నిర్వచనోత్తరరామాయణము
తృతీయాశ్వాసము
|
రమ్యతానిరూఢమ
హోరస్కుం బుణ్యసంపదుదితయశస్కుం
గారుణ్యార్ద్రమనస్కుఁ బ్ర
జారంజనశీలు మనుమజగతీపాలున్.
| 1
|
విష్ణువు దేవతలకుఁ దోడై రాక్షసులతో యుద్ధము సేయుట
చ. |
హరిఁ గని దేవదూత చరణారనతుఁ డై యసురేంద్రసేన ని
ర్జరనగరంబుపైఁ బెలుచురాకయు నాకము బెగ్గలంబునం
దిరుగుడుపాటుఁ జెప్పిన నతత్వరితంబునఁ గౌతుకంబు మై
గరుడుని నెక్కి శార్ఙ్గగుణగాఢరవంబు నభంబు నిండఁగాన్.
| 2
|
క. |
రక్షోవధయును సుమనో, రక్షయు మదిఁ గోరి యాదరంబున రాజీ
వాక్షుఁడు సిద్ధులజయశ, బ్దాక్షరములుఁ గిన్నరీచయము గానంబున్.
| 3
|
క. |
కొంచెపునగవుల సంభా, వించుచు వివిధాయుధాంశువితతుల్ దిశలన్
నించుచు దనుజతమముఁ దూ, లించుచు రణకేళిలోలలీలం జనుచోన్.
| 4
|
క. |
గరుడునిపై శార్ఙ్గధను, ర్ధరుఁ డగువిష్ణుండు మేరుతటిఁ బొల్చుతటి
త్పరివృతజలదముఁ బోలుట, విరియ దనుజరాజహంసవితతి యితనికిన్.
| 5
|
మ. |
అని బృందారకవందిబృందము లమందానందముం బొంది కీ
ర్తన సేయం ద్రిదివంబు ముట్టికొన నుద్దామప్రతాపంబున
న్దనుజానీకము చేరకుండ నడుమ న్వారింపఁగాఁ బూని చ
య్యన నేగెం బతగేంద్రపక్షపవనవ్యాధూతదిగ్భిత్తి యై.
| 6
|
మ. |
చని నాకంబున కడ్డపడ్డ హరియుత్సాహంబు వీక్షించి య
ద్దనుజాధీశుఁడు చేయి వీచుటయు మాద్యద్దంతివర్గఁబు న
శ్వనికాయంబుఁ బదాతిలోకము రథవ్రాతంబు నొక్కుమ్మడిన్
ఘనమార్గం బఖిలంబు గప్పి పడగల్ గ్రాలన్ వడిం దాఁకినన్.
| 7
|
తే. |
మందహాసంబు చేసి యమందరవము, మిగిలి రిపుతూర్యరవములు మ్రేఁగికొనఁగఁ
|
|
|
బాంచజన్యంబుఁ బెలుచఁ బూరించి శార్ఙ్గ, గుణము సారించి దానవగణముఁ జూచి.
| 8
|
క. |
కడఁకఁ దలమీఱి యల వే,ర్పడ మును దలపడఁ దలంచి పఱతేరంగా
విడుచుచు నొక్కొకయమ్మునఁ, బడనేయుచు వచ్చె వీరభటులం గడిమిన్.
| 9
|
చ. |
తొలితొలి పడ్డ పీనుఁగులఁ ద్రొక్కుచు నొండొరు మీఱఁ జూచున
గ్గలికఁ గడంగి బాహుబలగర్వము చూపఱు మెచ్చ నుగ్రదై
త్యులు దలపడ్డ వారిసమరోద్ధతి కుత్సవ మంది శార్ఙ్గమం
దలవున నిల్వరించె నిశితాస్త్రము లూఁ తయి వ్రాలునట్లుగన్.
| 10
|
ఉ. |
కూలినవారిఁ జూచి వెడగొంకిన మెచ్చక మున్ను వెన్నుగా
నేలకుఁ జొచ్చువారుఁ దమనెయ్యుర కడ్డము వచ్చువారు ను
క్కీ లయి నేర్పు లేక తమకించి పయింబడి నొచ్చువారు మున్
వాలిన మచ్చరం బగుట వారణసేయక వచ్చువారు నై.
| 11
|
క. |
దానవు లేయుచు వైచుచు, సేనలఁ బురికొల్పుకొనుచుఁ జేరిన శార్ఙ్గ
జ్యానాదభరితరోదసి, యై నారాయణుఁడు మార్గణాంబుధి ముంచెన్.
| 12
|
చ. |
మునుమును వీఁకఁ దాఁకి యొకమోహర మచ్యుతుచేత మ్రగ్గుటన్
మొదలు గలంగినం గని సముద్ధతవృత్తి నదల్చి వెన్నుద
న్ని నిలిచె దానవేశ్వరుఁడు నెక్కొనఁ గాఁ దనముద్దుఁదమ్ములున్
దనయులు దండనాథులు నుదగ్రత సేనకు దర్ప మెక్కఁగన్.
| 13
|
క. |
బరవసమునఁ గో ల్తలచే, సిరి పురికొని కడఁగి దైత్యసేనలు మగుడన్
హరిఁ బొదిసెఁ జపలజలదో, త్కర మతిసాంద్రముగ నభముఁ గప్పినభంగిన్.
| 14
|
ఆ. |
ఓరలేక దొరలు క పోరికిఁ జొచ్చిరి, కడిఁదిమగలుఁ బేరు కలుగువారు
నడరి ముట్టఁ గవిసి రరవాయి గొనక కో, లాహలముగఁ గాల్బలమ్ము గదిసి.
| 15
|
క. |
శరములఁ జక్రంబులఁ దో, మరములఁ గుంతముల గుప్పి మానుగ ఖడ్గ
క్షురికాహలపరిఘాము, ద్గరముసలపరశ్వధములఁ గప్పిరి కడిమిన్.
