నిర్వచనోత్తరరామాయణము/చతుర్థాశ్వాసము

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

చతుర్థాశ్వాసము



రమణీయుఁ డుపాసక
నారాయణుఁ డాదిధరణినాయకసామ్యో
దారచరిత్రుఁడు కులని
స్తారకసంభవుఁడు మనుమజనపతి యెలమిన్.

1

రావణకుంభకర్ణవిభీషణులు పెండ్లాడుట

క.

ఆదశకంధరుఁ డఖలవి, నోదంబులఁ దగిలి నిత్యనూత్నవిహారా
మోదితుఁ డగుచుండి మృగ, వ్యాదరమున నేగి కాననాంతరభూమిన్.

2


క.

ఒక మార్గంబున రా మయుఁ, డొకకన్నెయుఁ దాను నచట నొయ్యన చనుదే
నకుటిలశాంతోదాత్త, ప్రకృతి యగుట చూచి యెఱిఁగి రాక్షసపతియున్.

3


ఉ.

గౌరవశాంతమూర్తిఁ దగ గైకొని మార్గముక్రేవ నిల్చి య
చ్చేరువఁ బోవ నద్దనుజుఁ జేరఁగఁ బోయి మహాత్మ యిట్లు కex
తారములోనఁ బోకకుఁ గతంబును నీలలితాంగిపేరు నీ
పేరును దీనిజన్మమును బ్రీతిఁ దగంగ నెఱుంగఁ జెప్పవే.

4


చ.

అనవుడు నాతఁ డిట్లను మహాపురుషా! మయనామధేయుఁడన్
దనుజుఁడ హేమ నాఁ బరఁగుదానిఁ బయోరుహవక్త్ర నప్సరో
వనిత నమర్త్యు లిచ్చిన వివాహవిభూతి వహించి నెమ్మి మైఁ
దనయుల నిద్దఱం గని పదంపడి కాంచితి నీతలోదరిన్.

5


తే.

అగ్రతనయుండు మాయావి యనఁగ వాని
యనుఁగుఁదమ్ముఁడు దుందుభి యనఁగఁ బరఁగు
దీనిపేరు మందోదరి దేవ యిమ్మృ
గాయతాక్షికిఁ దగువరు నరయఁ దలఁచి.

6


మ.

జగతిం గ్రుమ్మరువాఁడ నై కడఁగి యీచంద్రాస్యఁ దోకొంచు నే
ను గరం బుత్సుకవృత్తిఁ బోక యిది హృన్మోదంబు సంధిల్లె నీ
దగుసల్లాపరసంబుపెంపునఁ బ్రియం బంతంతకుం బేర్చున
ట్లుగ నీయన్వయనామధేయములు విందుం జెప్పు నా కేర్పడన్.

7

క.

నావుడు ముద మంది యితం, డీవారిజనయన నాకు నీ నెదఁ గోరెం
గావలయు నని తలంచి మహావినయపరుండువోలె నతఁ డి ట్లనియెన్.

8


క.

నాకుం బ్రపితామహుఁ డా, లోకపితామహుఁడు తండ్రులుం బౌలస్త్యుల్
మీకె ననఁ బూన నేర గు, ణాకల్పావేదములు చికరాభ్యస్తంబుల్.

9


ఉ.

పేరు దశాననుండు కృపపెంపున నాదుతపంబు సొెపునన్
వారిజసంభవుం డొసఁగె వావిరి యైనవరంబు లిప్పు డిం
పారెడులంక నాకు నెలవై మహనీయవిభూతి నుండుదున్
దారపరిగ్రహంబు నకృతం బిటముందట నన్నఁ బ్రీతుఁ డై.

10


తే.

క్రూరుఁ డగుట యెఱుంగక కోరి యిచ్చెఁ, గన్య నప్పుడ మయుఁ డుదకప్రదాన
సహితముగ వీటి కరిగి యుత్సవముతో వి, వాహమయ్యె నద్దానవవల్లభుండు.

11


క.

తనసుతు లని యమ్మయు చె, ప్పిన మాయావియును దుందుభియు సమరముఖం
బున వాలిచేత నీల్గుట, లినతనయుఁడు సెప్పె రఘుకులేశ్వర నీకున్.

12


క.

ఒకయోధముఖ్యు నని నం, తకు నైనను గీటడంచుదాని నమోఘ
ప్రకృతి యగుశక్తి నిచ్చెను, విరసిల్లుచు మయుఁడు దనుజవీరాగ్రణికిన్.

13


క.

కోరి వివాహం బయ్యెను, గారవ మెసఁగంగఁ గుంభకర్ణుడు దళదం
భోరుహలోచన యగున, వ్వైరోచనికూఁతుకూఁతు వజ్రజ్వాలన్.

14


ఆ.

