దశకుమారచరిత్రము/ఏకాదశాశ్వాసము

ఏకాదశాశ్వాసము


     శ్రీరమణీరమణీయమ
     హోరస్స్థ్లలవిజితకాంచనోర్వీధరవి
     స్తారితబలుండు ధర్మవి
     హారసముజ్జ్వలుఁడు తిక్కనామాత్యుఁ డొగిన్.1
వ. రాజవాహనమహీవల్లభుండు మంత్రగుప్తు మొగంబు
     చూచిన నతండు సగౌరవంబుగా ని ట్లనియె.2
ఉ. ఏను గళింగదేశమున కేగి కళింగపురంబుచేరువవ్
     మానితబిల్వసాంద్రవిసినంబునఁ బ్రేతవనంబుపొంత ని
     ద్రానిరతుండ నైనయెడ నచ్చట నొక్కరుఁ డొక్కకాంతతో
     నానడురేయి పల్కుపలు కల్లన యి ట్లని సోఁకె వీనులన్.3
ఆ. ప్రొద్దు వరుస మాలి సిద్ధులమందులు
     చిచ్చులోన వైచి సిద్ధి వడయఁ
     దొడరి యయ్యగారు దొసఁగులఁ బెట్టెడుఁ
     బోవవలయు నాకు నీవు నిలువు.4
వ. అనిన విని యే నుత్సుకుండ నై యాత్మగతంబున.5
ఆ. వార లెవ్వ! రిపుడు గోరెడుసిద్ధి దా
     నేమి? వేల్మి చంద మిపుడు వీని
     నేల పిలువఁ బంచె? నింతయు నెఱుఁగంగ
     వలయు నని తలంచి వానిపిఱుఁద.6
ఉ. అల్లన పోయి సాంద్రవిపినాంతరచారుశుచిస్థలంబునం
     దెల్లనివాలుగడ్డమును దీర్ఘజటాలియుఁ గ్రూరదృష్టులుం

     బల్లశరీరముం భసితపాండులలాటముఁ గల్గు తాపసుం
     డుల్లసితాగ్నికుండమున హెూమము చేయఁగఁ బొంచి చూచితిన్.7
క. ఆతపసి కింకరుండు వి
     నీతిమెయిన్ మ్రోల నిలిచి నిటలతటమునం
     జేతు లిడి మ్రొక్కుటయు నవి
     నీతుం డై యతఁడు పలికె నిష్ఠురవృత్తిన్.8
ఆ. ఈకళింగనగర మేలెడు కర్టను
     నంతిపురము చొచ్చి యతనితనయఁ
     గనకరేఖఁ బట్టికొనిరమ్ము పొమ్మన్న
     నరిగి కింకరుండు నాక్షణంబ.9
శా. హాహాకారము లుద్భవిల్ల నొకకన్యారత్నముం దెచ్చె దు
     ర్మోహాంధుం డయి క్రూరతాపసుఁడు సాముచ్యత్కృపాహీనుఁ డై
     స్వాహాకారము గూర్పఁగాఁ దలఁచి యుత్సాహం బొనర్పంగ నే
     నాహోమాగ్నిశిఖాలి కాజటిలు నాహారంబు గావించితిన్.10
ఉ. కింకరుఁ డంత నాకుఁ గడుఁ గీడ్పడి సిద్ధికిఁ గా నతండు ని
     శ్శంకత నిజ్జగంబున నృశంసపటం బొగిఁ గట్టి దుష్క్రియా
     లంకృతుఁ డై యనేకవిధులం దరుణీవధ సేయుః గాన నా
     కింకకు నేఁడు లోఁబడియెఁ గిల్బిషవంతున కింత పెద్దయే.11
క. రేయుం బగలును నతనికిఁ
     బాయక పనిచేసి యిడుమఁ బడి విసివినచో
     నాయొద్ది కిష్టదైవము
     డాయఁగ నినుఁ దెచ్చి సంకటము బెడఁబాపెన్.12

క. పనుపుము పనిచినపని గ్ర
     క్కునఁ జేసెద ననిన నేను గోమలి మగుడం
     గొనిచని యెప్పటిచోటన
     యునుపుము నా కిదియ వేడ్కయుం గార్యంబున్.13
చ. అనవుడు రాజపుత్రి గళితాశ్రుల వక్త్రము దోఁగ సంభ్రమం
     బునఁ బ్రణమిల్లి యి ట్లనియెఁ బొచ్చెము లేని దయాగుణంబునన్
     నను ననలంబులోనికి జనం జోరకుండంగఁ గాచి యిప్పు డే
     మని మదనానలంబునకు నాహుతి చేసెదు జీవితేశ్వరా!14
ఆ. ఏడుగడయు నీన యెచటికి నరిగిన
     నీకు నేను దోడినీడఁ బోలి
     తగిలి వచ్చుదాన దయతోడ ననుఁగొని
     పొమ్ము పోకచూడఁ బోలదేని.15
క. చెలులుం బరిచారికలుం
     గలరు తలంపులకుఁ దగిన కార్యము లెల్లం
     దలకొని చేయఁగ నీ వి
     మ్ముల మద్గృహమునకు రమ్ము మోదం బెసఁగన్.16
మ. అని నెయ్యం బొడఁగూడఁ బల్కుటయు రాగావేశ మేపార న
     వ్వనితారత్నము చూచుచున్నఁ గని భావజ్ఞాని యై కింకరుం
     డనుమానింపక రండు లెం డనుచు బాహాశక్తి శోభిల్లఁగా
     వినువీథిం గొనిపోయె మమ్ము హృదయావిర్భూతహర్షంబుతోన్.17
క. ఆకింకరునకుఁ బూజ ల
     నేకవిధంబుల నొనర్చి యీమే లెంతే

     నీకతమున మా కిప్పుడు
     చేకుఱె నని గౌరవించి చిత్తం బలరన్.18
వ. అతనిం బుచ్చి యనంతరంబ.19
శా.ఆలీలావతి గ్రక్కునం జెలుల డాయం బోయి మేల్కొల్పి మం
     దాలాపంబుల నంతయుం దెలిపి కన్యాగారగూఢస్థలిం
     గేలీమజ్జనభోజనాదివిధు లక్లేశంబునం జెల్లున
     ట్లాలోకించి తగంగ న న్నునిచె ని ట్లత్యంతమోదంబునన్.20
వ. విచ్చలవిడి విహరించుచున్నం గొన్నిదినంబులకు వసంతా
     గమం బగుటయు వనక్రీడాలాలసుం డై కర్దనుం డంతః
     పురకాంతాసమూహంబును దుహితయుం దత్సఖీజనంబులు
     వినోదసముచితపరివారంబును దానునుం బయోధివేలావన
     భూమికిం జని తత్ప్రదేశంబున బహుదివసంబులు కేలి
     సలుపుచున్న సమయంబున.21
సీ. ఆంధ్రదేశాధీశుఁ డగు జయసింహుండు
                    ప్రతిభటుం డగుట రంధ్రంబు వేచి
     బరిమితపరిచారపరిగతుఁ డని తన
                    వేగులు చెప్పిన వివిధయాన
     పాత్రముల్ సమకట్టి బలములుఁ దానును
                    వారాశిలోఁ జొచ్చి తీరభూమి
     డిగ్గి మోహరములు డిగ్గనఁ దీర్చి కం
                    పితమహీతలుఁ డయి బిట్టు మండి
తే. లీల నేమఱియున్న కళింగవిభునిఁ
     గామినీజనసహితంబు గాఁగ [1]నడఁగఁ