| 16
|
శా. |
సర్పారాతిపయి న్నిజాంగములపైఁ జంచద్భుజాభీలతన్
దర్పం బేర్పడ నొక్కపెట్ట యటు లాదైతేయవీరు ల్దిశా
సర్పద్దీప్తిసటాజటాలపటుశస్త్రవ్రాతముల్ సాంద్రమై
యూర్పోకుండఁగ నించినన్ మురహరుం డుద్దామకోపాగ్ని యై.
| 17
|
చ. |
గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ దారభీ
షణముగ నుప్పతిల్లి రభసంబుగ రేఁగినమాడ్కిఁ దీవ్రమా
ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబులఁ గప్ప శార్ఙ్గని
క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్.
| 18
|
క. |
అరదములు రథికవరులును, హరిసారథికేతుసహిత మై పొడిపొడి గాఁ
గరులును జోదులు డొల్లఁగఁ, దురగంబులు రావుతులును దుత్తునియలు గాన్.
| 19
|
క. |
ఏయుచుఁ గౌమోదకిఁ గొని, వ్రేయుచు నందకమునను వివిధగతిఁ దునియల్
సేయుచు మధుమథనుఁడు దై, తేయతతిం గూల్చె నుద్ధతిం బడలుపడన్.
| 20
|
చ. |
అడరిన మేఘపంక్తి విరియం బటువేగమహానిలంబు బ
ల్విడి భయదప్రకారముగ వీచుతెఱంగున దైత్యసైన్యముల్
సెడి నలుదిక్కులం బఱవఁజేసి యమందవిజృంభణంబునం
బిడుగులపిండు బి ట్టులియుపెల్లున విష్ణుఁడు శంఖ మొత్తినన్.
| 21
|
ఆ. |
పాఱలేక చాలుకపడ డొల్లె భటకోటి, కరులు గిరులు గూలుకరణి మ్రొగ్గె
ఘోటకంబు లెల్ల గుండియ లవిసి శో, ణితముఁ గ్రక్కె శంఖనిస్వనమున.
| 22
|
చ. |
తదవసరంబునం బెలుచఁ దాఁకి సుమాలి యుపేంద్రుపైఁ బటు
ప్రదరము లభ్ర మద్రిశిఖరంబును వారిని ముంచినట్లు పె
ల్లిదముగ నేసె దైత్యులు చలించక సంగరకాంక్షఁ గ్రమ్మఱం
బొదువ సహోదరు ల్ప్రమదపూరిత చిత్తులు గా నుదగ్రుఁ డై.
| 23
|
క. |
వనజాక్షుఁడు దరహాసం, బునఁ బొదివిన కినుక వక్త్రమున ముసుఁగు వడం
దునిమెను లీలమెయిన్ గ్ర, క్కున నాతనిసూతుశిరముఁ గ్రూరాస్త్రమునన్.
| 24
|
ఉ. |
సారథి పద్ద నశ్వములు సంచలతం బెనఁగాడి యీడ్చినం
దే రనువేది యగ్రజుఁడు ద్రిప్పికొనం గని మాలి యడ్డ మై
బోరన వచ్చి యవ్విహగపుంగవకేతను నేసె నెంతయుం
గ్రూరము లైనయమ్ములను గుర్వుగ దానవు లుత్సహింపఁగన్.
| 25
|
ఉ. |
మాలిశరంబు లొక్కమొగి మంచుక గప్పినమాడ్కిఁ గప్పుడుం
గూలఁగ నేసె వానిరథఘోటములన్ హరి వాఁడు గ్రక్కున
న్శైలతటంబు డిగ్గుమృగనాథుక్రియన్ గద పుచ్చికొంచు నా
భీలగతిన్ రథంబు డిగి భీమజవంబున నంట నార్చుచున్.
| 26
|
క. |
పఱతెంచి కదియఁబడి యే, డ్తెఱ వ్రేసిన మోము దాఁకి తిరిగె గరుడి య
త్తఱిఁ జక్రంబున హరి పెడ, మఱి వైచెను దనుజుననుజుమస్తకము దెగన్.
| 27
|
మాల్యవంతుఁడు విష్ణువున కోడి పాతాళముఁ జొచ్చుట
శా. |
మాలిం జంపిన మాల్యవంతుఁ డుదితామర్షప్రకర్షంబురం
గాలాగ్నిప్రతిమానుఁ డై నిజభుజాగర్వంబు మై లీల నున్
మీలజ్జ్వాలకరాళశక్తిఁ గొని మే మే తాఁకి వక్షస్స్థలిం
గీలించెం జలదంబుపై మెఱుఁగుమాడ్కిన్ శౌరికిం జెన్నుగాన్.
| 28
|
క. |
ఆశక్తియె కొని క్రమ్మఱఁ, గేశవుఁ డసురేంద్రు వైవ గిరిపైఁ బడుతీ
వ్రాశనిచాడ్పున వక్షో, దేశంబునఁ బడిన నొచ్చి ధృతి వాటించెన్.
| 29
|
ఆ. |
మూర్ఛవోక నిలిచి మూఁడుమొగంబుల, శూల మెత్తికొని కరాళవృత్తి
నడచి నెమ్మొగమునఁ బొడిచె నింద్రానుజు, దేవతలమనంబు దిగ్గనంగ.
| 30
|
క. |
పొడిచి పిఱిఁదిదెసకయి పో, యెడిదానవు వ్రేసె గద మహీధరుఁడు గడున్
వడిఁ బక్షంబులఁ బొరిఁబొరి, నడిచెను విహగాధిపతియు నత్యుగ్రముగాన్.
