తెలుగువారి జానపద కళారూపాలు/నూనెగుడ్డలవారు

నూనెగుడ్డలవారు

ఒకో ప్రాంతంలో ఒకో కళారూపం అభివృద్ధి పొందింది. అయితే రాష్ట్ర వ్వాపితంగా ఏ ఒక్క కళారూపమూ వ్వాప్తిలో లేదు. అలా చూసుకున్నప్పుడు, ఈ నూనెగుడ్డలవారు ఎక్కువగా తెలంగాణాలో వున్నారు. వీరిలో కొంత మరాటీతనం కనిపిస్తుంది. అందుకు కారణం మరాటీ కళారూపమైన తమాషాలో ఉపయోగించే ఏకతారను వీరు ఉపయోగిస్తున్నారు.

వీరు రంగు రంగుల అందమైన గుడ్డల మీద గవ్వల్ని బెల్టులుగా కుట్టి, వరుసలు వరుసలుగా అలంకరిస్తారు. మరో విశేషమేమిటంటే, వీరు ధరించే గుడ్డలు నూనెతో తడిసి వుంటాయి. అందు వల్లనే వారికి ప్రత్యేకంగా నూనెగుడ్డలవారు అనే పేరు వచ్చింది.

మెడలో గవ్వల హారాల్ని వరుసలుగా ధరిస్తారు. నుదుట పెద్ద సింధూరపు బొట్టును ధరిస్తారు. తలకు గంభీరమైన తల గుడ్డను చుడతారు. చూపరులకు ఒక విలక్షణమైన వ్వక్తిగా మంత్రగాడుగా కనీంచే ఇతడు జ్యోతిషాన్నీ, గ్రహాల కదలికలను చెప్పడు. అయితే వీరు నోటితో వల్లించే సాహిత్యం మాత్రం, ఒకదాని కొకటి పొంతన లేకుండా వుంటుంది. ఈ రకంగా వీరు, ఈ విద్య ద్వారా గ్రామ ప్రజలను ఆకర్షించి, వారికి భవిష్యత్తును చెపుతూ గ్రహ దోషాలను తొలగిస్తూ, వ్వాచన చేస్తూ జీవిస్తున్నారు. వీరి కోసం ఎదురు చూసేవారు తెలంగాణా పల్లెలలో ఎంతోమంది వున్నారు... వీరి వేషధారణే పెద్ద ఆకర్షణ.