తిక్కన సోమయాజి/అయిదవ యధ్యాయము


అయిదవ యధ్యాయము

అక్కన బయ్యనల దండయాత్ర

అక్కనబయ్యన లనుమనుమసిద్ధిరాజు దాయాదులు బలీయులై విక్రమసింహపురముపై దాడి వెడలివచ్చి యుద్ధముచేసి యా యుద్ధములో మనుమసిద్ధిరాజు నోడించి యాతనిఁ బాఱఁ ద్రోలి రాజ్యము నాక్రమించుకొని యుద్దండలీలఁ బరిపాలనము చేయసాగిరి. దీనికై యెంతయును జింతించుచు మనుమసిద్ధిరాజు మంత్రియు నాస్థానకవియు నగు తిక్కనసోమయాజి మనుమసిద్ది రాజుపక్షమును బూని కాకతీయుల రాజధాని యైన యేకశిలానగర మనునామాంతరముగల యోరుగంటికిఁ బోయి గణపతిదేవ చక్రవర్తికి భారతాఖ్యానమును వినిపించి యతనివలన బహుమానములను బడసి యతనితో మనుమసిద్ధి దురవస్థను దెలుపఁగా నాతఁడు సదయ హృదయుఁడై సోమయాజుల రాయబారమును శిరసావహించి బహుసైన్యములతో దండెత్తి వచ్చి అక్కన బయ్యనలను నెల్లూరునుండి పాఱఁద్రోలి మనుమసిద్ధిని బునరభిషిక్తుని గావించి వెడలిపోయెనని సిద్ధేశ్వరచరిత్రములోని యీ క్రింది చరణములవలన బోధపడఁగలదు.

"సారెసారెకుఁ గేరి సన్నుతుల్ చేయ
 సారపారావార సరస గంభీర
 సారుఁ డై కీర్తివిస్తారుఁడై యలరు
 నారీతి గణపతి నటుచూచువేడ్కఁ
 దిక్కనసోమయా జక్కడ కొకట

 దిక్కుదిక్కులనుండి తెరలి విద్యార్థు
 లక్కడక్కడను గావ్యముల శ్లోకార్థ
 మొక్కొక్క విధమున నొగి వినిపింపఁ
 జక్కనవినుచును నొక్కయందలము
 నెక్కి తిక్కనసోముఁ డక్క డేతెంచె
 నారీతిగా సోమయాజులరాక
 వారకచని ఫణీహారులు దెల్ప

 అట్టిమహాత్ముని నాసోమయాజి
 నెట్టన నెదురేగి నేర్పుతోరాజు
 తెచ్చి యర్హాసనస్థితునిగాఁ జేసి
 మెచ్చి తాంబూలాదు లెచ్చుగా నిచ్చి

 అగుభారతాఖ్యాన మావీరవరులు
 తగఁ జేసినట్టి యుద్ధప్రకారములు
 వినియు సంతోషించెఁ గని నట్లు చెప్ప

 అంతఁ దిక్కనసోమయాజికి మెచ్చి
 వింతవస్త్రంబులు వివిధభూషణము
 లత్యంతభక్తితో నప్పుడిచ్చుడును

 సత్యసంధుఁడును సభ్యవర్తనుఁడు
 నగుసోమయాజి తా నారాజు కనియెఁ
 దగుమాట వినుమొక్క ధర్మకార్యంబు
 సూర్యవంశంబున సొబ గొందు నట్టి
 యార్యపూజితవర్యుఁ డామన్మసిద్ధి
 రాజు దా నెల్లూరు రమణతో నేల

 అక్కనబయ్యన లధిక బలిష్ఠు
 లక్కట సిద్ధిరాయని బాఱఁ దోలి
 దక్కినరాజ్యంబు తామె యేలుచును
 నొక్కకాసైనను జక్కఁగ నీరు
 వారల దండించి వారి నెల్లూరు
 వార కిప్పింపు మవారణ ప్రీతి
 ననిన గణపతిరా జట్లకా కనుచు