| 31
|
సీ. |
గద దాఁకి మూర్ఛిల్లి గరుడునియెఱకలగాలిచే దవ్వుగఁ దూలిపోయి
తెప్పిఱి లేచి నల్ దిక్కులు గనుఁగొని పాఱియుఁ జచ్చియు బయలుపడ్డ
బలములోపలఁ జేయఁగలవారి బంధుల దొరలను గానక బరవసంబు
దక్కి తమ్ముండును దాను నొండొరువులఁ జూచుచున్నంతనె వీచె గరుడి
|
|
ఆ. |
పక్షమారుతమునఁ బరిపరి యైనయా, సేనతోడఁ గూడి దానవేంద్రుఁ
డాకులముగఁ జొరువుటాకులచాడ్పునఁ, ద్రిప్పికొనుచు నెగసి తెరలి పఱవ.
| 32
|
క. |
అమ్మెయిని నోడి తానుం, దమ్ముఁడు హతశేష మైనదానవబలముం
గ్రమ్మఱి తమవచ్చినమా, ర్గమునఁ బాఱెను విహంగగమనుం డెగపన్.
| 33
|
మ. |
కడువేగంబున లంక కేగి తమదోర్గర్వంబు దైత్యారిచేఁ
బడి భంగంబునఁ బొందినన్ భయభరభ్రాంతాత్ము లై యందునుం
దడయన్ బెగ్గిలి బృంద మెల్లఁ గొని పాతాళంబుక్రిందం జొరం
బడి రా దేవమునీంద్రకోటికి ననల్పప్రీతి సంధిల్లఁగాన్.
| 34
|
అగస్త్యుఁడు రామునకు రావణాదులకథ దెల్పుట
క. |
వనజాక్షుఁ డొకఁడు వెలిగా, దనుజుల నెవ్వరికి గెలువఁ దలఁపఁగ నగు నిం
ద్రుని కప్పుడు తమ్ముఁడ వై, తనయుఁడ వై తిపుడు నీవు దశరథపతికిన్.
| 35
|
ఉ. |
సత్త్వరజస్తమోగుణవశస్థితిఁ గైకొని నీవ లీల బ్ర
హ్మత్త్వము దాల్చి లోకముల కన్నిటికిన్ జననం బొనర్తు వి
ష్ణుత్త్వము దాల్చి వానికి మనోజ్ఞతమస్థితి వృత్తిఁ జేర్తు రు
ద్రత్త్వము దాల్చి వాని కుచితంబుగ సంహృతిఁ గూర్తు రాఘవా.
| 36
|
ఉ. |
సాధులఁ గావ దుష్టజనసంహరణం బొనరింప ధర్మముల్
బాధలఁ బొందకుండఁ బరిపాలన సేయఁదలంచి యాత్మమా
యాధృతిఁ బుట్టువుం బనుల నాదర మొప్పఁగఁ దాల్చి పొల్చుటన్
మాధవ మర్త్యుఁ డండ్రు నిను మందమతిన్ భవభావరూఢు లై.
| 37
|
తే. |
అధిపతి సాలకటంకటు లనఁగఁ జనిన, నాఁటివారుఁ బౌలస్త్యులు నాఁగఁ బరఁగు
నేఁటివారు సమానులు నిక్క మరయ, బాహుబలమున నాహవదోహలమున.
| 38
|
మ. |
అనినన్ రాఘవకుంజరుండు మునినాథాగ్రేసరుం జూచి యి
ట్లనియెన్ మాల్యవదాదివృత్తము ప్రసంగాధీన మై పుట్టె నే
మును మీచే విను రావణాదులకథల్ ముట్టం బ్రశంసింపుఁ డా
తనిఁ దత్సోదరులం దనూజు వినఁ జిత్తం బుత్సుకం బయ్యెడిన్.
| 39
|
ఆ. |
రాముఁ డిట్టు లడుగ నాముని సెప్పెఁ బా, తాళ భువనమున ముదం బడంగి
యున్న యాసుమాలి యొకనాఁడు సౌందర్య, వినయమహిత తనదుతనయఁ జూచి.
| 40
|
ఉ. |
రూపగుణంబులందు ననురూపత గల్గువరుండు దీనికిం
జేపడు నొక్కొ పుత్త్రులఁ బ్రసిద్ధులఁ బల్వురఁ గాంచు నొక్కొ ల
క్ష్మీపరిణామహృద్య మగు జీవన మక్కట గల్గు నొక్కొ యి
ప్పాప మదస్వయక్రమముఁ బాత్రముఁ జేయు నొకో పొగడ్తకున్.
| 41
|
క. |
ఈలోకంబున నరసితి, మే లెల్లెడ వరునిఁ గాన మేదిని కరుగం
జాలక యున్నను బోవదు, బాలికఁ గొనిపోవవలయుఁ బరిణయమునకున్.
| 42
|
మ. |
అని యుల్లంబున నిశ్చయించి సుకుమారాకార నాకైకసిం
గొని వేడ్కన్ మహి నెల్లెడం దిరిగి రక్షోనాథుఁ డెం దైన న
ల్లునిఁ గల్యాణగుణోత్తరుం బడయ కెట్లుం బోవఁ బొ మ్మంచు న
ల్లనఁ జేరెం దరుపోతకాంత మగు పౌలస్త్యాశ్రమోపాంతమున్.
| 43
|
ఆ. |
అచటఁ గనియెఁ దండ్రి నతిభక్తి వీడ్కొని, ఘనవిమాన మెక్కి యనుపమాన
మహిమ వెలయఁ బురికి మగుడఁ బోవఁగ ధనా, ధ్యక్షు రుచిరహారధవళవక్షు.
| 44
|
క. |
కనుఁగొని సుమాలి యితనిం, గను మునిచంద్రునకు నిత్తుఁ గన్నియ నని సం
జనితకుతూహలుఁ డై య, వ్వనితకు ని ట్లనియె గారకవంపుఁబలుకులన్.
| 45
|
చ. |
తగినవరుండు నీకు వనితా విను విశ్రవసుండ యాతఁ డా
ర్యగుణవిభాసి యమ్మునిజనాధిపుపాలికి నీవు వోయి యిం
పుగ వరియింపు నీకనిన పుత్త్రులచేత మదన్వయంబు రూ
పగు నిదె చూచితే ఘనుఁ దదాత్మజు నుజ్జ్వలవైభవోన్నతున్!
