తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/సంగ్రహ ఆంధ్ర వాజ్మయ చరిత్రము
సంగ్రహ ఆంధ్ర వాజ్మయ చరిత్రము.
మో. చలపతిరావుగారు.
మనము ఆంధ్రులము; మనభాష ఆంధ్రభాష, మనదేశము ఆంధ్రదేశము, జాతి భాష దేశములకు నొకే పేరుండుటచే వీనిలో నొకదానికొకదానికి సంబంధముండియేతీరును. జాతినిర్మాణమునకు భాషగాని దేశముగాని ప్రధానములు కావు. తల్లిదండ్రుల రక్తమే ప్రధానము; ఏలన నొక ఆంధ్రుడు ఇంగ్లాండు దేశమునకు వెళ్లి యొక ఆంగ్లేయయువతిని పెండ్లాడి కన్నబిడ్డ డాంధ్రుడగునా? ఆంధ్ర దంపతులు పరదేశములలో నివసించుచున్నను వారికి గలిగిన పుత్రులు ముమ్మాటికి ఆంధ్రులే. ఆంధ్రులలో చతుర్వర్ణముల వారున్నారు. కావున మనభాషకు గాని దేశమునకుగాని జాతినిబట్టి పేరు రాలేదని తెలియుచున్నది. కావున మొట్టమొదట దేశమును బట్టి భాషకు, భాషనుబట్టి జాతికి పేరు వచ్చియుండును. దేశమున కీపేరు ఎట్లు వచ్చినది? ఈవిషయమున పలువురు పలువిధముల అభిప్రాయపడుచున్నారు. భాగవత నవమస్కంధమునందు ఆంఢ్రుడను రాజొక్కడుండెను. ఆతఁడు పాలించినదేశము ఆంధ్రదేశమని పిలువబడినట్లున్నది. కావున ఆదేశమున మాట్లాడు భాషకాంద్ర భాషయనియు ఆభాష మాట్లాడువారు ఆంధ్రులనియు కొందఱి భ్రమ. రామానుజులవారు ఆంధ్రదేశమునకు నిర్దేశించిన ప్రదేశమని యర్ధము కావున దండకారణ్య సమన్విత ప్రదేశము ఆంధ్రదేశమనియు అందు నివసించువారు ఆంధ్రులనియు వారి భాష ఆంధ్రమనియు నభిప్రాయ పడుచున్నారు.
ఆంధ్ర రాజ్యము క్రీ.పూ 300 సంవత్సరముల ప్రాంతమునుండి నత్యున్నతదశ యందున్నట్లు మెగాస్తనీసు రచనల వలన తెలియుచున్నది. కాని మనకు క్రీ.వె. 11-వ శతాబ్ధము వాడగు నన్నయకు పూర్వపుకవిత్వము లభింపమిచే అతని పూర్వ మాంధ్రలిపి యుండియుండునా? లిపియేలేకున్న నన్నయ్యకునన్ని కట్టుదిట్టములతో నంత నిర్ధుష్టముగా నూతనముగా గ్రంధరచన సాధ్యపడియుండదు. కావున నన్నయ పూర్వము ఆంధ్రభాషలో ననేకగ్రంధము లుండియే తీరును. హిందూదేశమున నతి ప్రాచీనములగు అశోకుని శాసనములందలి లిపికిని తెలుగు లిపికిని సంబంధ మున్నట్లు పాశ్చాత్యులే యంగీకరించి యున్నారు. అశోకుడు తన శాసనములు తెలుగులోనే వ్ర్రాయించే నేమో! నన్నయకు పూర్వ గ్రంధములు ఏమైనవి? మనదేశము ఆఱవ శతాబ్దమునకు పూర్వము బౌద్ధజైనక్రాంతమై యుండినపుడు ఆంధ్రమున బౌద్ధజైన వాజ్మయములు విస్తరిల్లి యుండవచ్చును. తరువాత రాజ్యాదికారులైన చాళుక్యులు బ్రాహ్మణ మతస్థుల వారు బౌద్ధజైన వాజ్మయము లను ప్రోత్సహింపక పొవుటయే కాక రాజరాజనరేందుని కాలమున వారి మతవాజ్మయాభి వృద్దికై, అప్పటికె సన్నగిల్లి పోయిన బౌద్ధజైన వాజ్మయము లను అడుగంట నాశనమొనర్చి నన్నయను భారత ఆంధ్రీకారమునకు ప్రొత్స హించి యుందురు.
ఒక్కొక్క కాలమునందు ప్రబలిన ఆచారములు, ఆలోచనలును వాజ్మయము యొక్క విధానములను నిర్ణయించుచుండును. జాతీయ జీవనమున కలుగు మార్పుల కనుగుణముగా నొక్కొక్కప్పుడు కవిత యందలి రుచియు మాఱు చుండును. కావున నొక్కొక్క విధమైన కావ్యము ప్రాముఖ్యములోనికి వచ్చుచుండును..
