నవనాథచరిత్ర/ద్వితీయాశ్వాసము

నవనాథచరిత్ర

రెండవ యాశ్వాసము

శ్రీజగన్నుత రూప ◆ చిత్తజుండైన
రాజమహేంద్ర ధ ◆ రాతలేశ్వరుఁడు
నంతలోఁ జిత్రాంగి ◆ నంతరంగమునఁ
జింతించి చిత్తంబు ◆ చెందలిరాకు
వాలుతాఁకునకును ◆ వలపులకొండ
గాలిచొక్కునకును ◆ గమకించి మరలి
పురము సొత్తెంచుచోఁ ◆ బుణ్యకామినులు
సరసముత్యాలసే ◆ సలు పైని చల్ల
శృంగారములఁ జేసి ◆ జీవంబులెసఁగు
బంగారు బొమ్మల ◆ భంగిఁ జెన్నారు
ధవళేక్షణలు కల ◆ ధౌత పాత్రములఁ
బ్రవిమలరత్నదీ ◆ పము లమరించి
వరుస నివాళింప ◆ వందిమాగధులు
పొరిఁబొరి గైవార ◆ ములు చేయనెలమి
రాజిల్లు తన[1]కొటా ◆ రమునకు వచ్చి
రాజమహేంద్రధ ◆ రాతలేశ్వరుఁడు
రవుతుల దొరల దీ ◆ ర్పరులను భటులఁ
గవుల గాయకులను ◆ గ్రమమున ననిపి
కలయ వాసించిన ◆ కనకకుంభముల
జలమున జలకంబు ◆ చతురతఁ దీర్చి
మంచావరించిన ◆ మాడ్కిని జిలుగు
మించిన చీరెలు ◆ మెచ్చుగాఁ గట్టి
యగరు దూపించిన ◆ యలరులు దురిమి
మృగమదపంకంబు ◆ మెయినిండ నలఁది
యరసి చూచినమధు ◆ రాహారములను
బరితృప్తుఁడై యడ ◆ పము వానికేలు
వలచేత నూఁది సు ◆ వర్ణపాదుకలు

మెలుపు మీఱఁగ మెట్టి ◆ మెల్లనె నడచి
యరిగి చిత్రాంగి య ◆ భ్యంతరగృహము
కరమొప్పఁ జొచ్చి యా ◆ కపటాత్మురాలి
చందంబుచూచి వి ◆ స్మయమున మునిఁగి
డెందంబులోనఁ బా ◆ టిల్లిన భీతిఁ
బలికె నిదేలయో ◆ పద్మపత్రాక్షి!
ఎలమి నల్లంత నా ◆ కెదురుగా వచ్చి
మొలకనవ్వులు చేసి ◆ ముదమురంజిల్లఁ
బొలయు నీమెఱుఁగు చూ ◆ పుల నివాళించి
యుపచారములు పెక్కు ◆ లొనరింతు వేమి
నెపము నా కిదె నేఁడు ◆ నీవొవరుపవు
ముదిత నాయెడఁ దొల్లి ◆ మోహంబు లేదు
మృదుభాషణలు లేవు ◆ మేలంబు లేదు
శృంగార మలవడఁ ◆ జేయక చెలుల
సంగడి మెలఁగక ◆ చనవుగాఁ జదువు
శుకముఁ గైకొనక మిం ◆ చులు దొంగలించు
ముకురంబు చూడక ◆ మురియుచు నడచు
రాయంచ నొల్లక ◆ రత్నవిపంచి
వాయించ సొగయక ◆ వాసన మీఱు
పరువంపుఁ బూబంతి ◆ పట్టక ప్రోది
పురినెమ్మియాటయిం ◆ పులును గైకొనక
జగతీతలంబున ◆ శయనింప నేల
తగు హంసతూలికా ◆ తల్పంబు గలుగఁ
గడుమైలపుట్టంబు ◆ గట్ట నీ కేల
మడఁకమాయనితులాం ◆ బరములుఁ గలుగ
నెవ్వరు నీదెస ◆ నెగ్గాచరించి
రెవ్వరు నీతోడ ◆ నెదురు భాషించి
రేతరితనమున ◆ నింతి నీమీఁదఁ
బోతుటీఁగకు నైన ◆ పొలసి పోరాదు
లోలాక్షి నీదెస ◆ లోఁగక జుట్టు
వ్రేలి నెవ్వరుఁ జూప ◆ వెఱతు రెప్పుడును
అలుకుచు నామంత్రు ◆ లతివ నీయాజ్ఞ
తలమోచి తీర్తురు ◆ తడయక పనులు

పోకుండ నీయాన ◆ పొడిచిన భయము
పైకొని పాఱెడు ◆ పామైన నణఁగు
నెలనాగ నీకునే ◆ నేచన వొసఁగ
నెలఁత నేఁ డేమిట ◆ నీకు [2]వెర్గంద
నలఁగఁగారణమేమి ◆ యల పూవుఁబోణు
లలుగుదు రొకవేళ ◆ నాత్మనాయకుల
వల పొత్తిచూడ భా ◆ వంబునఁ దలఁచి
కలకంఠి నిను దక్కఁ ◆ గలనైన నొండు
వెలఁది పొందెఱుఁగఁ బూ ◆ విలుతుఁడు సాక్షి
పలుకులేటికి నమ్ము ◆ పచరణ గాదు
ధవళాక్షి నీమోము ◆ దామరపువ్వుఁ
[3]గవవారు మదమధు ◆ కరశాబములును
గురులుఁ జుట్టంబులు ◆ కొదమ చందురుఁడు
దరుణి నీ నుదురును ◆ దగ సందడిల్లు
నిగిడి వీనులఁ దాఁకు ◆ నీలోచనములు
మగబేడిసలుఁ బొత్తు ◆ మను తల్లిప్రజలు
చిలుకలకొలికి నీ ◆ చిగురువాతెరయు
నలబింబఫలములు ◆ ననుఁగు వియ్యములు
ప్రసవసుగంధి నీ ◆ బాహువల్లికలు
బిసకాండములు నొక్క ◆ పేగుబందుగులు
వనిత నీజిగిమించు ◆ వలుదపాలిండ్లు
నొనర జక్కవలును ◆ నొకగూటి పిల్ల
[4]లనువుగఁ బిడికిట ◆ నణఁగు నీనడుము
మనసిజుదేవిదౌ ◆ మధ్య మొకజోక
కలహంసగమన సై ◆ కతములు మించు
తొలఁకు నీ జఘనంబు ◆ తోడఁబుట్టువులు
సరసిజగంధి నీ ◆ సవరని తొడలుఁ
గరితుండములును ద ◆ గ్గఱినబంధువులు
బాలకి నీపాద ◆ పల్లవంబులును
నేలకెందమ్ములు ◆ నెత్తురుఁ బొత్తు
సౌందర్యమున నీకు ◆ సరియెన్నఁ గలరె
చందనగంధులు ◆ జగతిని నెందు

నలికులవేణి నీ ◆ యలుక దీఱినను
దళుకు సుపాణిము ◆ త్యములపే రిత్తుఁ
బద్మాక్షి నీముఖ ◆ పద్మ మెత్తినను
బద్మరాగంబుల ◆ పతకంబు లిత్తుఁ
[5]సుదతిరో నాదెస ◆ చూచి నవ్వినను
ముదమొప్ప పచ్చల ◆ ముద్రిక లిత్తుఁ
బడతి నీ వొకతియ్య ◆ పలుకు పల్కినను
గడునొప్పు వజ్రాల ◆ కడియంబు లిత్తుఁ
గలకంఠి నీవు నన్ ◆ గౌఁగిలించినను
వలసిన యూళ్లును ◆ వాహనంబులును
దొడవులు మాడలు ◆ దోరహత్తుగను
దడయక నీయన్న ◆ దమ్ముల కిత్తు
సుందరి బహువిధ ◆ సురతసౌఖ్యముల
నొందింప వేడ్కల ◆ నోలలార్చినను
బ్రాణ మిత్తునటంచు ◆ బదశిరోమహిత
మాణిక్యకాంతులు ◆ మలయుచు దివ్య
పదనఖమణిపంక్తి ◆ పయి బిత్తరింపఁ
గదిసిమ్రొక్కినఁ దన ◆ కపటంబు నెరప
నిది దఱి యనుచు నా ◆ యిభరాజగమన
గొదుకుచుఁ బొరలి క ◆ న్గొలకులఁ జూచి
యుసురని బిట్టు ని ◆ ట్టూర్పులు నిగుడ
ముసుఁగు వాయఁగఁ బు చ్చి ◆ మోమరవాంచి
యొయ్యనఁ గరపద్మ ◆ మూఁతగా లేచి
యయ్యవ[6]ని పుని తో ◆ నతివ యేడ్చుచును
నరనాథ నీ వర ◆ ణ్యములకు వేఁట
కరిగిన వెనుక నె ◆ య్యంబునఁ బొంది
గడవఁ జొప్పడక నా ◆ కలికి రాచిలుకఁ
గడువేడ్కఁ గైకొని ◆ కరముపై నునిచి
తేనెలు గులుకు త ◆ దీయవాక్యముల
వీనుల విందుగా ◆ వినుచు నవ్వేళ
విసువక మైకందు ◆ విడచిపో నమృత

రసమున నుమిసి[7]క ◆ ర్పరమున దొలఁచి
వెలఁది ముత్యపుఁ బోణి ◆ వెలసివజ్రాల
తళుకునఁ దొలఁచియు ◆ ధళధళ మెలఁగు
ప్రాలేయధామబిం ◆ బము కెలనేల
వ్రాలెనో యన నభి ◆ రాగంబు మించు
మీనుమీసము లీల ◆ మిసమిస మించు
మేని క్రొమ్మించుల ◆ మెఱుఁగు వెన్నెలల
వెదచల్లు నొకమంచి ◆ వెల్లపావురము
ముదము దీపింప నా ◆ ముందట వ్రాలె
వ్రాలిన నెందుండి ◆ వచ్చె నిచ్చటికి
నాలోకనోత్సవం ◆ బయియుండ నిపుడు
పొడతోఁచె నని తల◆• పోయఁ బావురముఁ
గడి పట్టునెపమునఁ ◆ గడువన్నె మెఱుసి
మనమున శంకణు ◆ మాత్రంబులేక
చనుదెంచె నిచటికి ◆ సారంగధరుఁడు
వచ్చి రెప్పార్పక ◆ వాఁడు నావలనఁ
జెచ్చెర వీక్షించి ◆ చిత్త మంతయును
జడిగొన్నభావజు ◆ సాయకనిహతిఁ
దొడరిదొప్పఁగఁదోఁగి ◆ [8]ధృతిఁ దుప్పఁదూలి
వావి వోవిడిచి కా ◆ వరమునఁగదిసి
చేపట్టి ననువన్నె ◆ చిరునవ్వు నిగుడ
మత్తచకోరాక్షి, ◆ మరువంపు లాక
క్రొత్తముత్యపు బొమ్మ ◆ కొఱనెలసోగ
చిలుకలకొలికి వా ◆ సించినకలువ
మెలఁగు తొలకరికారు ◆ మెఱుఁగ కాముకుల
డెందంబుగుఱులు బీ ◆ టికవాఱ నాటు
కందర్పమోహన ◆ కాండంబుతోడ
జగడించు నీకటా ◆ క్షంబు నామీఁద
నిగుడించి నన్ను మ ◆ న్నించుట తగదె
నీ నెరికురులకు ◆ నీ మోమునకును
నీ నయనములకు ◆ నీ పల్కులకును

నీ చేతులకు నొప్పు ◆ నీ చన్నులకును
నీ చిఱుఁ దొడలకు ◆ నీ పదంబులకు
సరి సమానము జోడు ◆ సవ తెన సాటి
[9]తర మెనయిక యని ◆ తమ్మును బొగడి
వానివానికిఁ బోల్చి ◆ వర్ణింహ లజ్జ
నూని నీకును వెఱచి ◆ యూడనింబాడిఁ
చిఱుత తేంట్లును మ్రాని ◆ చిల్లులు సొచ్చె
నెఱిచంద్రుఁ డుదయాద్రి ◆ నెత్తంబు నెక్కె
గఱ చెడి బేడిసల్ ◆ గలిసె పెన్ వఱద
వఱలు రాచిలుకలు ◆ వదనముల్ వ్రాల్చె
వడిగొనఁ బాఱి తీ ◆ వలు చెట్లఁబ్రాఁకె
నడఁగెఁ జక్కవలువ ◆ నంబుల నడుమ
విరుల విల్లును జూడ ◆ వెనుకకు వంగెఁ
బరగనేలలు వట్టె ◆ బయలుదామరలు
నీ చక్కదనమును ◆ నీ జవ్వనంబు
నీ చతురతకును ◆ నీవిలాసముకు
నీకు నేక్రియఁ దగు ◆ నృపుఁ డిదె మొదలు
నాకు నీకునుగాక ◆ నలినాయతాక్షి
పలికినవడిని దు ◆ ర్భాషలు చెవులఁ
జిలికిన నులికి నా ◆ సి గ్గటు గావఁ
గలవారి నెవ్వరిఁ ◆ గానక వగచి
తలకొన్నఁ గినుక నా ◆ దర్పాంధుఁ జూచి
పలికితి నోరి! నా ◆ పతిలేని వెనుక
నలుకక కనుఁబెట్టి ◆ యంతఃపురంబు
వన్నెలు పచరించి ◆ వడిఁ జొచ్చి వచ్చి
సన్నుఁ జేవట్టి మ ◆ న్మథ వికారమున
వెడమాట లాడెదు ◆ విభుని కేఁగూర్తు
నొడలు ప్రాణంబులు ◆ నుర్వీశుసొమ్ము
లెక్కడ నీవేడ ◆ యేను నీ కేడ
చక్కఁగ వచ్చిన ◆ జాడగాఁ జనుము
పాపాత్మ! పినతల్లిఁ ◆ బట్టి యీరీతి
నేపినకష్టులే ◆ యెడనై నఁ గలరె?

అని విడనాడిన ◆ నలుక దీపించ
ననుఁ బల్మి నాలింగ ◆ నంబు గావించి
కొంజక కొనగోళ్ల ◆ గుబ్బల వ్రచ్చె
ముంజేతికంకణం ◆ బున కద్ద మేల?
కన్నులారఁగ నిదె ◆ కనుఁగొను మనుచు
నన్నీలవేణి ప ◆ య్యద వాయఁ దివిసి
యుబ్బి క్రొన్నెత్తురు ◆ లొలుకుచు నున్న
నబ్బిక మైనట్టి ◆ యంకుశ ఘాత
జనిత రేఖాంకిత ◆ సమదద్విపేంద్ర
ఘనకుంభముల లీల ◆ గనుగంది కుందు
కుచములు సూసి డ ◆ గుత్తికఁ బెట్టి
పచరించి వేగుచుఁ ◆ బ్రాణేశ! నీకు
నీవిధం బంతయు ◆ నెఱిఁగింపఁ గోరి
నీవు వచ్చినదాఁక ◆ నిలిచితిఁ గాని
చావఁ బంతము నాకు ◆ సారంగధరుఁడు
వావిరిఁ జెయిఁబట్ట ◆ వచ్చిన యపుడె
నాకు మామవు నీవు ◆ నాయంబు దప్పి
నీకుఁ గోడలి ముట్ట ◆ నింద వాటిల్లు
నరుగుము నీవు ర ◆ త్నాంగి సంగడికి
సురతసౌఖ్యంబుల ◆ సొక్కింప నేర్చు
ననుచు సంతటఁ బోక ◆ యా మాయలాఁడి
జననాథుచే నున్న ◆ చాయల పిడెము
కఱకఱి మీఱ ది ◆ గ్గన నెఱఁ బెఱికి
మెఱుఁగులు గిఱికొన ◆ మెడఁ జేర్చుకొన్నఁ
గని సంభ్రమంబునఁ ◆ గదిసి చే వట్టి
పెనఁగి యాచురి విడి ◆ పించి భూధవుఁడు
దాని కిట్లనియె జం ◆ దన గంధి నిన్ను
మానంబు గొనిన దు ◆ ర్మార్గవర్తనునిఁ
గరుణమై సుతుఁ డని ◆ కాచి పోనియక
పొరిగొలిపించి నీ ◆ పొగులు వారింతు
నని యూరడిలఁ బల్కి ◆ యచ్చోటు వాసి
మనమునఁ గోపంబు ◆ మల్లడిగొనఁగఁ
గొలువున కే తెంచి ◆ కోలల వారి

నలుగడఁ బంపి స ◆ న్మంత్రుల బంధు
జనుల నాప్తుల మ[10] హా ◆ జనులను దొరల
నొనరంగఁ బిలిపించి ◆ యుచితాసనముల
..... ..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
జడిగొని కార్యని ◆ శ్చయబుద్ధి దొరఁగి
చెలువేది బయలు వ్రా ◆ సిన చిత్రరూప
ములలీలఁ బలుకక ◆ మోములు వంచి
కొని యున్నయప్పు డ ◆ క్కునల యేశ్వరుని
కనియె నయార్జితుం ◆ డను మంత్రివరుఁడు
ఇది మహా పాతకం ◆ బిచ్చఁ జింతింపఁ
గొదుకక వాక్రువ్వఁ ◆ గూడ దెవ్వరికి
నెందు నేకథలందు ◆ నే జాతివారి
యందును నిట్టి య ◆ న్యాయ వర్తనము
మును చెప్పు వింటిమే ◆ మోరత్రోపునను
దనవన్నె మెఱసి యం ◆ తఃపురంబునకు
నలుకక తాఁ బోవు ◆ టది తప్పు తొలుతఁ
దలఁచి చూచిన దొడ్డ ◆ తప్పౌనొ కాదొ
సవతియీసునఁబట్టి ◆ జంపింపఁ దలఁచి
సవరగా ననృత భా ◆ షలు దొంతిచేసి
చెప్పెఁబొమ్మనరాదు ◆ చిత్రాంగి మరుగు
దప్పించి సారంగ ◆ ధరు చేఁత నీకుఁ
జూపిన స్వయము పోఁ ◆ జూపినమీఁద
నీపాపమున రాజ్య ◆ మేమి గాఁగలదొ
జగములో నపకీర్తి ◆ సమకొను జయము
దిగుఁబ్రతాపముదప్పుఁ ◆ దేజంబు మాయుఁ
గులము గుద్దిలి గాఁగఁ ◆ గొన్న యానీచు
వలదు పుత్రుం డను ◆ వాత్సల్యమునకుఁ
గృపఁజేసి వెళ్లి పోఁ ◆ గొట్టిన నైనఁ
జపచపనై యాజ్ఞ ◆ సాగదు మీఁద
దుర్మార్గుఁ డై తల్లి ◆ దొరలిన పాప
కర్ము నిప్పుడే పట్టి ◆ కట్టి తెప్పించి
వెసఁ బాము గఱచిన ◆ వ్రేలును బోలె

మసలక ఖండించి ◆ మనుట కార్యంబు
అనవిని మతిమంతుఁ ◆ డనుమంత్రి పలికె
మనుజేశ నయశాస్త్ర ◆ మత మిది గాదు
ధనము వోయిన, మన ◆ స్తాప మొందినను
దనయింట దుశ్చరి ◆ త్రము పుట్టినైన
వెలవెల్లనై వెల్లి ◆ విరివి గావింప
వల దనియెడి నీతి ◆ వాక్యంబు గలదు
తనయులు తమ పిన ◆ తల్లు లిండ్లకును
జనవున నొకవేళఁ ◆ జనుట త ప్పేమి
తరుణులు తమచేయు ◆ తప్పు లన్నియును
బురుషులపైఁ జూపి ◆ బొంకు సేయుదురు
కుసుమసౌరభములు ◆ గుది గ్రువ్వవచ్చు
నినుకబొమ్మల నీట ◆ నీఁదింపవచ్చు
[11]వానగండ్లు గుడుల్ గ ◆ వడి గట్టవచ్చు
గానియింతుల మనో ◆ గతి గానరాదు
తన సహోదరినైనఁ ◆ దనయుని నైన
జనకు నై నను గడుఁ ◆ జక్కనివాని
మనమారఁ గనుఁగొన్న ◆ మదిరనేత్రులకుఁ
దనుపెక్కులజ్జాప ◆ దం బని మున్ను
పాండుతనూజుల ◆ పత్ని నిక్కంబు
పుండరీకాక్ష, స ◆ మ్ముఖమునం బలికె
నాకుఁజూడఁగ నర ◆ నాథ చిత్రాంగి
నీకుమారుని రూప ◆ నిర్జిత మదనుఁ
జూచి తాలిమిఁ దూలి ◆ స్రుక్కక పట్టి
లోఁచిన వాడటు ◆ లోను గాకున్న
నలిగి యీరీతిమా ◆ యలువన్నెఁగాని
తలపోయ సారంగ ◆ ధరుఁడటు వంటి
దోషంబునకు నేల ◆ తొడరు 'నాగేంద్ర
భూషణు వరమునఁ ◆ బుట్టినయతఁడు
ఆలిమాటకు రాము ◆ నడవులం బనిచి
[12]జాలిఁ బొరలిన ద ◆ శరథునిపగిది
తొడిఁబడఁ బుత్త్రునిఁ ◆ దునిమించి పిదపఁ

