దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కాంగ్రెసు - దివ్యజ్ఞానము

హనుమంతరావు బి. ఎల్. మొదటిసారి తప్పినపిమ్మట గుంటూరు హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి కాలముజరుపుచుండెను. నా కీమధ్యనే కార్యమైనందునను మాయత్తవారి కుటుంబవిషయములు నేను విచారించవలసివచ్చినందునను లింగమగుంటలో ఎక్కువకాలము గడపుట సంభవించినది. ఇందువల్ల నా బి. ఎల్. చదువుగూడ కొంత భంగమైనదని చెప్పవచ్చును.

కాంగ్రెసు - దివ్యజ్ఞానము

నేను బి. ఏ. జూనియర్ చదువుచుండగనే భారత దేశీయ మహాసభ (Indian National Congress) మూడవసమావేశము 1887 డిసెంబరులో చెన్నపట్టణములో జరిగినది. అప్పుడు నేనును, హనుమంతురావును ఐచ్ఛికభటులుగా పనిచేసితిమి. ఆసభకు డబ్లియు. సి. బెనర్జీ యను వంగదేశీయుడు, బారిస్టరు అధ్యక్షుడుగా నుండెను. ఆజానుబాహువిగ్రహము; పెద్ద గడ్డము ఆయనవక్షస్థలమున వ్రేలాడుచుండెను. ఆయన కంఠధ్వని మేఘగర్జనమువలె నతిదూరము వినబడుచుండెను. ఆసభకు సురేంద్రనాధబెనర్జీ యను ప్రసిద్ధవక్తగూడ వచ్చియుండెను. శ్రీ గోపాలకృష్ణగోఖలేగారును, మహాదేవ గోవిందరణడేగారును ఆసభకు హాజరైరి. వారు ప్రత్యేకముగ విషయములనుగూర్చి యోచనలుచేయుచుండిరి. తిలక్‌గారు రాలేదు. పండిత మదనమోహనమాలవీయ, బాబూ బిపినచంద్రపాలును యువకులుగా నుండిరి. వీ రిద్దరు కాంగ్రెస్‌లో ప్రదమముగా నుపన్యాసముల నిచ్చి సభాసదుల మెప్పించిరి. దేశప్రభుత్వమునందు ప్రజాప్రాతినిధ్యముండవలెననియు, శాసనసభలలోను, మునిసిపాలిటీలు, జిల్లాబోర్డులు, తాలూకాబోర్డులలోను ప్రజలప్రతినిధులు చేరవలెననియు, వీరికి పరిపాలనాబాధ్యత నొసగవలెననియు దీర్ఘోపన్యాసములనొసంగిరి. జాతీయమహాసభాపతాకము విప్పారిన దనియు దానిపై ప్రాతినిద్య మను పదము స్వర్ణాక్షరములతో లిఖీంపబడినదనియు గంభీరముగ వచించుటతోడనే సభాసదులు పులకాంకితులైరి. కరతలధ్వానములు మిన్నుముట్టెను. అప్పటికి దేశపరిపాలనలో ప్రజాప్రాతినిద్యము కోరుటయే గొప్పవిశేషము. ఆసభలో మరియొకవిషయము చర్చించబడెను. చెన్నపట్టణములో హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయుచున్న ఎడల్జినార్టన్ అను సుప్రసిద్ధ ఆంగ్లేయు డొక ఆంగ్లేయస్త్రీతో అవినీతిగ ప్రవర్తించి ఆమెభర్తనుండి వివాహబంధవిచ్ఛేదమును హైకోర్టుద్వారా సంపాదించి, తాను, ఆమెను వివాహముచేసుకొనకయే ఆమెతో కలసి నివసించుచు ఈజాతీయమహాసభకు ఆమెతోహాజరయ్యెను. అట్టి అవినీతిపరులను జాతీయమహాసభలో పాల్గొననియ్యవచ్చునా యను చర్చ తలయెత్తెను. ఈమహాసభలో సభ్యుల సంసారిక జీవితములందలి నీతిధర్మములను విచారించుట తగదనియు, ఏది నీతియో, ఏది అవినీతియో విచారించి తేల్చుటకష్టమనియు, గాన అట్టి నిషేధమును ఈమహాసభ చేయజాలదనియు స్పష్టపరచబడెను. అంతట ఆసభకు వచ్చియుండిన తీవ్రనీతివాదులగు (puritans) శ్రీ వెంకటరత్నంనాయుడు ఎం. ఏ. మొదలగువారు సభనుండి వెడలిపోయిరి. గోక్లే మొదలగు ముఖ్యులుతప్ప సభ్యులలో పలువురు మహాసభాకార్యక్రమము వినోదముగ భావించుచు వక్తల యుపన్యాసముల పదగాంభీర్యము, భావౌన్నత్యము, తర్కశుద్ధి, తీవ్రతమొదలగు విశేషముల నెన్నుచుండిరి. కాంగ్రెసుకార్యభారముగాని బాధ్యతలుగాని వారికి పట్టలేదనియే చెప్పవచ్చును. ఒకరోజు మధ్యాహ్నము అట్టివా రందరును గూడి చెన్నపురిలో ప్రసిద్ధురాలగు కళావంతురాలిని పిలిపించి ఆమెచే పాటలు పాడించి, అభినయముజరిపించి తమ రసికత్వమును వెల్లడించిరి.

మూడురోజులు సభాకార్యములు నడచినవి. నాల్గవనాడుదయమున నిదురలేదునప్పటికి అందరును వెడలిపోయిరి. ఈ మహాసభాకార్యక్రమమును అందు పాల్గొనిన దేశభక్తుల స్వరూపములును మా హృదయములందు నూతనోత్సాహము గల్పించినవి. అట్టిసభలో మాచేతనైన సేవచేయుటకు అవకాశము కలిగెనుగదా యని ఆనందము నొందితిమి. ఇట్లు 1887 వ సంవత్సరములో మొట్టమొదట కాంగ్రెసుమహాసభతో నాకు సంబంధము చేకూరెను.