| 46
|
ఉ. |
నా విని తాను మున్ మనమునం దలపోయువిధంబ తండ్రి సం
భావనఁ జెప్పినన్ వికచపద్మవిలోచన సంతసిల్లి యేఁ
బోవుట యుక్త మేని మునిపుంగవు నాశ్రమ మెద్ది పోదునే
నావుడుఁ జూపి సమ్మదమునన్ సుత వీడ్కోలిపెన్ సుమాలియున్.
| 47
|
క. |
చని కైకసి పౌలస్త్యుం, గని వినయవిలాసభయవికాసవ్రీడా
జనితవికారసుభగనిజ, తనులత వెడవ్రాలఁ జతురతం బ్రణమిల్లెన్.
| 48
|
ఆ. |
మ్రొక్కి నిలిచి యతనిముందట మేదిని, నుంగుటమున నొరయుచున్నఁ జూచి
యెచటనుండి రాక యెవ్వనిసుత వేమి, పనికి నిందు వచ్చి తనిన నదియు.
| 49
|
ఉ. |
ఏను సుమాలికూఁతుర మునీశ్వర మి మ్మిటఁ దండ్రిపంపునం
గానఁగ రాక యంచు నునుఁగాంతి దలిర్చెడిమోము వాంచుచుం
దా నటఁ జెప్పలేమి విదితంబుగఁ జెప్పుట యైన నంకుర
శ్రీనినుపారె విశ్రవసుచిత్తలతం గరుణాస్వరూప మై.
| 50
|
క. |
ముని యమ్మానినియింగిత, మును నెఱిఁగియు దివ్యబోధమున నేర్పడ నె
ల్ల నరసి యల్లనినగవున, మునింగి మృదుమధురవాక్యముల ని ట్లనియెన్.
| 51
|
చ. |
జనకుఁడు గోరి నిర్మలవిచారమునం దగ నిశ్చయించి ని
న్ననుమతి సేయ నీవును బ్రియంబున నియ్యెడ కేగుదెంచు టె
ల్లను నగు నాదెసం దనయలాభముఁ గోరితి వియ్యకొంటి నే
ను నకట వేళ క్రూరము తనూజులఁ గ్రూరులఁ గాంతు కామినీ.
| 52
|
చ. |
అనవుడు మీకృపం బడయు నాత్మజు లుగ్రులు గాఁగఁ బాడి గా
దనవుడు నీదుసంతతికి నంతకుఁ గొండొకవాఁడు శాంతుఁ డై
వినయవివేకధర్మముల విశ్రుతబుద్ధి వహించు మత్కులం
బును భవదీయవంశమును బూతము సేయు సరోజలోచనా.
| 53
|
క. |
అని యూఱడించి ముని య, వ్వనితం గైకొనియె నదియు వల్లభుచిత్తం
బునకుఁ దగుచరిత మన్ననఁ, గని సంతస మంది కొంతకాలంబునకున్.
| 54
|
క. |
పదితలలుం గోఱలు నిరు, వదిచేతులు నిరులు గవియు బలుమేనును గెం
పొదవిననయనంబులు ను, న్మద మగుహృదయంబుఁ గలతనయునిం గాంచెన్.
| 55
|
ఆ. |
కనినయప్పు డచటఁ గడునుగ్ర మగురక్త, వృష్టి గురిసె నుల్క లష్టదిశలఁ
బడియె వఱళు లఱచెఁ బిడుగు లుర్విని బడి, మ్రోసె గాడ్పు సుడిసె మాసె నినుఁడు.
| 56
|
క. |
మునివరుఁడు వికటుఁ డగుతన, తనయుకడకు వచ్చి వదనదశకంబు గనుం
గొని వానికి దశవదనుం, డనియెడునామం బొనర్చె నాసుతు పిదపన్.
| 57
|
సీ. |
అధికప్రమాణసర్వాంగఘోరాకారుఁ గుంభకర్ణుం డనుకొడుకుఁ గాంచె
దంష్ట్రాపరస్పరతాడనరచితసంకుల శూర్పణఖ యనుగకూఁతుఁ గనియె
నిట్టిసంతతిఁ గన్న యిమ్మహాపాతకంబునకుఁ బ్రాయశ్చిత్త మనఁగఁ బ్రీతిఁ
బడ విభీషణుఁ బావనోజ్జ్వలమూర్తిఁ గైకసి మునికృపాగౌరవమున
|
|
ఆ. |
నిట్లు పుట్టి పెరుఁగునెడఁ బంక్తిముఖకుంభ, కర్ణు లెందుఁ గ్రూరకర్ము లగుచుఁ
దిరిగి జంతువుల వధింతురు ధర్మసం, ప్రీతిఁ బరఁగు నవ్విభీషణుండు.
| 58
|
ఆ. |
అంత నొక్కనాఁ డనంతవైభవముతో, ధనదుఁ డేగుదెంచి తండ్రిపాల
గారవమున నున్నఁ గైకసి గనుఁగొని, చిన్నవోయి కొడుకుఁ జేరఁ బిలిచి.
| 59
|
క. |
ఇతనిమహాసంపద సూచితె మీ రొక్కనిక పుట్టి శ్రీతేజములం
దితఁ డి ట్లుండఁగ నీ వి, ట్లతిహీనత నున్నఁ బురుషుఁ డండ్రే నిన్నున్.
| 60
|
మ. |
తను ని ట్లాడినతల్లిమాటలకు మాత్సర్యంబు చిత్తంబునం
దనరంగా దశకంధరుం డనియె నుత్సాహంబు వాటించి యీ
తనితో సాటి యనంగ మే లన నమందశ్రీవిలాసంబు సే
కొని యీలోకము లెల్ల నేలుదును నీకుం జింత యింతేటికిన్.
