దశకుమారచరిత్రము/నవమాశ్వాసము

నవమాశ్వాసము

     శ్రీ విలసనరమణీయా!
     భావితభవపాదపద్మ(భక్తి)నిధానా!
     భూవినుతశుభచరిత్రా!
     ధీవిభవాత్తస్వరూప! తిక్కచమూపా!1
శా. దేవా! దేవర యున్నచో టెఱుఁగ నుద్దేశించి దేశంబులం
     దే వర్తించుచునుండి వింధ్యగిరిపై నేకాంత ముగ్రాటవిం
     బోవం బోవఁ బయోజబంధుఁ డపరాంభోరాశిలోఁ గ్రుంకె సం
     ధ్యావేళన్ వన మెల్లఁ బల్లవితమైనట్లుండ రంజిల్లుచున్.2
ఉ. పల్లము మిఱ్ఱు వేఱుపఱుపన్ వెర వేదెడునట్లుగాఁ దమం
     బెల్లెడ నిండఁ బర్వుటయు నేఁగుట వ్రేఁ గని నిశ్చయించి యేఁ
     బల్లవశయ్య భూతలముపై నొకవృక్షము క్రేవఁ దీర్చి యం
     దల్లన మేను సేర్చి వినయంబునఁ బల్కితి మీఁదు చూచుచున్.3
ఉ. మీకృపఁ గోరి భూరుహసమీపము చేరితి నాప్రియం బెడం
     జేకొని కావుఁ డిందుల వసించిన దైవములార! యొంటిమైఁ
     జీఁకటిరాత్రి నాగహరిసింధురసూకరవుండరీకభ
     ల్లూకపరీతకాననములో నిట నూఱడి నిద్రవోయెదన్.4
మ. అని యొక్కించుక కన్ను మూయ నెడ దివ్యస్ఫారసౌఖ్యంబునం
     దను వుద్యత్పులకాంక మయ్యె నమృతార్ద్రం బైనచందంబునన్
     మన మానందముఁ బొందె నిట్లగుడు నన్మానించి యే నత్తఱిన్

     గనుదో యల్లన విచ్చి మేదినియు నాకాశంబునుం జూచితిన్.5
వ. ఇట్లు కలయం బరికించి రమణీయం బైన హర్మ్యంబును విశ్రు
     తంబైన వితానంబును నిద్రాపరవశంబైన తరుణీజనంబును
     మృదుతలం బైన తల్పంబును నందు మదీయాంగంబునుం గదిసి
     నిద్రించుచున్న కన్యకారత్నంబునుం జూచి యచ్చెరువంది
     యాత్మగతంబున.6
సీ. ఏను నిద్రించిన కాననం బెటు వోయె
                    నీసుధాభవన మిం దెందు వచ్చెఁ
     గాననాంతర్గతఘనశాఖ యెట పోయె
                    నీవితానం బది యెట్లు గలిగె
     లత లెందులకు నేఁగె లావణ్యవతుల మొ
                    త్తంబు దా నేమికతమునఁ జేరెఁ
     జిగురులం దీర్చిన సెజ్జ యెందుల కేఁగె
                    నీయండజంబుపా న్పేల పొదివె
తే. భీతి యేవల నరిగె నీనాతి నన్ను
     నేమిగతిఁ జెందె నింతయు నింద్రజాల
     మగునొ నిక్కున మగునొ యీయద్భుతంబు
     తెఱఁగుఁ దెలియంగ నెమ్మెయి నెఱుఁగువాఁడ.7
క. ఈమగువ దేవకామిని
     గామి యెఱింగించెఁ గన్నఁగవ యిదె యుద్య
     త్కామచరితమున నెంగిలి
     గామి యెఱింగింపఁ బెక్కు గల వూహింపన్.8

