తెలుగువారి జానపద కళారూపాలు/ఆసువిద్యకు ఆలవాలం వాలకం

ఆసువిద్యకు ఆలవాలం వాలకం


ఈ నాటికి పల్లెటూళ్ళలో, వారి వాలకం చూడు, వారి వాలకం ఏమీ బాగాలేదు, వాళ్ళ వాలకం ఎమిటో తెలియడం లేదు. ఆయ్య వాలకం చూడు, వాడి వాలకం తగల బడ్డట్టుంది. అనడం సర్వసాధారణం గా అందరికీ తెలిసిందే. వాడి వాలకం చూడు అనే సంబోధనలో, వాడి వైఖరి చూడు అన్న అర్థం మనకు స్పురిస్తుంది.

అయితే ఈ వాలకం అనేది ఒక కళా రూపంగా వర్థిల్లినట్లూ, అది బహుళ వ్వాప్తిలో ఒకనాడన్నట్లూ అవి అన్నిచోట్లా ప్రచారంలో లేక పోయినా, ఈ నాటికి విశాఖపట్టణం జిల్లాలో వాలకం... కళా అరూప ప్రచారంలో వున్నట్లు రాంభట్ల కృష్ణమూర్తి గారు నాట్యకళలో ఉదహరించారు.

వాలకం అంటే:

వాలకం ఒక రకంగా ఆశువిద్య. నలుగురు నటులు రంగం మీదికి ప్రవేశించి, అప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని ఊహించుకునో, ఆశువుగా సంభాషణల్ని కూర్చుకుని అభినయిస్తారు. ఈ పద్ధతి పాశ్చాత్య దేశాలలోనూ, మన దేశంలోనూ పలుచోట్ల దీనిని ఎక్స్ టేంపోర్ నాటకంగా ప్రదర్శిస్తున్నారు. ఒక రకంగా ఆలోచిస్తే ఇది విశిష్ట కళారూపమే. ఆశువుగా ఒక విషయాన్ని కళాత్మకంగా చిత్రించి దానిని పరిష్కరించడం ప్రతిభావంతమైన విషయం. న్యాయానికి ఇది ఒక ప్రధాన ప్రక్రియ లాంటిది.

వీధి ప్రదర్శనం:

ఇది వీథి ప్రదర్శనమే. దీనికి పెద్ద రంగస్థల హంగులూ అవీ కూడ అవసరం లేదు. ఎత్తుగా వున్న దిబ్బ రంగ స్థలంగా ఉపయోగపడుతుది. వాలకం యొక్క ఇతి వృత్తం సమకాలీన సమస్యలకు సంబంధించి వుంటుంది. జటిల హీన సాంఘిక సమస్యలకు పరిష్కారాలను కూడ చూపిస్తుంది. సంభాషణలు అతి చాతుర్యంగానూ, హాస్య ప్రధానం గానూ, చతురోక్తులతో కూడినవిగా కూడా వుంటాయి. ముఖ్యంగా యక్షగానం, వీధి నాటకాలలో మాదిరి విదూషకుడు ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాడు. ఈ కళారూపంలో వాలకం విజ్ఞాన దాయకమైన, వినోదాత్మకమైన విశిష్ట కళారూపం. సంఘంలో వున్న కుళ్ళును అద్దం పట్టినట్లు చూపించి, ప్రేక్షకులకు కనువిప్పు కలిగిస్తుంది. పై అధికారుల నుండి పల్లెటూరి అధికారుల పెత్తందారుల వరకూ అందరి అవకతవక బ్రతుకుల్నీ ఎండ కడుతుంది. అయితే ఈ ప్రదర్శనాన్ని ఎవరు బడితే వారు ప్రదర్శించడం కష్టమే. ఎందు కంటే ప్రదర్శించే వారికి సమయ స్పూర్తి, చాకచక్యం చాల అవసరం. అదీ గాక వ్రాత పూర్వకమైన ఇతి వృత్తాలు లేక పోవడం వల్ల ఈ కళా రూపం యొక్క సంప్రదాయాన్ని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

రాంభట్ల వారి వివరణ:

శరదృతువు రాగానే పల్లెల్లో గవిరమ్మ సంబరాలు జరుగుతాయి. గవిరమ్మ సంబరాల్లో ఊరి మధ్య ఘటాలు నిలుపుతారు. ఘటాల కెదురుగా ఆరు బయలులో జనమంతా వలయాకారంగా గుమికూడతారు. వాలకాలు మొదలయ్యే ముందు మూర్ఖుడైన కోడెగా డొకడు మండుతున్న తాటాకు మొలకు కట్టుకొని లంకా దహనం చేసే హనుమంతునిలా అల్లెలోకి ఉరుకుతాడు.అల్లెంటే వలయాకారంగా గుమికూడియున్న జనం మధ్యలోకి అనుకోవచ్చును.

