దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వివాహము
వకీలుగానున్న శ్రీ మాడభూషి వేదాంతం నరసింహాచార్యులుగారి పెంపుడుతండ్రి. అట్టి మహాపండితులు ఈకాలములో కనబడుటలేదు.
వివాహము
మేము బి. ఏ. చదువుట ప్రారంభించినపిమ్మట నాకు వివాహముచేయవలెనని మాతండ్రిగారు ఉద్దేశించుకొనిరి. మెట్రిక్యులేషనులో చేరకపూర్వమే సంబంధములు వచ్చుచుండెను గాని మాపిల్లవాడు చదువుకొనుచున్నాడు గనుక వివాహము చేయతలచలేదని పంపివేయుచుండిరి. కాని ఇప్పుడు ఇంటిలో మేనత్త అబ్బాయికి వివాహముచేయు మని చెప్పసాగినది. కనుక తగిన సంబంధమునిమిత్తము కొన్ని గ్రామములకు బోయి, తుదకు వంగోలు సమీపమున లింగమగుంట అనుగ్రామములో లింగమగుంటవారిపిల్లను జూచివచ్చిరి. కొలదిరోజులకు ఆపిల్లమేనమామ గారును మరియొకబంధువును మాయింటికి వచ్చి, సంబంధము నిశ్చయించుకొని పిల్లకు వివాహము తిరుపతిలో మ్రొక్కుబడి యుండుటచే అక్కడనే చేయవలసియుండునని చెప్పివెళ్ళిరి. ఆపిల్లకు తండ్రిగారు కొలదిసంవత్సరములక్రిందటనే గతించిరి. తల్లియును, ఎనిమిదేండ్లవా డొకతమ్ముడు నుండిరి. లింగమగుంటవారిది వంగవోలుతాలూకాలో పేరుపొందిన వంశము. ఈపిల్ల తండ్రిపేరు కోదండరామయ్యగారు, వారితండ్రి కోటయ్యగారు. ఆగ్రామకరిణీకమువారిదే. వారు భారీవ్యవసాయదారులు. స్వంతముగాని, ఇతరులవలన కవుళ్లుపొందిన మాన్యములుగాని రెండువందల ఎకరములవరకు నుండెడిది. అన్నదానమునకు ప్రసిద్ధికెక్కిన కుటుంబము. తండ్రికొడుకు లిరువురును ఆకాలమున మంచి వ్యవహర్తలని పేరుగాంచిరి. కోటయ్యగారు కరిణీకము చేయవచ్చునప్పటికి లింగముగుంటగ్రామమునకును చుట్టుప్రక్కల హద్దులులేవు. కాబట్టి పొలిమేరత్రొక్కుటకు కోటయ్యగారినే గవర్నమెంటు ఉద్యోగులును గ్రామములోని ప్రజలును కోరిరి. పొలిమేరత్రొక్కుటకు సామాన్యముగ నందరును ఒప్పుకొనరు. ఏయూరి అసామీలు చేసుకొన్న పొలములు ఆయూరి వారికే యుండులాగున జ్ఞాపకముపెట్టుకొని న్యాయదృష్టితో జాగ్రత్తగా చేయవలసిన కార్య మది. అట్లు హద్దులుత్రొక్కుటలో అక్రమము జరిగినయెడల ఆ త్రొక్కినవారివంశము నాశనమగు ననువిశ్వాసము గూడ ప్రజలలో వ్యాపించియుండెను. ప్రజలు కోటయ్యగారుతప్ప మరియొకరు సమర్థులుగారని పట్టుపట్టుటచేత సమ్మతించెను. పూర్వాచారప్రకారము ఆనాడు చెరువులో స్నానముచేసి, తడిగుడ్డలతోనే రామాయణము నెత్తిన బెట్టుకొని అనేకజనులు వెనుక నడచుచుండగా లింగమగుంటపొలములచుట్టును ప్రదక్షిణముగ తిరిగివచ్చెనట. అప్పుడొక నల్లనికుక్క ఆయనకు ముందు నడిచెననియు, ఆకుక్క నడిచిన త్రోవనే ఆయన నడిచెననియు చెప్పిరి. ఆప్రకారము చుట్టివచ్చిన త్రోవయే లింగమగుంటగ్రామమునకు పొలిమేరగా నేర్పడినది. ఆనాడు ఆయన యుపవాసముచేసి దీక్షతో నుండెను. వారియింటిలో ఏ చిన్నప్రాణి గతించినను ఆయన పొలిమేర త్రొక్కుటలో అన్యాయముచేసినట్లు ప్రజ లూహింతురుగాన కొన్నాళ్ళవరకు ఇంటిలో పశువులు, పిల్లి, కుక్క