నేటి కాలపు కవిత్వం/అయోమయత్వాధికరణం

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

అయోమయత్వాధికరణం.

అయోమయత్వం.

బుద్ధి అపరిణతమై ఉదితభావపరంపరలో స్పష్టతలేనప్పుడు వెలువడే మాటలు అయోమయంగా వుండడం సహజం. చెప్పదలచుకొన్నది చెప్పడానికి బలంలేని భీరుత్వమూ చెప్పవలసిన దేమిలేనప్పుడు వ్రాయవలెననే కోరికా అయోమయపుమాటలనే వెడలిస్తవి.

ఉన్నది మామూలు అభిప్రాయమే ఓసి ఇంతేనా అంటారని దాన్ని యేమేమో మాటలతోచెప్పి అయోమయంతో ఆత్మవంచన చేసుకొంటారు కొందరు.

ఈ అన్నిరకాల అయోమయాలు నేటికాలపుకవిత్వంలో బహుళంగా కనబడుతున్నవి.

"మధురమోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీనమై నట్టులుండ
 మధురహాసంబులో మాధురీప్రకృతి
 యానంద ముద్రితమై నట్టులుండె
 మధురచంద్రికలలో మధురామృతంబు
 మధురామృతంబులో మధురరసంబు
 మధురరసంబులో మధురభావంబు
 మధురభావంబులో మధురరూపంబు
 మధురరూపంబులో మధురతేజంబు
 మధుర మోహనకళా మహితమై వుండ
 మధురస్వరంబులో మధురగీతముల
 మధురగానంబులో మదిమేళగించి." (యేకాంత సేవ)

అని యేకాంతసేవలోవున్నది యీ అయోమయ ప్పులుముడే నని ఇదివరకే నిరూపించాను.

"పెద్దపులినోటిలో నే నేను. పెనుబొబ్బపెడతాను నే నేను
 గొర్రెల్లెమేకల్లె నే నేను. ఘోషిల్లిపోతాను నే నేను
 భార్యనీవకచెంప నే నేను. భర్తనీవకచెంప నే నేను"
                                  (భారతి సం. 2, 11).

అనేవి యీఅయోమయపుకోటిలోనే చేరుతున్నవి. ఇది శంకరుల అద్వైతమా? వైయాకరణుల శబ్దబ్రహ్మవాదమా? లేదా జైమినీయమా? కాపిలమా? కాణాదమా? పాతంజలమా? గౌతమీయమా? స్వకీయ నూతనసిద్దాంతమా? యీబొబ్బలు పెట్టడమేమిటి; భార్యగావడమేమిటి; భర్తగావడమేమిటి; యీ అయోమయాన్ని యీకృతికర్తకే వదులుతున్నాను. ఇది స్వకీయసిద్దాంతమయితే దీనిని సుబోధంగా వ్యక్తపరచవలసి వుంటుంది. లేదా అయోమయంలోబడవేసి కృతికర్త అకృతార్దుడే అవుతున్నాడు.

"వినబడదు శ్రుతివాణి విప్పినవిధాన
 కనబడదుస్మృతి ఋషివచించిన విధాన." (భారతి.ధ్యానగీత),

అని ధ్యానగీతకర్త అంటాడు. శ్రుతివాణి విప్పిన విధానవినబడదంటే ఋగ్వేదంమొదటిరూపంతో లేదనా? మొదటి శ్రుతికారుడు చదివినట్లు నేటిబ్రాహ్మణుడు చదవలేడనా? లేదా వాట్లో ప్రక్షిప్తాలు చేరినవనా? యశ్రుతి? ఋగ్వేదమా? యజుర్వేదమా? అధర్వవేదమా? సామవేదమా? వాట్లో మంత్రభాగమా? బ్రాహ్మణభాగమా? యేవిప్రక్షిప్త భాగాలు? కాకుంటే ప్రథమంలో ఋగ్వేదం వినబడ్డట్లు ఇప్పుడు వినబడదనా? అయితే వేదం పుట్టినప్పటిధ్వని ఈధ్యానగీతకర్త యెప్పుడువిన్నాడు? ఇట్లానేస్మృతి. ఇవే అయోమయపునిస్సారపు మాట లంటున్నాను.

