తెలుగువారి జానపద కళారూపాలు/ఏకపాత్రాభినయ గానం - హరికథా గానం

ఏకపాత్రాభినయ గానం, హరికథాగానం


ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాలలో ముఖ్యమైన హరికథా గానం ఆంధ్రుల హరికథా చరిత్రలో హరికథ ఒక ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది. దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వారు శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు.

హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్ర ధారి మూడు గంటల కాలం కథా గానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితో నృత్యమూ చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయ మైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలో వున్న ప్రత్యేకత ఇదే. మూడు గంటల కాలం కూర్చున్నా ప్రేక్షకులకు విసుగు జనించ కుండా పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్య రసాన్ని పోషిస్తూ సమాజంలో వున్న కుళ్ళు ఎత్తి చూపిస్తూ, వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరి కథను గానం చేస్తాడు.

వేషలు, భూషలు:

కథకుడు కేవలం అతని ప్రతిభవల్లనే ప్రేక్షకులను హరి కథతో రంజింప జేయగలడు. హరికథకుని వేషధారణ కూడ సామాన్యమే. చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు.

కట్టుకథలు కావు అచ్చంగా హరికథలే:

హరికథకులు రామాయణం, భారతం, భావతం మొదలైన అధ్యాత్మిక సంబంధమైన కథలను విరివిగా చెపుతూ వుంటారు. సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం మొదలైన కథలు వరుసగా పది హేను రోజులూ, నెలరోజుల వరకూ గూడా సాగుతాయి. పట్టణాలలోనూ గ్రామాల్లోనూ పనుల తరుణం అయ పోయిన తరువాతా, పర్వ దినాలలోనూ ఆంధ్ర దేశపు హరిదాసులు ఈ కథలు చెపుతూ వుంటారు.

హరికథల ప్రాచీనత:

హరికథల స్వరూపం వేద కాలం నాటిదనీ, సర్వజ్ఞులయిన మహర్షులు ఈ హరి కథా శిల్పాన్ని ప్రప్రధమంగా సృష్టించారనీ పండితులు నిర్ణయించారు. బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ హరికథా గానం చేస్తూ వుంటాడని ప్రతీతి. వేద విభజన చేసినా, అష్టాదశ పురాణాలను లిఖించినా మనశ్శాంతి పొందనేరని శ్రీ వ్వాసునకి శ్రీ మద్భాగవతం రచించి హరికథామృథాన్ని పంచిపెడుతూ మానవోద్ధరణ గావింపునని నారదుడు ఆదేశించాడు. తరువాత శుకదేవుడు, సౌనకాది మహర్షులు, సూతుడూ హరికథా రూపకమైన భాగవతాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేశారని పాతూరి ప్రసన్నంగారు 1965 పిబ్రవరి 'నాట్యకళ ' సంచికలో వివరించారు.

రంగస్థలము, రంగైన ప్రదర్శనం:

హరికథా ప్రదర్శనాలు రాత్రి పూటే జరుగుతూ వుంటాయి. ఇవి ముఖ్యంగా, గణపతి నవరాత్రులు, దశరా, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి పర్వ దినాలలో విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ ప్రదర్శనానికి ఖర్చు చాల తక్కువ. ఒకేనాటి ప్రదర్శనమైతే, గ్రామం మధ్య పెద్ద బజారులో గాని, విశాలమైన మైదానంలో గాని ఒక చిన్న పందిరి వేసి పందిరిలో ఎత్తైన దిబ్బను గాని, చెక్కలతో చిన్న స్టేజిని నిర్మించి గానీ రెండు ప్రక్కలా కాంతి వంతమైన పెట్రో మాక్సు లైట్లను అమరుస్తారు. ఆరుబైట ప్రేక్షకులు కూర్చుంటారు. అదే కథ ఒక నెల రోజులు చెప్ప వలసి వస్తే ఒక పెద్ద పందిరి వేసి దానిని చక్కగా అలంకరిస్తారు.