     బట్టి కలములలోపలఁ బెట్టికొని స
     మగ్రమదగర్వ మొప్పంగ మగుడ నరిగె.22
వ. ఇట్లు కర్దనుండు పగతున కగపడిన నరాజకం బయ్యునుం
     దదీయరాజ్యం బమాత్యమంత్రిభృత్యచాతుర్యంబులవలన
     (సురక్షితం బయ్యెఁ) జతురంగబలబాహుల్యంబు నొంద
     కయు నమాత్యుండు దానోపాయనంబుల నయ్యాపదకుం
     బ్రతివిధానం బాచరించుచుఁ గడప నట్టిసమయంబున.23
ఆ. కనకరేఖఁ గేలి కనిచినయది యాది
     గాఁగ నాకుఁ గన్యకాపురమున
     నుండరామి వీట నొండువేషంబునఁ
     దిరుగుచుండి యెల్లఁ దెలియ నెఱిఁగి.24
వ. ప్రియావియోగసంతాపం బంతరంగంబునకు దుస్సహం
     బగుటయు.25
ఉ. ఆజయసింహుపట్టణమునం దొకచందమునం జరించి యం
     భోజదళాక్షి నెట్లయినఁ బొందుదుఁ బొమ్మని యుత్సహించి పోఁ
     గా జటిలుం డొకం డెదురుగాఁ జనుదెంచిన నేను మార్గధా
     త్రీజమునీడ నాతని నతిప్రియభావన బిల్చి నెమ్మితోన్.26
వ. పథశ్రమాపనోదనార్థం బయ్యెడ నాసీనుండ నై యుండి
     తదాననం బాలోకించి.27
క. దేశాంతరవర్తనముల
     కౌశలములు [2]గలుగు లెక్క గలిగినయది; యే

     దేశముననుండి యిట యే
     దేశమునకు నరిగె దీవు తెల్లము చెపుమా!28
వ. అనవుడు.29
ఆ. ఆంధ్రదేశనృపతి యగు జయసింహుని
     పురములోననుండి పోవుచున్న
     వాఁడ గౌడభూమి వర్తించువేడుక
     ననిన నిట్టు లంటి నతనితోడ.30
క. ఆదేశంబున నెప్పుడు
     వైదేశికపూజనములు వర్తిల్లునె? ధా
     త్రీదేవుఁడు ధర్మిష్ఠుఁడె?
     యాదేశము తెఱఁగు చెప్పు మంతయు నాకున్.31
వ. అనిన విని యతం డి ట్లనియె.32
ఆ. భూమి లెస్స రాజు పూర్వులతో డిడ
     మేలు వీటిలోన మెలఁగునప్పు
     డేను శుద్ధి గాఁగ నెఱిఁగిన క్రొత్తయుఁ
     గలదు ధరణినాథువలన నొకఁడు.33
చ. అతఁడు కలంబు లెక్కి చని యక్కడ నేమఱియున్న వైరిభూ
     పతి కడు బిట్టు ముట్టికొని భామలతోడన పట్టి తెచ్చిత
     త్సుత దెస సక్తుఁ డై కవయఁ జూచిన రేఁగి తదీయగాత్ర సం
     శ్రితుఁ డగు బ్రహరాక్షసుఁడు చేరఁగనీడు మహెగ్రచేష్టలన్.34
ఉ. దాని నెఱింగి మంత్రములు తంత్రములున్ జపముల్ తపంబులున్
     దా నొనరింపఁబంచె వివిధక్రమశాంతికపూర్వకంబుగా
     దానము లెల్లఁ జేసి విదితంబుగఁ గల్పము లెన్ని యన్నియుం

     దే నియమించి చూచుచుఁ దదీయవిధానము లాచరించుచున్.35
తే. బ్రహ్మరాక్షసుఁ డింతిపైఁ బాయకున్న
     మంత్రవాదుల వెదకుచు మందు లెఱుఁగు
     వారిఁ దడవుచుఁ గనుకలి వంతఁ జింత
     నొంది యిడుమలు గుడుచుచు నున్నవాఁడు.36
వ. అనిన విని యిది యంతయుఁ గనకరేఖకపటం[3]బుగా నెఱింగి
     యాత్మగతంబున.37
క. యువతీరత్నము చెలువున
     దవిలి వివేకంబుచొప్పు దప్పిన జయసిం
     హవిభునిఁ గుటిలోపాయత
     నవశ్యముం జెఱుతు నే ననాయాసమునన్.38
వ. అని నిశ్చయించి సముచితసల్లాపంబుల వెండియుం గొండొక
     సేపు గడపి యాజియ్య వీడ్కొని యరిగి యాకారంబు
     వే ఱగునట్లుగా నైపుణ్యంబునం దాపసవేషంబు దాల్చి
     కొందఱు శిష్యులం గూర్చుకొని యేనును వారునుం బర
     మాస్తికజనమధ్యంబున సుఖుల మై నడచి యంధ్రనగరంబు
     చేరువకరిగి తత్ప్రదేశంబున నొక్కకొలనికడం బర్ణశాలఁ
     గావించుకొని యందు వసియించి.39
క. నైష్ఠికభావన వివిధా
     నుష్ఠానంబుల మహీజనులు మేడ్పడ ధ
     ర్మిష్ఠాధిష్ఠుఁడ నగుచుఁ బ
     టిష్ఠుఁడ నై సలిపితిం గడిఁది యగుభంగిన్.40

