నవనాథచరిత్ర/తృతీయాశ్వాసము

నవనాథ చరిత్ర

తృతీయా శ్వాసము

శ్రీ మీననాథుఁ డం ◆ చితభక్తిఁ దనకు
నా మేరుగంధర్వుఁ ◆ డర్పించి నట్టి
సారంబులైన యౌ ◆ షధము లన్నియును
గోరక్షుచేతికిఁ ◆ గొమరొప్ప నిచ్చి
కదల నల్లంతఁ జొ ◆ క్కపుమొల్లవిరుల
నొదవినకొప్పును ◆ నొకవంక చెంప
నడఁచిన యేదుకొ ◆ య్యయును జేగురను
బెడఁగుగాఁ దీర్చిన ◆ పెడవంక బొట్టు
వింతగాఁ జెక్కుల ◆ వెన్నెలచల్లు
దంతంపుఁ గమ్మలు ◆ ధళధళమంచు
[1]బరిమించుచన్నుగు ◆ బ్బలమీఁద వ్రాలు
గురువిందపూసల ◆ గుబ్బసరంబుఁ
బిరిగొన నల్లంటి ◆ [2]పెన్చిన నెమలి
పురి పచ్చవన్నెల ◆ పుట్టంబుఁ జంక
బరువుగాఁ బూనిన ◆ పండ్లపుట్టిక యుఁ
జెలువొందఁ జేత రా ◆ చిలుకలగూఁడుఁ
బచ్చికస్తురితోడ ◆ భద్రేభమదము
మెచ్చుగాఁ గూర్చిన ◆ మేనిపూఁతయును
గరమొప్ప ఘర్మాంబు ◆ కణములు గలయ
నెరసిన నెమ్మోము ◆ [3]నిండార నివము
వొలసిన విరితమ్మి ◆ పొలుపు నటింప
నలకలఁ బద నిచ్చి ◆ నట్టి పిల్లొత్తు
వలపు పిసాళింప ◆ వాలుగమీల
తళకుల మించియుఁ ◆ దలచుట్టి పాఱు
నిడువాలు గన్నుల ◆ నిగ్గులు వొలయ
నొడికంబుగావ... ◆ ....న మరుని

నీలోత్పలాస్త్రంబు ◆ నిగనిగ మెఱుఁగు
నీలపుత్రిక మరు ◆ నెలఁతుక కేలఁ
గేళిశుకంబు నాఁ ◆ గీర్తింపఁదగిన
బాల యొక్క తె తన ◆ పజ్జ నేతేర
నెక్కువెట్టిన విల్లు ◆ నేర్చిన (యమ్ము)
చిక్కువెండ్రుకకొప్పు ◆ చెవినున్న పీక
గోరోజనముబొట్టు ◆ గురువెందపేరు
పారుటాకుల కాసె ◆ పచ్చనిపొరక
పీలినెట్టెపుజుట్టు ◆ పెంచపూదండ
లీలఁ జెన్నారు పు ◆ ళిందుఁ డొక్కరుఁడు
వచ్చి యమ్మడువున ◆ వారిపూరంబు
చెచ్చెరఁ గ్రోలి యా ◆ చేరువ నున్న
సరసరసాలభూ ◆ జంబులనీడఁ
దరుణియుఁ దాను మో ◆ దంబున నుండి
కెలఁకులఁ గలయ నీ ◆ క్షించి బాలార్క
తులితాంశు మీననా ◆ థునిఁ బొడఁగనియు
నీమహామహుఁడు భూ ◆ తేశ్వరుం డైనఁ
బాములు తొడవులు ◆ ఫాలలోచనముఁ
బులితోలుకప్పును ◆ బునుకకంచమును
గలువలచెలికాని ◆ కళయుసు గలుగు
మనసిజాంతకునికు ◆ మారుఁడై వెలయు
ఘనుఁడు మత్స్యేంద్రుఁడు ◆ గాఁబోలు ననుచుఁ
గూరిమి ముదమునఁ ◆ గొంకుచుఁ జేరి
గోరక్షుచేత ని ◆ క్కువము నెఱింగి
తరుణియుఁ దానును ◆ ధరఁజాఁగి మ్రొక్కి
పరిపక్వఫలములు ◆ పాయ కర్పించి
యోగీంద్రవంద్య నే ◆ నొక చెంచువాఁడ
నీగిరితటమున ◆ నెసఁగిన వేడ్క
నొనర వేఁటాడుచు ◆ నొక్కొక యెడలఁ
గనిన విచిత్రముల్' ◆ గల వనేకములు
ఇవి యవి యని వాని ◆ నిచ్చలో నెరయ
వివరింపలేక య ◆ వ్విధము మీతోడ
విన్నవించెద నని ◆ వేడుక మీఱ

నున్న చోటను దైవ ◆ యోగంబు కతన
విచ్చేసి తనఘాత్మ ◆ విను మత్తెఱంగు
మెచ్చుగా నొకరాతి ◆ మీఁద నెప్పుడును
వెలుఁగొందుఁ దేజంబు ◆ వెస డాయఁబోయి
నిలిచిన పసిఁడివ ◆ న్నెయుఁ బొల్చు దేహ
మరయ మంటయు(ను) గా ◆ దది యెట్టి దనిన
నరు దంది యచ్చట ◆ నారసం బున్న
దాకందు వెఱిఁగింపు ◆ మనుటయుఁ దన్నుఁ
దోకొని శబరుండు ◆ త్రోవచూపుటయుఁ
జని వాఁడు చెప్పిన ◆ చక్కటి వెలుఁగు
ఘనతర తేజంబు ◆ గని శిష్యవరుల
కది చూపి యలరుచు ◆ నన్నగం బెక్కి
కదిసి కూర్చుండి శం ◆ కరునిఁ దలంచి
యా రసదేవత ◆ నర్థిఁ బ్రార్థించి
(కోరి దోసి)లియొగ్గి ◆ కొని యున్న యంత
గ్రక్కున నాశీలా ◆ గర్భంబు వెడలి
నిక్కిన మెఱుఁగులు ◆ నింగి నిండార
రాజితవజ్రక ◆ రండంబుతోడఁ
దేజరిల్లుచు మహా ◆ దేవు తేజంబు
చెచ్చెర వచ్చి దో ◆ సిటిలోన నున్న
నచ్చపుభ క్తి హ ◆ స్తాంబుజాతములఁ
బొదివి యల్లన శిరం ◆ బునఁ జేర్చి ముదము
గదుర గోరక్షుని ◆ కరమునఁ బెట్టి
యాపుళిందునిఁ గొని ◆ యాడినఁ జిత్త
మేపార మఱియువాఁ ◆ డిట్లని పలికెఁ
బొడగంటి నొకమహా ◆ భూతంబు నొక్క
యెడ నది యె ట్లన్న ◆ నేకలం బొకటి
కడువాఁడి నామీఁదఁ ◆ గదిసిన నమ్ము
తొడిగి యేసినఁ దప్పఁ ◆ దూఱి యాయమ్ము
ఖంగున నొకరాతి ◆ కడఁ బడి మేలు
బంగారమైన న ◆ ప్పట్టున నున్న
రాలతో మత్ర్పద ◆ రము లన్నియును.
వోలి మోపినఁ గన్న ◆ నొక్కటియైనఁ

గర మొప్పఁ బసిఁడియుఁ ◆ గాదయ్యె, నన్నఁ
బరుసవేదియుఁ జూపు ◆ పద మని యచటి
కరిగి పై నున్న రా ◆ ళ్లటు పాయఁ ద్రోచి
తరుణార్కమండల ◆ ధగధగద్యుతులఁ
బొలుపొందు ఘనశీలా ◆ ముఖము వీక్షించి
చెలఁగి పద్మాసనా ◆ సీనుఁడై శివునిఁ
దలఁచి మ్రొక్కుచుఁ గర ◆ తలము లొగ్గుటయు
వెలుఁగుచు నందుండి ◆ వెడలి దోసిటికి
నరుగు దెంచిన భక్తి ◆ నౌదలఁజేర్చి
పరుసవే దిది దీనిఁ ◆ బదిలింపు మనుచు
గురుభక్తిరతుఁడైన ◆ గోరక్షు కిచ్చె
....... ...... ...... ...... ...... ....... ....... ........ .......
మఱియుఁ బుళిందుఁ డా ◆ మత్స్యేంద్రుతోడఁ
దెఱుఁగొప్ప నిట్లనె ◆ దేవ యింకొక్క
చిత్రంబు గంటి నీ ◆ క్షితిధరప్రాంత
ధాత్రీధరంబున ..... ...... ...... ...... వజ్ర
కాంతిఁ జెన్నొందు శృం ◆ గము గల దచటి
కింతింత నుండి తా ◆ రేమి తలఁచిన
నప్పదాథన్‌ములెల్ల ◆ నచ్చెరువార
నప్పుడు వచ్చు రా ◆ వనుభవంబునకు
నావుడు నచటు చిం ◆ తామణిస్థాన
మావరమణి చేతి ◆ కబ్బినఁ గాని
సిద్ధింప వెందుఁ బ్ర ◆ సిద్ధంబులైన
సిద్ధు లటంచు నా ◆ సిద్ధముఖ్యుండు
నెఱుకు చూపిన త్రోన ◆ నేగి దీధితుల
గిఱిగొన మెఱసి యా ◆ గిరి నెక్కి వాఁడు
గుఱుతు చూపిన భక్తిఁ ◆ గూర్చుండి యపుడు
కఱకంఠునకు మ్రొక్కి ◆ కరము లొగ్గుటయుఁ
దను బ్రస్తుతింపుటఁ ◆ దలఁపురత్నంబు
ఘనపథంబున మించు ◆ గములు రాణింప
హస్తపుటంబున ◆ నరుదుగా నిల్వ
మస్తకంబునఁజేర్చి ◆ మన్ననచేసి
రమని పిలిచి గో ◆ రక్షుచేతికిని

గ్రమ్మఱ నిచ్చి కి ◆ రాతు కెర్గించ
నావేళ గురునకు ◆ నభివందనంబుఁ
గావించి పాణి పం ◆ కజములు మొగిచి
కొనకొని చౌరంగి ◆ గోరక్షసిద్ధు
లనిరి మహాత్మ యీ ◆ యద్భుతమహిమ
యెఱుకుమాత్రపువాని ◆ కేరీతి నుర్వి
నెఱుగఁవచ్చెడు నాన ◆ తీఁదగు నన్నఁ
దనదివ్యదృష్టి నా ◆ తని తెఱం గెఱిఁగి
ఘనమీననాథుఁడు ◆ గాండీవి మున్ను
పూని తపంబుస ◆ ల్పుచు నున్నవేళ
వానిపైఁ గరుణించి ◆ వరము లీఁ దలఁచి
చెంచుచేఁత లమరు ◆ శివుఁడుఁ బార్వతియు
నంచితలీలఁ దా ◆ మరుగుచోఁ ద్రోవ
నొకశబరాలయ ◆ మొయ్యనఁ జేర
నకలంకచిత్తుఁడై ◆ యం దొక్క యెఱుకు
వారిఁ దోడ్కొనిపోయి ◆ వనఫలంబులను
నారగించఁగ నిచ్చి ◆ యమృతోపమాన
మగుశీతలోదక ◆ మర్పించి మనసు
చిగురొత్తఁ బ్రియమొన ◆ ర్చిన సంతసిల్లి
యీతఁడు సౌజన్య ◆ మెసఁగఁ గిరాత
జాతుఁడై ననుఁ జాల ◆ సత్కారమిపుడు
గావించె మన కటు ◆ గాన సత్పుత్త్రు
నీవలె నని భవా ◆ నీశు లూహించి
యతనితో ననిరి మ ◆ హా బలాధికుఁడు
నతిమహామాన్యుండు ◆ నమితశౌర్యుండు
నలఘు తేజస్వియు ◆ నగుసుతుం డొకఁడు
గలుగు నావుడు మాకుఁ ◆ గలిగె నీవేళ
నపరభవంబున ◆ నటువంటి పుత్త్రుఁ
గృపసేయు మనుచు మ్రొ ◆ క్కిన నట్లకాక
యనుచును స్వేచ్ఛమై ◆ యాభవుఁ డుమయుఁ
జని రంతఁ గాలవ ◆ శంబున నుండి
యీయుగంబున వాఁడు ◆ నింతియుఁ బుట్టి
యీయనఘునిఁ గాంచి ◆ రితఁడు. నిధాన

దర్శనాముఁడు గానఁ ◆ దద్దయు నితఁడు
దర్శింపఁ జాలె నే ◆ తద్విషయంబు
లని చెప్ప శబరున ◆ కభిమతార్థంబు
లొనరంగ నిచ్చి తా ◆ రుత్తరదిశకు
భోరునఁ జనుచుండ ◆ ముందట నేగు
చౌరంగి యొక మహీ ◆ జమునీడఁ గొంత
తడవు గానఁగరాక ◆ తత్తరుచ్ఛాయఁ
(గడవ న)వ్వలఁ బొడ ◆ గాన వచ్చుటయు
వెఱఁగొంది మత్స్యేంద్రు ◆ వెనుక సద్భక్తి
గుఱుకొని యే తెంచు ◆ గోరక్షకుండు
ఈచిత్ర మెట్టిదో ◆ యెఱిగింప వలయు[4]

