తిక్కన సోమయాజి/నాలుగవ యధ్యాయము


నాలుగవ యధ్యాయము

మనుమసిద్ధిరాజు - తిక్కనమంత్రి.

వీరసోమేశ్వరుఁడు మొదలుగాఁ గర్ణాటులను, మారవర్మసుందర పాండ్యుఁడు మొదలుగాఁ బాండ్యులను, మహారాజసింహుడు మొదలుగా ద్రావిడులను రణములో జయించి కాంచీపురమున రాజరాజచోడుని సింహాసనమునఁ గూరుచుండబెట్టి పట్టాభిషిక్తుని గావించి చోళస్థాపనాచార్య బిరుదము గాంచిన తిక్కరాజు కీ. శ. 1240 వఱకుఁ బరిపాలనముఁ జేసె నని యిదివఱకె తెలిసికొని యున్నారము. అతని వెనుక నతనికుమారుఁడు మనుమసిద్ది భూపాలుఁడు విక్రమసింహపురంబునఁ బట్టాభిషిక్తుఁ డై పరిపాలనము చేసెను. ఏసంవత్సరమున నీతఁడు సింహాసన మధిష్ఠించి పరిపాలనము చేయఁ బ్రారంభించెనో మనకు నిశ్చయముగా దెలియరాదుగాని యీతఁడు 1240 దవ సంవత్సరము తరువాతనుండి పరిపాలనము చేసి నట్లు మన మూహింప వచ్చును. ఇతఁడును దండ్రివలెఁ బరాక్రమవంతుఁడెగాని యంత యదృష్టశాలి కాఁడు. ఇతనిపూర్వ పుణ్యవశమున మహానీయుఁడగు కవితిక్కన మంత్రిగ నుండుటచేఁ బ్రఖ్యాతికి వచ్చెను. ఇట్టిరాజులెందఱో యూరును బేరును లేక

నశించి పోయిరి. కవితిక్కనమూలమున మనుమసిద్ది యెట్టివాడో మనకుఁ దెలిసికొనుట సంభవించినది. తిక్కరాజు కాలమునందే మనుమసిద్ది భూపాలునకును కవితిక్కనకును మైత్రిసంభవించినది. తనపెదతండ్రి సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకు మంత్రిగ సేనాపతిగ నుండుటంజేసి కవితిక్కన మనుమసిద్దిరాజుతో మైత్రి నెఱపుటలో వింత యేమియునులేదు.

సిద్దనామాత్యునికి గల నేడ్వుర పుత్త్రులలోను జ్యేష్ఠుడగు తిక్కనామాత్యుఁడు మనుమసిద్ది భూపాలునకు మంత్రిగను సేనాపతిగ నుండెను. ఈ తిక్కనామాత్యునితమ్ములు మూవురును కొమా ళ్ళిరువురును మనుమసిద్దిభూపాలుని కొల్వుననే యుండిరి. కొట్టరువువారి కుటుంబము చాల గొప్పది. ఈ తిక్కనామాత్యునినే యిటీవలివారు ఖడ్గతిక్కనయని వ్యవహరించు చున్నారు. వీనితోఁ బాటు కవితిక్కనగూడ మనుమసిద్ధి భూపాలునికడ మంత్రిగను సేనాపతిగఁ గూడ నుండెను. మనుమక్ష్మాసాలమంత్రి మాణిక్యుఁడనియు, మనుమసిద్దిమహీశ సమస్తరాజ్యభార ధౌరేయుఁ డనియు, గవితిక్కనను వర్ణించి ఖడ్గతిక్కనను గేతనయట్లు చెప్పకుండుటచేత ఖడ్గతిక్కనకంటెను గవితక్కన మనుమసిద్ధికి నథికకరుణాపాత్రుం డయ్యె నని చెప్పవలసి యుండును. మనుమసిద్ధి విద్యాగంధములేని మూర్ఖుఁడు గాఁడు. ఇతరు లాడించి నట్లాడుటకు వారిచేతిలోని జంత్రపుబొమ్మగాఁడు. కేతసకవి సుకృతాత్ముఁ డైనమనుమసిద్ధిని కీర్తి పాత్రుం డనితెలుపుచు నీక్రింది పద్యముచే నిట్లబివర్ణించెను.

"సీ. వీరారివర్గవిదారణక్రీడ న
          ద్యతనజగత్ప్రాణసుతుఁ డనంగఁ
     బరధనదారాపహర ణానభిజ్ఞత
          నూతనగంగాతనూజుఁ డనఁగ
     నర్థార్థిజనవాంఛితార్థ సంపూర్ణవి
          తీర్ణిమైనభినవకర్ణుఁడనఁగఁ
     గామినీచిత్తాపకర్ష కారణశుభా
          కారసంపదనింత కంతుఁడనఁగ

గీ|| ధీరతాగుణముసమేరుమహీధర
    మన గభీరవృత్తి నబ్ది యనఁగ
    వెలసె వైరిరాజ వేశ్యాభుజంగాంక
    భూషితుండు సిద్దిభూవిభుండు."