సీ. కౌఁగిటఁ బొందమిఁ గామినికుచయుగ
                    ళంబు దాళములచందంబు వోలె
     నిరుపమభోగంబు నిబిడమై యంగంబు
                    సాలభంజికతనులీలఁ బోలె
     భూషణానుపరక్తి బొలఁతికపోలంబు
                    దళ మెక్కి చంపకదళముఁ బోలె
     నింపెసలారఁ జలింపక యునికిఁ గె
                    మ్మోవి లేఁబవడంపుఁదీవఁ బోలె
తే. నదియుఁ గాక పరస్త్రీవిహారమునకు
     జొరని నాచిత్త మిప్పు డీసుందరాంగిఁ
     దగిలెఁ గావునఁ బరసతీత్వంబు లేని
     తెఱఁగు తెల్లమై యున్నది దీనియందు.9
వ. అని డోలాయమానమానసుండ నై యున్న యవసరంబున
     నొక్కింత నిద్రం గను మోడ్చి యనంతరంబ కఠినస్పర్శనం
     బున మేలుకాంచి.10
క. ఎప్పటికాంతారములో
     నెప్పటి వృక్షంబునీడ నెప్పటిచో నే
     నెప్పటితలిరులపాన్పున
     నెప్పటిచందమున నునికి యేర్పడఁ గనుటన్.11
మ. మును సౌధంబును దల్పముం దరుణియున్ ముగ్ధాసమూహంబుఁ దోఁ
     చినచందంబు నదృశ్యమైన తెఱఁగుం జిత్తంబులో నద్భుతం
     బొనరింపం దలపోసి యిందుముఖి నింపొందంగ నాలింగనం
     బునకుం జేడ్పడియున్నమోసము వగం బుట్టింప నే నయ్యెడన్.12

క. వెఱఁగుపడి చిత్రరూపము
     తెఱఁగున నున్నంత నరుణదీప్తులు పర్వం
     బఱతెంచెఁ దరణిరథ మ
     త్తఱి నొండువిచార ముడిగి తత్పరమతి నై.13
క. అంతయుఁ దెలియ నెఱుంగక
     కాంతారము వెడలిపోవఁ గాంచితిఁ గల యం
     చెంతయుఁ దెంపున వృక్షో
     పాంతంబున దైవసాక్షిఁ బ్రతినలు పట్టన్.14
వ. తదవసరంబున.15
తే. కరుణ పొడవైనయ ట్లొక్క సరసిజాక్షి
     వచ్చి నాయెడ మాతృభావంబు దోప
     నిలుచుటయు భక్తిఁ బ్రణమిల్లి నిన్ను నాకు
     నెఱుఁగ నానతి యిమ్మన్న నిట్టు లనియె.16
మ. తనయా! నీ చెలి యర్థపాలుజననిం దారావళిం దొల్లి యే
     ననిమిత్తంబ పతిం దొరంగి కడు నన్యాయంబునం బోయినం
     గని య క్షేశ్వరుఁ డల్గి వర్షపరిభోగ్యంబైన శాపంబు గ్ర
     క్కున నా కిచ్చిన భూత మైతిఁ దుది నీక్షోణీజముం జేరితిన్.17
వ. ఇది నా తెఱుంగు విను మని యి ట్లనియె.18
శా. శ్యావస్తీనగరంబునందు మహితం బై చెల్లు నప్పార్వతీ
     దేవీవల్లభు నుత్సవంబునకు నర్థిం జూడఁ బో నున్నచో
     నీ వీవృక్షముక్రేవ నాశ్రితుఁడ వై నిద్రించుడున్ డించియున్
     బోవం జాలక నిన్ను నెత్తుకొని యంభోవాహవీథీగతిన్.19