కమ్మ వాలకం ప్రారంభం:

అల్లెలో దూకిన మూర్ఖుడు గవిరెమ్మ అమ్మవారి ఘనతనీ, సంబరాల ప్రాముఖ్యాన్ని పాడి పంటల సంపదలనూ, సమృద్ధినీ గ్రామలోని పెద్ద భుక్తలు, పెద్ద నాయుళ్ళు, పెద్ద సెట్ల ప్రతిభను చదువుతూ అల్లెలో గిర్రున తిరుగుతూ గుంపుచేత గుండ్రంగా పెండె కట్టిస్తాడు. యౌవనంలో వున్న పడుచు యువతుల్నీ వయసులో వున్న కోడెగాళ్ళను హెచ్చరిస్తూ పరాచికాలు ఆడుతూ, మొలకు కట్టుకున్న మండే తాటాకులతో జనంలోని వారిని ఒక్కొక్క చురక అంటిస్తాడు. తాటాకు చురక అంటించటానికి వీలులేని గ్రామ పెత్తందార్లను మాటల తోనే చురక వేస్తాడు. దీనికి కమ్మ వాలకమని పేరు.

తాటాకులు కట్టటం:

ఈ నాటికీ తెలుగు దేశంలో ఎవరినైనా ఎద్దేవా చేయాలన్నా, ఫలానా వాడిని వీథి లోకి లాగాలన్నా, నలుగురిలోనూ వాణ్ణి నవ్వులపాలు చేయాలన్నా, ఎదుటి వాణ్ణీ మూర్ఖుణ్ణి చేసి నప్పుడు వాడికి తాటాకులు కట్టారనీ, కమ్మ కట్టారనీ, పలనా వాడు తాటాకులు కట్టించుకున్నాడనీ గేలి చేయడం రివాజై పోవడం మనకు తెలిసిందే. ఆ రివాజు ఈ వాలకం నుంచే పుట్టిందంటారు రాంభట్ల కృష్ణమూర్తి గారు. (నాట్య కళ, జానపద కళోత్సవ ప్రత్యేక సంచికలో.)

అసలే మూర్ఖుడు, అందులో తాటాకులు కట్టించుకున్నాడు. ఇతగాడి రంగ ప్రవేశంతో ఇతర వాలకాలు కట్టే కోడె గాళ్ళకు జంకూ గొంకూ పోతుందట. తాటాకు మండినంత వరకే ఈ వాలకం జరుగుతుందట. మంట ఆరిపోగానే కొరివిని ఎవరికైనా కొట్టేసి గుంపును చీల్చుకుని జర్రున చీకటిలో కలిసి పోతాడట వాలకం గాడు.

నిష్క్రమణ, ప్రవేశం:

కమ్మ వాలకం నిష్క్రమించగానే, మరో వాలకం వెంటనే రంగ ప్రవేశం చేస్తుంది, ఈ వాలకాలలో అనేక రకాలున్నాయి. కొన్ని ప్రయోజనం కలవీ,మరి కొన్ని కేవలం వినోదాత్మకాలు. ప్రధానంగా ఈ రెండే ప్రాముఖ్యం వహిస్తాయి.

విదూషకులు, పగటి భాగవతులు ప్రదర్శించే అరవై నాలుగు జాతీయాలలాగే ఈ వాలకాలు కూడా అరవై నాలుగు జాతీయాలంటారు రాంబట్ల వారు. అయితే విదూషకుల వృత్తి పెద్ద దొరలకు నినోదం కలిగించడం, వారి మెప్పు పొందటం, వారి పారితోషికాలు అందుకోవడం, అందువల్ల అవి పెద్ద ప్రయోజనం కలవి కావు. ఈ వాలకాలు సామాన్య ప్రజలు కట్టేవి.

అల్లెలోకి కోడెగాడి ప్రవేశం

ఒక కోడెగాడు అల్లెలోకి వస్తాడు. ఆహార్యం అలంకరణా ప్రత్యేకంగా లేక పోయినా, అ నడకా, ఆ వాలకం, అదీ చూసి అతగాడు కరణం అని అంతా ఇట్టే పోల్చుకుంటారు.