చెన్నపట్టణము పెద్దది యగుటవలన మా కళాశాలకు సమీపమున నున్న లింగిచెట్టి తంబుచెట్టి వీధులను, ఆర్మీనియన్ చర్చివీధి ఫోఫమ్సుబ్రాడ్‌వే చైనా అంగళ్ళు పచియప్పకళాశాల చిల్లరసానులు (Second hand) చౌకగా దొరకెడి ఈవినింగు బజారు సెంట్రల్ రైలుస్టేషనులు గాక తక్కిన తిరువళ్ళిక్కేణి, మైలాపురము, అడయారు, ఎగ్మూరు, నుంగంబాకం, రాయపురము, తండియారుపేట మొదలగునవి మాకు అపరిచితములుగనే యుండెను. తిరువళ్ళిక్కేణిలో రెంటాల వెంకటసుబ్బారావుగారు హైకోర్టు వకీలుగానుండి వాసముచేయుచుండిరి. తాము ప్రకటించిన గ్రంథముల మూలకముగ ద్రవ్యసముపార్జన దండిగ జేయుచు పేరు ప్రతిష్ఠలు జెందుచుండెను. హైకోర్టు వకీలువృత్తి ఆయనకు నామమాత్రమే. వారిని చూచుటకు నే నప్పుడప్పుడు పోవుచుంటిని. ఒకటిరెండుసార్లు ఇంటియొద్దనుండి డబ్బు వచ్చుటకు ఆలస్యమైనప్పుడు వారి నడిగితెచ్చుకొని మరల వారికి చెల్లించితిని. ఆయనయందు గురుభావ ముండెను. వారును నాపై ప్రేమగలిగియుండిరి. వీరిస్థితి మిక్కిలి ఉచ్చదశలో నున్నపుడు వీరి చెల్లిలికుమార్తెకు సంబంధమునిమిత్తము మేము బసచేసియున్న తంబుచెట్టివీధిలో మాయింటికి వచ్చి, మమ్ము నందరిని కలుసుకొని, అప్పుడు మాతోడనే ఆయింట వాసము చేయుచున్న కాశీనాథుని నాగేశ్వరరావుగారికి ఆపిల్లను ఇచ్చుటకు నిశ్చయించుకొనిరి. అప్పుడు నాగేశ్వరరావు ఎఫ్. ఎ. సీనియర్‌లో చదువుచుండెనని జ్ఞాపకము. అచ్చట నున్న తెలుగు విద్యార్థులము పెండ్లి పెద్దల మైతిమి. వివాహమునకు తిరువళ్ళిక్కేణికి నాగేశ్వర్రావును పిలుచుకొనిపోయిరి. మమ్ము నందరిని వివాహమునకు ఆహ్వానము చేసినందున మేము కళ్యాణమహోత్సవము జూచి, మాలో నొక్కడుగా నుండిన నాగేశ్వర్రావుకు అప్పటినుంచి రెంటాలవారి యింటనే నివసించుచుండెను. ముందు కాలములో నాగేశ్వర్రావు ఇంత గొప్పవాడు కాగలడను మాట మా కపుడు తోచలేదు. ఆదినములలో మేము క్రైస్తవకళాశాలలో చదువుచుండినప్పుడు, దివాన్ బహద్దూర్ రఘునాధరావుగారు గొప్ప సర్కారు ఉద్యోగములుచేసి ఇందూరు సంస్థానములో దివానుగ కొంతకాలము పనిచేసి, న్యాయవర్తనచేతను, దైవభక్తిమొదలగు నున్నతగుణములచేతను పేరుపొందినవారుగా నుండిరి. ఇంచుక పొట్టిగా నున్నను పచ్చనిదేహకాంతి గలిగి, ధోవతికట్టుకొని పసుపుపచ్చ పట్టులాంగుకోటు తొడిగి, దేశస్థులు చుట్టుకొను తలపాగా చుట్టుకొని మనోజ్ఞమగు స్వరూపముతో దైవభక్తిని గూర్చియు, న్యాయవర్తనమునుగూర్చియు, అండర్సన్‌హాలులో ఉపన్యసించుచుండిరి. వీరియందు మా కెంతయో గౌరవభావము సమకూడెను. వారు ఉపన్యసించుసమయములలో చదివిన

         ఓన్నమ: పరన్మై పురుషాయ భూయసే సదుద్భవ
         స్థాన నిరోధలీలయా గృహీతశక్తి త్రితయాయ
         దేహినాం అంతర్భవానుపలక్ష్యవర్త్మనే

యీ శ్లోకము నేను మాటిమాటికి నుచ్చరించుచు, ఇప్పటికిని ప్రతిదినము నా సంధ్యావందనసమయమునందు పఠించుచుందును. వీరికి వీణావాద్యము ప్రియమనియు స్వయముగనే వీణ వాయించుకొని పాడుచు, ఆనందమునొందుచుందురనియు వింటిని. ఇట్టి సచ్చారిత్రులు చిరస్మరణీయులు.