వ. అట్టియెడ మదీయశిష్యులు పురంబునం గలయ మెలంగి.41
ఆ. ఇతఁడు పూర్వమునుల కేమిటఁ దక్కువ
     యతులబోధమున మహానుభావుఁ
     డద్భుతావహంబులైన శాపానుగ్ర
     హంబు లరయ నితనియందుఁ గలవు.42
క. పెక్కెడలఁ జూచితిమి మే
     మక్కజముగ వీరిఁ గొలిచి యభిమతసిద్ధిం
     గ్రక్కునఁ బడయుదు రీక్రియఁ
     ద్రక్కొని ఘటియించె నీచదశ నొందంగన్.43
వ. అనుచు మఱియు ననేకప్రకారంబుల నన్నుం బ్రశంసించుచు
     మత్పరత్వసకలజనసమానీతసమస్తవస్తువు లనుభవించుచు
     నేను సమలోష్ఠకాంచనత్వంబు భావించుకొని యున్నం
     గర్ణపరంపరాప్రాప్తంబైన యస్మదీయవిఖ్యాతివిశేషంబునకు
     బేలువడి భూపాలుండు నాకడకుం జనుదెంచి దండప్రణా
     మంబు చేసి చేతులు మొగిచి నిలిచి.44
క. మునినాథ! నీమహత్త్వము
     విని యభిమతసిద్ధి వడయు వేడుకతోడం
     జనుదెంచితి ననుఁ గరుణం
     గనుఁగొను మని వినయనమ్రగాత్రుం డయ్యెన్.45
వ. ఏనును వానికొలంది యెఱింగి తద్గుణకథనంబు నెపంబుగా
     మదీయవర్తనంబందు గురుత్వబుద్ధి పుట్టింపందలంచి యిట్లంటి.46
మ. బహుదేశంబులు [4]చొచ్చుచున్ బహుతపఃప్రౌఢిం బ్రతిష్టించుచున్
     బహుతీర్థంబుల కేగుచున్ బహుగుణభ్రాజిష్ణులం జూచుచున్

     బహుసంవత్సరముల్ చరించితిమి భూపాలాగ్రణీ! కాన మి
     మ్మహి నిట్టినరేంద్రు ధర్మమహిమన్ మానజ్ఞతం బ్రాజ్ఞతన్.47
క. కావున నభిమత మెల్లను
     గావింపఁగ నాకుఁ గౌతుకము పుట్టెడు నీ
     భావగుణంబగు కోర్కి మ
     హీవల్లభ! యెఱుఁగఁ జెప్పు మిప్పుడ తీర్తున్.48
వ. అనిన నతండు కామాతురుం డగుటం జేసి లజ్జ యుజ్జగించి
     యి ట్లనియె.49
క. మునినాథ! వినుము నే నొక
     వనితారత్నంబుఁ జూచి వలచితిఁ దనుఁ బ
     ట్టిన బ్రహరాక్షసునికత
     మున మెయికొన దదియు సంగమున కెబ్భంగిన్.50
ఉ. కావునఁ దత్సమాగమసుఖంబు మనంబునఁ గోరికోరియున్
     భావజుబాణజాలముల పాల్పడి వెజ్జుల మంత్రవాదులం
     వేవురఁ గూడఁ బెట్టియును వేల్పుల గొల్చియు బ్రహ్మరాక్షసుం
     బోవఁగఁ జోప నేరక తపోధనవల్లభ! నిన్నుఁ జేరితిన్.51
క. అనవుడు ని ట్లని పలికితి
     మనుజేశ్వర! మంత్రతంత్రమాహాత్మ్యమునం
     దనుమధ్యకు నీకును బొం
     దొనరించెద భావభవున కోడకు మింకన్.52

వ. అది యె ట్లం టేని రూపసిద్ధి యను నొక్కమంత్రంబు బ్రహ్మ
     రాక్షసభయంకరం బగు రక్షామణియు నీ కిచ్చెదఁ దన్మం
     త్రాభిమంత్రితంబైన యిక్కొలనిజలంబు నిష్కంటకంబుగా
     దర్వీకరమకరగ్రాహాదిదుష్టసత్వసముద్ధరణంబు సేయించి
     యాగామిశుక్లపక్షద్వితీయదినంబు నుపవసించి రక్షామణి
     లాంఛితశిరస్కుండ వై శశికళాసందర్శనంబు చేసి సప్త
     ఘటికానంతరంబ యష్టోత్తరసహస్రకరదీపికాపరివృతుండ వై
     యియ్యెడకుం జనుదెంచి పదశతత్రయమాత్రస్థాపితపరి
     వారుండ వై విలాసాలోకనంబును నపనయించి మంత్రపుర
     స్సరంబుగా సరోవరంబు చొచ్చి మునింగి యున్నభంగిన
     యూర్పు నిలుప నయ్యెడునంతసేపుం జపియించి పరిభూత
     మన్మథాటోపంబగు రూపంబు దాల్చి తదనంతరంబ నిజ
     గృహంబునకుం జని.53
క. ఇతరులతోఁ బలుకక య
     య్యతివకుఁ బొడచూపి పలుకు మంతటఁగోలెం
     బ్రతిదివసము రతిపతికిని
     రతిక్రియ నమ్మగువ నీకు రాగ మెనర్చున్.54
మ. ఇది నీకుం బ్రియమేని ప్రెగ్గడలతో నేకాంత మూహించి యొ
     ప్పిద మై యుండఁగ నాచరింపు మనుడున్ బేల్పాటు చిత్తంబునం
     దొదవన్ సమ్మద మొంది యియ్యకొని మాయోపాయజాలంబులం
     బొదువం బడ్డ నెఱింగి యాత్మముద ముప్పొంగంగ నే వానితోన్.55
వ. మఱియు ని ట్లంటి.56

ఉ. నీవు సధర్మవర్తి వని నీ కొక మే లొనరింపఁ గోరియే
     పోవన కాని యిప్డు పరభూములఁ గ్రుమ్మరుచున్న యట్టి నా
     పోవుట నిల్చు నిట్టి దొకపొం దని లేదది యట్ల యుండె స
     ద్భావముతోడ నొక్కమరి భక్తిఁ దలంపుము మమ్ము నిచ్చలున్.57
వ. అని పరిజనుల నవలం బొమ్మని యతని డాయం బిలిచి
     మంత్రాకారంబులుగాఁ గొన్ని కపటాక్షరంబు లుపదేశించి
     యంతకుమున్న ఘటించియున్న యొక్క జిలిబిలిరక్షపూసయు
     నిచ్చినం గృతార్థీభూతమనస్కుం డై నమస్కరించి మునీం
     ద్రా! నన్నుం గొలువుగొని మీ రిందు నిలుచుట మా
     కెల్ల పురుషార్థంబులు నని ప్రార్థించిన మా కంతపట్టునకు
     భాగ్యంబు గలిగి యి ట్లయ్యెం గాని మావర్తనంబు గ్రామైక
     రాత్రం బై యుండు ననిన నట్లన యగు నని మగుడం బలికి
     వీడ్కొలిపినం జనియెఁ బదంపడి గతాగతజనంబులవలన
     నతండు మంత్రిపురోహితసహితంబుగా నిక్కార్యంబు సేయ
     నిశ్చయించు టెఱింగి నాచెప్పిన దినంబునకు ముందటినాఁటి
     నిశాసమయంబున.58
క. ఏనును మదీయశిష్యుల
     లోనుగ వంచించి కొలనిలోపల నుండన్
     మానిసి కుండఁగ నయ్యెడు
     మానముగాఁ దటమునం దమర్చి తగంగన్.59
వ. ఉపద్వారంబు సూక్ష్మంబుగాఁ గల్పించి యవ్వేకువన నతి
     దూరంబగు నొక్కతీర్థంబునకుం బోవు నెపంబున శిష్యుం
     గొనిపోయి గవ్యూతిమాత్రంబునం గాననంబులోనం గాడు