ఏంవోయ్ అప్పలస్వామి: బొత్తిగా ఔపించడం లేదేంవిటి? అన్న ప్రశ్నతో ఆ మాట తీరూ, ఆ నొసటి విరుపూ అచ్చం కరణంగారే అని ముసిముసి నవ్వుల మధ్య వాక్యాలు వెలువడతాయి.

వాలకాల ఇతి వృత్తం:

కరణంగారు పన్నుల పంతులు. పన్నులు వేసేవారు సంపన్నులు. పన్నులు కట్టేవారు ఆ పన్నులు. గాలి వీస్తే పన్ను, ధూళీ వీస్తే పన్ను అని పన్నుల పన్నాలు చదువుతాడు కరణం, కరణం గారి శిస్తు ముందు, సర్కారు వారికి శిస్తు తర్వాత ఇదీ కరణం గారి లెక్క, సెట్టి గారి మాయ కొలతలు, నాయుడుగారి రంకెలు, భుక్త గారి బూకరింపులు, ఇల్లు పట్టిన భుగతమ్మ మణి అచారపు హడావుడి అన్నీ వాలకాలకు ఇతి వృతాలే.

ప్రతి ఏడూ గ్రామ కరణం రాపిడికీ, భుక్తగారి దోపిడికీ అణగారి పోయిన ప్రజలు ఆనాడు ఆ ఆటలో అద్భుతమైన చురక లంటిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం గవిరమ్మ సంబరాలూ, రసాత్మకమైన వాస్తవిక జీవైతాలను ప్రతిబింబించే వాలకాలు ప్రదర్శింప బడతాయి.

నిజం చెప్పే నిజాయితీ పరులు:

తాటాకులు కట్టుకుని మరొకరికి తాటాకులు కడుతూ, నా పేరు మూర్ఖుడని తనకు తానే ఎద్దేవా చేసుకుంటూ హేళన చేస్తారు. నిజానికి ఇలా ఎద్దేవా చేయడం, ధైర్యంతో కూడుకున్న విషయం, అయితే అమ్మ వారి ముందు చెప్పటం వల్ల వాటిని గురించి ఎవరూ అంతగా పట్టించు కోలేరు.

మనకు తెలిసిన తొలి నాటకం వాలకమే నంటారు రాంభట్ల గారు. త్రిపుర దహనం ఆయిన తరువాత గెలిచిన వారు ఓడిన వారిని ఎద్దేవా చేస్తూ త్రిపుర దహన వాలకం కట్టారని చెప్పవచ్చునంటారు.

ఉదాహరంణగా కూచిపూడి భాగవతులు వీర నరసింహరాయల కొలువులో సిద్ధవటం సామంతుడు సంబెట గురవరాజు దురంతాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి ఆ ప్రజా కంటకుని తొలగించిన ప్రదర్శనం వాలకం లాంటిదే.

సమాజానికి సంబంధించిన సాంఘిక కట్టు బాట్లనూ, గ్రామ జీవితాన్ని ఖాతరు చేయని ప్రజా కంటకుల్నీ అమ్మవారి ముందూ, ప్రజల ముందూ వారి గుట్టు మట్టుల్ని చీల్చి చెండాడుతారు వాలకం ప్రదర్శనంలో.

తాటాకులు కట్టటం లాంటి మాటలను బట్టి ఒక నాడు వాలకం, తెలుగు నాట నాలుగు చెరగులా ప్రదర్శింపబడి వుండవచ్చు. ఈనాడు ఈ వాలకం ఒక్క విశాఖ జిల్లాలో అందునా, ఎక్కడో మారు మూల గ్రామాల్లో నామమాత్రావిశిష్టంగా వుండి వుండవచ్చు.

అయితే ఈనాటి సామజిక, ఆర్థిక, రాజకీయ, అస్తవ్యవస్థ పరిస్తితుల్లో జానపద కళారూపమైన ఈ వాలకాన్ని పునరుద్ధరించడం ఎంతైనా అవసరం. ఉత్సాహ వంతులైన యువకులకు ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు ఎంతో అనుకూలంగా వుంటుంది. అందుకు ఉదాహరణ, బాదల్ సర్కారు వ్రాసిన నాటకం, విశాఖ పట్టణం కళాజ్యోత్స్న వారు ప్రదర్శించే ఊరేగింపు నాటిక వాలకం లాంటిదే.

ఆశువుగా ప్రదర్శించే ఈ కళారూపం అవధానాలు ఎంతటి ప్రజారంజకంగా వుంటాయో, ఈ వాలకాలు కూడా అంతటి ప్రజారంజకాలుగా వుంటాయి.