 వెడలి గణపతియు విజయంబునకును
 గుడియెటమల సేన కొలిచియే తేక
 వెలనాడుచేరియు వీ డెల్లఁ గాల్చి
 వెలనాటిరాజును వెసఁ గెల్చి వాని
 యవ్వనంబులు గొని యటచని రాజు
 గుప్పున నెల్లూరు కూడ నేతెంచి
 యక్కన బయ్యన నచట సాధించి

 నెల్లూరిప్రజలకు నేర్పు వాటిల్ల
 జెల్లించె మన్మసిద్ధిరాజునకు
 నెల్లూరిపట్టంబు నేర్పుతోఁ గట్టి

 సల్లరితాఁదృతి సమదుర్గములను
 నఱువ దెనిమిదియు నగుపట్టణముల
 నరుదొంద సాధించి యామన్మసిద్ధి
 రాజు కిచ్చియుఁ దనతేజంబు దిశలఁ
 బూజ కెక్కఁగ ఘనరాజితయశుఁడు
 ఘనతటాకంబుఁ దాఁ గట్టించె నచటఁ
 గొనకొని నెల్లూరఁ గొన్నెల లుండి
 మనుమసిద్ధికి రాజ్యమహిమంబు దెల్పె.

(సిద్దేశ్వర చరిత్రము)

గీ. చేయఁ దక్కువ యైనదేవాయతనము
   లపుడు పూర్తిగ గట్టించి యలరుచున్న
   చోట నొకనాఁడు తిక్కనసోమయాజి
   వచ్చె నెల్లూరినుండి భూవరునికిడకు.

సీ. వచ్చిన యయ్యార్యవర్యు నెదుర్కొని
           వినయసంభ్రమభక్తు లినుమడింప
    సతిథిపూజ లొనర్చి యతనిచే భారతా
           ర్థమును ద్వైతాద్వైత తత్త్వములను
    విస్తృతచిదచిద్వివేకలక్షణములుఁ
           బ్రకటధర్మాధర్మ పద్ధతులును
    రాజనీతి ప్రకారంబును భారత
           వీరుల మహిమంబు వినుచునుండి

    యనుమకొండనివాసు లైనట్టి బౌద్ధ
    జనుల రానించి వారిఁ దిక్కనమనీషి
    తోడ వాదింపఁ జేసినఁ దొడరి వారిఁ
    జులకఁగా సోమయాజుల గెలుచుటయును.

వ. అప్పుడు బౌద్ధదేవాలయంబులు గూలం ద్రోయించి గణపతిదేవరాజు సోమయాజుల పటువాక్యశక్తి మెచ్చి యతని౯ బహుప్రకారంబులఁ బూజించి యెనిమిది గ్రామంబు లొసంగి యతఁడు వచ్చినకార్యం బడగిన నాభూవరునకుఁ గవివరుం డిట్లనియె.

గీ. ఇనకు లోద్భవుఁ డైనట్టి మనుమసిద్ధి
   రాజు నెల్లూరు పాలించుచోఁ జెలంగి
   యతనిదాయాదు లతని నుక్కఱగఁ బట్టి
   యునిచి రాజ్యంబుఁ దమ రేలు చున్నవారు.

క. కావున మీ రిపు డచటికి
   వేవేగం దరలి వచ్చి విడకుండఁగ నా
   భూవరుఁ బునరభిషిక్తునిఁ
   గావింపఁగ వలయు ననిన గణపతివిభుఁడున్.

గీ. అట్ల కాకయనుచు నాపని కొడఁబడి
   య త్యుదారగుణసమగ్రుఁ డగుచు
   దవిలి యప్పు డొక్కనవలక్షధనమును
   యజ్ఞ కుండలములు నతని కిచ్చె.

క. పనుచు నెడఁ దిక్కమఖి యా
   జనవరు సింహాసనమున సచివాగ్రణి యై
   తనరెడు శివదేవయ్యన్
   గనుఁగొని యారాజుతోడ గడఁకం బలికె౯.