     పఱచి తొలంగి యొండుజాడ మరలివచ్చి కొలను సొచ్చి
     వేషోపకరణంబు లడంచి యాయితం బై యుండి.60
మ. సమయం బైన నృపాలుఁ డస్మదుపదేశప్రక్రియం బద్మషం
     డమునం గ్రుంకుట చూచి బిట్టడరి యంటం బట్టి కంఠంబు పా
     దమునం జిక్కఁగ నూఁది [5]యంతఁ దనువున్ ద్వంద్వంబుగాఁ జేసి ప్రా
     ణములం బాసిన మేను బొక్క నిడి యానందంబునం గప్పితిన్.61
వ. ఇట్లు జయసింహుని సమయించి కొలను వెలువడి తదీయాం
     బరభూషణాదులు ధరియించి యల్లన పరిజనంబు లున్నపరి
     సరంబున కరిగి నివ్వటిల్లు దివియలు వెలయించిన.62
ఉ. అచ్చెరుపాటు నొందు హృదయంబులతోఁ బరివార మంతయున్
     వచ్చి కనుంగవల్ విరియ నాకు మహీస్థలిఁ జాఁగి మ్రొక్క నే
     నచ్చట సస్మితాననమునాకృతి వారల నాదరించి వా
     క్రుచ్చి యొకండుఁ బల్కక నిరూఢమహానియముండ పోలె నై.63
చ. నగరికి నేఁగి వాఁడినయనంబుల నందఱ వీడుకొల్పి వా
     సగృహముచొచ్చి యంతిపురిభామలు విస్మితలోచనప్రభల్
     మిగులఁగఁ జూచుచోఁ గనకరేఖఁ గనుంగొని దానితోడఁ ద
     న్పుగ నొకపల్కు పల్కి మునుపొల్తులకుం బుయిలోట పాయఁగన్.64
వ. మనోహరాకారలాభకారణంబునకుం దగినయాలాపంబులం
     గలపికొని కొంత సేపు వారలనడుమ నిలిచితి నట్టియెడం
     గర్దననందన సందేహాందోళితం బైన డెందంబుతోడ నన్ను
     నిరూపించుచుండె నేనును సాభిప్రాయంబులు సవిస్మితం

     బులు సవ్రత్యభిజ్ఞానంబులు నగు నవలోకనంబుల నయ్యంబు
     జానన యనుమానంబు వాపినం గొండొక యలరుచుండియు
     వితర్కంబుతోడి యచ్చెరుపాటునం బొరయుచుండం
     గరకిసలయంబు సరసంబుగాఁ బట్టికొని యేకాంతగృహంబు
     నకుం దోడ్కొనిపోయి.65
క. అల్లనిమాటల నంతయుఁ
     దెల్లంబుగఁ జెప్పి కలపు దెలిపి మనములన్
     వల్లగఁ గనుకలి గలసి స
     ముల్లాసము నొంది యచట నువిదయు నేనున్.66
ఆ. నగరివర్తనంబునకు నంతిపురముసుం
     దరుల తెఱఁగునకును బరిజనముల
     నడపుటకును నాదునడవడి యిట్లని
     నిశ్చయించి నెమ్మి నిద్ర చేసి.67
క. మేలుకని ప్రొద్దుపొడుపునఁ
     గాలోచితవిధులు సలిపి కాంతాకల్ప
     శ్రీలసితుఁడ నై సమ్మద
     లీలం గరి నెక్కి వైహళికిఁ జని యచటన్.68
ఆ. ఉచితవర్తనముల నొక్కింతవడి నిల్చి
     మరలివచ్చి సకలపరిజనములు
     బలసి కొలువఁ బెద్దకొలువున నుండి మం
     త్రులకు నిట్టు లంటి నెలమితోడ.69
ఉ. కోరిక నిట్లు కర్దనునికూఁతుఁ బ్రియాంగనఁ గా నొనర్చితిం
     గారణబాంధవం బలర గ్రక్కున నానృపు నాత్మరాజ్యవి

     స్తారకు (గా నొనర్చి నిజధాత్రికిఁ బంచుట నీతి గాన మీ
     కోరికపద్ధతిం దెలియఁ గోరితి నావుడు వార లీకొనన్.70
క. ఘనమతితో నప్పుడు క
     ర్దనునిన్ రావించి నీదు రాజ్యమునకుఁ) బొ
     మ్మనుమాట బ్రియ మొనర్చితి
     వినుతాంబరభూషణాదివితరణములతోన్.71
వ. పదంపడి కనకరేఖచేత నతనికి నాక్రమంబును సాధకక్రూర
     కర్మకౌశలంబును ముదితగాంధర్వపరిణయప్రకారంబును
     జయసింహు నెడం జేసిన వైచిత్రియుం జెప్పి పుచ్చి కలపి
     కొని యతనిం గళింగనగరంబున కనిచి రెండురాజ్యంబులు
     నొక్కటిగాఁ బాలించి భవత్పాదోపకంఠసంవాససౌఖ్యంబు
     దొఱకొనుతెఱంగు చింతించుచున్నంత సింహవర్మ సహా
     యంబు గోరి పుత్తించినం జనుదెంచి మనోరథసిద్ధిం బొందితి
     ననిన విని రాజహంసనందనుం డభినందించి.72
తే. మంత్రగుప్తు పరాక్రమమహిమ గుప్త
     మయ్యు నియ్యెడఁ బ్రఖ్యాత మయ్యె ననుచు
     విశ్రుతుని మోము చూచి నీవిధము చెప్పు
     మనుడు నాతండు భక్తి ని ట్లనియెఁ బతికి.73
ఉ. ఏనును వింధ్యకాననమహిం గలయ న్నిను రోసి గ్రమ్మఱం
     గా నొకచోట నూతిదరిఁ గన్నులనీళుల మోముఁ గప్పుచున్
     హీనదశార్తు డేడెనిమిదేఁడుల ప్రాయమువాడు పెద్దయుం
     దీనత నొంది నన్ గని యధీరత నిట్లని పల్కె వెక్కుచున్.74