మొదలగు వానిని జాగ్రత్తగా కాపాడుచుండిరట. వీరు విస్తారముగ భూమికలవారగుటచే వీరికిగల యెద్దులతో పనులు తూగకుండెనట. అమావాస్యనాడు ఆయూరి ఆసామీలుగాని దగ్గరపల్లెల ఆసామీలుగాని భూమిదున్నరు. కావున ఆనాడు వారి అరకలు వీరిభూములు దున్నిపోవుచుండెనట. ఇందువలన వీరికి పలుకుబడి విశేషముగా నుండెనని తెలియుచున్నది. వ్యవసాయంమాత్రమే గాక కొంతకాలము వీరు నీలిమందువ్యాపారము చేయుచుండెడివారు. ఆకాలమున చెన్నపట్టణములో గాజుల లక్ష్మీనరసింగచెట్టియను గొప్ప వర్తకుడు సీమకంపెనీతరపున నీలిమందు ఖరీదుచేసి యోడమీద సీమకు రవాణాచేయుచుండెను. లింగమగుంటవారు వంగోలు, అద్దంకిమధ్య నుండు గ్రామములలో తయారైన నీలిమందు లక్ష్మీనరసింహచెట్టిగారికి ఏజంట్లుగా కొనుగోలుచేయుచుండిరి. ఈవ్యాపారమునిమిత్తము పైకము చెన్నపట్టణమునుంచి లింగమగుంటకు కావిళ్ళమీద మనుష్యులు తెచ్చుచుండెడివారని గ్రామములోని ముదుసళ్లు చెప్పుచుండెడివారు.
కోదండరామయ్యగారు ఆడంబరపురుషుడు. అప్పుడు వంగోలు నెల్లూరుజిల్లాలో చేరియుండెనుగాన నెల్లూరులోను వంగోలులో నుండు సర్కారుఉద్యోగులలో ముఖ్యులైన వారితో స్నేహము సల్పుచుండెను. వారిని తమగ్రామమునకు రప్పించి విందులుచేయించుచుండెను. తెల్లవా డొకడు వంగోలులో డాక్టరుగా నుండెను. ఆయనతో చాల స్నేహము సంపాదించెను. ఆయననిమిత్తము కావలసిన వస్తువులు తెచ్చి, కుడువబెట్టుచుండెను. కొన్నాళ్లు రోడ్డుకంట్రాక్టు పనులుగూడ చేయించుచుండెను. ఎక్కి తిరుగుటకు తెల్లని పెద్దగుఱ్ఱమును, రెండెద్దులపెట్టెబండియు, ఇతరగ్రామములనుండి ఉద్యోగులు మొదలగువారు వచ్చినపుడు వారిసౌకర్యమునిమిత్తము డేరాయును సమకూర్చుకొనెను. ఈయన భోగపురుషు డగుటచే చెడిపోయిన ఒక బ్రాహ్మణస్త్రీని ఉంచుకొని దాని నిమిత్తము చిన్నమేడను కట్టించెను.
మరియును కోర్టులలో వ్యాజ్యములుండు కక్షిదారులకు సలహాలనిచ్చి వారివలన బహుమానములు పొందుచుండెను. ఇట్లు సలహాలు పొంది జయించిన కక్షిదారులు తొమ్మిదియకరముల భూమి నిచ్చి తెల్లని పెద్దగుఱ్ఱము నిచ్చి దానిపై నెక్కించి ఆయనకు ఊరేగింపుటుత్సవము గావించిరట. మరియొకరు మంచి టేకుకలప కొనితెచ్చి, వీరిగ్రామములో నూరివెలుపల పండ్రెండుదూలముల పశువులశాలను కట్టియిచ్చిరి. మరియు ఈయన గరిడీనేర్చిన జవాను. ఎప్పుడును ఫైలువానువంటి ముసల్మానొకడువెంట తైనాతిగా నుండెను. భజనలుచేయుట యం దెక్కువ ప్రీతియగుటచే సమీపమున నున్న క్రొత్తపల్లినుండి హరిదాసులను బిలిపించి, శనివారమునాడు దేవాలయములో భజనలు, పూజలు గావించి భోజనములుపెట్టి బహూకరించుచుండెడివాడు
