దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పట్నవాసము
శము లేకపోయినది. అప్పుడు లింగమగుంటనుంచి మరియొకరిని తోడుతీసికొని కొత్తపట్టణముదగ్గర చెన్నపట్టణముకాలువమీద పడవనెక్కి వారమురోజులలోపలనే చెన్నపట్టణము చేరితిని. నాభార్య కప్పుడు పండ్రెండవయేడు. చామనచాయరూపము. మిక్కిలి పలచగానుండెను. తెలుగు కొద్దిగా చదువను వ్రాయను మాత్రమే నేర్చియుండెను. నేను బి. ఏ. సీనియరులో చదువుచుండగానే వేసవి సెలవులలో నాకు కార్యముజరిపిరి. పిమ్మట చెన్నపట్టణముచేరి యధాప్రకారము చదువుసాగించుచుంటిని.
పట్నవాసము
మేము చెన్నపట్నములో విద్యార్థివసతిగృహము ప్రారంభించినపిమ్మట కొన్నాళ్ళకు ఆగృహములోని విద్యార్థులము కొందరము కలసి డిబేటింగుసొసైటిని స్థాపించి, అందు ప్రతి ఆదివారమును ఏదో ఒకవిషయమును చర్చించుచుంటిమి. ఆచర్చలు ఆంగ్లేయభాషలోనే జరుపుచుంటిమి. ఒకప్పుడు ఇంగ్లీషులో వ్యాసములువ్రాసి చదువుటయు జరుగుచుండెను. ఆచర్చలలోను, ఉపన్యాసములలోను నాకు ఒకకొంచెము ప్రవీణత యున్నట్లు కొందరు విద్యార్థులు చెప్పుకొనుచుండిరి. ఇట్లు జరుగుచుండ నొకనాడు షేక్స్పియర్ వ్రాసిన "జూలియస్ సీజరు" నాటకములో నొకటి రెండు ప్రధానాంకములు ప్రదర్శింపవలెనని నిర్ణయించి బ్రూటసుపాత్ర హనుమంతురావుకు, కాసియస్ పాత్ర నాకు నిచ్చిరి. ఆప్రదర్శనమున కాసియస్‌పాత్ర అందరికంటె బాగుగ నున్నదని చెప్పుకొనిరి. నన్ను సుశిక్షితుడగు నటకుడని శ్లాఘించిరి. నా చిన్ననాటి నాటకముల అనుభవము ఆనా డుపయోగించెననుట స్పష్టమే. పిమ్మటి కాలములో న్యాయవాదవృత్తియందు న్యాయమూర్తియెదుట నా కక్షిదారునిపక్షమున సభాకంపములేక వాదించుటలో సయితము ఈ అనుభవము కొంత యుపకరించెను.
బి. ఏ. సీనియర్‌లో చదువుచుండగా నొక శనివారము నాటి సాయంకాలము తంబుచెట్టి, లింగిచెట్టివీధులలో విద్యార్థులు గుంపులుగూడి గొప్పయుపద్రవము సంప్రాప్తమైనట్లు కేకలు వేయుచు తిరుగనారంభించిరి. కారణము విచారించగా మా కళాశాల విద్యార్థియగు ముట్నూరి సుబ్రహ్మణ్యము అనువానిని క్రైస్తవమతములో మరునాటి ఉదయముననే కలుపుకొనబోవుచున్నారు గావున దానిని ఆపివేయుటకే ఈసంరంభమని తెలిసినది. నేనును హనుమంతురావును ఆగుంపులతో కలుసుకొని ఒకయింట సభగాజేరి కొంత చర్చించుకొన్నపిమ్మట ఆచిన్నవాడు రాయపురమున ప్రొఫెసర్ రే అను మిషనరీయింట ఉన్నట్లు తెలిసినది. అప్పుడు మాలో కొందరిని ఆ మిషనరీతో మాట్లాడుటకు, మతప్రవేశము నాపుటకు, ఆపి, బందరులో అతని బంధువుల కిది తెలుపుటకు నియమించిరి. అందు హనుమంతురావును నేనుగూడ నియుక్తుల మైతిమి. మేము ఆరాత్రి రే దొర యింటికి బోయి ఆయనతో ముచ్చటించగా అతనిని మరునాడు మతములో కలుపుకొనవలెనను ఆలోచనయేమియు లేదనియు అతని బంధువులకు వర్తమానముచేసి పిలిపించవచ్చుననియు, వాగ్దానముచేసెను. ఆతనికి బ్రాహ్మణహోటలులో భోజనము పెట్టించు చున్నాముగాని తమయింటిలో నన్నముపెట్టుటలేదనికూడ స్పష్టముగ చెప్పెను.