"వినబడియె నొక్కసూక్తి హృద్వివరమందు
 స్మృతులు మాని ముక్కోటిదేవతల వదలి



బ్రహ్మ విష్ణు రుద్రుల బరిత్యజించి
అగ్నిముఖమున బురుషుని నరయుమనుచు" (భారతీ.ధ్యానగీత)

అని ధ్యానగీత కర్త అన్నాడు.

అగ్నిముఖాన ఆరయమంటే యజ్ఞంచేయమనా? అగ్నిలోనిల్చోని తపస్సుచేయమనా? పార్శీలవలె అగ్నిపూజచేయమనా? అగ్నిలోవుండే జ్యోతిస్సునే బ్రహ్మమనుకోమనా? బ్రహ్మమునకు అగ్ని ముఖమనా? చెప్పదలచినది స్పష్టంగా చెప్పగల బలంలేని భీరుత్వంవల్ల యిట్లాటి అయోమయపు ధోరణి దిగుతున్నది.

"కలవిహంగమ పక్షముల దేలియాడి
 తారకామణులలో దారనై మెరసి
 మాయమయ్యెదను నామదురగానమున
 మొయిలు దోనెలలోన బయనంబొనర్చి
 మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
 పాడుచు జీన్కునై పడిపోదునిలకు
 పక్షినయ్యెద జిన్ని ఋక్ష మయ్యెదను
 మధుపమయ్యెద జంద మామనయ్యెదను
 మేఘమయ్యెద వింత మెఱపు నయ్యెదను
 అలరు నయ్యెద జిగురాకు సయ్యెదను
 పాటనయ్యెద గొండ వాగునయ్యెదను
 పవనమయ్యెద వార్దిభంగమయ్యెదను" (కృష్ణపక్షం)

ఇవన్నీ అయోమయపు మాటలు. ఈ కృష్ణపక్షకర్తయిట్లా తుమ్మెదఅయి, మేఘమయి. గారడిచేస్తుంటే చూడవలెనని నేను కుతూహలపడుతున్నాను. కావ్యానందం లేకుంటే గారడీ ఆనందంతో నైనా తృప్తి పడతాను.

"ఓకుటిలపన్నగమ చెవియొగ్గివినుమ
 ఏను స్వేచ్ఛాకుమారుడ నేను గగన
 పథవిహారవిహంగమపతిని నేను

మోహనవినీలజలధరమూర్తి నేను
ప్రళయజంఝూప్రభంజనస్వామి నేను

ఎవ్వరని యెంతురో నన్ను ఏననంత
శోకభీకరతిమిర లోకైకపతిని
కంటక కిరీటధారినై కాళరాత్రి
మధ్యవేళల జీమూతమందిరంపు
గొలువుకూటాల నే కాంతగోష్ఠిదీర్చి
దారుణ దివాంధరోదన ధ్వనులశ్రుతుల
బొంగి పొంగియు నుప్పొంగి పొరలిపోవు
నావిలాపనిబిడగీతికావళీవి
రావముల నర్ధరాత్ర గర్భమ్ము మరియు
మరియు భీషణకాళిమోన్మత్తగాగ
జేయు తఱి నన్ను మీరు వీక్షింపలేదొ "

ఇది కూడా ఆకృష్ణపక్షంలోవున్న అయోమయధోరణే. వాస్తవంగా శోకభీకర తిమిరలోకైకపతు లెవరైనావుంటే ఇట్లా చెప్పుకోవడం అంతగా వుచితంకాదు. ఇట్లాటిమాటలను గురించే కాబోలు. "కంచుమోగునట్లు కనకంబుమోగునా" అని వేమన అన్నాడు. చిన్నప్పుడు వెంట్రుకలు మొగానికి కప్పుకోని "ఆం! నేను యెలుగొడ్డును" అని దడిపిస్తే మొగం తేరి పారజూచి "నీవు అన్నయ్యవుగావా" అన్నమాటలు జ్ఞాపకానికి వస్తున్నవి.