సరమ యనులతాంగి శైలూషతనయఁ గ, పోలచంద్రబింబఁ బులినజఘన
హరిణశాబనయనఁ బరమోత్సవంబునఁ, బెండ్లి యయ్యె నవ్విభీషణుండు.

15

మేఘనాదుని జననము

క.

పదపడి మందోదరి స, మ్మదమున సుతుఁ గాంచె నాకుమారకు నెలుఁగున్
మదదిగ్దంతావళములు, బెదరఁ జెలఁగె మేఘనాద భీకరభంగిన్.

16


క.

దనుజేంద్రుండును జిత్తం, బున నెంతయు సంతసిల్లి పుత్రకునిఁ గనుం
గొని మేఘనాదుఁ డనఁగా, ననురూపం బయిననామ మప్పుడు వెట్టెన్.

17


తే.

పిదప నింద్రజి యనుపేరుఁ బెంపుఁ బడసె, నద్దశానననందనుఁ డభిమతముగ
దానిఁ బదపడి చెప్పెద మానవేంద్ర, వినుము తరువాతికథలు సవిస్తరముగ.

18


ఉ.

ఆసమయంబునన్ సరసిజాసనుపెట్టినచొక్కు కుంభక
ర్ణాసురుమోమునం గదిరె నాతఁడు నగ్రజు వేఁడె గాఢని
ద్రాసుఖయోగ్యమందిరము రాక్షసవంశవరుండు నిచ్చెఁ గై
లాసమువోలెఁ బ్రాంశుధవళం బగునూత్ననికేతరత్నమున్.

19


క.

అందు నివాసస్థానము, నం దల్ప మనల్పముగ నొనర్చిన నిద్రం
బొంది బహువత్సరంబులు, నిందితదురితాబ్ధిలో మునిఁగి యుండంగన్.

20

రావణుఁడు దేవతలు మొదలగువారిని బాధించుట

శా.

దేవోద్యానము లీల మై నఱకు బాధించు న్మునిశ్రేణి నా
నావిప్రావలిఁ బట్టి తెచ్చి తిను బన్నంబుల్ సురస్త్రీలకుం
గావించుం గ్రతువైభవంబులకు విఘ్నం బాచరించుం దశ
గ్రీవుం డప్రతిమప్రతాపపరుషక్రీడాకలాకల్పుఁ డై.

21


సీ.

మదమున నలిరేఁగి నదులు సొచ్చి కలంచి యాడు నుద్ధత గంధహస్తిలీల
బలమునఁ జెలఁగి కానల రేగి రూపఱ విఱచు మహావాతవిభ్రమమున
బెడిదంపుఁదనమునఁ గడఁగి శైలమ్ములు పొడిపొడి సేయు దంభోళిభంగి
నొడలిపెంపున వీచి జడనిధు లిక్కడక్కడ వైచు మంథనగంబుకరణి


తే.

గరుడగంధర్వయక్షకిన్నరులఁ గన్న, జెవులు పట్టి యాడించు నశేషలోక
భీకరము లగువిధములు పెక్కు సేయు, గర్వ మెదుగంగ నాదశకంధరుండు.

22

కుబేరుఁడు దూతను బంపి రావణునకు బుద్ది చెప్పించుట

క.

అత్తఱి నత్తెఱఁ గెల్లను, విత్తేశుఁడు గలయఁ గనియు వినియుం గరుణా
యత్తమతి యగుట దూతం, బుత్తెంచె దశాననునకు బుద్ధులు సెప్పన్.

23


క.

చనుదెంచి దూత ముందఱ, గనియె విభీషణు నతండుఁ గడువేడుక న
ద్ధనపతిసేమ మడిగి పరి, జనముల వేర్వేఱ యడిగి సంభావించెన్.

24


ఉ.

వచ్చినకార్య మారసి యవక్రచరిత్రుఁడు దానవేశ్వరుం
జెచ్చెరఁ గానిపించి నెడసేయక దూత వినీతవేషుఁ డై
చొచ్చి ధరాతలం బురము సోఁకఁగ నానతుఁ డై యుపాయనం
బిచ్చి కరప్రదర్శిత మహిం దగ సంకుచితోపవిష్టుఁ డై.

25


శా.

దేవా దేవరతోడఁబుట్టువు కృతార్థీభూతచేతస్కుఁ డై
నీవిఖ్యాతికి సంతసిల్లు సహజస్నేహుండు నీయందు నీ
శ్రీ వెంపారుటఁ గోరు నీమహిమఁ బ్రార్థించు న్మదిం గావునన్
దేవేంద్రాదులచంద మొప్ప దని యుద్దేశించి నీయొద్దకున్.

26


తే.