ఉ. తానును నేను నియ్యెడఁ బథశ్రమఖేదముఁ బొందినీరువ
     ట్టూనిన నిల్చి చేఁద గొని యొయ్యన నీటికిఁ జేరి దానితో
     నానతుఁ డై పదద్వితయ మల్లల నాడ వడంకి వార్ధకా
     ధీనశరీరతం దెమలి త్రెళ్ళె నొకం డిదె నూతిలోపలన్.75
ఆ. ఇతనిఁ దిగువ లావు నే డ్తెఱ లేకున్న
     దిక్కుమాలి యిచటఁ జిక్కియున్న
     వాఁడ నిన్నుఁ గనిన వచ్చెఁ బ్రాణంబు శీ
     ఘ్రమున వెడలఁ దిగిచి కాపవయ్య!76
క. అని కరుణ పుట్ట వేఁడిన
     విని యొకబలు దీవఁ డిగ్గ విడిచిన నావృ
     ద్ధును నద్దెస మొల నిరియం
     చిన వెరవును లావు మెఱయఁ జేఁదితి వెడలన్.77
వ. ఇవ్విధంబున వెడలం దిగిచి బ్రదికించి కొంకిగల నిడుపు
     వెదురునం జ్యేద [6]పుచ్చి నీరు దిగిచి యబ్బాలుని డప్పి
     దీర్చి సాంద్రతరుచ్ఛాయాశీతలసికతాతలంబున నయ్యిరు
     వుర సునిచి పాషాణనిపుణపతితంబులైన వన్యఫలంబుల
     వారియాకలి దీర్చి యేనును జలపానఫలఖాదనంబునం బథ
     శ్రమం బపనయించి వారల చేరువ సుఖాసీనుండ నై తదీయ
     యోగక్షేమం బావృద్ధు నడిగిన నతండు సవిస్తరంబుగాఁ
     జెప్పెద విను మని యి ట్లనియె.78
ఉ. నీతివిదుండు వైరిధరణీపరభీకరశౌర్యుఁ డార్యసం
     ప్రీతి(వి)ధాశరీరుఁ డధరీకృతకల్పతరుండు రూపవి

     ఖ్యాతుఁడు ధర్మవర్మ యనఁగా నొకరాజు విదర్భరాజ్యసం
     స్ఫీతవిభూతి మైఁ గరము పెంపు వహించె నృపాల[7]కోటిలోన్.79
తే. జనుల భాగ్యదినంబులు చనినయట్ల
     యతనిదినములు చనుటయు నమరపురికి
     నరిగెఁ దత్సూనుఁడైన యనంతవర్మ
     రమణఁ బట్టంబుఁ గట్టె సామ్రాజ్యమునకు.80
క. అసమానబుద్ధివైభవ
     లసితుఁడు నృపనయవిచారలంపటుఁడు జన
     వ్యసనహరుఁడు గలఁ డొక్కఁడు
     వసురక్షితుఁ డనఁగ మంత్రివర్యుం డతనికిన్.81
వ. అయ్యమాత్యుండు తజ్జన్మసంభావితుండు గావున శిక్షకు
     నొడయం డగుటం జేసి యొక్కనాఁడు సముచితసమయం
     బున నమ్మహీవల్లభున కి ట్లనియె.82
చ. కులమును బెంపుఁ దేజము నకుంఠితబుద్ధియుఁ జారుమూర్తియుం
     గలిగి రసోజ్జ్వలంబులగు కార్యములం గొనియాడనేర్చి శ
     త్రులకు భయంకరం బయిన దోర్బలసంపద నుల్లసిల్లి స
     త్కళలఁ బ్రసిద్ధి బొంది నుతి గాంచితి వీవు మహీతలంబునన్.83
ఆ. వినుము రాజనీతివిద్యతాత్పర్యంబు
     చాల కునికి పూర్ణచంద్రులోనఁ
     గానవచ్చుచున్న కందున ట్లున్నది
     నీకు నిదియ కొఱఁత నృపకుమార!84

చ. సృపనయహీనుఁ డైన ధరణీపతి రాజ్యవిభూతి చూడఁగా
     నపగతవాతవారణక మైనయెడ న్వెలుఁగొందు దీపరే
     ఖపగిది నిప్పు డప్పు డనఁగాఁ జలితస్థితి నుండు నీతిసా
     రపరమనస్కుఁడైననృపురాజ్యము సుస్థితిఁ బొందు నారయన్.85
వ. కావున.86
తరువోజ. ఖ్యాతవిద్వజ్జనగ్రాహ్యంబులైన కామందకము లోనుగాఁ గలయట్టి
     నీతులు విని తజ్జనికరంబుతోడ నిష్ఠమై సద్గోష్ఠి నిచ్చలుఁ జేసి
     యాతదర్థం బెల్ల నభ్యాసవృత్తి నంతరంగంబున నలవడ నిలిపి
     యా తెరు వొంది కార్యాకార్యవేది వై మేదినీచక్ర మంతయు నేలు.87
వ. అనిన విని యవనీశ్వరుం డప్పులుకు లభినందించినవాఁ డై
     సముచితసంభాషణంబుల సంభావించి పుచ్చి తనకు బాల
     సేవకుండునుం బరిచయవిస్రంభస్థైర్యవచనుండును సంగీత
     విదుండును నంగనాకార్యనిర్వహణనిపుణుండునుం జిత్తాను
     వర్తనకుశలుండును సవినయోసాధ్యాయుండును నైన
     విహారభద్రుండను నర్మసచివుండు తోడనె చనుదేర నంతః
     పురంబున కరిగి తరుణీజనంబులు గొలువ నున్నయెడ వాఁడు
     కొండొక నగుచు నమ్మంత్రి మాటలు కొంతగాఁ బ్రసంగించి
     యి ట్లనియె.88
క. ఎలమిగల లక్ష్మి యొకనికిఁ
     గలిగిన నది పంచి కుడువఁగాఁ గూడి యనే
     కులు పెక్కుభంగులం గలి
     బిలి సేయుదు రతనిమనసు భేదించి తగన్.89