"ఏవియో ఘోర పవనార్బటీధ్వను లివె
 కర్మకుహరాంతరస్థలిం గలత బరచు
 ధూమపావకజ్వాలల నొదిగియుండి
 భూత పైశాచములు నన్నుఁ బొడుచుచుండు."

అని భూతాలూ పైశాచాలూ విడివడి బాధిస్తున్న యామర్తి సూర్యప్రకాశరావువారిమాటలు ఈప్రళయజంఝూప్రభంజనస్వామి అయోమయపు కోటిలోని వేనని చూపి ఈచర్చ ముగిస్తున్నాను. ఇఘ యీ అయోమయపుమాటలను గురించి చర్చించడం అనవసరం. బుద్ధి అపరిణతమై వున్నప్పుడూ, చెప్పదలచినది చెప్పడానికి బలంలేని భీరుత్వం తమస్సు ఆవరించివున్నప్పుడూ, చెప్పవలసినదేమీ లేనప్పుడూ, ఉన్నది మామూలు అభిప్రాయమై దాన్ని యేమేమో మెలికలువేసి ఆత్మవంచనకు ఆరంభించినప్పుడూ, యీఅయోమయం దిగుతుందని చెప్పి చాలిస్తున్నాను. యెంతో జ్ఞానాన్ని దేశం నిండా వెదజల్లిన వేమన ప్రభృతులు సయితం

"నీరు కారమాయె కారంబు నీరాయె
 కారమైన నీరు కారమాయె
 కారమందు నీరు కడురమ్యమైయుండు
 విశ్వదాభిరామ వినురవేమ. (వేమ)
 
 బ్రహ్మ గుఱ్ఱమాయె భవుడు పల్లంబాయె
 నాది విష్ణు లెన్న నంకె నాయె
 నందు మీదివాడు ఆడదో మొగవాడొ
 విశ్వదాభిరామ వినురవేమ" (వేమ)

"మొనలుమీదుగ తలలుకిందుగ మొలచియున్నది వృక్షమూ
 మోదమలరగ మంట మీదను మదగజము విహరించెరా
 చిదిమి పట్టిన బంటుకైవడి చీమయేనుగు మింగెరా
 విర్రవీగుచు కేక వేయుచు యోగమంచము మింగెరా
 గొర్రెయొక్కటి అయిదుపులులను గొట్టి నెత్తురుదావెరా
 చిర్రిచెట్టున జాజిపూవులు శ్రీకరంబుగ పూచెరా
 మర్రిపై కదళీఫలంబులు మళ్లూరిరామదయానిధే.
 కొంచమౌ నొకగృహములోపల కోటిసింహము లుండెరా
 అంచితంబుగ నన్నిటిని యొకసామజంబు వధించెరా
 పంచవన్నెల చిలుకలైదొక పర్వతము భక్షించెరా
 మంచి తత్వజ్ఞానమిది మళ్లూరిరామదయానిధే.
 ఒంటిపాటుల రెండుకోతులు జంటపిల్లుల నీనెరా
 కంటి నని ఒక నక్కకడుపున కామధేనువు పుట్టెరా

 
వింటి నని ఒక మొసలినవ్వుచు వీధిపఱుగులు బారెరా
మానసంబున మనుజుడొక్కడు మాను నమలుచునుండెరా
కాని కానిమ్మనుచు దోమలు కనకగిరి కదలించెరా

నిరుపమాంబుధి చంద్రమళ్లూరి వీర రాఘవదయానిధే" (కా.త) అని యిట్లా చెప్పినమాటలు నేటికి అయోమయమై సమస్యలకిందికి దేలి ఉద్దిష్టప్రయోజనానికి దూరమై వున్నవి. సర్వలోకం సంశ్రయించ దగినవిజ్ఞానాన్ని ప్రసాదించిన శంకరప్రభృతులు తమసిద్ధాంతాలను అయోమయత్వంలోకి దింపలేదు. గనుకనే దిగంతవ్యాప్తమై వున్నవి. శ్రీభాగవతకవి యీతీరుగా అన్యాపదేశంగా పురంజనోపాఖ్యానం జెప్పి చివర కది అయోమయమవుతుందని తలచి కాబోలు తానే దాన్ని విపి వినిపించాడు.