మేఘనాడ సిద్ధుని కథ



పొలతియుఁదానును ◆ బుత్రుఁడుఁ గూడి
కొలనిలోపలికి డి ◆ గ్గుచునుండ వచ్చి
పెలుచ గర్జించుచుఁ ◆ బెటపెట మొరసి
పడుమహీసురు తల ◆ పైఁబడ నుఱికి
వడివి ప్రకుని (మెడ) ◆ వాత (నుబట్టి)
గడువాఁడి కోఱలఁ ◆ గఱచిన నొగుల
నొడలు నెత్తుటఁ దోఁగి ◆ యో మహాదేవ
యనుచు నేలకు వ్రాలు ◆ నాత్మేశు నార్త
నినదము న్విని భీతి ◆ నెక్కొనఁ బాఱు
పణఁతిఁ జంపఁగ వెంటఁ ◆ బడువాలుమృగము
కణఁక వీక్షించి ది ◆ గ్గన నమ్ముఁ దొడిగి
యనువొంద దృఢముష్టి ◆ నమరించి విల్లు
కొనలుమోవఁగఁ దెగఁ ◆ గొని దృష్టి నిలిపి
మాఁగి తా నొకమ్రాను ◆ మాటున నుండి
తూఁగ నేయుటయు న ◆ ద్భుతముగా నిగిడి
నట్టెద నదరంట ◆ నాటిన మూట
గట్టి వేసినరీతి ◆ గాఁ దుక్కుడగుచు
నుప్పరం బెగసి యా ◆ యుగ్రమృగంబు
గుప్పున ధరమీఁదఁ ◆ గూలెఁ గూలుటయుఁ
జెట్టు సయ్యన డిగి ◆ చేరి యావిప్రు

[5]పట్టికిఁ బత్నికి ◆ భయమెల్లఁ దీర్చి
వారిఁ దోడ్కొనిపోయి ◆ వసుమతీవిభుఁడు
ధారుణీసురుని ముం ◆ దటఁ దెచ్చి నిలిపి
తియ్యనిజలములు ◆ తెచ్చి వక్త్రమునఁ
జయ్యనఁ బోసి లో ◆ చనములఁ దడిపి
యలఁతఁదేర్చినఁ గన్ను ◆ లల్లనఁ దెఱచి
పొలఁతిఁ బుత్త్రునిఁ జూచి ◆ భూవిభుఁ జూచి
(యనఘా) త్మ మీరెవ్వ ◆ రయ్య [6]నావుండు
మనుజనాయకుఁడు బ్రా ◆ హ్మణున కిట్లనియె
యేనొక్కనృపుఁడ మ ◆ హీదేవతిలక
పూని కొలనిజలం ◆ బులను నేఁ గ్రోలఁ
గొలనిలో దిగఁబోయి ◆ కూలకుంజమునఁ
బులిఁ బొడగని యేయఁ ◆ బూని యున్నంత
నీవుఁ బుత్త్రుండును ◆ నెలఁతయు నీరు
ద్రావ నేతెంచి ముం ◆ దటఁ బరికించి
కనుగొననేరక ◆ ఘనతరవ్యాఘ్ర
మున కెదురైతి రా ◆ పులి యంతఁ బోక
వెస నీవధూమణి ◆ వెంటఁ బట్టుటయు
మసల కేసితి దాని ◆ మహీమీఁదఁ గూల
నీవంటిబహుపుణ్య ◆ నిధి కిటువంటి
చా వయ్యెనే యని ◆ సంతాప మందు
భూవరుఁ జూచి యా ◆ భూసురోత్తముఁడు
చావులు లే వనఁ ◆ జనదు చర్చింప
దేవతలకు నైన ◆ దీనికి నడల
నీవాలుమృగముచే ◆ నిట్టిదుర్మరణ
మగుటకు వగచెద ◆ నాత్మలో ననుచుఁ
దగిలి యేడ్చుచు నున్న ◆ తనయు వీక్షించి
[7]తనయు డగ్గఱఁ బిల్చి ◆ తన్ముఖాంబుజము
తనయురంబునఁ జేర్చి ◆ తార్కొన నెత్తి
యన్న నే నడిపెడి ◆ యాచారవిధులు
సన్నుతమతిఁ బూని ◆ జరుపు మీ వింక

నలయక వేదశా ◆ స్త్రాభ్యాసనిరతి
సలుపుము దినమును ◆ సజ్జనగోష్ఠిఁ
బాయక యతిథిస ◆ పర్య లెప్పుడును
జేయుము సుకృతసు ◆ [8]తృప్తులఁ బొంద
నెల్లభూతంబుల ◆ యెడ దయ మీఱ
నుల్లసిల్లుము భక్తి ◆ నుడురాజధరుని
మన్మథాంతకుని సం ◆ మాన్యప్రభావుఁ
జిన్మయాత్ముఁ [9]దలంపు ◆ చిత్తమునందు
నని బుద్ధిచెప్పి ని ◆ జాంగనకేలు
తనకేలఁ దగిలించి ◆ తనయునిఁ జూపి
వనిత యీతఁడు పిన్న ◆ వాఁ డీమహోగ్ర
వనము భయంకర ◆ వ్యాళశార్దూల
భూతసంకుల మొంటిఁ ◆ బోనీకు మవుల
నాతతకందమూ ◆ లాహరణార్థ
మిటమీఁద వలవదు ◆ మీకు నిం దుండఁ
బటుబుద్ధి సన్ముని ◆ ప్రవరాశ్రమమున
వసియింపుఁ [10]డిఁకఁ దరు ◆ వాతికృత్యంబు
లెసఁగింపు కులశీల ◆ మేమర కుండు
మని వెండియును వసు ◆ ధాధీశు ముఖముఁ
గనుఁగొని యావాల్మె ◆ కంబు బారికినిఁ
బాపి రక్షించి తీ ◆ పణఁతిని శిశువు
నేపారఁ గరుణమై ◆ నిఁక వీరి నొక్క
మునియాశ్రమము చేరు ◆ పుము నీకు నొదవు
ననుపమసకలయో ◆ గాధిక ఫలము
లనుచు మహాదేవు ◆ నంబికారమణు
మనమున నునిచి న ◆ మశ్శివాయ యని
విడిచెఁ బ్రాణంబులు ◆ విప్రుఁ డావేళఁ
దొడతొడ గన్నీరు ◆ దొరఁగ దైన్యంబు
మొగమున నెసఁగంగ ◆ ముదిరిన వగను
బొగులు తనూజుని ◆ ముద్దులమొగము
గుదిగొన్న కూర్మి న ◆ క్కునఁ బలుమాఱు
గదియించి ముద్దిడి ◆ కన్నీరు దుడిచి

భూనాయకునిఁ జూచి ◆ భూసురవనిత
మానవేశ్వర కృపా ◆ మతి నీకుమారు
మునియాశ్రమముఁ జేర్పు ◆ ముద మంద ననుచు
...... ...... ...... ...... ...... ...... ....... ...... ......
[11]గతిఁ గూడ ననలము ◆ ఖంబు కేగెదను
...... ...... ...... ...... ....... ...... ....... ...... .......
కడుకాలమును నుండఁ ◆ గాఁ జాల ననినఁ
బుడమీశుఁ డాత్మలోఁ ◆ బురపురఁ బొక్కి
యమ్మ నీ కిట్లాడ ◆ నగునె డెందమున
ముమ్మడిగొనుశోక ◆ మునఁ జాల బెంగ
విడిచినఁ బ్రాణముల్ ◆ విడుచు నీబాలుఁ
డుడుగు మీ కతనను ◆ నుత్తరక్రియలు
పరలోకగతుఁ డైన ◆ పతి నాత్మలోనఁ
బరమేశ్వరునిఁ బోలె ◆ భక్తి భావించి
మ్రొక్కుచు భూతలం ◆ బునఁ గడు వినుతి
కెక్క గంగాది వా ◆ హినులను గ్రుంకి
యమితతపోధను ◆ లైనసన్మునుల
కమరంగఁ బరిచర్య ◆ లర్థిఁ జేయుచును
బరమ [12]సంయమ వ్రత ◆ పాలనం బెసఁగ
జరుపుచు నడవడి ◆ జగములు పొగడఁ
జేకొని పుత్రుఁబో ◆ షింపుచు నుండు
నీ కుమారుం డుండ ◆ నిక్కంబు గాను
నీరజూనన నిన్ను ◆ నీ తనూభవుని
భోరునఁ దోడ్కొని ◆ పురమున కేగి
నూటి కొక్కటి నేర్చి ◆ నుతిమీఱఁ బాడిఁ
జాటువ కైక్కు[13] వ ◆ త్సల ధేనువులను
బెక్కింటిఁ జెచ్చెరఁ ◆ బ్రీతిగా నిత్తు
నిక్కంబు నావుడు ◆ నృపుని వీక్షించి
యా విప్రకాంత ◆ యిట్లనియె భూనాథ
నీవంటి సత్కృపా ◆ నిధి మాకుఁగలుగఁ
బతిలేని సుతు లేల ◆ ప్రాణంబు లేల
పతిలేని సకల సం ◆ పదలును నేల

నాకును నాప్రాణ ◆ నాథున కొక్క-
లోకంబు నను నింక ◆ లోవంగ వలదు
వసుధేశ నీవిచ్చు ◆ [14]వాటి నన్నిటినిఁ
బొసఁగ నీ వడుగుఁ జే ◆ ర్పుము విను మొకటి
విపినంబులోఁ బ్రాణ ◆ విభుఁడును నేనుఁ
దప మాచరించెడి ◆ తఱి నొక్కనాఁడు
శివయోగియొకఁడు చె ◆ చ్చెర చనుదేరఁ
బ్రవిమలమతి నర్ఘ్య ◆ పాద్యాదు లిచ్చి
కరమొప్ప ఫలములఁ ◆ గందమూలములఁ
బరితృప్తిఁ గావింపఁ ◆ బరిణామ మంది
నెలఁత నీ భర్తయు ◆ నీవును వినయ
మొలయంగఁ జేసిన ◆ యుపచారములకు
మిగులఁ బ్రీతుఁడనైతి ◆ మీ కొక్కసుతుఁడు
పొగడొంద జన్మించు ◆ భువన పూజ్యుండు
వాఁడును నొక యోగి ◆ వర్యునికరుణఁ
బోఁడిమిగా సిద్ధ ◆ పురుషుఁడై వెలయు
నని చెప్పి యతఁ డేగె ◆ నటమీఁదఁ గొన్ని
దినములు చనఁగనా ◆ దివ్య యోగీంద్రు
పలికినట్లుగనె గ ◆ ర్భం బొగిఁదాల్చి
నెలలు తొమ్మిదియును ◆ నిండ నాలోన
ఫలముల కని యోగి ◆ పతియును నేను
వెలయు నీవనములో ◆ విహరించువేళ
మెఱుపులు తళతళ ◆ [15]మెఱయ మి న్నగల
నుఱుములు ఘుమఘుము ◆ నుఱుమఁ బెల్లోదవు
వానఁ దోఁగుచు నొక్క ◆ వటమహీరుహము
తో నొత్తగిలి యాత్మఁ ◆ దురగలిగొనెడి
బీతునఁ గంపింపఁ ◆ బెట పెట మనుచు
నాతఱి నంబర ◆ మందు మిణ్గుర్లు
పరువడిఁ జెదరంగఁ ◆ బడియెఁ బెన్బిడుగు
అరుదుగా నప్పుడా ◆ యశని పాతమున
వటమహీరుహమును ◆ పడి నిలఁగూలె
విటతాటమై బిట్టు ◆ విఱిగి మ్రోయుచును

అప్పుడు శ్రుతిదుస్స ◆ హంబుగ దిశలఁ
గప్పిన రవమున ◆ గర్భంబు గలఁగి
వడి నూడిపడియె నీ ◆ వడుగు వానయును
నుడిగె నేమును భయం ◆ బొయ్యనఁ దెలిసి
కొడుకు నక్కున నెత్తు ◆ కొనివచ్చి పెంచి
వడుగుఁ గావింప స ◆ ర్వజ్ఞుఁ గానెల్ల
చదువులు గఱపె నా ◆ శ్చర్యంబు మీఱఁ
బొదవిన ప్రేమను ◆ భూసురోత్తముఁడు
అటుగాన మేలగు ◆ నవనీశ తిలక
యిటుమీఁదఁ బరితాప ◆ మేల చిత్తమునఁ
బనుపుము ననువేగఁ ◆ బ్రాణేశుఁ గూడ
ననఘాత్మ యిదియది ◆ యని యాన తీక
యనవుడు నట్లకా ◆ కని చితిపేర్చి
చని మహీనాథుఁడ ◆ చ్చటి చెంచుపల్లె
ననలంబుఁ దెచ్చిన ◆ నలరి యా విప్ర
(వనిత యాత్మే)శుపై ◆ వరలు రక్తంబు
గడిగి తానును నుద ◆ కము లాడి పిదపఁ
గొడుకును మడుఁగునఁ ◆ గ్రుంకించి శవము
సొదమీఁద నిడి. పూర్షు ◆ సొంపలరంగఁ
గదియఁ గౌఁగిటఁజేర్చి ◆ క్రమము దీపింపఁ
[16]ద్రేతాగ్నులాయాయి ◆ రీతులఁ నెల్లఁ
బుత్త్రునిచే మంత్ర ◆ పూతంబుగాఁగఁ
బెట్టించుకొని యొక్క ◆ పెట్టున నగ్ని
చుట్టు దరీకొనికాల్ప ◆ జువ్వన నింగి
నడరఁ జీలలుద్రుంగి ◆ యా పుణ్యసాధ్వి.
తడయక ప్రియుఁడును ◆ దానునుగూడి
యమరలోకము కేగి ◆ రంత శోకాగ్నిఁ
గుములుచు వడుగును ◆ గువలయేశ్వరుఁడు
నున్నచో నచటికి ◆ యోగసిద్ధ్యబ్ధి
పున్నమచంద్రుఁడై ◆ పొలుపొందు ఘనుఁడు
పరమేశ్వరుని కూర్మి ◆ పట్టి మత్స్యేంద్రుఁ
డరుదుగా నిజతేజ ◆ మడర నేతెంచె

