నేటి కాలపు కవిత్వం/తత్త్వజిజ్ఞాసాధికరణం

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

తత్త్వజిజ్ఞాసాధికరణం.

వేదాంతం.

ఈకాలపు కృతుల్లో తత్వకవిత్వమంటూ కొంత కనబడుతున్నది. కవిత్వం తత్వజిజ్ఞాసా, చాలా సంబంధంకలవి.

"నానృషిః కురుతే కావ్య" మని భారతీయులు చెప్పుతున్నారు.

భగవద్గీతవంటి తత్వగ్రంథాన్ని కవి వ్యాసుడు తనకృతిలో యేకదేశం చేశాడు. అసలీ తత్వజిజ్ఞాసలకు కవులే బీజావాపకులు.

"నాసదాసీత్ నో సదాసీ త్తదానీం నాసిద్రజో నోవ్యోమాప రోయత్"

(ఋ. మ10. అ 11. సూ 1. ఋ. 1)

ప్రళయదశలో అసత్తులేదు, సత్తులేదు, భూమి పాతాళం మొదలైనవిలేవు. అంతరిక్షంలేదు. (విద్యా. భా.)

"కో అద్దా వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం సృష్టికి
 అర్వాగ్దేవా అస్య విసర్జనేనాధాకో వేద యత ఆబభూవ."
                                                     (ఋ. మ 10. అ 11. సూ 1. ఋ 6)

యేవుపాదానకారణంచేత యేనిమిత్తకారణంచేత ఈసృష్టి సకలం ప్రాదుర్భవించిందీ యెవడికి వాస్తవంగా తెలుసును? యెవడు చెప్పగలడు? ఈభూతసృష్టికి పిమ్మటివారుగా దేవతలుచేయబడిరి. జగత్తేకారణంవల్ల పుట్టిందో యెవడికి తెలుసు? (విద్యా . భా.)

అని వినిపించిన ఋగ్వేదకవివాక్కులు ఈతత్వజిజ్ఞాసలను విశదం చేస్తున్నవి.

"కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత మోహితాః" (భగవ) అని వ్యాసుడు కవుల కీ తత్వజిజ్ఞాసలతోటి గల సంబంధాన్ని విశదంచేస్తున్నాడు. బాదరాయణుడికి పిమ్మట వచ్చిన కాళిదాసాదులు అంతకు పూర్వం వికసితమైన జిజ్ఞాసల నన్నిటిని ప్రసిద్దభారతీయ విద్వద్గోష్ఠుల్లో మననంచేసి ఆపైన వారి అనుభవాన్ని సందర్భంవచ్చినచోట కావ్యమర్యాదతో వినిపిస్తూ వచ్చారు. ఔపనిషదం జైమినీయం పౌరాణికం, కాపిలం కాణాదం నైయాయికం పాతంజలం మొదలైనమార్గాల తత్వ సిద్ధాంతాలను స్వానుభవాలను అనుసరించి మేళగించి కావ్యనయాన కాళిదాసు రఘువంశదశమాశ్వాసంలో దేవతలు రావణ వధార్థం విష్ణువును ప్రార్ధించిన సందర్భాన.

1. "నమో విశ్వసృజే పూర్వం విశ్వం తదనుబిభ్రతే,
   అథ విశ్వస్య సంహర్త్రే తుభ్యం త్రేధా స్థితాత్మనే.

2. రసాంతరాణ్యేకరసం యధా దివ్యం పయోశ్నుతే,
   దేశే దేశే గుణేష్వేవ మనస్థా స్త్వమవిక్రియః.

3. ఏకః కారణతస్తాం తాల అవస్థాం ప్రతిపద్యసే,
   నానాత్వం రాగసంయోగాత్ స్ఫాటికస్యేవ దృశ్యతే.

4. అమేయో మితలోకస్త్వమనర్థీ ప్రార్థనావహః,
   అజితో జిష్ణురత్యంత మవ్యక్తో వ్యక్తకారణం.