చెన్నపట్టణములో దూరపుబేటలకు బోవలయునన్న సామాన్యజనులకు దేశవాళిపొట్టిగుఱ్ఱములు గట్టిన పెట్టెబండ్లే ఆధారము. ఈబండ్లు భోషాణములవలె నుండి, యిరుకుగా నుండెడివి. నలుగురిని ఒక్కసారి ఎక్కించుకొని పోవుచు, దూర మునుబట్టి బాడుగను తీసుకొనుచుండెడివారు. మేము ఉండెడి భాగమునుకు బ్లాకుటౌను అని పేరు. (నల్లవారి బస్తీ యని) ఈపేరు బహుశ: తెల్లవారు పెట్టియుందురు. ఈ బ్లాకుటౌను నుండి తిరువళ్కేణి పోవుటకు ఒక్కొక్కరికి మూడూణాల బాడుగ అని జ్ఞాపకము. అప్పటికింకను ట్రాములు, బస్సులు లేవు. కొన్ని వీధులలో తిరుగునప్పుడు, కొన్నిఇండ్లకు వెలుపల, ద్వారముదగ్గర, అన్నసత్రము అని వ్రాసినబల్లలు కట్టబడి యుండెను. ఇట్టివి అనేకములు కనబడినందున, అన్నదానము విశేషముగా చేయుదురు కాబోలు అనుకొంటిమి. విచారించగా, అన్నసత్రము లనునవి పూటకూళ్ళని తేలినది. మరియు, చెన్నపట్టణములో ఏవస్తువునైనను బేరముచేయుట మిక్కిలి కష్టముగా నుండెను. వస్తువుధరకు నాలుగురెట్లు అయిదురెట్లు ఎక్కువ వర్తకుడు చెప్పుచుండును. మిక్కిలి తగ్గించి అడిగిన నత డేమనుకొనునో యనియు పట్టణమున ధరలు అతిశయముగా నుండునేమో అనియు దలంచి, అర్ధయో, పావలో తగ్గించి అడిగినప్పుడు "తీసుకొనుడు, మీకుగనుక ఇచ్చుచున్నా"నను ఇచ్చకములు పలికి వస్తువునకు హెచ్చుధర రాబట్టుకొనుచుండెను. ఈపరిస్థితులు పరిచయమైనపిదప, సగమునకుసగము తగ్గించి ధరయడుగ నేర్చుకొంటిమి. కావుననే చెన్నపట్టణమున బురిడీ (మోసము) మోపని అంతటను వాడుక అయినది. ఇప్పుడు మన తెలుగుదేశమున బస్తీలలో బేరగాం డ్లిట్టిధరలే చెప్పి, తెలియనివారిని మోసగించి హెచ్చుధరలు గుంజుకొనుచున్నారు. వర్తకమనిన మోసమే యనుభావము దేశమున వ్యాపించియుండుట శోచనీయము. మేము చెన్నపట్టణము చదువునిమిత్తము పోవకముందే భారతదేశమున ఆసేతుహిమాచలము కూడ మదాంబ్లావట్‌స్కీ, కల్నల్ఆల్‌కాట్‌గార్లు సంచారముచేసి, భారతీయసంస్కృతిని గూర్చియు, ఆర్యమతసాంప్రదాయములనుగూర్చియు మహోపన్యాసముల నిచ్చుచు ప్రముఖులతో సంభాషణలుగావించుచుండిరి. పాశ్చాత్యవిద్యలపైనను పాశ్చాత్యాచారసాంప్రదాయములందును వ్యామోహము ప్రబలి మన పూర్వపుటున్నతిని గుర్తెరుంగని భారతీయులందు సంచలనము గల్పించి, భారతదేశ పూర్వచారిత్రమునందును సంస్కృతియందును, అభిమానము నంకురింపజేసిరి. ఒకప్పుడు చెన్నపట్టణములో కల్నల్‌ఆల్కాట్ ఇంగ్లీషులో గావించిన మహోపన్యాసము మహోన్నతహిమాలయశృంగాలనుండి అతివేగముగా దిగబారు గంగాప్రవాహము వలె వీనులవిందై ఆశ్చర్యముగూర్చెను. పదసౌష్ఠవమును ఉదారభావములు నటులుండ మనపూర్వశాస్త్రములు కళలులోనగు వానివివరణలు, యోగశాస్త్రాభ్యాసములవలన మహాపురుషులు పొందిన అద్భుతశక్తులు, మనపూర్వపుటౌన్నత్యమును, ఇప్పటి పతనమును వర్ణించుటలో సభ్యులహృదయములు నూతనోత్సాహభరితములయ్యెను. మదామ్ బ్లావట్‌స్కీ రుషియా దేశపుస్త్రీ యగుటవలన ఆంగ్లేయభాషలో ఉపన్యసింపజాలకుండెను. ఆమె హిమాలయములలో నివాసముచేసి, అద్భుతమైన శక్తులు సమకూర్చుకొనెనని ప్రజలలో గాఢమగు విశ్వాసముండెను. వారు అడయారులో నెలకొల్పిన దివ్యజ్ఞానసమాజమను సంస్థ భారతదేశములోనే గాక, లోకమున అనేక దేశములలో పిమ్మట స్థాపించబడిన దివ్యజ్ఞానసమాజములకు, కేంద్ర సంస్థగా పరిణమిల్లినది. అడయారులోని కార్యస్థానమునుండి మేడమ్ బ్లావట్‌స్కీ, దూరదృష్టి దూరశ్రవణపరకాయప్రవేశములు మొదలగు అద్భుతకార్యముల ప్రదర్శించుచుండెననియు, అక్కడ నుండి హిమాలయములలోని కుటీ, హ్యూమీ మొదలగు మహానుభావులతో సంభాషణలు జరుపుచుండెననియు, చెప్పుకొనుచుండిరి. కొందరు ఈమె దగ్గర శుశ్రూషచేయనారంభించిరి. థియసాఫికల్ సొసైటీజర్నల్ అను పత్రికలో ఈఅద్భుతచర్యలు ప్రకటితములగుచుండెను. మరియు దివ్యజ్ఞానసమాజము కేవలము ఆర్యమతమునందేగాక ఇస్లాము, క్రైస్తవ, బౌద్ధమతములలోగూడ ఉదారములు, ఉన్నతములునగు ధర్మములను, ఆశయములను గ్రహించి మన్నించుచుండెను. ఈసమాజము కులభేదములు, జాతిభేదములు పాటింపదు. ఈసమాజమున చేరినంతమాత్రమున వారివారిమతముల విడనాడిన ట్లెంచరాదు. ఇట్లు స్వేచ్చాస్వాతంత్ర్యము లున్నకారణమున హిందువులు, క్రైస్తవులు, ముసల్‌మానులు, బౌద్ధులు, జైనులు మొదలగు పలుమతములవారు ఆసమాజమున సభ్యులుగాచేరిరి. ప్రతి ముఖ్యపట్టణమునందును దివ్యజ్ఞానసమాజశాఖలువెలసెను. అందు భాండాగారములు నెలకొల్పిరి. సర్కారు ఉద్యోగులు పలువురు ఈసమాజములో జేరిరి. ఇందువలన ఆంగ్లేయవిద్యాధికులలో హిందూమతమునందు అభిమానము ప్రబలసాగినది. పురాణములలో చెప్పినగాధ లన్నియు వాస్తవములైనట్లు సకారణముగా స్థాపించుచుండుటచేత, కొన్ని వెఱ్ఱివిశ్వాసములు వ్యాపింపనారంభించెను. ఇట్లు దివ్యజ్ఞానసమాజప్రభావము పలుదెసల వ్యాపించుచుండగా "కుట్‌హ్యూం కూలిపోవుట" అను వ్యాసములు వరుసగ క్రైస్తవకళాశాల మాసపత్రికలో ప్రకటింపబడెను. అందులో అడయారులో ప్రదర్శితములైన అద్భుతములెల్ల మాయోపాయములచే చేయబడినవని వివరించుటచేత, దివ్యజ్ఞానసమాజముపైన విశ్వాసము ప్రజలలో తగ్గిపోవ నారంభించెను. కాని అద్భుతములమాట ఎట్లున్నను, మనపూర్వశాస్త్రములందలి యభిమానము నానాటికి హెచ్చుచునే వచ్చినది. ఆధునిక భౌతిక శాస్త్రము కంటె మన మహర్షుల ఆధ్యాత్మికవిద్య ఉత్తమమని ప్రజలు గుర్తించసాగిరి. ఈ దివ్యజ్ఞానసమాజము మొత్తమున మన భారతజాతిని మేలుకొలిపె ననుట స్పష్టము. పిమ్మట దేశములో ఉద్భవమొందిన రాజకీయాందోళనమునకు ఈసమాజప్రభోధములు కొంత తోడ్పడినవనుటకు సందియములేదు. మరికొన్ని సంవత్సరములకు అనిబిసెంటు అనునామె దివ్యజ్ఞానసమాజమునకు అధ్యక్షురాలుగా నున్నకాలములో అనన్యమగు విజ్ఞానసంపత్తి, అసమానమగు స్వానుభవమును సంపాదించి లోకమునకు అన్ని వేళలయందును సేవచేసి, పొగడ్త నందినది.

