నేటి కాలపు కవిత్వం/నామాధికరణం

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

నామాధికరణం.

పేర్లు.

పుల్లయ్య, రామయ్య, సీతయ్య అనే మనుషులపేర్లు యదృచ్చాసంజ్ఞలు పుల్లయ్యలో పుల్లలేదు రామయ్యలో దాశరథిత్వం లేదు. సీతమ్మకు జానకీత్వం లేదు. కాని కావ్యనామాలు వస్తుధర్మాన్ని అనుసరించి యేర్పడుతున్నవి. రామకథ రామాయణం భరతవంశస్థులకథ భారతం రఘువంశాన్ని అధికరించి రచించినది. రఘువంశం ఈతీరున కావ్యనామాలు వస్తు ద్యోతకంగా వుండడం వుచితం కాని యిప్పుడు జడకుచ్చులని, సంధ్యారాగమని సెలయేటిగానమని తమకు ప్రియమైన పేర్లన్నీ కావ్యాలకు పెట్టుతున్నారు. అది అప్రశస్తం.

పూర్వపక్షం

యదృచ్ఛానామాలు మనుషులకే పెట్టవలె నని నియమమేమిటి? పుస్తకాల కెందుకు పెట్టగూడదు?

యెవరికింపైనపేర్లు వారు కవిజనమనోభిరామమని జడకుచ్చులని అవి అని ఇవి అని పెట్టుకొంటారు అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను మనుష్యసంజ్ఞలు కేవలవ్యవహారం కొరకు. కావ్యసంజ్ఞలు కావ్యవస్తుగ్రహణంకొరకు మనిషి తనయింటికి తనకుటుంబానికి హక్కుదారుడై వాటికి బద్ధుడై వుంటాడు. మహాపురుషులెవరైనా యింటిని దాటి లోకానికి దృష్టి మరల్చవచ్చును. అప్పుడు వారికి పరమహంసలని లోకమాన్యులని గుణవాచకాలు అనేకుల విషయంలో ప్రయుక్తమవుతునేవున్నవి కావ్యం ఒకమనిషికిగాని ఒక కుటుంబానికిగాని వుద్దేశించిందిగాదు. అది లోకానికి ఉద్దిష్టం కాకుంటే దాన్ని లోకంలో వ్యాపించజేసేయత్నమే అనావశ్యకం. దాన్ని లోకానికి వుద్దేశించినప్పుడు దాంట్లో యేమున్నదీ లోకానికి తెలపవలసిన బాధ్యత కర్తకువున్నది. కందులను తన యింట్లో తాను రత్నాలనుకొన్నా కందిపప్పును వరహాలనుకొన్నా బాధలేదు. బయటికి వచ్చి మూట బుజానవేసుకొని రత్నాలో అని అరిస్తే చూపమన్నప్పుడు కందులుచూపి నాలిక వెళ్లబెట్టవలసివస్తుంది. నిజంగా కందులు కావలసిన వాండ్లు అవి రత్నాలనుకొని అతణ్ని పిలిచి కొనకుండానే పోవచ్చును. కావ్యకర్త తన యింటిలో తన కావ్యాలను జడ అని ముడి అని చుట్ట అని కొప్పు అని జడకుచ్చు అని కుచ మని కపోల మని బనారసు చీర అని ముఖమల్లు రవికె అని తనకు ప్రియమైన పేర్లు పెట్టుకొని బులుపుతీర్చుకోవచ్చును గాని లోకానికి వుద్దేశించినప్పుడు ఈవికారపు పనిచేసెనా లోకవంచనా, ఆత్మవంచనా అతని పైన బడుతున్నవి.

న్యాయకుసుమాంజలి, ముక్తావళి, సిద్ధాంతకౌముది ఖండనఖండభాద్యం అనేవి ఆశాస్త్రాలకాఠిన్యాన్ని మృదువుపరచడానికి చేర్చినమాటలు గనుక వీటికి అన్వయించవు. కవిత్వ మసలె మృదువైనది. మనోహరమైనది. దానికి మృదుత్వమనోహరత్వాలు పులిమితే శబ్దవాచ్యత అవుతుంది శబ్దవాచ్యతను ముందు వివరిస్తాను.

ఆక్షేపం

అవునుగాని జడకుచ్చులవంటివి కేవల సంజ్ఞలుగావు. జడకుచ్చులవలె యింపైన పద్యగుచ్చా లిందులో వున్నవని భావం కనుక ఇది లోకమాన్య మహాత్మ అన్నట్లు గుణవాచకం గుణవాచకాలుచితమే గదా అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను: జడకుచ్చులవలె ఇంపైనవి అని ఆయింపు యితరులు చూచి అనవలసిందిగాని తానే చెప్పుకోవలసిందిగాదు. కాకిబిడ్డ కాక్కి ముద్దు అన్నట్లు యెవరిది వారికి యింపుగానే వుండవచ్చును ఇతరుల కది దొషభూయిష్టంగా కనబడవచ్చును. రఘువంశమన్నప్పుడు దాంట్లో రఘువంశకథ లేదని యెవరూ అన లేరుగదా. కనుకనే అనిశ్చితమైన ఒకగుణాన్ని స్వయంగానే తన కవ్యానికి ఆరోపించుకొని వివాదానికి అవకాశమిచ్చే సెలయేటిగానం, జడకుచ్చులు. అనే యిట్లాటిపేర్లు కావ్యాలకు పెట్టడం అత్యంతం నింధ్య మంటున్నాను. అదిగాక యీపేర్లు యేకావ్యానికి పెట్టరాదు? పెంట మాటలువ్రాసి దాన్ని జడకుచ్చు లనవచ్చును. అదేమంటే నాది నాకు బాగున్నవనవచ్చును ఇవన్నీ అవివేకపు పనులని వెనకటివైనా యిప్పటివైనా యిట్లా జడకుచ్చులు, సెలయేటిగానము అనే మాదిరిపేర్లు అప్రశస్తమని అంటున్నాను.

"శిశుక్రంద యమసభ ద్వంద్వేంద్ర జననాదిభ్యశ్ఛః"

అని పాణిని చెప్పినట్లు శిశుక్రందీయం, యమసభీయం కిరాతార్జునీయం ఇంద్రజననీయం, విరుద్ధభోజనీయం మొదలైనవీ. రఘువంశం కుమారసంభవం మొదలైనవి, పేర్లు కావ్యవస్తువును సూచించేవి మన వాఙ్మయంలో ప్రతిష్ఠితమై వున్నవి.

ఇంత ఆలోచించియే, భారతీయసాహిత్య వేత్తలు--

"కవేర్వృత్తస్య వా నామ్నా నాయకస్యేతరస్య నా" (సాహిత్య) (కవిపేరునుగాని, వృత్తంపేరునుగాని, నాయకుడి పేరును గాని, తత్సంబంధి అయిన ఇతరుడి పేరునుగానిబట్టి కావ్యానికి నామం కల్పించవలెను) అని ఆదేశిస్తున్నారు. పేర్లను క్లప్తంచేయవచ్చును.

స్వారోచిషమనుసంభవం అనడానికి మనుచరిత్ర అనవచ్చును

"సత్యభామా భామా, దేవదత్తో దత్త:" (మహా)

అని మహాభాష్యంలో పతంజలి వ్రాస్తున్నాడు. పేర్లనుగురించి వివేకం కోల్పోయి లోకాన్ని వంచించే జడకుచ్చులు మొదలైన అనుచితపు పేర్లు ఈ కాలపు కృతులకు తరుచుగా కనబడుతున్నవి.

అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నామాధికరణం సమాప్తం.