సన్మానాలూ, సత్కారాలు:

ఒకే రోజు కథకైతే, ఏదో ఒక పారితోషికాన్ని హరిదాసుకు ముట్ట జెపుతారు. అదే నెలరోజుల కథలు జరిగిన తరువాత హరిదాసు ఇంటింటికీ వెళ్ళి ప్రతివారినీ కలుసు కుంటాడు. నెల రోజుల పాటు మదులకు నెమ్మదిగా హరి కథను విని ముగ్దులైన ప్రజలు భక్తి ప్రవత్తులతో దాసుగారిని గౌరవించి ఎవరికి తోచింది వారు సమర్పిస్తారు. ఇలా హరి దాసు మొత్తంమీద అందరి వద్దా చేరి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసుకుని సంతృప్తిగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా గ్రామ గ్రామాలు తిరిగి హరిదాసులు కార్యక్రమాలిస్తూ వుంటారు. మరి కొందరు ప్రతి సంవత్సరమూ వార్షికంగా ఆయా ప్రదేశాల్లో ఈ కథలు చెపుతూ వుంటారు.

సినిమా, నాటకం అభివృద్ధి కాక పూర్వం గ్రామాల్లో ఇతర జానపద కళారూపాలతో పాటు ఎక్కువ ప్రజాదరణను పొందిన కళారూపాల్లో హరికథ చాల ముఖ్యమైంది. ఏది ఏమైనా అనాటి నుంచి ఈనాటివరకూ శిధిలం కాకుండా నానాటికీ క్రొత్త రూపును సంతరించుకున్న కళారూపం హరికథ.

ఈ హరి కథను అత్యంత ఉత్తమ కళారూపంగా తీర్చి దిద్ది దానికొక గౌరవాన్నీ, విశిష్టతనూ చేకూర్చినవారు ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఆయ ఎన్నో హరికథలు రచించారు. ఎంతో మంది ఉద్ధండులైన శిష్య ప్రశిష్యులను తయారు చేశారు.

ఇంటా బయటా ఇంచక్కని పేరు పొందిన ఆదిభట్ల నారాయణదాసు:
ఆటపాటలమేటి ఆదిభట్ల నారాయణదాసు

ఆదిభట్ల నారాయణ దాసు 1864 వ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలో సువర్ణ ముఖీతీరంలో వున్న అజ్జాడ గ్రామంలో జన్మించారు. వీరు ద్రావిడ బ్రాహ్మణులు. తల్లి నరసమాంబ. తండ్రి వేంకటచయనులు, చిన్ననాడే తల్లి ద్వారా భాగవతాన్ని విని అధ్యాత్మికత్వాన్ని జీర్ణించుకున్నారు. తండ్రి ద్వారా పాండిత్యాన్నీ, కవిత్వాన్నీ నేర్చుకున్నారు. నారాయణ దాసు గారు స్వయంకృషి వలన సకల విద్యల్నీ అపారజ్ఞానాన్ని సంపాదించారు. దాసుగారు బొబ్బిలి వాస్తవ్యుడైన వాసా సాంబయ్య వద్ద కొంతకాలం వీణ నేర్చుకున్నారు. తరువాత విజయనగరం మహారాజావారి కాలేజీలో యఫ్.ఏ. వరకూ చదివి తరువాత ఆంగ్ల విద్యకు స్వస్తి చెప్పారు.

దాసుగారు ప్రప్రథమంగా యక్షగానాలను తరువాత హరికథా ప్రబంధాలను రచించారు. షేక్స్ పియర్, కాళిదాసు గ్రంధాలను అనువాదం చేశారు. వీణా వాదన లోనూ, నృత్య సంగీతాల్లోనూ అసమానమైన ప్రజ్ఞను సంపాదించారు. లయలో ఈయన సామర్థ్యం సాటిలేనిది. చల్లపల్లి జమీందారు గారిచే గజయాన, గండపెండేర సత్కారాన్ని పొందారు.

దర్బారుల్లో దర్జాగా సన్మానాలు:

పిఠాపురం, ఏలూరు, విజయవాడ, బళ్ళారి, మద్రాసు నగరాల్లో హరికథా ప్రదర్శనాలనిస్తూ అనేక సంస్థానాల్లో సత్కారాల నందుకున్నారు. బెంగుళూరులో తన హరికథా కథన ప్రజ్ఞను ప్రదర్శించి మైసూరు మహారాజా దర్బారున కాహ్వానింపబడి గొప్ప సన్మానాన్ని పొందారు.