పూర్వపక్షం

.

అవునండీ, మీరది అయోమయమంటారు; ధ్యానగీతలో ప్రతిక్రియలో కృష్ణపక్షపు ప్రభంజనస్వామిలో అంతరార్థమున్నదని మేమంటాము అని వాదిస్తారా?

సమాధానం.

చెప్పుతున్నాను. ఆఅంతరార్థాన్ని ఢీకొనే అంతరార్థం నా విచారణలో కూడా వున్నదంటాను. మీ రది విప్పినప్పుడు నే నిది విప్పుతానంటాను. ఈమాటలకు తలా తోకా లేదు. యేమైనా అంతరార్థం వుంటే దాన్ని యెందుకు కప్పిపెట్టవలె నని ప్రశ్నిస్తున్నాను. యేమైనావుంటే దాన్ని విప్పి చెప్పండి అని కోరుతున్నా ను. చెప్పే దాక ఆవి అయోమయమ్మాట లంటున్నాను. విప్పి చెప్పినప్పుడు అవి యెంతవరకు వుచితమో మళ్లీ ఆమాటలమీద వేరే విచారణచేస్తాను.

అస లింతకూ విప్పడానికి ఇవి సమస్యలుగావు; తిరుమలేశ పద్యాలుగావు; సౌందర్యభావన దర్శనమాత్రాన్నే కలుగ వ లెనుగాని కండ్లూ, ముక్కూ. చెవులూ, కండ్లకు దగ్గిరగాపెట్టుకొని చెక్కిపై తోలుతీసి పరీక్షిస్తే సౌందర్యస్పురణానికే మూలక్షయం కలుగుతుంది.

ఆక్షేపం.

ఇవి యీకాలంలో తెలియవు. ముందుకాలంవారుగాని వీటిలోతు కనుక్కోరు. అందుకే భవభూతి

"కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ" (మాలతీ) అన్నాడు అని అంటారా?

సమాధానం.

చెబుతున్నాను; అది అసంబద్ధం. తనకావ్యాన్ని కొందరు గౌరవించకపోతే మీరు కాకుంటే మీతరువాతవారు దాన్ని గౌరవిస్తారు అని అన్నాడు.

"ఏకో రసః కరుణ ఏవ" (ఉత్తర)

అనే యిట్లాటి నూతనసిద్ధాంతాలను వారు అంగీకరించకుంటే వాటిలో సత్యమే ఉన్నట్లయితే ముందు వారంగీకరిస్తారని అతడి అభిప్రాయం. అంతేగాని భవభూతి తననాటకాలను అయోమయంగా వ్రాసిముందువారి కివి తెలుస్తవనలేదు. భవభూతినాటకాల్లో యెక్కడా యేమాత్రం అయోమయత్వం లేదు. ఒక వేళ ముందుకాలపువారి కని ఒప్పుకుందాము. అవి ముందుకాలపువారికే అయితే యిప్పుడే అచ్చువేయించి అమ్మడం యెందుకు? యీమాటల కర్థం మారింది గనుక అవిముందుకాలంవారికి తెలుస్తవంటారా? ఆమారిన అర్థాలెవరికీ తెలియకుండా పద్యకర్త కొక్కడికే యిప్పు డెట్లా తెలిసినవి? ముందు కాలపు వారి భాష వీరికెట్లా వినబడ్డది? వీరు కొత్తగా అయోమయపు భాషను సృష్టించారంటారా?

|"నిత్యాః శబ్దార్ధసంబంధాః" (వాక్యా) అని శబ్ద తత్వజ్ఞులు చెప్పుతున్నారు.