వ. అది యె ట్లం టేని కొందఱు శ్రౌతస్మార్తవిదు లనం బరఁగిన
     డాంబికులు.90
చ. అలఘుమహేంద్రలోకసుఖ మందఁగ సాధన మంచు గ్రక్కునం
     దల గొఱిగించి తో లొకటి దాల్పఁగ వెన్న యలంది యన్నమున్
     జలము దొరంగఁగా ధరణిశయ్యను నిద్ర యొనర్పఁ బంచి యా
     కులపడఁ జేసి యర్థములు గొండ్రు మనంబులలోన నవ్వుచున్.91
క. జర పొందిన దొరకొన దని
     వెరవు కలిగి విషయసుఖము వెదకెడువానిం
     గరము విదగ్ధత నెడ కొని
     మరులు గొలిపి చొచ్చి కొలిచి మంత్రుల మనుచున్.92
తే. అర్థములు పూర్ణములు గా నుపార్జనంబు
     చేయు విధమును బరుల నిర్జించు తెఱఁగుఁ
     దెలియఁ జెప్పెద మది శాస్త్రదృష్టిఁ గాని
     యెల్ల నెఱుఁగంగరా దని యియ్య కొలిపి.93
క. ఒకపొత్తము మెడఁ దగిలిచి
     సెక లాయువునంద పోవ జీవింతురు వా
     రక మగునంతకుఁ జదివిన
     జకితత్వముఁ గుటిలతయు నిజంబుగఁ బొందున్.94
ఆ. ఆర్జవంబు విడిచి యాలిని బిడ్డను
     నైన విశ్వసించు టాత్మ నుడిగి
     సుఖము లెల్లఁ దొరిఁగి సొలవక కృపణుఁ డై
     యునికి నేర్పు గాఁగఁ గొను నతండు.95

వ. ఇట్టివి శాస్త్రాభ్యాసంబునకు ఫలం బని చెప్పి వెండియు
     ని ట్లనియె.96
క. పోకలఁ బోయిన నృపతి య
     నేకము లొసఁగంగ మాట లింపుగ నాడన్
     లోకము మన్నింపంగాఁ
     జేకొన రది కృత్రిమంబ చేయుదురు జనుల్.97
క. తనయెడ విశ్వాసము భూ
     జనులకు లేకుండె నేని జగతీశుఁడు పె
     ట్టినబిరుదున కనుమతి గలి
     గినఁ జిరకాలంబుమనికికిం గీ డొందున్.98
ఉ. ఎంతటఁ జేసి వర్తనము జెల్లను జెల్లుఁ గొఱంత లేక తా
     నంతటినీతి లోకమునయంద కడుం దెలియంగవచ్చు న
     త్యంతమనోవ్యథావహము లై చను శాస్త్రము లభ్యసించి య
     శ్రాంతముఁ ద్రుళ్లి పడ్డనవిచారముగల్గినయట్టివాఁ డగున్.99
క. తనబుద్ధిఁ గాదె? బాలుఁడు
     జననిఁ బ్రసన్నాత్మఁ జేసి చన్నిచ్చువిధం
     బునకుం జేర్చుం దగ నె
     వ్వనితో నేచదువు చదివె వాఁడుం బెంపన్.100
క. సిరి గలయప్పుడె దుఃఖముఁ
     బొరయక సంతతసుఖంబుఁ బొందు విమూఢే
     తరుఁ డటు చేయక బేల కు
     పురుషుం డాదినము లవధిఁ బుచ్చుచు నుండున్.101
క. కావున వలవని యంత్రణ
     లేవియుఁ జొరనీక మనము నెంతయు సుఖినిం

     గావించుకొని యనూనము
     దావహభోగములు సలుపు మవనీనాథా!102
వ. అనిన విని వనితాజనంబు లెల్ల నివి యిట్టివియ యని మోదం
     బు చేసి అనంతవర్మయు నలరిన మొగంబుతోడ నద్దురాలా
     పంబులు పరమహితంబులుగాఁ గైకొని రాజనీతిశాస్త్రా
     భ్యాసంబులకుం దదనుచారనియతాచారంబులకును విము
     ఖుం డై యాధూర్తునిమ(ది ననుసరించి) వర్తిల్లుచుండు.103
చ. అరయఁగ రాజ్యవర్తన మహర్నిశమున్ విషయోపభోగత
     త్పరమతి యై వినీతిఁ బరిపాలన సేయఁడు మంత్రి దీనికిం
     బురపురఁ బొక్కి చెప్పుతగుబుద్ధులఁ బిమ్మట గేలిసేసి యా
     వెరవిఁడి మన్మనోగతికి వీఁడు వినం డని [8]యాడు నేర్పునన్.104
ఆ. అతఁడు నతనియింగితాకారచేష్టల
     నతివిరక్తుఁ డగుట యాత్మ నెఱిఁగి
     మాటఁ బడఁగవలదు మౌనవ్రతంబున
     నునికి దక్క నీతి యొండు లేదు.105
క. దీన నొకకీడు దోఁచిన
     నైనను మన ముడిగి మన్మతానుసరణముం
     బూనెడునంతకుఁ జెప్పఁగ
     నే నోపం దొలఁగవలయు నెల్లవిధములన్.106
వ. అట్లుగాక స్నేహపారవశ్యంబున నతనికి మాఱుపలుకు
     చుండితి నేని భంగంబు వచ్చు నితండును సన్మార్గంబున నడ
     చినవాఁడునుం గాఁ డని చేయునది లేక యూరకుండె నన్నర
     పతియును స్వైరబహుళనిరతుం డైనట్టి సమయంబున సమీ

     పదేశాధీశుండును బహుగోసాయపారిణుండును నగు
     వసంతభానుం డను రాజునమాత్యుం డింద్రపాలితుండనువాని
     తనయుండు గూఢకృత్యపాటవపారీణుండు చంద్రపాలితుం
     డనువాఁడు పతియనుమతంబునం దనకపటనీతిప్రయోగం
     బునకు వలయుపరివారంబును దానునుం దండ్రి వెడల
     నడిచిన వచ్చినవాఁ డై విదర్భనగరంబున కరుగుదెంచి విహార
     భద్రుంగని యతండుం గార్యసహాయుండు గా ననంత
     వర్మం గొలిచి.107
క. నూతనకేలీవిరచన
     చాతుర్యంబున మనఃప్రచారానుగతిం
     బ్రీతికరుం డై యాదు
     ర్జాతుం డవనీశుఁ దనవశంబుగఁ జేసెన్.108
వ. ఇట్లు పరమాప్తుం డై యాయాసచ్ఛేదనస్నేహత్వంబును
     మేదోహీనతయును [9]నుత్ఖాతనపరత్వదేహంబును నాదిగాఁ
     గలకొన్నిగుణంబు లగుట చూపి మృగయావ్యాపారంబుల
     యందును నిపుణతాప్రకటంబునుం జతురకాలయాపనంబును
     ధనాగమంబును నాదిగాఁ గల కొన్నిగుణంబు లగుట చూపి
     దురోదరక్రీడలయందును నారోగ్యంబును వీరరససంధుక్ష
     ణంబును సౌమనస్యంబును ధాతువృద్ధియు నాఁ దగు
     కొన్నిగుణంబు లగుట చూపి మద్యప్రకారంబులయందును
     నంగరాగమాల్యాభరణమాంగల్యంబును ననితరసులభా
     నందంబు నాదిగాఁ గొన్నిగుణంబు లగుట చూపి యంగనా
     సంగమవిహారంబులయందునుం [10]గుతూహలంబుఁగా జేయుచు

