దశకుమారచరిత్రము/దశమాశ్వాసము

దశమాశ్వాసము

     శ్రీస్తనమండన మేదుర
     కస్తూరీబహుళకాంతికవిబుధవక్ష
     శ్శస్తహరిచరణకమలో
     పాస్తికృతస్వస్తి! తిక్కనామాత్యుఁ డొగిన్.1
వ. రాజవాహన ధరాధీశ్వరుండు.2
క. నీవర్తనంబు చెప్పుము
     నావుడు నతఁ డెంతయున్ వినయమునఁ బ్రణతుం
     డై వచనరచన యొప్ప మ
     హీవరునకు విన్నవించె ని ట్లని ప్రీతిన్.3
వ. ఏను దేవర వెదకి వివిధపురపట్టణగ్రామపల్లీఖేటకంబులం
     గ్రుమ్మరుచుండి యొక్కనాఁడు.4
క. వినుతమగు దామలిప్తం
     బను నగరముపొంత మధుకరామోదభరం
     బున నల్లఁ బొలయు పవనుని
     తనుపున నింపారు తోఁట దరియం జనుచోన్.5
క. పంచమహాశబ్దంబులు
     వించు ననంతరమ సుచిరవిద్యుల్లేఖా
     సంచయ మనుకరణిం దో
     తెంచెం దరుణీ[1]జనంబు దృష్టికిఁ బ్రియ మై.6

క. తొడవులు దొడుగుచుఁ బువ్వులు
     ముడుచుచుఁ దిలకంబు లొప్పముగఁ బెట్టుచుఁ బొ
     ల్పడరఁగఁ బూఁతలు పూయుచు
     మడుఁగులు గట్టుచుఁ గడంగి మగువలు ప్రీతిన్.7
క. ఉత్సవము తెఱం గై సం
     పత్సదృశాచరణవిభవపరిణతిమై న
     త్యుత్సుకతం గ్రెసేసిరి
     మాత్సర్యాన్వితములైన మాటలతోడన్.8
వ. వారం జూచుచుఁ జను సమయంబున.9
మ. తనశృంగారము దాన కైకొనుచు నుత్సంగస్థవీణామృదు
     ధ్వనితోఁ గూడఁగఁ బాడి పాడి తెలివొందం దన్నుఁ దా మెచ్చుచున్
     జనసమ్మర్దముదిక్కు చూచుచుఁ బిశాచగ్రస్తసంకాశుఁ డై
     యనురాగంబునఁ బొందుచుండె నొకఁ డేకాంతప్రదేశంబునన్.10
వ. వాని డాయం బోయి యీయుత్సవంబునకుం బే రెద్ది కార
     ణం బెయ్యది? యుత్సవానుత్సుకుండ వై యేకాంతంబునందుఁ
     దంత్రీనినాదంబు వినోదంబుగా నీ యున్న తెఱం గేమి?
     యెఱింగింపు మనిన వాఁ డి ట్లనియె.11
చ. శుభచరితాభిశోభితుఁడు [2]సుహ్మమహీపతి తుంగధన్వుఁడన్
     విభుఁ డభిరామరాజ్యపదవీకలితుం డయి తాను నన్యదు
     ర్లభసుఖ మందియుం దనయలాభము లేమికిఁ గంది యాత్మస
     ద్విభవము నిష్ఫలం బని మదిం దలపోసి గురుండు పన్పఁగన్.

క. నేమముతో నిజకాంతా
     స్తోమంబును దానుఁ గొల్చె సోమాపీడా
     నామాంకిత యగు దేవతఁ
     గామితఫలదాయిఁ బుత్రకాంక్షాపరుఁ డై.13
వ. ఇట్లు గొల్చినం బరమేశ్వరి ప్రత్యక్షం బై నీకు నొక్క
     పుత్త్రుండునుం బుత్త్రియు నుద్భవింపం గలవారు పుత్త్రికిం
     బతి యైనవాని ప్రాపునం బుత్త్రుండు బ్రతుకం గలవాఁడు
     పుత్త్రి యెవ్వనిం జూచి వలచె వాఁడె మగం డగు సప్తమ
     వర్షంబు దొడంగి పాణిగ్రహణసమయంబు తుదిగాఁ
     బ్రతివర్షంబును నీకూతురు నాకుం గందుకోత్సవంబు సేయం
     గల దని పలికినం బ్రసాదం బని పోయి దేవీకృప నపత్య
     ద్వయంబుం బడసి కొడుకునకు భీమధన్వుం డను నామం
     బునుం గూతునకుం గందుకావతి యను పేరును బెట్టె నట్టి
     కందుకోత్సవంబునకు నత్తరుణి దేవీగృహంబునకు వచ్చు
     చున్న దని చెప్పి వెండియు ని ట్లనియె.14
తే. అధిపనందన నెచ్చెలి యైన చంద్ర
     సేన యనియెడు పడఁతి నాజీవితేశ
     దానిపై భీమధన్వుండు దగిలి యుండుఁ
     గష్టచారిత్రుఁ డాతండు దుష్టబుద్ధి.15
వ. అతనిచరితం బ ట్లుండె.16
క. ఇచ్చటిసంకేతంబును
     నచ్చేడియ నాకుఁ జెప్పె నది యింపెసఁగన్
     వచ్చుట కెదుళ్ళు చూచెద
     మచ్చరితం బివ్విధంబు మానవతిలకా!17

సీ. అనుచున్న యవసరంబున నొక్కకోమలి
                    చనుదెంచె వాడును సంభ్రమమున
     నెదురేఁగి వచనంబు హృదయంబు వికసింప
                    గమలాక్షి బిగియారఁ గౌఁగిలించి
     కొనివచ్చి చేరువఁ గూర్చుండి నాతోడ
                    నెంతయుఁ బ్రీతిమై నిట్టు లనియె
     నా ప్రాణమునకుఁ బ్రాణం బైనయది యిప్పు
                    డేను జెప్పిన చంద్రసేన సుమ్ము
తే. భీమధన్వుండు దినిన నా పేరికూర
     నంజ, నే నిది వెలిగాఁగ నాకు నొక్క
     నిమిష మేనియుఁ గడపంగ నేరరాదు
     ప్రాణములతోడి పొం దింకఁ బాయువాఁడ.18
చ. అనవుడు నాలతాంగి కుసుమాయుధసాయకసన్నిభంబు లై
     మనమునఁ బ్రాణవల్లభుని మాటలు నాటిన సంచలించి యి
     ట్లనియె మదర్థమై కులము నర్థముఁ గీర్తియు బాయఁ బెట్టి నీ
     యునికికి దోడు దైన్యముగ నొండు తలంపు దలంపఁగూడునే?19
వ. అదియునుం గాక యర్థదాసుండను సార్థవాహునకుం గోశ
     దాసుండనం బుట్టి నామీఁదికూర్మి కారణంబుగా వేశదాసుం
     డను హీననామంబు దాల్చి తిదియునుం జాలదే? నన్ను
     నీ కిష్టంబగు దేశంబునకుం దోడ్కొని పొ మ్మనిన సమ్మతించి
     మద్వదనం బాలోకించి యి ట్లనియె.20
క. ఏదేశంబు సమృద్ధం
     బేదేశము ధర్మబహుళ మేదేశము తా

     వైదేశికులకు సుఖకర
     మాదేశము వెలిసి చెప్పు మరుగఁగవలయున్.21
తరల. అనిన నిట్లని యేను బల్కితి నక్కటా! పరదేశ మీ
     వనితఁ దోడ్కొని పోవవచ్చునె? వచ్చునేని సహాయమై
     యనుప వచ్చెద మీకుఁ జిత్తసుఖావహంబుగ నియ్యెడన్
     మనుప నేర్చితినేని నేర్చెద మాట లన్నియు నేటికిన్.22
క. అని పలుకఁగ మృదునూపుర
     నినదము రశనాకలాపనినదము వనితా
     జనసరసవచనరచనా
     నినదంబును నిండె వర్ణనీయం బగుచున్.23
వ. ఆనినదం బాలించి చంద్రసేన యి ట్లనియె.24
తే. కందుకోత్సవమునకు భూకాంతపుత్త్రి
     వచ్చుచున్నది నాకుఁ బోవలయుఁ బిదపఁ
     గార్య మూహింత మిప్పు డక్కాంతఁ జూడ
     నిష్టమేని నాపజ్జన యేఁగుదెండు.25
వ. అనవుడు26
తే. ఏము దాని పిఱుందన యేఁగి రమ్య
     రంగతలమున కరిగి యారాజతనయం
     జూచుచుండితి మంత నాసుభగలీల
     నాదుహృదయంబులో నర్తనంబు సేసె.27
వ. అట్టిసమయంబున నపూర్వలక్షణాలంకృతంబైన యాకాంత
     నీక్షించి విస్మితాంతఃకరణుండ నై యాత్మగతంబున.28
సీ. లక్ష్మిహస్తమునకు లాంఛనం బబ్జంబు
                    హస్తంబ యబ్జ మీయబ్జముఖికి