నన్నుఁ బుత్తెంచెఁ దనవచనములు గాఁగఁ, జెప్పుమని కొన్ని బుద్ధులు సెప్పి వాని
నవధరింపు మొకించుక యవసరంబు, నాకు దయసేసి కార్యవివేకచతుర.

27


చ.

జగములకుం బ్రతాపము ప్రశస్తముగాఁ బ్రకటించుమాత్రకుం
దగ వగు నిప్డు సేసినవిధం బిటమీఁద నిజాన్వయోచితం
బుగ నొనరింపు ధర్మము దపోవిభవంబునఁ గాదె యింతపెం
పు గనుట లంకకై మనకుఁ బుట్టినముందటిహాని సాలదే.

28


చ.

మునిజన మెల్ల దుర్దశల ముచ్చిరి యుండుటఁ జూచి యప్సరో
వనితలయార్తిఁ జూచి క్రతువర్గము దైన్యముఁ జూచి నామనం

బనయముఁ దల్లడిల్లెడు దశానన దుష్టచరిత్ర మింక నై
నను నిది మాని సత్పథమునం జను దూఱు లడంగు నంతతోన్.

29


తే.

ఇంతకాలంబు నేఁ బోయి హిమనగమున, శాంకరం బగుధర్మంబు సలుపు చునికి
నెఱుఁగనైతి మగుడివచ్చి యెల్ల నెఱిఁగి, యెఱుఁగఁజెప్పితి హితము నా యెఱిఁగినంత.

30


క.

ఇది నా కానతి యిచ్చిన, పదకము గలరూపు విన్నపము సేసితి నీ
హృదయంబునఁ గైకొను మొం, డుదలంపులు దక్కు మనవుడుం గుపితుం డై.

31


క.

ఆతఁడు నీకుం దగు నీ, వాతనికిం దగుదు మీర లక్కట దొరయుం
దూతయు నఁట వచ్చుట యుభ, యాతురతం గఱపి పోవ నఁట యిది పోలున్.

32


ఉ.

బుద్ధులు సెప్పు టెల్ల నటు వోవఁగనిమ్ము ధనాధిపుం దప
స్సిద్ధికిఁ బోయి వచ్చె నని చెప్పితి వత్తెఱఁ గెట్టి దంతయున్
శుద్దిగఁ జెప్పు మన్న సురసూదనుపల్కులు చూడ ని ట్లసం
బద్ధము లైనదూత యెడబాసియు దిట్టఁడు గాన నిట్లనన్.

33


ఉ.

అర్థవిభుండు వోయి తుహినాద్రిఁ దపం బొనరింపఁగా విహా
రార్థము వచ్చినన్ గిరిసుతాన్వితు నీశ్వరుఁ గాంచియున్ వర
ప్రార్థన సేయఁ డయ్యె నతఁ డాతఁడు దానికి మెచ్చి యిచ్చె స
ర్వార్థవిధాయకం బయిన యాత్మసఖత్వము నిశ్చలంబుగన్.

34


తే.

వామపార్శ్వాభిగతు లగువారితేజ, మడరి యద్దెస లోచన మతని కపుడు
పింగళం బైనవా రేకపింగళుండ, వనఁగఁ బరఁగుము జగముల ననిరి ధనదు.

35


ఉ.

అత్తెఱఁ గెల్ల నిట్టిద మహాత్మ శుభంబు సధర్మవృత్తి కా
యత్తము సూవె యిమ్మెయి నహంకృతి సత్త్వముగాఁ దలంతురే
యుత్తము లక్కటా చెడుట కోపక చుట్టము బుద్ధి చెప్పినం
జిత్తమునందు నీసరకు సేయమి గర్వము గాక కర్జమే.

36


తే.

అనిన నిరువదికన్నుల నడరుకెంపు, పద్మవనగతబాలాతపంబుఁ బోల
భ్రుకుటివికటలలాటవిస్ఫూర్జదుగ్ర, కోపభీకరుఁ డగుచు రక్షోవిభుండు.

37


క.

ఏమేమి ననుఁ జెడు దని, నాముందటఁ గొంకులేక నాలుకతుద కీ
వీమాట దెచ్చి తజువర, మేమిగఁ దలఁచితొకొ నీకు నిది విధి యనుచున్.

38


క.

కేసరము లదరుహరిక్రియ, మీస లదర లేచి దూతమెడ దునియఁగ సిం
హాసనము కెలన నున్న మ, హాసి వెఱికి వ్రేసెఁ దమ్ముఁ డడ్డము సొరఁగన్.

39


ఆ.

ఆవులించుతలయు నడరెడునట్టయుఁ, జూచి ప్రీతుఁ డగుచు సురవిరోధి
యచటిడింభతతికి నాఁకలిమడుపుగా, నిచ్చి యాగ్రహమున నిట్టు లనియె.

40


శా.