బొడము శోకాగ్నులఁ ◆ బొరలుదు వీవు
ననుటయుఁ గొలువెల్ల ◆ నామతిమంతుఁ
గొనియాడ నరనాయ ◆ కుఁడు నట్లమంత్రి
యొరసి వీడ్వడ నాడు ◆ చున్న వాక్యముల
నురువడి నుయ్యాల ◆ లూఁగు మనమున
నిది కార్య మని నిర్ణ ◆ యింపఁజొప్పడక
కదిసిన మోహసా ◆ గరమున మునిఁగి
యిటుచూడవచ్చిన ◆ నింతిపై నేర
మటుచూడవచ్చిన ◆ నాత్మజుతప్పు
కప్పి పుచ్చఁగరాదు ◆ కాదనరాదు
తప్పు గావఁగ రాదు ◆ దండింప రాదు
ఏమిచేసెడి దింక ◆ నీటమీఁద ననుచు
భూమీశ్వరుఁడు తన ◆ బుద్ధి నందంద
పలుమాఱు వగచి ఱె ◆ ప్పలు వాలవైచి
తల యూఁచి చూపులు ◆ ధరణిపైఁ జేర్చి
వేలు ముక్కున నిడి ◆ వెఱఁ గంది యున్న
నాలోన నీతిజ్ఞుఁ ◆ డను మంత్రి పలికె
మతిమంతుచెప్పిన ◆ మాటలన్నియును
హితములై మితములై ◆ యింపొదవించు
నలఘుమత్తేభక ◆ ర్ణాగ్రంబుకంటెఁ
జలదళ పల్లవాం ◆ చలములకంటెఁ
బొడవుసౌధధ్వజ ◆ స్ఫురణల కంటెఁ
గడుఁ జంచలము కల ◆ కంఠుల మనసు
చిత్రాంగి తనకల్ల ◆ చెప్పునే యిపుడు
ధాత్రీశ సారంగ ◆ ధరుని నెంతయును
మెత్తనిమాటల ◆ మెయికొల్పి యింక
నొత్తిచూడఁగఁ బంపు ◆ మొక బుద్ధిమంతు
ననుటయు భూపాలుఁ ◆ డట్ల కా కనుచుఁ
దన కూర్చుబంధులఁ ◆ దగునాప్తజనుల
హితులను సత్ పురో ◆ హితులను బంధు
మతిమంతులను దగు ◆ మాన్యులఁగూర్చి
చనుఁడన్న వారును ◆ జయ్యన నేగి
ఘనవజ్రతోరణ ◆ కలితదీధితుల

గిఱిగొను దినకర ◆ కిరణ జాలమునఁ
[13]దఱచగు టెక్కెముల్ ◆ దళతళబొలయ
మిసమిసమనవింత ◆ మెఱుఁగులు నిగుడు
పసిఁడి మేడలయందు ◆ భాసిల్లుచున్న
నంగజాలలచేత ◆ నవసరం బడిగి
సంగతిగాఁ జొచ్చి ◆ సారంగధరునిఁ
గని మ్రొక్కి నిలిచినం ◆ గనువేడ్క వారిఁ
దనగద్దె చేరువఁ ◆ దపనీయరత్న
రచితంబులై చాల ◆ రంజిల్లుచున్న
యుచితాసనంబుల ◆ నునిచి మన్నించి
యేమికార్యంబు మీ ◆ రిట వచ్చుటకును
భూమీశ్వరుఁడు పిల్వఁ ◆ బుత్తెంచె నొక్కొ
చెప్పుఁ డేర్పడ నన్నఁ ◆ జెప్ప శంకించి
చెప్పుదు మని యోలిఁ ◆ జేతులు మొగిచి
యోకుమారక సద్గు ◆ ణోదయ మమ్ము
భూకాంతుఁ డిచటికిఁ ◆ బుత్తెంచె మాకు
భావించి చూడ నే ◆ పట్టుననైన
నీవురాజును జూడ ◆ నెఱి నొక్కరూప
యొకవిన్నపముచేయ ◆ నొగి [14]వెఱచుంటి
మకలంక బుద్ధి నీ ◆ యానతి లేక
సన్నుతంబగు మహీ ◆ శ్వరుఁడు వేఁటాడఁ
జన్న పిమ్మట నంగ. ◆ జాలలఁ దఱిమి
తమకించి పారావ ◆ తముచొప్పు వట్టి
నెమకు నెపంబున ◆ నీతి వోవిడచి
రాణివాసముఁజొచ్చి ◆ రాజుకు మిగులఁ
బ్రాణపదంబైన ◆ పణఁతి చిత్రాంగిఁ
గనుగొని మోహించి ◆ కనుఁ గానలేక
మనసునఁ బిరిగొన్న ◆ మదనాతురమునఁ
జేవట్టి కఱకఱిఁ ◆ జేసితి వనుచు
నావిద్రుమాధరి ◆ యలయుచుం దనకుఁ
జెప్పిన గోపంబు ◆ చిత్తంబులోన
నుప్పొంగి కొలువున ◆ నుండి భూవిభుఁడు

నిను నంతవట్టును ◆ నిజముగా నడుగుఁ
డనిన నాతఁడు భీతి ◆ నాత్మలోఁ గలఁగి
యెక్కడనుండి నేఁ ◆ డిటు సంభవించె
నక్కట యిట్టి మ ◆ హాపరాధంబు
బాపురే మాయలు ◆ పన్ని చిత్రాంగి
రూపించెనే యిట్టి ◆ రోఁత నామీఁద
నాయమ్మ నామీఁద ◆ నాగ్రహంబునను
ఈయుపాయము గడి ◆ యించిననైనఁ
జేకొని తనకింత ◆ చెవి నాన నేల
భూకాంతుఁ డిదె పోలుఁ ◆ బోలదు [15]అనక
జనని నాపై లేని ◆ సడి మోప నట్టి
జనకుండు నదియె ని ◆ శ్చయమునుం జేయ
నెల్లవిధంబుల ◆ నిట్టి చోనింకఁ
గల్లరినేఁ గాక ◆ కలరె తక్కొరులు
ధరణీశు నాపాలి ◆ దైవంబు గాఁగఁ
బరమసమ్మదమున ◆ భావింతు నాత్మ
వినుఁ డింక నొక్కటి ◆ వేఁడెద మిమ్ము
జననాయకుని మ్రోలఁ ◆ జను లెల్ల వినఁగ
పాటించి నావిన్న ◆ పముగాఁగ మీరు
మాటలు విన్నవిం ◆ పఁగవలెఁ గొన్ని
నిర్మలమతిఁ బూని ◆ నీతిమార్గమున
ధర్మంబు పెంపొంద ◆ ధర నేలురాజు
తప్పు విచారించి ◆ దానికిఁ దగిన
చొప్పున దండించి ◆ శుభమునఁ బొందుఁ
గావున నీకళం ◆ కము నాకుఁ బాయ
దేవతాముఖమైన ◆ దిబ్బఁ బట్టించి
మన్నింపు మనుఁడుపి ◆ మ్మట మాటలేల
తన్నుఁ జిత్రాంగిముం ◆ దటఁ బెట్టి నిలిపి
తెలియ నాడించిన ◆ దెస నిట్టి కల్ల
కలిగిన శిక్షగాఁ ◆ గావింపు మనుఁడు
అటమీఁదఁ బరమేశు ◆ నాజ్ఞ యెట్లుండె
నటు గాక పోనేరఁ ◆ దని వారి కెలమిఁ

బసిఁడి కోఱలనుంచి ◆ బహుమాన మొదవఁ
బొసఁగఁ గర్పూర తాం ◆ బూలమ్ము లొసఁగి
బొండన్న వారును ◆ బోయి యారాజు
దండ ప్రణామంబు ◆ తగ నాచరింప
వలనొప్పఁ గాఁబోయి ◆ వచ్చిన[16] తెఱఁగు
వెలఁదిగా నంతయు ◆ వినిపింపఁ గోరి
అవధారు! విన్నపం ◆ బవనీశ తిలక
తివిరి దేవరయాన ◆ [17]తిక్రమంబునను
జని యథోచితగతి ◆ సారంగధరునిఁ
గనుఁగొని మానేర్చు ◆ క్రమముల నెల్ల
నడుగఁ గలంతయు ◆ నడిగితి మేము
కడుఁబుణ్యుఁడౌఁ గాని ◆ కల్లరి గాఁడు
తిరముగా దేవ భూ ◆ దేవ సన్నిధిని
[18]బరిసెనంబున దిబ్బఁ ◆ బట్టించి గాని
యొండు విచారంబు ◆ లూహింపఁ గాదు
మండలాధీశ్వర ◆ మఱియు నే మతనిఁ
దఱిమి నే మింకఁ ద ◆ థ్యము చెప్పుమనిన
నఱమరలేక చి ◆ త్రాంగి నీమాట
ధట్టించి యడిగిన ◆ ధరణీశు తోడఁ
గట్టిగాఁ జెప్పెడిఁ ◆ గాన పొం డనియె
నావుడు వారి నం ◆ దఱఁ దోడుకొనుచు
భూవరుఁ డపు డంతి ◆ పురమున కేగి
కనుఁగొని శయ్య డి ◆ గ్గన డిగ్గి యచట
నొనర హేమస్తంభ ◆ మూఁతగా నిలిచి
ముసుఁగు డగ్గఱఁ దిగిచి ◆ ముగుద చందమున
వసివాళ్లు వాడుచు ◆ వదనంబు పంచి
కాటుకకన్నీరు ◆ కడగోర దిద్ది
మీటుచు నున్న యా ◆ మెలఁతుకఁ గదిసి
యవనీశు ననుమతి ◆ నాదొరల్ చేరి
ధనళాక్షి సారంగ ◆ ధరుఁడు నేఁ డిటకుఁ
బారావతంబునె ◆ పంబున వచ్చి

కోరిన రూపు క ◆ న్గొని తాల్మి నదలి
చేరి దర్పాంధుఁడై ◆ చెయివట్టె ననుచు
మీరు చెప్పితి రని ◆ మేదినీ నాథుఁ
డెల్లవారును విన ◆ నేర్పడఁ బలికెఁ
దెల్లంబుగాఁ దన ◆ తెఱఁ గెల్ల నడుగ
ననిపినఁ బోయి మే ◆ మాకుమారకుని
గని చాల దూఱి ని ◆ క్కము చెప్పు మనినఁ
గటకటా! తనమీఁది ◆ కల్ల నామీఁద
నిటు మోపి రాజున ◆ కెడలుగాఁ జెప్పి
నట్టి దేవులనె మీ ◆ రడుగుఁ డీమాఱు
గట్టిగా ననియె నే ◆ గతి దీని కనిన
నెలుఁగెత్తి యొకరీతి ◆ నేడ్చుచు బిట్టు
చలపట్టి నన్నేల ◆ చంపెదో రాజ
రచ్చల కెక్కించి ◆ రట్టు చేసెదవు
చచ్చినచా వయ్యె ◆ సరివారిలోనఁ
దెగి చావఁబోయినఁ ◆ దివిరి పట్టెదవు
నగుబాటు చేసితి ◆ నాలజ్జఁ గొంటి
నీకు లేదటిసిగ్గు ◆ నేఁడునాకేల
నీకార్యవాదులు ◆ నీవుఁ గన్నార
నిటు జూడుఁడని వారి ◆ యెదుటికిఁవచ్చి
కుటిలాత్ము రాలు పై ◆ కొంగు వోఁదివిసి
కలయంగఁ బురినీళ్లు ◆ గ్రమ్ముచు నున్న
వలుద చన్నుల మీఁది ◆ వ్రప్పులు చూపి
యివియెల్ల నాతప్పు ◆ లీ దుప్పటియును
అవునొ గాదోయని ◆ యది చూడ విభుఁని
ముందట నిడెఁ [19]గింక ◆ ముప్పిరి గొనఁగ
నిందు సందేహంబు ◆ లేటికి ననుచుఁ
గ్రచ్చర పేరోల ◆ గమునకు వచ్చె
వచ్చి భూవిభుఁడు వి ◆ ద్వాంసుల నెల్ల
ధర్మాసనము గూర్చి ◆ తల్లిఁ గామించి
దుర్మదంబునఁ బట్టి ◆ దోషంబుఁ బెట్టి
నటువంటి పాపాత్ము ◆ నడరెల్ల నణఁగ

నెటువలె దండింప ◆ నిపుడు గర్తవ్య
మనుటయు సభవారు ◆ నట్టి దురాత్ముఁ
గొనిపోయి నడు రేయి ◆ ఘోరాటవందు
గనెలుగాఁ జేతులుఁ ◆ గాళ్లు గోయింపఁ
జను నని ధర్మశా ◆ స్త్రములు శోధించి
పలికిన నృపుడు న ◆ ప్పని సేయుఁ డనుచుఁ
దలవరులకుఁ జెప్పి ◆ తగువారిఁ బంచిఁ
చయ్యన లోనికిఁ ◆ జని పాన్పుమీఁద
నొయ్యన మెయిఁజేర్చి ◆ యొదవు నెవ్వగల
మునుఁగెడు నంతలో ◆ [20]మునుఁగంగ నెంచి
ఘనతరగోపురా ◆ గ్రంబుననుండి
యారవిమండలం ◆ బనుజాజువన్నె
పారావతము వ్రాలె ◆ ఁబశ్చిమా[21]బ్ధికిని
వనరుహలక్ష్మి క ◆ ల్వలకును గాపు
చనఁ బూనుటయు మును ◆ సరసులునడప
నెడయాడువిధమున ◆ నిందును నందుఁ
దడఁబడ మదషట్ప ◆ దము చరియించి
బగివాయఁగాఁబడె ◆ భయమునఁబ్రియుల
మొగములు మోహంబు ◆ ముప్పిరిగొనఁగఁ
బలుమాఱు సూచుచుఁ ◆ బద్మగంధములు
సెలవుల జాఱంగఁ ◆ జేష్టలు మఱచి
వెలయఁజిత్రించిన ◆ విధమున నుండె
జలజషండంబున ◆ జక్కవకవలు
అలమహానటుఁడు సం ◆ ధ్యాతాండవంబు
లలి నటియించి క ◆ ళాసించుగతిని
కీ లెత్తి కంకణా ◆ కృతి భుజగేంద్ర
లోల ఫణామణు ◆ ల్మొగిచి పైఁదోఁచు
మురువుక్రొమ్మించుల ◆ మొలకలు నిగుడఁ
బొరిఁబొరి నక్షత్ర ◆ ములు పొడసూపెఁ
దివిరి భూతము కేలఁ ◆ ద్రిప్పెడికొఱవి
నవియు స్ఫులింగంబు ◆ లడరుచందమున
నెడనెడ మెఱయుచు ◆ నెల్ల దిక్కులను

మిణుఁగురుఁబురువులు ◆ మెఱసె నత్తఱిని
[22]మిత్తివౌకోఱల ◆ మీఱి లోవంక
కత్తులు తళతళ ◆ గ్రాలఁ ద్రిప్పుచును
గింకఁబేర్చిన కాల ◆ కింకరులట్ల
ఝంకించి ఱంకెలు ◆ చటులహుంకృతులు
నడరంగఁ దలవరు ◆ లార్భటం బెసఁగ
వడిఁ గోలదివియల ◆ వారిఁ దో కొనుచు
బలువిడిఁ జనుదెంచి ◆ పాపని నగరు
కలయఁబ్రవేశించు ◆ క్రందు సందడిని
సురిగియాసుద్ధి యే ◆ డ్చుచు వచ్చితనకుఁ
బరిచారు లెఱిఁగింపఁ ◆ బర్వినభీతి
వెలువడిపోలేక ◆ వెసఁ దప్పివడ్డ
పులుఁగుకై వడి బీరు ◆ వోయి చిత్తమునఁ
దలపోయఁ దొడఁగె రా ◆ తనయుఁ డోతల్లి
చలపట్టి లేని దో ◆ షముసు నామీఁదఁ
బచరించి మాయలు ◆ పన్ని భూపాలు
నెచరించి కోయింప ◆ నెట్లాడె మనసు
నీమన స్సాడెఁబో ◆ నృపుఁడు వివేక
మేమియు లేక యి ◆ ట్లేలకో నన్ను
నలవొందఁ గట్టు మ ◆ న్నాఁడునా తప్పు
కలరూ పెఱుంగక ◆ కనికరం బుడిగి
యురకయ తెగి చంప ◆ నొప్పనఁజేసెఁ
బొరయక నే మున్ను ◆ వోవలేనైతిఁ
గర్మపాశంబులు ◆ కాళ్లఁ బెనంగ
నిర్మూలమై పోయె ◆ నేఁటితో ధర్మ
మేల యీజాలి నా ◆ కిటమీఁద దిక్కు
కాలకంఠుఁడుగాక ◆ కలరె తక్కొరులు
అని ధీరుఁడై యున్న ◆ యా శుభాకారు
వినుతయశోధారు ◆ విమలవిచారు
సారంగధరుని స ◆ జ్జనదృక్చకోరు
సారంగధరుఁజేరి ◆ సారమేయములు
చిఱుపులి నరికట్టి ◆ చీకాకుపఱుచు

తెఱఁగున నదలించి ◆ [23]దీనునిఁజేసి
ఘనతరకాలోర ◆ గము చుట్టిపట్టు
కొను గారుడికుని లా ◆ గునఁజుట్టువట్టి
గుదియించ జడముడి ◆ క్రొవ్విరులెల్లఁ
జెదర నల్గడలందుఁ ◆ జెవులఁ దూఁగాడు
లలితమౌక్తికకుండ ◆ లంబులసోగ
తళుకుల తళతళ ◆ తలచుట్టు పాఱఁ
బిడివడఁ దిగిచి శో ◆ భిల్లుహారములు
జడిగొని ... ... ... .... .... సందులుగట్ట
నడిరేయిఁగొనిపోయి ◆ నఱుకుద మనుచుఁ
గడుభయంకరలీలఁ ◆ గావలియుండ
నా వార్త వినియుల్ల ◆ మగల రత్నాంగి
చావుతో పరిఁజేయఁ ◆ జనుమూర్ఛనొంది
ధరణిపైఁబడికొంత ◆ తడవుకుఁదెలిసి
పరిచారకులు దాను ◆ భయమునలేచి
యడుగులు దొట్రిల్ల ◆ నందియల్ మ్రోయ
ముడివిడి క్రుమ్ముడి ◆ మూపుపైఁజాఱఁ
బగడంపువా తెర ◆ పద నింక లీల
జిగిఁదప్పి పాపట ◆ చీకాకుపడఁగ
ఘనకుచంబులమీఁద ◆ గమనవేగమునఁ
బెనఁగొని ముత్యాల ◆ పేరులుదూల
నీలాలకంబులు ◆ నెరిఁదప్పి చెదర
వాలుగన్నుల నీరు ◆ వరదలై పాఱ
నేలబఁయ్యెదచేర ◆ నెమ్మేను దీగె
[24]సోలుచు నసియాడ ◆ సొంపులుజాఱ
వదనంబు చెమరింప ◆ వసుధేశుఁ డున్న
సదనంబునకునేగి ◆ జననాథ నేఁడు
నాపుత్రరత్నంబు ◆ నఱికింప నీకు
నేపాప మొనరించె ◆ నింతిమాటలకుఁ
గొడుకుఁ గోయించిన ◆ క్రూరాత్ముఁడనుచు
వడి నొవ్వఁ దిట్ట రే ◆ వసుధలో జనులు
కావరంబున నీవు ◆ గానవు నీతి

త్రోవఁ జిత్రాంగిమం ◆ దులు తలకెక్కె
భూమిలో రాజులు ◆ భోగభామినుల
పై మోహ మెసఁగిన ◆ పదివేల నిచ్చి
పుచ్చిరి కాదేని ◆ పుత్రుఁ గోయింప
నిచ్చిరే యెందైన ◆ నిటు దయమాలి
గురుభక్తినిరతుండు ◆ కోమలాంగుండు
దురితదూరుండు బం ◆ ధురమానఘనుఁడు
వినయభూషణుఁ డతి ◆ విమల మానసుఁడు
గొనబులప్రోడ నా ◆ కొడు కిట్టికాంత
కేమిటి గొడఁబడె ◆ నిది కపటంబు
కామాంధుఁడవు కన్ను ◆ గానవుగాక
యింకనైనను బుత్రు ◆ నీ తప్పుఁగాచి
ఝంకించివిడువుము ◆ చాలు నొండేని
పురమువెల్వడఁగొట్టి ◆ పొమ్మన్ననైన
నరిగి తాపసవృత్తి ◆ నడవులలోన
నాకులు భక్షించి ◆ నర్థి నుండెదము
నాకోడలును నేను ◆ నా కూర్మిసుతుఁడు
దూరభూములకైనఁ ◆ దొలఁగిపోయెదము
ఈరాజ్యభోగంబు ◆ లింతియే చాలు
ననుచు రత్నాంగి దుః ◆ ఖావేశమునను
తను దూఱునప్పు డా ◆ ధరణివల్లభుఁడు
తెలిసియుందెలియని ◆ తెఱఁగున నుఱకె
తలవంచి చిత్రాంగిఁ ◆ దలఁచుచునుండె
నప్పుడు రత్నాంగి ◆ యంతరంగమున
ముప్పిరిగొను శోక ◆ మును నోర్వలేక
దాసీజనంబులు ◆ తగిలి యేతేర
నాసూనుఁ జూపరే ◆ నయనాభిరాము
నని ప్రలాపించుచు ◆ నాత్మజునగరు
చని చొచ్చిపోవ నా ◆ సమయంబునందు
నలి నింద్రజిత్తుండు ◆ నాగపాశముల
బలిమిఁ గట్టిన రామ ◆ భద్రుని పగిది
నలఁగుచుఁ దలఁచుచు ◆ నాత్మదైవంబు