| 61
|
రావణాదులు తపం బొనరించుట
క. |
అని గోకర్ణమునకుఁ జని, యనుజన్ములుఁ దాను నెదల నజు నిలిపి తపం
బొనరించి రత్తేఱం గొన, రను జెప్పెద నీవు వినుము రఘుకులతిలకా.
| 62
|
సీ. |
వేసవి గనగన వేఁగుచట్రాతిపై నగ్గి నల్గడ నుండ వర్కుఁ జూచి
వానకందువను దివారాత్రములు జలధారల బయళులఁ దడియుచుండి
సీతునఁ బెనుమంచు శిరముపైఁ గురియంగ నిష్ఠఁ గుత్తుకబంటినీర నిలిచి
ఫలముల వేళుల బత్రంబులను నీళ్లులను గాలిఁ గాలంబు దనరఁ గడపి
|
|
ఆ. |
కుంభకర్ణుఁ డిట్లు ఘోరంబుగాఁ బది, వేలవత్సరములు సాల నియతి
మునిగణంబు సిద్ధజనమును వెఱఁ గంది, తన్నుఁ దగిలి పొగడఁ దపము సేసె.
| 63
|
తే. |
ఏకపదమున నైదువేలేఁడు లుండి, యూర్ధ్వబాహుఁడై మో మెత్తి యుండెఁ బిదప
నైదువేలేండ్లు లిట్లు మహాతపంబు, ప్రియము గుందక చేసి విభీషణుండు.
| 64
|
చ. |
అనుజులనిష్ఠ మెచ్చక దశాననుఁ డుగ్రతపఃకుతూహలం
బునఁ ద్రిజగంబులం బొగడు పొంపిరివోవ సహస్రవర్షముల్
సన నొకమస్తకంబుగ నశంకతఁ దొమ్మిదివేలఁ దొమ్మిదిం
దునిమి హుతాశనుం దలలఁ దుష్టునిఁ జేసె నజుండు మెచ్చఁగన్.
| 65
|
క. |
క్రమమున దశముఖుఁ డొగి నొ, క్కముఖమ చిక్కంగఁ బెఱముఖము లన్నియు న
గ్నిముఖంబున వేల్చియుఁ జి, త్తమునం దొకకొంకు లేక తద్దయు నెమ్మిన్.
| 66
|
రావణునకు బ్రహ్మ వరంబు లిచ్చుట
చ. |
పది యగు వేయి నిండుటయుఁ బంక్తిముఖుండు మనంబునన్ ముదం
బొదవఁగ నిర్వికారమున నున్న శిరంబును గోయఁ జూచినన్
వదనచతుష్టయం బలర వారిజసంభవుఁ డేగుదెంచి క
ట్టెదుర వరంబు వేఁడు మిదె యిచ్చెద మెచ్చితి నంచు నిల్చినన్.
| 67
|
క. |
ధరఁ జాఁగి మ్రొక్కి దశకం, ధరుఁడు వినయ మొప్ప నిలిచి తఱుగనితలపై
వెరపునఁ దనకరపద్మము, లిరువదియును మొగిచి యల్ల నిట్లని పలికెన్.
| 68
|
శా. |
దేవా విన్నప మాదరింపుము భయోద్రేకంబునన్ మృత్యువుం
గావం గోరు బహుప్రకారముల లోకం బంతయుం గావునన్
దేవవ్రాతనియచ్చరప్రకరదైతేయప్రజాదిక్రియన్
జా వేరూపున నాకు లే కునికి యిష్టం బాశ్రితశ్రీకరా.
| 69
|
క. |
ఏ నాబలవిరహితు లగు, మానవులను సరకుసేయ మది నెన్నఁడు నీ
యానయె జగతిం దక్కటి, హీనపుజాతులకు వెఱతునే పరమేష్ఠీ.
| 70
|
చ. |
అని తను వేఁడిన సరసిజాసనుఁ డవ్వర మిచ్చి యొక్కమో
మున వినయావనమ్రుఁ డయి ముందట నిల్చినపంక్తికంధరుం
|
|
|
గనుఁగొని క్రమ్మఱం దలలు గ్రక్కునఁ గల్గ ననుగ్రహించి ప్రీ
తి నొసఁగె నుజ్జ్వలంబు లగుదివ్యశరంబులుఁ గామరూపమున్.
| 71
|
క. |
వెల్లువ ముంచి పిదప నీ, రెల్లను వెస డొంకఁ గొలన నెసఁగెడుచంచ
త్ఫుల్లారవిందములక్రియ, నల్లన వదనములు దోఁచె నాశ్చర్యముగాన్.
| 72
|
విభీషణునకు బ్రహ్మ వరంబు లిచ్చుట
మ. |
అజుఁ డి ట్లద్భుతభంగిఁ బంక్తిముఖు నన్వర్థాభిధానోజ్జ్వలుం
ద్రిజగద్వీరునిఁ జేసి దుష్కరతపోదీక్షాప్రవృత్తిప్రకా
రజితాత్ముం డగునవ్విభీషణు వరప్రాప్తోన్నతుం జేయఁగా
నిజబుద్ధిం దలపోసి వానిఁ గరుణాస్నిగ్ధాత్ముఁడై చూచుచున్.
| 73
|
తే. |
ధర్మనియతికి మెచ్చితిఁ దపము పండె, వత్స నీమది వలసినవరముఁ గోరు
మనిన భయభక్తిసంభ్రమహర్షభరిత, హృదయుఁ డై యతఁ డాతని కిట్టు లనియె.
| 74
|
ఉ. |
ప్రీతుఁడ నంటి నాతపముపెంపున నీవల దీని కగ్గలం
బై తగుకోర్కియుం గలదె యైనను గోరెద నామనంబు ధ
ర్మేతరవృత్తికిం జనమి యిష్టవరం బగు ధర్మవర్తులై
పూతగుణాభిరాము లగుపుణ్యులకున్ సులభంబు లెవ్వియున్.