5. హృదయస్థ మనాసన్నమకామం త్వాం తపస్వినం.
   దయాళుమనఘస్పృష్టం పురాణమజరం విదుః.

6. సర్వజ్ఞస్త్వమవిజ్ఞాతః సర్వయోనిస్త్వమాత్మభూః,
   సర్వప్రభురనీశ స్త్వమేకస్త్వం సర్వరూపభాక్.

7. సప్తసామోపగీతం త్వాం సప్తార్ణవజలేశయం,
   సప్తార్చిర్ముఖమాచఖ్యుః సప్తలోకైకసంశ్రయమ్.

8. చతుర్వర్గఫలం జ్ఞానం కాలావస్థా చతుర్యుగా,
   చతుర్వర్ణమయో లోకః త్వత్తః సర్వం చతుర్ముఖాత్.

9. ఆభ్యాసనిగృహీతేన మనసా హృదయాశ్రయం,
   జ్యోతిర్మయం విచిన్వంతి యోగినస్త్వాం విముక్తయే.

10. అజస్య గృహ్ణతో జన్మ నిరీహస్య హతద్విషః,
    స్వపతో జాగరూకస్య యాథార్థ్యం వేద కస్తవ.

11. శబ్దాదీన్ విషయాన్ భోక్తుం చరితుం దుస్తరం తపః,
    పర్యాప్తోసి ప్రజాః పాతుం ఔదాసీన్యేన వర్తితుం.

12. బహుధాప్యాగమైర్భిన్నా : పంథానః సిద్దిహేతవః,
    త్వయ్యేవ నివసంత్యోఘా జాహ్నవీయా ఇవార్ణవే.

13. త్వయ్యావేశితచిత్తానాం త్వత్సమర్పితకర్మణాం,
    గతిస్త్వం వీతరాగాణాం అభూయః సన్ని వృత్తయే.

14. ప్రత్యక్షో ప్యపరిచ్ఛేద్యో మహ్యాది ర్మహిమా తవ,
    ఆప్త వాగనుమానాభ్యాం సాధ్యం త్వాం ప్రతి కా కథా

15. కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః
    అనేన వృత్తయః శేషాః నివేదితఫలాస్త్వయి.

16. ఉదధేరివ రత్నాని తేజాంసీవ వివస్వతః, .
     స్తుతిభ్యో వ్యతిరిచ్యన్తే దూరాణి చరితాని తే.

17. అనవాప్తమవాప్తవ్యం నతే కించన విద్యతే.
    లోకానుగ్రహ ఏవైకో హేతుస్తే జన్మకర్మణోః.

18. మహిమానం యదుత్కీర్త్య తవ సంప్రియతే వచః,
    శ్రమేణ తదశక్త్యా వా న గుణానామియత్తయా." (రఘు)

1. మొదట విశ్వంసృజించి, పిమ్మట విశ్వంభరించి. తరువాత విశ్వం సంహరిస్తూ త్రివిధరూపాత్ముడైన నీకు నమస్కారం.

2. ఆకాశసంబంధి జలం యేకరసమైనా, దేశదేశంలో రసాంతరాలను పొందినట్లు, నీవు వికారరహితుడవైనా గుణాల్లో భిన్నా వస్థలు పొందుతున్నావు.

3. నీవొకడవై కూడా ఉపాధివశాన ఆయాఅవస్థలను రాగసంయోగంవల్ల స్ఫటికానికి నానాతత్వంవలె, ప్రాప్తిస్తున్నావు.

4. నీవు కొలతకందవుకాని నీవు లోకాలను కొల్చావు. నీకు కోరికలు లేవు కాని కోరికలు తీరుస్తావు. నిన్ను గెల్చేవాండ్లు లేరు. నీకు సర్వత్రజయం. నీవు అవ్యక్తుడవు కాని వ్యక్తం నీవల్లనే కలుగుతున్నది.

5. హృదయంలో వున్న దూరస్థుడవని, తపస్సాధ్యంలేని తపస్వివని. వ్యసనంలేని కరుణాశాలివని. ముదిమిలేని వృద్ధుడవని అంటారు.