"గోవిందరెవడీ" అనువారు పూనాపట్టణవాస్తవ్యులు, మహారాష్ట్రబ్రాహ్మణులు, దేశస్థు లనుశాఖకు చెందినవారు. వీరు బొంబాయిహైకోర్టులో న్యాయమూర్తిగానుండిన కాలములోనే చెన్నపట్టణములోని మూడవ కాంగ్రెసుసమావేశమునకు వచ్చినట్లు పైనచెప్పబడినది. ఆరోజులలోనైనను ప్రభుత్వోద్యోగులు కాంగ్రెసుకు బోవుటకు ఆక్షేపణగాని ఆటంకముగాని లేదు. పిమ్మట మరియొకసారి వారు చెన్నపట్టణము వచ్చి, పచ్చయప్పకళాశాలలో ఆంగ్లేయమున ఉపన్యసించిరి. మన దేశపు బరిస్థితులనుగూర్చి చెప్పుచు "బైబిలులో పాలస్థైన్ దేవుని కభిమానదేశమని చెప్పబడినది. కాని నాయూహలో భారతదేశమే అట్టిదనితోచుచున్న" దనిరి. ఏలననగా, ఈదేశమునందు లోకమునందలి సర్వజాతులయొక్కయు, సర్వమతములయొక్కయు ప్రతినిధులు నివసించుచున్నారుగాన, మానవసంఘ పరమావధి, ఈదేశమునందే నిర్ణయముకానున్నదని వక్కాణించిరి. ఆనాడు వారు చెప్పిన వచనములను పరమసత్యములుగా పరిగణించవచ్చును. ఈనాడు మనకు లభించిన స్వాతంత్ర్యమును, నిజముగా రామరాజ్యము చేయగలిగితిమేని భారతదేశము లోకమున కంతకును మార్గదర్శకము కాగలపరిస్థితులు ఏర్పడును. రెవడీగారు అప్పటికి ఏండ్లుచెల్లిన ముదుసలిగా నుండి, కనుచూపు సయితము లోపించి యుండెను. ఆయన పొడగరి. గండు మొగము, విశాలఫాలభాగము పెద్దశిరస్సు గలిగి వారు శాంత స్వరూపులుగానుండిరి. ధోవతియు, బొందుల తెల్లని అంగరఖా మహారాష్ట్ర పగిడి, ఉత్తరీయమునుధరించి, నెమ్మదిగా సులభములగు పదములతో భావములను దొరలించుచుండెను. ఆధోరణి వినుటకు ఇంపును, మనస్సునకు ఆనందమును గల్గించి, జ్ఞానబోధ గావించుచుండెను. వీరు ఆనాటి పెద్దలలోకెల్ల బెద్దలు. దేశసేవా తత్పరులు, విద్యాప్రవీణులు, రాజకీయములందును, ఆర్థిక విషయములందును ఆరితేరినవారు. దైవభక్తిచే న్యాయవర్తనముచే ప్రసిద్ధికెక్కినవారు. ఆర్థికశాస్త్రముగూర్చి యొకగ్రంథమును వ్రాసి ప్రకటించిరి. మిక్కిలిపెద్దవారై మరికదలలేని కాలములో యింటిలోనే సాయంకాలమున పురాణముచదివి వినుపించుచుండెడివారని వినియున్నాను. వీరిపత్ని గూడా పూనాలో స్త్రీవిద్యను గురించి శ్రద్ధగా పనిచేసియుండెను.

నేను రెండుసార్లు బి. యల్. తప్పిపోయి, మూడవసారి పరీక్షనిమిత్తము చదువుచున్నకాలములో ఏదయినా ఉద్యోగమునిప్పించుటకు, రిజిస్ట్రార్ జనరల్‌గారికి దరఖాస్తుపంపి, అందుతో నాకు డాక్టరు మిల్లరుగా రిచ్చిన యోగ్యతాపత్రమునుగూడ పంపితిని. దానిఫలితము తేలకముందే బి. యల్. పరీక్షలో గెలిచితిని. ఆనాటి సాయంకాలమే బాపట్ల ప్రొబేషనరీ సబ్‌రిజిస్ట్రారుగా నియమించి, బందురులోనున్న హెడ్‌రిజిస్ట్రారుగారి యొద్దకు హాజరుకావలెనని, రిజిస్ట్రారుజనరల్‌గారి కార్యాలయమునుండి ఉత్తరువువచ్చెను. హెడ్‌రిజిస్ట్రారుగారు గుంటూరులో సబ్‌రిజిస్ట్రార్‌గా నున్నప్పుడు నన్ను ఎరిగినవారగుటచే "నీవిప్పుడు బి. యల్. లో కృతార్థుడవైనావు గనుక ఈ ఉద్యోగమునకు రావని తలంచుచున్నా"నని యుత్తరముగూడ వ్రాసినారు. నేను ఆఉద్యోగములో ప్రవేశించుటలేదని ప్రత్యుత్తరము వ్రాసి పంపినాను.

