నీతి రత్నాకరము/రెండవ వీచిక
యని యాశీర్వదించిరి. ఆసమయమున నా కుమారికంగన్న తల్లి దండ్రుల యానందమిట్టిదని యెవ్వరు వర్ణింపఁగలరు? అది శక్య మగుపనియే కాదు. ఐన నొక్కఁడు లేచి,
తే. శీతకరు నుదయంబున ♦ సింధువట్లు,
ఘనతతిం గాంచినమయూర ♦ గణమురీతిఁ,
బరమపూరుషుఁ గన్నట్టి ♦ భక్తుపోల్కి,
నలరుచుండుత జనకుల ♦ హర్ష మెపుడు.
అని దీవించెను పద్య భావము సరసజనహృద్యమని యెల్లరు మెచ్చు కొనిరి. కర్పూరదీపమును రాధికకు నివాళించి తల్లి దండ్రులు ఘోటకశకటమున నింటికిం బిలుచుకొని పోయిరి. ఆసభా గౌరవమును బురస్కరించుకొని యాకన్య పాండితి నలుదెసల వ్యాపించెను.
రెండవ వీచిక.
జాలంధరపురము నెఱుఁగనివారు మహారాష్ట్రులలో లేరనవచ్చును. ఆపురము చంద్రభాగకు సమీపమున నుండెను. శృంగార ప్రధాననగరము కాకున్నను ధనసంపన్న నివాసము మాత్ర మగును. నడుమనడుమ గృహములు పాడుపడియుండుట యది ప్రాచీనకాలమున నత్యున్నతదశ ననుభవించినదని చెప్పక చెప్పుచుండును. ఆచోటుల మరల గృహములు నిర్మింపం బడక యుండుటం బరికింపఁగాఁ గేవల శాస్త్ర విశ్వాసవంతు లందు విశ్లేషించి కలరని తెలియవచ్చును. పాడుపడిన తావుల గృహములు కట్టరాదని వాస్తుశాస్త్ర నియమము గలదు. కావు. ననే యావల నిండ్లు కట్టుకొనుచుండిరి. ఆకారణమున నగరము విశేషభూభాగము నాక్రమించెను. కాని నడుమనడుమ రిత్త తావు లుండుటంబట్టి చూచుటకు శృంగారముగ నుండదన వచ్చును దేవాలయములు పెక్కులు గలవు. జాలంధరి యను దేవత ప్రధానస్థానము నాక్రమించెను. ఆమె పేరున నానగ రము కట్టఁబడియెననియు, నంతకుఁ బూర్వ మాయాదిశక్తి యాలయము మాత్రమే యుండెననియుఁ, గొందఱు చెప్పు దురు. పెక్కండ్ర కాగాథయందే విశ్వాసము కలిగియుండెను. జాలంధరీదేవి. భక్తరక్షణదీక్షగలదని యా నగరవాసుల విశ్వాసము.
శ్లో. “యేయథా మాం ప్రపద్యం తాం స్తవైన భజామ్యహమ్.”
అని శ్రీకృష్ణమూర్తి తెల్పెనుగదా. ఏవిశ్వాసమున భక్తు లంబ నారాధింతురో యాలాటివిశ్వాసముననే యాజగజ్జనని వారి గాపాడుచుండును. ఏటేట నాజననికి మహోత్సవము సాగును. ఆ యుత్సవదర్శనార్ధము పెక్కు దేశములనుండి వెక్క డ్రరు దెంతుకు. వారిసంఖ్య మూడులక్షలు మొదలైదులక్షల దనుక నుండునని గణితజ్ఞులు నిర్ణయించిరి. ఇంద ఱరు దెంచినను నగరమున నివాసములకు శ్రమంపడ నక్కఱ లేదు. ఎన్ని యో దేవాలయములు, మఠములు, సత్రములు గలవు, మహార్ణవమున నదు లిముడునట్టు లాయాత్రికు లా నగరాంతర్భాగమున నడఁగి పోవుదురు. కావున నామహోత్సవము సామాన్యులకుంగూడ శ్రమము గల్గింపకయుండును. స్నానముల కానగరమునఁ గోదువఁ గల్గింపని తడాకములు గలవు. సరస్సులు, వాపీకూప ములు గలవు. ఆయాయి దేవాలయములలో నన్న మాయుత్సవ _ కాలములఁ బెట్టుధర్మాత్ములు గలరు. ఆకారణమునఁ దొమ్మిది దినము లుత్సవపరిమితియైనను బూర్వాపరదినములు గలిసి పదు నై దుదినము లామహోత్సవము సాగుచున్నట్లే యుండును వస్తువు లన్ని యు నల్పమూల్యమునకే దొరకును ఇన్ని కారణములచే నాభగవతియుత్సవము నేత్ర హృదయానందములను గలిగించునని యెల్లర విశ్వాసము.
