నా జీవిత యాత్ర-1/స్వరాజ్య పత్రిక

26

స్వరాజ్య పత్రిక

'స్వరాజ్య' పత్రిక 1921 వ సంవత్సరం అక్టోబరు 29 వ తారీఖుని ప్రారంభించబడింది. మొదటి సంచిక ఆ రోజుననే బయలు దేరింది. నాగపూరు కాంగ్రెసులో సహాయ నిరాకరణోద్యమం అవలంభించి కోర్టులూ, స్కూళ్ళూ, శాసనసభలూ బహిష్కరించ వలసినదనీ, నిర్మాణకార్యక్రమం ఒక్క సంవత్సరం పూర్తిగా దేశంలో అంతటా సాగించి జయప్రదం చేయవలెననీ, తిలక్ స్వరాజ్యనిధి పేరుతో సంవత్సరంలోగా కోటి రూపాయలు వసూలు చెయ్యవలసిందనీ, దేశం అంతటా 20 లక్షల రాట్టాలు ప్రవేశపెట్టి నూలు వడికేటట్టు చెయ్య వలసిందనీ తీర్మానించ బడింది. నిర్మాణకార్యక్రమంలో 1. జాతీయ పాఠశాలలు, 2. ఎక్కడ తగువులు అక్కడనే పంచాయతీ కోర్టులద్వారా పరిష్కారం చెయ్యడం, 3. ప్రభుత్వంమాదిరిగా కాంగ్రెసు నడిపించడం, 4. నియమాల ప్రకారం రాష్ట్రీయ కాంగ్రెస్ కమిటీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు, తాలూకా కాంగ్రెసు కమిటీలు, గ్రామ కాంగ్రెసు కమిటీలు స్థాపన చేసి కాంగ్రెసు ప్రభుత్వం నడిపించడం మొదలయినవి ఉన్నాయి. నాగపూరు కాంగ్రెసు తరవాత 1921 వ సంవత్సరంలో బెజవాడలో అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశమై పైన చెప్పిన నిర్మాణ కార్యక్రమం విషయమై త్రివిధ బహిష్కారాలమీద తీర్మానాలు చేసి, దేశంలోని ప్రజలకి కాంగ్రెసు నిర్ణయించిన ప్రకారం కార్యక్రమం జరపవలసినదని ఆజ్ఞాపించింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. అది వరకు 30 సంవత్సరాలనించి, కాంగ్రెసు మహాసభ పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఇల్లాంటి కాంగ్రెసు నియమావళికింద 1921 వ సంవత్సరం వరకు పనిచెయ్యలేదు.

నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఏర్పరచబడిన పద్ధతిమీద అది వరకు ఎప్పుడూ ఏర్పరచలేదు. ఆంధ్ర రాష్ట్రము, తమిళ రాష్ట్రము, మళయాళ రాష్ట్రము, కన్నడ రాష్ట్రము మొదలయిన భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజనచెయ్యడం కూడా నాగపూరు కాంగ్రెసులోనేజరిగింది.