ఉ. ఆనగరంబు చేరి నిటలాంబకు గేహము డాయఁ బోవుచో
     మానవనాథపుత్రి నవమాలిక సౌధముమీద గాఢని
     ద్రానిరతాత్మ యై యునికి తక్కక చూచి తదీయశయ్యపై
     మానుగ నిన్నుఁ బెట్టి పురమర్దనుఁ గొల్వఁగఁ బ్రీతిఁ బోయితిన్.20
చ. ఉరగవిభూషణుం గొలిచి యుత్సవలీలలు చూచి భక్తిమై
     గిరిజకు మ్రొక్కి తత్కరుణఁ గిల్బిష మంతయుఁ బాచి తొంటివ
     త్సరపరిభోగ్యమైన పటుశాపము చెచ్చెర నీఁగ వచ్చి సుం
     దరికడ నాస సేయు నినుఁ దప్పక చూచితి విస్మయంబుతోన్.21
వ. ఇట్లు కనుంగొని శాపదురితసమాగతపురాతనమహానుభావ
     నగుటం జేసి ని న్నెఱింగి.22
ఆ. అకట! యితఁడు ప్రమతి యగు వింధ్యభూమికి
     నేల వచ్చె నొక్కొ యీలతాంగి
     మీఁద నిపుడు దగులు మిగిలె ని ట్లీతం డ
     నంగు చెయ్ది దనతెఱంగు మఱచె.23
వ. అనిన నీవచ్చినవిధంబునుం గని యుమ్మలించి నిను నుపలక్షించి.24
ఉ. డెందమునందుఁ గూటమి కడిందిగఁ జూచుటఁ జేసి ముద్దియం
     బొందఁగ లేఁడు వీఁడు పొరపొచ్చెపు నిద్రయ పోవుచున్నవాఁ
     డిందుల నాకు నిల్పఁ దగ దిప్పుడ నెయ్యముఁ దియ్య మెక్కఁగాఁ
     బొందొనరింపఁ బ్రేమ మదిఁ బొందియుఁ జూడదు వీని నేనియున్.25
వ. కావున వీనికిం జొక్కు పుట్టించి యిమ్ముద్దియకుం బ్రమో
     దం బాపాదించి రాత్రిసమయంబున నిజతల్పంబుపై వింత
     మానిసిం గని పుట్టుదిగులుం బరిహరించి దీని సౌందర్యంబు

     వీనికి విలోచనగోచరంబు సేసి దీని మగుడ సొక్కించి వీని
     నెత్తుకొనిపోయి.26
శా.ఆయుగ్రాటవియంద పెట్టి నిజవృత్తాంతం బెఱింగింపఁగా
     నీయబ్జాననఁ దాన పొందు గొని వీఁ డెబ్భంగి నైనన్ సుఖ
     శ్రీయుక్తిన్ విహరించుఁగాక యని యర్థిం దత్క్రమం బెల్లఁ జి
     త్తాయత్తంబుగఁ జేసి యియ్యెడ కనాయాసంబునం దెచ్చితిన్.27
ఉ. నీ విట యప్రమత్తమతి నెమ్మిఁ దలోదరిఁ బొంది సౌఖ్యల
     క్ష్మీవిభవంబు నొందు మని చెప్పి పతిం గలయంగఁ బోయెఁ దా
     రావళి యేను నెంతయుఁ బ్రియంబునఁ బొంగి మనంబులోన రా
     జీవదళాక్షి నిల్పుకొని చెచ్చెర నప్పురి కేగు నయ్యెడన్.28
క. నడుమ నొకబోయపల్లెం
     గడువేడుకఁ గోడిపోరు గనుఁగొనియెడు నాసం
     దడి దరియఁ జొచ్చి కోళుల
     నెడమడువుగ విడుచుచున్నయెడ ని ట్లంటిన్.29
క. చరణములు నేత్రములుఁ గడు
     నరుణము లారెలును ముక్కు నాయతములు కం
     ధరములు దొడలును సన్నము
     లరయఁగ బకజాతి కది భయంపడుఁ బోరన్.30
క. ఆరెలు వలములుఁ దొడలును
     దోరము బలుమెడయుఁ జుట్టు దుండముఁ గుఱుచల్
     బీరంబునుఁ నురమును వి
     స్తారి యగు న్నారికేళజాతికి నెందున్.31