సొలయుచునలయుచు ◆ సొంపేదియున్న[25]
పుత్రరత్నముఁ జూచి ◆ పురపురఁబొక్కి
చిత్రాంగియింతగాఁ ◆ జేసెనే యనుచుఁ
జెందమ్మిరేకులఁ ◆ జెనకు హస్తముల
ముందలయునుమొగం ◆ బును మోదుకొనుచుఁ
గొడుకుపైఁ బడియేడ్చి ◆ కొంత దడవునకుఁ
గడలేనిశోకాగ్నిఁ ◆ గ్రాలుచుం బలికె
నిది యేమి చేసితి ◆ వే తండ్రి యనుచు
మదిమదినుండి యీ ◆ మరు లేల పుట్టెఁ
గనివెంపదే తల్లి ◆ గాదె చిత్రాంగి
ననుఁ జూచినట్లు మ ◆ న్ననఁ జూడవలదె
తొల్లినీయెడ లేని ◆ దుష్టవర్తనము
చెల్లఁబోనేఁ డేల ◆ చేకురె నిట్లు
పరభామపైఁజూపు ◆ పరపనివారు
పరులమర్మము లెత్తి ◆ పలుకనివారు
తలపోయఁగా దేవ ◆ తాసము లనుచుఁ
బలుకువాక్య సితిఁ ◆ బాటింపవలదె
కొడుక నిన్నెప్పుడు ◆ గుణవంతుఁ డనుచు
నుడుగుచు నుందు నా ,◆నోరు నేఁ డణఁగె
..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
దండినోములు నోచి ◆ తగ గొడ్డువీఁగి
కడపటనీయట్టి ◆ కల్యాణశీలుఁ
గొడుకుగాఁ గని ప్రాపు ◆ గుడువలేనైతిఁ
జన్నిచ్చి యింతగా ◆ సవరించి పిదప
నిన్నుఁ జిత్రాంగికై ◆ నేఁడు గొంపోయి
యెఱుక మాలిన వసు ◆ ధేశుని బారి
గొఱియఁగా నొప్పించి ◆ కోయింప వలసెఁ
బసిబిడ్డనాఁడు నీ ◆ పాద పద్మముల
నెసఁగు వ్రాతలఁ జూచి ◆ యెఱిఁగినవారు
ఎన్నిక మీఱ న ◆ నేక కాలంబు
చెన్నొంద మను నని ◆ చెప్పిరి గాని
నడు రేయి కరచర ◆ ణంబుల కోఁత
వడి చత్తు వని యేరుఁ ◆ బలుకరు తనయ

చావులులేవొకో ◆ [26]చనద యీ రీతి
దేవతలకు నైనఁ ◆ [27]దీరదె వగవ
విధి దిట్టు గుడువఁగా ◆ [28]వెదకె ని న్నిట్లు
వధకు నీ వర్హుండ ◆ వాని గుణాధార !
ఎవ్వరిఁ దొల్లి నే ◆ నేమి చేసితినొ
యివ్విధంబున వేఁగ ◆ నిప్పుడు వలసె
నని యిట్లు శోకాగ్ని ◆ నలయుచు నున్న
తన తల్లి వదనంబు ◆ తప్పక చూచి
యమ్మనేఁ జిత్రాంగి ◆ నంత రంగమున
నెమ్మితో భావింతు ◆ నీ మాఱుగాను
మాయమ్మ నన్నుఁ గా ◆ మాతురంబునను
డాయ వచ్చినఁ బొందఁ ◆ దగదు పొ మ్మనుచుఁ
బలుదెఱంగుల వేడఁ ◆ బడినఁ గైకొనక
తొలఁగి వచ్చితిఁ గాని ◆ దోష మే నెఱుఁగఁ
బోలు పొందెఱుఁగక ◆ భూవల్ల భుండు
ఆలిమాటలె నిక్క ◆ మని మది నమ్మి
యొప్పగించక నన్ను ◆ నూరక చంప
నొప్పించె సభవారు ◆ నున్నట్లు చంప
నరిమురిఁ దోఁచిన ◆ యప్పటి కొలఁది
నొరగ నాడిరి శివుఁ ◆ డొక్కఁడే యెఱుఁగుఁ
గన్న మోహంబునఁ ◆ గ్రాఁగుచు నీకు
నిన్నీ చదుదన్‌శ ◆ నిటకు రావలసె
మేదినీవిభు నాజ్ఞ ◆ మీఱి పోరాదు
రాదువో యిట్లుండ ◆ రత్నాంగి నీకుఁ
గలనైన నవనీశుఁ ◆ గల్లరి యనకు
చెలిమిఁ దప్పకు మమ్మ ◆ చిత్రాంగి దేవి
నాకూర్మి లెంకల ◆ నాయిష్టసఖుల
నాకయివడిఁ జూడు ◆ న న్నింక మఱవు
మడలక విచ్చేయు ◆ మని బుద్ధిచెప్పి
యడుగులం బడియున్న ◆ యక్కుమారకుని
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి ◆ కోరి దీవించి
[29]పుచ్చిహాయని యేడ్చె ◆ పోవుచు బిట్టు

ఇంత పాపముసేసె ◆ నే మహీనాథుఁ
డింతటితోఁబాసి ◆ తే పట్టి యనుచుఁ
దలయూఁచి సుతుమోము ◆ తప్పక చూచి
తలవరులకు నెల్లఁ ◆ దగ నప్పగించు
నక్కఱం బచరించు ◆ నక్కునం జేర్చుఁ
జెక్కిలి నొక్కుచుఁ ◆ జెరఁపలు దీర్చుఁ
బోయెద నని లేచుఁ ◆ బోలేక మగుడుఁ
బోయెఁ బ్రాణము లని ◆ పొగిలి మూర్ఛిల్లుఁ
గ్రమ్మఱం దెలివొందుఁ ◆ గన్నీరు నించు
ముమ్మడి గొనుపుత్ర ◆ మోహంబుకతన
నట చనంగా లేక ◆ హాయని నిలుచుఁ
గటకటయని వగ ◆ గతుల రత్నాంగి
పొడగన్నవా రెల్లఁ ◆ బురఁబురఁబొక్క
నడలుచు మగుడి గృ ◆ హంబున కరిగి
[30]పుడమిపైఁ బలుమాఱు ◆ పొరలుచు బిట్టు
కొడుకుఁ బ్రలాపించు ◆ కొనుచుండె నంత
నడురేయి యగుటయు ◆ నగరరక్షకులు
తడయక సారంగ ◆ ధరుని బంధములు
సడలించి వీడిన ◆ జడఁ జక్క నల్లి
మొగలిఱేకులు మీఁద ◆ మురువుగాఁ జెరివి
మృగనాభితిలకంబు ◆ మెచ్చుగాఁ దీర్చి
పలుచగా గుంకుమ ◆ పంకంబు నలఁది
చెలువారు నెఱిపట్టు ◆ చీరఁ గట్టించి
పొలుపొంద భూషణం ◆ బులు చక్కదిద్ది
కలువపువ్వులదండ ◆ గళమున వేసి
[31]వెలయఁ గప్పురముతో ◆ వీడెంబు లొసఁగి
పటుఖడ్గ ఖేటక ◆ పాణులై యతని
నటు తోడుకొనుచును ◆ నరుగు నవ్వేళ
తఱచుగా శశముల ◆ తఱచుఁ జెండాడి
[32]తొఱుఁగు రేచులును క్రం ◆ దుగ గుంపుగూడి
యఱచు నక్కలు నిట్టు ◆ నట్టుగ బిట్టు
పఱచుతోడేళ్లును ◆ బటు[33]కుశాగ్రములఁ

గఱచుదుప్పులవేగఁ ◆ గఱచి బొండుగలు
విఱిచి నెత్తురుద్రావు ◆ వేఁగి వలములు
మెఱుఁగుఁగోఱలుదోఁప ◆ మెడనెత్తి నోళ్లు
దెఱచి పై నుఱికిన ◆ దిశదప్పఁదాఁట
మఱచి మల్లడిగొను ◆ మన్ను బోతులను
గఱచి గర్జించెడి ◆ కడిదిబెబ్బులులు
వాఁగువంతల నూరి ◆ వఱలునీరంబు
కేఁగునేఁదులఁ బట్ట ◆ నెడనెడ వెదకి
మాఁగుదుప్పులఁ బట్ట ◆ మార్కొనలేక
తూఁగుకాకులమెడ ◆ తునుమ నొండొండ
మూఁగునులూక స ◆ మూహభారమున
వీఁగుబంధురవట ◆ వృక్ష శాఖలను
దూఁగునుయ్యలఁబట్టి ◆ [34]తూఁగుటుయ్యాల
లూఁగునెలుంగుల ◆ నోర్చుమృగములు
జిఱుకులుగొనిపాఱి ◆ చీలు చిమ్మటలు
నఱిముఱి వాపోవు ◆ నట్టి కాఱడవి
నలుగక వడిఁ జొచ్చి ◆ యానట్టనడుమఁ
గులపర్వతముఁబోలు ◆ కొండ చేరువను
నిలిపి కొందఱు వోయి ◆ నృపుని ముమ్మాఱు
సెలవులు గొని వధ ◆ శిలమీఁద నునిచి
కడునొప్పు తొడవులు ◆ గ్రమమునఁదిగిచి
పొడవైన యతనిమూఁ ◆ ఫులు జానువులను
గడచుచేతులు నలి ◆ కము గల నడము
వెడఁద యురంబును ◆ వీనులఁ దాఁకు
నిడువాలుఁ గన్నులు ◆ నీలంపుఁగురులు
నుడురాజబింబంబు ◆ నొరపైనమోము
తప్పక వీక్షించి ◆ తల లూఁచి మతుల
ముప్పిరిగొనుశోక ◆ మున నశ్రు లొలుక
య తలారులు చేతు ◆ లాడక వికల
చేతస్కులై కొంత ◆ సే పూరకున్న
వారలం గనుఁగొని ◆ వసుధేశసూనుఁ
డీరీతి నెడసేయ ◆ నేల భూవిభుఁడు

సెలవులు మూఁడు ని ◆ చ్చినమీఁద మీరు
నలినాసనుఁడు మున్ను ◆ నా నిటలమున
వల నొప్ప నిట్లుగా ◆ వ్రాసి పుట్టించెఁ
దొలఁగునె తొల్లింటి ◆ దుష్కర్మఫలము
మీరు నాకును నేను ◆ మీకు నెన్నఁడును
వైరంబు చేసిన ◆ వారము గాము
మీరు నాబిడ్డలు ◆ మీకుఁ బాపంబు
చేర దేలికపంపు ◆ చేయంగఁ బూని
కొలిచినవారికిఁ ◆ గొంకక తండ్రిఁ
బొలియింపు మన్నను ◆ బొరిగొనవలయు
అలుకక చేయుఁ డే ◆ మైనను జేయఁ
గలచేఁత నావుడు ◆ గలఁక పోవిడిచి
తలవరు లప్పు డా ◆ తనయుని తోడఁ
దలపుము నీ యిష్ట ◆ దైవంబు నన్నఁ
దల్లిదండ్రుల నాత్మఁ ◆ దలఁతునా మున్ను
పల్ల దంబునఁ గో యఁ ◆ బంపినవారు
ధర్మదేవత నేను ◆ దలఁచెద నన్న
నిర్మలమై నది ◆ నేఁ టితో నణఁగెఁ
దల్లియుఁ దండ్రియు ◆ దైవంబునాకు
నెల్లభంగుల జగ ◆ దీశ్వరుండైన
యా [35]మహా దేవుఁడే ◆ యని మనం బనెడి
తామరపువ్వులోఁ ◆ దరుణేందు ధరుని
శంకరుఁ బార్వతి ◆ స్తనకుంభలిప్త
కుంకుమాంకితవక్షుఁ ◆ గొమరార నునిచి
తరలక యుండె న ◆ త్తఱి వాఁడి మీఱఁ
కుఱుచకత్తులు నూఱు ◆ కొని కుమారకునిఁ
గటికివారలు చేరి ◆ కాళ్లుఁ జేతులును
బటువుగా నొక్కటఁ ◆ బట్టి గుత్తులకు
వఱదలై నెత్తురు ◆ వడియ నందంద
గఱగఱఁ దఱిఁగినఁ ◆ గప్పైన నెగులు
నుప్పతిల్లిన వెత ◆ నుర్విని గీళ్లు
తప్పినబొమ్మచం ◆ దంబున వ్రాలి

వడిమూర్ఛ మునిఁగిన ◆ పాపనిం జూచి
యడరుచు తలవరు ◆ లాచావుచేటు
కని పోద మనుచు న ◆ క్కడఁ జేరువందు
మునుమైన పొదలలో ◆ మునిఁ గుండి రంత
నొదవిన మూఛన్‌దా ◆ నొయ్యనఁదెలిసి
వెదకి నల్దెసలును ◆ వీక్షించి యచట
నెవ్వరిఁబొడగాన ◆ కిచ్చలో భీతి
నివ్వటిల్లంగ నా ◆ నృపకుమారుండు
భోరునఁ గన్నులఁ ◆ బొడమిన బాష్ప
ధారలు వదనప ◆ ద్మంబుపైఁ జాఱఁ
దొరఁగునెత్తుటఁ దొప్పఁ ◆ దోఁగిసన్నంపు
విరిసిన నెఱివేణి ◆ వీపుపై నంట
నుదుట దట్టంబుగా ◆ నూల్కొన్న చెమటఁ
జెదరి కుంతలములు ◆ చీకాకుపడఁగ
నా తీవ్రవేదన ◆ నసువు లూఁటాడ
హాతాత హామాత ◆ యనుచు నందంద
భూతలంబునఁ బడి ◆ పొరలుఁ బల్మారు
వాత లాలలు గ్రమ్మ ◆ వాపోవు మిగుల
నాతురంబున బొందు ◆ నవయవంబులను
....... ....... ....... ...... ....... ......... ...... ......
బడిబడి పంక్తులై ◆ పాఱు చీమలను
దుడువఁగోసిన గండ్లఁ ◆ దోఁగి జుమ్మనుచు
నేఁపికాట్లాడిన ◆ యీఁగలఁ బోవఁ
జోఁపఁ జేతులులేక ◆ సుఱ్ఱున స్రుక్కి
పొరిఁబొరి రక్తంబు ◆ పొలుసుకంపునకు
నరుదెంచు మృగముల ◆ నలిగి యదల్పఁ
ద్రాణయు లేకుండి ◆ తలవరులార !
ప్రాణంబు లుండ వీ ◆ పాటి మీరైన
నేతెంచి తలద్రెంపుఁ ◆ డే నొప్పి కోర్వ
భూతసంఘములార! ◆ పొరిపుచ్చుఁ డింక
నీనొప్పి కే నోర్వ ◆ నెడపక వచ్చి
పూని చంపరె మృగ ◆ పుంజంబులార !
చాలనే దుఖంబు ◆ సైరింపఁ జాలఁ
గాలువరే తన్నుఁ ◆ గార్చిచ్చులార !

అనియని విలపించు ◆ నలమరి వగచుఁ
దనమది నొక్కింత ◆ ధైర్యంబు నిలిపి
పాయునే తనకర్మ ◆ ఫల మని వగచు
మాయురే చిత్రాంగి ◆ మా యని పొగడుఁ
గటకట ! దైవమా ! ◆ కరుణింపు మనుచు
నిటు చేయఁ దప్పు నే ◆ నేమి చేసితిని
మరులువెట్టినవారి ◆ మాయలుగాక
పరికింప దైవ మే ◆ పట్టునఁ గలఁడు
అనుచు దైవము దూఱు ◆ చక్రభాగమునఁ
దునకలైపడిన చే ◆ తులఁ బదంబులను
నలిఁ జూచి మంత్రినం ◆ దనుని వాక్యములు
తలపోసి తలయూఁచి ◆ తార్కాణ మిచ్చి
యొకమరి నవ్వు వే ◆ ఱొకమరి యేడ్చు
నొకపరి పాడు వే ◆ ఱొకపరి మూల్గు
నొకపరి గిరిశ ! మ ◆ హోరగాభరణ !
సకల లోకేశ్వర ! ◆ శశికళాకల్ప !
పురహర సితికంఠ ! ◆ భూతేశ ! నీవె
శర ణని యీరీతి ◆ సంతాప మందు
నవనీశుసుతుతోడ ◆ న[36]నుకంప మీఱ
దివినుండి యాధర్మ ◆ దేవత పలికె
నో కుమారక ! వల ◆ దుడుగుమీ వగపు
నీకు నీవిధి తప్ప ◆ నేర దె ట్లనిన
వినుము నీతొల్లింటి ◆ వృత్తాంత మెల్ల
వినిపింతు నని పల్కె ◆ విస్మయం బొదవ
నవనిపైఁగౌశాంబి ◆ యను పట్టణమున
ధవళచంద్రుండను ◆ ధరణీశుఁ డేలు
ననుపమమతులు జ ◆ యంతసుమంతు
లను మంత్రివరు లిద్ద ◆ ఱతనికిఁ గలరు
ఆయిరువురలోన ◆ ననఘు సుమంతుఁ
బాయక మన్నించుఁ ◆ బార్థివేశ్వరుఁడు
దానికి ననిశంబు ◆ దనరుసుమంతుఁ
బూని జయంతుఁ డె ◆ ప్పుడుఁ జంప నలుగు

నటు గొంతకాలంబు ◆ నరిగినపిదపఁ
గుటిలవిచారి ద ◆ క్షుఁడు జయంతుండు
కువలయేశ్వరుకూర్మిఁ ◆ గొనసాగఁ గూర్చు
భువనసుందరియను ◆ భోగిని వరవుఁ
గాకినియనుదానిఁ ◆ గడుబ్రియం బొదవ
నేకాంతమునఁ దన ◆ యెడకు రప్పించి
మాడలు బహువిధ ◆ మణి భూషణములు
వీడంచు వన్నెల ◆ వెలయుపుట్టములు
నుల్లమారఁగఁ గట్ట ◆ నునిచియాయింతి
పల్లవకోమల ◆ పాణిపద్మములు
తనహస్తమునఁ బట్టి ◆ దగ్గఱఁ దిగిచి
విను మని పలికె నో ◆ విమలేందువదన
పతి నన్ను నెప్పుడుఁ ◆ బలుచగాఁ జూచు
మతిమంతుఁడనుచు సు ◆ మంతు మన్నించు
దాన వాఁ డెంతయు ◆ దర్పించి కన్ను
గానకయున్నాడు ◆ గావున నతనిఁ
జెఱుచు నుపాయంబుఁ ◆ జింతించి నీకు
నెఱిగింపఁ బిలిచితి ◆ నేరీతి నైన
నుడుగక కనుపెట్టి ◆ యుండి యేమరిన
యెడ సుమంతుని చెప్పు ◆ లెసఁగ లాగించి
కొనిపోయి పరులు గ ◆ న్గొనకుండ మొఱఁగి
తనరారు భువనసుం ◆ దరి పాన్పు క్రిందఁ
గలఁగక యునిచి నా ◆ కంటిలో నెరను
తొలఁగించి నీవు నా ◆ తుందుడు కార్పు
మని వేఁడుకొనుటయు ◆ నటుచేయఁ బూని
తన కెడరైన న ◆ త్తఱి నొక్కనాఁడు
వంచన మీఱ భూ ◆ వల్లభుదేవి
మంచంబు క్రింద సు ◆ మంతుపాదుకలు
నించి యున్నంత వ ◆ న్నెలు పచరించి
యంచితలీల న ◆ య్యబ్జాక్షికడకు
వచ్చి పాంచాలుని ◆ వడువున నపుడు
పచ్చవిల్తునికేళి ◆ బ్రమద మొనర్చి
యొయ్యన తమ్ములం◆ బుమియ మస్తకము