వచ్చి తోయములాడి ◆ వనజాకరమునఁ
జెచ్చరఁగ్రోలి యా ◆ చెంగట నేలఁ
బటుబాణహతి నీల్గి ◆ పడియున్న పులినిఁ
బొటపొట కన్నీరు ◆ పొరిబొరి దొరుఁగ
వగలఁగుందుచు నున్న ◆ వడుగును నృపునిఁ
దగఁగ వీక్షించి యం ◆ తయు మాకుఁదెలియ
నెఱగింపుఁ డనిన మ ◆ త్స్యేంద్రుకు భక్తి
నెఱిఁగి భూనాయకుం ◆ డిట్లని పలికె
వనమున వేఁటాడ ◆ వచ్చి యీ నరసిఁ
దనివోవ జలములు ◆ ద్రావి వెల్వడుచు
నల పొదరింటిలో ◆ నణఁగి లాఁచున్న
పులిఁగని మ్రానెక్కి ◆ పొంచి యేయంగ
గమకించి వడిఁ జండ ◆ కాండంబు వింట
సమరించు నాలోన ◆ నలర నేతెంచి
కూరిమి విప్రుండు ◆ కొమ్మఁ జేకొనుచు
[17]నీరాస నుడుగులో ◆ నికి డిగునంత
గర్భముల్ గలఁగ భీ ◆ కరముగాఁ బులియు
నార్భటంబున నయ ◆ మార లంఘించి
యొఱలంగ విప్రుని ◆ యుత్తమాంగంబుఁ
గఱచి యంతటఁ బోక ◆ కడఁగి యీ వడుగు
తల్లిపైఁ గవయ ◆ న త్తఱి బులినేలఁ
ద్రెళ్లసేసితి నేను ◆ తీవ్రభల్లమున
నా విప్రనందనుం ◆ డనఘ యీ శిశువు
భావమునం బతి ◆ భక్తి దీపింప
ననలముఖంబున ◆ నా త్మేశుఁగూడఁ
జనియె నీతని తల్లి ◆ సద్గతి కనుచు
విన్నవించిన మహీ ◆ విభుమీఁద మిగుల
మన్నన మెఱయఁగా ◆ మత్స్యేంద్రుఁ డనియెఁ
బొడిపొడిగాఁ ◆ గాలిపోయిననైనఁ
దడయక బాలుని ◆ తల్లిదండ్రులను
వెరవుగాఁ బ్రతికింప ◆ వెలయు సంజీవ
కరణి నే నటు చేయఁ ◆ గాదు వారిప్పు

డమరలోకంబున ◆ నమితసౌఖ్యములు
సమకొని యున్నారు ◆ సమ్మదం బెసఁగ
నా దివ్యదేహుల ◆ నలజడిపెట్ట
రా దటుగాన గా ◆ రవము నిండార
దిక్కెవ్వరును లేక ◆ దీనుఁడై యున్న
యిక్కుమారునిఁ బ్రోచు ◆ టెక్కుడు ధర్మ
మిత్తు సిద్ధినినేను ◆ నితనికి ననుచు
సత్తుగానాతని ◆ జన్మప్రకార
మంత నృపుఁడు చెవు ◆ లారంగఁ జెప్ప
వింతగా నేర్పడ ◆ విని సంతసిల్లి
మీననాథుఁడు దయ ◆ మీఱ గోరక్షు
తోన నిట్లనియె నా ◆ ర్తుని నీ కుమారు
నెమ్మితోఁ జేకొని ◆ నీ వుపదేశ
మిమ్ము నాపనుపున ◆ నింక నొం డనక
నావుడు మాఱాడ ◆ నణఁకి ఫాలంబు
మోవ భూస్థలిఁ జాఁగి ◆ మ్రొక్కి చౌరంగి
కతిభక్తి నెఱఁగి నే ◆ ర్పలరంగ విప్ర
సుతుని సిద్ధాసన ◆ స్థునిఁగాఁగఁజేసి
ధీయుతుఁడై విభూ ◆ తిస్నాన మొనరఁ
జేయించి మత్స్యేంద్రు, ◆ శివునిఁదలంచి
హస్తపంకేరుహ ◆ మనురక్తి నతని
మస్తకంబున నుంచి ◆ మఱి నాలుగైన
యోగంబు లలవడ ◆ నుపదేశ మిచ్చి
[18]లాగుగాఁ గృప సిద్ధు ◆ లన్నియు నొసఁగి
సిద్ధశరీరుఁగాఁ ◆ జేసి మత్స్యేంద్ర
సిద్దున కిరువురుఁ ◆ జేరి మ్రొక్కుటయు
నలరి నామం బిడ ◆ నాత్మలోఁ దలఁచి
చెలఁగి మేఘధ్వనిఁ ◆ జేసి యీ వడుగు
జనియించె నని వీని ◆ జననిచే మున్ను
వినినచందంబు భూ ◆ విభుఁ డెఱింగించె
నామాట విన్నాఁడ ◆ నగు మేఘనాద
నామ మొప్పఁగ నని ◆ నాథముఖ్యుండు

భూనాథు దీవించి ◆ పొమ్మన్న నతఁడు
మీననాథుకు భక్తి ◆ మీఱంగ మ్రొక్కి
దేవ నన్నును గృపా ◆ దృష్టి వీక్షించి
కావింపవే సిద్ధుఁ ◆ గా నన్న నవ్వి
మనుజేశ సకల సా ◆ మ్రాజ్య సౌఖ్యముల
మనమార నీవు నె ◆ మ్మది నుంట మాని
యోగీశ్వరత్వంబు ◆ నుల్లంబులోన
నీగతి నాసింప ◆ నేమిటి కనినఁ
బుడమిఱేఁడును రాజ్య ◆ భోగంబునందు
నొడఁబడ దిప్పుడు ◆ నుల్ల మెబ్భంగి
నింక నే మని యాన ◆ తిచ్చిన మీకు
శంకరు నా నని ◆ చాఁగి మ్రొక్కుటయు
మదిలోనఁ గృపమీఱ ◆ మత్స్యేంద్రుఁ డతని
వదనము వీక్షించి ◆ వసుమతీనాథ
నీ దేశ మెయ్యది ◆ నీ తెఱంగెల్ల
నాదట నెఱిఁగింపు ◆ మన్నఁ గేల్మొగిచి

విరూపాక్ష నాథుని కథ.



యనఘాత్మ వినుము ము ◆ న్నాదిత్యవంశ
వనధిచంద్రుం డన ◆ వసుధఁ బెంపెసఁగు
నట్టి గణ్యావంతుఁ ◆ డను భూమిపతికిఁ
జుట్టాలసురభియై ◆ సొంపు గావింప
నంజని యను పేర ◆ నసమశీలమున
రంజిల్లు నమ్మహా ◆ రాష్ట్రాధినాథు
సుత(కును నిరువురు ◆ సుతులమునొక్క)
యతివయుఁ బుట్టితి ◆ మగ్రజు పేరు
మహిఁ బెంపు నొప్పఁ గు ◆ మారచంద్రుండు
దహనలోచనుపేరఁ ◆ దగు విరూపాక్షుఁ
డ(నువాఁడ నేనంత ◆ నగ్రజు) రాజ్య
ముననిల్పి ప్రజకెల్ల ◆ ముదమునఁ దీర్తు
నేపున నొక్కనాఁ ◆ డే నరణ్యముల
లోపల వేట స ◆ ల్పుచు వచ్చివచ్చి
పెడ లీకవిల్లును ◆ బిడుగునకంటె
కడువడి మెఱుఁగులు ◆ గ్రక్కు బాణములు

ధరియించి దరినిబా ◆ దపశిఖరమున
గురువులు వా ఱెడి ◆ గువ్వ నేయంగ
లేక చింతించు ◆పుళిందునిఁ జూచి
యాకీలు దెలిసెద ◆ నని చేరఁబోవ
నా లోన[19] గూఁటికి ◆ నల్లనఁ జేరు
లీల నట్టిట్టు చ ◆ లింపఁక గువ్వ
నిలిచిన నము సం ◆ ధించి చాపంబు
బలు తెగ గొని యేయఁ ◆ బరగుచునున్న
పొడ గాంచి యేనును ◆ బో నమ్ముదొడిగి
నడిఁకిన వాని డెం ◆ దంబు కపటము
తెలియంగ డాసి యి ◆ త్తెఱఁగెట్టి దనుచుఁ
బలికిన వాఁడు చె ◆ ప్పక కొంత దవ్వు
నుసలి యిట్లనియె భూ ◆ నుత తప్పఁబలుకఁ
బొసఁగఁగా వినుము క ◆ పోతంబుగుండెఁ
బరగ మ్రింగిన భూమి ◆ పతి యగు దీని
సిరము మ్రింగినవాఁడు ◆ సిద్ధుఁడై వెలయు
మానవేశ్వర దీని ◆ మాంసంబుఁ దిన్న
వాని కాఁకలి నీరు ◆ వట్టును జరయుఁ
దనుకక పెక్కు వ ◆ త్సరములు బ్రతుకు
నని చెప్పె నొక్క మ ◆ హాత్ముండు నాఁటఁ
గొలె దీనిఁ బడనేయఁ ◆ గొలఁది గా కలసి
వల నేది యిట్లున్న ◆ వాఁడ నే నన్న
వడిచాప మెక్కించి ◆ వాలమ్ముఁ దొడిగి
తడయక తెగనిండఁ ◆ దాదృష్టి నిలిపి
భూమిపైఁ గూలఁ గ ◆ పోతంబు నేసి
యామస్తకము గుండె ◆ యమాంసమేను.
మసలక కైకొని ◆ మాంసంబు బోయ
కొసఁగితిఁ దలఁదింటి ◆ నుత్తమాంగంబు
మరిగుండె యిచ్చితి ◆ మాయన్నకంత
నరుదుగా ధరణీశుఁ ◆ డై యున్న వాఁడు
ఆఁకలి నీరువ ◆ ట్టాదిగా జరయు
లేకయున్నాఁడు పు ◆ ళిందుండు నిపుడు

నాకును నీదర్శ ◆ నంబయ్యె నింక
నాకిరాతుని మాట ◆ కనుగుణంబుగను
జెలఁగి కృతార్థునిఁ ◆ జేసి రక్షింప
వలయు ననవుడు త ◆ ద్వాక్యంబులకును
మది ననుమానింప ◆ మత్స్యేంద్రుతోడ
విదితంబుగా నంత ◆ వినువీథి నుండి
వలనొప్ప నాకాశ ◆ వాణి యిట్లనుచుఁ
బలికె నీతఁడు పూర్వ ◆ భవమున విభవ
లీలతో మెఱయు క ◆ ళింగ దేశమున
శీలసంపన్నుఁడై ◆ చెన్నొందు నొక్క
ధరణీసురోత్తము ◆ తనయుఁ డాద్విజుఁడు
మరణమొందిన వాని ◆ మానిని పిదప
కులటయై మును చనుఁ ◆ గుడి చెడి శిశువు
నులిచి నిష్కృపతోడ ◆ నొకచోట వైచి
పోయిన మఱియొక్క ◆ భూసురవర్యుఁ
డాయర్బకునిఁ గొంచు ◆ నరిగి మోహమున
వరలఁ జేకొని పెంచి ◆ వడుగుఁ గావించి
[20]పరువొప్ప నపుడు వి ◆ వాహంబునకును
ధనము సంపాదింపఁ ◆ దలపోయు జాడ
మనమున నెఱిఁగి స ◆ మ్మతి బేరమాడి
యర్థమార్జించెద ◆ ననుచు నావడుగు
సార్థముఁ గూడుక ◆ చని దూరభూమి
నొకపురి వేశ్యయై ◆ యున్నట్టి జనని
నకలంకమతిఁ దల్లి ◆ యగుట యెఱుంగ
నేరక కవయుచు ◆ నిత్యకర్మములు
ధీరుఁడై సలిపి వ ◆ ర్తింపుచు న్న తని
యాచార మెడలింప ◆ కనువుగా దనుచు
నీచాత్మురాలు బా ◆ నిసచేతఁ గల్లు
వల నొప్పఁ దెప్పించి ◆ వాఁడు నిచ్చలును
జలములు గ్రోలెడి ◆ సగ్గెడ నించి
యున్నంత నీరువ ◆ ట్టొదవ విప్రుండు
మున్ను గ్రోలినయట్లు ◆ ముదము దీపింప