గీ. వసుమతీనాథ యీతఁ డీశ్వరుఁడు గాని
   మనుజమాత్రుండు గాఁడు పల్మాఱు నితని
   యనుమతంబున నీవు రాజ్యంబు నెమ్మి
   నేలు మనిచెప్పి యాఘనుఁ డేగుటయును.

సీ. గణపతిదేవుఁ డాఘనువసుమతి గాంచి
          యతిసత్వరమునఁ బ్రయాణభేరి
   వేయించి చతురంగపృతనాసమేతుఁ డై
          తరలి మున్వెలనాటి ధరణిపతుల
   గెలిచి వారలచేత లలి నప్పనము,
          గొని బారి నందఱ దనవశము జేసి
   కొని చని నెల్లూరు గొబ్బునఁ జొచ్చి య
          క్కనయు బయ్యనయు న౯ ఖలులఁ దఱిమి

   మనుమసిద్ధిరాజుఁ బున రభిషిక్తుఁ గా
   నించి మించి రెండువేలు నైదు
   నూఱు గ్రామములు మనోవృత్తి కతనికి
   నిచ్చి కడమఁ దాను బుచ్చుకొనియె.

(సోమదేవరాజీయము)

విమర్శనము.

సిద్ధేశ్వరచరిత్ర మనునది యొక శైవగ్రంథము. దీనికిఁ బ్రతాపచరిత్ర మనునామాంతరము గలదు. కాసె సర్వ ప్పను నాతఁడు దీనిని ద్విపదకావ్యమునుగా రచియించెను. ఈగ్రంథము పురాతన మైనదయినను లక్షణదోషములు పెక్కులు గాన వచ్చుచున్నవి. ఈకవికాల మెప్పుడో మనకు నిశ్చయముగాఁ దెలియరాదుగాని గణపతిదేవునకు నూఱుసంవత్సరముల తరువాత నున్నవాఁ డని తోఁచుచున్నది. ఈసిద్దేశ్వర చరిత్రమునుబట్టియే సోమదేవరాజీయము కూచిమంచి జగ్గకవి చే రచియింపఁబడి మందపాటివారి కంకితము గావింపఁ బడినది. జగ్గకవి పదునెనిమిదవశతాబ్దిలో నుండిన వాఁడు. ఈరెండు గ్రంథములే పై నుదాహరించిన కథకు మూలాధారము లై యున్నవి. ఈచరిత్రములందు చరిత్రమునకు విరుద్ధము లైన యనేక విషయములు చొప్పింపఁబడి యున్నవిగాన కేవలము వానినే నమ్మి పరమసిద్ధాంతములనుగాఁ గైకొనరాదు. ప్రస్తుతము పై నుదాహరించిన చరిత్రాంశములను విమర్శింతము.