చాలకాలమునుండి న్యాయవాదిగా పనిచేయవలెనని నామిత్రుడు హనుమంతురావునూ నేనును కోరుచుంటిమి. కావున మే మిరువురమును బందరుజిల్లాకోర్టులో న్యాయవాదులుగా ప్రవేశింప నిశ్చయించుకొంటిమి. మాకు ఉభయులకును మిత్రుడగు కలపటపు లక్ష్మీనరసింహము సెకండరీగ్రేడు ప్లీడరుగా బందరులో పనిచేయుచున్నందున, గుంటూరులో కలసికొని, మనముగ్గురము కలసి జాయింటుఫరముగా వకాల్తాలు పుచ్చుకొని పనిచేయవచ్చుననియు, బందరులో తనకు తెలిసినవారు పలువురు కలరుగావున మనకు పని ప్రోత్సాహకరముగా నుండుననియు చెప్పగా అంగీకరించి ముగ్గురము కలసి బందరు గొడుగుపేటలో ఇల్లు అద్దెకుతీసుకొని ఆఫీసు పెట్టితిమి. గుమస్తాల నిరువురను నియమించితిమి. 1894 సంవత్సరము ఆగష్టులో 21వ తేదీనో లేక 24వ తేదీనో నేనూ హనుమంతురావును న్యాయవాదులముగా జేరితిమి. ఈమధ్యనే హైకోర్టువారివలన ఫస్టుగ్రేడు ప్లీడరీపట్టాలను పొందితిమి. శ్రీ దేవమ్మగారు అనునామెతండ్రి నాయుడుగారు మామిత్రుడు లక్ష్మీనరసింహముగారిపై ఎక్కువ అభిమానము కలవాడుగానుండుటచేత, శ్రీదేవమ్మగారికి సంబంధించిన చిన్న రివెన్యూ సివిల్‌వ్యాజ్యములలో వకాల్తాలు మేము మువ్వురము కలసి దాఖలుచేసితిమి. ఆప్రధమదినములలో బందరుకు సమీపమున గూడూరులో జరిగిన కూనీ కేసులో ముద్దాయిలపక్షమున నేను, హనుమంతురావును వకాల్తాలు పుచ్చుకొంటిమి. లక్ష్మీనరసింహంగారి బంధువులు ఆగ్రామంలో కొందరు ఉండుటచేత మమ్ములను ముద్దాయిలపక్షమున ఏర్పరచుట జరిగినది. ముద్దాయి బ్రాహ్మణుడు. అతడు చంపినట్లు చెప్పబడినస్త్రీ వయస్సుచెల్లిన శూద్రురాలు. ఈబ్రాహ్మణునకును, ఆస్త్రీకిని వ్యభిచారసంబంధము ఉండి వీరిమధ్య గల్గిన ద్వేషములనుబట్టి ఆమెను అతడు చంపివేసెనని ప్రాసిక్యూషను వాదము. అప్పుడు ఎల్విన్ అనువారు న్యాయమూర్తిగా నుండిరి. నేను ఆ కేసును నడిపించుటలో ఎక్కువబాధ్యత వహిం చితిని. సాక్షులను విచారణచేయుటలో ప్రశ్నలు, అడ్డుసవాళ్ళు మొదలగునవి అప్పటికి నేర్చినరీతిని వేసి, చివర ప్రాసిక్యూషన్ తరపున గవర్నమెంటువకీలు వాదన ముగించిన పిదప, నేను వారికి ప్రత్యుత్తరమిచ్చుచు, ముద్దాయి నేరస్తుదు కాడనియు, నేరము రుజువుచేయుటకు విచారించినసాక్షులు విశ్వాసపాత్రులు గారనియు, సందర్భములుగూడ ముద్దాయి నిరపరాధియైనట్లే నిరూపించుచున్నవనియు చెప్పి ముగించితిని. ఆరోజులలో ఆకోర్టులో ప్రముఖుడగు న్యాయవాదిగానున్న శ్రీ వావిలాల శివావధానులు బి,ఎ.బి.యల్. ఆ కేసులో వారి కేమియుసంబంధము లేకపోయినను, కోర్టులోనుండి నేను చెప్పినదంతయు విని నేను (Pedantic) వాగాడంబరము చూపుటచే కాబోలు కన్నులు చేతితో మూసుకొనుచుండిరి. కోర్టులలో వ్యవహారోచితమైన భాషయే యుచితముకాని, నాకు కోర్టులో బాషించుట కొత్త యగుటచేత, కొన్ని యూతపదములు కొత్తకొత్తవి పెద్ద పెద్దవి పడినవి. న్యాయమూర్తి నేను కొత్తవాడనని గ్రహించి శాంతముగా నేను చెప్పినదంతయు వినెను. న్యాయమూర్తి అసెసర్లకు చెప్పుటలో సాక్షులు విశ్వాసపాత్రులుకారని వివరించి అభిప్రాయమును అడుగగా ముద్దాయి నిర్దోషియని చెప్పిరి. న్యాయమూర్తియు సమ్మతించి, ముద్దాయిని విడుదలచేసిరి. ఇట్లు ఒక ఖూనీకేసులో మేము జయముగాంచుటచేత, న్యాయవాదులు కొందరు మమ్ములను ప్రశంసించుటచేత, కొంతవరకు మంచి అవకాశము కలిగెను. ఆకేసు నడిపించుటలో, పట్టిన కేసు గెలుచు టెట్లు అనే యోచన ప్రధానముగా నుండెనేకాని సత్య మెట్లున్నదను విషయము మా కంతగా పట్టలేదని చెప్పుట తప్పదు. నిర్దోషిని రక్షించితి మనుభావము నాకు లేదు. పిమ్మట చిన్న క్రిమినల్‌కేసులో ముద్దాయితరపున పనిచేయుట తటస్థించినది. చాలావరకు జయప్రదముగానే ఆ కేసు నడిచినది. కాని యోచనచేసినకొలది మనస్సునకు ధర్మసందేహములు కలుగుచు, కొంతబాధ కలుగుచు వచ్చినది. సాక్షులు చెప్పుమాటలు కేసు గెలుచుటకు తగినట్లుండుటకు కొంత ప్రయత్నము చేయవలసి వచ్చినది. కేవలము సాక్షులకు పాఠము నేర్పించకపోయినను, సాక్ష్యమట్లుండిననేగాని కేసు మనకు అనుకూలము గానేరదని సూచనలు చేయవలసివచ్చెను. ఇట్లు కొంతకాలము మన:క్లేశమును పొందుచుండగనే, మామిత్రుడు లక్ష్మీనరసింహంగారు మాలోనుంచి విడిపోయి తాను వేరుగా వ్యవహరించుకొనెదనని చెప్పుటచే మే మందుకు సమ్మతించితిమి. నేను, హనుమంతరావును మాత్రమే కలసిపనిచేయుచుంటిమి.

లక్ష్మీనరసింహముతో కలసిపనిచేయుచున్న కాలములోనే శ్రీదేవమ్మతండ్రి తాయి సుబ్బారావునాయుడుగారిపై దావా దాఖలుచేయుటకు ఎవరో పూనుకొని, ముందుగనే ఆస్తికి ఫైలు జప్తు పెట్టుదురని తెలిసి, ఆయన, నాకు, హనుమంతురావుకు వకాల్తాలిచ్చి అట్టి పిటీషన్ న్యాయవాది ఎవరైన పెట్టినపుడు ఫైలుజప్తుకు ఉత్తరువు చేయ నవసరములేదనియు తగినఆస్తి జామీ నిచ్చుటకు సిద్ధముగా నున్నాడనియు, ఆస్తి అన్యాక్రాంతముచేయు నుద్దేశ్యము లేదనియు అఫిడివిట్ దాఖలుచేయ వలసినదని నన్ను కోరియుండిరి. నేను ఆప్రకారమే కోర్టులో కనిపెట్టియేయుంటినిగాని వావిలాల శివావధానులుగారు న్యాయ మూర్తి కూర్చున్న పీఠముదగ్గరకు బోయి వారితో నేమియో ఎవ్వరికిని వినపడకుండ నచ్చచెప్పి, ఉత్తరువు వేయించుకొనుట చూచుచుండియు, అది, పిటీషన్ అనిగాని దానిమీద నుత్తరువు పొందుచున్నారనిగాని నేను తలచలేదు. ఏదైన పిటీషన్ పెట్టిన ఎడల తక్కిన అన్ని వ్యవహారములలోవలెనే బహిరంగముగనే పిటీషన్ పెట్టబడుననియు నేను వకాల్తును అఫిడివిట్‌ను దాఖలు చేసి చెప్పవలసిన అంశములు చెప్పవచ్చు ననుకొంటిని. తాయి సుబ్బారావునాయుడుగారుకూడ ఆఫైలుజప్తు ఉత్తరువు పడినప్పుడు కోర్టువెలుపల వరండాలో నుండెను. ఈఉత్తరువు పడినట్లు విని, నాయొద్దకు వచ్చి "ఏమి చేసితివయ్యా" అని నాపైన గొప్ప అయిష్టముతో పలుకుచు ఇంతగా నమ్మితే ఇంత మానభంగము మీవలన గావలసివచ్చెనని నన్ను చురచురచూడసాగెను. అప్పటికి జరిగినమోసము గ్రహించితినేకాని అప్పటికైన వెంటనే న్యాయమూర్తియొద్దకు బోయి తగినంత ఆస్తి జామీనిచ్చుటకు కక్షిదారుడు సిద్ధముగానున్నాడని చెప్పవచ్చునను ఆలోచన నాకు తోచక పోయెను. ఫైలుజప్తుకు ఉత్తరువు పడినదన్నతోడనే ఇక నేమియు చేయశక్యముగా దనుమాట యొక్కటె తలచుకొని మిక్కిలి తెలివితక్కువగ ప్రవర్తించి, మనల నమ్ముకొన్న కక్షిదారున కవమానము గూర్చితినేఅని మిక్కిలి చింతించితిని. నా యవజ్ఞత నామిత్రులగు లక్ష్మీనరసింహము, హనుమంతురావుగార్లకు ఖేదము కలిగించెను. ముఖ్యముగ కక్షిదారునకు ఏవిధమయిన అవమానము జరుగకుండ వ్యవహారము నడుపబడునని అభయహస్తమిచ్చినకారణమున ఆయనకు మరింత మన:క్లేశము కల్గెను. ఈఉత్తరువు కోర్టులో పడి నప్పుడు హనుమంతరావును, లక్ష్మీనరసింహమును ఇతర కోర్టులలోనుండిరి. అప్పటినుండి శ్రీదేవమ్మగారి పనులతోను, తాయి సుబ్బారావునాయుడు పనులతోను సంబంధము విడిపోయెను.