జలబుద్ధి నాకల్లు ◆ చవిగొని యెఱిఁగి
వలచేత సగ్గెడ ◆ వసుధపై వైచి
పరితాప మొందుచు ◆ బాష్పబిందువులు
దొరఁగ లంజను జూచి ◆ దోషాత్మురాల
తగునె యీకపటకృ ◆ త్యంబు సద్విప్రుఁ
డగునన్నుఁ జెరుప నీ ◆ కగు లాభమేమి
కటకటా యిఁకఁ దన ◆ గతి యేమి యనుచుఁ
బొటబొటఁ బొక్కు నా ◆ భూసురుఁ జూచి
యావారవనిత యి ◆ ట్లనియె నీ దేశ
మేవంక నీపురి ◆ యేది నీగోత్ర
మంతయు నెఱిఁగింపు ◆ మని వాఁడు చెప్ప
వింతగా విని విని ◆ వీఁడు మత్పుత్రుఁ
డని బిట్టు మూర్ఛిల్లి ◆ యల్ల నఁ దెలిసి
కనుఁగవ బాష్పాంబు ◆ కణములు దొరుఁగ
వెగచుచు నున్నట్టి ◆ వెలఁది వీక్షించి
మగువ నీ వేటికి ◆ మఱిఁగెద వనినఁ
దన పూర్వచరిత మం ◆ తయుఁ జెప్పి నీవు
తనయుఁడ వగుదువు ◆ తల్లి నే ననినఁ
బుడమిపై ఁబడి మూర్ఛఁ ◆ బొంది యొక్కింత
తడవుకుఁ దెలి వొంది ◆ తరియింప నలవి
గాని దుస్సహమాతృ ◆ గమనాఘ మద్య
పానదోషములు చొ ◆ ప్పడె నొక్కయెడను
ఈ మహాపాతక ◆ మింక నొండొకట
నేమార్గమునఁ బాయ ◆ దెడపక పోయి
గంగ గాళిందిలోఁ ◆ గలసి పెంపొంది
పొంగుచుఁ బ్రవహించు ◆ పుణ్యతోయముల
నొనరఁబ్రాణత్యాగ ◆ మొనరింపకున్న
ననుచుఁ దాఁ గొనివచ్చు ◆ నట్టి యాసరకు
వరుసతోడుతఁ దమ ◆ వారి కిమ్మనుచు
వెరవువచ్చిన వణి ◆ గ్వితతి కొప్పించి
చని ప్రయాగను గృత ◆ స్నానుఁడై యతఁడు
తనపాపములఁ జెప్పి ◆ తద్విముక్తియును
ధరలోన భూపతి ◆ త్వము సిద్ధపదముఁ

దెఱఁ గొప్పఁ దనకు సి ◆ ద్ధింపను గోరి
యానదిలో (బడి ◆ ప్రాణముల్ దొ)లఁగి
తా నట్టిఘోర పా ◆ తకములఁ బాసి
పదపడి ఘూర్జర ◆ పతిగ జనించి
విదితంబుగా రాజ్య ◆ విభవంబు లందెఁ
దనభావ వశత ....... ....... ....... .......
గని కృతా(ర్థుం)డయ్యెఁ ◆ గరుణఁ జేకొనుము
నావుడు నమ్మీన ◆ నాథుఁడు ధర్మ
దేవతావాక్యంబు ◆ దృఢబుద్ధి నూఁది
గోరక్షుఁ బిలిచి యీ ◆ కువలయేశునకు
(నారంగ) యోగవి ◆ ద్యాభ్యాసములను
దెలిపి సిద్ధునిఁ జేసి ◆ తె మ్మన్న మ్రొక్కి
వల నొప్ప నాసరో ◆ వరమున నృపునిఁ
జెచ్చరఁ గ్రుంకించి ◆ సిద్ధాసనమున
నచ్చుగా నునిచి ని ◆ జాంతరంగమున
మన్మథవైరిని ◆ మత్స్యేంద్రుఁ దలఁచి
తన్మస్తకమున హ ◆ స్తముఁ జక్కనిలిపి
యెల్లయోగంబులు ◆ నెల్లసిద్ధులును
దెల్లంబుగా నుప ◆ దేశించి తెచ్చి
ముదమున గురునికి ◆ మ్రొక్కించి తేజ
మొదవ పే రితనికి ◆ నొనరింపుఁ డనుచు
విన్నవించిన భక్తి ◆ వెలయునీవిభుకుఁ
గన్నవారలు మును ◆ కాలకంధరుని
పే రిడినా రింక ◆ వేఱొకనామ
మీరాదు గావున ◆ నీవిరూపాక్ష
నాథాఖ్య యొసఁగు ను ◆ న్నతి నంచు మీన
నాథుండు పలుక ◆ నందఱు సంతసిల్లి
రంతఁ దపస్వుల ◆ యాశ్రమభూము
లెంతయు వేడుక ◆ నీక్షింపఁగోరి
తనశిష్యవరులతోఁ ◆ దడయక కదలి
మనమార నరుగుచో ◆ మత్స్యేంద్రుఁ డెదుటఁ
గడిఁది భల్లూకంబు ◆ కసమస రేఁగి
బెడిదంపుఁ గోఱలు ◆ బెట్టు నొగల్చి

కఱచినమేని యా ◆ గంట్లను నెల్ల
వఱదలు గాఁగను ◆ వడియ రక్తంబు
తోరంబుగాఁ దొప్ప ◆ డోఁగి వాపోవు
ధారుణీసురునితోఁ ◆ దా నంతఁ గదిసి
యురుదుష్టమృగబాధ ◆ లొందక యుండ
నరయుచు శరచాప ◆ హస్తుఁడై యున్న
యెఱుకును వీక్షించి ◆ యిది (యేమొనాకు)
నెఱిఁగింపు మన్న వాఁ ◆ డెఱఁగి యిట్లనియె
విను నాథముఖ్య యీ ◆ విప్రువర్తనము

వంచక పురోహితునికథ.



వినుపింతు నేఁగన్న ◆ విన్న మార్గమున
నవనిపై సింహాద్రి ◆ యనుపురం బేలు
నవిరళంబుగను సిం ◆ హళుఁడను (రాజు)
గల దాతనికి ల ◆ క్షణ మంగళాంగి
పలుక నేర్చిన మంచి ◆ బంగారు ప్రతిమ
మెలఁగెడి తొలుకారు ◆ మెఱపు పుష్పాస్త్రు
పొలతుకకేళిపూఁ ◆ బోణి జీవంబు
గలచిత్రరూపు పుల్ ◆ గడిగిన రత్న
కలళ కందర్పుఁడు ◆ కరసానఁ దీడి
పొది నేర్చి కైకొన్న ◆ పూ మొగ్గతూపు
మదచకోరంబు కో ◆ మలపుష్పలతిక
చిలుకలకొలికి గొ ◆ జ్జెఁగ మించు చంద్ర
కళ నాఁగ రూపరే ◆ ఖా విలాసములఁ
జె(న్నారు చుండు) నం ◆ జిని యనుకన్య
యన్నాతి భువనమో ◆ హనముగా నొదవు
చున్న [21]యవ్వనలక్ష్మి ◆ నొప్పారు కన్య
నన్న రేంద్రుకు మాన్యుఁ ◆ డై యంతిపురము
నందును దనకడ ◆ నాఁక లేకుండఁ
బొందున బ్రతుకుచు ◆ భూరి సౌఖ్యముల
నెసఁగు పురోహితుం ◆ డితఁడు కురూపి
మిసమిస మనెడి తు ◆ మ్మెదలమైకప్పు
నెఱపెడి కురులుఁ గ్రొ ◆ న్నెల వింతచెన్ను

మఱపించునుదురును ◆ మలయు బేడిసల
మఱిఁగించు కన్నులు ◆ మణి దర్పణముల
తెఱఁగగు చెక్కులుఁ ◆ దిలకుసుమంబు
మిగులునాసిక యును ◆ మేలిమి మొల్ల
మొగడల నగు దంత ◆ ములు బింబఫలము
దలఁపించు నధరంబు ◆ దర్పకుశంఖ
కలితసౌభాగ్యంబుఁ ◆ గడచిన గళము
బిసముల నటమటిం ◆ పెడి బాహులతలుఁ
గిసయంబుల పెంపు ◆ గెలుచు హస్తములుఁ
జిన్ని జక్కవలతోఁ • జిటిపొటిసేయు
చన్ను మొగ్గలుఁ [22]బాప ◆ చందంబు లీల
తిన్న తనంభా మ ◆ తించు నూఁగారు
నన్నువపిడికిట ◆ నణఁగు నెన్నడుము
సైకతంబుల మించు ◆ జఘనంబు ననఁటి
మ్రోఁకల నిరసించు ◆ ముద్దు పెందొడలుఁ
గనక కాహళల బిం ◆ కము దువాళించు
నునుజిఱుదొడలుఁ జెం ◆ దొవలసోయగము
[23]కలవైన వ్రేళుల ◆ నమరు మీఁ గాళ్లు
అలవై న వేడ్కల ◆ నలరు విధములఁ
పొలఁగనలరు పెం ◆ పొందు మన్మథుని[24]
లాలిత సామ్రాజ్య ◆ లక్ష్మి చందమున
గరువంపుఁ గలహంసి ◆ కల వింతగతుల
మురువు బిసాళించు ◆ మురిపెంపు నడల
మనసిజ మోహన ◆ మంత్ర దేవతను
మొనపు చందమున నూ ◆ పురములు మొరయ
శృంగార మలవడఁ ◆ జేసి నెచ్చెలుల
సంగడి మెలఁగు న ◆ జ్జలజాక్షిఁ జూచి
మోహించి కామాంధ ◆ మునఁ దారతమ్య
మూహింపలేక పె ◆ ల్లొదవు తత్తరము
చిత్తంబుఁ బిరివీకు ◆ చేయ నారాట
మెత్తి విధాత న ◆ న్నేల పుట్టించె
నీ మాలకులమున ◆ నిది గాల్చి పోయి

నే మున్నె యొకధారు ◆ ణీ వల్లభునకుఁ
బుట్టినట్లైన నీ ◆ పొలఁతి వరించు
నట్టి మహాభాగ్య ◆ మబ్బుఁగా తనకుఁ
జెడితి రా యిఁక నేమి ◆ సేయుదు ననుచుఁ
గడుపును బిసుకుచుఁ ◆ గటకట యనుచు
నిలిచినచో నొక ◆ నిమిషార్థ మైన
నిలువ నోపక కూడు ◆ నీళ్లును బాసి
కడుజాలిఁ బొందుచుఁ ◆ గన్నంబులోన
వడిఁ దేలు గుట్టిన ◆ వాని చందమున
విలవిలవోవుచు ◆ వేదనఁ జాల
నలయుచు నొక యుపా ◆ యమును జింతించి
జననాథు నశ్వర ◆ క్షకులలో నొకనిఁ
గొనకొని వానికిఁ ◆ గోరిన ధనము
లొనరంగ లోలోన ◆ నొసఁగి నిన్నొక్క
పనిఁ బంప వేడెద ◆ బయలు వోకుండఁ
జేసెద వేనియుఁ ◆ జెప్పెద ననుచు
బాసలు గొని నీవు ◆ భయ మింత లేక
నీ రేయి మందడి ◆ యెల్ల మై మఱచి
తారు నిద్రించు న ◆ త్తఱిఁ జిచ్చు పెట్టి
నీవాజిశాలల ◆ నీర్చేసితేని
భావంబు లోన నా ◆ పలుకులు మెచ్చి
తగ నృపుం డిచ్చు న ◆ ర్థంబులో నీకు
సగ మిత్తు ననుచు వి ◆ శ్వాసంబు చేసి
వాని వీడ్కొనివచ్చి ◆ వడి నంతిపురము
లోనికిఁ జని నృపా ◆ లునిఁ బొడగాంచి
యహిమకరుం డాది ◆ యయిన తొమ్మండ్రు
గ్రహములు నేఁడు నే ◆ కాదశస్థాన
ఫలదులై సర్వ సం ◆ పదలు నొసంగ
వలయు మీ కనుచు దీ ◆ వన లిచ్చి చంక
నచ్చుగా నిడిన పం ◆ చాంగంబు ముష్టిఁ
జెచ్చెర విప్పి వీ ◆ క్షించి నాఁటితిథి
వారతారాదులు ◆ వరుసతోఁ జెప్పి
యూరకె వెరగొంది ◆ యొకకొంతసేపు

తల యూఁచి పలికె భూ ◆ తలనాథ నేఁడు
ప్రలయాగ్నియునుబోలి ◆ పర్వెడి చిచ్చు
కాలుప నీ తురం ◆ గంబులఁ గట్టు
శాల లన్నియును భ ◆ స్మంబు లౌ ననిన
నిది చోద్య మనుచు సా ◆ హిణుల రప్పించి
విదితంబు గాఁగ నా ◆ విప్రునిమాట
చంద మెఱింగించి ◆ జతన మై యుండుఁ
డందఱు నని పంపె ◆ నంత నారాత్రి
పాపపువిప్రుని ◆ పనికిఁ దా మున్ను
తాపికాఁడై నపా ◆ దలి మందడీఁడు
జ్వాలకలాపభీ ◆ షణముగా నశ్వ
శాలల నగ్నిఁగ్ర ◆ చ్చరఁ దరికొల్పె
నప్పుడు పెనుమంట ◆ లందంద నభముఁ
గప్పి పెల్లెగసినఁ ◆ గలకల నంత
వడిఁ బాఱు తెంచి కా ◆ [25]వలివారు విభునిఁ
దడయక రం డనఁ ◆ దత్తరపడుచుఁ
బరిజనంబులుఁ దానుఁ ◆ బర తెంచి వారిఁ
బురికొల్పుటయును బెం ◆ పునఁ జొచ్చిపోయి
తోఁకలు మండి మూ ◆ తులు గాలి యగ్ని
సోఁకవీఁపులు వ్రీలి ◆ చుంచులు గమరి
బలుమంటలెగసి చెం ◆ పలు గాలి పిఱుఁదు
లురిసి కంఠములతో ◆ ళ్లూడి గర్భంబు
లుడుకెక్కి బంధంబు ◆ లురువడిఁ దెంచి
విడివడి హేష లు ◆ ద్వేగముఁదెల్ప
బలువిడి నిట్టట్టుఁ ◆ బఱచుగుఱ్ఱముల
వెలినడఁ దిగిచి యా ◆ వివిధమాణిక్య
కలితంబులైన కం ◆ కణములు పైఁడి
జలపోతనంబులఁ ◆ జాల నొప్పారు
పల్లనంబులు నెర ◆ వట్టుపల్లములు
కల్లెంబులును గొంత ◆ కాలంగఁ దిగిచి
తెచ్చియుఁ జచ్చెల్లఁ ◆ దెగ నార్పి రంత
నిచ్చలో నిజపురో ◆ హితు నెఱుకకును