జాలంధరపుర వాసులు కృత్రిమ ప్రవర్తకులు గారు. పౌరుష ప్రధానులు. పట్టుదలఁ బూని రేని “యశోవా మృత్యు ర్వా" యన్న న్యాయము ననుసరించువారే కాని నడుమ వదలు కొని 'యేడుపుమోములు పెట్టుకొని యూరక యుండువారు మాత్రము కారు. మాటయిచ్చి రేని ప్రాణమునైన లెక్కింపక సాయపడుదురు. సాధారణముగా నుపకారబుద్ధి గలవార లనక తప్పదు. జాలంధరీదేవి నారాధింపనివార లుందురాయన్న సందియమే. ఆమె కృపకుఁ బాత్రుఁడు కానివాఁడు నామ ధారియైయుండఁబోఁ డన్న నమ్మకము వారికిం గలదు. కావుననే మేలు కలిగిన నామె కరుణయే దానికిఁ గారణమని నమ్మి పూజింతురు. ప్రతివారును నుదుటఁ గుంకుమ రేఖ యునుచుకొను నలవాటు గలవారే.
అట్టి జాలంధర పురమున శుక్ర వారపుఁ బేటయందు శ్రీవత్సాంక దాసను మహాధనసంపన్నుఁ డుండెను. సుగుణముల ప్రోవని కీర్తిగాంచెను. దినదిన ప్రవర్ధమానధనుఁడై వాసిమించెను. మంచి యశము నార్జించెను. బంధుజనులఁ గాపాడి విఖ్యాతిం జెందెను. ఆశ్రితుల రక్షించి ప్రాశస్త్యమున దిక్కుల నావరించెను. ఆతనికళత్రము రూపవతియు గుణవతియు నగు పద్మావతి. మంచిగుణము లీరూపమును ధరించెనా యన్నట్టు లామె యుండును. ఏమి యాదాంపత్యము ఘటించిన శతధృతి నేర్పు ? ఎంచఁదరమా యని కవికుల గ్రామణులు సమంచిత పద్య ముల నాతనిం బాడుదురు. వారికిఁ గొంత కాలమున కొక్క కుమారుఁడు కలిగెను. అతని పేరు శ్రీకృష్ణ దాసు. తల్లిదండ్రుల పుణ్యములపంటయనఁ గాదనరాదు. ఔననియే యొప్పుకొన వలయు. పంచమవర్షమున నొక నాఁడు శుభముహూర్తమున నక్షరాభ్యాసముహూర్తమును బెద్దలు నిర్ణయించిరి. మహాదాత యగు నాశ్రీవత్సాంక దాసుచే నాహూతులై కొందఱు, పిలువఁ బడకున్నను మఱిగొందఱుగాఁ బదివేలవిద్వాంసులు గూడిరి. మహారాష్ట్ర దేశమున నిఁకఁ బండితు లట్టివారు సభకు రాని వారు కలరా యనుశంక కలుగవలసినదే. అందఱుపండితు లరు దెంచిరి. 'రామదా సను యోగి పుంగవుఁ డొక్కఁ డా దేశమున నుండి పిలువని పేరంటముగా నాకస్మి కముగ వచ్చెను. ఎంత ప్రార్థించినను రానియోగి యెట్లు వచ్చినా యని పండితులు పామరులుం గూడ నచ్చెరు వొందసాగిరి. వారిరాక కాదాసు పరమానంద పరిపూర్ణహృదయారవిందుఁ డయ్యెను. మనయదృష్టమే యీమహానుభావుని దోడి తెచ్చెనని యాతనిపురం ధ్రి యూహించి నిశ్చయించెను ఏదో యొక గొప్పలాభము కలదని యాదంపతులు నమ్మిరి.