నేను బందరుకు మొదట నొంటరిగనే వెళ్ళితిని. హనుమంతరావు తన తలిదండ్రులను, చెల్లెండ్రను భార్యనుగూడ తీసికొనివచ్చి గొడుగుపేటలో నొకయింట కాపురముండెను.

నే నొంటరిగనే యుండి లక్ష్మీనరసింహముగారి ఇంటిలో భోజనముచేయుచుంటిని, తర్వాత కొన్నాళ్ళకు మా ఆఫీసు పెట్టిన ఇంటిలో నొక వంటయామె వంటచేసి పెట్టుచుండెను. నాతమ్ముడు సూర్యనారాయణ చెన్నపట్టణములోనే చదువుకొనుచుండెను. నేను బి. యల్. చదువుచుండగనే 12 - 11 - 1892 న నాకు ప్రధమసంతానము, ఆడశిశువు కలిగెను. బందరుచేరిన పిమ్మట నాభార్యపుట్టినింటనే మరల కుమార్తెను గనెను. ఇట్లుండగా నాతమ్మునికి పిల్లనిచ్చెదమని కృష్ణాజిల్లా తిరువూరు తాలూకా కనుమూరి గ్రామవాస్తవ్యులు జమీందారులు గాడిచర్ల కృష్ణమూర్తిగారు నాకు వర్తమానమంపిరి. మాతండ్రిగారిని అడగవలసినదిగా కబురంపితిని. కొన్ని రోజులకు మనుము నిశ్చయమయ్యెను. నేను బందరులో నుండగనే నాభార్యను పిల్లలను గుంటూరునకు తీసికొనివచ్చిరి. అంతకుముం దొకసారి నాచిన్నతమ్ముని ఉపనయనమునకు ముందు పెద్దపిల్లను కడుపుతోనుండగా నాభార్యను తీసుకొనివచ్చిరి. మరల కాన్పు నిమిత్తము కొలదిదినములలోనే లింగమగుంటకు వెళ్ళవలసి వచ్చెను. కనుక నాభార్య అత్తవారింటి కొత్తకాపురమునకు అదియే మొదలని చెప్పవచ్చును. కొలది రోజులలో తమ్ముని వివాహమునకు లగ్నము నిశ్చయమయ్యను. అప్పుడు మండువేసవి. నాభార్యను పిల్లలను గుంటూరునకు తీసుకొనివచ్చినారని విని వారిని చూచుటకు వచ్చి, రెండుపూట లుండి మరల బందరు వెళ్ళితిని. పెద్దపిల్లది పచ్చని దేహచ్ఛాయ, కనుముక్కు తీరు మంచిది. నా కెంతో ఆనందముగ నుండెను. రెండవపిల్ల అంతకంటెను అందముగ నుండుటచే మిక్కిలి సంతసించితిని. కాని నేను బందరుచేరిన కొలదిరోజులకే రెండవపిల్ల మృతినొందినట్లు ఉత్తరము వచ్చినందున నాలో నేను చింతించితిని. మరల ఒక్కసారి భార్యనుచూచి ఓదార్చుటకు పోతిని. భరింపరాని కడుపుదు:ఖ మంతయు తనలో తాను మ్రింగుచున్నదేగాని అంతగా వెలిబుచ్చనందుకు కొంత సంతుష్టిచెందితిని. ఒక్కరోజు ఉండి, ఓదార్చి మరల బందరుచేరితిని. గుంటూరునకు ఎండలలో తీసుకొనివచ్చినందున పిల్ల చనిపొయెనని నాభార్య మనస్సున పరితపించుచుండెను. నేను విధివశము తప్పదుగదా యని ఊరడిల్లితిని. వేసవిసెలవులకు కోర్టులు మూసివేసినతర్వాత నేను గుంటూరు చేరినాను. అప్పుడు మా మేనత్తగారు పెద్దది యొక్కతెయే ఆడదిక్కు. ఆమెయే నాభార్యను ఓదార్చుచు ఆమెను పిల్లనుగూడ ప్రేమతో చూచుచుండెను. ఇంతలో కొలదిదినములలో వివాహమునకు బయలుదేరి వెళ్ళితిమి. కనుమూరు అడవిపట్టున నున్న చిన్నపల్లె. అందు గాడిచర్లవారు రెండుకుటుంబములవా రుండిరి. అందు పెద్దవారికి కనుమూరిలో రెండువంతులును, మాతమ్మునకు పిల్లనిచ్చిన కృష్ణమూర్తిగారికి ఒక్కవంతును, మరియొక గ్రామములో నొకవంతును మరికొన్ని గ్రామములలో ఈనాములు, ఇండ్లుమొదలగునవి యుండెను. కృష్ణమూర్తిగారే వారికుటుంబము కలసియున్నప్పుడు వారి జమీను ఎనిమిదిగ్రామముల వ్యవహారములను నడుపుచు వ్యవహర్తయు, కార్యదక్షుడును, పలుకుబడికలవాడుగా నుండెను. వారితో పోల్చినచో మాస్థితి చాలచిన్నది. మేము ముందు ముందు హెచ్చుస్థితికి రాగలమని వారిఆశ. అసమానమైన వియ్యమైనను, వివాహము మొత్తమునకు మర్యాదతోనడిచినది.

వేసవిసెలవులు ముగిసి, కోర్టులు తిరుగ తెరచుసమయమున నేను నాకుటుంబమును తీసుకొని బందరు వెళ్ళవలెనని యుద్దేశించుకొని, అంతకుముందే బందరులో హనుమంతరావున్న ఇంటిప్రక్కనే యొకభాగము తీసికొంటిని. ఆ ఇంటివారే నాకు వండిపెట్టుటకు ఏర్పాటుచేసుకొని కొన్నిమాసములు గడిపితిని. ఇప్పుడు ఆయింటనే కాపురము పెట్టితిమి. మొట్ట మొదట బందరులో న్యాయవాదిగా జేరుటకు వచ్చునపుడు ఖర్చుల నిమిత్తము మాతండ్రిగారు ముప్పదిరూపాయలు మాత్ర మిచ్చిరి. పిమ్మట నేను వారియొద్దనుండి ఏమియు తీసికొనలేదు. ఇప్పుడు నాభార్యను పిల్లను తీసుకొని బందరులో కాపురముచేయుటకు బయలుదేరుచు నొకబిందెయు, అన్నమువండుకొనుట కొకగిన్నెయు, కూరగిన్నె, రెండుచెంబులు మొదలగునవి మాచిన్న కాపురమునకు మిక్కిలి అవసరమైన పాత్రలుమాత్రమే తెచ్చుకొంటిమి. మాతండ్రిగారు, మేనత్తగారు, నాతమ్ములును గుంటూరులోనే భూముల అజమాయిషీతో కాలక్షేపము చేయుచుండిరి. కొన్నిరోజులకు నాతమ్ముడు బందరులో మెట్రిక్యులేషన్‌చదువుటకు వచ్చి నాదగ్గరనే యుండెను.