వెఱఁగంది ధారుణీ ◆ విభుఁ డుల్ల సిల్లి
తెఱఁ గొప్పఁ బిలిచి తో ◆ డ్తెం డని భటులఁ
బనిచిన వారును ◆ బఱచి వేవేగఁ
జనుదెం డని పిలువ ◆ జగదీశవిభుఁడు
పుత్తెంచె ననుడుఁబో ◆ పొమ్ము మామాట
చిత్తంబులో విశ్వ ◆ సింపఁడు నృపుఁడు
నిద్దుర గన్నుల ◆ నిండఁ గ్రమ్మెడిని
ప్రొద్దునఁ జనుదెంచి ◆ [26]పొడగాంతు ననిన
మగిడి యామాటలు ◆ మానవేశ్వరుకుఁ
దగ విన్నవింపఁ ◆ దాఁదఱితీపుచేసి
పిలిచి యాతనికి న ◆ భీష్టవస్తువులు
వలసినయంత న ◆ వారణ నొసఁగి
యనిపిన నాసొమ్ము ◆ నందులో సగము
కొని హయరక్షుకుఁ ◆ గొమరొప్ప నిచ్చి
మనమున నలరుచు ◆ మఱియుఁ గొన్నాళ్లు
చన నిచ్చి యతఁడొక ◆ [27]సఖ్యవంచనము
చేయంగ మనమునఁ ◆ జంతించి ధరణి
నాయకునొద్ద నం ◆ తఃపురిలోనఁ
ద్రిజగముల్ గెలువంగఁ ◆ దివురుమన్మథుని
విజయధ్వజముఁ బోలి ◆ విలసిల్లుచున్న
యనుపమ శుభలక్ష ◆ ణాంగిఁ దత్పుత్రిఁ
గని చేరఁ బిలిచి త ◆ త్కరపంకజమునఁ
గలభాగ్యరేఖలు ◆ గలయ వీక్షించి
తల యూఁచి యంతటఁ ◆ దనముక్కు మీఁద
వ్రే లిడి వెడవెడ ◆ వేసాలువేసి
మేలు కీ డని మాకు ◆ మేదినీనాథ
చెప్పకుండినఁ దప్పు ◆ చెప్పినఁ జిత్త
మప్పు డెట్లగునొ మే ◆ లైన మాయెఱుక
మెచ్చరుగాని యే ◆ మేనియుఁ గీడు
వచ్చిన మము దూఱ ◆ వత్తు రందఱును
గాన మే మిప్పుడు ◆ కన్నదోషములు
పూని చెప్పెద మీవు ◆ బుద్దిగా వినుము

విను వినకుండుము ◆ వివరించుకొనుము
కొనకుండు మనుచును ◆ గుటిలాత్మ నతని
చెవిడాసి కూఁతురు ◆ చేవ్రాలఫలము
వివరించి చూచితి ◆ విను మీకుమారి
నీయింటనుండిన ◆ నీవు నీప్రజలు
నీయేలుదేశంబు ◆ నిర్మూలమగును
అన విని భీతితో ◆ నతఁ డాడుమాట
తనకు నంతకుమున్న ◆ తార్కాణ యగుట
దలపోసి యక్కటా ◆ తల్లిపే రిడితి
నెలమి నీ బాలిక ◆ నేగతి విడువ
నొడఁబడు చిత్త మీ ◆ యువిదయే నాకుఁ
గొడుకైనఁ గూఁతైనఁ ◆ గూర్మి నెక్కొన్న
మోహసాగరమున ◆ మునిఁగి యుపాయ
మూహింప కే నింక ◆ నునిచితినేని
హాని పుట్టును నప్పు ◆ డందఱుఁ గవిసి
నానాముఖంబుల ◆ నన్నునిందింతు
రొక తెను విడిచిన ◆ నుర్వికి నాకు
సకల భూప్రజలకు ◆ సమ్మదం బొదవుఁ
జేకొనఁ దగు నయ ◆ స్థితి విచారించి
...... ...... ...... ....... ....... ....... .......
యింక సందేహంబు ◆ లేలని యాపె
తల్లి కంతయుఁ జెప్పఁ ◆ [28]దడవుగ దాని
యుల్లంబు ఝల్లని ◆ యొడలెల్ల వణఁక
శీతాంశుబింబంబు ◆ చెన్నుఁగై కొన్న
కూఁతురువదన మ ◆ క్కునఁ గదియించి
కన్నీరు గ్రమ్ముచుఁ ◆ గంపించుగుబ్బ
చన్నులపై జాఱఁ ◆ జమట మైఁ దొరుఁగ
వెగచి యేడ్చుచునున్న ◆ వెడఁదశోకంబు
నిగుడ విప్రునిఁ జూచి ◆ నృపుఁ డిట్టు లనియె
వెఱతుము నీమాట ◆ వేలెమ్ము గడమ
నెఱిఁగింపు మీపాప ◆ నేమి చేసెడిది
నావుఁడు సిద్ధించె ◆ నా కోరి కనుచు

భావంబులోపలఁ ◆ బ్రమదంబునొంది
యాతఁ డిట్లనె వసు ◆ ధాధిప మిగులఁ
[29]జాతిగ నొకమంద ◆ సంబును జేసి
యాలోన మణికన ◆ కాంబరాభరణ
జాలంబు లొంద న ◆ చ్చపలాక్షి, నునిచి
తలుపులు పదిలించి ◆ తగుతెప్పమీఁదఁ
బొలుపొంద నునిచి యు ◆ ప్పొంగు పెన్నీట
వెసఁబాఱ విడచిన ◆ వేవేగ శుభము
లెసఁగు మీకెల్లను ◆ నెలనాగభాగ్య
మిటువంటి దన నేటి ◆ కీశ్వరుకరుణ
నటమీఁద నైనయ ◆ ట్లయ్యెడిఁగాని
యనుచు లే లెమ్మని ◆ యవనీశుఁ దఱిమి
యనువొంద ననిచియు ◆ నట్లు చేయంగఁ
బనుప వల్దనువారిఁ ◆ బదరి తిట్టుచును
దనలోన బెదరుచుఁ ◆ దడవు సేసినను
జెడుదురు నేఁ జాటి ◆ చెప్పితిఁ గన్య
వెడలింపుఁ డని లోను ◆ వెలియుఁ జూచుచును
సిడిముడిఁబొందుచు ◆ శిఖ మిట్టిమిట్టి
పడఁగఁ బల్కులుదొట్రు ◆ వడ నూలమాల
గుడుచుచుఁ దన కిటఁ ◆ గొలిచి వేళయ్యె
నెడచేయ కందల ◆ మెక్కించి పాపఁ
గొనిరండ యనఁ దల్లి ◆ కొఱుఁగుచు మఱియుఁ
గనుఁగవ బాష్పాంబు ◆ కణములు దొరుఁగఁ
బాసి రాఁజాలని ◆ బాలిక బాయఁ
దీసి కోపించియు ◆ దేవులం గినిసి
యేమి యీ వెడయేడ్పు ◆ లేడ్చెద రనుచు
నామాట వినక భూ ◆ నాథుండు మున్ను
తురగరత్నముల న ◆ త్యుగ్రానలంబు
కెరచేసె నీచేటు ◆ నెఱుఁగఁడో లేఁడొ
మరులు కూఁతురు తోడ ◆ మరలింతుఁ[30]దొడుగ
నఱదిన్న బంగార ◆ మది యెల్ల నేల
యని విడ నాడి మీ ◆ కటు చనుదేరఁ

బనిలేదు వినుఁ డని ◆ బాలఁ దోడ్కొనుచు
సచివులతోఁగూడఁ ◆ జని బహు (రత్న)
నిచయముల్ నిండార ◆ నించిన పసిఁడి
మందసంబున నుంచి ◆ మఱితెప్పమీఁదఁ
బొందుగా నునిచి కొం ◆ పోయి నట్టేటి
వడిఁ బాఱి విడిపించి ◆ వచ్చె నావిప్రు
కడఁ గూడి చదువు వె ◆ క్కలి బ్రహ్మచార్ల
నటమట నొజ్జలు ◆ నంతకు మున్ను
తటుకున నరిగి మం ◆ దసఁ బట్టు డనుచుఁ
బంపిన నందఱు ◆ బఱచి యయ్యేటి
వంపున మందస ◆ వచ్చునంతకును
నెదురు చూచుచునుండి ◆ యేటితీరమునఁ
బొదరిండ్లలోపలఁ ◆ బొంచున్న యంత
నభినవ కందర్పుఁ ◆ డన నొప్పుభూమి
విభుఁడొక్కఁ డడవికి ◆ వేఁటమై వచ్చి
కడుదూపటిలి యుద ◆ కంబులు గ్రోలఁ
దడయక యయ్యేటి ◆ దరి కేగుదెంచి
రంగదుత్తుంగ త ◆ రంగఘట్టనలఁ
గ్రుంగుచు నెగయుచుఁ ◆ గూలంబుఁ జేర
వచ్చునందసఁ గని ◆ వడి నీతగాండ్లఁ
బుచ్చి తెప్పించి త ◆ ల్పులు బారు దెఱచి
కరసానదీర్చి యం ◆ గజుఁ డొరలోన
కరమొప్ప నునిచిన ◆ కరవాలువోలె
నెరసంజమబ్బులో ◆ నిగనిగమించు
నెరయ దీపించు క్రొ ◆ న్నెలసోగవోలె
సలలితరత్న పం ◆ జరములోఁ జాలఁ
జెలువారు ముద్దురా ◆ చిలుక చందమున
సన్నుతరత్నభూ ◆ షణదీప్తు లెసఁగ
నున్నట్టి బోఁటిని ◆ నుడురాజవదనఁ
జకితకురంగలో ◆ చనఁ గంబుకంఠిఁ
బికవాణిఁ బరిపక్వ ◆ బింబాధరోష్ఠిఁ
గుసుమకోమలిఁ గుంద ◆ కుట్మలరదనఁ
గిసలయపాణినిఁ ◆ గేసరగంధిఁ

గనకతాటంకను ◆ గరివైరిమధ్య
ననుపమజఘన ◆ నావర్తనాభిఁ
గరభోరు నరుణపం ◆ కజకరయుగళఁ
దరళతారుణ్యనూ ◆ తనవిభ్రమాంగి
నంగనాతిలక న ◆ య్యబ్జాక్షిఁ గన్య
నంగజరాగ లో ◆ లాత్ముఁడై చూచి
వేవేగ మందస ◆ వెడల రప్పించి
భూవరుఁ డాపూవుఁ ◆ బోణి కిట్లనియెఁ
దనుమధ్య యే రాజ ◆ తనయ వేమిటికి
నిను మందసమున ను ◆ నిచి యిట్టు లేట
విడిచిన తెఱఁగెల్ల ◆ వినుపింపు మనుచు
నడిగిన నంత సి ◆ గ్గడరఁ గ్రొమ్మించు
...... ...... ...... ....... ....... ....... ........ .......
లరయఁ జన్నులకుఁ బ ◆ య్యదఁ జాటుదిగిచి
తలవంచి చిరునవ్వు ◆ తనుకు వెన్నెలలు
పలుచని చెక్కుల ◆ పై బిత్తరింపఁ
దనపదాంగుళమున ◆ ధరణి వ్రాయుచును
మనుజేశుతోడను ◆ మదచకోరాక్షి
తనతెఱంగంతయుఁ ◆ దప్పక చెప్ప
విని విస్మయం బంది ◆ విప్రు నిందించి
ధరణీశ్వరుండు గాం ◆ ధర్వవివాహ
మరయంగ శాస్త్రోక్త ◆ మగు నని యపుడు
నృపతి యాకన్యఁ బా ◆ ణిగ్రహణంబు
విప్ర సమ్ముఖమున ◆ వెలయఁ గావించి
మనమార మొదల స ◆ మ్మందస నున్న
ఘనమైన వస్తువుల్ ◆ గైకొని యందుఁ
బూని తా నంతకు ◆ మున్నువేఁటాడి
బోనునఁదెచ్చిన ◆ బొల్లియెలుంగుఁ
జొరఁబెట్టి తలుపు ల ◆ చ్చుగఁ బదిలించి
తిరముగాఁ దొల్లిటి ◆ తెప్పపై నునిచి
యేటఁ బోవిడిచి యా ◆ యింతిఁ దోడ్కొనుచు
ఘోటక భటదంతి ◆ కోటులతోడఁ
దనపురి కేగినఁ ◆ దదనంతరంబు

అనువునఁ జనుచున్న ◆ యామందసంబు
వడుగులు కని యుబ్బి ◆ వడిఁ గుప్పిగంతు
లిడుచు నొండొరుఁ గేక ◆ లిడుచుఁ జప్పట్లు
కొట్టి చంకలువేసి ◆ కొనుచుఁ జెలంగి
పట్టి మందసఁ దెచ్చి ◆ పరగ నయ్యేటి
పొంతఁ బ్రబ్బినప్రబ్బ ◆ పొదలలో నునిచి
సంతసం బెసఁగ నొ ◆ జ్జలరాక కెదురు
చూచుచునుండి ర ◆ చ్చోట నావిప్రుఁ
డీచేటుపాటుఁ దా ◆నెఱుఁగక దక్కె
రాచకూఁతురు మనో ◆ రథసిద్ధి యెసఁగె
నా చపలాక్షిఁ జ ◆ య్యనఁ బొందకున్న
నేఁచిన నీమనం ◆ బె ట్లాపవచ్చు
వేఁచి కాఱించు పూ ◆ విలుతు కే నింక
నని సంభ్రమింపుచు ◆ నర్కున కెఱఁగ
ఘనతరంబుగఁ గాయ ◆ గట్టిననుదుటఁ
బొడవైన పెనుబొల్లి ◆ బొట్టును మొదలఁ
బెడసి రాలుచునున్న ◆ [31]పెడతల నరల
దులిచినసికయు సం ◆ దులఁబాఁకు వట్టి
బలువు గప్పిన గొగ్గి ◆ పండ్లును బిట్టు
పడికి కం పెసఁగెడి ◆ బడబాకినోరు
జెడసు [32]చెవులుఁ గుఱు ◆ పీఁచు గడ్డమును
బరుసు మీసముఁ జెక్కు ◆ పైఁ బులిపిరియు
నుఱుకుబొడ్డును మేన ◆ నొదవిన దద్దుఁ
బిల్లికన్నులు బల్ల ◆ పెరిఁగినకడుపు
గిల్లచూపులుఁ జాల ◆ గిరికొన్న బొచ్చు
బొలిబొట్టు గూనివీఁ ◆ పును బుఱ్ఱముక్కుఁ
గలుకును మెడమీఁది ◆ కంతియు నీచ
బోయిన పిఱుఁదును ◆ బుస్తుదోవతియు
దాయ జంక నిడిన ◆ దర్భసంబెలయుఁ
గోలయుఁ [33]గుఱుమెట్లు ◆ గొడుగును ముఱికి
పేలికెయును ముళ్లు ◆ బెట్టిన జంధ్య
ములును బంచాంగంబు ◆ ముష్టియుఁ జిల్లు

.