     సిరి పురాతనుఁడైన పురుషుని మును[3](గూడెఁ
                    జెలువుని గూడ) దీచిగురుఁబోఁడి
     జనులకు నిందిరాసతి పొడచూప దీ
                    పద్మాక్షి కన్నుల పండువయ్యె
     నింత ప్రాయం బని యెఱుఁగము కమల కీ
                    నాతికి నెలజవ్వనం(బు హెచ్చెఁ
తే. గాన) నీలక్షణమ్ములు కమలనిలయ
     లక్షణములకుఁ గడు నగ్గలంబు లిట్టి
     వనితకన్ను మనంబు నెవ్వానిఁ దగిలె
     నతఁడె కాఁడె మన్మథునకు ననుగలంబు.29
క. (అని తలంచుచుండ) వనజా
     నన కందుకకేళియందు నానావిధులం
     దననేర్పు మెఱసి యాడెం
     గనుఁగొనల మెఱుంగు లెల్లకడలం బొలయన్.30
వ. అయ్యవసరంబున.31
క. (చెఱకువిలుకాని) యమ్ముల
     తెఱుఁగున వడిఁ గందుకావతీదృగ్దీప్తుల్
     నెఱ నాటి ధైర్య మంతయుఁ
     బఱిగొని ననుఁ గుసుమబాణు బారిం ద్రోచెన్.32
తే. కందుకక్రీడ దీరిన నిందుము(ఖియుఁ
     జెలులతోఁ) గొంత ప్రొద్దు కోమలవిహార
     లీలఁ జలియించి వేడ్క సాలించి యంబి
     కాభివందన మొనరించి యరుగునపుడు.33

క. మనము నను మరగి వెలిపడి
     తనమేన్ (జొరునొ చొరదొ యని) చాని మరలి చూ
     చినయట్ల కటాక్షము నా
     తనువునఁ గీలించె మదనుదర్పం బలరన్.34
వ. ఇట్లు సవిలాసావలోకనంబు సేయుచుం జని కన్యాంతఃపురం
     (బుం బ్రవేశించె నేను)నుం గుసుమశరశరజర్జరితచిత్తుండ
     నగుచుం గోశదాసుతోడం దదీయనివాసంబున కరిగి తత్సం
     పాదితసంప్రీతిపూర్వకస్నానభోజనంబు లిచ్ఛానురీ(తి మనో)
     హరంబుగాఁ జలిపి సాయంతనసమయంబున నతండునుం
     జంద్రసేనయు నాతో మధురసల్లాపంబు సేయుచున్నయెడ
     నమ్ముదిత వల్లభు(మేన నొయ్యారంబు)న నొరంగి విస్రంభ
     సుఖానుభవచరిత యైన దాని నుపలక్షించి యతం
     డి ట్లనియె.35
క. వనితా! యీచందమునన
     యనఁగిపెనఁగి యేను నీ(వు నాజీవితముం)
     బనుపడునట్లుగ దైవం
     బనుగ్రహము సేయునొకొ? దయాతత్పర మై.36
క. అనవుడు నాతనిపలుకుల
     కనుగుణముగ నిట్టు లంటి నబలా! (నా) యొ
     (ద్దను నిపు డొకమం) దున్నది
     కొను మిచ్చెద భీమధన్వు కూరిమి చెఱుపన్.37
క. ఆమందు మేనఁ బూయఁగఁ
     గోమలి! యాక్షణమె యాఁడుఁగ్రోతి వగుదు త

     ద్భూమి(శసుతున కీపైఁ)
     బ్రేమంబును బోవు నీకుఁ బ్రియ మొనరంగన్.38
క. అనిన దరహసితముఖి యై
     నను నీజన్మంబునందు నగచరవంశం
     బునఁ బుట్టించెదు చుట్టమ
     వని నమ్మిన నిట్లు చేయ నగునే! నీకున్.39
వ. అని మఱియు ని ట్లనియె మనకుం గుటిలోపాయంబు పని
     లేదు మనతలంపు సఫలం బయ్యె నది యె ట్లనిన.40
తే. కందుకావతి యెవ్వనిఁ గలిసె వాఁడ
     మగఁడు భీమధన్వుండు నమ్మగువమగని
     జేరి బ్రదుకంగఁ గలఁ డని చెప్పె నొక్క
     దైవ మాదివ్యవాక్యంబు దప్ప దెట్లు.41
ఉ. ఆయబలాలలామ భవదాస్యము వేడుకతోడఁ జూచి పు
     ష్పాయుధుచేత నోఁబడియె నంతయు రాజున కేన చెప్పి నిన్
     రోయఁగ వత్తుఁ గందువ యెఱుంగుట నాతఁడు నన్న పంచినన్
     వేయును నేల నీవు పృథివీపతి యయ్యెదు దైవశక్తితోన్.42
వ. భీమధన్వుండు నీచేతిలోనివాఁడ యదియ మాకుం బ్రదు
     కుతెరు వీరాత్రి యించుకసే పెట్లైన నూరకుండి యెల్లి
     మనకార్యము సఫలంబు చేసికొందము.43
మ. అని న న్నూఱడఁ బల్కి వల్లె యనఁగా నాలింగనం బర్థిఁ జే
     సి నరేంద్రాత్మజఁ గొల్వ నేఁగుటయు నేఁ జింతానిమగ్నుండ నై
     కనుదో యించుక యేని నిద్రఁ బొరయంగా నేరమిన్ రాత్రి యె

     ల్లను గందర్పుని చేత నోఁబడితి నుల్లం బెంతయున్ బెగ్గిలన్.44
వ. అంత సూర్యోదయం బగుటయుం జంద్రసేన నన్నుం బొ
     మ్మని నియమించినం గందుకావతివలని లోలత్వంబున బేల
     నై యియ్యకొని పోవఁ దానునుం జనియె నేను దినము
     ఖోచితవ్యాపారంబుల నాదరంబున నిర్వర్తించి.45
శా. మాద్యచ్చిత్తుఁడ నై మహీశసుత నాత్మంగోరి తాపంబుతో
     నుద్యానంబున మాధవీగృహములో నున్నంత నచ్చోటికిన్
     హృద్యాకారత మేదినీశతనయుం డేతెంచి పట్టించి న
     న్నుద్యత్కోపముతోడఁ జూచి పలికెన్ హుంకారపూర్వంబుగన్.46
ఆ. నీవు రాజవేని నీ బంటునకుఁ జంద్ర
     సేన తాను వనిత యౌనె? కందు
     కావతీవధూటి దేవి యటే! నీకు
     బావ రాజ! యెచట బ్రదికె దింక.47
వ. అని పలికి యన్యు లెఱుంగకుండఁ దనయింటికిం గొనిపోయి
     శృంఖలానియమితచరణుం జేసిన.48
తే. నాదుమోసంబు దైన్య మొనర్చెఁ గాన
     దూఱు నగవక దైవంబు దూఱు టుడిగి
     బోటి [4]నేరమి నింతలు పుట్టె నని త
     లంచుటయు మాని నన్న నిందించుకొనుచు.49
వ. ఇ ట్లని విచారించితిఁ జంద్రసేన లోఁతుగల మనంబు లేని
     యది యగుటం జేసి. వెఱంగుపడి తలంపు తుంగధన్వున
     కెఱింగించు క్రమంబునకుం జొరక భీమధన్వుకడకుం జని