రెండుమూడు రోజులకు సుబ్రహ్మణ్యముతల్లియును, భార్యయును అతనిని కలుసుకొనుటతో క్రైస్తవమతములో కలియుట మానుకొని బందరుకు వెడలిపోయెను. ఈ యాందోళన మింకను చల్లారకుండగనే ఒకనాటి మధ్యాహ్నము కళాశాలలో జూనియర్ ఎఫ్. ఏ. క్లాసులో ప్రొఫెసర్ రివరెండు లాయిడీ అనునతడు బైబిల్‌పాఠము చెప్పుసమయమున తనబూటుకాలెత్తి మీరు విగ్రహమును పూజించుటకన్న నాబూటును పూజించవచ్చునని మిక్కిలినీచముగ బల్కెనట. అంతట ఆక్లాసులోని ఇన్నూరువిద్యార్థులును మిక్కిలి కోపముతో కేకలువేయు బల్లలను బిగ్గరగ కొట్టుచు కల్లోలముగావించుచుండిరి. ఇంతలో మధ్యాహ్నము టిఫిన్‌గంట కొట్టబడెను. ఆ ప్రొఫెసర్ లేచిపోయెను. విద్యార్థులును తొందరగ పరువులిడుచు అతని వెంట బడిరి. ఆయన తప్పించుకొని ఉపాధ్యాయులగదిలో ప్రవేశించెను. ఆసమయమున మా ఫిలాసఫీశెక్‌షనుకు రివరెండు డాక్టరు కూపర్ గారు పాఠముచెప్పుచుండిరి. మేము ఆతురతతో లేచి, వెలుపలకు బోవుచున్న తక్కినవిద్యార్థులతో కలుసుకొంటిమి. ఇట్లే కాలేజీలోను హైస్కూలులో నుండు విద్యార్థు లందరును చేరి, జరిగినవిషయమును విని, హిందూమతమునకు గావింపబడిన అవమానమునకు సంతాపమునొందుచు కళాశాల సమీపమున ఆవీధిలోని కపాలేశ్వరస్వామి కోవెలముందు స్వామివారి ఉత్సవములనిమిత్తము అప్పుడే క్రొత్తగా వేయబడిన పెద్ద కొఠాయిలో జేరి సభగావించి, అందులో కొందరు ప్రొఫెసర్ లాయిడ్ అవినీతివాక్కులను అందువలన కలిగిన అవమానమును ఖండించుచు ఉపన్యాసము లిచ్చినపిమ్మట ప్రొఫెసర్‌లాయిడ్‌చేసిన దుర్భాషణనుగూర్చి తగినచర్య ఆయనపై చేయువరకును మేము కళాశాలకు రాకుండ సమ్మెకట్టుటకు నిర్ణయించుకొంటిమి అని తీర్మానించి ఆతీర్మానమును కళాశాలాధికారులకు అందచేసితిమి.