రక్షోవంశహితోపదేశ మనుపేరన్ వీనిఁ బుత్తెంచె నా
యక్షాధీశ్వరుఁ డీశుతోఁ దనకు సఖ్యం బైనతేజంబు రా

జ్యక్షోభంబుగ లంకఁ గొన్న మనయన్యాయంబు సెప్పన్ సురా
దిక్షుద్రవ్యవసాయహేతు వగుభీతిం జూపి జంకింపఁగన్.

41


ఉ.

నిక్కము నట్ల కాన తగు నీతిపరు ల్సుర లుక్కివంబునన్
మిక్కిలి యైనవారి నియమింపక తక్కుదురే ధనేశ్వరుం
డక్కట లెస్స సేసె నడియాస సెడన్ దిగధీశుఁ డొక్కఁడుం
ద్రిక్కక యుండఁ ద్రు ళ్లడఁపఁ ద్రిమ్మరఁ బోవలసెం గ్రమంబునన్.

42

రావణుఁడు కుబేరునిపై దండెత్తి పోవుట

ఉ.

కావున మున్నుమున్న యలకాపుర మేర్చి ధనేశు నోర్చి య
క్షావలిపే రడంత మని యప్పుడ యుద్ధవిడిన్ సమగ్రనా
నావిధసైన్యభూరిభరనమ్రవసుంధరుఁ డై పురీసరి
ద్గ్ర్రావమహాటవు ల్గడచి రాజతశైలముఁ జేరఁ బోయినన్.

43


తే.

యక్షు లంతంతఁ జూచి ధనాధిపునకు, రాక్షసేశ్వరుసైన్యంబు రాక చెప్ప
నతఁడు గ్రక్కున సేన లాయితము చేసి, బరవసంబున దలపడఁ బంచుటయును.

44


క.

ధనదుబలము దనుజబలము, ననువునఁ దలపడఁ గడంగి యార్చుచుఁ దాఁకెన్
ఘనఘోషభీషణము లగు, వననిధు లొండొంటితోడ వడిఁ దాఁకుగతిన్.

45

యక్షరాక్షసులయుద్ధము

శా.

జ్యానాదంబు నిశాతహేతిపటలీసంఘట్టరావంబు ఘం
టానిక్వాణసమేతబృంహితము గాఢస్ఫారహేషాసము
త్థానోపేతఖురాహతధ్వనియు సాంద్రం బైనభేరీపటు
ధ్వానం బేర్పడ దయ్యె నయ్యెడ బలద్వంద్వంబునం దేమియున్.

46


ఉ.

అందును నిందుఁ జేయఁగల యట్టిభటుల్ దలపడ్డ సైన్యముల్
గ్రందుగ నొక్కపెట్ట తమకంబునఁ బోరుట చూచి కైకసీ
నందనుఁ డిమ్మెయిన్ సరి పెనంగుట సైఁపక వచ్చి వీఁకఁ దాఁ
కెం దనమోములన్ వఱలఁ గీల లుదగ్రత వజ్రదంష్ట్ర లై.

47


క.

ఏటున వాటున వ్రేటునఁ, బోటున దశముఖుఁడు రౌద్రముగ నఱుముటయున్
లేటమొగము పడి యక్షులు, కోట సొరంబాఱి రసురకోటి యెగవఁగన్.

48


క.

తోలుకొనిపోయి దనుజులు, కైలాసకటంబుబయలు గైకొనఁ జన నా
భీలశరనిహతి వారలు, గూలఁగ సంయోధకంటకుఁడు వడిఁ దాఁకెన్.

49


ఉ.

ఏచిన దైత్యసైన్యముల నెల్లను ద్రుళ్లడఁగించి యిట్లు శౌ
ర్యోచితలీలఁ గ్రాలి సమరోద్ధతి మైఁ దమసేనఁ జూచి చే
వీచుచు వచ్చుయక్షుఁ గని వీతభయుండు దశాస్యుమంత్రి మా
రీచుఁ డుదగ్రుఁ డై గిరి గిరిం దగ మార్కొనుమాడ్కిఁ దాఁకినన్.

50

క.

ఇరువురశరజాలము లొం, డొరువులతురగములు సూతు లురుకేతనముల్
గరువలిక్రియఁ బడఁ గూల్చుచు, నెరగలిచిచ్చుగతిఁ గప్పె నిరువాఁగుపయిన్.

51


ఉ.

యక్షుఁడు దానవుం గదిసి యార్చి దగం గద బిట్టు వేసినన్
రాక్షసుఁ డీడఁబోక భిదురప్రతిమానమహాసి వ్రేసె ధూ
మ్రాక్షుఁడు నంతఁ గూడుకొని యాసురవృత్తిఁ దగంగఁ జేసె ను
గ్రక్షురికాక్షతిం బ్రతిముఖంబున రక్తనదీప్రవాహముల్.