బాపట్లతాలూకా ఉప్పుటూరిలో బెండపూడివారిది గొప్ప భూవసతిగల ప్రసిద్ధివంశము. వారికిని ఉప్పుటూరిగ్రామమునకు కరిణిక మిరాసికలదు. వీరిపిల్లను కోదండరామయ్యగారి తమ్మునకు ఇచ్చుటకు లింగముగుంట వచ్చి సంబంధము నిశ్చయించుకొని లగ్నముగూడ నిర్ణయించుకొని, పెండ్లికి తరలిరమ్మని చెప్పిపోయిరి. పిల్ల నిచ్చినవా రెంతవారైనను పిల్లను తీసికొనువారికి లొంగి ఉండవలసివచ్చుట అందరు ఎరిగినదే. కోదండరామయ్యగారు మిక్కిలి ఆడంబరప్రియుడగుటచేతను తండ్రి కోటయ్యగారికి ఆయన జరిగించుపనులు కొన్ని యిష్టములేకున్నను తనమాటకు చెల్లుబడిలేదని యూరకుండుటచేతను వియ్యాలవారికంటె తాము పై చెయ్యి అనిపించుకొనవలెనని తరలిపోవుటకు గొప్పప్రయత్నములు గావించెను. ఊరిలోని ఆసామీల బండ్ల నన్నింటిని చేర్చి, బండి కొక్కరిని కూర్చుండబెట్టి ప్రయాణముసాగించెను. ముందుగా తనక్రింద నున్న సాహెబులను పంపి గ్రామములలో ఫలానివారు పెండ్లికి తరలిపోవుచున్నారని దండోరావేయించి మధ్య నొకటిరెండు గ్రామములలో నూరివెలుపల బాగుచేయించి వీరు బండ్లతో వచ్చునప్పటికి ఎద్దులకుమేత, నీళ్లు సిద్ధముచేయించి డేరాను పాతించి, వంటలుచేసుకొనుటకు వసతులుమొదలగు నేర్పాట్లు గావించెను. కోదండరామయ్యగారు గుఱ్ఱమునెక్కి ముందు బోవుచుండ వెనుకనుండి మంగళవాద్యములతో పెండ్లి కొడు కెక్కిన మేనా, పిమ్మట ఆడవారెక్కిన పెట్టెబండి, దాని వెనుక ఊరివారివలన కట్టించిన రెండెద్దులబండ్లును వరుసగా గ్రామములగుండ మెల్లమెల్లగ ప్రయాణముచేయుచు మధ్య వసతు లమర్చిన గ్రామములలో బసచేయుచు ఉప్పుటూరు అట్టహాసములతో చేరిరి. బెండపూడివారు సంపన్నులైనను ఇంత ఆడంబరములు, అట్టహాసములకు నభ్యాసపడినవారు కారు. అయినను వీరికి ఏవిధమైన లోపము జరుగకుండ చక్కని యేర్పా టులుగావించి సిద్ధముగా నుండిరిగాన వివాహము చక్కగనే జరిగిపోయెను.
ఇట్లు కొంతకాలము జరిగినపిమ్మట వీరికి కొన్ని వ్యవహారపు జిక్కులు సంభవించినవి. గాజుల లక్ష్మీనరసింహచెట్టిగారు వీరిమీద నలుబదివేలరూపాయలకు మదరాసుహైకోర్టులో దావాతెచ్చి డిక్రీపొందినారు. వీరు దానిని తప్పించుకొనుటకు కొన్ని అవకతవకపనులు గావించినారు. తండ్రికొడుకులు విడిపోయినట్లు ఏర్పరచి, కోదండరామయ్యగారివంతుకు వచ్చిన ఆస్తిలో కొన్నిభూము లితరులకు విక్రయాదులు జరిపించిరి. కొన్ని తనమామగారిపేరనే వ్రాసిరి. కొన్ని డిక్రీబాకీక్రింద అమ్మకమైపోయినవి. ఇట్లు భీభత్సమైనకాలముననే కోటయ్యగారు మృతినొందిరి. జప్తుతెచ్చిన కోర్టుజవానును కొట్టినట్లు కోదండరామయ్యగారిపై క్రిమినల్‌ఛార్జి వచ్చి అందులో సుమారు నెలరోజులు శిక్షబడుట సంభవించినది. జైలునుండి విడుదలయై వచ్చినతోడనే పక్షవాతమువలన మంచమెక్కి, అట్లు కొలదిసంవత్సరములు జీవించి, కోదండరామయ్యగారు మరణము నొందిరి. అంతకుముందు చాలకాలమునుండియు ఆయన మామగారితండ్రికుటుంబము వీరియింటిలోనే వీరిపోషణలోనే యుండిరి. ఆయనబావమరది సీతారామయ్య వ్యవహార దక్షుడై యింటి వ్యవహారముల బాధ్యత వహించి పనులు నడిపించుచుండెను. నా పెండ్లిసంబంధమును కుదుర్చుకొనుటకు మాయింటికి వచ్చినది యీ సీతారామయ్యగారే. నాపెండ్లినాటికి మా అత్తవారికి ఉన్న ఏడరకలవ్యవసాయమును ఈయనే నడిపించుచుండెను. కాని