మద్రాసు నగరము తెలుగు నగరము. ఇది చంద్రగిరిరాజు పరిపాలనలో ఉండేది. ఈ చంద్రగిరిరాజే దీనిని బ్రిటిష్‌వారికి స్వాధీనం చేశాడు. బ్రిటిష్‌వారికి స్వాధీన మైనప్పుడు తెలుగు జిల్లాలలో ఉండే వర్తకులు చాలామంది చెన్న నగరానికి వచ్చి, ఇక్కడనే వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అందుచేత చెన్ననగరం ఆంధ్రనగరం అని చెప్పడానికి ఎల్లాంటి సందేహమూ లేదు. ఆ కారణం చేతనే చెన్న నగరంలో ఏర్పడిన కాంగ్రెసు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేర్చబడింది. 1921 వ సంవత్సరంలో నాగపూరు కాంగ్రెసులో దేశమంతా 21 రాష్ట్రాలకింద విభజన కాక పూర్వం చెన్న నగరం ప్రత్యేకంగా తమిళులది అని కాని, తెలుగువారిది అనికాని, మళయాళపువారిది అని కాని, కన్నడపువారిది అనికాని చెప్పడానికీ, అనుకోవడానికీ కూడా అవకాశం లేకుండా ఉండేది. ఇది ఇంగ్లీషువారి చేతుల్లోకి రాకపూర్వం చెన్ననగరపు చరిత్ర. ఇది ఇల్లాంటిది అని ఎవరూ అనుకోకుండానే అరవలు, తెలుగువారు, మళయాళపువారు, గుజరాతీలు అందరూ కూడా ఇక్కడ ప్రవేశించి వర్తకం చేస్తూ ఉద్యోగాలు సంపాదించుకుని, ఇంకా ఇతరమైన వృత్తులుకూడా చేసుకుంటూ ఉండేవారు. మద్రాసులో హైకోర్టు ఉండడంవల్ల లాయర్లు అన్ని భాషా రాష్ట్రాలనించీ ఇక్కడికి వచ్చి, ప్రాక్టీసు చేసుకుంటూ ఉండేవారు, నా చిన్నతనంలోనే మద్రాసు లా కాలేజీలో చదవడమూ, ప్లీడరీ పరీక్ష పాసుకావడమూ, తరవాత రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు చెయ్యడమూ మొదలయిన వాటినిగురించి ఇదివరకే వ్రాశాను. 9, 10 సంవత్సరాలు రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు చేసిన తరవాత 1903 వ సంవత్సరం అక్టోబరునెలలో ఇంగ్లండు వెళ్ళడమూ, అక్కడ బారిష్టరు పాసైన తరవాత 1909 వ సంవత్సరం ఆఖరులో మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిడమూ, 14, 15 సంవత్సరాలు ప్రాక్టీసు చేసిన తరవాత 1921 వ సంవత్సరంలో కాంగ్రెసు ఉత్తరువు ప్రకారం న్యాయవాదవృత్తి వదలి వేయడమూ కూడా ఇదివరకే వ్రాశాను. స్వరాజ్య పత్రిక ప్రారంభించక పూర్వం మద్రాసులో నేను ఎంతకాలంనించి ఉన్నాను అనే విషయాలు చెప్పడానికి ఇవి మళ్ళీ వ్రాశాను. 1917 వ సంవత్సరం మొదలుకుని 1921 వ సంవత్సరంలో బారిష్టరు వృత్తి విడిచిపెట్టేవరకూ, హైకోర్టు లోను, రాజధానిలోను ఉండే జిల్లా కోర్టులలోను ఎక్కువ ప్రాక్టీసు సంపాదించి పనిచేస్తూ ఉండేసంగతి కూడా వ్రాశాను. నేను న్యాయవాదుల్లో ఎక్కువ డబ్బు సంపాదించి జయప్రదంగా న్యాయవాద వృత్తి నడిపిస్తూ ఉండే ప్రధాన న్యాయవాదుల్లో ఒకణ్ణిగా ఉండేవాణ్ణి. నెల ఒకటికి ఆరు, ఏడువేల రూపాయలు ఆర్జన చేస్తూ ఉన్న సంగతికూడా వ్రాశాను.

కలకత్తాలో న్యాయవాదిగా ఉన్న సి. ఆర్. దాసు, నేను చాలా సంవత్సరాలనించి స్నేహంగా ఉండేవాళ్ళం. ఆయన న్యాయవాదవృత్తి వదలివేసినప్పుడే పండిత మోతీలాలు నెహ్రూకూడా దేశంలోని న్యాయవాదుల్లో ముఖ్యుడుగా ఉండి, చాలా ధనం ఆర్జిస్తూ ఉండేవాడు. ఆయన్నికూడా నేను బాగా ఎరుగుదును. వీరిద్దరూ కాంగ్రెసు ఉత్తరువు ప్రకారం న్యాయవాద వృత్తులు ఒదిలివేశామని ప్రకటించిన తరవాత, నేను మద్రాసు నగరంలో ఉండే న్యాయవాదుల్లో మొట్టమొదట న్యాయవాదవృత్తి విడిచిపెట్టి వేశాను.

