నేటి కాలపు కవిత్వం/ఊగుడుమాటల అధికరణం
శ్రీ ర స్తు.
వాఙ్మయపరిశిష్టభాష్యం.
ఊగుడుమాటల అధికరణం.
ఊగుడుమాటలు
"కవి నొక విధమగు నుద్రేక మూగింపవలెను. ఒకయావేశ మావహింపవలెను వలవలనేడ్చును. పకపకనవ్వును పిచ్చి కేకలిడును పాడును నృత్యము చేయును." (యేకాంతసేవపీఠిక-దే.కృష్ణశాస్త్రి)
ఇట్లా వూగవలె నని యిది యిమోవ నని (Emotion) ఆవేశపడవలె నని పిచ్చి కేకలు వేస్తాడని ఊహలు ఈకాలపు కృతికర్తల్లో వ్యాపించివున్నది.
"ఆకులో నాకునై పూవులోఁ బూవునై
కొమ్మలో గొమ్మనై నునులేత రెమ్మనై
ఈయడవి దాగిపోనా యెట్లైన నిచటనే యాగిపోనా
పగడాల చిగురాకు తెరచాటు తేటనై
పరువంపువిరిచేడె చిన్నారి సిగ్గునై
ఈయడవిదాగిపోనా యెట్లైన నిచటనేయాగిపోనా". (కృష్ణపక్షం)
అని వెర్రిపాటలోవున్న మాటలు యీ వూగుడుపిచ్చిమాటలే అయివున్నవి దయ్యంబట్టితే అంకాళమ్మ పోలేరమ్మ ఆవేశిస్తే వూగుతారు. దూపదీపనైవేద్యాలతో వేపాకుమండలదెబ్బలతో ఊగుడు ఉపశమిస్తుంది. కాని కవులువూగరు. పిచ్చికేకలు వేయరు. భావం ఆవరించినపుడు దానికి మొదట కవి వశుడయ్యేమాట సత్యం.
"క్రౌంచద్వంద్వవియోగోత్ధః శోకః శ్లోకత్వమాగతః" (ధ్వన్యా)
(క్రౌంచమిధునవియోగంవల్ల పుట్టినశోకం శ్లోకమైనది) అనేమాటలు వాల్మీకి ఆశోకానికి యెంత వశుడైనదీ తెలుపుతున్నవి. అయితే కావ్యరచనయందు ఆభావాన్ని తానే వశంచేసుకొని సృష్టి ఆరంభిస్తున్నాడు.
"ఉపస్పృశ్యోదకం సమ్యఙ్ముని స్థిత్వా కృతాంజలిః
ప్రాచీనాగ్రేషు దర్బేమ ధర్మేణాన్వేపతే గతిం.
తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః
పురా యత్ తత్ర నిర్వృత్తం పాణానామలకం యధా
తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ న మహాద్యుతిః
అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః". (రామా)
పుణ్యే హిమవతః పాదే మేధ్యే గిరిగుహాలయే
విశోధ్య దేహం ధర్మాత్మా దర్బసంస్తరమాశ్రితః
శుచిః ననియమో వ్యాసః శాంతాత్మా తపసి స్థితః
జారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్ష్యతాం గతిం
ప్రవిశ్య యోగం జ్జానేన సోపశ్యత్ సర్వమాన్తతః. (మహాభా)
అవే పంఙ్త్కులు వాల్మీకి యొక్క వ్యాసుడియొక్క ఆత్మవశత్వాన్ని స్థితప్రజ్ఞత్వాన్ని ధర్మతేజస్కత్వాన్ని విదితం చేస్తున్నవి. సర్వభావాలకు మొదట వశుడై సర్వభావాలను పిమ్మట వశంచేసుకొని భావోద్వేగానికి (Emotion)తాను మొదట వశుడై పిమ్మట భావోద్వేగాన్ని తనవశంచేసుకొని సర్గానికి ఉన్ముఖుడయ్యే జగన్నిర్మాతవలె అమోఘువివేకంతో కావ్యసృష్టికి ప్రవృత్తుడవుతున్నాడు. కనుకనే
"అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః" (ధ్యన్యా)
(అపారమైన ఈ కావ్యసంపారంలో కవియే ప్రజాపతి)
"ననరసరుచిరాం నిర్మితి మాదధతీ కవేర్భారతీ జయతి (కావ్య)
(నవరససుందరమైన నిర్మితిని చేస్తున్న కవివాక్కు సర్వోత్కృష్టంగా వర్తిల్లుతున్నది.)