6. నీకన్నీ తెలుసును. నిన్నెవ్వరు తెలియరు. నీవు అన్నిటికి కారణం. నీకు నీవు తప్ప వేరేకారణంలేదు. నీవందరికీ ప్రభుడవు. నీకు ప్రభువు లేడు. నీవు ఒక్కడవి అన్ని రూపాలను పొందుతున్నావు.

7. సప్తసామాలు కీర్తించేది నిన్ను. సప్తసముద్రాలు నీకు శయనం, సప్తజిహ్వుడు నీకు ముఖం. సప్తలోకాలకు నీవు సంశ్రయం.

8. నాలుగు పురుషార్థాలనిచ్చేజ్ఞానం, నాలుగు యుగాలుగా వున్నకాలం, నాలుగువర్ణాలతో వున్నలోకం, ఇవన్నీ నాలుగు ముఖాలుగలనీనుండే కలుగుతున్నవి.

9. హృదయంలో జ్యోతిర్మయమై వుండే నిన్ను అభ్యాస నిగృహితమైన మనస్సుతో యోగులు ముక్తికొరకు ధ్యానిస్తారు.

10. పుట్టుకలేనివాడవై పుట్టుతూ క్రియారహితుడవై శత్రుల సంహరిస్తూ నిద్రలో జాగరూకుడవై వుండే నీయథాస్థితి యెవడికి తెలుస్తుంది.

11. శబ్దాది విషయాలను అనుభవించడానికి, దుస్తరతపస్సు తపించడానికి, ప్రజలను రక్షించడానికి, ఉదాసీనంగా వుండడానికి నీవు సమర్థుడవు.

12. గంగాప్రవాహాలు యెన్నివిధాల చీలినా చివరకు అర్థవంలో కలిసేరీతి సిద్దిహేతువులైన మార్గాలు బహుధాభిన్నాలైనా నీలోనే పడుతున్నవి.

13. నీయందు అవేశితచిత్తులై కర్మలను నీకు సమర్పిస్తూ కోరికలు వదలిన యోగులముక్తికి నీవు గతివి. 14. భూమ్యాదిభూతాలవల్ల నీమహిమ ప్రత్యక్షంగా కనబడుతున్నా యిట్లాటి దని తెలుసుకోవీలులేకున్నది. ఇక శబ్దాను మానాలవల్ల సాధ్యుడవైన నిన్ను గురించి యేమన వలెను?

15. స్మరణచేస్తేనేపురుషుణ్ని పవిత్రపరుస్తావు. నిన్ను పూజించడం దర్శించడం మొదలయిన వాటివల్ల ఫలమెంతగొప్పదో యిందువల్లనే తెలుసుకోవచ్చును.

16. సముద్రంలో రత్నాలు, సూర్యుడికిరణాలు చెప్పవీలులేనట్లు నీచరితలుస్తుతించ అలవికాకున్నవి.

17. పొందదగినదియేదీ, నీవు పొందకుండా వుండలేదు. నీవుజన్మిస్తే లోకానుగ్రహమొకటే హేతువై వుంటుంది.

18. నీమహిమను పొగడి. మావాక్కు లు చాలించడం శ్రమవల్లనో అశక్తివల్లనో గాని నీగుణా లింతే నని గాదు.

అని చెప్పి.

ఇతి ప్రసాదయామాసుః తేసురాస్తమధోక్షజం,
భూతార్థవ్యాహృతిః సా హి న స్తుతిః పరమేష్ఠినః.

ఇదంతా ఆపరమేష్ఠికి స్తుతిగాదు. సిద్ధమైవున్న గుణాలను చెప్పడమేనని పూర్వుల విజ్ఞానానికి తన వినతిని "భూత" శబ్దంచేత వ్యంగ్యముఖాన మనకు వినిపిస్తాడు. ఇట్లానే మాఘుడు.

