తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/గంటలు నిర్ణయించు పద్ధతి
గంటలు నిర్ణయించు పద్ధతి.
విద్వాన్ -మునిరత్నపిళ్ళగారు.
"కాష్టమును పదునాఱు భా - గములుచేసి
యెండలోఁ బెట్టి సమకోణ - ముండునటుల
పుల్లనీడ పరుండిన - పుల్లకొనకుఁ
దగులునట్టుగ సరిచేయఁ - దథ్యముగను
నిలుచు పుల్లభాగంబు తా - నిజఘటికలు"
భూమి తన్నుదాను ఒకసారి చుట్టుకొనుటకు 24 గంటలగుచున్నట్లంద ఱెఱుఁగుదురు గదా! దీనినే పూర్వులు సూర్యుడు 24 గంటలలో(60 గడియలలో) 360 డిగ్రీలుగల భూమిని ఒకసారి ప్రయాణము చేయుచున్నట్లుచెప్పిరి. కావున 90 డిగ్రీల ప్రయాణమునకు 6 గంటల కాలమగుచున్నది.
దీనినిబట్టి పూర్వులు పై నుదహరించిన విధమున గడియలు తెలిసికొనుచుండిరి.
ఎట్లన? 16 అంగుళముల నిడివిగల యొకపుల్లను గైకొనవలయును. ఒక్కొక్క అంగుళము 12 భాగములుగా జేసికొన్నచో మిగులమంచిది. పగలు 12 గంటలు కాకమునుపు అనఁగాఁ బూర్వాహ్ణమున నెన్ని గంటలయినవో తెలిసి కొనవలయునన్న పైఁ గనిన పుల్లను ఎండకాయుచున్న సమప్రదేశమున బెట్టి వంచవలయును. అప్పుడు 16 అంగుళముల పుల్లలో కొంతభాగము నిలిచియుండును. కొంతభాగము నేలపైఁ బరుండియుండును. పరుండియున్న భాగముయొక్క కొనకు నిలుచున్న భాగముయొక్క నీడ సమముగానుండునట్లును 90 డిగ్రీల కోణమేర్పడునట్లును కొంత ముందు వెనుకలుగా వంచిచూసి సరిపఱచుకొనవలయును. తర్వాత నిలుచున్న భాగమును కొలిచి చూచుకొనవలయును. ఎన్ని అంగుళములో అన్ని గడియలనితెలియును. అంగుళములోనివి భాగమొక్కొక్కటియు రెండునిమిషములని తెలియనగును. కావున సులభముగా గంటలు చెప్పవచ్చును. ఉదాహరణము 6 అంగుళములు నేలపై నున్నయెడల 10 అంగుళములు నిలబడియుండునుగదా! అప్పుడు 10 గడియల ప్రొద్దెక్కినదని తెలియనగును. 10 గడియలను గంటలుగా మూర్చుకొనినచో 4 గంటలు అనగా 6 + 4 = 10 కాబట్టి 10 గంటలని తెలిసికొనవచ్చును. పగలు 12 గంటలకు బిదప (అపరాహ్ణమున) నైనచో 10 గడియలు ప్రొద్దున్నదని తెలియుటచే 6 - 4 = 2 గంటలయినవని గ్రహించవలయును.
మఱియొక యుదాహరణము:- నిలబడినపుల్ల కొలత 8 అంగుళములు 7 విభాగములున్నవను కొందము. 8 గడియలకుపైన 14 నిమిషములుగదా! 8 గడియలును 192 నిమిషములు కావున 192 + 14 = 206 నిమిషములు అయినవి. అనగా 3 గంటలు 26 నిమిషములు సూర్యోదయకాలము 6 గంటలను చేర్చగా 9 గంటలు 26 నిమిషములయినవని యేర్పడుచున్నది. సాయంకాలమున నిట్టికొలత యేర్పడినయెడల 6 గంటలలో 3-36 పోగా 2 గంటలు 34 నిమిషములయినవని తెలియనగును. ఈ పద్దతి యెండకాయుచున్నప్పుడే యుపయోగపడునని ప్రాజ్ఞులు గ్రహింతురుగాక. గడియరములేని ప్రదేశముల యం దీపద్దతి మిక్కిలి సహకారియైయుండగలదు. సొంతగడియారము నిలిచిపోయినప్పుడు పై విధమునగంతలను తెలిసికొని గడియారమును సరిచేసికొనుటకును పనికివచ్చును.