క. ఆనారికేళజాతికి
     మానుగ బకజాతి పోర మార్కొన దగుడుం
     దా నట యరుకలి యనుచును
     మానక పోరించు నధికమాత్సర్యమునన్.32
సీ. ఎదిరినోడి ము స్నెనసి యారెలు మెడ
                    వెస గాఁడ నురువడి వ్రేసి వ్రేసి
     యది వ్రేయ మదికిన్క నడరి బల్పునఁ బట్టి
                    కబళించి యందంద కదిమి కదిమి
     విశిఖముఖంబులు వెనువెంటఁ దగులుచు
                    నంతంత బోనీక యాఁగి యాఁగి
     వాగాటులకు వచ్చి వసుమతి నిలువక
                    యొంటితన్నునఁ గొస రుడిపి యుడిపి
తే. గెలిచె నామాటఁ దగ నారికేళజాతి
     యగ్గలిక నంతఁ బ్రజ యెల్ల నార్చుచుండెఁ
     జెలఁగి యొకజాతిమాత్రోపజీవి యైన
     బ్రాహ్మణుండు న న్నెంతయుఁ బ్రస్తుతించి.33
క. తనపక్షము గెలుచుటకును
     మన మలరగ గౌఁగిలించి మనయింటికి ర
     మ్మని సంప్రీతిం దోకొని
     చనియె నిజనివాసమునకు సౌహార్ద్రమునన్.34
మ. చని సత్కారముతోడ నన్ను నుచితస్నానాసనాది క్రియా
     జనితాహ్లాదునిఁ జేసి తాను మును వేశ్యాసక్తిమై నందుఁ జే
     రినచందంబును సాహసక్రియల వర్తింపంగ దక్షుండ నే

     ననియుం జెప్పి యకారణంబ చెలికాఁ డై వాఁడు నెయ్యంబునన్.35
ఆ. పురికి నేఁగునపుడు కరము సంప్రీతితో
     ననుప వచ్చి నీకు ననుమతంబు
     లైన పనుల కే సహాయుండ నయ్యెద
     వలయుచోట నన్ను దలఁపవయ్య!36
వ. అని పునఃపునరాలింగనంబు సేసి మగుడ నేను
     నగరంబునకుం జని తత్పరిసరారామంబు సొచ్చి.37
సీ. పుప్పొడి రాలంగఁ బొరిపొరి వీతెంచు
                    మలయానిలమునకు నులికి యులికి
     తీఁగలు కప్పార మూఁగి యాలతి సేయు
                    భృంగమాలికలకు బెదరి బెదరి
[1](యెలమావిక్రొన్ననల్ లలిఁ గ్రోలి కేరు కో
                    యిలపిండుకూఁతల కలికి యలికి
దోరగాయల మెక్కి తారు రాచిల్కల
                    దుడుకు సందడులకు జడిసి జడిసి)
తే. మున్నుఁ గనుకలి గాఁకచే బన్నములకు
     వచ్చి యలఁదురి నే నుపవనములోన
     నగ్గలించిన వలవంత బెగ్గలించు
     చున్నచో నయ్యెడకు నొక్కయువిద వచ్చి.38
క. పగలిటి శశికాంతిగతిన్
     మొగమున వెలవెల్లఁబాటు ముసుఁగువడఁగ లే