సయ్యన వంచి మం ◆ చముక్రింద మిగుల
నొప్పారు వన్నెల ◆ యుద్దంబు గాంచి
చెప్పు లెవ్వరి వివి ◆ చెప్పు లె మ్మనిన
నుల్లంబు ఝల్లని ◆ యులికి యాయబల
వెల్లనై కన్నీరు ◆ వెడల నయ్యువిద
వడగాలిఁ గంపించు ◆ వనలతఁ బోలి
నొడలు వడంక దా ◆ నొండాడ లేక
పుడమి నంగుష్ఠాగ్ర ◆ మున వ్రాయుచుండె
నడరుకోపంబున ◆ నటఁ బాసి విభుఁడు
చనుదెంచి కొలువుండు ◆ సచివముఖ్యులను
బనిముఖంబులవారి ◆ బంధుల బుధుల
రప్పించి యాపాద ◆ రక్షలు వేగఁ
దెప్పించి వారల ◆ దిక్కు వీక్షించి
యెఱిగింపుఁ డీచెప్పు ◆ లెవ్వరి వనిన
వెఱఁగుసంశయములు ◆ వెఱపును గదుర
ముడిఁగి యొండొరులమో ◆ ములు చూచుకొనుచు
బుడుబుళ్లఁ బోవున ◆ ప్పుడు వోలఁ జూచి
కాలకేతుం డను ◆ కడిఁదితలారి
కే లడఁగించి యా ◆ క్షితితలేశ్వరుని
చెవి డాసి తెలియఁ జూ ◆ చితిఁ బొంకనేల
యివి సుమంతునిచెప్పు ◆ లిది దప్ప దనినఁ
గనుఁగవకెంపులు ◆ గదుర సుమంతుఁ
గనుఁగొని వసుమతీ ◆ కాంతుండు వలికె
నోదురాత్మక ! మది ◆ నొరుల నమ్మంగఁ
గా దని విశ్వాసి ◆ గా నిన్ను నమ్మి
సారమైనట్టి యా ◆ సకలసామ్రాజ్య
భారంబు నీయందె ◆ పాటించి నిలిపి
చంపఁ బెంపను నీకుఁ ◆ జన విచ్చి భాగ్య
సంపన్నుగాఁ జేసి ◆ సమ్మదం బొదవ
నన్ని వేళల నీకు ◆ నవసరం బిచ్చి
మన్నించుటకు ఫల ◆ మా యిది యనుచు
నీతిజ్ఞులను ధర్మ ◆ నిర్మలమతుల
భూతలపతి చూచి ◆ బుద్ధి మీ రితని

కర్మంబునకు గతి ◆ గావింపుఁ డనిన
ధర్మశాస్త్రముఁ జూచి ◆ ధరణీశు కనిరి
మొదల వీనికిఁ గల ◆ మొల్ల మంతయును
వదలక కొనిపోయి ◆ వడి నడురేయి
విఱిచి కట్టుక పోయి ◆ విపినంబులోన
నఱకఁ బంపుము చర ◆ ణములఁ జేతులను
అనిన మీ రటు సేయుఁ ◆ డని తలవరులఁ
గనుఁగొని సెల విచ్చి ◆ కాంతఁ గూపమున
నూకించి పిదపఁ దా ◆ నును గొల్వు విడిచె
నాకమలాప్తుండు ◆ నపరాబ్ధిఁ గ్రుంకె
నత్తఱిఁ దలవరు ◆ లామంత్రిముఖ్యు
నొత్తిబంధించి మ ◆ హోగ్రతం బొంది
తనయులు నాలును ◆ దల్లి బంధువులు
జనులును ఘనశోక ◆ జలధిలో మునుఁగ
నాపూతవర్తను ◆ నపరాధహీను
వాపోవ నా ఘోర ◆ వనభూమిలోనఁ
గడఁగి చేతులుఁ గాళ్లు ◆ గనెలుగాఁ గోసి
విడిచిన నడలుచు ◆ విశ్వేశ! గిరిజ!
నగరాజ కోదండ! ◆ నన్న కారణము
పగగొని కృపమాలి ◆ పట్టి కోయింప
నీ కపటోపాయ ◆ మెవ్వఁడు వన్నె
[37]నాకుటిలాత్ము న ◆ ట్టడవిలో నిట్లు
గోఁతలఁబడి గోడు ◆ కుడువని మ్మనుచు
నాతీవ్రవేదనఁ ◆ బ్రాణముల్ విడిచె
నా జయంతుఁడ వీవు ◆ నాసుమంతుండు
రాజమహేంద్ర భూ ◆ రమణుఁ డీరీతి
నేకాలమున నెవ్వఁ ◆ డేది గావించు
నాకాలమున వారి ◆ కటు కాక పోదు
కావునఁ దొల్లి దు ◆ ష్కర్మంబుక తన
నీవిధి పాటిల్లె ◆ నింతియె కాని
యీజన్మమందు నీ ◆ యెడఁ గల్లలేదు
రాజనందన మేలు ◆ రాఁగల దింక

జేరువ నున్నది ◆ సిద్ధపదంబు
శారీరసిద్ధియు ◆ సమకూరు ననుచుఁ
జెప్పి యాయశరీరి ◆ చెచ్చెర నణఁగె
నప్పుడు తలవరు ◆ లా విధం బెల్లఁ
జొప్పడ విని రాజు ◆ సుదతిమాటలకుఁ
..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
జెల్లఁబో పాపంబు ◆ చేసి కోయించెఁ
గల్లరిగానియీ ◆ ఘనపుణ్యు నకట
కలదె వివేకంబు ◆ కామాంధున కని
సొలయుచుం జని పురిఁ ◆ జొచ్చి యుండఁగను
జేగురుగా మేనఁ ◆ జెందిన కెంపు
ప్రోగిడి దిగ్వధూ ◆ ముఖదర్పణములఁ
దళతళమని తెల్పు ◆ దలకొన వెలచి
వలరాజు శరములు ◆ వాఁడిగా దిద్ది
యుదధికి మిన్నంద ◆ నుబ్బు గావించి
పొదలు జక్క వల గ ◆ బ్బులు దొట్రుచేసి
మరి చకోరములకు ◆ మరులు పుట్టించి
..... ..... ..... ..... ..... ..... ..... .... ......
తోయజంబుల నేఁచి ◆ తొగల నిక్కించి
యాయిఱ్ఱి కందు మే ◆ నందు చెన్నొంద
వెలఁదిమించులకుప్ప ◆ వెన్నెల లప్ప
కలువల యొప్పు చీఁ ◆ కటి మూఁకవిప్పు
రమణుల కను మించు ◆ రసికుల పొంచు
అమృతంబు ముద్ద తి ◆ య్యంబుల లొద్ద
విరహుల బలుమంట ◆ విబుధుల పంట
సురతంబులకు నింట ◆ సొబగుల వెంట
హరు తలపువ్వు సౌ ◆ ఖ్యంబుల కొవ్వు
చిరయశోధార రా ◆ జీవాప్తు మేర
గడలిరాయని పట్టి ◆ గగనంబు ముట్టి
పొడిచెఁ జల్లనివేల్పు ◆ భువనముల్ పొగడ
నప్పుడు మత్స్యేంద్రుఁ ◆ డాకొండనుండి
యొప్పారు గుహలలో ◆ నుండి దా వెడలి
రాకుమారునియార్త. ◆ రవము కర్ణముల

సోఁకిన నాలించి ◆ సోద్దెంబు నొంది
యి మ్మహాటవిలోన ◆ నీ నడురేయి
నిమ్మహి వినవచ్చె ◆ నీ యొంటియేడ్పు
కరుణ వాటిల్ల న ◆ క్కడకేగి చూచి
తిరిగివచ్చెదఁగాక ◆ దీనికే మనుచుఁ
గుఱుచకెంజడల లోఁ ◆ గొప్పుగా నివిరి
చిఱుకొమ్ము లలవడఁ ◆ జెరివి వెన్నెలలు
మునుముగా ననలొత్తు ◆ భూతి మైనెల్ల
నునుపుగా నలఁది వీ ◆ నులఁ గ్రొత్తమించు
దళుకొత్తు చంద్రకాం ◆ తంపుఁగామాక్షు
లలవడ నించి క ◆ ట్టాణి ముత్యములఁ
[38]బోలఁజాలెడు శంఖు ◆ పూసలమాల
మాలికగాఁ బూని .◆ మఱి సమానంబు
గౌళరుద్రాక్షలు ◆ గరుడపచ్చలును
జాలఁగూర్చిన పేరు ◆ జాతిగాఁ బూని
కడునొప్పు పద్మరా ◆ గంబులడాలు
కడలొత్తు నెరిపట్టు ◆ గంత వహించి
యలఘువిచిత్ర ది ◆ వ్యౌషధమణులు
గల కక్షపాలయుఁ ◆ గరపంకజమున
లాగైన పటికంపు ◆ లాతంబు వింత
బాగుగాఁ గైకొని ◆ పచ్చవన్నియలఁ
బసను మించిన యోగ ◆ పట్టె బిగించి
మిసమిసమని జిగి ◆ మీఱెడు పొడల
నొఱపై న యొడ్డాణ ◆ మొనర బిగించి
మెఱుఁగులు గిఱికొని ◆ మెఱయు దంతముల
పోగుల రవము గొ ◆ బ్బున మ్రోయ మెట్టి
యాగిరి డిగ్గి య ◆ ల్లల్లన వచ్చి
యొడలినెత్తుటఁ దోఁగి ◆ యొదవిననొప్పిఁ
బుడమితో నిజముఖాం ◆ భోజంబు మోపి
పనవుచునున్న భూ ◆ పాలకుమారుఁ
గనుఁగొని వీనులఁ ◆ గరపంకజములఁ
జేరిచి గురునాథ! ◆ శివ! శివా! వీని

మారుసన్నిభు సుకు ◆ మారుఁ గుమారు
నీ విధంబునఁ గోయ ◆ నెంతటి తప్పు
గావించెనో చెప్పఁ ◆ గా వింద మనుచుఁ
గదిసి యోవత్స! యె ◆ క్కడి వాడఁ వొంటి
విది యేల వచ్చె నీ ◆ కీ దురవస్థ
చెప్పుమా యనవుడుఁ ◆ జెవులలో నమృత
ముప్పతిల్లెడు వేడ్క ◆ నొయ్యన లేవ
ముంజేతు లూఁతగా ◆ ముఖ మెత్తి నేత్ర
కంజాతములు విచ్చి ◆ కమలాప్తతేజు
నానాథముఖ్యుని ◆ నతులప్రభావు
భూనాథసూనుండు ◆ పొడగాంచి మ్రొక్కి
తనకరదండముల్ ◆ దలమీఁదఁ జేర్చి
వినయ మేర్పడఁ బల్కె ◆ వినుమ యోతండ్రి
..... ..... ..... ..... ...... ..... ...... ...... ...... ......
యనఘ రాజేంద్రమ ◆ హేంద్రభూపాలు
తనయుండ సారంగ ◆ ధరుఁడనువాఁడ
నని తనవృత్తాంత ◆ మంతయుఁ జెప్పి
వెకలినై నాపాలి ◆ [39]విధి ద్రిప్పుకొలుప
నొకపావురము వెంట ◆ నొంటిమై నున్న
పినతల్లి యింటికిఁ ◆ బ్రీతి నేగుటయుఁ
గనుఁగొని యాయమ్మ ◆ కామాతురమునఁ
దనుఁబట్టుటయు నీవు ◆ తల్లివేఁ గొడుకఁ
జనునె నీకీ దుర్వి ◆ చారము మీఁద
నేమిటఁ బెడవాయు ◆ నీపాతకంబు
భూమీశుఁ డెఱిఁగినఁ ◆ బొరిగొలిపించు
వలదు పొమ్మని తన ◆ [40]వంకకురాక
తొలఁగివచ్చినఁ తన ◆ దోష మంతయును
నాకల్లగా నర◆• నాథుతోఁజెప్పి
యీక్రియఁగోయించె ◆ నింతియకాని
పరికింప నాయెడఁ ◆ బాపంబు లేదు
పరమేశునాన నీ ◆ పాదంబులాన
సుతుఁ డని దయలేక ◆ సుదతిమాటలకు

మతి దప్పి కోయించె ◆ మనుజనాయకుఁడు
నరములు దివియఁ బ్రా ◆ ణము పట్ట రాదు
పురువులు దొలువంగఁ ◆ బొరిపొరిఁ దుడువఁ
జోఁపఁజేతులు లేవు ◆ చూడుమా మొండ్లు
భూపాలసుతుని కీ ◆ పోఁడిమి వచ్చెఁ
[41]దఱిసి పాదములు హ ◆ స్తంబులుఁ బట్టి
తఱుఁగు వారలఁ దన ◆ తలయును ద్రుంప
వేఁడుకోనైతి నే ◆ వెఱచుచు నిన్ను
వేఁడెద జీవంబు ◆ వెళ్లిపోఁ దనకు
మందుగల్గిన నిచ్చి ◆ మన్నించు నిన్నుఁ
జెందదు పాపంబు ◆ సిద్ధయోగీంద్ర !
అని తెలివొంది మ ◆ హాత్మ నీపెంపు
మనమునఁ దలపోయ ◆ మఱచి యీ రీతి
నుడివితి నా తప్పు ◆ లోఁగొని నన్నుఁ
గడుఁ గృప మీఱ నీ ◆ కడగంటఁ జూచి
నాతప్పు సైరింపు ◆ నా తల్లిఁ దండ్రి .
[42]వైతివి నీవె నా ◆ యార్తానురక్ష
నీవెవ్వరయ్య మ ◆ న్నించి యీవేళ
నావగ పార్ప మ ◆ నంబునఁ జూచి
విచ్చేసినట్టి శ్రీవి ◆ శ్వనాథుఁడవొ
నిచ్చలుఁ బ్రియమార ◆ నీగిరిగుహలఁ
జెలఁగుచు వసియించు ◆ సిద్ధముఖ్యుఁడవొ
తలపోసి తెలియ నా ◆ తరమె నీ మహిమ
చూడుమా నీగాలి ◆ సోఁకి నామేన
నూడుగాఁ బర్వుచు ◆ నున్న యీనొప్పి
నడఁగించె నిచ్చోట ◆ నయ్య యొక్కింత
తడ వుండవేయని ◆ దైన్యంబు దోఁపఁ
బలుకు రాకొమరుని ◆ పలుకుల కాత్మ
నలయుచుఁ గదిసి మే ◆ నల్లన నిమిరి
యడలకు మన్న నీ ◆ కకట ప్రాణములు
విడువ నేమిటి కిటు ◆ విను మున్ను వాలిఁ
బొంచివేసిన దోష ◆ మున వేటువడఁడె

చెంచుచేఁ గృష్ణుఁడు ◆ చేసిన కర్మ
ఫల మేరినైనఁ గు ◆ డ్పక దైవమేల
తొలఁగిపోనిచ్చు నెం ◆ దుసు శరీరికిని
బరువడి ననుభవిం ◆ పక పోవరాదు
సురుఁగక నొకవేళ ◆ సుఖదుఃఖములను
గావున శౌర్యంబు ◆ గలిగి శంకరుని
భవునిఁ బార్వతిపతి ◆ భక్తవత్సలునిఁ
గృత్తివాసుని సుధా ◆ కిరణక లాపుఁ
జిత్తంబులోన సు ◆ స్థిరముగా నిలిపి
పటుబుద్ధినుండు మా ◆ పదలెల్ల నణఁగు
నిటుగాన నినుఁ జెందు ◆ నిష్టసౌఖ్యములు
అని బుజ్జగించుచు ◆ నను వొంద నెత్తి
కొనిపోయి యల్ల నఁ ◆ గువలయకుముద
జనితసౌరభముల ◆ చలు వగ్గలించి
తనదునీరున యిగ ◆ తాళించుచున్న
దొనఁ జేర్చి మేను ◆ నెత్తురు వోవఁగడిగి
తనివివో నుదకంబుఁ ◆ ద్రావించి పిదపఁ
గనుదోయిఁ దడిపి యం ◆ గములకు నుసురు
దనుపున రప్పించి ◆ తగగ్రుచ్చియెత్తి
కొనిపోయి తా నుండు ◆ గుహలోన నునిచి
మునుగ్రోలఁ జిక్కిన ◆ మొదవులపాలఁ
బరితృప్తుఁ జేసి యా ◆ పార్థి వపుత్రు
కరచరణోత్పత్తి ◆ గలిగించు వెరవు
ననిచినకృప మీన ◆ నాథుఁ డుల్లమున
నొనరి విచారింపు ◆ చుండ నావేళ
నంతకంతకు వెలుఁగ... .... .... లలు
వింతగాఁ జంద్రుండు ◆ వెలవెలఁబాఱెఁ
గంతులుదక్కెఁ జ ◆ క్కని చకోరములు
కంతుపూ విల్లును ◆ గవిసెన నించెఁ
దఱచుగాఁ జుక్కలు ◆ తలచూప కణఁగెఁ
దఱఁగె వెలుఁగు గృహాం ◆ తరదీపములను
గలయఁ గుక్కుటకంఠ ◆ కాహళుల్ మొఱసెఁ
బులుఁగు లెల్లను బొరి ◆ పొరి నెలుఁగించెఁ

బరిమళంబులు గ్రోల ◆ భ్రమయించు మధుప
గరుదంచలంబులఁ ◆ గడలెత్తి సన్న
గరువలి వీవంగ ◆ ఘనదీర్ఘికలను
దరఁగలన్ తూలికా ◆ తల్పముల్ గ్రాల
మెలఁగెఁ జిల్లనిగాలి ◆ మేడలమీఁద
నిలువున నొప్పు వె ◆ న్నెలలబయళ్లఁ
దగుహంస తూలికా ◆ తల్పంబునందుఁ
జిగురాకు బోణుల ◆ జిగిమించుచున్న
యురములు దాఁకొని ◆ యొత్తి యొండొరుల
కరదండములు దల ◆ గడల నమర్చి
ధమ్మిల్ల బంధంబు ◆ తగ వీడుపడఁగఁ
దమ్మలంబులచొక్కు ◆ తడఁబడఁ గలసి
విలసిల్లు నెరజాణ ◆ విటుల గుండియలు
ఝళుకెక్కఁ దూరుపు ◆ జాయ గెంపెక్కి
లాగుగాఁ దీర్చిన ◆ లత్తుక రేఖ
బాగున జిగిమించు ◆ పవడంపుఁ దీగె
జోక జేగురుపట్టె ◆ [43]సొబగునరాగి
రేకుచందమున [44]చెం ◆ ద్రికనింపుబరణి
మూఁకుడు విధమున ◆ ..... ..... ..... ......
..... ...... ...... ...... ...... ◆ మురువునరాము.
గండగొడ్డలి లీలఁ ◆ గ్రమమున నాత్మ
మండలం బెసఁగఁగ ◆ మర్త్యు లింద్రునకుఁ
జారువైభవలీల ◆ సమకొనఁ జేరి
కోరి పట్టిన తోఁపు ◆ గొడుగన మఱియు,
శ్రీ సొంపుమీఱ శ ◆ చీదేవి చెవిని
భాసిల్లు కెంపుల ◆ పసిఁడి యాకనఁగ
నలిగి యసురులవై ◆ [45]నదిమిపట్టియును
జలశాయి వేసిన ◆ చక్రమో యనఁగ
మలహరు కుడికన్ను ◆ మహిమలచెన్ను
కలువలపెంపు జ ◆ క్కవలకు సొంపు
వ్రతముల చేవ కై ◆ వల్యంబు త్రోవ
క్రతువులయొప్పు చీ ◆ కటిమూఁక విప్పు

తమ్ములపెచ్చు నె ◆ త్తమ్ములమెచ్చు
తమ్మివిభుఁడు పూర్య ◆ ధర మెక్కె నంత
రాజమహేంద్ర ధ ◆ రాత లేశ్వరుఁడు
భూజననుతుఁడైన ◆ పుత్రు నారీతిఁ
దప్పు శోధింపక ◆ దండింపఁ బంపి
రెప్పఁ బొందించి ని ◆ ద్రింపఁ జొప్పడక
యూరక నిట్టూర్పు ◆ లొదవఁ దల్పమున
నారాటమున వేఁగు ◆ నంతకుఁ బొరలి
వెలయ మేల్కొనివచ్చు ◆ విధమున వచ్చి
వలను మీఱఁగ రేపు ◆ వరుసగసల్ప
వలయు కృత్యము నొక ◆ వగగాఁను సలిపి
కొలువున కేతెంచి ◆ కొండ పైఁబడిన
పరువడి నేదియుఁ ◆ బలుకక యున్న
సరగున నగరిర ◆ క్షకు లేగుదెంచి
తోరంపు మణుల దీ ◆ ప్తులు సందడింప
సారంగధరుని భూ ◆ షణములు తెచ్చి
ముందట నిడి పాద ◆ ములమీఁద వ్రాలి
యందంద యేడ్చుచు ◆ నాకాశవాణి
పలవించు రత్నాంగి ◆ పట్టి నూరార్చి
పలికిన యాకాశ ◆ పద్ధతిం జెప్ప
విని విస్మయంబున ◆ వెఱఁగు చిత్తమున
...... ...... ...... ...... ...... ....... ....... ......
తట్టుముట్టాడంగఁ ◆ దనమంత్రివరులఁ
జుట్టంబులను మహీ ◆ సురులను దొరలఁ
దనవెంటఁ గొంచు నం ◆ తఃపురంబునకుఁ
జనుదెంచి యాపాప ◆ జూతి రప్పించి
భూమీశ్వరుఁడు దీని ◆ బుద్ధి భేదింప
సామవాక్యంబులం ◆ జన దని వెలుచ
నదలించి కాదులే ◆ దనుచు నీకల్ల
పొదలిపుచ్చగ నింకఁ ◆ బోలదు నీకు
నాకాశవాణి నీ ◆ యటమటం బెల్ల
దాఁకొని చెప్పంగఁ ◆ దలవరుల్ దెలియ
విని వచ్చి కొలువెల్ల ◆ విస్మయం బందఁ