అందుపై కళాశాల సిండికేటు సమావేశమై విద్యార్థులిట్టి తిరస్కారభావమును బూనియున్నందున వారి తీరుమానము విచారింపబడదని వ్రాతమూలకముగ మారు తెలియజేసెను. ఇట్లు మాసమ్మె పదిదినములు సాగినది. క్రైస్తవవిద్యార్థులు తప్ప తక్కిన విద్యార్థులెవ్వరును కళాశాలకుగాని హైస్కూలుకుగాని పోలేదు. ప్రతిదినము ఉదయముమొదలు సాయంత్రము చీకటిబడువరకు సభ జరుగుచునేయుండెను. చెన్నపట్టణములోని కొందరు హిందూసంఘపుబెద్దలు సయితము మాసభకు వచ్చి క్రైస్తవకళాశాలవారును మిషనరీలును హిందూమతమును నాశనముచేయగోరుచున్నారనియు వారుచేయు అవమానములు భరింపరానివనియు విద్యార్థులు గావించిన సమ్మె క్రమమైన దనియు మమ్ముప్రోత్సహించుచుండిరి. అప్పుడు చెన్నపట్టణములో ఎఫ్. ఏ. చదువుచున్న శ్రీ వల్లూరు సూర్యనారాయణ రావుగారు ఒకరోజున మాసభకు వచ్చి, మిక్కిలి ఆవేశపూరితులై కళాశాలాధికారులను ప్రొఫెసర్ లాయిడ్‌ను విమర్శించుచు దీర్ఘముగ ఉపన్యసించిరి. హిందూపత్రికా కార్యాలయములోని కొందరు ఉపసంపాదకులును అటులనే ఉపన్యసించుచుండిరి. మద్రాసు మెయిలుపత్రిక క్రైస్తవకళాశాలపై పూర్వమునుండి తనకున్న వైషమ్యబుద్ధిని వెలిబుచ్చుచు సమ్మెజరిగినందుకు కళాశాలాధికారుల అసమర్థతను విమర్శించుచు ప్రతిదినమును ఏదో ఒకవ్యాసము వ్రాయుచు, మిషనరీ సంఘములవారు క్రైస్తవకళాశాలకు చేయుచున్న ద్రవ్యసహాయము వ్యర్థమని చాటింపసాగెను.
ఈసమయమున కళాశాలాప్రిన్సుపాల్ డాక్టరు మిల్లరుగారు వారి స్వదేశమగు స్కాట్లండునకు సెలవుమీద పోయియుండెను. రివరెండు డాక్టరు కూపరు అను అతిశాంతపురుషుడు కేవల ఋషితుల్యుడు ప్రిన్సిపాల్‌గా నుండిరి. వీరు ఆరోజులలో అప్పుడప్పుడు మావిద్యార్థివసతిగృహమునకు వచ్చి, ఈసమ్మె పనికిరాదని చెప్పుచుండిరి. లాయడ్‌గారి అవమానకరమగు దుర్భాషణను గురించి చెప్పగా "గోరంతలు కొండంతగా చేయుచున్నా" రని చెప్పి, మమ్ము సమాధానపరుప యత్నించుచుండెను.
ఇట్లు పదిరోజులు జరుగునప్పటికి మాకును త్రోవయేదియు దొరకకుండెను. గౌ. ఆనందాచార్యులవారు, హైకోర్టు వకీలు కాంగ్రెస్‌మహాసభకు అధ్యక్షతవహించినవారు గలరు. క్రైస్తవకళాశాలలో పూర్వము వారు చదివికొనిరి. మరియును వారు గవర్నరుజనరల్‌గారి (Executive Council) కార్యాచరణ సలహాసంఘములో సభ్యులు. ఈయన మాసమ్మె పదియవనాడు మాసభకు వచ్చి, తాను కళాశాలాధికారులతో మాట్లాడితి మనియు, ఇక నెప్పుడును హిందూమతమునుగురించి యెట్టి దుర్భాషలుగాని ఆడకుండ కట్టుబాటుచేయుదుమని తమతో వారు గట్టిగా చెప్పిరనియు, గావున నింతట సమ్మె చాలించి బడికి పోవుట మంచిదనియు లేకున్న చదువుకు భంగముకలుగునుగాన విద్యార్థులకే నష్టమనియు ఎంతవారైననను ఒకప్పుడు తప్పులు చేయుదురు గనుక వారిపై కాఠిన్యము వహించుట సరికాదనియు, ఎట్లయిన వారు విద్యాగురువులు మీరు విద్యార్థు లను విషయము మరువవలదనియు శాంతముగా మాకు నచ్చజెప్పుటతో మేము సమ్మెమానుటకు నిశ్చయించుకొంటిమి.
