తెలుగువారి జానపద కళారూపాలు/గావులాటలు
గావులాటలు
ఈనాటికంటే ఆనాడు పల్లె ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా వుండేవి. గ్రామలో కలరా లాంటి ఏ అంటు వ్వాధి సోకినా, పశువులకు వ్వాధులు సోకినా అమాంతం గంగానమ్మకో, మహాలక్ష్మమ్మకో, మారెమ్మకో, మరిడమ్మకో, మహంకాళికీ, నాంచారమ్మకో కోపం వచ్చి ఈ విధంగా జరిగిందనీ, ఇది గ్రామానికి కీడనీ, ఈ గ్రామదేవతల్ని తృప్తిపరిస్తే గ్రామ సుఖంగా వుంటుందనీ ఎంచి జాతర్లూ జంతు బలులూ చేస్తూ వుంటారు.
ఈ జాతర్లలో గణాచార్లు అధిక ప్రాముఖ్యం వహిస్తారు. సాక్షాత్తు ఆయా దేవతలు వారిలో ప్రవేశించి ఆవేశ పూర్వకమైన పూనకంతో నృత్యం చేస్తూ వరాల నడుగుతూ ఊగి పోతూ,డప్పు వాయిద్యాలకూ, వీరణాలకూ, కొమ్ము బూరలకూ అనుగుణంగా నృత్యం చేస్తారు. ఈ నృత్యం చాల ఆవేశపూరితంగా వుంటుంది. గణం పూనిన వ్వక్తి ఒక విలక్షణ వ్వక్తిగా కనిపిస్తాడు. సాక్షాత్తు గ్రామ దేవతలానే ప్రవర్తిస్తాడు.
తల విర బోసి, వేప మండలు చేతబూని,పసుపు కుంకాలతో అలంకరించుకుని గరగను నెత్తిన బెట్టుకుని విన్యాసం చేస్తాడు. క్రమేపీ గణం తగ్గిన తరువాత లాస్యంగా నృత్యం చేస్త్యాడు. ఈ గరగలను కొన్ని చోట్ల ఘటం కుండ అంటారు. ఒకో ప్రాంతంలో ఒకో రకంగా పిలుస్తారు. గరగ ఇత్తడితో కుండలా చెయ్య బడుతుంది. కుండ మూతి చుట్టూ పడగ విప్పిన పాము చుట్టబడి వుంటుంది. ఆ గరగకు కుచ్చిళ్ళు పోసి కోక లాగా అలంక రిస్తారు. పసుపు, కుంకుమ వేప ఆకులతో అలంకరిస్తారు. ఆ కుండను పవిత్రంగా గ్రామ ప్రజలు చూస్తారు.
గరగల నెత్తుకుని పూనకంతో ఊగి పోయే వారిని కొన్ని ప్రాంతాల్లో అసాదు లంటారు. మరికొన్ని ప్రాంతాల్లో గణాచార్లు అంటారు. అంటే ఆయా దేవతలకు వారే పూజారులన్న మాట. ఈ పూజారుల పూనకం ఒకోసారి తారాస్థాయికి చేరుకుంటుంది. ఎన్ని కొబ్బరి కాయలు కొట్టినా ఎంత సాంబ్రాణి ధూపం వేసినా, ఆ మత్తులో నుండి క్రిందకు దిగరు. ఒళ్ళు అలిసి పోయినా తరువాత వారంతట వారే శాంతిస్తారు. వీరిని ప్రజలు సాక్షాత్తు దేవతల్లానే అరాధించి హారతులిస్తారు. ఈ ప్రదర్శన గ్రామ వీధుల్లో జరుగుతింది. ఈ గణాచార్ల నృత్యాన్ని గావె అంటారు. గణంతగ్గడానికి కోడి పిల్లల్ని అందిస్తారు. వాటిని నోటితో కొరికి రక్తాన్ని రొమ్ము మీదకు జారవిడుస్తారు. ఆ సమయంలో వాయించే ఉధృత వాయిద్యాలు చూపరులకు కూడ ఉద్వేగాన్ని కలిగిస్తాయి. గ్రామమంతా ఈ సంబరాల్లో పాల్కొంటారు. తెల్ల వార్లూ జాగరం చేస్తారు. తరువాత ఆ దేవతల్ని గ్రామ పొలి మేరలో వదిలి వేస్తార.