దనకుఁ జెప్పిరి చెప్పు ◆ తథ్య మింకన్న
నొక్కక, స్రుక్కక ◆ నుసలక భీతి
దక్కక తన దిట్ట ◆ తనము దీపింప
బలికెఁ జిత్రాంగి తాఁ ◆ బన్ని నమాయ
తెలియ నీరాత్రి ◆ ...... ...... ...... ......
...... ...... ...... ..... ర ◆ త్నాంగి దేవియును
దలవరులకు నెల్లఁ ◆ దగులంచ మిచ్చి
తనతనూభవుబారి ◆ తలఁగంగఁజేసె
నని ప్రియుం గనుఁబ్రామి ◆ యాకాశవాణి
నొకటి గల్పించి దు ◆ రుక్తులు గొన్ని
ప్రకటించి తనుఁ జంపఁ ◆ బన్నినయట్టి
నాటకం బనుట మా ◆ నవనాథ నీకుఁ
దేట తెల్లంబు సం ◆ దేహంబులేదు
కాకున్న రాత్రి యీ ◆ గతిఁ బల్కినట్టి
యాకాశవాణి యెం ◆ దరిగె నేఁ డనుచు
ధాత్రీశుతో నెదుర్ ◆ తాటించి నిలిచి
చిత్రాంగి పలుకునా ◆ చిత్రంబులోన
నాకాశవాణి యి ◆ ట్లనియె నరేంద్ర
నీకుమారుని రూప ◆ నిర్జితకంతు
నతిమోహమున ఱెప్ప ◆ లార్పక చూచి
బతిమాలి చిత్రాంగి ◆ భావసంభవుఁడు
గడు వాఁడిచిగురాకుఁ ◆ గత్తిచేఁదాల్మి
గడిబాలు? గావింపఁ ◆ గ్రమ్మఱ రతికిఁ
జిత్తంబు లోపలఁ ◆ జీకాకుపఱచు
తత్తరంబునఁ బట్టఁ ◆ దమకించుటయును
రతిబోణి నీవు మా ◆ రత్నాంగి మాఱు
మతిదప్పి యిట్ల ◆ మానంబు విడిచి
పాపంబు[46]గట్టుక ◆ పైఁబడఁ జాలుఁ
బోపొమ్మనుచుఁద్రోచి ◆ పోయిన నలిగి
కొనగోళ్లతోఁ జను ◆ గుబ్బలు వ్రచ్చి
కొని నీకు గణఁక నె ◆ క్కొనఁ గుమారకుని
చేఁతగాఁ జూపి చే ◆ సిన బూమె లెల్ల

నీ తలంపునఁ జాల ◆ నిజముగ నమ్మి
కృపమాలి పగవాని ◆ క్రియఁ దప్పుచేసి
యపరాధహీను ర ◆ త్నాంగి తనూజు
విమలభూషణు నీతి ◆ విమలచారిత్రు
వినుత గుణాధారు ◆ వీతకళంకుఁ
బట్టి కోయించి యీ ◆ పాపంబు వెంటఁ
గట్టుకొంటివి పల్కఁ ◆ గాదు నీతోడ
నని యూరకుండిన ◆ నధిపుఁ డుల్లమున
మునుఁగఁ గప్పిన శోక ◆ మున మూర్ఛనొంది
తెలిసి గొబ్బున నుప్ప ◆ తిల్లెడు బాష్ప
జలములు కన్నుల ◆ జరజరఁదొరుఁగ
నాపాపజాతి చి ◆ త్రాంగి వీక్షించి
కోపాగ్ని మది దరి ◆ కొనఁగ నిట్లనియె
నినుఁ బట్టి నాపట్టి ◆ నిర్మలచరితు
వనధిగంభీరుని ◆ వంశవిస్తారుఁ
గులనగధీరుని ◆ గురుభక్తినిరతు
నలఘు తేజోధనుఁ ◆ డగు భాగ్యవంతుఁ
బరమేశువరమునఁ ◆ బడసినయట్టి
పురుషరత్నముఁ దగఁ ◆ బోనాడుకొంటి
నాలిమాటలు చెవి ◆ నాలించి జగతి
నాలీలఁగోయించె ◆ ననుచు భూజనులు
తనుఁ ! బువ్వఁ దిట్టరే ◆ ధరణీశవరులు
...... ...... ...... ...... ...... ....... ....... ......
పాపంగ రానట్టి ◆ పాపంబు దన్నుఁ
బ్రాపించె నారక ◆ పంకానఁగూలఁ
బాలైతి నని పల్కు ◆ పార్థి వేంద్రునకుఁ
బోలుపొందుగ మదిఁ ◆ బొంక నోరార్ప
నే యుపాయము లేక ◆ నిలఁ గాలివ్రేల
వ్రాయుచుండిన నెఱ ◆ వాది చిత్రాంగిఁ
బాతాళవివరంబు ◆ పగిది నెంతయును
లోఁతు మీఱిన నూతి ◆ లోనఁ ద్రోయించి
నిగుడ శోకాగ్నులు ◆ నిండుమనమున
జగతిపైఁ బొరలుచు ◆ సారంగధరుని

తెలివియు రూపంబుఁ ◆ దేజంబు గుణముఁ
బలుమాఱు పేర్కొని ◆ పలవింపుచున్న
క్షితినాథునకు మతి ◆ జితసురమంత్రి
మతిమంతుఁ డనుమంత్రి ◆ మణియు ని ట్లనియె
మనుజేశ యిట్లుండ ◆ మానంబుఁ దొరఁగి
చనునె నీ వీగతి ◆ సంతాపమొందఁ
బాయక చేసిన ◆ పనికి రోదనము
సేయుట గతజల ◆ సేతుబంధనము
నీకు లోకములోన ◆ నింద రావలసి
చేకొనవైతివి ◆ చెప్పినబుద్ధి
పరమేశువరమునఁ ◆ బడసినయట్టి
పరమపుణ్యుం డగు ◆ భక్తవత్సలుఁడు
ధరణీశ సారంగ ◆ ధరుఁ డేల హానిఁ
బొరయు శుభంబులు ◆ ఎందు నయ్యనఘు
ననవుండు భూపాలుఁ ◆ డా మతిమంతుఁ
గనుఁగొని నీ వన్ని ◆ గతులఁ గార్యంబు
పుట్టఁ జెప్పగఁ బాప ◆ మును బోల్పనైతిఁ
బట్టి నూరక వెసఁ ◆ బట్టి కోయించి
తింక నా నేరమి ◆ కింక నిఱ్ఱంకు
లింక నేటికిఁ బర ◆ మేశ్వరుకృపను
జావకుండినఁ జాలు ◆ సారంగధరుని
వేవేగఁ గొనివచ్చి ◆ వెజ్జులఁ బెట్టి
ముదమార నిచ్చలు ◆ మోళ్లు గాపించి
బ్రదికించుకొని వానిఁ ◆ బట్టంబుగట్టి
నెట్టన నేగుదు ◆ నేఁ దపంబునకు
...... ...... ...... ....... ....... ....... .......
ననుచు భూవిభుఁడు ర ◆ త్నాంగియుఁ దాను
దనబంధుజనులతోఁ ◆ దడయక కదలి
నగరరక్షకులు ముం ◆ దరఁ ద్రోవఁ జూపఁ
బొగులుచుఁదానటు ◆ వోయి కట్టెదుర
దళముగా నెత్తుటఁ ◆ దడిసిన వధ్య
శిలమీఁదఁ ద్రెంచివే ◆ సి మునున్నయట్టె
పడియున్న పదములుఁ ◆ బాణిపద్మములుఁ

బొడగాంచి నందనుఁ ◆ బొడగానలేక
కడుపు భుగల్లనఁ ◆ గడఁగు శోకాగ్ని
నడలుచు హా పుత్త్ర ◆ హా పుత్త్ర యనుచు
నామహీశుఁడును ర ◆ త్నాంగిదేవియును
భూమిపైఁబడి మూర్ఛ ◆ బొంది యొక్కింత
తడవుకుఁదెలిసి సుం ◆ దరియును దాను
నడుగులు తడఁబడ ◆ నశ్రులు రాల
నాపొంత పొదరిండ్ల ◆ నచ్చటితరుల
నేపార గిరులను ◆ నెలమిఁ గొలఁకులఁ
బొదల నెలుంగెత్తి ◆ పుత్త్రునిఁ జీరి
వెదకుచు నోలతా ◆ బృందంబులార!
కరులార ! గిరులార ! ◆ ఖగపంక్తులార!
తరులార ! హరులార ! ◆ తాపసులార!
కాన రే మాపుత్త్రు ◆ గమలాప్తతేజుఁ
గాన రే మాపట్టిఁ ◆ గాంతామనోజుఁ
గానరే మాసుతుఁ ◆ గల్మషదూరుఁ
గాన రే మాసూనుఁ ◆ గనకాద్రిధీరు
ననియని విభ్రాంతు ◆ లైనోళ్లు నొవ్వఁ
దనువులు చెమరింపఁ ◆ దనరు వారలకు
[47]గుఱిపట్టు లెగయంగఁ ◆ గుత్తుక లెండ
మరలుచుఁ గ్రుమ్మరి ◆ మగువయుఁ దాను
జనుదెంచి యాకర ◆ చరణఖండములు
తనయురంబునఁ జేర్చి ◆ ధరణీశ్వరుండు
వివిధభంగులఁ బ్రలా ◆ పించుచు నుండె
అవి దాను గైకొని ◆ యారాజుదేవి
మక్కువనెక్కొన ◆ మాటిమాటికిని
గ్రక్కున నక్కున ◆ గదియించుకొనుచుఁ
గొడుకుఁ జిట్టాడింపఁ ◆ గోరి ని న్నెలమి
నడుగిడు మనెడి నీ ◆ యడుగు లి వయ్య
తటుకున రమ్ము నా ◆ తండ్రి నీ వనుచుఁ
జిటికెలు వెట్టు నీ ◆ చేతు లి వయ్య
ఒత్తి నా చన్నిచ్చి ◆ యోమినమేని

నెత్తురా యీక్రొత్త ◆ నెత్తు రోయన్న
తావి మించినపుష్ప ◆ తైలంబు లంటు
నీ వెంట్రుకలు నేఁడు ◆ నేలపైఁ గలసెఁ
బేద కై నను బుట్టి ◆ పెక్కేండ్లు మనక
మేదినీశునకు జ ◆ న్మించి ప్రాయమున
మహితసామ్రాజ్య సం ◆ దలకుఁ బాసి
గహనంబులోన నీ ◆ గతిఁ జావవలసె
మునుపు నిక్కముఁ జెప్ప ◆ ముడిఁగి తా [48]నుండి
వెనుకఁ దా నశరీరి ◆ వినువీథినుండి
పలుకుకండిన నేమి ◆ పలికిన నేమి
చలమున నినుఁ గోసి ◆ చంపినమీఁదఁ
బలుకుపంతము చెల్లు ◆ బడిగఁ జిత్రాంగి
కులభూషణుని నిన్నుఁ ◆ గోసివేయించెఁ
జావకుండిన నేమి ◆ చచ్చిన నేమి
వావిరి తన కూర్మి ◆ వనితమాటలకుఁ
దఱిఁగించినట్టి నీ ◆ తండ్రి నీ వెంటఁ
దఱిమి వచ్చుట యని ◆ దాఁగితో కాక
కడిమి వాల్మెకములు ◆ గఱచి యొండెడకు
వడిఁ గొనిపోయెనో ◆ వనభూమిలోనఁ
గడుభయంకరలీలఁ ◆ గ్రాలుభూతములు
మిడుకకుండగఁ బట్టి ◆ మ్రింగెనో కాక
తక్కక పనిఁ దీర్చి ◆ తలవరుల్ నిన్ను
నొక్కని డించి పో ◆ వుటయు భీతిల్లి
వాపోవఁ గరుణించి ◆ వచ్చి ని న్నెలమిఁ
జేపట్టి బ్రతుకఁ బో ◆ షించెద ననుచు
ఘనపుణ్యుఁ డెవ్వఁడు ◆ గైకొని చనెనొ
తనయ ని న్నెటువలెఁ ◆ దడయక మఱతు
నీయొప్పు నీరూపు ◆ నీ విలాసంబు
నీ యొప్పు నీ చొప్పు ◆ నీరాజసంబు
నీదునెయ్యంబును ◆ నీ వినయంబు
నీదుచారిత్రంబు ◆ నెటువలె మఱతు
ననుచు రత్నాంగి బి ◆ ట్టడల భూవిభుఁడు

వినువారి కేడ్పురా ◆ విలపింపఁ దొడఁగె
నేమని పుత్త్రక ◆ యేడ్తురా పాప
మే మని తలపోతు ◆ నెక్కడఁ బోయి
తే మని ననుఁదూఱి ◆ తెం దున్నవాఁడ
వే మాడ్కి నిటువత్తు ◆ వెన్నఁడు చూతు
నామహాదేవుని ◆ నమృతాంశుధరుని
రామావిలాసాభి ◆ రామవామాంగు
సేవించి శ్రీ విల ◆ సిల్లఁ గన్నట్టి
దేవతాసము నిన్నుఁ ◆ దెలివి పోకాడి
నిందించి మతిమంతు ◆ నీతిమార్గంబు
పొందునఁ బోక దుర్ ◆ బుద్ధిని నట్టి
కొఱగామి చేసి లో ◆ కులు నవ్వనై నఁ
గొఱవి గడ్పున నుంచు ◆ కొనఁగఁ బాలైతిఁ
దప్పును నొప్పును ◆ దరువాతఁ దెలిసి
చెప్పుద మనియొక్క ◆ చెఱ నుంచనైతిఁ
బట్టి కట్టింపక ◆ పారిపో బెదరు
పుట్టించుగతిఁ దల ◆ పోయలేనైతిఁ
బాదు చాలక వేగ ◆ పడి పనిఁ దీర్పు
నా దురాత్ముని జెందు ◆ నాపద లన్న
నీతివాక్యము మది ◆ నిలుపలే నైతి
నాతాల్మి తెగటాఱె ◆ నా తెల్వియణఁగె
నిందును నందు న ◆ నేక సౌఖ్యములు
పొందించుసుతు లెందుఁ ◆ బుట్టరుగాక
జగమున నిమిషార్థ ◆ సౌఖ్యంబు లొసఁగు
మగువ లెందుఁ గలరు ◆ మదిఁ దలపోయ
నని విచారింప లే ◆ నైతి నా కింకఁ
జనునె ముందటఁ గూడు ◆ చవి యని కుడువ
నీరజహిత తేజ ◆ నీవు లేనట్టి
యీ రాజ్య మేటికి ◆ నీతను వేల
విడుతుఁ బ్రాణము లని ◆ వేగైనగుండు
మెడఁ గట్టుకొనీలోఁతు ◆ మీఱిన నదికి
మకరభోజనముగా ◆ మనుజేశుఁ డరుగ
నకలంకగతిఁ బల్కె ◆ నాకాశవాణి

ఓహో నరేంద్ర నీ ◆ కుచితమే యిట్టి
సాహసం బొనరింపఁ ◆ జంద్ర శేఖరుని
నందనుఁ డగు మీస ◆ నాథునియొద్దఁ
బొందొంద నిపుడు మీ ◆ పుత్త్రుఁ డున్నాఁడు
చిరతరంబుగ దేహ ◆ సిద్ధియు మున్ను
కరచరణోత్పత్తి ◆ గలుగు నాతనికిఁ
బరితాప ముడిఁగి నీ ◆ పట్టణంబునకు
నరుగు భూవర యన్చు ◆ నందఱు వినఁగఁ
బలికిన శోకంబు ◆ పాసి రారాజ
తిలకంబు రత్నాంగి ◆ దేవియు నంత
వారుఁ బురమునకు ◆ వచ్చి రావిభుఁడు
కోరి నగరమేలు ◆ కొనుచుండె నంత
నట మీననాథుండు ◆ నా కుమారకునిఁ
బటువుగా నొకమంచె ◆ పైఁదగ నుంచి
గోపాలకుఁడు భక్తిఁ ◆ గొనియిచ్చుచున్న
యాపాలు పోయుచు ◆ నతని కధ్యాత్మ
విద్యోపదేశంబు ◆ వెలయఁ గావింప
నుద్యుక్తుఁ డౌచు రా ◆ జోన్నతసుతుని
నను వొంద సిద్ధాస ◆ నాసీనుఁ జేసి
యనుతుర్యయోగంబు ◆ లం దంగములును
నందలిదేవత ◆ లాగణంబులును
బొంద నాస్పర్శముల్ ◆ పొసఁగ నెర్గింప
నాగురునాథు వా ◆ క్యములఁ జిత్తమున
బాగుగా నిలిపి యా ◆ పగిదిఁ బ్రవీణుఁ
డై యోగసౌఖ్యంబు ◆ లందుచు నుండె
నాయోగిముఖ్యుండు ◆ నట్ల యుండఁగను
గొనకొని యాలీలఁ ◆ గొంతకాలంబు
పనిచిన మంచెపై ◆ పట్టి సారమున
యోగసమాధిఁ దా ◆ నొయ్యనఁ దెలిసి
వేగంబె ధారుణీ ◆ విభుతనూజునకుఁ
గరచరణోత్పత్తిఁ ◆ గలిగింపఁ జేయ
స్థిరముగా నూర్ధ్వదృ ◆ ష్టియు నిలిపింపఁ
జక్కగా నిలిచినఁ ◆ జయ్యన మీఁద

నొక్కగుం డెగయంగ ◆ నువ్వున వై చి
యదియె చూడుము నీవు ◆ నందలిచూపు
వదలిన శిరముపై ◆ వడిఁబడు ననుడు
నాచూపు మరలింప ◆ నాత్మలో వెఱచి
రాచూలి యోగమా ◆ ర్గమున నుండఁగను
బదపడి యాతని ◆ భాగ్యంబుకతన
ముదమార నాలుగు ◆ మొండ్లులయందుఁ
గరపదంబులయందుఁ ◆ గనుపించు మొలక
లలరిక్రొమ్మోనులు ◆ నల్లనే వచ్చి
లలితాంఘ్రికరయుగ ◆ ళంబులవ్రేళ్లఁ
బరగగోళ్లును రెంటఁ ◆ బది విస్తరించి
నాఁడునాటికిఁ జాల ◆ నయమెక్కి వచ్చు
పోఁడిమి కానాథ ◆ ముఖ్యుఁ డుల్లముస
ముద నమంది యతనికి ◆ ముక్కంటికరుణఁ
బదకరాంబుజము లు ◆ ద్భవమంది మించి
కడిఁదిమైఁ దొల్లిటి ◆ కంటెను మంచి
యొడికమై వ్యవహార ◆ యోగ్యమై యుండఁ
జేయుదు నని మీఁది ◆ శిలఁ బాయఁ దీసి
కాయజారాతికిఁ ◆ గడుభక్తి మ్రొక్కి
యాతని నిలమీఁద ◆ నల్లన దించి
చేతులు చంకలఁ ◆ జెలువొంద గ్రుచ్చి
పట్టి మెల్లనె యెత్తి ◆ పాదము లుర్వి
మెట్టింప ధైర్యంబు ◆ మిగుల రాసుతుఁడు
లాగుగా నూఁది మె ◆ ల్లనె నడుపాడ
నాగతిఁ బూన హ ◆ స్తాంబుజంబునకుఁ
దనచేతి దండ మూఁ ◆ తగ నిచ్చి నడువఁ
బనుపుచు నిజగుహా ◆ భవనంబులోనఁ
బనుపడ నడిపించి ◆ పదపడి వెడలి
చని కొంతదవ్వుదాఁ ◆ జరియింపఁజేసి
కరుణించి యతనికిఁ ◆ గలసిద్ధు లెల్ల
నరుదుగా నొసఁగి కృ ◆ తార్థునిఁజేసె
నయమెక్కి మొండ్లను ◆ నాల్గింటియందు
నయముగ రంగవ ◆ ర్ణంబులై మొలచెఁ

గరములుఁ బదములుఁ ◆ గమనీయలీల
నెరుపులై[49] యున్న జా ◆ డెఱిఁగి యాతనికి
నరుదార చౌరంగి ◆ యనునామ మొసఁగి
మరి వాని కిట్లనె ◆ మత్స్యేంద్రుఁ డెలమిఁ
దనయ సమాల్యవం ◆ తంబున కింకఁ
జనియెద నామహా ◆ శైలంబునందు
దీపించు నతిచిత్ర ◆ దివ్యౌషధములు
చేపడు మాకుఁ జె ◆ చ్చెరఁ నింక వినుము
గురుభక్తి నిరతుండు ◆ గోపాలుఁ డతని
వెరవార శిష్యుఁ గా ◆ వింపు చిత్తమునఁ
దలపోసి నీకు ని ◆ త్యంబునుం బాలు
వలె నెడచేయక ◆ వలసి యిన్నాళ్లు
పాలు నిచ్చలుఁ బోసి ◆ పాటించె నింత
కాలంబు మనల న ◆క్కఱ నెక్కొనంగ
యోగిత్వ మతనికి ◆ నొనరింపవలయు
నాగుణోన్న తునకు ◆ నాలస్య ముడిఁగి
నిడివిగా నుండక ◆ నేమించినట్ల
కడులెస్సగా నుండు ◆ గతియయ్యె నేని
యిమ్ము నీయుపదేశ ◆ మెలయ నాతనికి
సమ్మదం బొదవ మా ◆ శాసనంబునను
అనుచుండఁ జను దెంచి ◆ యావులపాలు
గొనుచు నచ్చోటికి ◆ గోపాలకుండు
వచ్చి దుగ్ధము లిచ్చి ◆ వరుస సద్భక్తి
చెచ్చెర భక్తిని ◆ ల్చిన వానిమీఁదఁ
గరుణామృతము నిండ ◆ కడకంటిచూపు
పరగించి పలికె నా ◆ పరమయోగీంద్రుఁ
డామహితాత్ము పెం ◆ పంద నౌషధము
లామాల్యవంతంబు ◆ నందు సిద్ధించుఁ
గాన మా కచటికిఁ ◆ గదలంగవలయు
మానక నీ వింక ◆ మాకిట తెచ్చు
పాలు నిచ్చలుఁబోసి ◆ పరితృప్తిఁజేసి
మేలుగా సవరింపు ◆ మీ మమ్ముఁబోలి