52


ఉ.

దానవవీరు లిట్లు ధనదప్రియభృత్యునిఁ గిట్టి నొంచినన్
మానము డిగ్గఁ ద్రావి గరిమంబు దలంప కతండు వాఱినన్
సేనలు పెల్లగిల్లి పఱచెన్ దశకంఠుఁడు కోట డగ్గఱం
గా నడచెన్ మణిస్ఫురితకాంచనతోరణకాంతిఁ జూచుచున్.

53


ఉ.

అట్టియెడన్ సురారిభటావళి వాకిట లగ్గ సేసినం
గట్టుపకాసి దీర్ఘదృఢకాయుఁడు తత్ప్రతిహారపాలకుం
డొట్టినమంటవోలెఁ గడునుగ్రతఁ బేర్చిన సూర్యభానుఁ డ
ప్పట్టునఁ దాఁకి దానవులు పాఱుటయుం గదిసెన్ దశాననున్.

54


ఆ.

వీఁకఁ గొండతోడఁ దాకెడుతగరును, బోలె గగనచరులు భుజబలంబు
వొగడఁ బరిఘ ద్రిప్పి యెగసి దశానను, వెడఁదయురము పెలుచ నడిచి యార్చె.

55


క.

ఆసూర్యభానుఁ డీక్రియ, వ్రేసినయప్పరిఘ దనుజవిభుఁ డధికబలో
ల్లాసమునఁ బుచ్చుకొని పొడి, సేసె నసురు లార్వ నతనిశిర మొకవ్రేతన్.

56


క.

సుగ్గయినయతనిఁ గనుఁగొని, బెగ్గలమున నచటిభటులు పికపిక లైనన్
డగ్గఱి పిశితాశను లొక, మొగ్గర మై కోట సొర సముద్ధతు లయినన్.

57


మ.

సమరక్రీడకు వచ్చె వైశ్రవణుఁ డుత్సాహోగ్ర మై మాణిభ
ద్రముఖం బైనబలంబు మున్ వెడలఁ దూర్యశ్రేణి గర్జిల్ల దు
ర్దమదోఃకాండవిమర్దితోద్ధతగదాదండోద్భటుం డై పరా
క్రమలీలం బటువందివాగ్విభవసంరంభంబు రంజిల్లఁగాన్.

58


క.

ప్రకటబలు లమ్మహోదర, శుకసారణు లాదిగా నసురవీరులునున్
భ్రుకుటిముఖు లగుచు యక్షు, ప్రకరముఁ దలపడిరి తూర్యరవములు సెలఁగన్.

59


ఆ.

దొరలు వెన్ను దన్ని పురికొల్పి యిరువురుఁ జేరి చూచుచుండఁ జెలఁగి యుభయ
బలముఁ బోటులాడెఁ జలమున నొక్కింత, యోలనూసగొనక యోలి నార్చి.

60


సీ.

కీలాలజలముపైఁ దేలుచు నవ్విన ట్లున్నశిరంబు లొక్కొక్కచోట
నంగుళీయకరుచు లడరంగ నెఱిఁ, బాసియున్నహస్తంబు లొక్కొక్కచోట
గుత్తులకొలఁదికిఁ గృత్తంబులై పడి యున్నపాదంబు లొక్కొక్కచోట
నవయవభేదంబు లమరక తునియ లై, యున్నగాత్రంబు లొక్కొక్కచోటఁ

తే.

గమలషండంబు నాగలోకంబుఁ దలిరుఁ, బాన్పుఁ గల్పాంతమున జముబానసంబు
నింటిలోపలఁబోలె నొ ప్పెసఁగెఁజూడ, నపుడు యక్షనిశాటయుద్ధాంగణమున.

61


ఉ.

అయ్యెడ మాణిభద్రుఁడుఁ బ్రహస్తుఁడు నొండొరుఁ దాఁకి వ్రేసియున్
వ్రయ్యఁగ మోదియుం జదియవైచియు నొచ్చి చనంగ నిమ్మెయిన్
డయ్యఁగఁ బోరి రంత వికటప్రముఖాసురు లంటఁ దాఁకినం
గయ్యము దక్కి యక్షుఁ డధికం బగునొవ్వునఁ బెల్లగిల్లినన్.

62


ఆ.

బలము పాయ యిచ్చి తొలఁగిన నలుకక, బరవసమున నర్థపతి గడంగి
రథముఁ బఱపఁ బనిచె రాక్షసభటకోటి, యఱుమలేక పాఱి తెఱపి యిచ్చె.

63

కుబేరుఁడు రావణుని దూరనాడుట

క.