"బహిర్వికారం ప్రకృతేః పృథగ్విదుః
 పురాతనం త్వాం పురుషం పురావిదః" (మాఘ)

అని పెద్దలంటారని పూర్వుల విజ్ఞానానికి వినతిని చూపినాడు కాళిదాసు అజవిలాపసందర్భంలో వశిష్ఠుడిచేత

1. తదలం తదపాయచింతయా
   విపదుత్పత్తిమతముపస్థితా.

2. రుదతా కుతఏవ సా పునర్భవతా నానుమృతాపి లభ్యతే.
   పరలోక జుషాం స్వకర్మభిర్గతయోభిన్న పథాహి దేహినాం.

3. మరణం ప్రకృతిః శరీరిణాం వికృతి ర్ణీవిత ముచ్యతే బుదైః
   క్షణమప్యవతిష్ఠతే శ్వసన్ నను జంతుర్యది లాభవానసౌ

4. అవగచ్ఛతి మూఢచేతనః ప్రియనాశం హృదిశల్యమర్పితం,
   స్థిరధీస్తు త దేవమన్యతే కుశలద్వారతయా సముద్ధృతం.

5. స్వశరీరశరీరిణావపి శ్రుతసంయోగవిపర్యయౌ యదా,
   విరహః కిమిషానుతాపయే ద్వద బాహ్యైర్విషయై ర్విపశ్చితం.

6. న పృథగ్జనవచ్చుచో వశం వశినాముత్తమ గంతుమర్హసి.
   ద్రుమసానుమతాం కీమంతరం యది వాయౌ ద్వితయే పితే చలాః. (రఘు).

1. ఆమె మరణానికి చింతచాలించు. ఉత్పత్తిగలవాటికి విపత్తుచేరువనే వుంటున్నది.

2. నీవు ఆమెవెంట మరణించినాగూడా ఆమె నీకెట్లాను లభించదు. పరలోకంలో స్వకర్మానుసారంగా దేహులకు గతులు భిన్నంగా వుంటవి గదా. ________________

66

వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

3. మరణమే ఆత్మకు స్వభావసిద్దమైన అవస్థ బ్రతుకువికృతావస్థ అని పెద్దలంటారు క్షణమాత్రమరణమైనా శ్రేయస్సే గదా.

(క్షణమాత్ర జీవితమైనా అని మల్లినాథుడు).

4. ప్రియవినాశం హృదయ శల్యంగా మూడుడు భావిస్తాడు,స్థిరప్రజుడు తెరచిన కుశలద్వార మనుకుంటాడు.

5. స్వకీయమైన దేహాత్మలకే సంయోగవియోగాలు కలుగుతూవుం టతెలిసినపొడేమని బాహ్యవిషయ వియోగానికితాపపడతాడు.

6. వశులలో ఉత్త ముడమైన అజుడా! సాధారణుల వలె | దుఃఖానికి వశం కావడం నీకు అర్ఘంగాదు..

"చెట్లూ పర్వతం రెండూ వాయుపతికి కదలితే వాటి కేమిభేదం?"

అని ప్రాణుల సంయోగవియోగజన్యమైన సుఖదుఃఖాలను గురించి

చెప్పించిన ఘట్టంలో "బుదైః" అని విబుధులవిజ్ఞానానికినతిని కనబరచాడు.

ఆకాలంనాటి విజ్ఞానసౌధాన్ని ఆరోహించి తత్వ జిజ్ఞాసలకు

వెలుగునిచ్చే నూతనానుభవాలను సయితం అక్కడక్కడ కాళిదాసాదులు

అనుగ్రహిస్తూ వచ్చారు. కనుకనే శాస్త్రవేత్తలుసయితం

"కర్తవ్యం కాళిదాసాదేః కావ్యానాం పరిశీలనం" అని అన్నారు.