     జిగురులు పువ్వులుఁ గోయుచు
     మిగిలినవగతోడ మత్సమీపంబునకున్.39
వ. అరుగుదెంచి నన్నుం గనుంగొని.40
ఉ. మోదము సందియంబుఁ దనమోమున సందడిలంగ నల్ల న
     త్యాదరవృత్తి నన్ను నిజహస్తగతంబగు చిత్రరూపముం
     గా దవు నన్నచందమునఁ గన్ను మనంబును నుండుదిక్కులన్
     వీదులు వాఱుచుండ నరమించనిభావన చూచెఁ బల్మఱున్.41
తే. దానిచూచుట గనుఁగొని యేను జిత్ర
     ఫలకయందున్న రూపంబు దెలియఁ గాంచి
     మేడపైఁ జారుతల్పంబుమీఁద నిద్ర
     సేయు నాచంద మగుటయుఁ జిత్త మలరి.42
క. సరసిజముఖి నవమాలిక
     మరుశరముల పాలుపడుట మదిఁ గాంచియు ని
     త్తరలాక్షితోడి మాటల
     నరసి తెలియ నే నెఱుంగన ట్టి ట్లంటిన్.43
మ. సుదతీ! పల్లవసంచయంబు కుసుమస్తోమంబునుం జాలఁ గో
     సెదు కామానలతప్తయైన యొకరాజీవాస్యకున్ సెజ్జకే!
     మదనాస్త్రవ్యథ నీకు నిత్తెఱఁగునన్ మాన్పింపఁగా వచ్చునే?
     హృదయాహ్లాదము చేయు వల్లభుని నన్వేషింపు మింపారఁగన్.44
క. అనవుడు నామాటల పొం
     దున కెడ నాసపడి యతిచతుర యగుటం గ్ర
     క్కునఁ జెప్ప నొల్లకుండియు
     నను నిట్లని పల్కె నాననం బలరంగన్.45

తే. నడచి డస్సినచంచ మాననమునందుఁ
     గాననయ్యెడు నీకు నేకతమ యిచట
     నేల తిరిగెదు రమ్ము మాయింటి కిష్ట
     సంపదలఁ బొద్దుపుత్త మచ్చటన మనము.46
చ. అని వినయంబుతో నిజగృహంబునకుం గరమర్థి నన్నుఁ దో
     కొని చని పేర్చునెయ్యమునకుం దగు మజ్జనభోజనాదివ
     ర్తన మొనరించి నెమ్మి నుచితంబగు మాటలఁ బ్రొద్దుపుచ్చి యొ
     య్యన ధవళాయతాక్షి వదనాంబుజ మించుక యుల్లసిల్లఁగన్.47
క. పలుచోట్లం గౌతుకమునఁ
     గలయం గ్రుమ్మరుట మీకుఁ గలుగును నిల నెం
     దుల నైన నద్భుతంబులు
     గలవే! మీ రెన్నఁడేనిఁ గన్నవి యనినన్.48
చ. అనవుడు దానిచిత్తగతమైన తలం పెఱుఁగం దలంచి యే
     నును మును గన్న చిత్రపటనూతనరూపముఁ బొంద రాజనం
     దన యనురాగలజ్జలకుఁ దావల మై వెడనిద్రవోవురూ
     పును లిఖియించి యాతలిరుఁబోఁడికి నేర్పడఁ జూపి చెప్పితిన్.49
క. ఈచందము సౌధముపై
     నీచందము పాన్పుమీఁద నీచందము వా
     రీచాడ్పున నొండొరువులఁ
     జూచుట గల నొక్కనాఁడు చూచితిఁ దరుణీ!50
క. అనవుడు నది యిది కల గా
     దనఘా! నిక్కంబు చెప్పు మనవుడు నే మున్

     గని తుది వినినప్రకారము
     వినిపించితి నమ్మృగాక్షి విస్మయ మందన్.51
వ. అదియునుం దనసందేహంబు వాసినం బరమానందంబు
     నొంది రాజనందన తెఱంగు సవిస్తరంబుగా నెఱింగింపం
     దలంచి యి ట్లనియె.52
క. న న్నేలిన నృపనందన
     నిన్నుం గలఁ గాంచెఁ గాంచి నెయ్యపుఁ జెలియన్
     నన్నుఁ బిలిపించి యత్తెఱఁ
     గన్నెలఁతయుఁ దెలియఁజెప్పె నది యె ట్లనినన్.53
శా. బాలా! సౌధతలంబునం దొకఁడు మత్ప్రాంతంబునం బాన్పుపై
     లీలానిద్రితుఁ డైన మన్మథుఁడు వోలె న్మోడ్పుఁగన్నుంగవం
     జాలం బొల్పు వహించియున్నయెడ నాశ్చర్యంబు నెయ్యంబు ను
     ద్వేలం బై జనియింపఁగా నతనిఁ బ్రీతిం జూచి కామించితిన్.54
క. తదనంతరంబ కన్నుల
     నొదవిన వెడనిద్రఁ జొక్కియును జొక్కమి బి
     ట్టు దెలిసి యయ్యెడఁ గలయ
     న్వెదకి యతఁడు లేమి నధికవిస్మిత నైతిన్.55
మ. నగుఁబాటో యెఱుఁగం దదాకృతిసమానం బేను జిత్రించితిన్
     మగ లీచందమువారలుం గలరొకో మర్త్యంబులో నింతపొ
     ల్పగు రూపంబునవాఁడు కల్గి యొకకన్యం జూచి యుల్లంబునం
     దగులం బొందిన యట్టిభాగ్యవతిచిత్తం బెంత రంజిల్లునో.56