| 75
|
క. |
అనుపలుకుల కచ్చెరుపడి, దనుజులలోఁ బుట్టి నీవు ధర్మంబు మనం
బునఁ గోరుట యరు దిచ్చితి, నని యజుఁ డమరత్వమును నిజాస్త్రము నిచ్చెన్.
| 76
|
కుంభకర్ణుని తపగఫలము
ఆ. |
ఇవ్విధమున శంభుఁ డవ్విభీషణుఁ బ్రీతుఁ, జేసి కుంభకర్ణుఁ జేరఁ బిలువఁ
దలఁచు టెఱిఁగి దేవతలు దేవ విన్నప, మవధరింపుఁ డనుచు నజునిఁ జేరి.
| 77
|
సీ. |
అప్సరోగణము విహారంబు సలుపంగఁ దునిమెఁ బెక్కండ్ర నందనమునందుఁ
దపములు సేయ మందరకుధరంబులో నురవడి మునులఁ బల్వుర వధించె
నిల నెల్లయెడల ననేకభూసురులు యాగము లొనరింపఁ బ్రాణములు గొనియెఁ
దెరువుల నరుగంగ సరికట్టి చంపె నాబాలవృద్ధంబుగా బహుజనముల
|
|
తే. |
వేచి యాహారమున కని వేడ్క కనియు, నఖిలజీవుల నిట్లు నిత్యంబు సమయఁ
జేయు నీవరమున నిఫ్డు సిద్ధుఁడయిన, నితఁడు సైరించునే లోకహితవిచార.
| 78
|
క. |
కావున నీతని మోహితుఁ, గావించుట జగము లెల్లఁ గాచుట సుమ్మీ
నావుడుఁ దలఁపున భారతి, రావించిన వచ్చుడును సురజ్యేష్ఠుండున్.
| 79
|
ఆ. |
అసురమోమునందు వసియించి నను నిద్ర, యడుగు మనిన వాణి యట్ల చేయు
దాన ననుచుఁ జనియె దానవుఁ బిలిచి నీ, కాంక్ష సెప్పు మనియెఁ గమలభవుఁడు.
| 80
|
క. |
నిద్ర దయసేయు మనియె సు, రద్రోహియు నమరవరులు రదనాంకురచం
చద్రుచులు నిగుడ నవ్వుచు, భద్రము మా కదియె యనఁగఁ బద్మజుఁ డిచ్చెన్.
| 81
|
క. |
ఆనేర్పుతోన వెసఁ జతు, రాననుఁడును సురలు నరిగి రవ్వాణియు దై
త్యాననముఁ బాసి పోయెను, దానవుఁడుఁ దలంచుకొని వృథాచింతనుఁ డై.
| 82
|
క. |
ఏరూపున నే ని ట్లని, కోరితి నిది యేమి యొక్కొ కుత్సిత మయ్యెన్
ఘోరతప మెల్ల దీనికిఁ, గారణ మాసురలవలని కపటము సుమ్మీ.
| 83
|
క. |
అని వగచుచున్న నాతనిఁ, గనుఁగొని ఖేదమునఁ బంక్తికంఠుఁడు సేరం
జనుదెంచి తానుఁ దమ్ముఁడు, ననునయ మొనరించి సముచితాలాపములన్.
| 84
|
క. |
కొనియాడిన నాఱవ నెల, కును నొకదినమందు లేచుఁ గుడుపును గమనం
బును గల్గు నాఁడు పగతుర, కనిలోనన్ విజయుఁ డీతఁ డని యజుఁ డరిగెన్.
| 85
|
క. |
వనజభవుచేత నివ్విధ, మున వరములు వడసి పంక్తిముఖుఁ డుద్ధతుఁ డై
యనుజులతో శ్లేష్మాతక, వనమున సుఖ ముండె దనుజవర్గము కొలువన్.
| 86
|
సుమాలిబోధనచే రావణుఁడు లంకను వశపఱచుకొనుట
తే. |
ఇంతయును జెప్ప విని రాఘవేశ్వరుండు, మిగుల నచ్చెరువడి యటమీఁద వారి
చరిత మెట్లొకొ నావుఁడు ధరణిపతికి, నయ్యగస్త్యమునీంద్రుఁ డి ట్లనియెఁ బ్రీతి.
| 87
|
సీ. |
కైకసి దీనికిఁ గడుసంతసంబునఁ దేలుచు నుండ సుమాలి తనదు
దౌహిత్రుఁ జూడఁ బాతాళలోకంబున నుండి మారీచమహోదరులును
నవ్విరూపాక్షప్రహస్తులు నాదిగా సచివులుఁ దక్కటిసైన్యపతులుఁ
గొలిచి రాఁ జనుదెంచెఁ గుంభకర్ణవిభీషణులు దోన చన దైత్యకులవిభుండు
|
|
ఆ. |
నెదురువోయి భక్తి నెరఁగి సమాలింగి, తాంగుఁ డై విభూతి యతిశయిల్లఁ
దననివాసమునకుఁ గొనిపోయి సముచితా, చారవిరచితోపరచారుఁ డయ్యె.
| 88
|
క. |
వినయము దగఁ బాటించుచుఁ, దనపార్శ్వమునందు సముచితం బగురుచిరా
సనమున నాసీనుం డగు, మనుమనితో నిట్టు లను సుమాలి ప్రియమునన్.
| 89
|
శా. |
మావంశంబు ప్రసిద్ధిఁ బొందు హరి పల్మాఱున్ సురేంద్రాదులం
గావన్ దానవమర్దనంబు గడఁకం గావించుటల్ మాను నా
దేవానీకముత్రు ళ్లడంగు విభవోద్రేకంబు శోభిల్ల దై
త్యావాసత్వముఁ గాంచు లంక భవదీయస్ఫారవీరోద్ధతిన్.