యనుచుఁ జౌరంగిని ◆ నప్పనసేసి
మనమార మేము క్ర ◆ మ్మఱ వచ్చినీకు
వినుత యోగాభ్యాస ◆ విధమెల్లఁ దెలిపి
తనుసిద్ధియును నిచ్చి ◆ ధన్యుఁ జేసెదము
మసలక చనుదేర ◆ మా కబ్బకున్న
నెసఁగ నీ కుపదేశ ◆ మిచ్చుఁ జౌరంగి
సేవింపు మితని సు ◆ స్థిరభక్తి ననుచు
వేవేగఁ బశుపాలు ◆ వీడ్కొల్పి యంత
...... ...... ...... ...... ...... ...... ...... ......
పొలుచులాతపుఁగోలఁ ◆ బుటిక యుం బూని
తలఁపునైత్తము లోనఁ ◆ దరుణేందుమౌళి
నిలిపి మ్రొక్కుచు గుహా ◆ నిలయంబు వెడలి
చని పురంబులు నూళ్లు ◆ శబరులయిండ్లు
వనములు నదులును ◆ వరశైలములును
బొలుచు తీర్థములును ◆ బుణ్యాశ్ర మములు
నెలమితోఁ జూచుచు ◆ నేగి ముందటను
గనియె మత్స్యేంద్రుండు ◆ ఘనరత్నశృంగ
జనితవజ్రాళీల ◆ నద్దిగంతరముఁ
గమనీయకందర్ప ◆ కన్యకా కేళి
సముచిత నిర్మల ◆ చంద్రకాంతమును
ఘనదంతిహతిసింహ ◆ ఖరనఖోత్పాత
వినుతముక్తావళీ ◆ విశదదంతమును
అమితశాఖామృగ ◆ వ్యాధూతవృక్ష
సుమహితశిఖర వి ◆ శ్రుతలతాంతమును
సన్ముఖకిన్నర ◆ జన దార రచిత
మన్మథోదంతంబు ◆ మాల్యవంతంబు
కని డాయఁ జని కౌతు ◆ కంబు చిత్తమున
నెనయంగ నన్నగ ◆ మెక్కుచో నందు
మును దపమున్న స ◆ న్మునులు మోదంబు
మనమునఁ బెనఁగొన ◆ మనసిజాంతకుని
నందనుండగు మీన ◆ నాథుండు వచ్చె
నిందుల కాయోగి ◆ కెదురుగా నేగి
పొడగందు మనుచు గుం ◆ పులుగూడి వచ్చి

తడయక దర్శించి ◆ తగ సన్నుతించి
ముకుళితహస్తులై ◆ ముందట నున్న
సకలమునీంద్రులఁ ◆ జిల్లఁగాఁ జూచి
పొందొందఁ గౌగిట ◆ బొందించి వారి
నందఱఁ గుశలంబు ◆ లడిగి యాశైల
మెలమి వారును దాను ◆ నెక్కి యా మీఁద
వెలయు హోమాగ్నులు ◆ వేదనాదములు
పరపుగాఁ దీర్చిన ◆ పర్ణ శాలలును
సరసకిన్నరవధూ ◆ చతురగానములు
కలకంఠ శారికా ◆ కల పిక కీర
కలకలంబులు గల్గి ◆ కాయలఁబువుల
బాగుగాఁ బరిపక్వ ◆ ఫలములచేత
వీఁగు వృక్షంబులు ◆ విలసిల్లుచున్న
వనముల నభినవ ◆ వనజమనోజ్ఞ
వనజాకరంబులు ◆ వరుసగఁ గనుచు
వినతులై తాపసుల్ ◆ నెలయంగఁ దెచ్చి
తన కిచ్చునర్ఘ్య పా ◆ ద్యములు గైకొనుచు
నాయాయిఠావుల ◆ నతిభక్తిఁ దనకుఁ
బోయు దుగ్ధాహార ◆ ములఁ దృప్తుఁడగుచు
వారి వీడ్కొని చని ◆ వలసిన మందు
లారఁ గైకొని యమ్మ ◆ హాద్రిపై నొక్క,
గుహ నివాసముచేసి ◆ కొని వసియించి
మహితయోగానంద ◆ మగ్నుఁడై యుండె.
నంతలో నచ్చట ◆ నా చవురంగి
సంతసంబున నిజ ◆ చరణహస్తములు
ఒడికమై వ్యవహార ◆ యోగ్యంబు లైనఁ
దడయక గుహ వెళ్లి ◆ తత్సమీపమునఁ
దెరువరుల్‌వచ్చెడి ◆ తెరువున నొక్క
పరవైన ఱాతిపైఁ ◆ బరగఁ గూర్చున్న
తఱి నొక్కవైశ్యుఁ డు ◆ త్తముఁడు మిర్యముల
పెఱికలు త్రోవగాఁ ◆ బెక్కు, గొంపోవఁ
గని యివి యేటి వె ◆ క్కడి కేగుచున్న
వనుచుఁ ఔరంగి త ◆ న్నడిగిన వాఁడు

సుంకరియను భీతి ◆ స్రుక్కి నేర్పునను
బొంకి తప్పించుక ◆ పోద మటంచు
నవి జొన్న లనుటయు ◆ నట్లుగా నాత్మఁ
దవిలి తలంపఁ జి ◆ త్రముగ నా పెఱిక
లందలి మిరియంబు ◆ లవి జొన్నలైనఁ
బొందుగాఁ జని యొక్క ◆ పురమును జొచ్చి
వచ్చి యా మూటలు ◆ వడి విడ్చి చూచి
యచ్చెరువడి బొంకు ◆ నాత్మ నూహించి
యూఱక పుణ్యుని ◆ నొగి సుంక రనుచు
మొఱగి పల్కిన మాకు ◆ మోసంబుకతన
నీచేటు పుట్టెను ◆ నింక నీ వెఱిక
లాచక్కటికి గొంచు ◆ నరిగి యాఘనుని
దగఁ గాంచియాతప్పు ◆ దయ మీఱఁ గావ
దిగదిగ నొగిని బ్రా ◆ ర్థించెద ననుచుఁ
బెఱిక లెత్తించి యా ◆ బేహారి చనిన
మఱియుఁ జౌరంగియు ◆ మఱి యివి యేటి
వనిన వాఁడును మిరి ◆ యమ్ముల పెఱిక
లని నిజమాడిన ◆ నాసిద్ధముఖ్యుఁ
డప్పుడు తనమది ◆ నట్లుగాఁ దలఁపఁ
జెప్ప నచ్చెరువుగాఁ ◆ జెచ్చెరఁ జొన్న
లన్నియు మిరియంబు ◆ లైతొల్లియట్ల
యున్న వర్తకులును ◆ నొగిఁ దమలోనఁ
బెఱికలమూటలు ◆ పెడవైచి చూచి
వెఱ గంది వచ్చి యా ◆ విమలాత్మునకును
ముదమునఁ జాఁగిలి ◆ మ్రొక్కి నీవాక్య
మది దేవతావాక్య ◆ మనుచు నత్తెఱఁగు
వివరంబుగాఁ జెప్పి ◆ వీడ్కొని చనిన
సవరనై వాక్సిద్ధి ◆ చౌరంగి తనకుఁ
గల్గుట యెఱిఁగి త ◆ క్కటిసిద్ధు లెల్లఁ
గలిగె నటంచుఁ దా ◆ క్షత్రియుం డగుచుఁ
జేసినపంతముఁ ◆ జెఱచి గర్వమున
నా సమీపంబున ◆ నరుదుగా నిత్య
తీపుమించినపాలఁ ◆ దృప్తునిఁ జేసి

చేపట్టి తన్నుఁ బో ◆ షించినయట్టి
గోపాలకునిఁ దన ◆ గురునివాక్యమును
ద్రోపునూకుడుఁజేసి ◆ తొల్లి మత్స్యేంద్రుఁ
డరిగినత్రోవఁ దా ◆ నద్రులు నదులుఁ
బురములుదేశముల్ ◆ పుణ్యతీర్థములుఁ
జూచుచుఁ[50] బోవనా ◆ ను ద్దెఱుంగమిని
డాచేత దుగ్ధభాం ◆ డంబు ధరించి
గోపాలకుఁడు వచ్చి ◆ గుహవాత నిలిచి
యాపాలకుండ గు ◆ హాంతరమ్మునకుఁ
జాపినఁ దొల్లిటి ◆ జాడఁ గైకొంట
దోఁపకయున్న నం ◆ దుకుఁ జనఁ జొచ్చి
యాఁదటఁ జౌరంగి ◆ నరసి లేకున్న
వేదనఁ బొందుచు ◆ వెలికి నేతెంచి
నాగుహ కవ్వల ◆ నాగుండ్లమీఁద
లాఁగలఁ బడెలఁ బ ◆ ల్లముల లోయలను
గలయంగ వెతకుచుఁ ◆ గడు నెలుఁగెత్తి
పలుమాఱుఁ బిలుచుచుఁ ◆ బర్వినవగలఁ
దనలోన నిట్లని ◆ తలపోయఁ దొడఁగెఁ
గొనకొని ననుఁ బిల్చి ◆ గురుఁ డొప్పగించి
చనినది మొదలు ని ◆ చ్చలు దుగ్ధములను
మునుపటివలెఁ దెచ్చి ◆ ముదమున నొసఁగఁ
గైకొన కిప్పు డె ◆ క్కడి కేగె నొక్కొ
వై కొని మృగములు ◆ పట్టిప్రాణములు
గొనియెనొ కొనిపోయి ◆ క్రూరదానవులు
దునుమభూతంబులు ◆ తొడిఁబడఁ దినెనొ
తెరువు దప్పెనొ పెక్కు ◆ దిక్కుల నిట్లు
పరికించి చూచి యే ◆ పట్టున నైనఁ
జౌరంగి గాన నీ ◆ చంద మెట్టిదియొ
ధారుణి తోయంబు ◆ దహనవాయువులు
దివియును జంద్రుండు ◆ దిననాయకుండు
శివుఁడు వాగ్ధవుఁడు రా◆. జీవలోచనుఁడు
సాక్షిగా గురు వని ◆ చౌరంగిఁ గొలుతు

దక్షత ని న్నె కా ◆ తలఁ చెద ననుచు
నొదవు శోకము నిల్ప ◆ నోపక మఱియు
[51]నదవదపడుచు ని ◆ ట్లనియెఁ జౌరంగి
మఱువక గురునాథు ◆ మాఱుగా నిన్ను
నఱ లేక తలఁపుదు ◆ ననవరతంబు
లేదు నాయెడఁదప్పు ◆ లేశమాత్రంబు
మోదంబు మీఱ నే ◆ మును చేసినట్టి
పొరపేమి యని చిన్నఁ ◆ బోయిన మోముఁ
దొరఁగు భాష్పములుపైఁ ◆ దొరఁగ గోపకుఁడు
విసిఁగి చౌరంగిని ◆ వెదకుట మాని
మసలక చనియుఁ దా ◆ మందలోపలికి
గోపాలకులఁ బిల్చి ◆ గోవులమందఁ
జూపి యప్పనఁజేసి ◆ స్రుక్కక చావ
సమకట్టియుఁ గడు వి ◆ సర్జించి జాలిఁ
గుములుచుఁ దానుండు ◆ గుడిసెలోపలను
నించుక కను మూయు ◆ నెడ మీననాథు
డంచితంబుగఁ గల ◆ నరుదెంచి పలికెఁ
జావ నేటికిఁ బుత్త్ర ◆ చౌరంగి వచ్చె
నూవసించిన యట్టి ◆ మాల్యవంతమున
కనిన మేల్కని గురుఁ ◆ గని వెఱఁగంది
తనమది నిల్పి స ◆ ద్భక్తితో మ్రొక్కి
మఱునాఁడు తాఁ జని ◆ మత్స్యనాథుండు
గుఱుకొని వసియించు ◆ గుహవాత నిండఁ
బెనురాళ్లఁ దెట్టెగాఁ ◆ బెట్టి చాలించి
చనక నిశ్చలభ క్తిఁ ◆ జనుదెంచి యరసి
పోవుచు నిహపరం ◆ బుల శ్రీ గురుండు
దైవంబు భావింపఁ ◆ దన కనుచుండె
నంతఁ జౌరంగియు ◆ [52]నమ్మాల్యవంత
చెంతను వడ యెండ ◆ చే దప్పి గదిసి
వెరవార జలములు ◆ వెదకుచుఁ బోయి
సరసిజ కుముద వి ◆ స్తారంబు చక్ర
సౌరస హంస ప్ర ◆ చారంబు పంక

దూరంబు వాసనా ◆ తులితపానీయ
పూరంబు పుష్పిత ◆ భూరు హోదార
తీరంబు నుల్లస ◆ ద్వీచి వితాన
సారంబు నైనకా ◆ సారంబుఁ గనియెఁ
[53]గని మనంబునఁ గౌతు ◆ కంబు సిద్ధింపఁ
జనఁజొచ్చి చయ్యనఁ ◆ జౌరంగి పాణి
కమలపుటంబునఁ ◆ గమలముల్ నించి
తిమిరికొన్నను దప్పి ◆ తీఱకయున్నఁ
దనుఁ బొడగాంచిన ◆ దవ్వులఁ దొలఁగి
చనుమృగపక్షి సం ◆ చయము వీక్షించి
యరుగుచు నంత స ◆ హ[54]కరభూజంబు
చలిత శాఖోచ్ఛాయ ◆ జడిగొను చున్న
సైకతస్థలిఁ బథి ◆ శ్రమ మెల్ల దీఱఁ
జేకొని శయనించి ◆ చిత్తంబు నలర
నంచితలీల శా ◆ ఖాగ్రంబు లందు
సంచరించెడి శుక ◆ శారికా బర్హి
కలపిక కలకంఠ ◆ కలకలధ్వనులు
పలుమాఱు వీనుల ◆ పండువై పొలయ
వినుచు సుఖంబున్న ◆ వేళ నహీంద్రుఁ
డొనర నచ్చటి కొక్క. ◆ డొయ్యన వచ్చి
తీరపాదప మెక్కి ◆ తిరముగా దాని
తోరంపు గొమ్మలఁ ◆ దోఁకఁదాఁ జుట్టి
జలపానతృష్ణ నా ◆ సరసీలోపలికిఁ
దల చాచి తోయంబు ◆ త్రాగునయ్యెడను
నెగ డందులోనుండి ◆ నిగిడి యాపాము
దగులఁబట్టిన నది ◆ తల్లడపడఁగ
సుదగొమ్ముతోనంటఁ ◆ జుట్టినతోఁక
వదలక తివుపాము ◆ వడిమీఁద నెగడు
కడిమిమైఁ దివియవృ ◆ క్షము వేళ్లతోడఁ
దొడిఁబడఁ బెకలి త ◆ త్తోయంబులందు
భోరున బుగ్గలు ◆ వొడమంగ మునిఁగె

నారీతి సిద్ధుఁడు ◆ నాజలగ్రహము
బలిమికి నాశ్చర్య ◆ పడు నంతలోనఁ
గలుషించి నక్రముఁ ◆ గంపింపఁ గఱచి
విడుపించుకొని పాము ◆ వృక్షంబుతోను
వడిఁ దేలి మీఁదికి ◆ వచ్చె నత్తరువు
వదలి చయ్యనఁ జని ◆ వదలని యలఁత
నొదుఁగుచు నొక కాష్ఠ ◆ మొయ్యనఁ గఱచి
కొనివచ్చునాఁడు న ◆ క్కుజము మూలంబు
...... ...... ...... ...... ...... ...... ...... ......
దప్పికిఁ జనుదెంచి ◆ తగుజలం బాను
నప్పుడు మిగుల దా ◆ నాఁ కొన్నదగుట
నొదుఁగుచు దానిని ◆ నొయ్యనఁ గదిసి
యదరంటఁ బట్టె న ◆ ల్లప్పుడు పాముఁ
గదిసియుఁ జౌరంగి ◆ కరుణ దీపింప
మొదల వృక్షము నిల్ప ◆ మోపినకాష్ఠ
మక్కజంబునఁ దెచ్చి ◆ యాపాముపొట్ట
వక్కలమోపిన ◆ వడిఁగూడి పొదలి
సైకమై మెఱుఁగారు ◆ సంది గొందెఱుఁగ
రాకుండె నప్పు డా ◆ రట మెల్ల మాని
ఫణీనాథుఁ డొయ్యనఁ ◆ బడగెత్తి నిక్కి
ఖణి మీఱ చౌరంగిఁ ◆ గనుఁగొని పలికె
సనఘాత్మ మీ రెవ్వ ◆ రయ్య నేఁడే మొ
పనికిఁగా నిచటికే ◆ పగిది వచ్చితిరి
ననుఁజావకుండఁ బ్రా ◆ ణములు గాచితిరి
మనిపిన తెఱఁగు న ◆ మ్మతిఁ జెప్పవలయు
ననినఁ జౌరంగియ ◆ య్యహికులోత్తముకు
విను మని పలికే న ◆ వ్విధ మెల్లఁ దెలియ
సరసిజాసన పాక ◆ శాసన ప్రముఖ
సురగణమకుట భా ◆ సురమణి కిరణ
బృందరంజితపాద ◆ పీఠు[55]డై మెఱయు
కందర్పసంహరు ◆ గారాపుఁబట్టి
మీననాథుం డను ◆ మేటి సిద్ధునకు

నేను శిష్యుఁడ ధర ◆ ణీపతి సుతుఁడ
సహినాథ చౌరంగి ◆ యనెడి సిద్ధుఁడను
మహిమఁ బెంపొందిన ◆ మద్గురుదేవుఁ
డీమాల్యవంతమ ◆ హీధరమందు
క్షేముంబుమీఱ వ ◆ సించి యున్నాఁడు
వారలదివ్యాంఘ్రి ◆ వనజంబు లర్థి
చేరి కొల్చెద నను ◆ చింత నున్నాఁడఁ
గడు దప్పిగొని యుద ◆ కంబులు గ్రోల
నెడపక మడుఁగున ◆ కేతెంచి జలము
నిమ్ములఁద్రావి నే ◆ నీచెట్టునీడ
నెమ్మది వసియించి ◆ నీ విధం బెల్లఁ
గనుచుంటి నని తన ◆ కథ లొప్పఁ జెప్పి
కొనుమిదె నీవుగై ◆ కోఁ దెచ్చినట్టి
మందు చక్కని దని ◆ మసలక యిచ్చె
డెందంబునందుఁ బా ◆ టిల్లు మోదమున
నతనితో నురగ మి ◆ ట్లనియె భూ తేశు
సుతుఁడైన మత్స్యేంద్ర ◆ సూనుండ వగుటఁ
జనఁగొను మిత్తు నీ ◆ సంధానకరణి
ననుచుఁ జౌరంగికి ◆ నౌషధం బొసఁగి
మఱియు నిట్లనియెను ◆ మత్స్యేంద్రుఁ జూడ
నఱిమెడు ముదము నా ◆ యంతరంగమునఁ
దెలుపుమ యది యేమి ◆ తెఱఁ గన్నఁ దొల్లి
తలపోయనొక్క. గం ◆ ధర్వుఁడనేను
శాపకారణమున ◆ సర్పవేషంబు
నేపారఁ గైకొని ◆ యిట్లున్న వాఁడ
నమ్మహాత్మునిఁ జూచి ◆ నప్పుడే తనకు
ముమ్మరంబగు శాప ◆ మోక్షంబు గలుగుఁ
గ్రచ్చర సంధాన ◆ కరణి నీ కిప్పు
డిచ్చితి నిచ్చెద ◆ నిఁకదీనితోడ
మందులు మీ రిందు ◆ మరలియేతేరఁ
బొందుగా నట వేగఁ ◆ బోయి రమ్మనుచుఁ
వినయమొప్పఁగఁ బాము ◆ వీడ్కొని వేగఁ
జనియె నచ్చటు వాసి ◆ చౌరంగినాథుఁ