ఆనాడు మా బి. ఏ. సీనియర్‌క్లాసుకు ఏదో పరీక్ష ప్రారంభముకాబట్టి మేము పెద్దహాలులో కూరుచుండి పరీక్షా ప్రశ్నలను చదువుకొనుచుండగనే అప్పుడప్పుడె అచ్చువేసిన చినకరపత్రమొకటి మాలో పదుగురకు అందిచ్చిరి. అందు "నీవు సమ్మెకు ప్రధాననాయకులలో నొకడవుగా నున్నట్లు మాకు స్పష్టమైనది గనుక పదిరూపాయలు జరిమానావిధించబడినది. ఈజరిమానా చెల్లించనియెడల నిన్నుగురించి విశ్వవిద్యాలయాధికారులకు తెలిపి పరీక్షలలో చేర్చుకొనకుండ నిషేధపుటుత్తరువు తెప్పించబడు"నని వ్రాయబడియుండెను. దీనినిబట్టి కష్టసుఖముల నాలోచించుకొంటిమి. అప్పుడు క్లాసులోజరుగు పరీక్షకు గూడ హాజరగుటకు అవకాశము లేదనిరి. మాలో గురుస్వామి, రామచంద్రన్ అనువా రిర్వురుమాత్రము సంస్కృతవిద్యార్థులగుటచేత వారు కలకత్తాలో చదువ నిశ్చయించుకొని జరిమానా చెల్లించలేదు. నేను, హనుమంతరావును తెలుగువిద్యార్థులము. బి. ఏ. పరీక్షలో తెలుగు మాకు రెండవభాష, తెలుగులోనే పరీక్ష ఇయ్యవలసియున్నది. మరి యే యితరవిశ్వవిద్యాలయ ములలోను తెలుగునకు స్థానములేదనియు బి. ఏ. పరీక్ష కొలది దినములలో జరుగనున్నదిగావున దీనిని వదలి, మరల సంస్కృతమును చదువుటకు మొదలుపెట్టి ఇన్నిసంవత్సరములు చదివిన దంతయు వ్యర్ధపరచుకొనుట దుర్భరమగు కాలహరణమునకు, దుస్సహమగు ద్రవ్యనష్టమునకును గారణమగుననియు తలంచి అవమానమునకు లోనై జరిమానాసొమ్ము పదిరూపాయలను చెల్లించితిమి. ఈసమ్మె చల్లారినపిమ్మట నన్ను, హనుమంతరావునుగూడ విద్యార్థివసతిగృహమును విడిచివెళ్ళవలసినదని ఉత్తరువుచేసిరి. అవి బి. ఏ. పరీక్ష సమీపించురోజులు. మేము ఉండుటకు తగినస్థలము దొరకుట దుస్తరముగానుండెను. కాని దైవానుగ్రహమువలన విద్యార్థివసతిగృహమునకు ప్రక్కనున్న తంబుచెట్టిగారియింటిలో నొకహాలు అద్దెకు గుదిరినది. హాలులో సోఫాలు, చలవరాళ్ళబల్లలు, పటములు ఛాండిలియరులు మొదలగు విలువగలిగినవస్తువులు రమణీయముగ నమర్చబడియుండెను. అవి యన్నియు అందుండగనే మాకు నెలకు రు 2/- లకు మాత్రమే అద్దెకిచ్చిరి. ఆయింటివారినిబట్టియే ఆవీధికి పేరు వచ్చినది. వారు ఒకప్పుడు ప్రసిద్ధులయ్యు అప్పటికి హీనస్థితిలోనికి వచ్చియుండిరి. కాని యిల్లు అద్దెకిచ్చినారని యితరులకు తెలియుట గౌరవహానిగా నెంచి, మాకు అతిరహస్యముగ అద్దెకిచ్చిరి. మరికొందరు ఆంధ్రవిద్యార్థులును మాతో చేరిరి. కొలది రోజులలో నామేడ అంతయు విద్యార్థులతో నిండిపోయెను. ఇట్లు చదువుకొనుటకును నివసించుటకును మంచివసతి దొరకినందున సంతసించితిమి. మిల్లరుగారి వసతిగృహమునుండి వెడలగొట్టబడినకొరత మా కేమియును లేకుండెను. భోజనమునకు రామలింగయ్యయను తెలుగుబ్రాహ్మణుడు పెట్టిన హోటలులో ఏర్పరచుకొంటిమి గాన తెలుగు భోజనముగూడ సమకూడెను.