     నావలన విన్నమదీయవంశవృత్తంబులు నత్తన్విచిత్తంబు
     నాయందుం దగులుటయు నెఱింగించి తాను ముదుసలి
     యై దైవవాక్యంబును దలంచిన నతండు కుటిలహృదయుండు
     గావున.50
తే. కోశదాసుండు నిదియును గూడి యిట్టి
     యకృత మొనరింతురే యని యాత్మఁ దలఁచి
     తలఁపు దోఁపకయుండుచందమునఁ బలికి
     యాతఁ డెచ్చోట నున్నవాఁ డనిన నదియు.51
క. ఉపవనమున నాయుండుట
     నృపసుతునకుఁ జెప్పె నతఁడు నెమ్మి మెయిన్ మ
     చ్చుపగిదిఁ బోద మని కపట
     లపితుం డై వచ్చెఁ గావలయు నూహింపన్.52
వ. అనుచు.53
క. ఈవిధము వితర్కము నా
     భావమునం బుట్టి యేమి వాటిల్లిన మ
     ద్భావి యనుచుండ నంత వి
     భావరి యగుటయును నానృపాలసుతుండున్.54
క. సంకలియతోడ బహుమక
     రాంకితమగు జలధిఁ ద్రోయుఁ డని కోపముతోఁ
     గింకరులఁ బనిచె వారును
     శంకింపక తెచ్చి నన్ను జలనిధిలోనన్.55
క. త్రోచినఁ గ్రుక్కుచుఁ దేలుచు
     వీచిపరంపరలనడుమ వెగ డందఁగఁ బూ

     ర్వాచరితపుణ్యఫలమై
     నాచే నగపడియె శుష్కనగఖండ మొగిన్.56
వ. దానిం బట్టుకొని తేలుచు నారాత్రి గడపి మఱునాడు.57
క. కులిశహతిఁ బడని హరగిరి
     పొలువున నొకకలము చేరెఁ బుణ్యము పొడ వై
     జలనిధి ననుఁ జేరుగతిం
     జెలువగు ధవళంపుగాలిచీరలతోడన్.58
ఉ. అందలిసెట్టులందఱు దయామతి నన్ [5]దిగిపించి యోడలో
     నం దమయొద్దఁ బెట్టుకొని నాపదబంధము పుచ్చి పంచి రం
     తం దముఁ దాఁకె నడ్డపడి దారుణశాత్రవయానపాత్రముల్
     గ్రందుగ భీతిఁ దారు గలఁగంబడి రత్తటి నేను గ్రక్కునన్.59
వ. ధనుస్తూణీరంబులు గైకొని.60
క. పలుకుల కెడ లే దీరిపు
     బలముల నాశౌర్యశక్తిఁ బఱపెద మీరల్
     గలఁగఁబడ నేల? యని దో
     ర్బలముఁ జలము మెఱయఁ దాఁకి రౌద్రం బెసఁగన్.61
వ. ఉద్దండకోదండనిర్ముక్తక్రూరనారాచంబులం బ్రతిబలంబుం
     బరిమార్చితి నట్టియెడ నొక్కనావలోన వివర్ణవదనుం డై
     యున్న భీమధన్వుం జూచి యచ్చెరువంది పట్టికొని యన్యా
     యంబున బేహారుల ధనంబులు గొనవచ్చి నాచేతం జిక్కితె!
     యనుచుం దెచ్చి పాపంబు చేసేతం గుడుపునట్లు నన్నుం
     బెట్టిన సంకలియన వానిం బెట్టించి మదీయవిక్రమాటోపం
     బునకు విస్మయచిత్తులగు సెట్లచేతం బసదనంబులు వడసి

     వారికిం బరమమిత్రుండ నై పోవనవసరంబున మహా
     వాయువు వీవం దొడంగిన.62
సీ. బెడిదంపుగాలిచే బెదరి యెత్తిన చాఁప
                    విడిచి గుండ్లును దిగవిడుచుటయును
     గడల వే నొదికిలఁబడుచు భారంబునఁ
                    బలకలు నొగులుచుఁ బగులుచున్నఁ
     గ్రమ్మఱ గుండులు కలముమీఁదన పెట్టి
                    యుత్తమవస్తువు లోలిఁ గట్టి
     ప్రభువు లందఱుఁ (ద)మపాదులకడ డాసి
                    [6]యిష్టదైవంబుల [7]నెఱఁగికొనుచు
తే. నుండి రంత హనూమంతుఁ డుదధిఁ జేరి
     యుఱక నుంకించుపగిది నుఱ్ఱూఁత లూఁగి
     (యోడ) లయమారుతంబు (పెన్నుద్ది) వోలెఁ
     దీవ్రగతిఁ బాఱి యొకపాడుదీవిఁ జేరె.63
వ. తత్సమయంబున.64
క. ఆఁకలియు నీరుపట్టును
     దాఁకిన ప్రజ కలము డిగి యథాయథలుగఁ బెన్
     మ్రాఁకులకుఁ జేరి యేఱుల
     లోఁకలకుం జనిరి దీవిలోపలఁ గలయన్.65
వ. ఏనును నోడ దిగిపోయి పండ్లు గోసి నమలుచున్న సమ
     యంబున.66
ఉ. పేరినకోఱవెండ్రుకలు బీఁటలువాఱిన దీర్ఘకాయమున్
     మీఱినకోఱదౌడలను మీసల నూనినరక్తపంకముల్

     వీఱిఁడిచూపులం గుఱుచవీ(పును) గల్గిన బ్రహ్మరాక్షసుం
     డీరములోన నన్ను గని యి ట్లని పల్కెఁ గఠోరవాక్యుఁ డై.67
తే. ఎద్ది క్రూరంబు? గృహపతి కెద్దిడి ప్రియము?
     హితము నొనరించు నెయ్యది? యెద్ది కామ?
     మెద్ది దుష్కరసాధన? మింతపట్టు
     నెఱుఁగ మదిఁ గోరుచుండుదు నెల్లప్రొద్దు.68
క. ఇత్తెఱఁగున నాప్రశ్నల
     కుత్తర మి (మ్మీక యూరకుండుదువేనిన్)
     వ్రత్తుం బ్రేవులు సాదగు
     నెత్తుటఁ జొతిల్ల దాఁచి నేఁడు రుచింతున్.69
వ. అనిన నేఁడు వీఁడు శాపోపహతుండు గావలయు నని విత
     ర్కించి యభిమతం బాచరింపం బూని యి ట్లంటి.70
క. క్రూరము నారీహృదయము
     దారగుణము గృహికిఁ బ్రియహితము సంకల్పం
     బారయఁ గామము దుష్కర
     కారకసాధనము ప్రజ్ఞ గణుతింపంగన్.71
క. అన నతఁ డెంతయు దయఁ గై
     కొని యి ట్లని పలికె నిది యగు నయిన నీచె
     ప్పినయుత్తరములు దృష్టాం
     తనిరూపణ మొప్పఁ జెప్పు తజ్ఙ్ఞుఁడ వేనిన్.72
వ. అనిన నట్ల చేసెద నని యి ట్లంటి.73
తే. మును త్రిగర్తాఖ్యఁ బరఁగిన జనపదమున
     ధనక ధాన్యక ధన్యకు లనఁగఁ బరఁగు

     గృహపతులు సోదరులు మహామహిమతోడ
     నెగడుచుండిరి విశ్వజనీను లగుచు.74
క. వఱపున సస్యము లొదవమి
     నఱిముఱి దైవంబుచెయ్ది నాఱేఁడులు పెన్
     కఱవైన భూమిఁ గలప్రజ
     పఱివఱి యై [8]విడిచి పోయెఁ బరభూములకున్.75
వ. తత్సమయంబున విరళంబగు జనసమూహంబు.76
ఉ. మానిసిమాంసమున్ (బసులమాంసముఁ) గూడుగ నెత్రు నీరుగాఁ
     బూని దినంబులు న్నెలలుఁ బుచ్చఁగ దుస్తరవృత్తిఁ గాలముం
     దా నతిదీర్ఘ మైనయెడ ధాన్యకుఁడున్ ధనకుండు ధన్యకా
     ఖ్యానుఁడు నంత వర్తకులు గావునఁ బోవక నిల్చి రందులోన్.77
వ. (అట్లు నిలిచి త్రావు విడువక పూర్వార్జితంబులైన ధనధాన్యం
     బులు పొలియం గుడిచి కొన్నిదినంబులు నవసి నవయం
     జాల కజాదిగోమహీషదాసదాసీవర్గంబుల నెల్లం గ్రమ
     క్రమంబున నశనంబుగాఁ గొని భార్యామాత్రసహాయు
     (లయి యున్నంత).78
క. ఆమువ్వురు నిరువురుసతు
     లామిషముగ బ్రదికియుండ నవరజుఁ డుద్య
     త్ప్రేమమున నాత్మభామిని
     ధూమినిఁ బరదేశమునకుఁ దోకొని చనుచోన్.79
వ. ఒకయెడ మధ్యందినసమయంబున.80