డరిగి ముందటఁ గాంచే ◆ నామాల్యవంత
ధరణీధరమును నం ◆ తట దుగ్ధవంత
వరసరోవరఫుల్ల ◆ వనజాతజాత
పరిమళంబులు మును ◆ పడఁ గానుకిచ్చి
తవిలిసేవింప మో ◆ దము మీఱఁ జూపి
చవురంగిపై వీచెఁ ◆ జల్లనిగాలి
యతఁ డప్పు డాశైల ◆ మల్లన నెక్కి
నుతికెక్కు చున్న స ◆ న్ముని నివాసముల
కరిగి జగత్పూజ్యుఁ ◆ డగుమీననాథు
చరణపద్మంబులు ◆ సద్భక్తిఁ గొలిచి
బ్రదుకుసిద్ధుండఁ జౌ ◆ రంగి నే ననుచు
నొదవుసంప్రీతి వా ◆ రొసవు దుగ్ధములు
గొని తృప్తి నొందుచు ◆ గురునాథుఁ డున్నఁ
గని గుహాభవనంబు ◆ గదియంగ నేగి
యాలోనఁ బరమయో ◆ గానంద వార్థి
నోలలాడుచునున్న ◆ యోగివరేణ్యుఁ
బొడగాంచి యందంద ◆ భువిఁ జాఁగి మ్రొక్కి
కడుభక్తితోఁ గర ◆ కమలంబు మొగిచి
శ్రీగురునాథ యా ◆ శ్రితపారిజాత
యోగిగోచరవంద్య ◆ యోగిప్రభావ
యోగిచూడామణి ◆ యోగవిజ్ఞాన
సాగరపూర్ణిమా ◆ సంపూర్ణ చంద్ర
భోగిభూషణ పుత్త్ర ◆ భువనైకవినుత
రాగవిరోధాది ◆ రహిత సంసార
దూర దుస్తరమహా ◆ దురితాంధకార
వారిజమిత్ర ◆ గీర్వాణపారీణ
విజితారిషడ్వర్గ ◆ విమలాంతరంగ
సుజనానుకూల వి ◆ శ్రుతదయాలోల
యని వినుతింపంగ ◆ నతి సంతసించి
కని యాత్మయోగంబు ◆ కర మర్థితోను
దెలిసి శంకరు మహా ◆ దేవుఁ బరేశుఁ
దలఁచి చేతులు మోడ్చి ◆ తలఁజేర్చి మ్రొక్కి
క్షితిఁ జాఁగిమ్రొక్కిన ◆ శిష్యు లె మ్మనుచు

నతికృపామతిఁ బల్క ◆ నాతఁడు భక్తి
సంధిల్లఁ దనకుఁ ద ◆ క్షకుఁ డిచ్చినట్టి
సంధానకరణి ని ◆ జంబుగాఁ జూపఁ
బ్రమదంబుతోడఁ జౌ ◆ రంగి నీ కెచట
సమకూరె నిప్పుడు ◆ సంధానకరణి
నావుడు నామీన ◆ నాథుతో నతఁడు
తా వచ్చినట్టి వి ◆ ధంబును ద్రోవఁ
బొడగాంచినట్టి యా ◆ భుజగంబుకథయుఁ
దడయక చెప్పి మీఁ ◆ దట నయినట్టి
లలితదివ్యౌషధ ◆ లాభంబు దెలియఁ
బలికి మి మ్మటకు రాఁ ◆ బ్రార్థనఁజేసె
నాపన్నగాధిపుం ◆ డనుటయు ముదము
దీపింపఁ బలికె సు ◆ స్థిరమతిఁ బూని
యోగవిద్యాభ్యాస ◆ [56]మొనరిస్తి నీకు
బాగుగాఁ గరపద ◆ పాటవం బెసఁగ
నున్న దె మమ్ము ని ◆ ట్లూఁదినభక్తిఁ
బన్నుగాఁ గొలుచు గో ◆ పాలముఖ్యునకు
క్షేమమే యనుటయు ◆ శ్రీ గురునాథ
మీ మహామహిమను ◆ మించుతత్పాణి
పదయుగములఁబొల్చి ◆ ప్రతిదివసంబు
విదితయోగాభ్యాస ◆ విధము నేమరక
పూని యనుష్ఠింతుఁ ◆ బుణ్యాత్ముఁడైన
ధేనుపాలకుఁడు సు ◆ స్థితి నున్న వాఁడు
నావుడు వినీ మీన ◆ నాథుఁ డిట్లనియె
నీ విందు వచ్చుట ◆ నిజముగాఁ జెప్పి
వినుతికెక్కిన యోగ ◆ విద్యోపదేశ
మొనరంగఁ బశుపాలు ◆ కొసఁగితే యనిన
వడకుచుఁ జౌరంగి ◆ వాతెఱ భీతిఁ
దడుపుచు విన్ననై ◆ తలవంచి పలికె
గురునాథ వేగ మ ◆ గుడనైతిఁ జెప్ప
వెర వేది మొఱఁగి యా ◆ విమలాత్ముతోడఁ
జెప్పక యిందు వ ◆ చ్చితి నింక నిట్టి

తప్పు సహించి చి ◆ త్తంబునఁ గరుణ
చిప్పిల నన్ గటా ◆ క్షించి రక్షింపు
...... ...... ...... ...... ...... ...... ....... ......
మని వేఁడుకొనుమాట ◆ మఱి బిట్టు చెవులఁ
గనలుశూలము నాటి ◆ కసిగినట్లయిన
నుల్లంబు గలఁగి బి ◆ ట్టులికి బాష్పములు
పెల్లుగాఁ దొరఁగంగఁ ◆ బేర్చుదుఃఖమున
నలఁగుచు మత్స్యేంద్రుఁ ◆ డనియెఁ జౌరంగిఁ
దలపోయ నాయజ్ఞఁ ◆ దలమీఱి నీవు
ఒక గొల్లవానిగా ◆ నూహించి తట్టి
సుకృతాత్ము ననిశంబు ◆ శుద్ధచారిత్రు
గురుభక్తి నిరతు స ◆ ద్గుణ విభూషణునిఁ
బరహితవ్రతలోలుఁ ◆ బరమకల్యాణు
వంచించి రాఁ గాళ్లు ◆ వచ్చెనే నీకు
నించుక మనమున ◆ నీతియులేదు
నాత .... .... నైన ◆ నమ్మించి చెఱుచు
పాతకంబున కొడఁ ◆ బడదె నీమనసు
తిట్టురట్టుల కోర్చి ◆ తెఱవమాటలకు
నట్టక నడు రేయి ◆ నందనుం డనెడి
యక్కఱలేక నీ ◆ యంఘ్రిహస్తములు
చక్కు చేయించిన ◆ జనపతిపట్టి
వగునీకుఁ గనికర ◆ మదియేల కలుగు
జగతిపై నింబబీ ◆ జము నించియుండ
మొలచునే వింతగా ◆ ముదము దీపింప
సలలితమధుర ర ◆ సాలభూరుహము
కప్పురంబునఁ బాదు ◆ గావించి పసిఁడి
కొప్పెరఁ బన్నీరు ◆ కొనితెచ్చి పోసి
తనరఁ బెంచినఁ దొల్లి ◆ తనకంపు మాని
వనరుహంబులతావి ◆ వలచునే యుల్లి
క్షత్త్రియుల్ దమపని ◆ సమకూరుదనుక
మిత్రులఁ బోలి న ◆ మ్మిక పుట్ట నుండి
యచ్చి వచ్చినవేళ ◆ నభియాతులట్లు
చెచ్చెర నొకకీడు ◆ చేసి పోవుదురు

నీచాత్మ ప్రొద్దున ◆ నీకు క్షీరముల
నేచిన సద్భక్తి ◆ నిచ్చి పోషింపఁ
గరచరణోత్పత్తి ◆ గలిగె నీ కనుచుఁ
బరిణామ మందు న ◆ ప్పశుపాలతిలకు
నే మని మొఱుఁగితి ◆ వే మని చూతు
నీమోము పోపొమ్ము ◆ ని న్నోమినట్టి
ఫలమెల్లఁ గలిగె నా ◆ పాల వసింప
వల దని గోపాల ◆ వ(రునిఁ జి)త్తమునఁ
దలఁచి యోసజ్జన ◆ స్తవనీయచరిత
తలకొన్న గురుభక్తిఁ ◆ దము మీఱరాని
యలఘుపుణ్యాధికు ◆ లవనిఁ బెక్కండ్రు
గలరు లే రనరాదు ◆ గాని నీ వంటి
వారలఁ గాన మె ◆ వ్వలనను నిన్ను
గారవంబున శిష్యుఁ ◆ గావించు కొనెడి
యా పుణ్య మేటికి ◆ నబ్బుఁ జౌరంగి
కీ పాపకర్మున ◆ కిచ్చలో నమ్మ
(నుల్ల) మారఁగనమ్మి ◆ యుపదేశ మిక
[57]కల్లచేసెనె యూర ◆ కయెకన్ను మొఱఁగి
చౌరంగి వచ్చిన ◆ జాడ నీ వెఱుఁగ
నేరక గుహలోన ◆ నెమక విభ్రాంతి
నెచ్చటఁ బరికించి ◆ తెచ్చటఁ బిలచి
తెచ్చట వగచితి ◆ వెచ్చటఁ దిరిగి
తయ్యయో శిష్యుండ ◆ నడకించిపోయె
నెయ్యెడఁ బొడగాంతు ◆ నింక నే ననుచు
జూమర్లు గుడుచుచు ◆ సొలయుచు నాత్మ
నేమని దూఱితి ◆ వింక నీకిట్టి
యోగ మేనునువచ్చి ◆ యొసఁగుదు నీకు
వేగంబె ఘనయోగ ◆ విద్యోపదేశ
మనుచు దిగ్గున లేవ ◆ నమ్మీన నాథు
కనియెను జౌరంగి ◆ హస్తముల్ మొగిచి
గురునాథ భవదీయ ◆ కోమలపాద
సరసిజంబులు గొల్వఁ ◆ జయ్యన నాత్మ

గరకొనుతమకంబు ◆ కతన నీ పంపు
మఱచి వచ్చిన తప్పు ◆ మన్నన మీఱఁ
గోపంబు తక్కి లోఁ ◆ గొని తొల్లిటట్ల
చేపట్టి కరుణ వీ ◆ క్షింపవే నన్ను
సకలజగత్పూజ్య ◆ జనకుఁ డారీతి
నొక విచారముచేయ ◆ కూరక పంపి
యఱవంగఁ గోయించె ◆ నంఘ్రిహస్తములు
నఱకించుటయును బ్రా ◆ ణములు నూటాడ
వనరుచు నున్న జీ ◆ వస్మృతు నన్ను
మనిచితి విఁక నీదు ◆ మహిమ వర్ణింప
నల శేషుఁడును జాలఁ ◆ డనిన నాబోటి
కలవియే నాతండ్రి ◆ కలవియె తల్లి
...... ...... ...... ...... ...... ...... ...... ......
వైనను నీవే మా ◆ స్వామివి నీవె
అనియని పలుమాఱు ◆ నందంద వేఁడు
కొనుచుఁ జాఁగిలియు మ్రొ ◆ క్కుచు నున్నవానిఁ
గలఁగిన చిత్తంబు ◆ గల మీననాథుఁ
డలుకఁచాలింప కి ◆ ట్లనియెఁ జౌరంగిఁ
జెదరక నీవొన ◆ ర్చిన కల్లతనము
పదివేలుచెప్పిన ◆ పాయ దుల్లమునఁ
బాపాత్మ నీవు నా ◆ పంపినపంపుఁ
ద్రోపునఁగూటమి ◆ దొలఁగి వచ్చితివి
గాన నేరమికి నీ ◆ కతన సంతాన
హీనుండ వై యుండు ◆ మింకని ఘోర
శాపమిచ్చిన తఱి ◆ సామర్థ్య మడఁగెఁ
దాపంబు దీపింపఁ ◆ దన గురు నాధు
పదముల వ్రాలి బా ◆ ష్పాంబుసంకలిత
వదనుఁడై మగుడలే ◆ వక గురునాథ
బడుగుపిచ్చుక మీఁదఁ ◆ బాశుపతాస్త్ర
మడరించు గతి మది ◆ ననుకంప లేక
దీనుని నీయాజ్ఞ ◆ దీకొన లేని
వాని నెంతటి వానిఁ ◆ గాఁ దలంచితివి
శాపమిచ్చితి వని ◆ చాల దుఃఖించు

నాపన్నుఁ జౌరంగి ◆ నాత్మ నొక్కింత
కనికరం బొదవంగఁ ◆ గనుఁగొని భర్గు
తనయుఁ డిట్లనియెఁ బు ◆ త్రక నేము నీకు
వెలయనిచ్చిన యోగ ◆ విద్యయు నెన్నఁ
గలసిద్ధియును మఱిఁ ◆ గాయసిద్ధియును
దప్పదు సిద్ధసం ◆ తతి లేదు గాని
చొప్పడ నఱికి యె ◆ చ్చోనైనఁ బాత
నిగిడించి మించియు ◆ నీమహీరుహము
జగతిపైఁ బరుగు నీ ◆ సంతాన మనఁగ
ననుచుఁ జౌరంగి నూ ◆ రార్చి సమ్ముదము
నొనరించి కదలిన ◆ యోగివరేణ్యుఁ
డరుదుగా మును వచ్చి ◆ నట్టి మార్గమున
నరిగి నరేంద్రు మ ◆ హా మహీధరముఁ
గని తనతొల్లిఁటి ◆ ఘనగుహాద్వార
మున నున్నసిలలెల్లఁ ◆ బుచ్చిపోవైచి
పటుబుద్ధిఁజొచ్చి లో ◆ పల నిజకక్ష
పుటదండములు నిల్పి ◆ భూతేశుతనయుఁ
డగ్గుహాంగణమున ◆ నచ్చ వెన్నెలల
నిగ్గులు దులకించు ◆ నిర్మలస్ఫటిక
భాసురోపలముపైఁ ◆ బ్రమదంబు మీఱ
నాసీనుఁడై యెప్పు ◆ డరుదెంచు నిటకు
గోపాలతిలకుఁ డా ◆ గురుభక్తినిరతు
నేపార వీక్షింప ◆ నెప్పుడు గలుగు
హృదయంబు విలసిల్ల ◆ నింక నా కనుచు
నెదురు చూచుచునుండె ◆ నింతట నతఁడు
గురు నాత్మఁ గానక ◆ కుందుచు నపుడు

గోరక్ష సిద్ధునికథ.



పొరిఁ [58]జిన్న వోయిన ◆ మోముతోడుతను
ముదుకుగొంగడి నిండ ◆ ముసుఁగిడి పసుల
నదరించుకోలయు ◆ నావులపాల
కుండయుఁ గేలఁగై ◆ కొని తలవంచి
యొండుదిక్కులఁ జూపు ◆ లొలయంగ నీక

దుగుదాయ మొదవఁ ద ◆ ద్గురుగుహ డాసి
మొగమెత్తి యానాథ ◆ ముఖ్యు నీక్షించి
సయ్యన ముదము నా ◆ శ్చర్యముం బొదవ
నయ్య వచ్చె నటంచు ◆ నందంద వసుధఁ
జాఁగిలి మ్రొక్కి త ◆ చ్చరణముల్ ఫాల
భాగంబు గదియించి ◆ భక్తి నుతింప
నాపశుపాలుని ◆ నత్యాడరంబు
దీపింపఁ బిలిచి త ◆ దీయమస్తమున
వక్షస్థ్సలంబు మో ◆ వఁగఁ గౌఁగిలించి
పక్షమేర్పడను గృ◆ పాదృష్టిఁ జూచి
సేమమే గురునాథ ◆ సేవానురక్త
సేమమే సుజనభూ ◆ షిత గుణోదార
సేమమే పావన ◆ శీలసంపన్న
సేమమే గోపాల ◆ శేఖర నీకు
నీమహీశులకును ◆ నీ బంధువులకు
నీమందపసికిని ◆ నీ గొల్లలకును
మేలె నెన్ముదె భద్ర ◆ మే కుశలంబె
చాల నేరమిచేసెఁ ◆ జౌరంగి నీకు
నుపదేశమీక ని ◆ న్నూరక మొఱఁగి
చపలుఁడై మాయున్న ◆ శైలంబునకును
జనుదెంచుటయు నాత్మ ◆ సంతాప మంది
నిను సిద్ధుఁగావింప ◆ నేనె వచ్చితిని
నీ గురుభక్తికి ◆ నీ నడవడికి
నీ గోలతనముకు ◆ నీ ధర్మరతికి
నిచ్చలో మెచ్చితి ◆ నింక నిక్కముగ
నిచ్చెద నాకు భూ ◆ తేశుఁడు గణఁక
నిచ్చిన సామర్థ్య ◆ మింక నీ కనుచుఁ
(జెచ్చెరఁ) జౌరంగి ◆ చేరి నీ వతనిఁ
గొనిపోయి నర్మదఁ ◆ గ్రుంకు పెట్టించి
కొనిరమ్ము నావుడు ◆ గురునకు మ్రొక్కి
గోపాలవరునిఁ దో ◆ డ్కొని యటపోయి
యాపుణ్యనదిలోన ◆ నవగాహ మొనరఁ
జేయించి తెచ్చినఁ ◆ జిత్తమేర్పడను

నా యోగిపుంగవుఁ ◆ డా పశుపాలు
ననువొంద సిద్ధాస ◆ నమునఁ గూర్చుండ
నునిచి మహాదేవు ◆ నురగభూషణునిఁ
దలఁపులోపల నిల్పి ◆ తన దివ్యపాణి
జలరుహం బతని మ ◆ స్తకమున నిలిపి
మసలక యొక్కొక ◆ మంత్రోపదేశ
మొసఁగి తదీయ పూ ◆ ర్వోత్తరాంగంబు
లెఱిఁగించియును నియ ◆ (మించెడి) క్రమము
నెరయంగ నెఱిఁగించి ◆ నెరి నటమీఁదఁ
బూర్వయోగాఢ్యుఁగా ◆ బోధించి పిదప
వేర్వేఱ గుణములు ◆ వేధలు తెలిపి
కడమ సంకల్ప వి ◆ కల్ప వంక
...... ...... ...... వైచి ని ◆ ష్కల్మషుఁ జేసి
సిద్ధముఖ్యుఁడు మరి ◆ శివుఁ డిచ్చినట్టి
సిద్ధులన్నియు నెడ ◆ సేయక యొసఁగి
సిద్ధులలోనఁ బ్ర ◆ సిద్ధుఁగాఁ జేసి
బుద్ధిలోపలఁ దల ◆ పోసియు నెప్పు
డెదిగెడి గోవుల ◆ నింద్రియంబులను
వదలక రక్షించు ◆ వాఁడు గావునను
అచ్చుగా గోరక్షుఁ ◆ డనియెడి నామ
మిచ్చితి ననుటయు ◆ నిలఁజాఁగి మ్రొక్కి
(పదభక్తి) చౌరంగి ◆ పదముల కెఱఁగి
చెదరక వచ్చి ని ◆ ల్చిన శిష్యునకును
నీరువట్టు దొలంగ ◆ నిద్రహారములు
...... ...... ...... ...... ...... ....... ........
...... ...... ....... ....... ........ ........ .......
మట్టుపడంగను ◆ మఱువఁగాఁజేయఁ
జాలినయట్టి యౌ ◆ షధముల నిచ్చి
కాలపంచకశక్తి ◆ కారణంబైన
ప్రకటసమాధిఁ జౌ ◆ రంగియుఁ దాను
సకలంకమతి నుండె ◆ నమ్మీననాథుఁ
డింతట రాజ మ ◆ హేంద్రభూపాలుఁ
డంతరంగంబున ◆ నంతకుఁ దనరు

సుతు నాజ్ఞ పెట్టించ్చి ◆ [59]సురసుర వెచ్చి
మతితప్పి తేజంబు ◆ (మాలి యావెన్క)
నంతకగోచరుం ◆ డయినఁదదీయ
సంతతియందు రా ◆ జ్యము నిస్తరించఁ
గలవార లెవ్వరుఁ ◆ గలుగమిఁజేసి
యలకక సామంతు ◆ లగు బలవంతు
లోక్కొక దుర్గంబు ◆ (నొగినాక్రమించి)
పెక్కుభంగులఁ బ్రజా ◆ పీడ యొనర్పఁ
గనుకని వారు నల్ ◆ గడ విచ్చి పఱవ
జనశూన్య మయ్యెఁ ద ◆ జ్జనపదం బెల్ల
నతనిభాండారము ◆ నాలమందలును
బ్రతిలేని గజములు ◆ బహుతురంగములుఁ
గణఁజంబు లాదిగాఁ ◆ గలుగు సంపదలు
గణుతింపఁజోద్యంబు ◆ గాఁగ నెచ్చోటి
వచ్చోట నణఁగె ము ◆ న్నటఁ బశుపాలుఁ
జెచ్చెరఁగానన ◆ సీమయందెల్ల
వెదకి కానక తోడి ◆ [60]వ్రేలును వగల
నదవదఁ బొందుచు ◆ నంత నత్యుగ్ర
మృగములు మెసఁగి చం ◆ పెనకాఁ దలంచి
మగిడి యేగిరి తమ ◆ మందల కచటఁ
గదలక మరికొంత ◆ కాలంబు చనఁగఁ
దుది మును మీన నా ◆ థుండు సమాధిఁ
దెలిసి తాఁ జౌరంగి ◆ దెలిపి గోరక్షుఁ
[61]దెలుపు నీ వన గ ను ◆ స్థితి నాతఁడట్ల
గావించె నిద్ర మే ◆ ల్కనినచందమున
నావల్లవోత్తముఁ ◆ డల్లనకన్ను
గవవిచ్చి పెద్దయుఁ ◆ గాలంబు కణఁక
...... ...... ....... ....... ....... ....... .......
....... ....... ....... ....... ....... ....... .......
వికసింపఁ జేసి వా ◆ విరి గురుస్వామిఁ
గనుఁగొని నేవచ్చి ◆ కడుతడ వయ్యెఁ
బనివినియెద నన్నుఁ ◆ బనువు మందలకుఁ