ఇంతలో డాక్టరు మిల్లరుగారు మరల చెన్నపట్టణము వచ్చి కళాశాలాధ్యక్షతను బూనెను. సమ్మెవిషయము ఆయనకు మిక్కిలి పరితాపము కల్గించెను. అందుచే ఆసమ్మెలో పాల్గొనిన కొందరు ముఖ్యులను పిలిపించి జరిగిన వృత్తాంతమును సావధానముగ చెప్పవలసినదని కోరిరి. నేను జరిగినదంతయు చెప్పెతిని. "ఒకకంటితో మిమ్ముచూచుచున్నంతవరకు మీరు చక్కగనే ప్రవర్తించుచుందురు. చూచువారు లేనప్పుడు మీరు త్రోవ తప్పుదురు. అదిగాక స్వభావము, నడవడి (Character and Conduct) వీని రెంటికినిగల తారతమ్యమును ఎవ్వరును సాధారణముగ గ్రహించరు. మనుజునిస్వభావము మారునది గాదు. నడవడిని మాత్రము ముఖ్యముగ దిద్దుకొనుచుండవలెను. నడవడి అప్పటప్పటికి మారుచుండును" అనుచు, లాయిడ్‌గారి ఆనాటి వర్తనముగూర్చి ఏమియు అనక మిక్కిలి ఆదరముతో ముచ్చటించెను. తుదకు సంభాషణ ముగించుచు, ఇంతవరకును మిమ్ము నాబాలకులారా (my boys) యని పిలుచుచుంటిని. ఇకముందు నా బిడ్డలారా (my children) అని పిలిచెదనని వాక్రుచ్చి, నన్ను దగ్గిరకు బిలిచి నాచెంపమీద తన యరచేతితో నెమ్మదిగ కొట్టి నవ్వుచు మమ్ము నందర వెళ్ళిపొమ్మని ఆనతిచ్చెను. మేము ఆయన ఔదార్యమును మెచ్చుకొని వారే ఆసమయమున నుండిన ఇంత జరిగియుండదని అనుకొంటిమి. పిమ్మట కొలది కాలమునకు బి. ఏ. పరీక్షలు గడచినవి. అందు నేనును హనుమంతురావును సెకండుక్లాసులో కృతార్థులమైతిమి. అప్పుడు బి. ఎల్. మూడుసంవత్సరములు చదువవలసి యుండెను. బి. ఏ. చదువుచుండగనే బి. ఎల్. లోగూడ చేరి చదువుటకు అవకాశముండెను. గాన ఒకసంవత్సరము కలిసివచ్చునను తాత్పర్యముతో బి. ఏ. సీనియరు చదువుచుండగనే బి. ఎల్. లో చేరితిని. అపుడు సముద్రపుటొడ్డున మెరీనాయెదుట ప్రెసిడెన్సికాలేజీలో బి. ఎల్. క్లాసులు పెట్టుచుండిరి. అందుకు హైకోర్టులాయర్లు ఉపన్యాసకర్తలుగనుండిరి. విద్యార్థులు హాజరైనట్లు క్లాసువెలుపల రిజష్టరులో దస్కతుచేయుటమాత్రమే కాని మేము క్లాసుకు హాజరైనది లేనిది విచారించు వా రెవ్వరును లేకుండిరి. ఓపిక ఉన్నంతవరకు శ్రద్ధగలవారు వినుచుండెడివారు. లేనివారు క్లాసులోనికి