రామదాసుకథ యించుక యెఱుంగందగినది. ఆతఁ డే కులమున జనించినవాడో యెవ్వ రెఱుంగరు. ఏకడనుండి వచ్చెనో తెలియదు. ఎందుల కీదేశమున నున్నాడో యెఱుఁగఁ దరముగాదు. ఏవిద్యయందుఁ బండితుఁడని తెలియ శక్యమే కాదు. ఏశాస్త్రమున నేసందేహమునుగూర్చి ప్రశ్నించినను వెంటనే బదులువచ్చుటం జేసి సర్వశాస్త్రములు వచ్చునని తెలియఁదగుఁగదా, కృత్రిమబుద్దిని బ్రశ్నించినచో బదులే రాదు. దానింబట్టి యీతఁడు ప రేంగితావగాహి యగు బుద్ది గలవాఁడని తేటపడును. మఱియు దివ్యదృష్టిగలవాఁడనియు నూహింపఁ దగును నూత్న వయస్సు కాదుగాని నలువది యేండ్లకు మించియుండదని యాతని రూపము తెల్పును ఎవ్వరికీ నామహనీయమూర్తివలన బాధ కలుగదు. అడిగిన నన్నము పెట్టుదురేని భక్షించును. లేదన్న నూరకయుండును. మనుష్యులకూటమి నా యోగి యాశింపఁడు విజనస్థలముననే యా దాసుండును. ఎందఱో పరీక్షించిరి. కాని యొక్క దోషమైన నున్న యట్లారోపింప నేరక నోరుమూసికొని యూరకుండిరి. ఎవ్వరేని విశేషించి ప్రార్ధించిన సమాధానముగనున్న వచ్చును. ఎవ్వరింటి కాతcడరు దెంచునో వారికి మహత్తర శుభములు గలుగునన్న ప్రవాదమొక్కఁ డెల్ల తావుల వ్యాపించెను. సర్వదా రామనామమును బలుకుచుండువాఁడు. విశేషించి దేవీసమారాధకుఁడు. అట్టి వారికి దేవతలయందుఁ దారతమ్యము గలదనుభావ ముండదు ఎల్ల తావుల నొక్క పరమాత్మ నే వారు చూచుచుందురు. కావున నే దేవతయైనను వారికి సమానభ క్తిచేఁ బూజింపబడఁదగినదై యుండును.
ఆమహాత్ముడే యా యక్షరాభ్యాసముహూర్తమునకుఁ బిలువకపోయిన నరుదెంచెను. ముహూర్తము సమీపించు చున్నదని మౌహూర్తికులు తెలుపుచుండిరి. సర్వాలంకృత గాత్రుఁడై బాలకుడు కన్నులపండువు చేయుచు నాడుకొను చుండెను. దాసు సంతర్పణము చేయ సర్వసంభారములు సిద్ధము చేయించియే యుండెను. నవనీతము దెచ్చి కాఁచి నెయ్యింగూర్చి యొక సుధామయస్థలమునఁ బోసియుండిరి. అగచ్చుతొట్టి 'బాహువు మాత్రము లోతుగ నుండెను. ముహూర్తకాలము సుముహూర్తమునకు వ్యవధియుండనపు డా బాలుఁ డాడు కొనుచుఁ బోయి తటాలున నా నేతితొట్టిలోఁ బడెను. తోడి బాలురు కేకలిడిరి. శ్రీకృష్ణదా సగపడ లేదు. తల్లి పరుగునవచ్చి బాలకు నెత్తుకొనేను. ప్రాణము లంతకుముందే పోయియుండెను. ఆసాధ్వి యావిధ మెఱింగి కార్యగౌరవము నాలోచించి కంటఁ దడి పెట్టిన నిందఱకు భోజనము 'లేకపోవును. మఱియు రామదాసుగారు పిలువకయే దయచేసిరి. పండితమండల మున్నది. ఆశీర్వచన ప్రభావమున నీబుడుతఁడు బ్రదుకక యుండునా, అని నిశ్చయించి దేహము తుడిచి చెఱఁగు వానికిఁ గప్పి సుముహూర్తకాలము వచ్చుచున్నది. రమ్ము రమ్మని చీరు భర్త చెంతకుం బోయి నిలుచుండెను బాలకుఁడు నిద్రించుచున్న వాడని మేలుకొనుసమయమని యామె చెప్పుచున్నపుడు స్వరము మాఱియుండినను, ఆతొందఱలోఁ 'బెనిమిటి కనిపెట్టఁ జాలకుండెను.