"భిన్న రుచి లోకః' | (రఘు)

అభితప్త మయోపిమార్ధవం భజతే కైవకథా శరీరిష" (రఘు)

అని తీరున విదీతంచేసిన సార్వకాలిక సత్యాలకు తోడు తత్వజిజూసకు కొత్త వెలుగుచూపించే అనుభవాలను ప్రసాదించినప్పుడు శాస్త్రవేత్తలు వీటిని తమజిజ్ఞాసలలో స్వీకరిస్తూ వచ్చారు. మీమాంసాసూత్రీయ శాబరభాష్యవ్యాఖ్యానమైన తంత్ర వార్తికంలో శిష్టచారవిచారంలో కుమారిల భట్టాచార్యులు

"సతాం హి సందేహపదేషు వస్తుషు
 ప్రమాణమంతఃకరణప్రవృత్తయః"( శాకుం)

అనే శాకుంతలవాక్యాలను గ్రహించారు. వైయాకరణసిద్ధాంత గ్రంథమైన వాక్యపదీయంలో భగవతిప్రతిభయే వాక్యార్థమని నిరూపించే ఘట్టంలో

"ప్రమాణత్వేన తాం లోకః సర్వః మనుపశ్యతి,
 సమారంభాః ప్రతీయన్తే తిరశ్చామపి తద్వశాత్." (వాక్య)

అనే కారికకు వ్యాఖ్యవ్రాస్తూ, హేలారాజు "సతాంహి" అనే పై వాక్యాలనే స్వీకరిస్తాడు.

హంస యోగిభాష్యమనే గీతాభాష్యంలో
"శరీరమాద్యం ఖలు ధర్మసాధనం". (కుమా)

అనే కుమారసంభవవాక్యాలు హంసయోగి స్వీకరించాడని శుద్ధధర్మ మండలి కార్యదర్శి చెప్పగా విన్నాను. ఈతీరుగా ఆకాలపు తత్వజిజ్ఞాసలకు బలం ప్రసాదించిన కాళిదాసాదులు తత్వజ్ఞత్వసంబంధం కలిగే లో కోత్తరులై వున్నారు.

శంకరులు - నూతనశకం

అయితే శ్రీశంకరులకాలంనుండి భారతవర్షంలో తత్వజిజ్ఞాసలకు ఒక నూతనశకం ప్రారంభమయింది. భారతంనుండి భగవద్గీత వేరైంది. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, గీతకు భాష్యాలు వ్రాసి భారతవర్షపుమూలమూలల అగణ్యశిష్యులతో సంచారం చేసి తత్వజిజ్ఞాసలను వెదచల్లినాడు. అదివరకే శాస్త్రంగా ఆరంభమైవున్న బ్రహ్మజిజ్ఞాస ఒక అఖండశాస్త్రమై అదే అనేకసంవత్సరాల పఠనానికి తగిన ఒకప్రసిద్ద విద్యాస్థానమయింది. శంకరాచార్యులకాలంనుండి బ్రహ్మజిజ్ఞాస ఒక అఖండవిద్యాస్థానమై దేశంలోవున్న మహామేధావంతు లనందరినీ ఆకర్షించ మొదలుపెట్టింది. బుద్ధుడితో కదలిక ఆరంభమైన యీజిజ్ఞాసలకు శంకరాచార్యులచేతిలో మహోచ్చదశ ప్రాప్తించింది. పిమ్మట రామానుజాదు లీజిజ్ఞాసల సాగించారు. మాధవాచార్యులవంటి మేధా సముద్రుల ఈజిజ్ఞాసలకు ఆకృష్టులైనారు. కవులనుండి యీతత్వ జిజ్ఞాసలు పూర్తిగా విడిపడ్డవి. కవులీ జిజ్ఞాసలకుచేర్చదగ్గది మృగ్యమైతోచినది.