ఋణములు కొన్ని యింకను బాధించుచుండెను. మీదు మిక్కిలి సీతారామయ్యగారి తల్లిదండ్రులును, అక్కచెల్లెండ్రును యీఆదాయమువలననే జీవించుచుండిరి. కాబట్టి భూములవల్ల వచ్చు ఆదాయముతో ఋణముతీర్చుమార్గము కనబడకుండెను. కుటుంబ మింకను కొంత అట్టహాసముతో కనబడినను నిజముగ నానాట క్షీణదశకు వచ్చుచుండెను. ఈసమయముననే పిల్లకు వివాహమును పిల్లవానికి ఉపనయనమును జరిపిరి. మొట్టమొదట తిరుపతివెళ్లవలెనని అనుకొనిరిగాని ఏదియో యిబ్బందివలన ఆప్రయత్నము మాని, వివాహమునకు ముందురోజు కొండకు నడచినట్లు మంగళవాద్యములతో మమ్ము నిర్వురను ఊరివెలుపల ఇంచుక దూరముననున్న మఱ్ఱిచెట్లవరకు నడిపించుకొనివెళ్లి యింటికివచ్చి, వెంకటేశ్వరపూజచేసి మరియొకప్పుడు కొండకు వచ్చెదమని మ్రొక్కుకొని సమారాధన గావించిరి. మరుసటినాడు పిల్లవాని ఉపనయనముచేసి ఆమరునాడు వివాహము జరిపిరి. పెండ్లికార్యము సాధారణముగనే జరిగిపోయెను. పెండ్లిలో నాకు అయిదుయకరముల మెరకయీనాముభూమిని, రు 100/- ల రొక్కమును, ఒక ఆవుపెయ్యను కన్యాదానసమయమునందు ఇచ్చిరి. ఈదానము లేవియు మాతండ్రిగారు నిర్బంధించినందున ఇచ్చినవిగావు. వారు మనసోత్సాహముతో కుటుంబమర్యాద ననుసరించి యిచ్చినవే. ఈపెండ్లికి మాతండ్రిగారు మూడువందలు మాత్రమే వ్యయపఱచినారు. నావివాహము సర్వజిన్నామసంవత్సర శ్రావణశుద్ధమునందు జరిగినది. వివాహానంతరము కొన్ని రోజులకు లింగముగుంటనుండియే చెన్నపట్టణము చేరి కళాశాలలో చదువనారంభించితిని. గృహప్రవేశము జరుపుటకు అవకా శము లేకపోయినది. అప్పుడు లింగమగుంటనుంచి మరియొకరిని తోడుతీసికొని కొత్తపట్టణముదగ్గర చెన్నపట్టణముకాలువమీద పడవనెక్కి వారమురోజులలోపలనే చెన్నపట్టణము చేరితిని. నాభార్య కప్పుడు పండ్రెండవయేడు. చామనచాయరూపము. మిక్కిలి పలచగానుండెను. తెలుగు కొద్దిగా చదువను వ్రాయను మాత్రమే నేర్చియుండెను. నేను బి. ఏ. సీనియరులో చదువుచుండగానే వేసవి సెలవులలో నాకు కార్యముజరిపిరి. పిమ్మట చెన్నపట్టణముచేరి యధాప్రకారము చదువుసాగించుచుంటిని.
పట్నవాసము
మేము చెన్నపట్నములో విద్యార్థివసతిగృహము ప్రారంభించినపిమ్మట కొన్నాళ్ళకు ఆగృహములోని విద్యార్థులము కొందరము కలసి డిబేటింగుసొసైటిని స్థాపించి, అందు ప్రతి ఆదివారమును ఏదో ఒకవిషయమును చర్చించుచుంటిమి. ఆచర్చలు ఆంగ్లేయభాషలోనే జరుపుచుంటిమి. ఒకప్పుడు ఇంగ్లీషులో వ్యాసములువ్రాసి చదువుటయు జరుగుచుండెను. ఆచర్చలలోను, ఉపన్యాసములలోను నాకు ఒకకొంచెము ప్రవీణత యున్నట్లు కొందరు విద్యార్థులు చెప్పుకొనుచుండిరి. ఇట్లు జరుగుచుండ నొకనాడు షేక్స్పియర్ వ్రాసిన "జూలియస్ సీజరు" నాటకములో నొకటి రెండు ప్రధానాంకములు ప్రదర్శింపవలెనని నిర్ణయించి బ్రూటసుపాత్ర హనుమంతురావుకు, కాసియస్ పాత్ర నాకు నిచ్చిరి. ఆప్రదర్శనమున కాసియస్‌పాత్ర అందరికంటె బాగుగ నున్నదని చెప్పుకొనిరి. నన్ను సుశిక్షితుడగు