క. ఈ చందమురూపులు మును
     చూచియు వినియును నెఱుంగ సుందరి! యం దేఁ
     జూచితిఁ జూచినమాత్రన
     నాచిత్తము చిత్తజన్మునకుఁ గొలు వయ్యెన్.57
వ. అని చెప్పి భవదీయాకారచిత్రితంబైన యీచిత్రఫలక చూ
     పుచుం దాపంబు నొందింప నేనును నది కలగా విచారించి.58
మ. కలలో నొక్కని నొక్కకాంత గని యాకాంక్షించి పుష్పాస్త్రు చేఁ
     బలుబన్నంబులు పొందుచున్న దని చెప్పం బోలునే! విన్నవా
     రలు నిన్ను న్నగరే! యిసీ! యనుచు ధీరత్వంబు చేపట్టి యా
     కులతం బొందక యుండు చెన్నరి మనఃక్షోభంబు నీ కేటికిన్?59
క. నిక్కపు మగవాఁ డిచటికి
     నెక్కడఁ జనుదెంచె? మగుడ నెక్కడి కరిగెన్?
     వెక్కసపు మాట లాడకు
     మెక్కడిచూ పెట్టికూర్మి యిందునిభాస్యా!60
వ. అని మఱియు నానావిధహేతుదృష్టాంతంబులు పలికియు
     వలవంత మాన్పింప నేరక శీతలక్రియార్థంబు మృదుపల్లవ
     బిసకుసుమాద్యుపకరణంబులు నిగూఢంబులుగా సవదరించి
     కొని పోవం దలంచి యుపవనంబునకు వచ్చి ఫలకచిత్రితం
     బైన రూపంబు నీరూపం బగుటం జేసి దృష్టిచిత్తంబులు
     డోలాయమానంబు లగుచున్నయెడ భవదీయకరుణావ
     లోకనంబున నీదృగ్విధంబైన యానందంబుం బొందితి ననిన
     నేనును ముందర డెందంబునం బొందిన కందు దిగఁద్రావి
     యయ్యింతి నుచితసంభాషణంబులం గలపికొనిన నదియును

     నవమాలికపాలికిం జని యతివేగంబునం గ్రమ్మఱ వచ్చి
     దుష్ప్రవేశంబగు కన్యకాంతఃపురంబు ప్రవేశించు నుపా
     యంబు నాతో నాలోచించిన నే ని ట్లంటి.61
క. ఏ నొకబ్రాహ్మణకన్యక
     నై నరపతిఁ గికురుపెట్టి యంతఃపురకాం
     తానివహములోనికిఁ జను
     దే నోపుదు నాలు గేను దివసంబులకున్.62
క. నాతీ! చతురత యేర్పడ
     నీ తెఱఁ గింతయును [2]బ్రీతి నేలిన నృపసం
     జాత కెఱిఁగింపు మని యే
     నాతరుణిం జెప్పి పుచ్చి యాక్షణమాత్రన్.63
ఆ. మున్ను కోడిపోరు ముదముతోఁ జూచిన
     పల్లె కరిగి తొంటి బ్రాహ్మణునకు
     నాతెఱంగుఁ జెప్పి నాతిఁ బొందెడువిధ
     మెఱుఁగఁ జెప్పఁ దలఁచి యిట్టు లంటి.64
చ. నరపతిమందిరంబు చోర నాకు నుపాయము గంటి దానికిన్
     వెర వెఱిఁగించెదన్ వినుము వేషము వేఱుగఁ జేసి యాఁడురూ
     పరుదుగఁ దాల్చి వచ్చెద దయామతిఁ గైకొని నీవు తండ్రి వై
     యరిగి యశంకితంబుగ మహాపురుషా! జననాథుసన్నిధిన్.65
వ. మదర్థంబుగా ని ట్లని విన్నవించునది. దీనితల్లి ప్రసవకాలం
     బునం బరలోకంబున కరిగిన సంతానాంతరంబు లేమింజేసి
     యతిప్రయత్నంబున.66