     జనంబులు జడుం డవహితుం డకృపణుం డనకుండవలయునట్టి
     వాక్పారుష్యదండార్థదూషణంబులవలనం బ్రవీణుం డగు
     నట్లునుం గావించె.109
క. వ్యసనపరుం డై భూపా
     లసుతుఁ[11]డు సంతతము నధికలౌల్యంబున వే
     డ్క సలుపఁ దొడఁగెఁ బ్రజయుఁ ద
     ద్రసానుభవకౌతుకమున రాజుం బోలెన్.110
క. నరు లెల్ల దుర్నయంబునఁ
     దిరుగుట నొండొరులకీడు దెలుపంగా నె
     వ్వరు లేమి భూమిలో వెలి
     విరిసె నధర్మంబు యోగవిధ్వంసక మై.111
ఆ. బలీయుఁ డన ద నడఁచు వలచినయవి యెల్లఁ
     బాడి లేక చేయుఁ బ్రభుజనంబు
     వేళ వేచి యొరుని యాలి నర్థంబును
     నపహరింతు రేచి యాగడీలు.112
క. అప్పుగొని మగుడఁ బెట్టరు
     తప్పు పలుక శంక గొనరు తగుబేహారం
     బెప్పటిపరివర్తనముల
     చొప్పు చెఱిచి చూఱగొనఁగఁ జొత్తురు జనముల్.113
క. అవి యెల్లఁ గారణములుగ
     నవనిం గలహములు పుట్టె నన్యోన్యవిచి
     త్రవధంబులు చేసి నృపా
     హవయోగ్యభటాలి యెల్ల నాఱడిఁ బోయెన్.114

వ. అట్టిసమయంబునం జంద్రపాలితు పరికరం బను కపటజనంబు
     మదంబు లొనర్చి పోటార్చి వేఁటవేడుకలు పుట్టించి
     వారలు మృగంబుల పాలు చేసియు మ్రుచ్చిలి యొరులపైఁ
     జొప్పులు పెట్టియుఁ బెనఁకువలు చేసి చచ్చునంతలు పుట్టిం
     చియు విషంబు లిడియుం జిచ్చులు దగిల్చియు మన్నీల వేఱు
     సేసి యగపడ్డచోట్లఁ దెగఁజూచియు యోధవీరుల సమ
     యించుచుండ.115
క. అధికారిచయముఁ దత్త
     వ్విధముల నవపాడి సేసి వివిధధనంబుల్
     పృథగతి నొక్కొక వెరవున
     నధిపతికిం జెప్ప కంత కంతకుఁ జెఱచెన్.116
క. తొల్లి గలుగు భండారం
     బెల్లను నానావిధముల నెసపోసి పతిం
     జెల్లఁగఁ బనిచిరి గాయక
     పల్లవలౌల్యాభిరతి నపాత్రంబులకున్.117
వ. ఇవ్విధంబున ననంతవర్మ రాజ్యం బస్తవ్యస్తం బగుటయు వసంత
     భానుం డంతకుమున్నం దా నతనికి నవిరోధి యై వర్తిల్లు
     చుండుం గావున గూఢవృత్తిం దద్విరోధి యగు భానువర్మ
     పాలికిం జతురదూతం బుచ్చి యనుకూలభావంబున నిలిచి
     పగ సాధించి యిచ్చువాఁడుగాఁ బూనిన నతండును.118
మ. చటులస్యందనఘట్టనం దెరలి యశ్వవ్రాతచంచత్ఖురో
     ద్భటపాదాతపదాహతి న్నెగసి యుద్యద్వారణశ్రేణికా
     కటనిష్యందిమదాంబువృష్టి నడవంగా భూరజఃపుంజ ము
     త్కటదర్పోద్దతవృత్తి నొత్తి నడచెన్ దండెత్తి యుద్దండుఁడై.119

క. నడచి విదర్భప్రాంతము
     పొడియుగఁ గాల్చియునుఁ జూఱపుచ్చియుఁ బై పై
     విడిసిన ననంతవర్మయుఁ
     గడు నలిగి బలంబు గూర్చి గ్రక్కున వెడలెన్120
ఆ. వెడలి పగతుమీఁద నడవ వసంతభా
     నుండు కుంతలేశ్వరుండు మఱియుఁ
     గలుగు చుట్టములను గలసి యేతెంచిన
     వీరు వారుఁ గదియ విడిసి రంత.121
వ. అట్టియెడ.122
తే. కుంతలాధీశుఁడైన యవంతిదేవు
     ననుగలంబగు నొకవారిజాక్షి మంచి
     గొండ్లి యన విని పిలిచి యక్కొమ్మ నృత్త
     మంతయును జూచె వేడ్క ననంతవర్మ.123
క. చూచి మకరకేతనశర
     గోచరుఁ డై దానిఁ గలిసెఁ గుత్సితవృత్తిన్
     వేచిన వసంతభానున
     కాచేష్టిత మెల్లఁ జెప్పి రందలిచారుల్.124
వ. విని యతండు ప్రముదితచిత్తుం డై.125
మ. అది మూలంబుగఁ గుంతలాధిపతి కత్యంతంబు నానాఁటికిన్
     హృదయక్షోభము పుట్టఁ జేయుచు విదర్భేశుం బెడంబాసి యు
     న్మదుఁ డాచారవిహీనుఁ డుగ్రుఁ డని యన్నం బెక్కుదోషంబులం
     దుదిముట్టం జెడనాడి యాతనికి శత్రుం జేసె నే ర్పేర్పడన్.126