జేరఁబ్రొద్దుటికన్నఁ ◆ జిఱునవ్వు నవ్వి
యారాజయోగి యి ◆ ట్లనియె నోమాట
పసులును మీ భూమి ◆ పతులుఁ దదీయ
వసురత్న ధాన్యాది ◆ వస్తుసంతతులుఁ
బొలుపఱి తడవయ్యెఁ ◆ బురమును నేలఁ
గలసెఁ దొల్లిటివారు ◆ గారుభూజనులు
నని వారి విభ్రాంతి ◆ యడఁగింపఁ దలఁచి
పెనుపొందఁ జౌరంగి ◆ బిలిచి మీ రేగి
మీపురంబును రాజు ◆ మీగోకులంబు
నేపార వీక్షించి ◆ యేగి రం డనుచు
ననిపిన సుముఖులై ◆ యాగిరి డిగ్గి
చన జనశూన్యమై ◆ చాల రూపడఁగు
తమభూమిఁ గాంచి త ◆ ద్దయు విస్మయంబు
సమకొని గోరక్షు ◆ జౌరంగి సూచి
రాజసంబున సుర ◆ రాజును బోలు
రాజనరేంద్ర భూ ◆ రమణుఁ డెం దేగెఁ
దిరముగా నమరావ ◆ తీ పట్టణంబుఁ
బురణించు మాంధాత ◆ పుర మెం దణంగె
నాపురజనులును ◆ నట్టి సంపదలు
నాపురపాలురు ◆ నా గోవ్రజంబు.
నెటఁబోయె నేమయ్యె ◆ నెందేగె నెచట
మటుమాయమయ్యె శ్రీ ◆ మాంధాతప్రోలు
పోలఁగా నలనీరు ◆ బుగ్గలకంటెఁ
జాల నిస్సార మీ ◆ సంసారసుఖము
అని మది రోయుచు ◆ నచ్చట నచట
మునుమైన పట్టణం ◆ బులను వీక్షించఁ
జని యొకకొంత దే ◆ శమునఁ జరించి
మనము గ్రమ్మఱనేగి ◆ మత్స్యేంద్రు చరణ
సరసిజాతములు ని ◆ శ్చల భక్తిఁ గొలిచి
పరమయోగానంద ◆ పదవి నుండుదము
పద మని వచ్చి యా ◆ పర్వతం బెక్కి
ముదమార గురునికి ◆ మ్రొక్కి వీక్షించి
దేవ మీ రప్పుడు ◆ దివ్యచిత్తమున

భావించి యేఫక్కిఁ ◆ బలికితి రట్ల
లేకపోయినవి తొ ◆ ల్లిటివి యేమియును
మాకు దుర్మోహంబు ◆ మదమును బోలె
ననుటయు మత్స్యేంద్రుఁ ◆ డల్లన నవ్వి
వినుము గోరక్షక ◆ వెలయ శరీర
సిద్ధులాదిగఁగల ◆ సిద్ధులన్నియును
సిద్ధించెమును మీకు ◆ శీతాంశుధరుఁడు
మన్నన నొసఁగిన ◆ మహనీయమహిమ
లన్నియు నొసఁగెద ◆ మవి నీవు దాల్పు
ప్రథమ శిష్యుండు చౌ ◆ రంగి మా కయిన
బుధగుణంబులను ని ◆ పుణుఁడవుగానఁ
బ్రఖ్యాత రాజ్య భా ◆ రముఁదాల్చి సిద్ధ
ముఖ్యుండనై నీవు ◆ ముదమున శిష్య
జనబోధకరయోగ ◆ శాస్త్రంబు లెలమి
నొనరింపు మనుటయు ◆ యోగి శేఖరుని
చరణంబులకు వ్రాలి ◆ చౌరంగినాథుఁ
డరయ మాకంటెను ◆ నగ్రశిష్యుండు
మైకొనఁ బంపుఁ డే ◆ మరక యయ్యనఘుఁ
జేకొని మిముఁ బోలె ◆ సేవింతు ననిన
నగు నది చెప్పిన ◆ యట్ల మాయాజ్ఞ
మిగిలి యాతఁడు తెంపు ◆ మెయి నిన్ను మొఱఁగి
మమ్ము సందర్శింప ◆ మాల్యవంతముకు
గ్రమ్మఱి వచ్చిన ◆ గతమునఁ జాలఁ
గోపంబు వొదవిన ◆ గురుపదంబునకుఁ
బాపినారము గాన ◆ పాత్రుండ వీవె
నావుడు శ్రీ గురు ◆ నాథ నీ వలుగ
నేవెంటఁ దలఁప నే ◆ నెంతటి వాఁడఁ
దప్పులన్నియు భవ ◆ త్పదపద్మసేవ
నొప్పులైనవి మున్ను ◆ నున్న వేమిటీకి
నేరకున్నను రక్ష ◆ ణీయుల మమ్ముఁ
గారుణ్యమునఁ బ్రోవఁ ◆ గా మీకుఁ బోలు
మన్నింపు మనుటయు ◆ మా మాటదప్ప

[62]నిన్ని చెప్పకు మన్న ◆ నీకొనకున్న
గోరక్షు గురుఁడు గ◆. న్గొని యిట్టు లనియెఁ
జౌరంగి గురుని ప ◆ క్షస్థితి దలఁపఁ
బరమార్థ మెందురాఁ ◆ బనిలేదు మాకుఁ
బరిణామ మియ్యది ◆ పని కియ్యకొనుము
అని బుద్ధిచెప్పిన ◆ నంగీకరించి
వినతుఁడై హస్తార ◆ విందముల్ మొగిచి
యున్న గోరక్షుని ◆ నున్నతంబైన
సన్నుతం బగు యోగ ◆ సామ్రాజ్యమునకు
మొదలఁ బట్టముగట్టి ◆ ముదమొప్పఁ దనకు
మదనారి యొసఁగిన ◆ మహిమ లన్నియును
దప్పక కృపచేసి ◆ ధన్యుఁగావించె

సర్పరూపమొందిన గంధర్వునికథ.



నప్పుడు చౌరంగి ◆ హస్తముల్ మొగిచి
గురునాథ నాతోడఁ ◆ గుంభీనసంబు
పరగఁజెప్పిన వాక్య ◆ పద్ధతి మీకు
విన్నవించితి నందు ◆ విచ్చేయుచిత్త
మున్న దేనియుఁ జను ◆ టొప్పు నిం కనిన
ఫలము నేకురునట్టి ◆ పని మేలుచేసి
తలఁపించి తని గుహ ◆ ద్వారంబునొద్ద
చాటుగాఁ గల్పించి ◆ చౌరంగీ త్రోవ
పాటిగాఁ జూప నా ◆ పథమున నెలమి
నరిగి కబంధర ◆ త్నాకరం బనఁగఁ
బరగెడు మడువును ◆ బద్మ పుష్పములుఁ
గని చేరఁజని ముఖ ◆ కమలంబునందుఁ
గనుపట్టు ఘనఘర్మ ◆ [63]కణము లాదివ్య
జలములఁ గడిగి యా ◆ షండాంబుజాత
కులశీతలచ్ఛాయఁ ◆ గొనియాడఁ దగిన
విమల సైకత భద్ర ◆ వేదిఁ గూర్చుండు
సమయంబునను గురు ◆ స్వామికిఁ నెఱఁగి
ఘనభుజంగము దప్పి ◆ గదిసి యచ్చటికిఁ
జనుదెంచినట్టి యా ◆ జాడయు దాని

పెనుపున వేళ్లతోఁ ◆ బెకలి తోయముల
మునిఁగి క్రమ్మఱఁదేలి ◆ మున్నున్నయట్టి
కుదురునఁబడిన యా◆ కుజముఁజౌరంగి
ముదమారఁజూపి చె ◆ ప్పుచు నున్న వేళ
విచ్చిన పడగలు ◆ వెలికి లోపలికి
వచ్చుజిహ్వలు విష ◆ వహ్నిధూమములు
నిగుడు హుంకృతులును ◆ నిడుదవాలమును
జిగిమించు పొడలును ◆ జిఱునిప్పు లురులు
గన్నులుఁ గెంపారు ◆ కంఠముల్ తలల
నన్నిటమెఱయు క ◆ ట్టాణిమణులును
గలిగి గరంటక ◆ ఘర్ఘరధ్వాన
మొలయ నయ్యురగేంద్రుఁ ◆ డొయ్యన నచ్చి
మడుఁగు డగ్గఱ విని ◆ ర్మల నలిలంబు
కడుపారఁగ్రోలి ము ◆ ఖంబు నిక్కించి
చేరి యా[64]పైన నా ◆ సీనులైయున్న
వారలలోనఁబూ ◆ ర్వము గనుంగొన్న
చౌరంగి వీక్షించి ◆ చయ్యన నేగి
కోరి తా మును సమ ◆ కూర్చినయట్టి
భవ్య ప్రభావసం ◆ పదఁ జెప్పమీఱు
దివ్యౌషధంబులఁ ◆ దెచ్చి సద్భక్తి
మెఱయఁ గానుక లిచ్చి ◆ మీననాథునకు
నెఱిఁగి త్రిలోకైక ◆ హితపుణ్యచరిత
పరమకృపాలోల ◆ భక్తానుపాల
దురితవిదూర బం ◆ ధురశుభాకార
పరమేశవరపుత్ర ◆ భవలతాదాత్ర
[65]నిరుపమశాంతాత్మ ◆ నిర్మలచ్ఛాత్ర
వారక నీమహ ◆ త్వము మున్ను వినియు
భూరితేజః స్ఫూర్తిఁ ◆ బొలయు ని న్నిపుడు
కనియు నాకన్నులు ◆ గల ఫలంబెల్ల
నొనరఁ గాంచినఁ బాసె ◆ నురుశాపదుఃఖ
మనుచు నప్పుడు భుజం ◆ గాకృతి మాని

తన పూర్వ గంధర్వు ◆ తనము వహించి
వినయంబుతోఁ దన ◆ వృత్తాంతమెల్ల
మనమార నిట్లనె ◆ మత్స్యేంద్రుతోడ
వినుపింతు మీకు నో ◆ విమలప్రభావ
యనిమిషాధిపుకడ ◆ నాదికుండలిక
నామంబు గలుగు గం ◆ ధర్వుఁడ నేను
పామునై యున్న నె ◆ పం బిది వినుము
ద్వాపరమునఁ బాండు ◆ వంశంబునందు
నాపరీక్ష్మి [66]తుఁడను ◆ నట్టి భూవిభుఁడు
వేఁటకై చని మహా ◆ విపినమధ్యమున
మాటలాడని నియ ◆ మంబునఁదపము
మేకొనిచేయు శ ◆ మీకు కంఠమున
భీకరంబగు పాము ◆ పీనుఁగు వైచి
పోయిన నమ్ముని ◆ పుంగవు శిష్యుఁ
డాయతప్రళయకా ◆ లాగ్ని కల్పుండు
శృంగినామకుఁడు చె ◆ చ్చెర వచ్చి కంఠ
(సంగతమైన) భు ◆ జంగశవంబు
తలఁపక యచలుఁడై ◆ తప మాచరించు
నలఘుతేజుని గురు ◆ నప్పుడు చూచి
యీ మహాత్ముని మెడ ◆ నీసర్పశవము
నేమూర్ఖు వై చె వాఁ ◆ డేడుప్రొద్దులకుఁ
దక్షుకవిషవహ్ని ◆ దారుణశిఖలఁ
[67]బ్రక్షీణచేష్టుఁడై ◆ భస్మమై పోవు
నని శాప మిచ్చిన ◆ నది యా శమీక
మునిశిష్యవరులచే ◆ మున్వడ నెఱిఁగి
యడరిన ప్రాణభ ◆ యంబున రాజు
కడుఁబొడవగు నొంటి ◆ కంబంబుమేడ
లోనుండ నంతటి ◆ లోఁ దక్షకుండు
నా నృపుఁ జంపుట ◆ కై విప్రవేష
మలవడఁ దాల్చితా ◆ నరుదెంచుత్రోవ
విలసిల్లునొకవట ◆ వృక్షంబునీడ
శయనించియుండ నీ ◆ జగతీశు నురగ

భయవిముక్తునిఁ జేసి ◆ బ్రతికింతు ననుచుఁ
దొ వృద్ధవిప్రుఁడై ◆ ధన్వంతరియును
వేవేగ వచ్చి యా ◆ విటపిమూలమునఁ
జేరిన నతని వీ ◆ క్షించి తక్షకుఁడు
[68]ఈరెవ్వ రిచటికి ◆ నేల వచ్చితిరి
నావుడు తక్షక ◆ నాగేంద్రుచేతఁ
జావకయుండ నా◆ [69]సంజీవశక్తిఁ
జూపి యాభద్రాత్మ ◆ జునిఁ గావజనెద
నా పేరు వినుము ధ ◆ న్వంతరి యనిన
నేనె తక్షకుఁడ నీ ◆ వెట్లు రక్షింపఁ
బూనెదు మద్విష ◆ [70]పూర్ణ దంష్ట్రలను
గఱచెద భస్మంబు ◆ గాను నీ పటము
నుఱక ము న్నున్నట్టు ◆ లుండఁ జేసెదవె
చూచెదఁగాక నీ ◆ చోద్యంబు ననుచు
నేచి నిజాకార ◆ మేర్పడఁ బెరిఁగి
విలయకాలానల ◆ విష ఫణిజ్వాల
చలదుగ్రజిహ్వావి ◆ శాలఫణంబు
కుఱుచగా [71]నోరకు ◆ గోడించి యొడిసి
కఱచిన గొబ్బునఁ ◆ గ్రమ్ము విషాగ్ని
పటలంబుచే భగ ◆ భగఁ గాలి పడిన
వటుతర వటతరు ◆ భస్మపుంజంబుఁ
జేరి సంజీవని ◆ సిద్ధమంత్రముల
నీర మాక్షణమె మం ◆ త్రించి చల్లినను
బసిడాలు నాకుజొం ◆ పములతో నొప్పి
యెసఁగుకొమ్మలతోడ ◆ నింద్రగోపముల
బాగునఁ బెంపారు ◆ ఫలములతోడఁ
దూఁగుశాఖలలోనఁ ◆ దొలఁకులయందు
నెలకొను బహుపక్షి ◆ నివహంబుతోడ
నలఁగకదానిపై ◆ నటనున్నయంత
యున్నతితోఁగూడ ◆ నుప్పరంబెగసి
పన్నుగఁబాదునఁ ◆ బడి విలసిల్లు
వృక్షంబుగనుగొని ◆ వెఱఁగంది నిలిచి

తక్షకుఁ డిట్లనె ◆ ధన్వంతరికిని
మహితాత్మ నీదివ్య ◆ మంత్రంబు మహిమ
మహిఁ జిత్రమగు నైన ◆ మనఁజేయరాదు
మునిశాపదగ్ధుఁడై ◆ ముడిఁగిన నృపుని
ననఘ నీ కతఁ డిచ్చు ◆ నర్థ మేనిత్తు
మిన్నకపొమ్మని ◆ మితిచేయరాని
పెన్నిధిఁజూపినఁ ◆ బ్రియమంది మరలి
యరిగె ధన్వంతరి ◆ యప్పుడు నేను
తరువుతోఁ దొడిఁబడ ◆ దగ్ధమైనట్టి
పరితాపమునఁ జేసి ◆ పాపంపు జీవు
లురగంబు లనుచు వా ◆ యోడక తమ్ము
దూషించుటయు నల్క ◆ తోఁ దక్షకుండు
భీషణదృష్టిఁ గం ◆ పింప వీక్షించి
జాతీయమైన మా ◆ చ ...... ...... .......
ఈ తెఱంగున మున్ను ◆ నెఱిఁగియు నెఱిఁగి
చెడ నాడితివిఁ గానఁ ◆ జెచ్చెర నీవు
కడుక్రూర మగు భుజం ◆ గమవు గమ్మనుచు
శాపమిచ్చుటయు నా ◆ క్షణమె నే నురగ
రూపంబు పూని యే ◆ రూపున నింక
నగు శాపముక్తి నా ◆ కని వేఁడుకొన్న
నగజేశునకుఁ గూర్మి ◆ నందనుండైన
ఘనుమీననాథునిఁ ◆ గాంచి భాషింపఁ
గనియెదు శాపమో ◆ క్షం బని పలికి
చనియెఁ దశకుఁడు నీ ◆ సందర్శనంబు
మనమునఁ గోరుచు ◆ మగిడియు మునిఁగి
యీభంగి నుండుదు .◆నీమఁడుగందు
నాభాగ్యవశమున ◆ నాథవరేణ్య
నెమ్మి విచ్చేసితి ◆ నీప్రసాదమునఁ
గ్రమ్మఱనాకంబు ◆ గనుగొనఁ గంటి
నని విన్నవించి వి ◆ యద్వీథి కెగసి
చనియె గంధర్వుండు ◆ సమ్మదంబెసఁగ
నని చతుర్దశ భువ ◆ నాధీశుపేర
వినుతవేదాగమ ◆ వేద్యుని పేర

భావనాతీత ప్ర ◆ భావుని పేర
సేవకోత్పలషండ ◆ శీతాంశు పేర
గంగాతరంగసం ◆ గతమౌళి పేర
భృంగీశతాండవ ◆ ప్రీతాత్ము పేర
ఘనముక్తిశాంత భి ◆ క్షావృత్తిహృదయ
వనజప్రభాతది ◆ వాకరు పేర
నభిమతార్థప్రదా ◆ యకుపేర నిత్య
శుభమూర్తి మల్లికా ◆ ర్జునుదేవుపేర
నారవితారశ ◆ శాంకమై వెలయు
గౌరనామాత్య పుం ◆ గవకృతంబగుచు
ననువొంద నవసిద్ధ ◆ నాథ చరిత్ర
మను కావ్యమున ద్వితీ ◆ యాశ్వాస మయ్యె !


  1. తన పోటరము
  2. నీకు వెరగంద్ద
  3. గలవారుమధుకర కీరసారములు
  4. లణువన
  5. సుందరి నా దెస
  6. నీనాథుతో
  7. కర్పూర.
  8. ఉచ్చారణ వశంబున 'ధుతి' యని భ్రాంతిపడి యిట్టియతి కవియే ప్రయోగించియుండును. చూ. పుట 41. సృపు... రెండు.
  9. తరమెన్న.
  10. ల విద్వాంసులు.
  11. వనగండ్లు గుళ్లుగా.
  12. జాలింబడి పొరలిన.
  13. తరిమిడక్కటమున.
  14. వెఱచియున్న.
  15. యనక.
  16. తెఱంగెల్ల.
  17. 'ఆనతి ' శబ్దము సంస్కృత మనుభ్రాంతిచేఁగవి ప్రయోగించి యుండును.
  18. బరిసెనంబుగ.
  19. యింక.
  20. ముదమున సూర్యు,
  21. మాద్రికిని.
  22. మృత్యువుకో.
  23. దిదిపుజేసి.
  24. సోలపున.
  25. సొంపెడలియున్న
  26. చనదు యీరీతి.
  27. దీనికి.
  28. విధికి నీవిట్లు.
  29. హాయనియేడ్చినా పోవంగబిట్టు.
  30. ఇటనన్వయము సరిపడుచున్నను నొకపాదము పోయినట్లున్నది.
  31. ఇటనన్వయము సరిపడుచున్నను నొకపాదము పోయినట్లున్నది.
  32. నుఱుకు.
  33. సభాగ్రముల.
  34. తూరినుయ్యలల లూగునెలుగుగల లొప్పు మ్రిగములు.
  35. దేవుని ననుదినంబేను.
  36. అనిశంబుమీర.
  37. కులాత్మకుడు.
  38. ముత్యములు పొలింపజాలు శంక్కుపూసల వనమాల.
  39. దిట్టుకొలుప.
  40. వంతునకు.
  41. దఱంగి.
  42. యాతత
  43. సొబగునపరంజి
  44. చంద్రంపుబరణి.
  45. మీదలిమినట్టియును.
  46. పాపంబుగట్టక.
  47. గురుపెట్టు.
  48. నెందొ.
  49. ంగి.
  50. వానిదా.
  51. నెదవడి:-- నిట్లని.
  52. గియుమాల్య వంతంబు చేరువ యెండవడచే.
  53. ఇటనన్వయము సరిగానెయున్నది కాని యొకపాదము లుప్తమైనట్లున్నది.
  54. సహకార భూజంబు జరిత ...జెలి.
  55. సిండుఁడై.
  56. ఇది వ్యాకరణవిరుద్ధముగా నున్నను గవిప్రయుక్తమనియే తోఁచెడిని
  57. కల్లచేసితివూర
  58. బొరి బొరిచిన్న పోయిన మోముతోడ.
  59. యునుజాల వెచ్చి
  60. పెయ్యలు.
  61. దెలుపునీవని సుస్థితిని మీననాధుడెల్ల .
  62. చెప్పక మన్ననీయా మీయన్న.
  63. ఘనకర్మ కన్నులా.
  64. పైననాసీనులై యున్న అనియే వ్రాతప్రతి పాఠము.
  65. నిరుపమశాంత నిర్మల
  66. క్షిత్తుండుయ నెడి.
  67. భక్షణ.
  68. మీ రెవ్వ.
  69. స్మరమంత్రశక్తి.
  70. వూరసిదడ్గు.
  71. కుఱుచగాజొర మొగ్గాణించి యొడసి.