ఆ. అవనకాంక్ష నొకరుఁ(డట) పాదములవ్రేళ్లు
     (కర్ణనాసికములు క)రతలంబు
     మ్రోడుపడఁగ నవని మురముక ముల్గుచుఁ
     బొరలుచున్నఁ జూచి కరుణతోడ.81
క. తాను నిజమాంసలోహిత
     దానంబుల సేద దేర్చి తత్సమయమునన్
     వా(ని నొకమూఁపు) పైఁ దన
     మానిని నొకమూఁపుపై నమానుషవృత్తిన్.82
క. మోచుకొనివచ్చి పూచిన
     కాచిన తరువులను గలుగు కాంతారములోఁ
     జూచె నొకజఠరకూపము
     ప్రాచీనజనిక్రియావి(పాకముకలిమిన్).83
వ. చూచి జలపానలాలసుండయి యపూర్వపరిచితోపకరణపరి
     ణతంబైన తత్ప్రదేశంబున.84
క. తాళీదళపుటికాముఖ
     కీలితలతికావితానకృతరజ్జుసమాం
     దోళనవిరళీకృతమై
     వాలంబగు జలము చేది వనితకుఁ (బోసెన్).85
వ. తదనంతరంబ వానికిం బోసి తాను నుదకపానసేచనంబుల
     వలన లబ్ధోత్సాహుం డై ఫలమూలంబులు దెచ్చి వాని
     కిచ్చి శేషం బుపయోగించి యవ్విపినస్థలి యి మ్మగుటయు
     నందు వసియించి.86
క. ఇరువురకుం (బ్రత్యహమును
     నిర)వుగ సమకట్టి పెట్టి యిచ్చ చని మహ

     త్తరయత్ననిహతబహుమృగ
     సరసాహారములఁ దృప్తి సలుపుచు నుండెన్.87
మత్తకోకిల. ఇవ్విధంబున ధన్యకాఖ్యుఁ డనేకభంగులఁ బ్రోవగాఁ
     గ్రొవ్వి ధూమిని మొండితోఁ (దనకోర్కి తెల్పుడు) సేయఁగా
     నవ్వలించినఁ జూచి వాఁడును నంతరంగములోపలన్
     నవ్వి లజ్జయుఁ గోపము గగనంబు ముట్టఁగ ని ట్లనున్.88
ఉ. తల్లివి నీవు ధన్యకుఁడు తండ్రి యసంశయ మింతవట్టు నీ
     యుల్లమునం దెఱింగియును నొప్పనిపల్కులు పల్కెదింక నీ
     తల్లితనంబు చాలు నుచితం బని పల్కిన నెట్లు తల్లియుం
     గిల్లియు నెట్టి పాపమును గీపము నీపతి కేను జెప్పెదన్.89
మ. అని పంగించిన వాని నప్పటికి నిష్టాలాపముల్ పల్కి నే
     ర్పునఁ (గోపం) బ(డఁగించి జంతు)పిశితంబున్ నన్యపుష్పంబులున్
     దనప్రాణేశుఁడు దెచ్చి యిచ్చి యుదకోద్ధారం బొనర్పంగ గ్ర
     క్కున నూతం బడఁద్రోచె [9]భామని గడుంగ్రూరాత్మ యై యాతనిన్.90
వ. త్రోచి మగుడం జనుదెంచి వికలాంగుం డగుటం జేసి యగ
     తికుండైన యతని యెత్తికొని యుజ్జయినీపురంబున కరిగి
     నామగం డని పాతివ్రత్యపాటవంబున నవంతీశ్వరు మోస
     పుచ్చి యానృపతిచేతం బూజిత యై గృహిణీధర్మభావం
     బునం బ్రవర్తించి యేకాంతంబున నొక్కొక్కమాటు వాని
     నొడంబడఁ బలుకుచున్నంత నక్కడ జలపానలాలసపథిక
     జనోద్ధరితుం డయి ధన్యకుండు దైవయోగంబున (నయ్యు

     జ్జయినీపురంబు)కు వచ్చి యశనార్థియై తిరుగుచున్నం గని
     ధూమిని జనపతిపాలికిం జని యి ట్లనియె.91
క. నావిభుని మొండివానిం
     గావించినవాఁడు వచ్చి కపటాకృతితో
     నీవీట నున్నవాఁడు మ
     హీవల్లభ! వాని నేన యిప్పుడు గంటిన్.92
చ. అనవుడు మేదినీశ్వరుఁడు నాయమపల్కులు నిక్కువంబు కాఁ
     దనమడిలోపలం దలఁచి ధన్యకునిం దల గోసి వైవఁ బం
     చిన నది చూప నారెకులు చెచ్చెర నాతనిఁ బట్టి నిన్ను ని
     మ్మనుజవిభుండు చంపు మని మమ్ము నియుక్తులఁ జేసె నావుడున్.93
వ. వాఁడును మరణభయవిహ్వలితాంతఃకరణుం డయ్యును
     ధీరుండు గావున సముచితంబుగా ని ట్లనియె.94
క. చంపిన సరి లేదని చం
     పింపం దగునె? ధరిత్రిఁ బేద లనక తాఁ
     జంపెడిచోట విచారము
     పెంపేనియుఁ దలఁపవలదె? పృథివీపతికిన్.95
క. అనవుడు పైపాటునకున్
     మనమున శంకించి వానిమాట పతికి వా
     రును జెప్పి కొలువులోనికి
     గొనిపోయిన నతఁడు ధన్యకున కి ట్లనియెన్.96
క. తగునే? నీవు పతివ్రత
     మగని నకారణమ పాపమతి వై యమ్మై

     [10](దెగఁబడి వికలాంగుని జే
     యఁగ ఛీ నీచేతు లెట్టు లాడె దురాత్మా!97
చ. అనవుడు ధన్యకుం డనె ధరాధిప! దీనియథార్థ మెన్నకే
     తునుమఁగఁ బంప నీతియె? యదోషుని, నైననతండు చెప్పినం)
     దునుముట నీతి గాన దయతోడఁ బతివ్రతభర్తఁ బిల్వఁగాఁ
     బనుపుము వాడు నావలనఁ బాపము పెట్టిన దీని కోర్చెదన్.98
క. అనినం బతి పనుపఁగఁ దో
     కొని వచ్చిన నతఁడు ధన్యకుని గని ననుఁ బ్రో
     చినయయ్య యనుచుఁ దత్పద
     వనజంబుల కెరఁగె మనుజవల్లభు మ్రోలన్.99
వ. ఇట్లు ప్రణమిల్లి మేదినీపతికిం దనతెఱంగు విన్నవించిన.100
ఆ. ధరణినాథుఁ డపుడు ధన్యకు నిర్దోషుఁ
     గా నెఱింగి వానిఁ గరుణ నేలి
     దుశ్చరిత్ర యైన ధూమిని నవమాన
     పఱచి యునిచెఁ గుక్కబానసమున.101
వ. అది కారణంబుగా నారీచిత్తంబు క్రూరం బయ్యె నని
     చెప్పి మఱియు ని ట్లంటి.102
సీ. అవనికిఁ దొడవైన ద్రవిళదేశములోని
                    కాంచీపురమునఁ బ్రకాశయశుఁడు
     శక్తికుమారాఖ్య సడిసన్న కోమటి
                    వెరవుపెంపునఁ గల వెలఁది వెదకి
     పరిణయంబుగఁ బూని పలుచోటులకు నేఁగి
                    యెఱుకల వెంట నిల్లిల్లు దూఱి