| 90
|
శా. |
లంకాపట్టణ మేలి యే నసమలీలం గ్రాలి దేవేంద్రుపైఁ
గింకన్ దాడిగఁ బోయినన్ సురల రక్షింపంగ వేగంబ చ
క్రాంకుం డడ్డము వచ్చినం దెరలి దైన్యం బొంది పాతాళ మా
తంకం బేర్పడఁ జొచ్చి యం దఁడగి యిందాఁకన్ వగం గుందుచున్.
| 91
|
క. |
ఉన్నంత నీవు గలిగితి, బన్నంబులు దలఁగ నింక బగఱ నొడుతు మీ
కిన్నరుఁడు రిత్తగాఁ డిటు, గొన్నపురము మున్ను మగుడఁ గొనఁగావలయున్.
| 92
|
క. |
మాతామహుఁ డిటు దనకుం, జేతోముద మంద నీతి సెప్పిన మదిలోఁ
బ్రీతుం డయ్యును దశముఖుఁ, డాతనిచిత్తంబుచంద మారయుబుద్ధిన్.
| 93
|
ఆ. |
ధనదుఁ డగ్రజుండు తదధీన మగులంక, యాసపడుట యుచితమగునె యనిన
నధికవినయమున మహామతి యైన ప్ర, హస్తుఁ డిట్టు లనియె నసురపతికి.
| 94
|
చ. |
తనయుఁడు తండ్రి యగ్రజుఁడు తమ్ముఁ డనం జనునయ్య రాజ్యముల్
గొనునెడ శౌర్యలంపటులకున్ మఱి చుట్టఱికంబు గల్గునే
యను వగునంతకున్ రిపు నుదగ్రత సైచిన నింక నూరకుం
డ నగునె వేగ పోరికిఁ గడంగుము నీభుజదర్ప మేర్పడన్.
| 95
|
క. |
విను ము న్నదితియు దితియును, ననఁ గశ్యపుభార్యలిరువు రప్పాచెల్లెం
డ్రనిమిషులు నసురగణముం, గని రయ్యిరుదెఱఁగుఁ బగఱు గారే తమలోన్.
| 96
|
ఉ. |
దైత్యులు దర్ప మెక్కి వసుధాతల మంతయుఁ దారవిక్రమౌ
ద్ధత్యమునం గొనం గని మదం బడఁగించి రసాతలైకసాం
గత్య మొనర్చె విష్ణుఁ డటు గావున వారలతోడివైర మౌ
చిత్యవిహీనమే తడవు సేయకు దాయకు నల్గు మిత్తఱిన్.
| 97
|
తే. |
ఇట్లు పలికినపలుకుల కియ్యకొని సుమాలి సందియ మేటికి మాకు నెల్లఁ
బ్రభువ వీవ లంకాపురపతివి నీవ, పనుపు మొకదూత నాతనికపాలి కనిన.
| 98
|
చ. |
ధనదునియొద్ద కేగి యుచితంబుగఁ బల్కి పురంబుఁ బాసి పొ
మ్మని మును చెప్పు కోఱడము లాడిన మద్భుజశక్తి యంబుజా
సనవరశక్తి మూలబలశక్తి యెఱుంగఁగఁ జాటి చెప్పి ర
మ్మని చతురాభిభాషణుఁ బ్రహస్తునిఁ బుచ్చె సురారి లంకకున్.
| 99
|
చ. |
చని యతఁ డాతనిం గని యసంభ్రముఁ డై సమయోచితంబుగా
వినయము సేసి దేవ యక విన్నప మిప్పురి తొల్లి దైత్యవం
శనిజనివాస మానడుమ శార్ఙ్గికతంబునఁ బాసి పోయి రా
దనుజుల దిప్డు నీయనుఁగుఁదమ్ముఁడు గ్రమ్మఱ నిన్ను వేఁడెడున్.
| 100
|
క. |
దశవదనుం డనుజుం డను, యశ మల్పమె నీకుఁ గిన్నరాధిప రక్షో
వశముగ లంక విడిచి యస, దృశబంధుప్రీతి సేయు దృఢముగ ననినన్.
| 101
|
తే. |
పురమునక కాదు నాదగు సిరికిఁ బరిజ, నమున కొరు లెవ్వ రొడయులు నాకు నేడు
గడయు నాకూర్మితమ్ముఁడ కాక దీని, కడుగ నేటికి రమ్మను తడయ కిపుడ.
| 102
|
క. |
అని యతనికి సాదరభో, జనవిధి యొనరించి వస్త్రచామీకరవా
హనభూషణాదివస్తువు, లనేకములు ప్రీతి నొసఁగి యానన మలరన్.
| 103
|
క. |
తగ వీడుకొలిపి ధనదుఁడు, వగ మనమునఁ గూర విశ్రవసుపాలికి శీ
ఘ్రగతిం జని యమ్మునిపద, యుగళంబున కెరఁగి సవినయోక్తిపరుం డై.
| 104
|
చ. |
అమరవిరోధిపంపునఁ బ్రృహస్తుఁడు లంకకు వచ్చి నాకుఁ గా
ర్యముఁ దగఁ జెప్పునట్లు పుర మాతని కిమ్మని యాడె నాడినన్
|
|
|
సముచిత మైనచందమునఁ జక్కనిమాటల బాంధవంబుతో
న మగుడ వానిఁ బుచ్చి మునినాయక మీ కెఱిఁగింప వచ్చితిన్.
| 105
|
తే. |
ఏమిపురుషార్థములుఁ జేయునెడల నెపుడు, మీ యనుజ్ఞయ నాకు సహాయమగుట
నరసి మీదివ్యచిత్తాన నవధరించి, చేయఁగలపని యెయ్యది చెప్పుఁ డనిన.