అంతలోఁ గూరుచుండుఁడని పురోహితుఁడు విన్న వింప 'నెల్లరుఁ గూరుచుండిరి. పెద్దలంద ఱోక్కసారి యాశీర్వ దించిరి. వేద నాదము పరమపవిత్రము గదా. అక్షతలు చల్లిరి. అత్తఱి రామదాసుగారు చెంతకు వచ్చి “దీర్ఘాయుర్భవతు" అని యాశీర్వచించెను. బాలకుఁడు లేచి కూరుచుండెను. ఆ తల్లి యానందమునకుఁ బరిమితియుండునే, తంత్రము కొంత సాగఁగా రామదాసుగారే విధివిహితముగా నక్షరాభ్యాస కర్మము నడపిరి. భోజనము యథావిధి సాగెను భూరిదక్షిణ లొసఁగఁబడియెను. పండితులు పరిపూర్ణ మనోరథులై తమ తమయిరవుల కరిగిరి. రామదాసుగారా శ్రీవత్సాంకదాసుతో జరిగినదంతయుం 'దెలిపి యిందులకై వచ్చితినని చెప్పి యాతని సాధ్వీమణి గొప్పబుద్దిని బొగడి యామె గొప్పదనమే యింతకు మూల కారణము సుమీ యని హెచ్చరించి తనయిచ్చం బోయెను. అనుకూలభార్యావంతుఁ డెంత యదృష్టవంతుడో కదా యని తనమదిఁ జింతించుచు నా దాసు నెమ్మదిగ నుండెను.
శ్రీకృష్ణదాసు క్రమక్ర మముగఁ జదువను వ్రాయను నేర్చుకొనెను. మఱికొంతకాలమునకుఁ జక్కఁగాఁ గావ్యనాటు కాదులం బఠించి చక్కనిసాహిత్య మలవఱచుకొనెను. మహారాష్ట్ర భాష యందు నా బాలకునితోఁ దుల్యుఁడు లేఁడన్న విఖ్యాతి వ్యాపించెను. పదునాఱవయేడు వచ్చునప్పటికిఁ గులోక్త కర్మ కలాపము చక్కఁగా జరపఁబడఁగా నాతఁడు విద్వాంసుఁడు కూడ నయ్యెను. వివాహ ప్రయత్నము చేయవలసినదని పెద్ద లపుడపుడు త్వర పెట్టసాగిరి. కులోద్దారకుఁడగు కొడుకొక్కఁడే చాలునన్న సామెత యాదంపతులకుఁ దృప్తిని గల్పించుచుండెను. భార్యయు సమయమును గనిపెట్టి ప్రస్తావవశమునఁ బెండ్లిమాట యాలోచింప సమయ మిది కాదా యని యడుగుచుండెను. నేను నా ప్రయత్నము చేయ నెంచితినని యాతఁడు సమాధాన మిచ్చుచుండెను. ఆవిషయమును విని పెక్కండ్రు, తమకొమరితల నిత్తుమని సువార్తలఁ బంపుచుండిరి. ఆలకించియు బదులాడక సంతోషము సంతోష మని బదులుగనాడుచు సుంతకాలము ద్రోయుచుండెను.
