను నళినసంభవునకు
                    వాసియౌ ననునట్టి బ్రాహ్మణుండు
బ్రహ్మచర్యంబున బ్రహ్మవిజ్ఞానంబు
                    జనియించి, మందిరస్థలిని నిల్వ
కాతండు గహన మత్యాసక్తితోఁ జొచ్చి
                    విశదస్థలమ్మున విమలుఁడగుచు
నాసీనుఁడై హరి ననవరతమ్మును
                    [ధ్యానంబు] సేయుచుఁ దగిలియుండ


ఆ.

నొక్కవడుగు వచ్చి గ్రక్కున నాతని
నాశ్రయించి హితము నడుగవలసి
శిష్యవృత్తి నుండ, చీకాకు పడి, వని
కారు చిచ్చు సొచ్చి కాలఁజొచ్చె.

40


ఇట్లు చైత్రవైశాఖమాసమ్ములలో మధ్యాహ్నకాలంబునఁ
జిచ్చు దవిలి యడవి కాలందొడంగిన సకలమృగంబులు, ఖగంబులు
రొదలు చెలంగఁ, బరువందొడంగె, నప్పు డాయోగి లేచి శిష్యుండు వెం
టరా, మృగంబు వోలె పరువందొడంగిన,—

41


ఆ.

పోయిపోయి కొంతప్రొ ద్దొక్కచోటను
నలసి నిలువఁబడిన యతనిఁ జూచి
శిష్యవరుఁడు నగ్ని శీఘ్రత వచ్చె, నిం
కొదుగరాదు మనకుఁ గదలు మనియె.

42


వ.

శిష్యునివాక్యమ్ము లాదరించి గురువును సాంద్రగహనగిరి
హ్రదమ్ములు దాఁటి చనుచో నతనికి దాహం బగ్గలంబై యెండందాఁకి, జల

శూన్యంబైన మార్గంబునం జనుచుండ శిష్యుండును ........... పాత్రను జల
మ్ములు సంగ్రహించుక నడుమ బహిర్భూమికిం జని, కొన్నిజలమ్ముల నాచ
మనమ్ముఁ జేసి తక్కినజలమ్ములు సంగ్రహించుకొని వచ్చె, దానింజూచి గురు
విట్లనియె. శిష్యవర్యా! నాకు దాహం బధికంబైయున్నది. నీచేతిజలమ్ములు
నాకుం బోయుమనిన నతం డిట్లనియె.

43


ఆ.

అనఘ! గుదముఁ గడుగఁజన మిగిలున్న యీ
జలము నీకుఁ బోయఁజనదు నాకు,
బాపమందు ననుచుఁ బరుగునఁ బోవంగ
గురువుకూడఁ బోయి కొసరి యడిగె.

44


ఆ.

ఎట్టి జలములైన నేమైనఁ గానిమ్ము
యిచట దప్పిదీఱ యేను గ్రోలి
ప్రాణములను బ్రోచి పరగుదునన్నను,
దోయ మీకపోయె దోసమంచు.

45


క.

పోయెడి శిష్యునిఁ బట్టుక
కాయము రక్షింపుమనుచుఁ గాంక్ష నడిగినన్
బాయుమని యతనిఁ గడచుచుఁ
బోయఁగ వెసఁద్రోఁచి, జలము పాత్రను ఱాఁతన్.

46


క.

పగులగ నడిచినఁ గనుగొని
దిగులునఁ గుతికెండ నతఁడు దేహము విడిచెన్
అది కనుగొని యాశిష్యుఁడు
మదిఁ గలఁగుచుఁ జనియెఁ దనదు మందిరమునకున్.

47


క.

కావున, మనుజుం డుచితము
వేవిధముల నేఱుఁగవలయు విశ్వములోనన్
ఆవిధము నెఱుఁగకుండిన
నా వేఁదుఱునంటు నఘము లవనిలొ నాథా!

48

క.

అని సస్యనేని పతికిని
ఘనముగ నెఱిగించినట్టి కథనమును వేడ్కన్
బని వడగ విష్ణుశర్మయు
నెనరున సౌదర్శనులకు నెఱుఁగఁగఁ జెప్పెన్.

49


వ.

ఇట్లు విష్ణుశర్మ సుదర్శననరేంద్రనందనులకుఁ బంచతంత్రమ్ము
లెఱింగించి వారల నీతిశాస్త్రకోవిదులం జేసెనని,—

50


సీ.

పంపావిరూపాక్ష, భైరవ, విఠ్ఠలే
                    శ్వర, ముఖ్యదేవతావ్రజముచేత,
పరిపంథిగర్వవిభాళన, శ్రీకృష్ణ
                    రాయభూధరభుజారక్షచేత,
భటనటజ్యౌతిషపౌరాణికభిషగ్వి
                    చక్షణసత్కవీశ్వరులచేత,
సంతతమదవారిచారుశుండాలఘ
                    టాజవప్రకటఘోటములచేత,
రమ్యమైయున్న విద్యాపురమ్మునందు,
నిమ్మహాకృతి భానుకవీశ్వరుండు
తెనుఁగుబాస నొనర్చెను వినుతి కెక్క
నవని నాచంద్రతారార్క మగుచుఁ దనర.

51


శా.

దానాంభస్తటినీవివర్ధితసముద్రవ్రాత! దోఃఖడ్గధా
రానిర్భేదనదర్పశుంభదసుహృద్రాజన్యసర్వాంగ! యో
షా౽నూనప్రసవాస్త్ర! సూక్ష్మలిఖితాచార్యాంక! పద్మాధవ
ధ్యానానందితచిత్త! పార్వణసుధాధామాభకీర్తిచ్ఛటా!

52


క.

తారాచలతారాధిప
శారదనీరదలసద్యశఃకర్పూరా
పూరితవిధ్యండకరం
డారూఢ! రమానిరంతరాంచితసదనా!

53

తోదకము.

వారిజసంభవవంశ[సముద్రాం]
భోరుహశాత్రవ! భూరికృష్ణావి
స్తారదృగంచల! సత్యవచస్సం
సార! నయోన్నతచారుచరిత్రా!

54

గద్య
ఇది శ్రీభారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రి పుత్త్ర,
సుజనవిధేయ, భానయనామధేయ, ప్రణీతం బైన
పంచతంత్రి యను మహాప్రబంధంబునందు
సర్వంబును పంచమాశ్వాసము

సంపూర్ణము

ఓం తత్సత్

  1. తేజఃకీర్తులని సంస్కరించినఁ బ్రాసభంగము