ఉ. కానక కన్నకూతుఁ గడు గారవ మొప్పఁగ నేన దాది నై
     యేన సవిత్రి నై పెనిచి యిచ్చితి [3]నచ్చుగ వేదశాస్త్రవి
     ద్యానిధియైన విప్రునకు నాతఁడు పెండిలి యాడి పోయె నా
     ల్గేను సమంబు లై మగుడ నెన్నఁడు రాఁ డది కారణంబుగన్.67
ఉ. ఏను దదీయదేశమున కేఁగెద నాతనిఁ దోడితేర ని
     మ్మానినికన్యకాత్వము ప్రమాదముఁ బొందక యుండునట్లుగాఁ
     బూని సహాయమై నడపఁ బొందగు బంధులు లేరు గావున
     న్మానవనాథ! నీకడ సమర్పణ సేయఁ దలంచి వచ్చితిన్.68
చ. అనద మహీసురోత్తముఁ డనంతవయస్కుఁడ నీకృపావలో
     కనమున కేను బాత్రుడఁ బ్రకాశయశోధన! ధర్మవర్తనుం
     డనియెడు పేరు సార్థ మవునట్లున నిక్కమలాక్షిరక్షణం
     బొనరఁగఁ జేయు మే నతనియున్నెడకుం జని వచ్చునంతకున్.69
చ. అనవుడు సమ్మతించి నను నంతిపురంబున నింతిపిండులో
     జనపతి యుంచు నేను బలుచాయల మాయల బేలు వెట్టి య
     మ్మనుజగణేశు పుత్రి నవమాలిక వాసగృహంబు చొచ్చి యం
     దనుదినము న్మనోభవసుఖాంబుధిలోపల నోలలాడెదన్.70
వ. అనిన నతండునుం గపటవర్తనలంపటుండు గావునం బ్రీత
     చిత్తుం డై స్వీకృతకన్యకాకారుం డగు నన్నుం దోకొని చని
     మదుక్తప్రకారం బనుష్టించిన రాజానుమతంబున నేనును
     నంతఃపురంబు చొచ్చి యత్తెఱం గంతయు నవమాలిక కెఱిం

     గించి యన్యు లెఱుంగకుండ సఫలితమనోరథుండ నై
     యున్నంత ధర్మవర్తనమహీశ్వరుండు నవయౌవనాలంకృత
     యైన కూఁతునకుం దగినవరుని నెందునుం గానక మంత్రి
     జనానుమతంబున స్వయంవరం బాఘోషించిన.71
చ. మనమున సంతసిల్లి నవమాలిక నూఱడఁ బల్కి తొంటివి
     ప్రునికడ కేగి యంతయు నపూర్వమనఃప్రియ మొందఁ జెప్పి య
     వ్వనితకు నాకు నెయ్యపువివాహము చొప్పడు నీవు వచ్చి తో
     కొని చనుదెమ్ము న న్నని నిగూఢముగా మరలంగ వచ్చితిన్.72
క. వంచకవరుఁ డగు నతఁ డే
     తెంచి ప్రియం బెసఁగ వసుమతీనాథుని దీ
     వించి జనకుండు సుతఁ దో
     తెంచుగతిం దెచ్చె న న్నతిశ్లాఘ్యముగన్.73
చ. అరుదుగ ధర్మవర్తనధరాధిపుఁడున్ నవమాలికాస్వయం
     వరమునకున్ సమస్తనృపవర్గములం బిలిపించెఁ దత్సభాం
     తరమున కేను సర్వజనతానయనప్రియవేష మొప్పఁగా
     నరిగితి మద్వయస్యులు నిజానుజుఁగా నను గౌరవింపఁగన్.74
వ. అయ్యవసరంబున.75
మ. అతిరమ్యంబుగఁ బూసి కట్టి తొడి కన్యారత్న మేతెంచి భూ
     పతులన్ విప్రకుమారులన్ వరుసతోఁ బ్రౌఢాంగనల్ చూపఁగా
     వితతాలాపవిలాసలోచనముల న్వీక్షించుచున్ డాసియు
     ధ్ధతసౌరభ్యవిలుబ్ధభృంగవిలసద్దామంబు ప్రేమంబునన్.76
వ. మదీయాంశంబునం [4]బూజించిన.77