ఈ విధంగా అన్య ప్రాంతాల్లో సన్మానాల నందుకున్న దాసుగారి కీర్తిని గుర్తించిన ఆనంద గజపతి మహారాజు దాసుగారిని అహ్వానించి దర్బారు పండితుణ్ణిగా చేసారు. ఆనంద గజపతి మరాణానంతరం దాసు మరల ఆంధ్రదేశ మంతటా హరికథ ప్రదర్శనాలిచ్చారు.

1919 వ సంవత్సరంలో ఆనాటి విజయనగర సంస్థానాధీశ్వరుడు శ్రీ విజయరామ గణపతి సంగీత పాఠశాల నొకదానిని స్థాపించి దానికి ఈయనను అధ్యక్షులుగా నియమించారు. ఈ పదవిలో ఆయన 17 సంవత్సరాలు పని చేశారు. 1936 లో ఉద్యోగాన్ని వదిలి వేశారు. వృద్యాపం వచ్చే కొద్దీ కథలను తగ్గించి అనేక మంది శిష్యుల్ని తయారు చేసి ఆంధ్రదేశ హరికథా పితామను డనిపించుకున్నారు. 1945 వ సంవత్సరం జనవరి 2 వ తేదీన మరణించారు.

శిష్యులూ, ప్రశిష్యులూ:

80 సంవత్సరాలు జీవించారు. వీరి శిష్యులైన వారు నారాయణదాసు సాంప్రదాయాన్ని అపారంగా ప్రచారం చేశారు. వీరేగాక, పాణ్యం సీతారామ భాగవతార్, పట్రాయని సీతారామశాస్త్రి, ప్రయాగ సంగయ్య, బాలాజీదాసు, కోసూరి భోగలింగ దాసు, తంపిళ్ళ సత్యనారాయణ, ఎరుకయ్య మొదలైన మహమహు లెందరో ఆంధ్ర దేశంలో హరిథా గానాన్ని ప్రచారం చేశారు.

ప్రసిద్ధ హరిదాసులు:

పై వారే గాక, వడ్లమాని నరసింహదాసు, ఉమాకాంత దాసు, బాలబ్రహ్మనంద దాసు, బులుసు పాటివెంకటప్పయ్య, బెజవాడ లింగ మూర్తి, భమిడిపాటి వెంకటరమణ, చిట్టిమళ్ళ రంగయ్యదాసు, శలక వరపు లింగమూర్తి శర్మ, పెద్దింటి సూర్య నారాయణ దీక్షిత దాసు, పాతూరి మధుసూదన రావు, చొప్పల్లి సూర్య నారాయణ భాగవతార్, మహావాది వెంకటప్పయ్య, కోసూరి పున్నయ్య, కొండపల్లి కళ్యాణ దాసు, మైనంపాటి నరసింగ రావు, కడలి వీర దాసు, శ్రీమాతి ఆర్. దుర్గాంబ, మహేంద్రవాడ కామేశ్వర రావు, పిల్లలమఱ్ఱి రామదాసు, ములుకుట్ల సదాశివ శాస్త్రి, రాజశేఖరుని లక్ష్మీపతి రావు, పొడుగు పాండురంగ దాసు, తాతిన సీతారాయ్య, ములుకుట్ల పున్నయ్య శాస్త్రి, శ్రీమతి యస్. రాజకుమారి చౌదరి, నవుడూరి విశ్వనాథ శాస్త్రి, పొట్లూరి వెంకట రామయ్య, ముట్నూరి సూర్య నారాయణ శాస్త్రి, బంకుపల్లి సింహాచల భాగవతార్, చిట్యాల ఆంజనేయ భాగవతార్, శ్రీ మతి బేబి రాణి, బసవలింగం, అమ్ముల విశ్వనాథం, కోట్ఘ సచ్చిదానంద శాస్త్రి మొదలైన ప్రసిద్ధ హరికథకులు నారాయణ దాసు లాంటి పెద్దల బాటల్లో నడిచి హరికథ కళను ప్రచారం చేశారు.