ధనదుఁడు గట్టెదురం ద, మ్మునిఁ గనుగొని సూతుఁ దురగముల నిలుపంగాఁ
బనిచి పులస్త్యతనయనం, దనుఁ డగుటకు సముచితముగఁ దా నిట్లనియెన్.

64


ఉ.

ఏను హితంబు సెప్ప నిటు లేచి దురాచరణంబు లిమ్మెయిన్
మానవు రోగి చేఁ దయినక మం దఱువుం దెవు లంటఁ దాఁకినం
గాని యెఱుంగఁ డప్టు ప్రతికారము గల్గునె యట్లపోలె నీ
దైననికృష్టవృత్తిఫల మంది తలంచెదు గాక పిమ్మటన్.

65


ఉ.

కార్యము లెందుఁ దార యవుఁ త గా దన నోపుదురే సహాయులై
యార్యులు ద్రోచి చెప్ప నుభయప్రతిపన్నము లైనఁ గాక యీ
శౌర్యము వట్టి దుర్ణయవిచారమునన్ వినయంబు దక్కు ట
స్థైర్యముఁ దేక యున్నె తుది దాఁకునె లోకవిరుద్ధవృత్తముల్.

66


తే.

మేలు రెండులోకంబుల మేల తెచ్చు, కీడు సేసినఁ దప్పదు కీడ యగుట
దీని నాబాలగోపాలమైనజనము, సకలమును మది నెఱుఁగు నీ వొకఁడుదక్క.

67


చ.

ఒకరునిమాటఁ బోక కడునుగ్రత నీవు సధర్ము లైనవా
రి కలుగుచున్ సముధ్ధతిఁ జరింపఁగఁ జూచుట దేవతాగణం
బకట మనంబులోన ముదమందుఁ జుమీ వెడమాట లింక నే
టికి రణకౌశలంబుఁ బ్రకటింపుము వచ్చితి సారెసారెకున్.

68

కుబేరుఁడు రావణునితో యుద్ధము చేసి యోడిపోవుట

క.

అనిన మఱుమాట పలుకక, దనుజేంద్రుఁడు ధనదు నస్త్రతతిఁ గప్పె నతం
డును బాణవృష్టి గురిసి య, శనిక్రియ నుగ్ర మగుననలశర మేసె వడిన్.

69


ఆ.

అదరు లెగయ వచ్చునాగ్నేయబాణంబు, రాక కంబుపతిశరంబుఁ దొడిగి
లాఘవమున నిజబలం బార్వ దశముఖుఁ, డనతిదూరమునన యాఱనేసి.

70


శా.

శ్రావ్యం బై చెలఁగన్ గభీరమధురజ్యానాద ముద్దామవీ
రవ్యాపారనిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్

సవ్యప్రౌఢి దృధాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచుకోన్
దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సాదృశ్యం బదృశ్యంబుగన్.

71


ఆ.

ఏటు లాడి యాడి యేడ్తెఱఁ గలిసి గ, దాప్రవీణబాహుదండుఁ డయిన
ధనవిభుండు వ్రేసె దశముఖుశిరము లం, దంద యక్షు లార్వనచల మద్రువ.

72


క.

సురవైరి గినిసి యొక్కట, నిరువదిగద లెత్తుకొని ధనేశ్వరు నురమున్
శిరమును బరులుం గరములుఁ, జరణంబులు జరియ మోఁదె సరభసవృత్తిన్.

73


చ.

కలయఁగ మేన శోణితము గ్రమ్మఁగ లా వఱి యొల్లఁబోయి కెం
దలిరుల నొప్పుచూతము మొదల్ నఱకన్ ధర వ్రాలునట్లు వి
హ్వలుఁ డయి తేరిపై నొఱగు వైశ్రవణుం గని సూతుఁ డెంతయుం
దలరి రథంబు దోలుకొని దవ్వుల కెక్కడి కేనిఁ బోయినన్.

74


క.

పెల్లుగ నార్చుచు విజయస, ముల్లాసముతోడఁ బంక్తిముఖుబల మెగవం
జెల్లాచెద రై యక్షులు, పెల్లగిలం బఱచి రద్రి బి ట్టులియంగన్.

75


సీ.

కాలుకొన్నంతయుఁ గడువేగమునఁ బాఱి కనుకని దెసలందుఁ గాడుపడియుఁ
బాఱఁజాలక ముట్టఁబడి జాడ దప్పంగఁ దొలఁగి పెన్గొందులఁ దూఱఁబడియుఁ
దలలుఁ జీరలును గంపలు పట్టికొని గాసి గా మ్రగ్గుటడవులఁ గాటువడియుఁ
గాళులఁ జేతులఁ గా నెట్టకేలకుఁ జఱు లెక్కి లోయలఁ జాఁగఁబడియు


ఆ.