క. నవమాలికాస్వయంవర
     మవునను నడియాస విడిచి యవనతముఖు లై
     యవనీపాత్మజు లందఱు
     నవమానాక్రాంతు లగుచు నరిగిరి కలయన్.78
వ. నరనాథుండును నన్నుం గని సంతసిల్లి యత్యంతవిభవం
     బెసంగ వివాహంబు సేసి సకలసంపదలు నిచ్చి సర్వాధి
     కారిం జేసిన.79
ఉ. ఏనును ధర్మవర్తనమహీపతియిచ్చ యెఱింగి రాజసే
     వానిపుణత్వ మేర్పడ దివానిశముం జరియించి తద్దయా
     నూనవిభూతిపెంపున మహోన్నతిఁ దాల్చి యతండు నిర్భయుం
     డైన విలాససౌఖ్యముల నందఁగ రాజ్యము సేయుచుండియున్.80
క. నరపాలలోకచూడా
     భరణములగు నీదుచరణపద్మములు నిరం
     తరముఁ గొలుచు నుత్సవమునఁ
     బొరయంగా లేమి సుఖము పొడకట్టువడెన్.81
వ. అంత సింహవర్మకు నెడరైనం దోడుపడుటకు నిందులకు
     వచ్చి దైవయోగంబున భవదీయసేవాసౌఖ్యంబు గాంచితి.82
క. అని వినయ మొప్పఁ బ్రణమి
     ల్లిన దైవబలంబు బుద్ధిలెస్సతనంబున్
     గొనియాడి మిత్రగుప్తుం
     గనుఁగొని మే నెలమిఁ బొందఁ గౌతుక మడరన్.83
మ. కరుణోదాత్తుఁ డుదారచిత్తుఁ డతులాకారుండు ధీరుండు వి
     స్తరసత్కీర్తిపవిత్రమూర్తి కవితాధన్యుండు పుణ్యుండు కా

     వ్యరతిస్తుత్యుఁడు సత్యుఁ డాశ్రితశివధ్యానుం డహీనుండు భ
     వ్యరమాసిద్ధివిశాలబుద్ధి వసుతృప్తాచార్యవర్యుం డిలన్.84
క. కవిలోకచాతకవ్రజ
     నవజలదస్తనితభాషణప్రకరుఁడు భా
     రవికల్పకల్పకపరా
     భవకరణధురీణదీర్ఘబాహుం డెలమిన్.85
మాలిని. నిరతిశయవివేకోన్నిద్రుఁ డక్షీణభద్రుం
     డరిసచివమహోపాయాపహారుం డుదారుం
     డరభసకలభాషుం డస్తదోషుండు యాగా
     హరణనిపుణచిత్తుం డప్రమత్తుండు ధాత్రిన్.86
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రం బను మహాకావ్యంబునందు నవమాశ్వాసము.

  1. ఈకుండలీకృతభాగము వ్రాఁతప్రతిలో లేనందునఁ బూరింపఁబడినది.
  2. నిన్ను
  3. నొక్కట
  4. వైచిన