మరుపురాని మరికొందరు హరిదాసులు:

ఈనాడు ఆంధ్ర దేశంలో హరికథగానకళ విస్తృతంగా వ్యాపించి ప్రజల నెంతగానీ ఆకర్షిస్తూంది. రాష్ట్ర వ్వాపితంగా ఈ కళను ఈ క్రింద ఉదహరించిన ఎంతో మంది కళారాధకులు ప్రచారం చేస్తున్నారు. మిక్కిలి

నేని పరంధామయ్య (కోవెన్ను), ఘట్టి శేషాద్రి (రేలంగి). చదలవాడ వెంకట్రాయుడు (భీమవరం). వీర్ల రామచంద్రయ్య (తణుకు) , చిట్యాల పార్థ సారథి (తాడేపల్లి గూడెం) అన్నమనీడి బాలకృష్ణ (రామచంద్ర పురం). మట్టా వజ్ర శేఖర్ (వుప్పాక పాడు), గూన పల్లి తాతావారావు (రామచంద్ర పురం), సుంకర నరసింహారావు (కొమరగిరి పట్నం), కొనకళ్ళ చిన వెంకన్న (రావులపర్రు), బద్దిరెడ్డి సుబ్బారావు (సుందరపల్లి), అయినం అప్పలదాసు( తాడేపల్లి గూడెం), తాడేపల్లి వరలక్ష్మి (తెనాలి), ముట్నూరి కుటుంబరావు(పెదకళ్ళే పల్లి), వాజపేయాజుల రామ నాథశాస్త్రి

(వుంగుటూరు), యాళ్ళబండి శారద (తాడేపల్లి గూడెం), ఆత్మకూరు గురు బ్రహ్మగుప్త (పిడుగురాళ్ళ ) వంగవోలు సుబ్బారావు (చెన్నయ్యపాలెం), తిరునగరి సత్యవాణి (తెనాలి), కోట సుబ్బా రావు (కొండయ్య పాలెం), శీలం నారాయణదాసు (నర్సాపురం), గిడుతూరి మాణిక్యాంబ (పత్తేపురం), బృందావనం రంగాచార్యులు ( తాడేపల్లి), రాయిపూడి సాంబశివరావు ( చావలి), నడింపల్లి నారాయణ రాజూ (ఉండి), వేపూరి పోతరాజు (కోనేటి పురం), గూడవల్లి సూర్యనారాయణ (రామచంద్ర పురం) , శీలం గంగరాజు ( పెనుగొండ) , తిరువాయిపాటి రామారావు ( తెనాలి),వఝ్ఝూ అప్పయ్య చౌదరి (గోలమూడి,) ముద్దుల కోటేశ్వర గుప్త ( పాలకొల్లు), సిగిడి సూరారావు( ఉండి), వీరగంధం వెంకట సుబ్బారావు ( తెనాలి) , జి.వి. శివయ్యదాసు (పెడన), మెట్ట బలరామ మూర్తి (ఉండి),అవుతు సోమారెడ్డి (చినపరిమి) అక్కిపెద్ది శ్రీఈరామ శర్మ (విజయవాడ), వంకా వెంకట్రామయ్య ( తణుకు) సజ్జల చిన ఓబుల రెడ్డి (కొప్పోలు), తుమ్మిరిసి హనుమంత రావు ( త్యాజంపూడి) , కంచర్ల బాలకృష్ణదాసు (తాడేపల్లి గూడెం) , తాడాల వెంకటరత్నం ( పొలమూరు), కాపవరపు పాపారావు ( పెదమొరం), మెట్టా వెంకఆటేశ్వర రావు (కైకరం), కన్నేపల్లి నీలకంఠశాస్రి. ( ఉండి. ), నంద్యాల రాయుడు (తాడేపల్లి గూడెం), నడింపల్లి విశ్వనాథ శాస్త్రి ( గరికి పర్రు) బాసం శెట్టి మల్లయ్య (మాముడూరు), బి.సింహాచలం ( పెరమరం), ముకుకుట్ల సీతారామశాస్త్రి ( తాడేపల్లి గూడెం), తాడాల నరసింహస్వామి, పొలమూరు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి( తణుకు), కాజన విశ్వరూపాచారి (శిరిపురం), ఆకురాతి నాగేంద్రం ( పెడన), వృధివి బసవ శంకరయ్య( పెడన), జోశ్యుల సత్య నారాయణ (శీనలి) , ఖండవల్లి తారక రామం ( ఎదురు లంక, యానాం), ముదుపాక మల్లేశ్వర రావు (భీమవరం), కల్లే బాలకృష్ణదాసు (విజయవాడ), అంబటిపూడి శివరామ కృష్ణ మూర్తి(విజయవాడ), శభాన రామారావు ( వేలపర్ల), డి. జ్యోతిర్మయాంబ (ఏలూరు) , గోవర్థనం వెంకటాచార్యులు (కేశవరం) , పంచాగ్నుల విశ్వనాథ శర్మ (సికిందరాబాదు), షణ్ముఖి లోకనాథ రాజు (భీమవరం), పట్నాల వీరభద్రాచార్యులు ( చాగల్లు), కోట ల్లక్ష్మీకాంతం ( వంగోలు), మల్లాది శ్రీరామ మూర్తి ( ఏలూరు,) ఎ. సత్యనారయణ (మండపేట), వి.రామమూర్తి,( ద్రోణాచలం), ఆదిలక్ష్మి శర్మ (ఏలూరు), బి. కాశీవిశ్వనాథ్ (గద్వాల) వేములవాడ జగన్నాధం పంతులు (తెనాలి), పెండెం ధర్మారావు (ముమ్మిడివరం), వెలిదెన నరసింహమూర్తి (వరంగల్), జవ్వాజి నాగమణి (అనంతపురం), బాల సుందర భాగవతార్ ( భీమవరం), బాదం బాలసుబ్రహ్మణ్య గుప్త (కాకినాడ), శేషభట్టరు భావనాచార్యులు నిడుమనూరు (నల్లగొండ)