మా మేనత్తగారికుమారుడు రావూరి కృష్ణయ్య, అతని చెల్లెలు మాయింటనే యుంటూయుండిరి. ఆ చిన్నదానికి వివాహమై కాపురమునకు వెళ్ళినది. ఆపిల్లలకు తలిదండ్రులు గతించిరి. కనుక కృష్ణయ్యకు మాఅత్తగారే ఆధారము. ఇట్లుండగా మానాన్నగారికిని ఆమెకును ఏదోమనస్పర్థ లేర్పడినందునను, ఆమె మనుమడు కోమట్లవద్ద గుమాస్తాగా చేరి కొంచెము జీతము తెచ్చుకొనుచుండుటచేతను ఆమెయు, అతడును మాయింటినుండి లేచిపోయి వేరొకచోట కాపురముండిరి. అప్పుడు నాభార్యయే ఇంటిపను లన్నియు చేసి వంటవండి, తక్కినవారికి భోజనములుపెట్టి తాను భోజనముచేయుచు, భార మంతయు వహించుచుండెను. చిన్నతనమునుండి పుట్టినింట పనిపాటలు చేసియుండకపోయినను దురభిమానముందుకొనక అన్నిపనులు తానే చేయుచుండెను. అందువలన మానాన్నగారు, కడుపున బుట్టిన కుమార్తెవలె కోడలిని ప్రేమతో చూచుచుండిరి. ఇట్లు కొలదికాలము జరిగెను. ఇంతలో మామేనత్తగారి మనుమడు కృష్ణయ్య జబ్బుచేసి దైవవశమున చనిపోయెను. కాన ఆమెను మాతండ్రిగారు మరల మాఇంటికి తీసుకొనివచ్చిరి. కనుక నేను నాభార్యను బందరు తీసుకొనివచ్చినను పూర్వమువలెనే మా మేనత్తగారు వండిపెట్టుటమొదలగు ఇంటిపనులు చేయుచుండిరి.

నేనిట్లు బందరులో నావ్యవహారములు చూచుకొనుకాలములోనే బాపట్ల చెరువులోతట్టుభూములు పల్లపుసాగునిమిత్తము వేలము వేయబడునని కృష్ణాజిల్లాగెజిట్‌లో ప్రకటనగావించిరి. నేను గుంటూరు వెళ్ళి మానాయనగారితో సంప్రదింపగా వారు మనకు అక్కరలేదని చెప్పిరి. నేను గట్టిపట్టు పట్టినమీదట నాకు రు 300/- లు మాత్రమిచ్చి భూమికొనుటకు నన్నే పొమ్మనిరి. ఆసొమ్ము చాలదని తెలిసియు ఏదియో మొండి ధైర్యముతో వెళ్ళి పాటపెట్టితిని. జాగర్లమూడి నాయుడు అను నొక పెద్ద ఆసామీతో పోటీగా పాడవలసివచ్చెను. ఆయన పట్టుదలతో పాటపాడుటచే ధర హెచ్చిపోయెను, మొత్తము 21 యకరములభూమి 1800 రూపాయలకు నాపేరనే కొట్టివేయబడెను. 300 ల రూపాయలుమాత్రమే భూమినిమిత్తము ఖర్చుపెట్టదలచిన మాతండ్రిగారి అభిప్రాయమునకు భిన్నముగా స్వతంత్రించి ముందువెనుక లాలోచించక భూమియందలి ఆశతో హెచ్చుపాటకు పాడితిని. ఆవేలము ఖాయపడుటకు ఆరోజుననే 500 ల రూపాయలు చెల్లించవలసివచ్చినది. నావద్ద నున్న 300 లు గాక తక్కిన 200 ల నిమిత్తము ఆయూరిలో బ్రహ్మాండం బాపయ్య గారను ధనికుడగు ప్లీడరును చేబదులడిగితిని. ఆయన నిర్మొగమాటముగ తనదగ్గర పైకము లేదని తప్పించుకొనెను. అంతట మాకు దూరపుబంధువులు కాజ సుబ్బారావుగారు బాపట్లతాలూకా హెడ్‌అక్కౌంటెంటుగా నుండిరి. వారు మరియొకరివలన 200 లు ఇప్పించుటచేత 500 ల రూపాయలు సర్కారుకుచెల్లించి గుంటూరుచేరితిని. మానాయనగారికి సవిస్తరముగా అన్నివిషయములును చెప్పితిని. 1800 లకు 21 యకరముల భూమి కొనుగోలువిషయమై సమ్మతించిరిగాని తనయొద్ద పైకము హాజరులేదుగనుక ఎక్కడనైన నోటువ్రాసి రుణముతేవలసినదిగ చెప్పిరి. వారివద్ద హాజరులోసొమ్ములేనిసంగతి వాస్తవమే. కనుకనే భూములుకొనుటయనిన ఇష్టములేకపోయను. ఇతరులయొద్ద రుణముతెచ్చుట వారికి బొత్తుగా సమ్మతములేనిపని. కాన నేనే ఏదో యుక్తమైన ఆలోచన చేయవలసివచ్చినది. కొంతవిచారించగా మిష్న్‌కాలేజీ అధ్యక్షుడుగా నున్న రివరెండు ఉల్ఫుదొరగారు రహస్యముగ రుణములిచ్చుచున్నారని తెలిసినందునను డాక్టరుకుగ్లరుదొరసానిద్వారా వారితో నాకు పరిచయమేర్పడి నందునను నేను బందరులో ప్లీడరుగా నున్నవిషయము వా రెఱిగినదే గనుకను నా అవసరము తెలిపి 1500 ల రూపాయలు రుణముకావలెననియు అందుకు నేనును నాతండ్రిగారును కలిసి ప్రామిసరీనోటు వ్రాసిఇచ్చెదమనియు త్వరలోనే తీర్చెదమనియు చెప్పగా ఆయన సమ్మతించి రుణమిచ్చిరి. బాపట్లలో స్నేహితునకు పంపవలసిన 200 లును మానాయనగారే సర్దుబాటుచేసిరి. ఈ 1500 లు వాయిదాలోపల సర్కారుకు కట్టివేసితిమి. ఈ భూములకు నేను పాటదారుడ నగుటచే నాపేరటనే పట్టా జారీ చేసిరి. మా తండ్రిగారిపేరనే పెట్టించవలెనని ఆలోచన నాకు తోచలేదు. నాపేర నున్నను జాయింటుకుటుంబముదే నను భావముతో నేను వ్యవహరించితిని. పిమ్మట ఆభూములున్న జమ్ములపాలెము పోయి, ఆసామీలను కుదిర్చి, వాటిని సాగుకు తెచ్చుట మొదలగు పనులన్నియు నేనే చేసితినిగాని మాతండ్రిగారు ఆపని పెట్టుకొనలేదు. ఉల్ఫుదొరగారి కియ్యవలసిన సొమ్ము పెద్దమొత్తముగానుండుటచేతను మానాయనగారు సంపాదించిన మెట్టభూమి కొంత ధర పలుకుచున్నందునను దానిపై సాలుకు ముప్పది నలుబదికంటె ఆదాయము లేదుగాన తొమ్మిదియకరముల మెట్టభూమిని రు 900 లకు అమ్మి ఆసొమ్మును ఉల్ఫుదొరగారికి కట్టితిమి. ఇంకను రు 600 లు, వడ్డీయును ఇవ్వతేలితిమి. ఆమొత్తమును పిమ్మట నెమ్మదిగా చెల్లుబెట్టితిమి. ఒక్కసారి యివ్వక జాగుచేసినందుకు దొరగారికి, డాక్టరు కుగ్లరుదొరసానికి కొంత అయిష్టము నాపై కలిగెను. కొలదికాలములోనే అంతయు చక్కబడెను. ఇది యంతయు నేను బందరు వెళ్ళిన రెండుమూడు సంవత్సరములలో జరిగిన వ్యవహారమే.