ఈచరిత్రములో నుదాహరింపఁబడిన మనుమసిద్ధి దాయాదు లగు అక్కనబయ్యన లనువా రెవ్వరో వారిచరిత్ర మెట్టిదో దెలియరాదు. వీరిశాసనము లెవ్వియును గానరావు. మనుమసిద్ధికిఁ బూర్వమునను తరువాతను మాత్రమేగాక మనుమసిద్ధికాలమునను విక్రమసింహపురమునను, తత్సామీప్య గ్రామములందును మహారాజుల పేరిటఁ బెక్కు శాసనములు లిఖంపఁబడి యుండఁగా వీరిపేరిట శాసనములు గానరాకుండుటచేత వీరినామము లెవ్వరికి మాఱుపేరులోఁ దెలియరాకున్నది. ఇంతప్రాముఖ్యమును గాంచిన చరిత్రాంశమును కేతనకవి తాను తిక్కనసోమయాజి కంకితముచేసిన దశకుమారచరిత్రముసం దైన నుదాహరించినవాఁడు గాఁడు. దశకుమారచరిత్రము రచింపఁబడు నప్పటికి నిది జరిగి యుండలేదని తలంచుకొందు మన్న మఱియెప్పుడు జరిగియుండు ననుప్రశ్నము రాఁ గలదు. తిక్కన యజ్ఞములు చేసి సోమయాజి యై భారత మాంధ్రీకరించినవెనుక నిట్టిది సంభవించిన దని యూహిం తమా? అట్లయినపక్షమున భారత మెప్పుడురచించిననాఁడనుప్రశ్నము జనించును. దశకుమార చరిత్రమును కేతన రచించి తిక్కన కంకితముచేసిన కాలమునకుఁ బూర్వమె తిక్కన యనేకయాగములను జేసి యున్నట్లు 'మహితదక్షిణ లైన బహువిధయాగంబు లొనరించుననుట వర్ణపము దారి' అనియు 'అధ్వరాబ్జదిననాధునకున్' అనియు, 'యాగవిద్యాభిరామా' అనియు మొదలుగాగల వాక్యములను దశకుమారచరిత్రమునందు కేతనకవి తిక్కన గూర్చి ప్రయోగించి వాడియుండుట చేతనే విస్పష్టమగుచున్నది. గణపతిదేవ చక్రవర్తి క్రీ. శ. 1260 వ సంవత్సరమున స్వర్గస్థుఁ డైనట్లు గన్పట్టుచున్నది. ఆ సంవత్సరమునకుఁబూర్వమె యీకథ నడచియుండవలయును. కడపమండలములోని నందలూరు శాసనములలో నొకదాని యందు మనుమసిద్దిరాజు కోడూరు గ్రామమును 1257-వ సంవత్సరమున బ్రాహ్మణులకు దానము చేసి నట్లుగఁ జెప్పఁబడి యున్నది. ఆశాసనములోనే మనుమసిద్దిరాజు కాకతీయ గణపతిదేవునితో స్నేహము సంపాదింపవలయు నని కోరిక కలిగియున్నట్టుగఁ దెలుపఁ బడినది. కనుక సిద్దేశ్వర చరిత్రము నందు చెప్పఁ బడినట్లు గణపతిదేవచక్రవర్తి అక్కనబయ్యనలను జయించి మనుమసిద్ధికి రాజ్యమిప్పించి రాజ్యమహిమలు దెలిపినది 1257 వ సంవత్సరమునకుఁ బూర్వము కాదని పై నందలూరు శాసనమువలన నూహింపవచ్చునుగదా ! అనఁగా 1257 వ సంవత్సరమునకును, 1260 వ సంవత్సరమునకును నడుమ నీచరిత్రము నడచి యుండవలయును. గణపతిదేవచక్రవర్తి మనుమసిద్ధిరాజునకు సాహాయ్యముఁ జేయఁ బూని మార్గమధ్యమున వెలనాటిరాజును జుయించి యప్పనము గైకొనియె నని సిద్దేశ్వరచరిత్రము నందుఁ జెప్పఁబడి యున్నది. కాని గణపతిదేవచక్రవర్తి 1228 దవ సంవత్సరమునాటికె వెలనాటిని సంపూర్ణముగా జయించెను. అప్పుడు నెల్లూరును బరిపాలించుచున్నవాఁడు మనుమసిద్దితండ్రి యగుతిక్కరాజు గాని మనుమసిద్ధిరాజు గాఁడని స్పష్టముగాఁ జెప్పవచ్చును. పైని జెప్పినట్లుగా 