అప్పటికి మద్రాసు నగరంలో రాజకీయాలు కేవలం మితవాదుల నాయకత్వంకింద నడపబడుతూఉండేవి. నాకు లాకాలేజీలో ప్రొపెసరుగా ఉన్న వి. కృష్ణస్వామయ్యరుగారు హైకోర్టున్యాయ వాదవృత్తిలో అగ్రగణ్యులుగా ఉంటూ మద్రాసులో కాంగ్రెసు నాయకులుగా ఉండేవారు. 1907 వ సంవత్సరంలో జరిగిన సూరతు కాంగ్రెసులో మితవాదులకీ, అతివాదులకీ తగువులు వచ్చి కాంగ్రెసు విచ్చినం కావడమూ, తలకాయలు బద్దలుకావడమూ, కాంగ్రెసుసభ చెల్లాచెదరు అవడమూ మొదలయిన వాటిని గురించి ఇదివరకు సవిస్తరంగా వ్రాశాను.

ఆ సూరత్‌కాంగ్రెసు సమయంలో కూడా కృష్ణస్వామయ్యరు గారే నాయకులుగా ఉండేవారు. వారి శిష్యులు, స్నేహితులు అందరూ మితవాదులే అయి, నాయకత్వం వహించి కాంగ్రెసు ప్రతినిధులుగా ఉంటూ పనిచేస్తూ ఉండేవారు. ఈ కారణంచేత మద్రాసు నగరం జాతీ యత అంటే ఏమిటో, నిజం అయిన ప్రజాస్వాతంత్ర్యం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో ఎరగనట్టి పరిస్థితుల్లో ఉండేది. మద్రాసు నగరంలో ఉన్న పత్రిక లన్నీ మితవాద పత్రికలే. అవి ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉండడమేగాని, ప్రజాస్వాతంత్ర్యమూ, జాతీయతా, త్యాగమూ మొదలైన వాటిని గురించి వ్రాయడానికి జడుస్తూఉండేవి.

మదరాసు బీచిలో జరిగిన పెద్ద బహిరంగ సభలో కాంగ్రెసు ఆదేశానుసారంగా నేను న్యాయవాదవృత్తి వదలివేశానని చెప్పినసంగతి మద్రాసు పత్రికల్లో ఎక్కడో మారుమూలగా చిన్న అక్షరాలలోవేశారు. ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వక పోవడానికి వాళ్ళ మనస్సుకి నూతన కార్యక్రమంలో నమ్మకం లేకపోవడం ఒక కారణము. అల్లాంటి సంగతులకి ప్రాముఖ్యం ఇస్తే ప్రభుత్వం ఏమి చేస్తుందో అనే భయం ఒకటి. అందుచేత, నాకు ఈ స్వల్ప వ్యవహారంలోనే ఈ పత్రికలకి ఇంత భయం ఉంటే, ముందు రాబోయే కార్యక్రమాన్ని గురించి ప్రకటించడానికి వాటికి ఏ మాత్రమూ సాహసం ఉండదనీ, పత్రిక సహాయం లేనిదే ఇంతటి మహోద్యమం ఈ రాజధాని అంతటిమీద నడిపించడం చాలా కష్టమనీ తోచింది.