| 106
|
శా. |
ము న్నీకార్యము వాఁడు న న్నడిగినన్ మో మీక కోపించి మీ
యన్నం బుణ్యచరిత్రు నేన మును లంకాధీశ్వరుం జేసితిం
జన్నే వానిపరాభవంబునకు నుత్సాహంబు సేయంగ నీ
కన్నన్ మోములు గంటువెట్టుకొని రోషాయత్తుఁ డై యత్తఱిన్.
| 107
|
ఉ. |
దిగ్గన లేచి పోయె గణుతింపక వాఁడు విరోధలబ్ధికై
యగ్గలికంబున మనలనందఱఁ జీరికిఁ జేకొనండు స
మ్యగ్గురుభక్తిధర్మరుచిమాన్యవివేకము లెంతదవ్వు నీ
కె గ్గొనరింపకుండఁ బుర మిచ్చి తొలంగుము చాటి చెప్పితిన్.
| 108
|
సీ. |
ఇంద్రాయుధద్యుతు లెసఁగఁ జూడ్కికి రమణీయంబు లైనమణిస్థలములు
సిద్ధగంధర్వాదిసేవ్యంబు లైనయచ్ఛోదకంబులఁ జెలువొందునదులుఁ
బల్లవపుష్పసంపద లుల్లసిల్లంగ రమ్యంబు లైనయారామములును
నంబుజమధుమత్తహంసికావితతుల రుచికంబు లయినసరోవరములుఁ
|
|
ఆ. |
గలిగి యొప్పు మిగులఁ గైలాసశైలత, టంబునందుఁ బురవరంబుఁ జేసి
కొని వసింపు మచట ననుచరసహిత మై, దివ్యభోగలీల తేజరిల్ల.
| 109
|
క. |
అని విశ్రవసుఁడు చెప్పిన, విని వైశ్రవణుండు లంక విడిచి పరిజనం
బును దాను రజతగిరికిం, జని యొకపుర మలక యనఁగ సంపాదించెన్.
| 110
|
రావణుఁడు లంకం బ్రవేశించుట
తే. |
అంత నక్కడ మగుడఁ బ్రహస్తుఁ డరుగు
దెంచి వి త్తేశుఁ గాంచినతెఱఁగు నచటఁ
దాను బల్కినక్రమమును దాని కాతఁ
డన్నచందంబుఁ జెప్పె దశాననునకు.
| 111
|
క. |
విని యయ్యవిచారంబులు, దన కేటికి వెడలుఁ గాక దాడిమెయిం బో
యిన గాసిఁగాఁడె యింతక, చనుఁ జూ వెఱచునఁట నిలువ సందియ మేలా.
| 112
|
మ. |
అని బాహాబలగర్వనిర్వహణవిద్యాపారగుం డైనయా
దనుజాధీశుఁడు వైర మెత్తి బలముం దానున్ వెసం బోయి పో
యి నిజావాసముఁ బాసి విత్తపతి పోయెం బోయె నా వించుఁ బే
ర్చినయౌద్ధత్యము నిత్య మైన విజయశ్రీవిభ్రమోద్భాసి యై.
| 113
|
ఉ. |
లంకకు నేగి రాజ్యసుఖలంపటుఁ డై యభిషేకమంగళా
లంకృతమూర్తిఁ జేకొని చలంబు బలంబును నుల్లసిల్ల ని
|
|
|
శ్శంకత రాక్షసాన్వయభుజావిభవం బలర జగద్భయం
బంకురితంబు చేసెఁ దొలకాడెడు వీరరసంబుపెంపునన్.
| 114
|
తే. |
ఇట్లు లంకాపురము వేడ్క నేలె సకల
దనుజలోకంబు సేవింప ననుజసహిత
ముజ్జ్వలశ్రీసమేతుఁ డై యుల్లసిల్లు
చుండి యాదశకంధరుఁ డొక్కనాఁడు.
| 115
|
శూర్పణఖకుఁ బెండ్లి సేయుట
క. |
దర్పోన్ముఖయౌవనకం, దర్పాస్త్రసముజ్జ్వలాంగిఁ దనచెలియలి నా
శూర్పణఖఁ జూచి యోగ్యవ, రార్పణసమయ మని తలఁచి యనుజన్ములతోన్.
| 116
|
ఆ. |
కాలకేయవంశకరుఁడు విద్యుజ్జిహ్వు, డతులబలుఁడు సుందరాంగుఁ డతని
కిత్త మెల్లభంగి నిత్తన్వి నని తగ, నాడి కార్యనిశ్చయంబు సేసి.
| 117
|
క. |
దనుజపతి యున్ననగరం, బునకుం దగువారి నపుడ పుచ్చి యతని రాఁ
బనిచి సబహుమానంబుగ, నొనరించెం బరిణయము మహోత్సవలీలన్.
| 118
|
ఆశ్వాసాంతము
చ. |
నిరుపమమూర్తి వైరిరథినీసమవర్తి వివేకవైభవ
స్ఫురితవిచారుఁ డుజ్జ్వలయశోమణిహారుఁడు ధర్మసంగ్రహా
దరపరతంత్రుఁ డార్యజనతామతమంత్రుఁడు వంశవారిజా
కరనవసూర్యుఁ డస్ఖలితగౌరవవర్తనధుర్యుఁ డిమ్మహిన్.
| 119
|
క. |
కవిలోకవనవసంతుఁడు, యువతీనూతనజయంతుఁ డుదయానంతుం
డు వినయధనవంతుఁడు దానవినోదైకాంతుఁ డమలినస్వాంతుఁ డిలన్.
| 120
|
మాలిని. |
అమరశిఖరిహేలాహారిధైర్యుం డవార్యా
క్రమభుజబలదృప్తారాతిసంహారుఁ డంహ
శ్శమనవినుతిపాత్రోచారగణ్యుండు పుణ్యో
ద్యమవిరచితలోకాత్యంతహృత్పర్వుఁ డుర్విన్.
| 121
|
గద్యము. |
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందుఁ దృతీయాశ్వాసము.
|
|