ప్రస్తుతాంధ్ర వాజ్మయమున ప్రధమ యుగము ఆంధ్రీకరణ యుగము. నన్నయాదులు కేవల భాషాంతరీకరణ మొనర్చక ఆంధ్రీకారమున పెక్కు మార్పులు కల్పించిరి.
ప్రబంధములందు కవులొక చిన్నకధను తీసికొని పెంచి పెద్దకావ్యముగా జేయుటకు మొదలిడిరి. నాచన సోమనాధుడు ఉత్తరహరివంశముతోడను శ్రీనాధుడు శృంగారనైషధము తోడను, ఆంధ్ర వాజ్మయ్హమున ప్రబంధ బీజములు చల్లిరి. క్రమముగా అల్లసానిపెద్దన తన మను చరిత్రముతో ప్రబంధరాజము నంకురింపజేసెను. తరువాత రామరాజభూషణుడు తన వసుచరిత్రమున కొన్ని క్రొత్తపోకడలు పోయెను పిమ్మట పింగళి సూరనార్యుడు తన కళాపూర్ణోదయము ప్రభావతీ ప్రద్యుమ్నములతో ప్రబంధ శిఖాగ్రముల నెక్కెను.
ఆంధ్రవచన కావ్యములు మిక్కిలి ప్రాచీనకాలమునుండి వాడుకలో నున్నవనియు అవి కూడ పద్యకావ్యములవలె దీర్ఘ సమాసాలంకారములతో నింపి వేయబడి యున్నందున ఆదరణ పాత్రములు కాలేదనియు పండితోత్త ములు అభిప్రాయ పడుచున్నారు. మనకు లభించు ప్రాచీన వచనకావ్య ములు 18-వ శతాబ్దము వాడగు కళువె వీరరాజు కృతమగు వచనభారతము, సముఖము వెంకట కృష్ణప్పనాయకుని వచనజైమిని భారతము మొదలగునవి. ఆధునిక వచనము 19-వ శతాభ్దముకడపటను 20 వ శతాంబ్దారంభముననుండిన చిన్నయసూరి నీతి చంద్రిక, చెదలువాడ సీతారామశాస్త్రి విసంధి సంఘటిత సంకృత నాటకకధలు, దక్కను పూర్వకధలు, బ్రౌను దొరగారి తాతాచార్యుల కధలతో ప్రారంభమై ఇక్కాలమున కుప్పలు కుప్పలుగా ఆంధ్ర వాజ్మయమును నింపుచున్నవి.
ప్రాచీనకాలమునుండి గొప్ప గొప్ప ప్రబంధములతోను ప్రౌఢకావ్యములతోను దులదూగు మన ఆంధ్రమున నాటక రచన లేకపోవుట కొంత హాస్యాస్పదముగా నున్నది. మాతృభాష (సంసృతము) నుండి పురాణములను ఇతిహాసములను ఆంధ్రీకరించిన మన ప్రాచీనకవులకు క్రీస్తుపూర్వము 5,6-వ శరాబ్ద ప్రాంతమున నున్న విశ్వవినుత కీర్తియగు కాళిదాసుని శాకుంతలమునుగాని, తరువాతి హర్ష కృతులగు తర్నావళి, మున్నగు నాటకరాజములు కంటబడలేదా! లేక "కావ్యేషు నాటకంరమ్యం" అనువాక్యమును వినియుండలేదా! ఆధినిక నాటకరచనకు పునాదివేసిన వారు ధర్మవరపు కృష్ణమాచార్యులు. ఇక్కాలమున ననేక నాటకకర్త లున్నను చిత్రనళీయకర్తలును, ఆంధ్రనాటక పితామహులునగు ధర్మవరపు కృష్ణ మాచార్యులును, ప్రతాపరుద్రీయది బహునాటకకర్తలగు కళాప్రపూర్ణ వేదము వెంకటరాయశాస్త్రులును గయోపాఖ్యానాది నాటక కర్తలగు లక్ష్మీనరసింహము గారును ముఖ్యముగా గణనీయులు, ప్రస్తుత కవులు ఆంగ్లేయులను బెంగాలీలను అనుసరించి నవలారచనకు పూనుకొనినారు. కాని తెనుగున నవలారచనకు మార్గదర్శకులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు వారిననుసరించి అనేకు లిప్పుడు పూర్వకవులవలె "గొఱ్ఱెదాటు" పద్దతి ననుసరింపక పౌరాణిక, సాంఘిక చారిత్రకనవలలను, పూర్ణస్వాతంత్ర్యముతో వ్రాయుచున్నారు. ఇతర వాజ్మయము లలోని మార్పులను బట్టి ఆంధ్రవాజ్మయమునందును మార్పులను గల్గింప నుద్దే శించుచున్నారు. ఇదంతయు భావిభాషాభివృద్దికి మూలకందము కదా!