తెలుగువారి జానపద కళారూపాలు/అనంతపురం ఆణిముత్యం మెరవణి గద్య

అనంతపురం ఆణిముత్యం మెరవణి గద్య


మెరవణి అంటే వధూవరుల ఊరేగింపనీ, అనంతపురం, బళ్ళారి, కర్నూలు జిల్లాల లోనూ మెరవణీ అనే ఒక ప్రత్యేకమైన వేడుక వాడుకలో వుందనీ, పెళ్ళి వుత్సవానికి సంబంధించిన గద్య మెరవణీ గద్య అనీ, తలంబ్రాల సంబరం తరువాత రాత్రిపూట మెరవణి బండి మీద నూతన దంపతులు ఊరేగేటప్పుడు తమకు గల చీరలు నగలు పది మందికీ ప్రదర్శించటానికి ఇదొక మంచి అవకాశమనీ, ఊరేగింపులు, ఓ వాద్య బృందం నాయకుడు గద్యను చదువుతాడనీ, దీనినే పొగిడింపులు, పొగడింఫుల గద్దె అంటారనీ, ఇలా చదివే అంగారకులకు 'ఓజు' అన్నది బిరుదు నామమనీ (తూమాటి దోణప్ప గారు తమ జానపదస కళా సంపదలో వివరించారు.

ఆడవారూ, ఆడంబరాలు:

ఉభయపక్షాల స్త్రీలకూ ఇదొక మంచి అవకాశం. బంగారు జస్రీ పట్టు చీరలతో రెప రెపలాడుతూ, ఏడు వారాల నగల నిగనిగలతో ప్రతి ఒక అమ్మా కోవెలలోని అమ్మలాగా, మహా శిల్పి చెక్కిన జగదేక సుందరి బొమ్మలాగా ఊరేగింపులో కనిపించాలని ఉవ్విళ్ళూరుతుంటుంది. ఇంట లేకపోయినా, పొరుగింటి నుంచో, పుట్టింటి నుంచో ఎరువు తెచ్చిన బరువు సొమ్ముల్ని ఒంటినిండా ధరిస్తారు.

ఊరేగింపులో రెండెడ్ల బండిని సాధారణంగా వాడతారు. కాని నేటి నాగరికత ననుసరించి టాపులేని మోటారు కారు వాడుకలోకి వచ్చింది. బండికి చేసే అలంకారాన్నీ గూర్చీ, ఏడ్లకు చేసే ముస్తాబును గూర్చీ ఒక వ్వాసమే వ్రాయవచ్చంటారు దోణప్పగారు.

కొమ్ములకు కుప్పెలు, రంగు రంగుల ఊదా దారాల గుత్తులు, మోరకు కుచ్చుల పణకట్లు, పిబోరాలు, మెడలో రకరకాల గంటల పట్టెడలు, వీపున ఖరీదైన మొఖ్మల్ గౌనులు, ఇలా ఎన్నో రకాల అలంకరించిన ఎడ్ల బండి మీద నట్ట నడుమ ఎత్తైన కుర్చీలూ, కుర్చీలపైన బనారస్ తాపితాలు పరచి వాటిపై వధూవరులు కూర్చుంటారు. పెళ్ళి కొడుక్కి కుచ్చుల తలపాగా లేక రుమాలు, తలపాగా పైన కలికి తురాయి బాసికం, చేతిలో డిబాకు, మెడలో చంద్ర హారాలు, పూదండలు, ముంజేతికి కంకణాలు, సిల్కు దుస్తులు, పెళ్ళి కూతురుకు పూల జడ, మేలిముసుగు, బాజు బందులు, మెడలో కాసుల పేరు, రవ్వదుద్దులు, చెంపసరాలు, బుగ్గ కాటుక బొట్టు, పాపటబిళ్ళలు, జడ కుచ్చులు, రవ్వల ఒడ్డాణం, నుదుత బాసికం, జిగేల్మనిపించే బనారసు పట్టు చీరె రవికె.

ఊరేగింపు ఉత్సాహం:

వధూవరుల కుర్చీలకు ముందు వెనకా బండి నిండా పెళ్ళివారి పిల్లలు, బండి తోలేవాడి వేషం వేరు. బండికిముందూ వెనుకా రెండు ప్రక్కలా పెట్రోమాక్సు లైట్లు ఎత్తి పట్టుకునే మనుషులు ఊరేగింపు ముందు బాగాన దివ్వేటీలూ, బాణాసంచా కాల్పులూ, బండికి నాలుగు ప్రక్కలా ఉభయ పక్షాలవారి అడా, మగా పెళ్ళి వారి ఊరేగింపును చూడ దానికి వచ్చిన ఊరి జనం వీథుల నిండ మేడ మెద్దెల నిండా తొడ తొక్కిడిగా వుంటారు.

బండికి ముందు పురుషులూ, వెనక స్త్రీలూ, నడవడం మామూలు. బండికి ముందు నడుస్తున్న పురుషుల గుంపునకు ముందు వాద్య కారుల బృందం ప్రత్యేక దుస్తులు ధరించి వుంటారు. ముఖ్యమైన కూడలి స్థలాలలో బండి ఆపి నప్పుడు, మేళ నాయకుడు వధూవరుల కభిముఖంగా తిరిగి మెరవణి గద్దెను ఆశువుగా పఠిస్తాడు.