రాకుండనే రిజిష్టరులో దస్కతుచేసి వెలుపల మెరీనాలో షికారుచేయుచుండెడివారు. సామాన్యముగ సాయంకాలము 5 గంటలకు పిమ్మటనే ఈక్లాసులు జరుగుచుండుటచేత క్రైస్తవకళాశాలలో క్లాసులు ముగిసినతర్వాత అచ్చటికి పోవుటకు అవకాశముండెను. సామాన్యముగ కాలినడకను బోవుచుండెడివారము. హనుమంతురావు బి. ఎల్. లో నావలె చేరలేదు. నేనైననూ బి. ఎల్. లో చేరితినన్న మాటయే కాని చదువు పూజ్యమే. బి. ఏ. చదివి అది పూర్తిచేయుటకే శ్రద్ధవహించి, అందుత్తీర్ణుడనైతిని, కానిమొదటిసంవత్సరము బి.ఎల్. చదువనికారణమున బి. ఎల్. పరీక్షకు ముమ్మారు బోయి మూడవసారి కృతార్థుడనగుట సంభవించెను. హనుమంతరావు చదువుకాలమునకు బి. ఎల్. రెండుసంవత్సరములుమాత్రమే చదువవచ్చునని నిర్ణయమయ్యెను. అతడు రెండవయేట తప్పిపోయెను. కావున నాతోపాటుగనే కృతార్థుడయ్యెను. హనుమంతరావు బి. ఎల్. మొదటిసారి తప్పినపిమ్మట గుంటూరు హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి కాలముజరుపుచుండెను. నా కీమధ్యనే కార్యమైనందునను మాయత్తవారి కుటుంబవిషయములు నేను విచారించవలసివచ్చినందునను లింగమగుంటలో ఎక్కువకాలము గడపుట సంభవించినది. ఇందువల్ల నా బి. ఎల్. చదువుగూడ కొంత భంగమైనదని చెప్పవచ్చును.
కాంగ్రెసు - దివ్యజ్ఞానము
నేను బి. ఏ. జూనియర్ చదువుచుండగనే భారత దేశీయ మహాసభ (Indian National Congress) మూడవసమావేశము 1887 డిసెంబరులో చెన్నపట్టణములో జరిగినది. అప్పుడు నేనును, హనుమంతురావును ఐచ్ఛికభటులుగా పనిచేసితిమి. ఆసభకు డబ్లియు. సి. బెనర్జీ యను వంగదేశీయుడు, బారిస్టరు అధ్యక్షుడుగా నుండెను. ఆజానుబాహువిగ్రహము; పెద్ద గడ్డము ఆయనవక్షస్థలమున వ్రేలాడుచుండెను. ఆయన కంఠధ్వని మేఘగర్జనమువలె నతిదూరము వినబడుచుండెను. ఆసభకు సురేంద్రనాధబెనర్జీ యను ప్రసిద్ధవక్తగూడ వచ్చియుండెను. శ్రీ గోపాలకృష్ణగోఖలేగారును, మహాదేవ గోవిందరణడేగారును ఆసభకు హాజరైరి. వారు ప్రత్యేకముగ విషయములనుగూర్చి యోచనలుచేయుచుండిరి. తిలక్‌గారు రాలేదు. పండిత మదనమోహనమాలవీయ, బాబూ బిపినచంద్రపాలును యువకులుగా