1257-1260 సంవత్సరముల నడుమమనుమసిద్దిరాజు రాజ్యమును గోలుపోయి యుండరాదా యని తలంతుమేని 1258-1259 సంవత్సరములలో రాజ్యూభివృద్ధికై మనుమసిద్ధి రాజుచేతనునాతనిక్రింది యధికారప్రభువు లైనపల్లవ రాజులచేతను జేయఁబడినదానములను గూర్చినశాసనములు పెంట్రాలలోఁ గానం బడుచున్నవి. కావున నాకాలమున మనుమసిద్దిరాజు పదభ్రష్టుఁ డయ్యె నని తలంపరాదు. అట్లయిన పక్షమున మనుమసిద్ది యెప్పుడును పదభ్రష్టత్వమును బొందనేలేదా యనుశంక పుట్టవచ్చును. మనుమసిద్దిరాజు పదభ్రష్ఠుడైన కాలము గూడఁ గలదు. మనుమసిద్ధితండ్రి యగు తిక్కరాజు కాలమునఁ బాండ్యులు కాంచీపురముపై దండెత్తివచ్చి యారాజ్య మాక్రమింపఁగాఁ దిక్కరాజు పాండ్యులతో యుద్ధముచేసి వారలను దఱిమి. మరల చోడుని సింహాసనమునఁ గూరుచుండఁబెట్టి చోళస్థాప నాచార్యబిరుదము నందె నని యిదివఱకె తెలిపియున్నాఁడను. తిక్కరాజు మరణానంతరము పాండ్యులు తమతొంటి పూనికను విడనాడక కాంచీపురము మొదలుకొనియుత్తరభూమిని జయింపఁగోరి పలుమాఱుదాడి వెడలి వచ్చి నెల్లూరునకు దక్షిణభాగమునను, పశ్చిమపాక నాడును, మార్జవాడిదేశమును గల్లోలపెట్టుచుండిరి. తనసామంతుల ప్రార్థనముమీఁద గణపతిదేవచక్రవర్తి కీ. శ. 1249 సంవత్సరమున నసంఖ్యాకము లైనసైన్యములతో గాంచీపురముపై దండెత్తిపోయి మారవర్మసుందరపాండ్యుని వాని కుమారుఁడైన జటవర్మసుందర పాండ్యుని నోడించి యచటినుండి పాఱఁద్రోలి తనసచివాగ్రణియు, సైన్యపాలుఁడును, చక్రధారియు, కాశ్యపసగోత్రుఁడు నైన సామంతభోజమంత్రిని గాంచీపురపాలకునిగా నియమించి నటు లేకాంబరేశ్వరుని దేవాలయములోని యొకశాసనమునలనఁ దెలియుచున్నది.[1] కాకతీయగణపతిదేవచక్రవర్తి దక్షిణదిగ్విజయ యాత్రను ముగించి రాజధాని యగునోరుగల్లు చేరినవెనుక మఱుసటి సంవత్సరమున జటవర్మసుందర పాండ్యమహారాజు మరల దండయాత్ర వెడలి కాంచీపురమును, విక్రమసింహపురమును ముట్టడించి స్వాధీన పఱచుకొని మనుమసిద్దిరాజును బాఱఁద్రోలి సిద్దిరాజునకు శత్రువులయినవీరులను పట్టాభిషిక్తులను గావించెనని నాలుగవయధ్యాయమునం దెలిపి యున్నాఁడను. వీనిని త్రిభువనచక్రవర్తి బిరుదాంకితుఁ డగువిజయగండగోపాల దేవుఁడు దఱిమి కాంచీపుర మాక్రమించుకొనియె నని వెనుకటియధ్యాయమునఁ దెలిపి యున్నాఁడను. అట్టి విజయగండగోపాలునే విజయక్ష్మాథీశ్వరుం డని తిక్కన నిర్వచనోత్తర రామాయణమునఁ బేర్కొనియె నని వక్కాణించి యున్నాఁడను. ఈనా యూహ సరియైన దైనయెడల నిర్వచనోత్తర రామాయణము 1250 దవ సంవత్సరముతరువాత రచియింపఁబడి యుండును. అప్పటికి మహాభారతము రచియింపఁబడి యుండలేదనుటస్పష్టము. మనుమసిద్దిరాజు పరిపాలనము చేసిన దెప్పటివఱకో తెలిసికొనుట గూడ కష్టసాధ్యముగ నున్నది. మనుమసిద్దిరాజు కాటమరాజుతో యుద్ధము చేసి మరణించెనను మఱియొకకథ గలదు. మనుమసిద్ధికుమారుఁడు తిక్కరాజు 1258-దవ సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁ డయ్యెను. 1262 వ సంవత్సరమునకుఁ దరువాత మనుమసిద్దిశాసనములు గానరాపు. మనుమసిద్ధికుమారుఁడు ఇమ్మడి తిక్కరాజు రాజ్యమునకు వచ్చుటకుఁ బూర్వము కొంతకాలము నెల్లూరిపట్టణము కాకతీయ సైన్యాధిపతుల పాలనమున నున్నట్లు కొన్ని శాసనమువలనఁ గానంబడు చున్నది. దాదినాగయసాహిణి యను నాగదేవమహారాజు గణపతిదేవచక్రవర్తికిఁ బ్రతినిధిగా 1272-73 వ సంవత్సర ములో విక్రమసింహపురమును బలపాలించు చుండెను. ఇంకొకచిత్రము గలదు. గణపతిదేవుని సైన్యాధీశ్వరులలో నొకఁడును, రాయసహస్రమల్లుఁ డనుబిరుదముగల వాఁడును నగు ఆంబదేవమహారాజు రాజ్యపదభ్రష్టుఁ డైన మనుమగండగోపాలుని విక్రమసింహపురంబున సింహాసన మెక్కించితి నని యొకశాసనమునఁ జెప్పుకొని యున్నాఁడు. ఈ మనుమసిద్ధిరాజునే మనుమగొండగోపాలుఁడని వక్కాణించి యుండవచ్చును. ఏలయన నీతెలుఁగుచోడరాజులకు గండగోపాలుఁ డను బిరుదము గలదు. తిక్కరాజునకు రాయగండగోపాలుఁ డనుబిరుదము గలదు. మనుమసిద్దికిని ఈ బిరుదము గలదు. ఇతనికి దాయాది యొకఁడు విజయగండ గోపాలుఁ డని వ్యవహరింపబడుచున్న కారణమున మనుమసిద్ధిని మనుమగండ గోపాలుఁ డనిజనులు వ్యవహరించి యుందురు. మఱియొక కాకతీయసైన్యాధిపతి మనుమగండగోపాలుని సంహరించితి నని చెప్పుకొనియెను. వీనినన్నిటిని బరిశీలించి చూచినపక్షమున నీ క్రింది విధమున సిద్దేశ్వరచరిత్రములోని విషయములను సమన్వయింపవచ్చును. 1257-వ . సంవత్సరమునఁగాని మఱు సంవత్సరముగాని మనుమసిద్ధిదాయాదులు సిద్ధిరాజును నెల్లూరునుండి పాఱఁద్రోలఁగా నతఁడు కందుకూరుసీమలోని పెంట్రాలకోటలోఁ కొంతకాలము దాగి యుండును. ఆకాలమున మహాప్రసిద్ధిగాంచిన యతని మంత్రి తిక్కనసోమయాజి గణ పతిదేవునికడకుఁ బోయి యాతనివలన మన్ననలనుగాంచి తన వచ్చినపని తెలుపఁగా నాతఁడు తనసైన్యమును బంపి మనుమసిద్ధిదాయాదులను నెల్లూరునుండి పాఱఁద్రోలి మనుమభూపతిని బునరభిషిక్తుని గావించి యుండును. తిక్కనసోమయాజి భారతాఖ్యానమును విన్పించినాఁడనియును, తిక్కన వాదమున గెలిచి బౌద్ధులను హింసింపఁ జేసినాఁడనియుఁ జెప్పెడికథలు మాత్రము కవిసృష్టి యని స్పష్టముగఁ జెప్పఁదగును. తిక్కన గణపతిదేవుని సమ్ముఖముస నద్వైతవాదమును సలిపి బౌద్ధుల నోడించినను నోడింపవచ్చునుగాని వారి హింసలకుమాత్ర మాతఁ డుత్తరవాదియై యుండఁడు. గణపతిదేవచక్రవర్తి యద్వైతవాది యని యతనికూతురు గణపాంబశాసనమునఁ గూడ వక్కాణింపఁ బడియుండుట గణపతికిని తిక్కనసోమయాజికిని సమావేశము గలిగియుండుటను సూచింపుచున్నది.

  1. The Indian antiquary, Ekamrautha Inscription of Ganapathi. Vol. XXI, p. 107, No. 15. Ganapeswaram Inscription of the time of Ganapati.