"నానృషిః కురుతే కావ్యమ్"
(ఋషికానివాడు కావ్యం రచించడు)
అని కవి కీర్తితుడగుచున్నాడు. అంతేగాని కవులు పిచ్చికేకలు వేసి వూగరు. కవులు ఆయాసందర్బాల్లో యిష్టపాత్రలతో సమానుభవం పొందుతారు కాని ఊగరు. వాల్మీకికి రావణుడితో సమానానుభవం వుండదు అతడు ఇష్టపాత్రలైన రామాదులతో సమానుభవం పొంది నట్లు గోచరిస్తుంది దీన్నే
"నాయకస్య కవేః శ్రోతుః
సమానానుభవస్తతః" (ధ్య .లో)
అని భట్టతోతుడు అన్నట్లు ద్వన్యాలోకవ్యాఖ్యానంలో అభినవగుప్త పాదులు ఉదాహరిస్తారు. మేఘదూతలో యక్షుడితో కవికి సమానుభవంవున్నా
"కామార్తా పిః ప్రకృతికృపణాశ్చేతనాచేతనేఘ" (మేఘ)
అని స్వవశత్వాన్ని విదితంచేస్తాడు. భవభూతి భావసాంద్రత కెంత వశుడైనా
"నమోవాకం ప్రశాస్మహే" (ఉత్తర)
అని ఆదికవులకు నమస్కరించి
"ఏకో రసః కరుణ ఏవ" (ఉత్తర)
అని అమోఘవివేకంతో వినిపిస్తాడు.
ఆక్షేపం
అవునయ్యా "బాలోన్మత్తపిశాచవత్" అని పెద్దలు చెప్పుతున్నారు. జ్ఞాని బాలుడివలె వెర్రివాడివలె, పిశాచంవలె వుంటాడు. కవులు జ్ఞానులు వెర్రివాండ్లవలె ఊగి మట్లాడడం ఉచితమేగదా కనుక కృష్ణపక్షంలో వున్న
"పాడమన్నది చిన్నబాలుదు పాడవిన్నది గాలిమబ్బులు
పాడినది ఒకమేకపై ఆ వెర్రిపాటకు డెవ్వడో"
అనే వెర్రిపాట మంచిదేను అని వాదిస్తారా
సమాధానం
వివరిస్తాను, "బాలోన్మత్తపిశాచవత్" అనేది కవికిగూడా వర్తింస్తుంది అనివొప్పుకొనే విచారిస్తాను. "బాలోన్మత్తపిశాచవత్" అనేది జ్ఞానికి బాహ్యలక్షణంగాని బాలుడివలె చనుబాలుగుడుస్తాడని వెర్రివాడివలె రాళ్లు రువుతాడని దయ్యంవలె యితరులను పడతాడని అభిప్రాయంగాదు. అసలింతకూ "బాలోన్మత్తపిశాచవత్" అనేది విరక్తుడైన వేదాంతిలక్షణం. అతడికి లోకంతో పనిలేదు.
"నిస్త్రెగుణ్యే పథి విచరతాం కో విధిః కో నిషేధః:"
అన్నట్లు అతడిప్రవృత్తి లోకాతీతంగా వుంటున్నది కాని కవి, లోకంతో అత్యంతం సంబద్దుడై లోకానికి తనకావ్యాన్ని ఉద్దేశించి లోకసంబంది విభావాదులను అలంబనందేసి గసభావాలను ఉన్మీలనం జేస్తున్నాడు. ఇతడు "బాలోన్మత్తపిశాచవత్" అనే లక్షణంగల జ్ఞానికోటిలో చేరెనా
"ఆత్మానం చేత్ విజానీయాదయమస్మితి పూరుషః
కిమిచ్చన్ కన్యకామాయ శరీరమనుసంజ్వరేత్" (శ్రు)
అని కావ్యాన్నే వదులుతున్నాడు కాదు కూడదు పిచ్చికేకలు వేస్తాడంటారా వెర్రివాడివలె కేకలువేసి పిచ్చిమాటలు ఒక వేళ మాట్లాడి, కావ్యంలో వ్రాసినా అవి పిచ్చిమాటలే గనుక వాటితో లోకానికి పనిలేదు.
ఆపిచ్చిమాట లతనికే లోకం వదలుతున్నది.
"నావృషిః కురుతేకావ్యమీ"
"అపారే కావ్యనంసారే కవిరేవ ప్రజాపతి॥"
అని అఖండవివేకశాలిగా కీర్తితులవుతున్న కవులకు సమస్కరిస్తూ యీపిచ్చిమాటలను గురించిన ప్రస్తావన ముగిస్తాను. ఇక "శిశువదనంలో కవిత్వమున్నది. సతీవదనంలో కవిత్వమున్నది" అని అంటే కవిత్వప్రేరకమైన అంశమున్నదని అభిప్రాయంగాని అవేకావ్యమని అర్ధంకాదు. ఆభారతీయ వర్షాల్లో ఊగి వెర్రిమాటలు మాట్లాడితే మాట్లాడుతారేమోగాని కవితాప్రస్థానం మహావికాసంపొంది సర్వోచ్చదశనొందిన భారతవర్షంలో కవిపరమోన్నత మైనపదం అధిష్టించి వున్నాడు. ఊగడం, కేకలు వేయడం ఆవేశమని కవి అట్లా ఆవేశపడి వూగుతాడని పిచ్చి కేకలు వేస్తాడని యీకాలంలో వ్యాపించివున్న అభిప్రాయం అజ్ఞానజన్యమని చెప్పి యీచర్చ చాలిస్తున్నాను.
అని శ్రీ. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో
ఊగుడుమాటల అధికరణం సమాప్తం.