     యెఱుకలు చెప్పుచో నెల్లలక్షణములు
                    గడు నొప్పు నొకకన్యకాలలామ
తే. నొక్కముదుసలి తో డ్తెచ్చి యువిదభాగ్య
     మెంత! మగఁ డెట్టిఁ? డాత్మజు లెంద? ఱనిన
     నిప్పు డాఁకొంటి వడ్డింపుఁ డేను గుడిచి
     యేకచిత్తానఁ జెప్పెద నెఱుక లెల్ల.103
క. అనుచుం బైకొంగునఁ గ
     ట్టినవడ్లం జేటఁ బోసి డించిన నదియుం
     దనయం గనుఁగొని వంటక
     మొనరింపుము వీరి కని నియోగించుటయున్.104
సీ. ఒడికంబుగా వ్రేసి యొక్కింత నేలపై
                    నిరుసవడ్లను బోసి యెండనెఱపి
     యొయ్య నొయ్యన క్రాసి యుముక నవ్వలకించి
                    కొని నేర్పుమై గరకూర విలిచి
     వంటక మొనరించి వరుసతో నిప్పులు
                    బొగ్గులుగా నార్చి ప్రోవు సేసి
     క్రమ్మఱ నొరకొన్న [11]గ(వ్యము) కమ్మించి
                    సమ్మదంబునఁ జల్ల చమురు విలిచి
తే. వెరవు భక్తియుఁ బెరయంగ వేడ్కతోడఁ
     గుడువఁ బెట్టిన నాతఁ డీకొమ్మకైన
     మగఁడు జగముల భాగ్యసమగ్రుఁ డనుచు
     నబలఁ బెండిలిగా నిశ్చయంబు సేసె.105
వ. తదనంతరంబ.106

క. కులమును బుట్టును బేరును
     వెలయఁగఁ దద్బాంధవులకు వేడుక పుట్టం
     దెలిపె జగ మెల్ల మెచ్చఁగ
     బలువిధముల ధనము లిచ్చి పరిణయ మయ్యెన్.107
క. గోమిని యనఁ బరఁగిన యా
     భామిని నిల్లాలిఁ జేసి పై నొక యాలిం
     గామించి వేఱు కొనియెన్
     గోమిని యనుసతిగుణంబుకొలఁది యెఱుంగన్.108
వ. ఇట్లు పరిణయం బై యున్న నగ్గోమినియును.109
చ. సవతికి భర్తకుం బ్రియము సల్పుచు వారికి నెయ్యులైనబాం
     ధవులకు భక్తి సేసె గృహధర్మము దప్పక నీచవృత్తులం
     దవులక యీలువుం బెనుపుఁ దాలిమియున్ జను లెల్ల నెల్లచో
     వివిధవిధంబులం బొగడ విశ్రుతి కెక్క సతీచయంబులోన్.110
ఉ. ఇమ్మెయి నేమిటం గొఱఁత యించుక లేక చరించు చున్కికిన్
     సమ్మద మంది నాదు గృహసంపద పొంపిరివోవనీక ము
     ఖ్యముగ నిర్వహింపు మని యైహికభూరిసుఖంబు గొల్లలుం
     గొమ్ములు వోవఁగాఁ బనిచె గోమిని శక్తికుమారుఁ డర్థితోన్.111
వ. అది కారణంబుగాఁ బురుషునకుఁ బ్రియంబును హితంబును
     దారగుణంబునం బుట్టు నని మఱియు ని ట్లంటి.112
క. వెలయఁగ సౌరాష్ట్రంబున
     వలభీనగరంబునందు వైశ్యుఁడు గృహగు

     ప్తలలితనాముం డొక్కఁడు
     కులతిలకం బనఁగఁ జాలు కూఁతుం గాంచెన్.113
వ. కని రత్నావతి యను పేరు పెట్టి బలభద్రుం డనం బరఁగిన
     సెట్టి కిచ్చిన వాఁడును వేశ్యాసక్తుం డగుట దాని నుదాసీ
     నంబు సేసిన నాబాలయు జననీగృహంబునకుం జని దు
     ర్భాగ్యానుగుణంబుగా జనులన లన నింబవని యను నా
     మంబు దాల్చి [12]పతిపాదచింతాక్రాంత యై యున్నం గొం
     డొకకాలంబునకు.114
క. ఒక ప్రోడముండి తనపా
     లికి నేకత మరుగుదెంచి లీలాశూన్యాం
     కకముఖి యై యి ట్లునికికి
     నకటా! కత మేమి? యనిన నది యి ట్లనియెన్ .115
ఉ. పేర్కొ ని తల్లిదండ్రులకుఁ బెంపుగఁ బుట్టితిఁ బుట్టి యెంతయుం
     గర్కశుఁడైన కాంతునకుఁ గర్మవశంబున నాల నైతి నా
     కోర్కుల మీఁదఁ దీర్తు నని ఘోరనికారము లోర్చుచున్నచో
     మార్కొని మాలదైవము క్రమంబున నన్నెడసేసె వానికిన్.116
శా. తల్లీ! ప్రాణముతోడిచావు మగఁడున్ దవ్వైన నిల్లాలికిం
     దల్లిం దండ్రిని జేరి యున్కి దలఁపన్ దైన్యంబు నాభర్త న
     న్నొల్లం బొమ్మని ద్రోచెఁ బ్రాణవిరహోద్యోగక్షమం బందె నా
     యుల్లం [13]బింతలు పెద్దలే నరులు దైవోపేక్షఁ జింతిల్లరే!117

మ. వలచిన నొల్లకున్న గుణవంతుఁడ యైననుఁ గాక తక్కినం
     గులసతి కాత్మవల్లభుఁడె కోరికవే ల్పని పెక్కుభంగులం
     దెలియఁగ వింటిఁ గావునఁ బతిం జదురొప్పఁగఁ బొంది కొల్వ నేఁ
     దలఁచెద నీవు తోడ్పడుము తల్లితనంబు ప్రసిద్ధిఁ బొందఁగన్.118
వ. అది యె ట్లంటేని మదీయభర్త గమనాగమనమార్గోపాం
     తరగృహంబున మత్సమానవయోరూపంబులం దగినకనక
     వతి యనం బరఁగిన చెలికత్తియ గలదు తద్భవనవలభియందు
     వాతాయనంబుల చక్కటిఁ గందుకక్రీడావ్యాజంబున విహ
     రించుచుం బ్రాణేశ్వరుఁ డరుగుదెంచు నవసరంబునం
     బ్రమాదపతితంబుపేర నతనిమ్రోలం నందుకంబు దిగ విడి
     చెద నీవునుం దత్సమయంబున మత్సమీపంబున నిలిచి
     వానిచిత్తంబునకు రాగంబు పుట్ట ని ట్లనుము.119
చ. నిధిపతిదత్తుకూఁతు రిది నీసతికిం జెలికత్తె నిన్నుఁ బల్
     విధముల నెగ్గులాడుచు వివేకవిహీనుఁడు నీరసాత్మకుం
     డధముఁడు మే లెఱుంగఁ డని యాఱడిఁ బెట్టెడు దీనిమాట లె
     వ్విధముననైన మాన్పఁగఁ బ్రవీణత లేదె? మనంబులోపలన్.120
క. అను పల్కు పల్కుటయు నత
     డనురాగము పొంది సముచితాలాపములం
     బనుపడి నిజగృహమునకుం
     జను నీవును నతినిపజ్జఁ జను మటమీఁదన్.121
వ. చని కుసుమతాంబూలాద్యుపహారంబు లిచ్చి కూరిమి ప్రక
     టించి యెడ నెడం దమకంబు పుట్టించి కందువకుం దార్చి