శ్రీకృష్ణదాసు రాధిక విఖ్యాతిని బెక్కండ్రు, పేర్కొన వినుచుండువాఁడు. సంగీతపరీక్ష సాగి బహుమానము పొందిన యా ప్రఖ్యాతిని గూడ నాలకించెను. అంతట నారాధికను బెండ్లియాడఁ దలంచుకొనియెను. కాని తల్లిదండ్రులయభి ప్రాయ మెట్టిదో కనుఁగొనినపిదప నీవిషయము సిద్ధాంతము చేయవచ్చునని యూరకుండెను. అచ్చట రాధికయు శ్రీకృష్ణ దాసు గుణగణమును "బెద్దలు గణుతింప విని యానం దించుచుఁ దల్లిదండ్రులయాశయము నేఱుంగ వేచియుండెను. మనసున నొక్కని గోరినపిదప నింకొక్క నిగోరుట, స్త్రీలకు ధర్మముగా దనియుఁ బాతి వ్రత్యమున కది భంగకరమనియు నామె తలం చుచు నుదాహరణము సావీ త్రీ చరిత్ర మును జింతించుచు నా పతివ్రతాశిరోమణిని బొగడుచు నెంతటి మహత్త్వ మామె కీనియమమునఁ గల్గెనో యని ' లెక్కించుచు నపరిమితానంద మందుచు నుండెను.
వివాహనియమము
ఈవిషయము నిక్కడ వ్రాయఁ దలంచుకొను టనుచితము కాదు. కన్యకి ఫుట్టినది మొదలు తల్లిదండ్రులు తగినవరు నెమకుచుందురు యుక్తవయస్సు, కులము, గుణము, శీలము, శ్రీ, విద్య, తల్లిదండ్రు లయల వాటులు కన్యాజనకులు పరీక్షించు చుందురు. కన్య కామూలమునఁ దమవంశమున కేలాటి కళంకము రాకయుండవలయునని వారికోరికలలోఁ దొలుతటి దన వలయు. ఈవిషయమునఁ దల్లికంటెఁ దండ్రియే యెక్కుడు భారము మోయఁదగియుండును. తల్లి యూహలు కొన్ని విషయములయందుఁ గుఱుచలగుచుండును. దండ్రి యూహలు సాగుచుండును. కావునఁ దండ్రి, యత్యంతశ్రమముల ననుభవించియైనఁ గొమరితకు ననురూపుఁ డగువరు నరయును. వరుని తల్లిదండ్రులు నిట్లె యనురూపకన్యాన్వేషణతత్పరులయియే యుందురు. తల్లిదండ్రులు కాక బంధువులందఱుఁ దగిసస్థలమును నెమకుదురు గాని యది యంత పరిగణింపఁదగినది కాదు. కన్యక పదివత్సరములకంటె మించని యీడుక లదిగనున్న తఱినో యంతకు రెండేండ్లముందుగనో వివాహము చేయు నలవాటు ప్రాచీనా చారమునఁ బ్రసిద్ధిం గాంచినది. అంత చిన్న తనమునఁ బెండ్లి చేయఁ దగునా యని కొంద ఱందురు. అది మిగులఁ బొరపాటు.
మానవుల కెల్లరకుఁ దఱచుగా మనస్సు తెల్ల వారు జామున (అనఁగా నుషఃకాలమునందు) నిర్మలముగా నుండును. ఆకాలమునందే 'వేదము చెప్పుదురు. ఏలనఁగా నితర కార్య ములయందు వ్యాపృతము కాకయుండును గాన దానికి గ్రహణశక్తి యెక్కువగా నుండుననియే యనవలయు. మఱి కొలఁదిగడియలకది సర్వతోముఖముగ వ్యాపించును అట్లే కన్యావరులమైత్రి , చిన్న తనమునందే కలిగినచో నది దృఢ ముగ నుండఁజాలి చిరకాలము నిలుచును శాస్తోక్తవయః పరిమితియందు నా యిరువురచి త్తములు చంచలతం గాంచియుండవు, ఆతరుణమునఁ గన్యక వరుఁడీతఁడు యావజ్జీవము నా కాధారభూతుడు. ఈతనివదలిన నాకు గత్యంతరము లేదు. ఈతనియాజ్ఞ భగవదాజ్ఞ వంటిది. మీఱరానిది నాయావత్సుఖదుఃఖముల కీభర్తయే పరమగతి యనుభావము వివాహాకర్మనమున నేర్పడును. ఆభావము నిశ్చంచల మనవలయును. తదనుగుణముగాఁ గన్యక యతనియందే బద్ధానురాగము కలదగును భర్తయునట్లే యనురక్తుడయి యుండును నడుమ నడుమ నేవో కుటుంబమునఁ జిక్కులు గలిగినను దృఢ తమ ప్రేమానుబంధము నవి నిర్మూలింపఁ జేయఁజాలవు. ఈవిషయమును జక్క నాలోచించియే పూర్వులు కన్యావరులకు వివాహవయోనిర్ణయము గావించిరి. అంతియకాని పదివత్సరముల కీకన్యకకు సర్వప్ర పంచవిషయములు తెలియఁగలనని కాదు.