మేము మావృత్తిలో ప్రవేశించిన మొదటిరోజులలో అక్కడి న్యాయవాదు లెవ్వరును మమ్ము నభిమానించలేదు. జూనియరులుగా నుంచుకొని కొన్ని అప్పీళ్లు వాదించుట కిచ్చిన యెడల మావిషయము ఇతరుల కెరుకబడుట కవకాశ ముండెడిది. కాని అట్టి వీలు ఏర్పడదాయెను. గుంటూరునుండి సెకండుగ్రేడు ప్లీడరుగా పనిచేయుచుండిన న్యాపతి హనుమంతురావుగారును, గండవరపు సుబ్రహ్మణ్యముగారును అప్పుడప్పుడు కొందరు కక్షిదారులను అప్పీళ్ళు దాఖలుచేయునిమిత్తము పంపుచుండెడివారు. వారిమూలమున కొంచెముపని మాకు లభ్యమగుచుండెను. కాని మా ఇరువురకు సరిపడునంతపని లేకపోయెను.

ఇట్లుండగనే కొలచలమల అప్పయ్యదీక్షితులు అనగా నీటిలో బడి బ్రదికిన చిన్నవాడు బి. ఏ. పరీక్ష నిచ్చి, రాజ మహేంద్రవరమున గవర్నమెంటుకళాశాలలో నుపాధ్యాయు డుగా నుండి, పిమ్మట ఫస్టుగ్రేడు పరీక్షయందు కృతార్థుడై బందరు జిల్లాకోర్టులో న్యాయవాదిగా జేరెను. ఈయన మంచి తెలివిగలవాడు. వావిలాల శివావధానులుగారికి బంధువగుటచేత వారుకొన్ని అప్పీళ్ళుమొదలగునవి ఇచ్చి, ఈయన సామర్థ్యమును ప్రకటించుటకు అవకాశము కల్పించుచు, శ్రద్దవహించుచుండెను. మాకును ఆయన మిత్రుడగుటచేత సంతసించుచుంటిమి. ఇట్లుండగా ఆయనకు భార్యవియోగము సంభవించినది. మరల వివాహము చేసుకొనెను. కొలదికాలములోనే కొన్ని భూములు సంపాదించి, ఆభూములనిమిత్తము వేసచిసెలవులలో గుంటూరుజిల్లా కారుమూరు పోయి, అక్కడ జబ్బుచేసి గుంటూరుకు వచ్చుచుండగా అకస్మాత్తుగా చనిపోయెను. ఎంతయో వృద్ధికి రాదగిన వ్యక్తి ఇట్లు కొలదికాలములోనే ప్రొద్దున పువ్వు వికసించి, సాయంకాలమునకు నశించినట్లు లోకమును విడిచిపోయెను. వీరి అకాలమరణమునకు పలువురు చింతించిరి. ఆయనకు ప్రధభార్యా వియోగము కలిగినపిమ్మట మరల వివాహముచేసుకొనకముందు మిక్కిలి విరాగముతో నున్నకాలములో నేనును ఆయనయు కలిసి కొన్నిసాయంకాలములు ఊరివెలుపలకు షికారుగా పోవుచుండినపుడు సంభాషణలో ఎందరో ఆప్తులు మరణించియుందురుగాని యొక్కరైనను మరణానంతరము తమస్థితి యీప్రకారము ఉన్నదని చెప్పినవారు లేరుగదా, దేహము నశించినను జీవుడు నశించడని చెప్పెడిమాట యెంతవరకు విశ్వాసార్హము మొదలగుసమస్యలు చర్చించు చుండువారము. మరల వివాహచేసుకొని కొన్నిమాసములలోనే మృతినొందెను. ఇంతశ్రద్ధతో చర్చించిన ఆయనయైనను నాతో తన జీవితానంతరస్థితి యెట్లున్నదో తెలుపలేదుగదా యని నేను పలుమార్లు అనుకొనుచుంటిని. లండన్ (psychical Research Society) సైకికల్ రిసెర్చి సొసైటీ అనుపేరుతో సర్ ఆలివర్ లాడ్జి మొదలగు శాస్త్రప్రవీణులు నడుపుచుండిన మానసికసంశోధనాసంఘమునకు కార్యదర్శిగానుండిన సభ్యుడును గొప్పశాస్త్రజ్ఞుడు నగునతడు చనిపోవుచు తాను మరణించిన తోడనే తనస్థితిగతు లెట్లుండునో సోదిలో చెప్పెదనని చెప్పి మరణించెనట. కాని ఆయన చెప్పినట్లు సోదిలో రాలేదు. పండ్రెండేం డ్లయినతర్వాత తలవనితలంపుగ ఆయన సోదిలో గనుపడి తాను ఫలానాఅని చెప్పినప్పుడు, పరిశోధకులు విశ్వసింపక, దృష్టాంతములు అడుగగా దానికి మిక్కిలి నిర్దుష్టములును తృప్తికరములునగు దృష్టాంతములను చూపించుటచే వారు తృప్తిపొంది నీస్థితిగతు లెట్లున్నవని యడుగగా అవి మీకు వివరించుటకు సాధ్యము కావనియు, మరణానంతరపరిస్థితులు మిక్కిలి విపరీతములనియు మాత్రము చెప్పి ముగించెనట. ఈవిషయము ఆ సంశోధనసంఘము ప్రకటించినగ్రంధములో చదివితిని. మొత్తముమీద ఈ విషయము గొప్ప మాయగనే యున్నది.


____________