ఆసాది, కొరిచె:
ఆసాది కొరిచె తెగల వారు వాయిద్యాలను వాయించే విద్యను నేర్చుకున్నట్లే మెరవణీ విద్యను కూడా నేర్చుకున్నారు. మెరవణి గద్య పొడిగింపు అతి సుంద
రంగా వుంటుంది. ఆ కోలాహలాన్ని చూచి ఆనందించి అనుభవించాల్చిందే గాని వర్ణించటం సాధ్యం కాదంటారు. గద్య చదివే సందర్భంలో బండిని ఆపి వేస్తారు.

గద్య చదివే నాయకునికి వంత దారులు ఊతమిస్తూ, గద్యను అతి సుందరంగానూ, శ్రావ్యంగానూ వల్లిస్తూ మధ్య మధ్య బుర్రకథలో మాదిరి భళి భళీ అనీ, బాపురే అనీ, అయ్యయ్యో సిగ్గు సిగ్గూ అనీ, గద్యకు వంత పలుకుతూ మేళ నాయకునికి ఊతమిస్తారు. మేళ నాయకుడు మెడలోనూ, కుడిచేతి మణి కట్టుకూ గుబాళించే మల్లెపూల దండలను ధరిస్తాడు. మంచి నిషాలో వుండి ఖుషీగా మెరవణి గద్యను పఠిస్తూ, జనాన్ని హుషారు పరిచే భంగిమల్లో ఊగి పోతుంటాడు. ఉభయపక్షాల బంధువులే కాక, ఊరి జనానికి కూడ ఇదొక ఆనందదాయకమైన వేడుక.

స్త్రోత్ర పాఠానికి ఉదాహరణ

వోహో హోయ్ యోయ్
పాగల రాతి గుండు పగల గొట్టగ వచ్చు
కొండ లన్నిటి పిండి గొట్టవచ్చు
విశ్వదాభి రామ వినుర వేమ.

అదేమాదిరి,

తూమాటోళ్ళ నారణప్ప అంటే
చప్పన్నారు దేశాలలో సరదారు
ముప్ఫై ఆరు పల్లెల్లో మంజూరు
యొక్కంగ గుఱ్ఱాలు - ఏడూర్ల పెత్తనం
కుచ్చుల్ల తురాయి - పచ్చల్ల పల్లకి
ఐదేళ్ళ కుంగరాలు - అస్తి కడియాలు
ఇదిగో అంటే - ఇరవై మంది
పని బడితే పాదాల కడ - పదివేల మంది
నారప్ప ముట్టింది ముత్యమై
పట్టింది బంగారమై
ఎద్దు తొక్కిన భూమి
యెయి పుట్లు పండింది.

గాదె పెట్టిన తోన కనక సిరి పంట పండె
మారుగేరీ సబ్బండు జాతులు
డెబ్బైయేడు కులాలు, తగ్గినా ముగ్గినా
కంటికి రప్పై, కాలికి చెప్పై కాపాడో
జోపానం చేసినాడు.
నారణప్ప అంటే త్యాగవల్లి కర్ణ,
భోగదల్లి దేవేంద్ర,
సత్యదల్లి హరిశ్చంద్ర మేళ గాళ్ళకు చదివిం
చినజోడు కానుకలు దక్కైనా హోయ్ దక్కె.

నిందలూ, నిష్టూరాలూ:

మెరవణీ గద్యలో కేవలం స్త్రోత్ర పాటాలే వుంటాయనుకోనక్కార లేదు. నిందా పాఠాలూ వున్నాయి. అలాంటిదే మచ్చు కొకటి.

దో హోహోయి
చీచీచీ చీమలపుట్ట - రెక్కల్లేని కోడి పెట్ట
నీ నోట్లో పుండు బుట్ట - నిన్ను ముదిరి పెట్ట
నీ కాళ్ళూడగొట్ట - వోహోహో
పెండ్లి కొడుకు బావమర్ది - పేడి మూతి
పెద్దయ్య వుండాడే - యలకను జూస్తే యదబడతాడు
పిల్లిని జూస్తే పారిపోతాడు
పీతిరి గుంతల్లో పొర్లాడి
జలారి గుంతల్లో జలకాలాడి
చినుగుల చల్లాడం గట్టుకోని
గోనిపట్ట రుమాలు జుట్టుకోని
నల్ల గంబడి కోరి కప్పుకోని
పెండ్లి బోజనానికి వచ్చినాడు
అదిగో ఇదిగో అని పోయినాడు

అనంతపురం ఆణిముత్యం మెరవణి గద్య

అదే పోత; ముసురు తొట్టిలో మూల్గుతుంటాడో
దొంత కుండల్లో దొల్లు తుండాడో
బాన కడుపుతో పాకుతుండాడో
దోని కడుపుతో దోకు తుండాడో
యాడాడ వుండాడో, యెక్కడుండాడో
పెండ్లి కొడుకు కింద
పెండ్లి కొడుకు అన్న దమ్ముల కింద
డక్కోలా హోయి డక్కోలు
బరాబరి వాహోయి బరాబరి.

ఈ విధంగా మెరవణీ గద్య సాగుతుంది. గద్దె పాఠకులు ఆయా భావాల కనుగుణగా హావభావలతో పాడుతూ వుంటే ప్రేక్షకులు ముగ్దులై వింటారు.