శాఖోపశాఖలతో పెరిగిన యీవిజ్ఞానం అధిగమించడంలో యెన్నో సంవత్సరాలు పట్టుతున్నవి. బుద్ధి విశ్రాంతావస్థకు వస్తున్నది. తత్వజిజ్ఞాసలకు దారిచూపే అనుభవాలు ఉండజాలనంతగా శాస్త్రవేత్తలు గార్లించి అనంతంగా వృద్ధిపరచారు. ఇక కవులేదైనా చెప్పితే అది ఆఅమేయశాస్త్రశాఖలముందు నిస్తేజంగా అణగి పోవలసినదే ఆయెను. కనుకనే శ్రీహర్షుడు తన అనిర్వచనీయత్వసిద్ధాంతాన్ని ఖండన ఖండఖాద్యమనే ఒక గ్రంథంలో ప్రతిపాదించి, దాన్ని శాస్త్రశాఖలకు చేర్చాడుగాని తనకావ్యంల్లో వాక్యరూపంగా చెప్పి వూరుకుండలేకపోయినాడు. అట్లా వూరుకుంటే విస్తరించివున్న శాస్త్రశాఖలయెదుట ఆవాక్యాలు నిల్వజాలవు. కనుకనే శంకర రామానుజాదుల తరువాత ఈజిజ్ఞాసలను స్పృశించ అవకాశం కవులకు కనబడలేదు. ఇక ఆంధ్రదేశంలో శంకర రామానుజాదుల ప్రచారమేగాకుండా దేశీయుల్లో అనేకు లీవిజ్ఞానాన్ని వెదచల్లినారు. గురువని మీమాంసకుల్లో ప్రసిద్ధిగన్న ప్రభాకరుడివలె ఆంధ్ర దేశంలో గురుపద వాచ్యుడైన వీరబ్రహ్మ. . వేమన్న, సిద్దప్ప, శివరామదీక్షితులు మొదలైన యోగులు, తత్వజ్ఞులు. దేశభాషాసాధనంతో ఆంధ్రదేశపు పల్లెపల్లెల ఈజిజ్ఞాసలను ప్రతిధ్వనింప జేశారు. వ్యాసుడు, జైమిని, గౌతముడు, కణాదుడు. కపిలుడు, పతంజలి. శంకరుడు. రామానుజుడు మొదలైన మహాతత్వవేత్తలు, బ్రహ్మగురువు, వేమన్న సిద్దప్ప, శివరామదీక్షితులు మొదలైన జ్ఞాననిధులు దేశాన్ని ప్రబోధిస్తుండగా వీటినిమించి కొత్తవెలుగుచూపే విజ్ఞానం కవులు ప్రసాదిస్తే తప్పక వారిని ఆరాధిస్తాము. కాదా? వారితత్వకవిత్వపుమాటలు నిస్సారములే కాగలవు. ఇంకా ఆధ్యాత్మికవిజ్ఞానం అస్ఫుటాపస్థలో వున్న అభారతీయులకు అట్లాటి తత్వకవిత్వం గొప్ప అయితే కావచ్చునుగాని ఆధ్యాత్మికవిజ్ఞానం పరిపాకావస్థకు వచ్చినభారతవర్షంలో అందులో ఆంధ్రదేశంలో అది తప్పక నిస్సారమే అవుతుంది. ఆతత్వకవిత్వం ఆంధ్రులకు అవసరంమాలిందేకాగలదు. ఇట్లా పరిహాసాస్పదమైన నీరసపు తత్వకవిత్వం ఈ కాలపు కృతుల్లో తరుచుగా కనబడుతున్నది.

"జననమరణములు రెండు విశ్రాంతిలేక
 జరుగుచుండును నీప్రపంచంబునందు." (వనకుమారి)
                (పునరపి మరణం పునరపి జననం. భజగో)

"ఒకప్పుడు కొన్ని సంఘము లుత్తమస్థితి గలిగియుండు
 మరికొన్ని అధమ సన్మానంబునొందు
 కష్టసుఖముల నీచోచ్చగతులు గలవు
 చక్రదండంబునకు బోల" (వనకుమారి)

"కస్యాత్యంతం సుఖముపనతం దుఃఖమేకాంతతోవా
 నీచై ర్గచ్చ త్యుపరిచ దశా చక్రనేమిక్రమేణ" (మేఘ)

"కాలమహత్వమెవ్వరికి గన్గొనరాదు ప్రతిక్షణంబు గా
 ర్యాళి ప్రయత్న లబ్దమగు కల్గవు కొన్ని ప్రయత్నయుక్తినేన్
 లీల లయించు భాగ్య. మవలీల దరిద్రతబోవు యిట్టులే
 తేలును మున్గుకాలజలధిన్ సకలంబును అస్వసంత్రతన్."
                                                                 (వనకుమారి).

"కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః
 కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః.
 కాలమూలమిదం సర్వం భావాభావౌ సుఖాసుఖే."
                                                    (మహాభా. ఆ.)

"కాల ఏవహి పురుషాన్ అర్థానర్థయోః
 జయపరాజయయోః . సుఖదుఃఖయో శ్చ స్థాపయతి." (వా.కా.సూ)

అని యిదివరకు ప్రసిద్ధమైనవచనాలనే తత్వంగా వనకుమారికర్తవ్రాస్తే మానవసుఖదుఃఖాలపై వీరిదృష్టి పెసిమిష్టికుగా వున్నదని ఆంధ్ర హెరాల్డులో ఒకరు సారంతేల్చారు. యీమాటల్లో వీరి నూతనానుభవంగాని వీరి స్వదృష్టిగానిలేదు. లోకంలో ప్రసిద్ధమైన వచనాలివి. జీర్ణించని పాశ్చాత్యసంస్కారంతో భారతీయసంస్కారానికి అంధులై వున్నంతకాలం ఇట్లాటివి గోచరిస్తుండగలవు. ఈకొత్త సంగతులు మనకు ప్రసాదించడానికి వనకుమారికర్త పడ్డ శ్రమలో నాల్గవవంతు భారతీయ విజ్ఞానంప్రాప్తించడానికి పడినట్లయితే ఆ అమేయ విజ్ఞానాన్ని మేళగించి వ్రాసినా వ్రాయకున్నా ఇట్లా పెద్దలంటారని బుద్ధి పరిపాకాన్నీ, వినతిని, అయినా కనబరచే వాడు.

ఇట్లనే భారతి సం 3. సం 1. లో రాయప్రోలు సుబ్బారాయకృతి ధ్యాన గీతవున్నది. యేదో తత్వం తెలుపబోయి ధ్యానగీతకర్త నేను బ్రాహ్మముహుర్తంలో మేలుకొన్నాను, నా అహంకారం కదలలేదు, నేను ఉపనిషత్తు పఠించాను, దేవీపంచరత్నాలు చదివినాను. రామకథ మీదికి మనసుపోయింది. తరువాత భాగవతంమీద బుద్ధిపుట్టింది, నాకేమి తోచలేదు. తరువాత అనువాకాలకు తిరిగినాను, అని తనచర్య వ్రాశాడు. చివరన అయోమయంలోకి దిగి వదలినాడు. దీన్ని తరువాత నిరూపిస్తాను. అనంతరూపంతో విస్తరించివున్న తత్వజ్ఞానం యొక్క శిఖరం ఆరోహించి సర్వ భావాలను వశపరచుకొని మనకు నూతనవిజ్ఞానం ప్రసాదిస్తే వారిని తప్పకుండా ఆరాధిస్తాము. కాని చెప్పగలిగినది. చెప్పవలసినది యేమీ లేనప్పుడు తత్వంలోకి దిగితే అది నిస్సారపు అయోమయపుమాటలలోనీకే పర్యవసిస్తుంది. తత్వంవ్రాస్తామా? అది వేదాంతవిజ్ఞానవిలసితులకు గ్రాహ్యంగా వుండవలెను. లేదా ఆసామగ్రి లేనప్పుడు ఊరుకొనడం ఉచితం. "ఆకున ఆందని పోకనపొందనీ" యేవో నాలుగుమాటలు పులిమి, బులుపుతీర్చుకుంటే తీర్చుకోవచ్చును. తెలియనివారు తెలియకుండా వాటిని చదవవచ్చునుగాని వాటిని అయోమయపు ఆజ్ఞానవచనాలని సంస్కారవంతులు నిరాకరిస్తారు.

అని శ్రీ... ఉమా కాస్త నిధ్యాఖగకృతీలో వాజ్మయసూత్ర

పరిశిష్ట్రంలో తత్త్వజిజ్ఞాసాధికరణం సమాప్తం.