వయస్సు చక్కఁగా వచ్చినపిదపఁ గన్యక తానే వరుని గోరుకొనుట మంచిదిగాదా యని యడుగవచ్చును. అది యంత మంచిది కాదనుటయే సమాధానము. లోక జ్ఞానము సంపూర్ణము కాఁగా నెవనిఁ బెండ్లియాడవలయునా యను చింత గలుగు. తన మేలు కీళ్ల కుఁ దానేక ర్త ననుజ్ఞానముకూడఁ గలుగు. లోకజ్ఞాన మూరక గలుగదు. పెక్కు కష్టముల ననుభవించి వానిఁ దప్పించుకొని మనవలయును. అజ్ఞానము వయస్సు మీఱినతర్వాతఁ గాని కలుగదు. విద్య కొద్దిగనభ్య సించి యాయల్ప విద్యచే లోక జ్ఞానము కలదనుకొనుచుఁ దనమేలును గూర్చి తానే ప్రయత్నించిన నది యవివేక కార్య తుల్య మగును. వరుని సుగుణదుర్గుణములను గొంతకాలము పరీక్షింపవలయును. ఆతఁడు సరిపడకున్న వేఱోకనిఁ బరీక్షించు కొనవలయును. దానఁ గొన్ని చెడుగులు గలుగక మానవు. కొన్ని విషయముల మేలుకూడ నుండుననక తప్పదు. కాని చెడుగులే యధికమనవలసి వచ్చును. ఈ విషయము లాలోచించియే మనవారు తల్లిదండ్రు లే వరునిఁ బరీక్షించి కొమరితకు వివాహము చేయవలయునని శాసించిరి. పౌరుషము ప్రధానముగాఁ గల రాజకన్యకలకు స్వయంవరము నిర్ణయించిరి. కొందఱు తమకొమరితలను గుమతి కిచ్చి యామెను గష్టముల పాలుచేయు చుందురు గదాయన్న లేదన రాదు. సామాన్య విధి యని విశేష విధియని రెండు విధులు గలవుకదా. ఒకానొకచోట నెట్టివిధికిని బరిహరము కలుగక మానదు. కావున దానింబట్టిచూచినఁ గష్టములకంటె సుఖములే యెక్కుడుగ నుండునని చెప్పక తప్పదు.
కన్యాపరులు పరస్పరము రూపమునుగాంచి ప్రేమించిరయే నది స్వల్ప కాలమున మార్పునొందును గాని చిరతరముగ నుండఁ బోదు. శీలగుణములం బరికించి ప్రేమింతురేని శాశ్వతముగా నా ప్రేమ ముండును. అట్లు ప్రేమించుట సర్వజనసాధారణముగ శక్యము కాదు. కావుననే పెద్దలు చిరకాలము జీవించి యరోగులు దృఢ గాత్రులు నగుట స్వానుభవమున వరాన్వేషణము చేయువని తల్లి దండ్రులదే యని తీర్మానించిరి.
శ్లో. “కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా వయః,
బాంధవాః కులమిచ్ఛంతి పక్వాన్న మిత రే జనాః."
యనుసూక్తి యొకఁడు వినఁబడియెడు. ఈవివాహ పద్ధతి కొన్ని వేల యేండ్లుగ నలపాటుపడి చెడుగున కవకాశము లేకయున్న దనవలయు. ఇఁకఁ గథకు మరలుదము. రాధికకు శ్రీకృష్ణ దాసునకుఁ: బరస్పరగుణ శ్రవణమూలమున ననురాగము పొడ మెనని యీవఱకే చదివితిమికదా. మనస్సులో నిమాట నించు కే వెలిపుచ్చక వా రుండిరి. పెద్దలయందు వారికిం గలవిశ్వాస మెట్టిదో చూచితిరికదా. అట్లుగాక వారిరువురు తల్లిదండ్రులమాట: దల పెట్టక స్వేచ్చగా లేఖల వ్రాసికొనియో దూతికామూలమున స్వాభిప్రాయములఁ దెలుపుకొనియో యొకానొకచో నిరువురును గలిసి కొని ప్రేమమును దృఢపఱచుకొనియో యిందునేది చేసియుండి నను వారిచరిత్రము మీవంటి పాఠకమహాశయులమది కెక్కియే యుండదు. స్వేచ్ఛా ప్రవర్తకులకుఁ బాఠ్యములగు గ్రంథముల యందు నది వెలయుచుండఁగలదు. అట్లు గాక సావిత్రీ సత్య సంతులవలె వా రిరువురును 'బెద్దలమాట వేదతుల్యమని భావించినకతన వారిచరిత్రము వనితల కెల్లరకు నుదాహరణభూతమయ్యెను. కొలదిదినము లిట్లు గడచెను.