లొలసినకరతిత్తి ◆ యును నలవడఁగ
గారెలు బూరెలు ◆ ఖండమండిగెలు
పేరిననేయియు ◆ బెల్లంబుఁ బప్పు
ముడిచిన ముడియలు ◆ మూపున డొల్ల
వడియఁబుచ్చిన పోఁక ◆ వక్కలు నెండి
పోయిన యాకులుఁ ◆ బొనరఁ గక్షముల
హేయమై దుర్గంధ ◆ మెసఁగగఁ జెమట
వడియంగఁ గునుకుచు ◆ వచ్చె వచ్చుటయు
వడుగులు గాంచి పై ◆ వలువ లందంద
...... ...... ....... ....... ....... ........ ....... .......
వడిదింపి దాఁటులు ◆ వైచుచు నెదురు
చని క్రందుగా నమ ◆ స్కారముల్ చేసి
మనమార మందస ◆ మనకు లోఁబడియె
ననవుడుఁ గడునుబ్బి ◆ యావటుప్రతతిఁ
గనుఁగొని నుతియించి ◆ కవుఁగిటఁ జేర్చి
సాముచేయుచు మల్ల ◆ సరచుచుఁ గోల
వేమారు విసరుచు ◆ విస్తూప మెసఁగఁ
బనసలు చెప్పుచు ◆ బ్రమసి పాఱుచును
గునియుచుఁ జప్పట్లు ◆ గొట్టి యాడుచును
వెగ్గలంబుగ నోరు ◆ విప్పి నవ్వుచును
వగ్గు కోఁతికి సివము ◆ వచ్చిన రీతి
కనుఁగొని హాస్యంబు ◆ గా వికారంబు
లొనరించి మఱియు శి ◆ ష్యులనెల్లఁ జూచి
మా వేడు కింతట ◆ మానదు మీకు
గోవిందగంతులు ◆ కొన్ని వేసెదము
అనుచు ధోవతి మొల ◆ నంట బిగించి
తనమూట లటు పెట్టి ◆ తమకంబు నిగుడ
మడమలు పిఱుఁదున ◆ మాటిమాటికిని
వడిఁ దాఁక నందంద ◆ వడిఁ బొట్ట గదల
ముఖము చెమర్ప నూ ◆ ర్పులు సందడింప
శిఖ మిట్టిపడ వల ◆ చేదోర మూడ
నడుతల మెఱవ జం ◆ ధ్యంబులు ద్రెవ్వఁ
బెడక చ్చ విడ మల్లి ◆ పెద్దికి మూఁడు

పప్పుకూచికి నాల్గు ◆ భాస్కరుకైదు
అప్పలకాఱు జం ◆ ధ్యాల కేశవుకుఁ
బది కుప్పిగంతులౌ ◆ భళుకుఁబదాఱు
పదుమూఁడు గోవింద ◆ భట్టుపిన్న(ని)కి
డేరవిఠ్ఠులుకుఁ బం ◆ డ్రెండు దోరాల
నీరయకెనిమిది ◆ వీథిమాధవుకు
నిరువది నచ్చాయ ◆ కేడు పాయసము
నరసింహునకు పదు ◆ నాల్గును నున్న
చల్లమల్లని కేడు ◆ సరి యనంతనికిఁ
బుల్లె విస్సయకును ◆ బురుషోత్తమునకుఁ
దులసి మంచనికిని ◆ ధోతి శ్రీధరుకుఁ
బులగ మీశ్వరునకు ◆ బూరె లక్షనికిఁ
బట్టెవర్ధనము గో ◆ పాలుకు నెలమిఁ
దుట్టెరాఘవునకు ◆ దుల జనార్దనుకు
సత్రమయ్యలకుఁ బ ◆ చ్చళ్ల క్రిష్ణకిని
సూత్రమల్లనికి జో ◆ స్యుల ధర్మనికిని
గూడ ముప్పదిరెండు ◆ గోవిందగంతు
లీడేర నేసితి ◆ నిం కోప ననుచుఁ
దనతొంటి గంతు లం ◆ తట మానివాండ్రఁ
బనిచి యిట్లనియెనొ ◆ ప్పార మీరెల్ల
మల్ల డ గొనఁ జేరి ◆ మందసఁ దెఱచి
కల్ల [34]చేయరు గదా ◆ కాఁగాదు అకట
నా కుపకార మొ ◆ నర్చినయట్టి
మీకునుజేసెద ◆ మే మిటు వినుఁడు
అరుదుగా నిఖిల మౌ ◆ నవధానములును
బరగంగ మంత్రాల ◆ పన్నాలు మిమ్ముఁ
దిట్టక కొట్టక ◆ ధృతిఁ జదివింతు
నెట్టుగా నేర్పుదు ◆ నిజ మింతపట్టు
అన్నగా ర్లాన మా ◆ యక్కమ్మతోడు
ఇన్నియు నిట్లుండె ◆ నింకొక్క భయము
పుట్టుచున్నది మాకు ◆ భూపాలపుత్రిఁ
బట్టి యొజ్జలు గాసిఁ ◆ బఱిచి రటంచు

బుగులుపుత్తురొ మీరు ◆ పురిలోన ననుచు
నగవుచేయక నాకు ◆ నమ్మిక పుట్టఁ
గ్రచ్చఱ నొకబాసఁ ◆ గావింపుఁ డనుచుఁ
జెచ్చరఁ దనతలఁ ◆ జెయ్యివెట్టించి
కొని నూకు నిఁక రాచ ◆ కూఁతురుఁ గదియఁ
జని విలాసంబుల ◆ సరసవాక్యములఁ
జిత్తంబు గరగించి ◆ సిగ్గెల్ల వాపి
సత్తుగా వేడుక ◆ సలుపఁ బోవలయు
మాకు సుఖంబు స ◆ మ్యక్కుగా మొదలఁ
దాఁకిన మరి పిల్చె ◆ దముగాని మీరు
సయ్యన నెడ గల్గఁ ◆ జనుఁ డన్న వడుగు
లయ్యెడ మరి నిల్వ ◆ కరిగి రావేళ
దాసి యామందస ◆ తలుపును నోర
చేసి యాయొజ్జలు ◆ చెలువను జూడ
లోను వీక్షించి యె ◆ లుం గని తెలియఁ
గానని చీఁకటి ◆ కతనఁ జిత్తమున
నీలిచీర ముసుంగు ◆ నిడిన యందంబు
దా లీలఁ జూచుచం ◆ దంబు గానోపుఁ
గాకున్న నేనాఁటఁ ◆ గలదు చర్చింప
భూకాంతుకన్యక ◆ బొల్లి మోమునకుఁ
గానియత్తెఱఁగు ని ◆ క్కంబుగాఁ దెలియఁ
గానక బాలిక ◆ గానఁ దనంతఁ
బలుక నేరక సిగ్గు ◆ పడియెడి ననుచుఁ.
దొలుతవాక్యముల చా ◆ తుర్యంబు దెలియ
మాటలాడెద నంచు ◆ మరికొంత గదిసి
పాటలగంధి సం ◆ భాషింప వేల
నగుచుఁ జుయ్యన వచ్చి ◆ నన్నుఁ గౌఁగిటను
బిగువారఁ జేకొని ◆ బిగియ వేమిటికి
నీవు పల్కక యున్న ◆ నృప పుత్రి నాకుఁ
బోవునే సిగ్గు ...... ...... ....... ....... .......
నని సన్న చేయుచు ◆ నకట యిం తేఁపఁ
జనునె మమ్మింక మా ◆ సానుర్థ్య మెల్ల
వెలయఁ జెప్పెద మిటు ◆ విను మని పలికెఁ

గులశీలములను ద ◆ క్కువగాని యాఱు
వేల బ్రాహ్మణుఁడ ఋ ◆ గ్వేదిని సభలఁ
జాలమించిన ఘన ◆ జటలఁబరీక్ష
గొనఁబంపి చూడు నా ◆ కొలఁది దుర్గోష్ఠిఁ
జనను మృత్తికను శౌ ◆ చంబులు చేతుఁ
గరతిత్తి నేమాఱఁ ◆ గాలంబులోన
సలుపుదు సంధ్యాది ◆ సత్క్రియ లెల్లఁ
బూనుదు నిన్నాన ◆ భోగాన నెపుడు
మానవేల్మియు రేపు ◆ మాపును సూర్య
సముపాసకుండఁ ◆ దిష్ఠన్మూత్రుగాను
కమలాక్షి నీకు నొ ◆ క్కతికె మోహించి
చిక్కితిఁగాకనేఁ ◆ జేరఁ బరసతిఁ
బ్రక్కఁజేర్పవె యేక ◆ పత్నీ వ్రతుండ
బతము మాలెదనన్నఁ ◆ బైఁబడి రాక
వెతలఁ బెట్టెదవు నా ◆ విద్యలయందు
నూహింప మీరాజ్య ◆ మొకగచ్చ కాయ
ఆహికంబులఁబెట్టి ◆ యప్పులు వార
వృద్ధి కొసంగుదు ◆ వేలుపుచెప్పు
పద్ధతి నేర్తుఁ బ్ర ◆ భాతకాలమున
దొరల యిండ్లకు నేగి ◆ తులసియుఁ బెట్టి
వరుస నిచ్చలు విన ◆ వారంబుఁ జెప్ప
గట్టిగా గొడుగులు ◆ గట్టను వండి
పెట్టను దర్భ సం ◆ బెల వరధాన్య
మెత్తఁ జేతులు చూడ ◆ నెలమి జంధ్యములు
నుత్తరుల్ సేయంగ ◆ నొగి బిక్షమడుగ
రూడికినెక్కు. విప్రుఁడఁ ◆ గాని మత్తి
గాఁడఁగాఁ జుమ్మిది ◆ గాక వెండియును
బడుగులు వెళ్లింతు ◆ బ్రహ్మరాక్షసికిఁ
గుడుతుఁ బీనుఁగు మోచి ◆ కొంపోదుఁ గాల
పురుషము నుభయతో ◆ ముఖి మృతిశయ్య
మరిమేషియును మృత్యు ◆ మహిషియు లవణ
తిలపిష్టగుడఘృత ◆ ధేనుకార్పాస
తిలపర్వతంబును ◆ దిలవర్తికయును

[35]గృష్ణాజినము నాల ◆ కృత్తియు నార్ద్ర
కృష్ణాజినంబనఁ ◆ గీర్తింపఁ బడిన
ధరీయింపరాని దు ◆ ర్దానముల్ గొందు
ఖరకరహిమకర ◆ గ్రహణకాలములఁ
గడికి నొక్కొక్కని ◆ ష్కముచేత నిడఁగఁ
గుడుతును బులగము ◆ కుత్తుకమోప
విడువక యిట్టు లీ ◆ విధమున ధనము
గడియింతు నే నటు ◆ గానఁ బూఁబోణి
యొఱపైన నీచన్ను ◆ లురముపైఁ గదియఁ
బఱతెంచి కౌఁగిట ◆ బంధింపకున్న
నీకు బ్రాహ్మల యాన ◆ నెయ్యియుఁ బప్పుఁ
బాకంబు రొట్టెలుఁ ◆ బంచదారయును
గండమండెఁగలును ◆ గారెలు నేత
వండినట్లును నాన ◆ వాలపాయసము
లడ్డువంబులును బె ◆ ల్లంబుబూ రెలును
ఇడ్డెనల్ కుడుములు ◆ నిదె తెచ్చి నాఁడఁ
గోమలి పొత్తులఁ ◆ గుడుతము రమ్ము
మామనంబున వేడ్క ◆ మల్లడి గొనెడిఁ
బప్పు దెచ్చితి నన్న ◆ పాఱితే నపుడు
తప్పెఁబో నీజాణ ◆ తనమునే మెచ్చ
దవ్వులనైన [36]శ్రా ◆ ద్ధంబని విన్న
నవ్వడి మున్నునే ◆ న చటికిఁ బోయి
పప్పు మండెఁగలును ◆ బాయసాన్నంబు
లప్పాలుఁ గొసరి తృ ◆ ప్తాస్థగాఁ దిందు
నూర్పువుచ్చక తలఁ ◆ యూఁచక వార
కార్పక నే నొక్క ◆ కడవెడు దాఁకఁ
ద్రావుదు నాజ్య మం ◆ దఱు వెఱగందఁ
గావునఁ బెండ్లిండ్లఁ ◆ గలుగు భోజనము
[37] గాతికి నేరాక ◆ కలకాల మెల్ల
దాతల యిండ్ల శ్రా ◆ ద్ధంబు గోరుదును
నాతి నానుగుణగ ◆ ణం బెల్ల వినుము
జాతిగాఁ గొక్కోక ◆ శాస్త్రమంతయును