     పొందొనర్పు మతండును జిరకాలదృష్టయు నారూఢయా
     వనయు నైన నన్నుం గనకవతియ కాఁ గొని నెలవున కెల
     యించు నటమీఁద భాగ్యంబున కనుగుణంబుగా బ్రదుక
     నేర్తు ననిన సమ్మతించి యమ్ముదుసలియును నట్ల సేసినం
     బతియభిమతసురతసుఖంబువలనం బరమానందంబునంబొంది
     యనంతరంబ యమ్మగువ యి ట్లనియె.122
సీ. దైవంబు మనకు నిద్దఱకుఁ బొం దొనరించె
                    నినుఁ బాసి పోఁజాల నీవు నన్ను
     నిష్టదేశమునకు నిప్పుడ కొనిపొమ్ము
                    తడవు చేసినఁ బ్రమాదంబు పుట్టు
     ననవుడు నతఁ డియ్యకొని పరభూమికి
                    నరుగువాఁడుగ నిశ్చయంబు చేసి
     ధనము చాలెడునంత గొని కోమలియుఁ దాను
                    నప్పుడ పయన మై యరిగి యరిగి
తే. యొనరఁ బాథేయములు మోవ నోపునట్టి
     వరవు నొకయూర [14]విలిచి మువ్వురును గూడి
     పుష్పపురమున కరిగి యప్పురమునందు
     వేడ్క పొంపిరివోవ జీవించుచుండి.123
వ. ఇవ్విధంబున నొక్కనాఁడు.124
క. పిలిచినఁ బలుకవు పనిచిన
     గలగలఁ బని సేయ వేమి కార్యం బైనన్

     వెలిపుత్తు నని కుపితుఁ డై
     బలభద్రుఁడు వరవుఁ బెక్కుపాట్లం బఱచెన్.125
చ. పఱచిన నాగ్రహించి మును పాయక నమ్మిక నున్ననాఁడు తా
     నెఱిఁగినమాట లన్నియును నెగ్గుగ నాత్మఁ దలంచి దాసియున్
     [15]గొఱకొఱ వీట నెల్లెడల గోసన పుచ్చిన నర్థలుబ్ధుఁ డై
     యఱమర మానితద్విభుఁడు నాబలభద్రుని బట్టఁ బంచినన్.126
ఆ. అతనికాంత యైన యారత్నవతి పతి
     కిట్టు లనియె వెఱవ నేల? మనకుఁ
     దెఱఁగు గలదు వసుమతీనాయకునితోడ
     నిట్టు లనుము ధైర్య మెసక మెసఁగ.127
క. వరవుళ్లమాట [16]లొకక్రియఁ
     బరికింపక నిజము సేయఁ బాడియె వలభీ
     పురి గృహగుప్తుం డనియెడి
     వరవైశ్యునిపుత్రి రత్నవతి యిది దీనిన్.128
ఆ. తల్లి దండ్రు లొసఁగఁ దత్కరగ్రహణంబు
     చేసినాఁడ నచటు వాసి యొక్క
     కారణమున వచ్చి చేరితి మిప్పుర
     మధిప! యప్పురమున కరయఁ బనుపు.129
క. అను మని చెప్పిన విస్మయ
     మనస్కుఁ డగు నతనితోడ మఱియును దెలియం
     దనవృత్తాంతం బంతయు
     గనదంబుజనేత్ర చెప్పె గౌరవ మెసఁగన్.130

చ. విని ముదమంది వాడు పృథివీపతిపాలికిఁ బోయి యింతిచె
     ప్పినక్రియఁ జెప్పి పూన్కి మెయిఁ బెంపరకుండఁగ నాలితోడ ని
     ల్చిన విభుపంపునం జనిన లేఖలవారలతోన మామ యిం
     పొనరఁగ వచ్చి తమ్ముఁ గొని యొప్పిద మొందఁగఁ బోవునంతకున్.131
వ. ఇవ్విధంబున బలభద్రుండు నిజస్థానంబునకు మగుడ భార్యా
     సమేతుం డై చనియె నది కారణంబుగాఁ గామంబు సంకల్పం
     బంటి నని చెప్పి మఱియు ని ట్లంటి.132
ఆ. శూరసేనదేశసుభగభూషణ మన
     నొప్పు మధురలోన నొకగృహస్థు
     నందనుండు మదనసుందరాకారుండు
     గలఁడు పేరు కలహకంటకుండు.133
క. మిండఁ డయి తిరుగు బాహా
     దండబలోద్దాముఁ డగుట దర్పంబున నె
     వ్వండుఁ దన కెదురు గాఁ డను
     చుండుఁ గలహలోలమైన యుల్లముతోడన్.134
వ. వాఁ డొక్కనాఁడు వైదేశికుండగు నొక్కరునిచేఁ జిత్ర
     పటంబు గనుంగొని యందు సుందరిచిత్రం బుపలక్షించి
     మదనమోహనమానసుం డై యతని కి ట్లనియె.135
క. ఎలనాఁగచంద మారయఁ
     గులవధు వగు నిదియుఁ గాక కోర్కులు సఫలం
     బులుగా బరిభోగంబులు
     గలయదియును గాదు వృద్ధకామిని యగుటన్.136

క. మగఁ డొల్లమియును విరహము
     మగువదెసం దోఁప దకట! మానము వినయం
     బు గరువతనమును గలయది
     యగుఁ [17]బ్రౌఢత తోఁచెఁ జూడ్కియం దడఁకువతోన్.137
ఉ. నీ వలపోక చూచి తరుణీతిలకంబుమనంబు రూపమున్
     భావగతంబులైనఁ దగంఁ బ్రౌఢత చూపుట గోరియచ్చుపా
     టై వఱలంగ నున్న తెఱఁగంతయు వ్రాసితిగాఁ దలంచెదన్
     దేవసమాన! నాయెఱుక తెల్లమొ బొంకొ నిజంబొ చెప్పుమా!138
ఉ. నా విని వాఁడు గారవమునం దనకౌఁగిట వానిఁ జేర్చి సం
     భావన చేసి యి ట్లెఱిఁగి పల్కుట యారయఁ గేవలంబె నీ
     భావము సూక్ష్మభావరసభావననైపుణరూప మిట్టి నీ
     కావనితాలలామ తెఱఁ గంతయుఁ జెప్పుదుఁగాక దాఁతునే.139
వ. అది యుజ్జయినీపురంబువాఁ డనంతకీర్తి నామధేయుండగు
     సార్ధవాహుభార్య నితంబవతి యనునది దాని తెఱం గెల్ల
     నీ చెప్పిన యట్టిద యనిన విని కలహకంటకుం డుత్కంఠా
     వినోదచిత్తుం డై.140
క. తత్పురికి నరిగి భిక్షా
     తత్పరుఁడును బోలెఁ దిరిగి తగఁ జొచ్చిన నీ
     లోత్పలలోచననిలయము
     సత్పాత్రమ కాఁ దలంచి చయ్యన నదియున్.141
ఉ. భిక్షము పుచ్చి భక్తిమెయిఁ బెట్టెడునప్పుడు చూచి యాసరో
     జాక్షిమనోహరోజ్జ్వలశుభాకృతి చిత్తమునందు నాటి వాఁ

     డాక్షణమాత్ర నొక్కతెఱఁ గాత్మఁ దలంచి పరేతభూమిసం
     రక్షణవృత్తి పూనె నగరంబున భార్గవనామధేయుఁడై.142
వ. ఇవ్విధంబునం జరియించుచు నొక్క జఱభితాపసిం బొందు
     గని శవదాహసమయలబ్ధంబులైన నూతనాంబరహిరణ్యశక
     లాదు లొసంగి దానిం బ్రీతచిత్తం గావించి తనతలం పెఱిం
     గించి పంచిన నదియునుం జని నితంబవతితో ని ట్లనియె.143
తే. యౌవనము భోగముల కెల్ల నాస్పదంబు
     దీనితఱి రిత్తపుచ్చక తెఱవ! నీవు
     నన్ను జేకొని తగ నీమనంబుకోర్కి
     తీర్పు మభిసారికావిధి నేర్పు మెఱసి.144
క. అనిన విని యింతి కోపం
     బునఁ గటకటఁబడి యదల్చి పోపో [18]నీ కి
     ట్లనుచితము లాడఁ దగునే?
     యనవుడుఁ బెడవీఁగి వచ్చె నత్తాపసియున్.145
వ. వచ్చి యత్తెఱం గాతని కెఱింగించిన నట్లేని విను మని
     యతం డయ్యవ్వ కిట్లనియె నీ వెల్లి యక్కోమలికడకుం
     జని యిట్లనుము.146
క. పావనచరిత్ర యగు ని
     న్నావిధమున కియ్యకొలుప నని పల్కితి నే
     నీవృత్తమునకు భయపడి
     భావం బారయఁ దలంచి పల్కితిఁ దరుణీ!147
తే. సారవర్జిత మగుట సంసార మెల్ల
     విడిచి యిమ్మెయి భిక్షుకవృత్తి నుండి