సలాది భాస్కర రావు (కాకినాడ), కొచ్చర్ల మల్లేశ్వరి, ముని ముని లక్ష్మి, కరకాంపల్లి, (చిత్తూరు జిల్లా), ఎ. రంగమాంబ భాగవతారిణి (తిరుపతి) , నదితోక రూపకుమారి ( పార్వతీ పురం), తూములూరి లక్ష్మణ శాస్త్రి. (విజయవాడ), సి.హెచ్. లక్ష్మీనరసింహాచార్యులు ఉప్పల్ (హైదరాబాదు) , తరకటూరి లక్ష్మీ రాజ్యం భాగవతారిణి (మచిలీ పట్నం), మంగిపూడి వెంకటరమణ మూర్తి ( రాముడు వలస), ముప్పవరపు వెంకట సింహాచల భాగవతారు, (పాత గుంటూరు), వీరగంధం వేకట సుబ్బారావు భాగవతారు ( తెనాలి), కలికివాయి విజయ శ్రీ, భాగవారిణి (తాడేపల్లి గూడెం) మహారెడ్డి శ్రీనివాసరావు (నరసన్న పేట), సంగమారాజు మణి భాగవతారు (సత్యవీడు), గరిమెళ్ళ సత్యవతి భాగవతారిణి (మదనపల్లి), నిడుముక్కల సాంబశివరావు, అరండల్ పేట,(గుంటూరు), గునపల్లి సూర్య నారాయణ భాగవతార్, నాంపల్లి, (హైదరాబాదు). పునుగు శేషయ్య శాస్రి, మెహిదిపట్నం (హైదరాబాదు), వేరేకాక తూర్పు గోదావరి జిల్లాలో వోడారేవు రామారావు, వేదంభట్ల వెంకట రామయ్య, సూర్తావారు, మరువాడ రామమూర్తి, బాలాంత్రపు లలిత కుమార్ మొదలైన వారెందరో రాష్ట్ర వ్యాపితంగా హరికథా గానం చేసి పేరెన్నిక గన్నారు. పైన ఉదహరించిన వారిలో అనేక మంది కీర్తి శేషులయ్యారు. మరెంతో మంది వృద్ధాప్యంతో బాధలు పడుతున్నారు.

పై నుదహరించిన హరికథా గాయకుల వివరాలను బెంగుళూరి మేలు కలయిక వ్వవస్తాపకుడు డి.ఆర్. శ్రీనివాస మూర్తిగారు నాకు అంద జేసి ఎంతో సహకారం అందించారు, వారికి నా కృతజ్ఞలు. ఇంకా మరెందరో

హరి కథా గాయకులు వుండవచ్చు. కావాలని ఎవరినీ విస్మరించ లేదు. వారి సమాచారం కాను అందక పోవటం వల్ల వారి పేర్లూ ఉదహరించ లేక పోయినందుకు విచారిస్తున్నాను,.