విన్నాడ నందుల ◆ విధమునఁ గవయ
కున్న లతాంగి నీ ◆ కోడినవాఁడ
వృద్ధని చూచితి ◆ వేని కామంబు
బుద్ధిఁబోలింపంగ ◆ ముదుకకు ఘనము
వామాక్షి నావిట ◆ త్వము జాణతనము
నామాట నమ్మవే ◆ నాభార్య నడుగు
మభినవమన్మథుం ◆ డనుచు నెల్లపుడు
సభవారు వొగడు నా ◆ చక్కదనంబు
భామలు కోరి త ◆ ప్పక చూచిరేనిఁ
గాముని మదిలోనఁ ◆ గాసుకుఁ గొనరు
[38]అంగన యీ యింద్రి ◆ యావేగమిపుడు
పొంగుడువంగుడై ◆ పొలసిపోకుండ
రక్షించితేని వా ◆ రాణసి కరుగు
నక్షయంబగు పుణ్య ◆ మబ్బు నీ కిపుడు
చందన గంధి యీ ◆ క్షణమె మీ పితరు
లందఱు స్వర్గస్థు ◆ లయ్యెద రిపుడు
కాక నీవేఁచినఁ ◆ గామాతురమున
మాకుఁ జావకపోదు ◆ మరణ మొందినను
జలమున బ్రహ్మర ◆ క్షసుఁడనై నేను
బొలియింపకయ నిన్నుఁ ◆ బోనీను సుమ్ము
మలయజగంధి నా ◆ మాటకు మాఱు
పలుకవు నక్కిళ్లు ◆ పడియెనో చెవుడు
దొడరెనొ పెనుముద్ద ◆ దుఱిగిరో నోర
నెడయ దవ్వులమాట ◆ లేల మా కనుచు
వెలుపల ధోవతి ◆ వేసి లోపలికిఁ
దలఁదూర్చి మోకాళ్లఁ ◆ దడవుచుఁ జొచ్చి
తలుపు దగ్గఱమూయఁ ◆ దడవయ్యె విప్ర
కులుని మైజుంజురు ◆ గొన్న వెంట్రుకలు
నరపగడ్డంబును ◆ నలుపును జూచి
తెరలి యా యెలుఁగొక ◆ దిక్కున కొదిగి
వేఱె మృగం బని ◆ వెస గుఱ్ఱుమనఁగఁ
బాఱుండు మన్మథ ◆ పరవశుం డగుచు

నది పెద్దభల్లూక ◆ మను తెల్విలేక
యుది తేందుముఖి శంక ◆ నూఁది చిఱ్ఱనుచుఁ
దలఁగెదవే యొజ్జ ◆ తన మూడ్చి మీఁదఁ
గొలువ నొజ్జలతోనే ◆ గుటగుట యనుచు
బలిమిఁబైఁ బడక లోఁ ◆ బడవు నీ వనుచు
నలుపారు నెలుఁగును ◆ నట వీఁగు దోఁకఁ
బ్రీతిమై రాకొమా ◆ రితెవేణి యనుచుఁ
జేత బిగ్గరఁబట్టి ◆ చేరఁదివ్చుటయు
గొటగొట [39]గోండ్రించి ◆ కోర లొండొంటిఁ
గటగటఁ దాఁకింప ◆ గర్భంబు గలఁగి
హాతాత హామాత ◆ యనుచు మోఁచేతు
లూఁతగా వెనుకకుఁ ◆ నొఱగి వెలికిలఁ
బడి పాఱుకొని గుండె ◆ బలువిడి నడచి
పడఁగ నెలుంగని ◆ బాతళింపఁగను
నత్తఱి విప్రుపై ◆ నదరంట నుఱికి
క్రొత్త నెత్తురులొత్తఁ ◆ గ్రొవ్వాడి గోళ్లఁ
జిల్లులు వోవంగ ◆ సిరమును నురము
గుల్లలతిత్తిగాఁ ◆ గొట్టియు మెడయుఁ
జరణయుగంబు గ ◆ క్షములు నురంబుఁ
గరములు జిగిబిగి ◆ గా నొగిలించి
విడిచె నంతటితో డ ◆ విటశిఖామణికి
నడఁగెఁ దొల్లిటి విష ◆ యవ్యథ లెల్లఁ
గెరలి భల్లూక మీ ◆ క్రియఁ దన్నుఁ గఱవ
హరిహరి గోవింద ◆ యయ్యరో యనఁగ
దరియంగవచ్చి యం ◆ తయుఁ బోలఁ జూచి
మరివచ్చి వడుగులు ◆ మందసఁ గదిసి
వగచుచుఁ జేరి మీ ◆ వంటి పెద్దలకుఁ
దగిలి యీదురవస్థ ◆ దైవయోగమున
వచ్చె మానుపఁ గల ◆ వా రెవ్వ రనుచుఁ
జెచ్చరఁ గాళ్లును ◆ జేతులు వట్టి
వెలికి నొయ్యనఁ దెచ్చి ◆ వెఱవకుఁ డింక
నెలుఁగు లే దిచ్చట ◆ నేఁగె దూరమున

కనుచు గంట్లను నెల్ల ◆ (నడరెడు రక్త)
(మొన) ర వెల్వడ నొత్తి ◆ యుదకముల్ దెచ్చి
రోయకఁ దనువెల్ల ◆ రోఁత పోఁ గడిగి
తోయంబు ద్రావించి ◆ ధోవతిఁ గట్టి
యొల్లనఁ గూర్చుండఁ ◆ నునుపఁ దొల్లింటి
డిల్లంబు గొండొక ◆ తీరుపడంగ
హీనస్వరంబున ◆ నిట్లని పలికె
భూనాథుకన్య ని ◆ ప్పుడు మీర లెచట
నణఁచినారోచెప్పి ◆ ప్రాణదానంబు
తడయక చేయరే ◆ దయ మీఱ ననిన
వడుగు లిట్లనిరి ◆ మావంక కించిత్తు
దొడరదు నమ్ముఁడీ ◆ దుష్టవర్తనము
నావుడు నుస్సని ◆ నాభోక్త గాక
మీవశమా యింక ◆ మేదినీనాథుఁ
డిట్టి నా దుర్వృత్త ◆ మెఱిఁగిన వెడలఁ
గొట్టించు మేనెల్లఁ ◆ గుక్కచ్చులొత్తి
కావున నే నింకఁ ◆ గాసి కేగెదను
మావారి కింతయు ◆ మఱువక చెప్పుఁ
డని బ్రహ్మచారుల ◆ నందఱఁ బోవఁ
బనిచి తా నిచ్చటఁ ◆ బడియున్నవాఁడు
(దేవ నా) యెఱిఁగిన ◆ తెఱఁ గిది యనిన
నీవంశికోత్తము ◆ నెలుఁగు నొప్పించ
...... ...... ....... ....... ....... ....... ........
నరయఁగ నామీన ◆ నాథుఁ డిట్లనియె
నితని దుర్గుణము మా ◆ కెన్న నేమిటికి
మృతిఁ బొందఁ డెపుడు మా ◆ దృష్టి పైఁబడినఁ
బడెనుఁగానెట్టైన ◆ బలునొప్పిఁ బాసి
యొడలు తొల్లిటియట్ల ◆ యుండుఁ గా కనుచుఁ
బలికిన నప్పుడు ◆ పరమయోగీంద్ర
తిలకునిదయఁజేసి ◆ దిగ్గన విప్రు
నవయవంబులు గంటు ◆ లన్నియు మాని
సవరనై తొల్లింటి ◆ జాడనె యుండె
నంత నాభూసురుఁ ◆ డాహీననాథు

కాతతభక్తి సా ◆ ష్టాంగ ప్రణామ
మొనరించి యోదివ్య ◆ యోగీంద్ర నన్ను
మనమునఁ గృప మీఱ ◆ మనిచి రక్షించి
తింకఁబోనొల్ల నే ◆ నెందు మీపాద
పంకజంబులు గొల్చి ◆ బ్రతికెద శిష్యుఁ
గొవించుకొను మన్నఁ ◆ గలకల నవ్వి
నీవంటి బ్రాహ్మణు ◆ నికి నుపదేశ
మీక మఱెవ్వరి ◆ కిచ్చెద మేము
నీకులం బట్టిది ◆ నీశీల మదిగొ
యే మనవచ్చుఁ బొ ◆ మ్మెక్కడికైన
గామిడి వీక్షింపఁ ◆ గా దన బోయ
వినతుఁడై యిట్లను ◆ విను మనఘాత్మ
ఘనతరంబైన యీ ◆ గహనమధ్యమున
నుండు చోద్యపుగువ్వ ◆ యొకటి యెవ్వరికి
నిండు సాధింపంగ ◆ నెమ్మేన దాని
నొదిగి...... ...... ...... ....... ....... ....... .....
...... ...... ...... ....... ...... ...... యేయంగలేక
పొంచియుండఁగ నొక ◆ భూపాలుఁ డరుగు
దెంచి నాతో దీని ◆ తెఱఁ గెట్టి దనిన
దీని గుండెను ధృతిఁ ◆ దిన్నమానవుఁడు
మానవేశ్వరుఁ డగు ◆ మఱి దీని మాంస
మానిన యతఁడు ని ◆ రామయుం డగుచుఁ
దా నెన్నఁ బెక్కేండ్లు ◆ ధరణిపై బ్రదుకు
దీనిమస్తముఁ దిన్న ◆ ధీరుండు సిద్ధుఁ
డై నిత్యసౌఖ్యంబు ◆ లందు నటంచుఁ
జెప్పినఁ జాల వి ◆ చిత్రంబు గాఁగఁ
దప్పక యా గువ్వ ◆ తలఁ ద్రెవ్వనేసి
కెరలి మాంసంబు నా ◆ కిచ్చి మస్తకము
ధరణీశ్వరుఁడు మ్రింగి ◆ దాని గుండియలఁ
దనతోడఁ బుట్టినా ◆ తనికిఁ గొంపోయె
ననవుడు మత్స్యేంద్రుఁ ◆ డా విరూపాక్షు
నాతనికిని జూప ◆ నవనీశుఁ డనిన
యాతఁ డీతండు గాఁ ◆ డనుటయుఁ దెలియ

వీక్షింపు మిప్పుడీ ◆ వేషాంతరంబు
దతుతఁ గైకొని ◆ తానుంటఁజేసి
యెఱుఁగంగ లేవైతి ◆ వీతని ననఁగ
మఱియాతనిని జూచి ◆ మత్స్యేంద్రుఁజూచి
యిలలోనఁ బక్షుల ◆ కీప్రభావంబు
గలుగ దెక్కతమునఁ ◆ గలిగె నీ గువ్వ
కానతియిమ్మన్న ◆ నంతలో నాత్మ
లోనఁ దెల్లమిగ నా ◆ లోకించివన్య
పతికి నిట్లనియె న ◆ ప్పరమ యోగీంద్రుఁ
డితర పక్షులకెల్ల ◆ నీ పెంపు గలదె
విను మీకపోతంబు ◆ నృత్తాంత మెల్ల

కపోత వృత్తాంతము



ననిమిషాధీశ్వరు ◆ కన్ని వేళలను
మందారనాథనా ◆ మంబు గంధర్వుఁ
డందఱలోనఁ దా ◆ నాత్ముఁడైయుండు
నుండనా దివిజేంద్రుఁ ◆ డొక్కదినమున
ఖాండవోద్యానంబుఁ ◆ గనుఁగొను వేడ్క
శృంగారములు చేసి ◆ జీవంబు గలుగు
బంగారుప్రతిమల ◆ పగిది రంభాది
వారకామిను లిరు ◆ వంకలఁ దన్ను
[40]జేరి సేవింప శ ◆ చీ సమేతముగ
నరిగి యవ్వనములో ◆ నసదృశప్రసవ
పరిమళ విభ్రమ ◆ పరమసంగీత
మాధుర్య మంజుల ◆ మంజు మంజీర
మాధవీ వనలతా ◆ మంటపంబులను
వర్ణితపోడశ ◆ వర్ణసువర్ణ
వర్ణమనోహర ◆ వైభవ శోభి
పరిపక్వ మృదుతర ◆ ఫలరసపాన
పరిణత మదశుక ◆ ప్రకరానులాప
సరసరసాల వి ◆ శాల భూజములఁ
బరపారు నీడల ◆ బాలప్రవాళ
లలితారుణ ప్రవా ◆ ళగ్రాసలోల