పతంజలి "కుంభకారకులం గత్వా" (మహా) అన్నట్లు భాషనెవరూ చేయలేరని భారతీయులసిద్ధాంతం. ఒక వేళ చేస్తారని వొప్పుకున్నా దీన్ని ముందుకాలపువాండ్లు యెట్లా నేర్చుకుంటారు? సాధనాలు వేరే యేర్పరచారంటారా? వీటికి ప్రామాణ్యమేమిటి? వీటిని ముందు కాలపువారు అంగీకరిస్తారని నియమమేమిటి? పోనీ అట్టాటి వేమైనా వుంటే మాకెందుకు ప్రసాదించగూడదు? ముందుకాలపువాండ్లు యింకా తెలివిగలవాండ్లవుతారు గనుక, వారికి తెలుస్త వంటారా? అది అసంబద్దం. పాణిని పతంజలి ప్రభృతులు వ్రాసిన శాస్త్రాలను యెన్నో సంవత్సరాలు పరిశ్రమజేసి సంస్కారవంతుల మవుతున్నాము. వెనకటి కాలపువారికంటే ముందుకాలపువారు యెక్కువ బుద్ధిమంతులనడం అనుచితం. సొట్యశాస్త్రంలో

"భవిష్యతి యుగే ప్రాయో భవిష్యంత్యబుధా నరాః" (భ.నా)

భవిష్యత్కాలంలో నరులు అబుధులవుతారు అని భరతుడు అన్నాడు పోనీయండి. ముందు రాబొయ్యేవారికంటె యిప్పటివారు తెలివితక్కువవారనే వొప్పుకుందాము. ఈ తెలివి తక్కువ వారికే దాన్ని విప్పి చెప్పండి అంటున్నాను. చెప్పినా తెలియదంటారా? తెలిసేటట్టు చెప్పండి.

వక్తురేవ హి తజ్జాడ్యం శ్రోతా యత్ర న బుద్యతే.”}}
(వినేవాడికి తెలియకపోవడం వక్తయొక్క జాడ్యమేను).

అని పెద్దలుచెప్పుతున్నారు. అధికారులు లేరంటారా? ఒకరైనాలేరా? కొందరు భీరువులై అటుభార్యకు తగిలేటట్లు యిటుదేవతకు తగిలేటట్లు అయోమయంగా రచిస్తున్నారు. వ్రాయదలచుకుంటే నిర్బయంగా జగన్నాథాదులవలె భార్యనుగురించి వ్రాయండి. లేదా దేవతమీద భక్తిని శ్రీగుణరత్న కోశం, సౌందర్యలహరి మొదలయినవాట్లోవలె కనబరచండి. ఇదే ఉత్తమమార్గం. భీరుత్వం. అయోమయం ఆధమమంటున్నాను.

ఆక్షేపం.

అవునండీ, చెప్పవలసినది లేనప్పుడు వ్రాస్తే అయోమయ మంటారు. చెప్పదలచుకున్నది చెప్పడానికి కావలసిన బలం లేనప్పుడు వ్రాస్తే అయోమయ మంటారు. వచ్చీరాని సంస్కృతంవ్రాస్తే అయోమయ మంటారు. అభిప్రాయము మామూలుదై దాన్ని మెలికలువేస్తూవ్రాస్తే అయోమయ మంటారు. ఈ అయోమయమైనా వ్రాస్తే మంచిది గదా. యేమీ వ్రాయకుండావుంటే వాఙ్మయం యెట్లా వృద్ధిఅవుతుంది? అని అంటారా? "

సమాధానం.

చెప్పుతున్నాను; అయ్యో! కవిత్వంవ్రాసేవాండ్లు లేరే అని దుఃఖించి కవిత్వంవ్రాయవద్దు. యేమీ వ్రాయకుండావుంటే యేమీ మునిగిపోలేదు. మనకు కాళిదాసాదులకవిత్వం యుగయుగాలవరకూ ఆనందపారవశ్యం కలిగించగలిగినది వున్నది. కవిత్వం లేదుగదా అనీ దుఃఖపడవలసిన పని లేదు. ఇఘ ఆంధ్రులను పవిత్రులను జేసి సర్వభారతవర్షానికీ సర్వలోకానికీ సందేశమిచ్చే కవిత్వం పద్యరూపానగాని గద్యరూపానగాని వస్తుందా దాన్ని ఆంధ్ర దేశం శిరసావహించగలదు, కాని యిప్పుడు కవిత్వం కొరతగా వున్నదని దుఃఖపడి మాత్రం వ్రాయవద్దంటున్నాను.

అని శ్రీ...ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో అయోమయత్వాధీకరణం సమాప్తం.