బయలి మొదలు గోట వట్టిన పెల్లున, వీటిప్రజయు నొక్కమాట యురలఁ
దెరలి యిద్ద ఱొక్కతెరువునఁ బోవక, యాకులితను గాందిశీకు లయిరి.

76

రావణుఁడు కుబేరు నోడించి పుష్పకవిమానము గొనుట

తే.

అసురపతి గెల్పు గైకొని యలకఁ జొచ్చి, యొండు సేయంగ నొల్లక యుచితపరుఁడ
పోలెఁ దనప్జర వారించి లీలఁ గామ, గమనరమణీయ మగుపుష్పకంబు గొనుచు.

77


క.

చనియె నట ధనదుసూతుఁ డ,తని నొకపద్మాకరంబుగతటముననుం బె
ట్టిన నచటఁ బొలయునల్లని, తను గాలిం దేఱి లజ్జితస్వాంతుం డై.

78


ఆ.

అంత నంత విరళ మగుపరివారంబు, గూడి చిన్నవోయి కొలిచి రాగ
వాడి యున్నమోము వాంచినభంగిన, యలకు కేగుదెంచె యక్షవిభుఁడు.

79


ఉ.

అక్కడ దానవేంద్రుఁడు జయంబునఁ గ్రొవ్వెలరారఁ బుష్పకం
బెక్కి గిరీంద్రవైభవనిరీక్షణకౌతుకలగ్నచిత్తుఁ డై
యిక్కడ నక్కడం గలయ నిచ్చ మెయిం జరియించుచుండఁగా
నొక్కెడ నెద్దెసం గదలకుండె విమానము విస్మయంబుగన్.

80


చ.

అమరవిరోధి దాని కెద నచ్చెరు వంది యమాత్యభృత్యవ
ర్గములును దానుఁ గూడి వడిఁ గామగ మై చనునట్టి దివ్విమా
న మిచట నిట్లు దీనిగమనం బెడలం గత మేమి యక్షస
త్తముఁ డొకరుండు దక్క నొరుఁ దాల్పదొకో హృదయానువర్తి యై.

81

నందికేశ్వరుఁడు రావణుని శపించుట

చ.

అనుసమయంబునం ద్రినయనానుచరుం డగునంది వారలం
గని యనియెం దొలంగుఁ డెడగా నిది యీశనివాసదేశ మిం
దనిమిషయక్షకింపురుషు లాదిగ నెవ్వరు రా రనంగ న
ద్దనుజవిభుండు వెండియు నుదగ్రతఁ బోవక యున్న నల్కతోన్.

82


క.

ఈతఱి నీశ్వరుఁ డిత్తరు, పోతంబులకెలన శైలపుత్త్రియుఁ దానుం
బ్రీతిఁ గుసుమాపచయకే, లీతత్పరుఁ డైనవాఁడు లీలానుగతిన్.

83


క.

అడిబీర ముడిగి రాక్షస, చెడక మరలి పొమ్ము నీకుఁ జేయలఁతియె యీ
యెడ యింక నీవు నిలిచినఁ, బడ నడుతురు గన్న నిన్నుఁ బ్రమథగణంబుల్.

84


తే.

అనినఁ గోపించి యీశ్వరుఁ డనఁగ నెవ్వఁ, డతని కిచ్చోటు దక్కినకతముఁ జెప్పు
మనుచు వానరవదనంబునట్టు లున్న, నందిమొగ మప్డు దేరకొనంగఁ జూచి.

85


క.

కడుఁ బెల్చ నవ్వి యగు నీ, పడువునఁ జెలువంబు గలుగు వారలచేతం
జెడఁడే యీతఁడు నుడువక యుడుగు మనుచుఁ బంక్తివదనుఁ డుల్లస మాడెన్.

86


చ.

తెగడినఁ గెంపుసొం పడరుదృష్టులు గాడఁగఁ జూచి నంది యి
ట్లగు నిది నిక్క మివ్విధమునాననముల్ గలవార యేపున
న్మిగిలినరాక్షసాన్వయము నిన్నుఁ బురంబును సాగరంబు గా
సిగ మసి గాఁగఁ జిక్కు వడఁ జేడ్పడఁ జేయుట యెట్లుఁ దప్పునే.

87


ఆ.

నిన్నుఁ బట్టి యిపుడ నీఱుగఁ దలలు దు, న్మాడ నాకు శక్య మగున యైన
జగముచేతినిందఁ జచ్చినవాఁడవు, మున్న కాన శవము ముట్ట ననిన.

88


మ.

అతిరౌద్రాకృతి దైత్యుఁ డిట్లనియె మీ రాక్రోశముం జేయఁ బ
ర్వత మే నిప్డ చలంబునం బెఱికెదన్ వారింపుఁడా నీవు మీ
యతఁడున్ వచ్చి విమాన మాఁగినఫలం బందంగ నీశాను ని
ర్జితుఁ గావింపక మిమ్ముఁ ద్రుంపక దశగ్రీవుండునుం బోవునే.