     యిట్టిపనులకుఁ దొడరుట యేల? నాకు
     నింత తెల్లంబు గాదె! నీ కిందువదన!148
చ. నడవడిపేర్మికిం దనమనంబున నిర్మలమైన సంతసం
     బడరెడు నాకు నింక నొకఁ డారయ నీకుఁ గొఱంత పెంపుగాఁ
     గొడుకులఁ గానవయ్యె దనఘుండగు నీపతి ధాతుహీనతం
     బడియెడు దాని కే నొకటి పంచెదఁ జేయుము సిద్ధి యయ్యెడున్.149
వ. ఒక్క మాంత్రికుండు కొందఱికిఁ గృపసేసిన తెఱంగు గల
     దే నతనికారుణ్యంబు వడసి తోడ్కొనివచ్చి మనమందిరా
     రామంబులోనన మదేకసాక్షికంబుగాఁ దెరమాటున నున్న
     యతనికిం ద్వదీయచరణంబు చూపి యమ్మహాత్తుచేత నభి
     మంత్రితంబైన పాదమునం బ్రణయకలహవ్యాజంబున
     భవత్పతియురస్స్థలంబుఁ దాఁచిన నతండును ధాతుసమ
     గ్రుండును బ్రజాసముత్పాదనసమర్థుండును నగు నవశ్యం
     బును నవ్విధంబు కర్తవ్యం బని చెప్పి తదనుమతి వడసి న
     న్నయ్యెడం జొనిపి నీతోడి సఖ్యంబు సఫలంబు సేయు మన
     వుడు నట్లు చేయం బూని య త్తపస్వినియు.150
ఆ. అతివకడకు నరిగి యవ్విధి కొడఁబడఁ
     బలికి యేకతమున వలను మెఱసి
     తోఁటలోని కల్లఁ దోకొని చనిన వాఁ
     డొక్కతీవయింట నొదిగి యుండె.151
క. వాని నటు లునిచి చని య
     మ్మానినిఁ దెచ్చుటయు రత్నమండనసుభగం

     బైన చరణంబు తెరవెలి
     కై నిగిడించిన నతండు నతిరభసమునన్.152
వ. అందియ పుచ్చుకొని (యొడియం) దిడి తొడ నిడుగంటిగాఁ
     గఠారంబున వాదరం గీచి సత్వరుఁ డై చసుటయు.153
క. తెఱవయు విషాదమునఁ గడు
     వెఱఁ గందుచు నల్లఁ జొచ్చి విహరణసరసిం
     గఱ చెడఁ బోటు గడిగికొని
     పఱివోయిన పెంపు దలఁచి భావం బడలన్.154
వ. మందిరంబు సొచ్చి వ్రణంబునకుం బట్టికాబంధనం బొనర్చి
     తక్కటియందియ పుచ్చి యామయవ్యాజంబున నాలుగేను
     దినంబు లభ్యంతరశయ్య నుండె.155
ఆ. కలహకంటకుండు వెలకును దెచ్చిన
     వాఁడ పోలె దాని వరునికడకు
     నతివినీతవృత్తి నందియ గొనివచ్చె
     నతఁడు చూచి విస్మయంబు నొంది.156
చ. ఇది నిను నెట్లు చేరె? నిజ మెయ్యది? దానిన చెప్పు నాకుమ
     త్సుదతివిభూషణం బగు విశుద్ధుఁడ వీవును నిత్తెఱంగు నా
     హృదయము త్రిప్పుకొల్పెనని యెన్నివిధంబుల నొత్తియాడినన్
     బెదరమితోడ నాతఁడు నభేద్యత నేమియుఁ బల్కకుండినన్.157
ఆ. [19]అపు డనంతకీర్తి [20]యంతగ నీతని
     నలఁప నేల? యింట నరసి పిదపఁ
     జూచికొంద మనుచు సుందరిపాలికి
     నంగియలకుఁ బుచ్చె నదియు బెదరి.158

క. మన పెద్దతోఁటలోనికి
     జని యయ్యెడ మెలఁగఁ గీలు జరిగిన నచ్చో
     టన పడియె నొక్కయందియ
     దిన మెల్లను వెదకి కానఁ దెఱఁ గేదుటయున్.159
వ. వగచుచున్నవార మని చెప్పి యొక్కయందియ పుత్తెంచిన
     ననంతకీర్తి కలహకంటకుం బట్టుకొని రచ్చకుం డెచ్చి య
     చ్చోటి జనంబుల కెఱుంగఁ బుచ్చిన వార లడుగ నాధూర్తుం
     డి ట్లనియె.160
ఉత్సాహ. మీరు నిలుపఁ గాటికాపుమేర పట్టి నిలిచి యి
     య్యూర నున్నవారు కొంద ఱోపు లేక యగ్నిసం
     స్కారవృత్తి రాత్రి చేసి చనుట వినుటఁ జేసి రే
     లారయంగఁ బోదు మొన్న నచట నద్భుతంబుగాన్.161
క. కాలియుఁ గాలని పీనుఁగు
     నేలకు నొఱుగంగఁ దిగిచి నెనడులు కముపం
     గా లలన నొకతెఁ గని యది
     చాలఁ దొడవు దొడిగి యున్న సాహసవృత్తిన్.162
మ. ధనలోభంబున నీతి వోవిడిచి యుద్దాముండనై యాయుధం
     బునఁ జంపం దలపోసి చేర నని పోఁబోఁ గాలు నాచేతఁ జి
     క్కినఁ గత్తిం దొడ వేసి నేఁ దిగిచినం గీల్దప్పి మత్పాణితో
     డన యీయందియ వచ్చె నవ్వనితఁ బట్టం జూడఁగాఁ బర్విడెన్.163
క. ఇది దెఱఁ గని చెప్పిన నా
     సదస్యు లచ్చెరువుఁ బొంది సత్యమ కా నె
     మ్మదిఁ దలఁచి పనిచి రాసతి
     హృదయేశుని దానిచంద మెల్లను నరయన్.164

వ. అతండునుం దనమందిరంబువ కరిగి.165
తే. అరసి తొడపోటు గనుఁగొని యధికభీతి
     తోడ జనులకు నెఱిఁగించి తోయజాక్షి
     డాకినీత్వంబు చాల దృఢంబు సేసి
     మూఢుఁ డై పోవ నడచిన ముద్దియయును.166
క. దురపిల్లుచుఁ గన్నీళులు
     దొరుఁగంగా వెడలి లజ్జతోడి యలమటన్
     బెరసినచిత్తం బెప్పుడు
     మరణంబున నపశయంబు మాన్పుటకుఁ దగన్.167
వ. అత్యంతవిరళగమన యై యరిగి.168
క. నడురేయి పితృవనంబున
     కడ వృక్షముశాఖఁ జుట్టి ఘనలత యురిగా
     నిడి మెడ చొనుపం దలఁచిన
     యెడ నంతకు మున్ను వచ్చి యెంతయుఁ బ్రీతిన్.169
ఆ. వేగ మెయిది పొదివి వెలఁది నయ్యురికడఁ
     బాయఁ బెట్టి చరణపంకజము
     మ్రోలఁ జక్క సాఁగి మ్రొక్కి మృదూక్తుల
     గారవించి కలహకంటకుండు.170
వ. నిజవంశంబును దనయున్నమధురాపురంబునం జిత్రపటంబు
     వైదేశికునిచెంతం గనుటయు వానివలన దానియన్వయనామ
     ధేయస్థానంబులు వినుటయుఁ దనమనంబునం దగులు మిగిలి
     చనుదెంచి తాను జేసిన కపటోపాయంబులుం జెప్పి మఱి
     యు ని ట్లనియె.171