వ. మఱియు ననేకప్రకారంబుల ననంతవర్మ మిత్రుల నెల్లను
     వేఱుపఱచి వివిధవస్తుప్రదానంబులం దనవశంబు గావించి
     వసంతభానుండు వానికి ననంతదేవునకుం దనతోడి పొందు
     శపథకీలితంబుగా దృఢంబు చేసికొని.127
ఆ. భానువర్మ తోడు గా నరపాలుర
     నెల్లఁ గూర్చి వారి నింద నిలిపి
     యవ్విదర్భపతికి నాపద పుట్టించు
     నట్లు కుటిలనీతి యనువు చేసె.128
ఆ. మొనలు నడుచునపుడు ముందటఁ దఱుమక
     యోజఁ దాను వారు నోసరించి
     తాఁకుతో విదర్భధరణీశు సైన్యంబు
     నాకులతను బొడిచి యతనిఁ జంపి.129
ఉ. కరితురగాదివస్తువులు గైకొని పాళులు పెట్టి యప్పు డ
     న్నరవరకోటి కాబహుధనంబుల లోభము పుట్టఁ జేసి యొం
     డొరువులతోఁ బెనంగి తెగి యుద్ధము సేయువిధం బొనర్చి యా
     తురగతిఁ బొందునట్లుగ నదోషుఁడ పోలె నొనర్చె నేర్పునన్.130
వ. సకలరాజలోకంబును వికలతం బొంది చనినం దత్పరివారం
     బెల్ల బెదరి వచ్చిన మధురవచనప్రదానాదులవలన వారిం
     గూర్చుకొని బలసి భానువర్మ పగఁ దీర్చినవాఁ డై యిమ్మెయి
     నాతనిం బ్రీతచిత్తుం జేసి యల్పధనంబునఁ దృప్తుం గావించి
     నిజదేశంబునకుం బుచ్చిన వసంతభానుండు సమస్తవస్తు
     సహితంబుగా విదర్భరాజ్యంబు చేకొని యుండె నిట వసు
     రక్షితుండును భండనంబున మొగ తప్పి పట్టణంబునకుం జని

     యనంతవర్మయగ్రమహిషి యైన మహాదేవినిం దత్పుత్రి
     మంజువాదినిం బుత్రకు భాస్కరవర్మనుం దోడ్కొని వెడలి
     పరదేశంబున కరిగి వారలకు నాపదను బంధువిధాయకుం
     డైన విధాతకరుణాహీనత నయ్యమాత్యుండు కాలగోచరుం
     డగుటయు నత్యంతవిరళంబై పరిజనంబు వారిం దడవి తెచ్చి
     మాహిష్మతిఁ జేర్చి యప్పట్టణం బేలెడు మిత్రవర్మ యనంత
     వర్మ పెద్దకొడుకు గావున.131
క. ఆనరపతిఁ గనిన నతం
     డనూనప్రియపూర్వకముగ నుర్వీశుసతిన్
     సూనునిఁ గుమారిఁ బురి నొక
     చో నుపయోగ్యప్రభావసుస్థితి నునిచెన్.132
వ. ఇట్లు కొన్ని దినంబులకు.133
తే. మఱఁదలికి నాసపడి లోలమతిఁ జరించి
     యమ్మహాదేవి పతిభక్త యగుటఁజేసి
     తనకు లోను గాకున్న నతండు చాల
     సిగ్గుపడి పోయి కలుషితచిత్తుఁ డగుచు.134
క. ఈయసతి సుతుని నృపుఁ గాఁ
     జేయఁగ నని యున్నఁ గలుచఁ జేరద మృతునిం
     జేయంగవలయు నేమి యు
     పాయంబు లొనర్చి యైన బాలకు ననుచున్.135
తే. క్రూరబుద్ధి యై తొడగినఁ గొంతకొంత
     వినియు వినమి నంతఃపుర[12]వృద్ధు కొకని

     కమ్మహా దేవి తనయుని నప్పగించి
     యి ట్లనియెను భయం బెడ్డ నెసక మెసఁగ.136
వ. వీని నెక్కడికేనియుం గొనిపోయి భిక్షుకాదులవలన వార్త
     పుత్తెంచి నాళీజంఘుఁ డిట్లు సేయునే యని పొగడించుకొ
     నుము వీడు ప్రాణంబులతోడ నునికియ నాకు నెల్లసంపద
     లనవుడు వాడును సత్వరుం డై.137
ఉ. ఆనృపసూనునిం గొని భయంబున రే గడు దవ్వు పోయి య
     చ్చో నొకయాలమంద గని చొచ్చి తనంతరవర్తి గోపికా
     నూనకృపాతిరేకవిహితోపకృతిం దగ దప్పి దీర్చి యెం
     దేనియుఁ బోవ వచ్చి ధరణీశ్వరు బంటులు గాంతురన్ వగన్.138
ఆ. అలికి దినమునందు నిలుచుట కొల్లక
     బాలుఁ దడివి యచటు వాసి వింధ్య
     విపినభూమి నడచి వేసవి గావున
     డప్పి నొక్కనూయి డాయ నరిగె.139
క. అని చెప్పంగనె నానృప
     తనయునిఁ దెచ్చిన యతం డతం డని చిత్తం
     బున నెఱిఁగియు వినియెదఁ గా
     కని యెఱుఁగనియట్ల యుండ నతఁ డి ట్లనియెన్.140
క. ఏ నాళీజంఘుండను
     భూనాథకుమారుఁ డితఁడు పోయెద మిట యెం
     దేనియు నల్లల్లన య
     మ్మానపపతియాజ్ఞ గడవ మనుజోత్తంసా!141

ఉ. సత్యయశోవిలాస! మహనీయకళాకమనీయ! కొమ్మనా
     మాత్యతనూభవత్వమహిమస్తవనీయ! వివేకసంపదు
     న్నత్యభిరామ! కాంతిపరిణామజితామృతధామ! సూరిసాం
     గత్యరసైకకామ! శుభకర్మసముజ్జ్వల! ధర్మనిర్మలా!142
క. అనవద్యచిత్తవిద్వ
     జ్జనమోదననిపుణ! వినయసంపదుదాత్తా!
     దిననాథజైత్రతేజో
     ధనసార! వికారదూర! ధర్మవిచారా!143
మాలిని. నరపతినయవిద్యానైపుణప్రౌఢభావా!
     నిరుపమగుణరత్నోన్నిద్రతేజఃప్రభావా!
     సురగిరిసమకీర్తిస్తుతధైర్యానుభావా!
     సరసమధురవాణీసవ్యభవ్యప్రభావా!144
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రం బను మహాకావ్యంబునందు నేకాదశాశ్వాసము.

  1. నడల
  2. గనెడు
  3. బని యె
  4. చూచుచున్
  5. త్రొక్కి నృపు వీతప్రాణుఁ గా
  6. పుచ్చుక
  7. కోటికిన్
  8. యుండు
  9. నుద్ధావన
  10. గుతూహలింగాఁ
  11. డనంతరము
  12. వృద్ధు నొకని