ఇందిరా దేవియుఁ దనభర్త నుచిత రీతిఁ ద్వర పెట్టసాగెను. ఆజాతి వారి కామహారాష్ట్ర, దేశమునఁ బదునాలు గేఁడులు మించక యుండ వివాహము చేయుటాచారమఁట. ఆ నెపమున నాపురంధ్రీమణి ప్రాణనాథా ! రాధిక విదుషి యయ్యెను. పదునాల్గవవత్సరము వెడలుసమయము రానున్నది మనకులాచారమురీతి నింకను జరపుట పాడి గాదు కదా. కావునం బెద్దలయలవాటును దాఁటక వివాహ ప్రయత్నము చేయుటుచితమని నాకుం దోఁచెడిని. మీరేమి యూహించితిరో తెలియఁగోరియున్నాను. అని వినీతిఁ బల్కెను. శ్రీనివాసదాసు పత్నీ వాక్యములను విని చిఱునవ్వు నవ్వి నీ వడుగు టకుముందే చెప్పవలయునని యూహించితిని. నాప్రయత్న మంతయు ఫలించినపిదప నీకుం దెల్ఫి నిన్ను సంతోషింపఁ జేయ నెంచితిని ఆయూహ ఫలింపకముండే ప్రశ్నించితివి. నీకుఁ దెలుపక నే నేకార్యమైనఁ జేసినఁ బెద్ద లంగీకరింతుగా? ఇకఁ జెప్పెదను. ఆలకింపుము రామదాసు నాహ్వానించి యామహాత్ముఁడు చెప్పి సట్లు చేయఁదలంచితిని. ఆయోగి నాకు హితముపదేశించినట్లే వరునితండ్రి కింగూడ నుప దేశింపఁ గలఁడని నాభావము. దాని కొఱకే ప్రయత్నించు చున్నాఁడను. నాయీ ప్రయత్నము ఫలించెనేని మనరాధిక యనురూపుఁడగు భర్తకలదగును;అదృష్టవతులలో నుత్తమురా లగును. ప్రేయసీ! నిన్నింకను గష్ట పెట్టుట న్యాయము కాదు. శ్రీకృష్ణ దాసు జాలంధర పురమునఁ బద్మావతీ శ్రీవత్సాంకదాసులకుఁ బుత్రుఁడని సుగుణవంతుఁడని వినియున్న దానవు కదా, ఆబాలకునికే మనరాధిక నీయఁ బ్రయత్నించుచున్న వాఁడ. రామదాసుమాటయన్న నా బాలుని తల్లిదండ్రులు శిరసా వహింతురు ఆరామదాసు నాయందుఁ బరమాదరణము గల వాఁడు. కావున వారిమూలమున నీసంబంధము దృఢపడునట్లు చేయఁదలంచి యున్నాను. ఎవ్వరికే నీవిషయముఁ దెలియనీయకుము. అసూయకులు లోకమునఁ బెక్కం డ్రుందురు. జాగ్ర త్తగా మదినిల్పుకొనుము. కార్యసిద్ధియయ్యె నేని మనమే యదృష్ట వంతులము. విశేషించియే ప్రయత్నించుచున్నాఁడను. అని పలుక నాయిందిరా దేవి ప్రమోదార్ణవ పరిమగ్నహృదయ యయ్యెను. శ్రీనివాసదాసును స్వప్రయత్నమున బద్ధాదరుఁడయె యుండెను,
_________________________