89

రావణుఁడు కైలాసమును బెల్లగించి యెత్తుట

ఆ.

అనుచు శైలమూలమున కేగి చేతుల, గ్రుచ్చి యమరఁ బట్టి కూలఁ ద్రోవ
నప్పళించి యెత్తె నల్లాడె నమ్మహా, నగము జీవరాశి బెగడుపడఁగ.

90


క.

తదవసరంబునఁ బ్రమథులు, బెదరిరి గిరిరాజతనయ బి ట్టులికి వెసం
బొదివి పయి వ్రాలి కౌఁగిటఁ, గదియించెను శంభుమేను గరుపారంగన్.

91


అ.

దనుజుచంద మంతఁ దనదుచిత్తంబున, నెఱిఁగి శంకరుండు చిఱుతనగవు
కాంతి మోము చెన్ను వింత గావింపంగ, నుంగుటమున నల్ల నూదుఁటయును.

92

శివుఁడు రావణునిచేతులు కైలాసముక్రింద నడఁగఁద్రొక్కి వాఁడు ప్రార్థింపఁగా ననుగ్రహించుట

చ.

కరములు చాఁపకట్టువడగా గిరి యెప్పటియట్ల క్రుంగినన్
విరవిరఁ ద్రెళ్లి నొవ్వడరి విహ్వలుఁ డై దశకంధరుండు ఘో

రరవము లోకసంభ్రమకరం బగునట్లుగఁ బెల్చఁ గూసె న
చ్చెరువును బెగ్గలంబుఁ గవిసెన్ వెస దైత్యునమాత్యకోటికిన్.

93


క.

వెల్లువ ముట్టినపగిదిం, దల్లడమునఁ గూడఁ బాఱి తనుఁ దనసైన్యం
బెల్లను ముసరఁగ దానవ, వల్లభుఁ డట్లఱచుచుండె వా విడిచి వడిన్.

94


తే.

తా నెఱుంగనియట్టుల తడవు గాఁగ, నిల్చి కరుణించి పదపడి నీలగళుఁడు
నగము ఢీలించి బాహులు దిగిచికొనఁగ, నిచ్చి యానతి యిచ్చె దైత్యేశ్వరునకు.

95


శా.

కేలీకందుక మల్ల నెత్తుకొను మాడ్కిం బట్టి నాయున్న యీ
కైలాసాచల మిట్లు నీవు నెగయంగా నెత్తినం జోద్య మై
నీలా వేఁ గొనియాడు టెల్లరును వర్ణింపంగ నీ కొక్క పే
రేలోకంబునఁ జెల్ల దైత్యులకుఁ బెం పెక్కంగ నే నిచ్చెదన్.

96


క.

ఏ వినఁగ నిపుడు నీదగు, రావంబు త్రిలోకభీకరం బయి చెలఁగెం
గావున విన్న భయం బగు, రావణుఁ డసునామమునఁ బరఁగు త్రిజగములన్.

97


ఉ.

పుష్పక మర్థి నెక్కు మెటఁ బోయెదొ పొ మ్మని వీడుకొల్పె వా
స్తోష్పతి సంతసం బెడల ధూర్జటి నిర్భరహర్షనిర్గళ
ద్భాష్పవిలోచనుం డగుచు దానవనాథుఁడు రత్నమాలికా
నిష్పతదంశుజాలరమణీయవిమానము నెక్కె మ్రొక్కుచున్.

98

ఆశ్వాసాంతము

మ.

బుధసంరక్షణశీలుచేత వినయాంభోరాశిచే శత్రుగ
ర్వధనాదానవిదగ్ధుచేత రమణీప్రద్యుమ్నుచే నన్వయాం
బుధిసంపూర్ణసుధాంశుచేతఁ సుహృదంభోజార్కుచే భారతీ
మధునిష్యందముఖాబ్జుచేతఁ ద్రిజగన్మాన్యస్ఫురత్కీర్తిచేన్.

99


క.

ఖండియరాయనిచే ను, ద్దండద్విషదవనిపతిషదావళహరిచేఁ
ఖండితవిధుచే విభవా, ఖండలుచే నృపనయప్రకారునిచేతన్.

100


మాలిని.

నిరుపమరణకేళీనిర్దళద్వైరిధాత్రీ
వరతనుగళితాసృగ్వారిపూరావగాహా
దరభరపరిఖేలద్యాతుధానాంగనాని
ర్భరమదమధురస్తోత్రప్రసన్నాత్ముచేతన్.

101


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందుఁ జతుర్థాశ్వాసము.


————