చ. మనసిజు నెత్తికో లెఱిఁగి మానిని! నీదెసఁ బ్రేముడించు టీ
     జననమునందుఁ బాయమి నిజం బగుటే మది నిశ్చయించి యి
     ట్లనుచితమైనఁ జేసి నిను నాలుగఁ గైకొనువాఁడ నైతి నీ
     వును నను నేలుకొమ్ము తగవున్ గిగవు న్మన కింక నేటికిన్.172
క. అని వెండియు బహువిధముల
     ననునయములు పలుకఁ బలుక నగతిక యగుటన్
     వనితయు నొడఁబడి చనియెను
     మన మలరఁగ నతనితోడ మధురాపురికిన్.173
వ. ఇవ్విధంబునం గలహకంటకుండు నితంబవతిపొందు వడయు
     టం జేసి దుష్కరసాధనంబు ప్రజ్ఞ యని యట్లు చెప్పితి
     ననిన.174
క. అంతయు విని యారాక్షసుఁ
     డెంతయు మోదంబు నొంది యెక్కడ నగు శా
     పాంతము నా విని మఱియును
     శాంతాలాపముల నన్ను సంభావించెన్.175
క. ఆయవసరమున నొకపా
     పాయత్తుం డొకలతాంగి నాకసమున హా
     హా! యని యఱవగఁ దే నో
     హో! యనుచు నదల్చి యెగసి యుగ్రాకృతితోన్.176
ఆ. బ్రహరాక్షసుండు బలీయుఁ డై పోనీక
     యడ్డపడియె నంత నతివఁ దలఁగ
     విడిచెఁ దాని వాఁడు వీఁకతో నతఁడును
     నతఁడు దాఁకి రాగ్రహంబు వెలయ.177
వ. తదవసరంబున.178

క. సురకరికరహతిఁ గల్పక
     తరుమంజరి దూలిపడు విధంబునఁ బడఁగాఁ
     దరుణీరత్నముఁ బట్టితి
     ధరపైఁ బడకుండఁ బాణితలయుగళమునన్.179
వ. ఇట్లు పట్టి చూచి కందుకావతి యగుడు నచ్చెరువంది దూ
     రాపాతమూర్ఛితయైన యక్కన్నియ సేదదేర్చిన నదియు
     ను న న్నెఱింగి యశ్రువ్యాకులితలోచన యై యున్న నెట్టకే
     నియు నూరార్చి నీ వీరక్కసున కగపడ్డ తెఱం గెఱింగింపు
     మనిన ని ట్లనియె.180
ఆ. బేలు పెట్టి పట్టి భీమధన్వుఁడు నిన్ను
     వనధిఁ ద్రోచె ననఁగ విని వియోగ
     వహ్ని గాక శోకవహ్నియు నడరినఁ
     జెలులఁ బాసి సౌధతలమునందు.181
శా. ఏకాంతంబున నున్న నాకడకు బి ట్టేతెంచి కామాంధుఁడై
     యాకాంక్షించినఁ జూచి యే నులికి యుద్యద్భీతిఁ గంపింపగా
     నాకాశంబును దిక్కులుం దనమయం బైనట్లుగా బేర్చి యు
     గ్రాకారంబున నన్నుఁ దెచ్చె దనుజుం డంభోదమార్గంబునన్.182
మ. అని శోకించిన నూఱడించి నిజవృత్తాంతంబు నాభీమధ
     న్వునివృత్తంబును నేర్పడం దెలిపి యేనుం గాంతయున్ రాజనం
     దనుఁ జేరం జని సాధువాక్యముల నత్యంతాప్తి భావించి యా
     తనికిన్ సెట్లకునున్ వచోరచనసంధానంబు గావించితిన్.183

వ. ఇట్లు చుట్టఱికంబు చేసి భీమధన్వు సంకలియ పుచ్చి యందఱుం
     గలం బెక్కి యనుకూలమరుత్ప్రసారంబున.184
క. పారావారముతీరము
     చేరిన తపనంతరంబ సెట్టులచేతం
     గారవమునఁ బూజలు గొని
     బోరన నాదామలిప్తపురవరమునకున్.185
చ. భీమధన్వుం గందుకావలిం దోడ్కొని వచ్చి వచ్చి నడుమ.186
మ. కొడుకుం గూఁతురుఁ బట్టువాసినఁ బరిక్షుభ్యన్మనోవృత్తియై
     యడవిం గూడు దొరంగిచాఁదివిరి పౌరానీకమున్ బంధులున్
     గడు శోకింపఁగ నున్నవాఁడు పతి నిక్కం బంచుఁ బెక్కండ్రు రే
     ర్పడఁ జెప్పంగ నెఱింగి కందువకుఁ జేరంబోయితిం బ్రీతితోన్.187
వ. పోయి.188
శా. చింతాభారపరీతచిత్తుఁ డగుచున్ జీవన్మృతుం డై మహీ
     కాంతుం డావులుఁ దానునున్నయెడఁ దత్కాంతారమధ్యంబునన్
     గాంతారత్నము నక్కుమారుఁ గడువేడ్కం జూపి యొప్పించి వృ
     త్తాంతం బంతయుఁ జెప్పితిన్ జనము లత్యాశ్చర్యమున్ బొందఁగన్.189
చ. విని మనుజేశ్వరుండు గడువేడుకతోఁ గొనియాడి నన్ను దో
     కొని పురి కేఁగి యాత్మసుత గోరికకుం దగ నిచ్చి రాజ్యముం
     జనవును నాఁడునాఁటికి నిజంబుగ నాపయిఁ బెట్టి రాజవ
     ర్తనమహనీయుఁ జేసె నుచితజ్ఞతఁ బ్రాజ్ఞులు పిచ్చలింపఁగన్.190

వ. ఇవ్విధంబున రాజ్యంబు వడసి దేవరం గొలువమియ కొఱంత
     గా నున్నంత సింహవర్మ పిలిచి పుత్తించిన సహాయార్థం బరుగు
     దెంచి దేవరచరణకమలంబులు గాంచి చరితార్థుండ నైతి
     ననవుడుం బ్రియం బంది యతనియాపత్సహిష్ణుతయును
     నాశ్చర్యకరమనోరథలాభంబును సంభావించి.191
మ. కమలాకేలినివాస మన్వయనవాకల్పంబు విద్యానిధా
     నము కారుణ్యసముద్భవస్థలము పుణ్యశ్లోకతాపాత్ర మా
     గమగోష్ఠీఘటనప్రదేశము కథాకల్యత్వసంపత్తివి
     శ్రమణస్థానము ధైర్యసీమ మనఘా రంభాత్మకం బిమ్మహిన్.192
క. ఆతులమనస్కుం డుజ్జ్వల
     వితతయశస్కుండు భవ్యవిధతేజస్కుం
     డతురౌదార్యుఁడు సుజన
     స్తుతగాంభీర్యుండు వినయధైర్యుం డెలమిన్.193
మాలిని. అమితమతివిలాసుం డర్థిమిత్రుం డదోషుం
     డమలచరితరూఢుం డప్రమేయుం డజేయుం
     డమదవికృతిగణ్యుం డద్భుతస్థైర్యధుర్యుం
     డమరపతిసమానుం డన్వయోద్ధారుఁ డుర్విన్.194
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రం బను మహాకావ్యంబునందు దశమాశ్వాసము.

  1. చయంబు
  2. ఇచట 'శూరమహీపతి దన్మతన్వయా' యని యుండ “సుహ్మపతి స్తుంగధన్వానామ' అను మూలమునకు విరుద్ధముగా నున్నందున సవరింపఁబడినది.
  3. ఈ పద్యములలోని కుండలీకృతభాగములు వ్రాఁతప్రతిలో శిథిలములు.
  4. యెడ నిమిత్తంబులు
  5. డిగి తెచ్చి
  6. వేయి
  7. వేఁడు
  8. తిరిచి
  9. ధూమిని
  10. ఈకుండలీకృతభాగము వ్రాఁతప్రతిలో లేనందునఁ బూరింపఁబడినది.
  11. గవ్వల
  12. పరివాద
  13. బింతులు వొందరే నరుల
  14. ఁబిలిచి
  15. గొఱుకున
  16. విని యొప్పరికింపక
  17. బ్రౌఢిమ
  18. యకటా, య
  19. ఒగి న
  20. యూరక