అదివరకు మద్రాసు రాజధాని మితవాద నాయకత్వంలో ఉన్నప్పటికీ నూతన కార్యక్రమానికి సంసిద్ధులు అయినవారు లేరని ఎంత మాత్రమూ అనుకోడానికి వీలులేదు. కాంగ్రెసు నూతన కార్యక్రమం వెల్లడికావడంతోనే లోపల అంత వరకూ దాగి ఉన్న దేశభక్తి, త్యాగబుద్ధి మొదలైనవి మనుష్యులలోనించి బయటికీ రావడం సహజము. అందుచేత, మద్రాసులో నూతన కార్యక్రమం జరపడానికి ఎవరు సంసిద్ధులు? అనే విషయం తెలుసుకోవడానికి కూడా వెంటనే అవకాశం కలిగింది. మొట్టమొదటి పిలుపులో మద్రాసు లాయర్లలో ఎక్కువమంది ఇవతలికి రాకపోయినా, నేను ప్రచురణ చేసిన తరవాత నగరంలో అనేకమంది వారి వృత్తులు ఒదులుకున్నారు. నగరంలో న్యాయవాదవృత్తి వదిలినవారిలో టి. వి. వెంకట్రామయ్యరు అనే స్నేహితుడు కూడా ఒకడు. రాజగోపాలాచారిగారు కూడా అప్పుడే వారి న్యాయవాదవృత్తి వదులుకున్నారు. రాజగోపాలాచారిగారిని నేను మొట్టమొదట కలుసుకోవడమూ, ఆయనతో స్నేహం చెయ్యడమూ, కలిపి పనిచెయ్యడమూ, మొదలయినవి అన్నీ కూడా 1920, 21 సంవత్సరాలలోనే జరిగాయి. రాజగోపాలాచారిగారు గాంధీగారికి మొదటి శిష్యులుగా చేరిన కొద్దిమందిలో ఒకరు. ఆయన సేలంలో ప్రాక్టీసుచేస్తూ ఉండి, ఈ ఉద్యమం ప్రారంభించడానికి పూర్వం కొద్దికాలం కిందటే న్యాయవాదవృత్తికోసం మదరాసు వచ్చారు. రాజగోపాలాచారిగారు, నేను, టి. వి. వెంకట్రామయ్యరు గారు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రిగారు కలిసి కాంగ్రెసు ఉద్యమం బలపరచ డానికి ఒక దినపత్రిక స్థాపిస్తే తప్ప ముందు కార్యక్రమం నడపడం కష్టతరం అవుతుందని ఆలోచించాము.

అందుచేత ఇంగ్లీషులోనూ, క్రమంగా తెలుగులోనూ, అరవము మొదలయిన భాషల్లోను పత్రికలు ప్రచురించడం మంచి దని నిశ్చయించి ఒక లిమిటెడ్ కంపెనీ స్థాపించడానికి నిర్ణయించాము. శ్రీ కాశీనాథుని నాగేశ్వర్రావుగారు కూడా మాకు ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చారు. ముఖ్యులైన ప్రోత్సాహకుల్లో రాజగోపాలాచారిగారు ఒకరు. నేను హైకోర్టులో 15 సంవత్సరాలనించి ప్రాక్టీసు చెయ్యడంవల్లనూ, కావలసినంత ధన సహాయం ఉండడంచేతనూ, మద్రాసు వర్తకుల్లో హిందువుల్లోనూ, మహమ్మదీయుల్లోను కూడా పెద్దలైనవారు ఈ ప్రోత్సాహకులలో చేరి సహాయం చేశారు.

ఇంతమంది ప్రోత్సాహకులతో సంస్థ ప్రారంభించి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మొదలైనవి తయారుచేయించి, స్థాపించబోయే పత్రికలు, ప్రత్యేకంగా కాంగ్రెసు కార్యక్రమాన్నీ, కాంగ్రెసు ఆశయాల్నీ అవలంబించి నడిపించడానికే ఉద్దేశింపబడ్డాయి అని వ్రాశాము.

ఆ రోజుల్లో ప్రజలకీ, నాయకుల్లో ముఖ్యులకీ కూడా కాంగ్రెసు ఆశయాలు, కాంగ్రెసు కార్యక్రమమూ కూడా బాగా తెలియడానికి అవకాశాలు ఉండేవికావు. త్రివిధ బహిష్కరణాల్ని గురించి అర్ధం అయింది కాని, తరవాత రాబోయే శాసనోల్లంఘనమూ, అది అవలంబించడంవల్ల వచ్చే కష్టాలూ అవీ క్రమంగా గాంధీగారు, కాంగ్రెస్సూ వెల్లడిచేసి కార్యక్రమం నడిపించేవరకూ కూడా బోధపడలేదు. అందుచేత దేశంలోను, నగరంలోను, గ్రామాల్లోను ఉండే నాయకులు, ధనవంతులు అంతా కూడా ఈ ఉద్యమం జయప్రదంగా జరపడానికీ, తగినంత సాహాయం చెయ్యడానికీ కూడా పత్రిక అవసరం అని నిర్ణయించాము.