కలకంఠకులకంఠ ◆ కాకలారావ
రుచిర పున్నాగ భూ ◆ రుహమూలములను
ఖచర విద్యాధర ◆ కామినీ రణిత
చారు వీణారవ ◆ శ్రవణ విశాల
సారంగసంకుల ◆ జాతిలవంగ
లవలీలసత్కుంద ◆ లతికానుకుంజ
నివహంబులను నిజ ◆ నికట సంఫుల్ల
వకుళ చంపక కుర ◆ వక శతపత్ర
వికసిత స్తబక న ◆ వీనమరంద
రసధౌత కలధౌత ◆ రచిత వేదికలఁ
బొసగంగఁ గేళి స ◆ ల్పుచునున్న వేళ
విరులుగో సెడు వేడ్క ◆ వెలయ రంభాది
తరుణులు తనలోనఁ ◆ దహతహ నిగుడఁ
బరపైన గురివింద ◆ పందిరుల్ దూఱి
సురగలపొరుగున ◆ నురుగుచు దాఁగి
చూతపోతమ్ముల ◆ నుద గొమ్మ లెక్కి
...... ...... ....... ...... ...... ...... ...... ......
కలయఁబూచిన కింశు ◆ కంబులు మెట్టి
చెలఁగెడు కలికి రా ◆ చిలుకలఁ బట్టి
చెలువారు తలిరాకు ◆ సెలగొమ్మ లూఁపి
కిలకిల నగుచు కో ◆ కిలలను జోఁపి
ప్రమదంబుమీఱ చం ◆ పకములు డాసి
కొమరు మించిన పువ్వు ◆ గుత్తులు గోసి
మలయజద్రుమముల ◆ మఱుఁగున దాఁగి
యలరు పెందీఁగెయు ◆ య్యాలల నూఁగి
తొరఁగుపూఁదేనెల ◆ తుంపర్ల జడిసి
పొరిఁబొరిఁ గలుగొట్ల ◆ పొంతను నుడిసి
యలమువాసనలను ◆ హాయని కోరి
ఫలములు గల మాది ◆ ఫలపాదపముల
గిరికొని నిమ్మల ◆ కెలఁకులఁ దనరి
తఱచైన పొన్నల ◆ తావులఁ జెలఁగి
కలికి కన్నుల తిల ◆ కంబులు చూచి
తొలఁగి యశోకప ◆ ఙ్త్కుల నోలి డాసి

[41]పొగడపూల సిగలఁ ◆ బొందికఁ జెరివి
మొగలిరేకులు చొల్లె ◆ ములఁ జాలఁ దుఱిమి
వన్నెలు పచరించి ◆ వనిత లందఱును
సన్నుతప్రసవభూ ◆ షణములు పూని
మురియుచుఁ జనుదెంచి ◆ ముందర నిల్వఁ
బురుహూతుఁ డా పువ్వుఁ ◆ బోండ్లునుదాను
వికసిత కనకార ◆ విందపరాగ
నికరపింజరితపా ◆ నీయమై తీర
కలితకల్పద్రుమ ◆ గళిత ప్రసూన
లలితసౌరభసము ◆ ల్లసిత (తరంగ)
జాలమై తన పొంత ◆ చందన శాఖి
బాలపల్లవభవ ◆ పవనకిశోర
శిశిరితకణ విరా ◆ జితమై శశాంక
విశదోర్మి డోళికా ◆ విసరవిహార
చతుర హంస బలాక ◆ సారసచక్ర
వితతకోలాహలా ◆ న్వితమై తనర్చు
కమలాకరంబు చెం ◆ గటఁ బారిజాత
కమనీయశాఖలఁ -◆గలయఁ బెనంగి
తనరారు మల్లీ ల ◆ తామండపమున
వినుతచింతామణి ◆ వేదిపైనుండి
జలకేళిసలుపు న ◆ చ్చర పువ్వుఁబోండ్ల
లలితవిలాసలీ ◆ లలఁ దనవేయి
కన్నులు విలసిల్లఁ ◆ గాఁగనుఁ గొనుచు
నున్నయత్తఱి నప్ప ◆ యోజాకరంబు
నందులో నొక రాజ ◆ హంసి తన మదిఁ
గందర్ప కేళికిఁ ◆ గౌతుకం బెసఁగ
విభుక్రేవఁ బుచ్ఛంబు ◆ విప్పుచుఁ గదిసి
యభినవలీలఁ ద ◆ దగ్రభాగమునఁ
గ్రీడించి మలయుచుఁ ◆ గేకరింపుచును
జోడువాయక యీఁదు ◆ చును గాలుచాఁచి
క్రొంకుచు ముక్కున ◆ కొన మోపుకొనుచుఁ
బైకొనఁ దత్తర ◆ పడక మున్గుచును

మలఁగి చూచుచుఁ బలు ◆ మా ఱెలయింపఁ
గలయక వేఱొక ◆ కలహంసివలన
నలమునిజేశుతో ◆ నలిగి యొక్కింత
తలఁగి పోవఁగ వెంటఁ ◆ దగిలి తానలుకఁ
దెలుపవచ్చినఁ దరి ◆ తీపును బెట్టి
(య)లయించుఁ బైఁబడ ◆ నరిగి కట్టెదుర
నిలిచిన నొండొండ ◆ నిగుడించుఁ జూడ్కి,
నెలమి పుచ్ఛము క్రేవ ◆ నేగిన మరలి
పదమెత్తి వెసనేయు ◆ బాలమృణాల
మదిదనకీఁబూని ◆ యరుదేర నలిగి
మేటితరంగల ◆ మీఁదికి దాఁటు
దాఁటినతోడనె ◆ డాఁటిననవులఁ
బొడవైన తామర ◆ పూగద్దె యెక్కు
వడినది చుట్టిరా ◆ వచ్చిన న్గెరలి
పొడుచుముక్కున నంత ◆ పోటు సహించి
తడయక నెయ్యంబుఁ ◆ దార్కొనఁజేసి
కలయ వీక్షించు నా ◆ క్రమము నీక్షింపఁ
దలఁపులో నొరయు కం ◆ దర్పు దర్పమున
చలివెలుంగుల నీను ◆ చంద్రకాంతంబు
చలువల నొప్పారు ◆ జగతిపైఁ జాల
పరువమై వికసించు ◆ పన్నీరు గురియు
విరుల చప్పరములో ◆ విమలమైవెలయు
ఘనసారరేణు సై ◆ కతములలోన
నొనరు పానుపుమీఁద ◆ నుప్పొంగు వేడ్క
ననువుగ శచియును ◆ నమరనాథుండు
మనసిజక్రీడాభి ◆ మత సౌఖ్యలీల
నందుచునుండిన ◆ నా చప్పరంబు
నందుఁ గపోతమై ◆ యారతి చేష్ట
లందందఁ జూచుచు ◆ నణఁకువ నున్న
మందారనాథు నేమరి ◆ పాటుఁ గాంచి
యీగొంది నెటనుండి ◆ యే తెంచె నిప్పు
డీగువ్వ యనుచు ను ◆ రేశ్వరుం డాత్మ
నవ్విధంబంతయు ◆ నరసి యాగ్రహము

నివ్వటిలఁగ నోరి ◆ నీచవిచార
నిన్ను నేసఖుఁబోలె ◆ నెయ్యంబుమీఱ
మన్నింతు నెప్పుడు ◆ మది నరలేక
కపటరూపమున నీ ◆ కల్ల గావింపఁ
జపలాత్మనీ కెట్లు ◆ సమకొనె మనసు
వదలక నినుఁ బట్టి ◆ వధియింపఁ దగిన
యదనైన నా చిత్త ◆ మట్లొడంబడదు
కావున భూమిపైఁ ◆ గాననసీను
నీ విట్లు గువ్వవై ◆ నిలువు పొమ్మనినఁ
గడు భయంబున వాఁదు ◆ గజగజ మేను
వడఁక దైన్యంబున ◆ నాసవు కెఱఁగి
నా కేశ గుమతినై ◆ నాచేసినట్టి
యీ కల్ల కిదితగు ◆ నిటమీఁదనెట్లు
శాపమోక్షము నాకు ◆ సమకూరు నట్టి
యాపొందు దయమీఱ ◆ నానతీవలయు
నావుడు నిట్లను ◆ నముచిసూదనుఁడు
భూవలయమున న ◆ ద్భుతవిక్రమమున
దీపించు ఘూర్జర ◆ దేశాధిపతికి
నేపారఁబుత్రుఁడై ◆ యెల్లభోగముల
నసమానుఁడగు విరూ ◆ పాక్షభూపాలుఁ
డసమున వేఁటాడ ◆ నరుదెంచి నిన్నుఁ
దలఁద్రెవ్వనేయ నం ◆ తట శాపముక్తి
కలుగు నన్నను వాఁడు ◆ గ్రమ్మఱ ంరొక్కి
యొకమహత్త్వంబు నా ◆ యొడల లోకముకుఁ
బ్రకటంబుగా వినఁ ◆ బడకుండ నన్ను
వెదకి చంపఁగరారు ◆ విబుధేంద్ర నాకు
నది గల్గఁ గృపసేయు ◆ మని విన్నవింప
నగుఁగాక నీ గుండె ◆ లర్థిఁ దిన్నతఁడు
జగతీశుఁడగు తర ◆ సముదిన్న యతఁడు
చిరజీవియై తెవుల్ ◆ చెందక బ్రతుకు
సిరము మ్రింగినవాఁడు ◆ సిద్ధుఁ డౌననిన
బలదైత్యభేది నా ◆ పై నిట్టి మహిమ
గలుగుట జగతిఁ బ్ర ◆ కాశంబు చేయ

ననుపు మొక్కని నన్న ◆ నమ్మాలతీంద్రుఁ
డనెడి గంధర్వుఁబొ ◆ మ్మనియెఁ బొకాలి
నరనుత మందార ◆ నాథుండు గువ్వ
మరి నీకు దాని సా ◆ మర్థ్యంబు తెఱఁగు
మూలముట్టుగఁజెప్పి ◆ పోయినవాఁడు
మాలతీంద్రుం డని ◆ మత్స్యనాథుండు
చెప్పిన నెఱుకును ◆ శిష్యపుంగవులు
నప్పుడుగొనియాడి ◆ రమ్మహామహుని
నా యోగిపుంగవుఁ ◆ డంత నాశబర
నాయకుఁజూచి స ◆ న్మతి విరూపాక్షుఁ
డడవికి వేఁటమై ◆ యరుదెంచి మమ్ముఁ
బొడగనినట్టి చొ ◆ ప్పును సిద్ధుఁడైన
తెఱఁగును మావెంటఁ ◆ దిరిగెడువిధము
నెఱిగింపుమొగి నీవు ◆ నితనియగ్రజుని
కనికామరూపత్వ ◆ మతనికి నొసఁగి
చనియెఁ దా మునుల యా ◆ శ్రమములుచూడ
...... ..... ...... ...... ...... ....... .......
ననిచతుర్దశ భువ ◆ నాధీశుపేరఁ
భావనాతీత ప్ర ◆ భావునిపేర
సేవకోత్పలషండ ◆ శీతాంశుపేర
భృంగీశతాండవ ◆ ప్రీతాత్ముపేర
గంగాతరంగసం ◆ గత మౌళిపేర
ఘనవృత్తిశాంత భి ◆ క్షావృత్తిహృదయ
వనజప్రభాత ది ◆ వాకరుపేర
నభిమతార్థ ప్రదా ◆ యకుపేర నిత్య
శుభమూర్తి మల్లికా ◆ ర్జునదేవు పేర
నారవితారశ ◆ శాంకమై వెలయు
గౌరనామాత్యపుం ◆ గవ కృతంబగుచు
ననువొంద నీ నవ ◆ నాథ చరిత్ర
మను కావ్యమునఁ దృతీ ◆ యాశ్వాసమయ్యె.

  1. పరిమించు.
  2. వెంజిన.
  3. లింపారలవము......... దమ్మివొర.
  4. ఇటఁగొంత గ్రంథము దీనిమాతృక వ్రాయునప్పటికే పోయియండును.
  5. పట్టితాపసు భయమెల్లనుదీర్చి.
  6. దీని వ్రాఁతప్రతులలోఁ బెక్కుచోట్ల 'నావుండు' అనియే యున్నది.
  7. తనయ డగ్గరవచ్చి.
  8. సంతృప్తి బొగడొందు.
  9. త్మకు దలచుచు చిత్తమందు.
  10. తరవాదారి కృత్యంబు.
  11. పతిగూడ.
  12. సంశయముల ప్రతి.
  13. మచ్చల.
  14. వాటినన్నియును
  15. మెఱవ.
  16. శ్రోతాగ్నులాయయి చేతుల.
  17. నీటికి.
  18. లాగుగాసిద్ధు లన్నియు గృప నొసంగి.
  19. గూండుకు.
  20. వెరవొప్ప.
  21. 'యౌవను' అనవచ్చును.
  22. పుష్పచందంబు.
  23. నలవైన యిందిరుల్ సమర.
  24. పొలుపలరసొ... బెంపును.
  25. వలివారి గూడిరండని భూ విభుడు.
  26. పొగడొందననిన.
  27. సంఖ్యదుర్జనము.
  28. దడవయ్యగాని.
  29. జాతిమందస.
  30. తొడమరుదిన్న.
  31. పదతటి.
  32. చెయినినురుపించు గండమును.
  33. గురుబిట్టు.
  34. శాయరుగదా.
  35. కృష్ణాజినము కృతియును నార్ధకృష్ణా
  36. శార్ధంబని
  37. ఘాతకు
  38. అంగనయిట్టియీవిషయవేదనము.
  39. నొండియ.
  40. జేరిసేవింపజేసివసమే.
  41. పొగడలసైగలు పుక్కిటజెవిరి.