ఇట్టిమనుమసిద్ధి భూపాలునికడఁ గవితిక్కనయు, ఖడ్గతిక్కనయు, మంత్రులుగా నుండి విఖ్యాతిఁగాంచిరి. కొట్టరువు తిక్కనామాత్యకవి మనుమసిద్ధియొద్ద వహించినమంత్రిపదవి నిజకులక్రమా గతంబైనదని కేతన నుడివి

"గీ. అందలంబు గొడుగు లడపంబు మేల్కట్టు
    చామరములు జమిలిశంఖములును
    గంబగట్లు భూమి కానికగాఁగ బెం
    పెసఁగు రాచపదవు లెల్లఁ బడసె."

అని చెప్పుటవలన నతఁడు సనుస్త సంపత్సమేతుఁ డై రాజ్యసుఖంబు లనుభవించు చుండె ననుట యతిశయోక్తి గాదు. ఇతని పెదతండ్రికుమారుఁ డగు ఖడ్గతిక్కనయు నితనివలెనే, సమస్త సంపత్సమేతుఁడై తమ్ములతోడను, గొమాళ్ళతోడను రాజ్యసుఖంబు లనుభవించు చుండెననుట సత్యవిరుద్ధము కాదు. కేతనకవి తిక్కనకవివంశ వర్ణనముఁ జేయు నపుడు సిద్ధనా మాత్యనందనుఁ డగు ఖడ్గతిక్కన నిట్లభివర్ణించి యున్నాఁడు.

"సీ. వేడిన నర్థార్థి వృథపుచ్చ నేరని
           దానంబు తనకు బాంధవుఁడు గాఁగ
    నెదిరిన జమునైన బ్రదికిపోవఁగ నీని
           శౌర్యంబు తన కిష్టసఖుఁడు గాఁగ
    శరణుచొచ్చిన శత్రువరు నైన రక్షించు
           కరుణయె తనకు నంగదము గాఁగ
    బలికినఁ బాండవప్రభు నైన మెచ్చని
           సత్యంబు తనకు రక్షకుఁడు గాఁగ

    జగతి నుతి కెక్కె రాయవేశ్యాభుజంగ
    రాజ్యరత్నాకరస్ఫూర్తి రాజమూర్తి
    గంథవారణబిరుద విఖ్యాతకీర్తి
    దినపతేజుండు సిద్ధయ తిక్క శౌరి."

మఱియును సిద్ధయ తిక్కనామాత్యుని గృహము ప్రతిదిన మెట్లుండునో యావివరమును మఱియొక కవి

"సీ. వీరవివాదంబు వేదనినాదంబు
          పాయక యేప్రొద్దు మ్రోయు చుండు
    భూసురప్రకరంబు సేసలు చల్లంగ
          బాయ కెన్నియొ కుటుంబములు బ్రదుకు

బ్రాహ్మణావళికి ధారలు పోసినజలంబు
       సతతంబు ముంగిట జాలువాఱు
రిపుల కొసఁగిన పత్రికల పుత్త్రికలను
       బాయక కరణముల్ వ్రాయు చుంద్రు

గీ. మానఘనుఁ డైనతిక్కనమంత్రి యింట
   మదనసముఁ డైనతిక్కనమంత్రి యింట
   మహితయశుఁ డైనతిక్కనమంత్రి యింట
   మంత్రిమణి యైనతిక్కనమంత్రి యింట."

అని మనోహరముగా నభివర్ణించి యున్నాఁడు. ఇట్టి మహనీయు లగుమంత్రివర్యుల సాహాయ్యముతో మనుమసిద్ధిభూపాలుఁడు కొంతకాలము విక్రమసింహపురము రాజధానిగాఁ జేసికొని రాజ్య పరిపాలనము చేసి విశుద్ధయశమును గాంచెను. ఇతఁడు మొట్టమొదట పేరునకు మాత్రము రాజరాజచోడునకు సామంతుఁడుగా నుండినను మూడవరాజేంద్రుఁచోడుని కాలమున స్వతంత్రుఁ డై కడపట కాకతీయాంధ్ర చక్రవర్తి యగు గణపతిదేవునకు లోఁబడిన సామంతుఁ డై రాజ్యపరిపాలనము చేసెను. చాళుక్యచోడ చక్రవర్తు లయిన రాజరాజచోడుఁడును, రాజేంద్ర చోడుఁడును బిరుదమాత్ర చక్రవర్తులే గాని నిజముగాఁ జక్రవర్తిపదము నధిష్ఠించి పరరాజులనుండి కప్పములు గైకొనుచుఁ దమయధికారమును వారలపైఁ జూపు శక్తిగలవారైయున్నట్టు గానుపింపరు.

మనుమసిద్దినాటి కాలస్థితి

పదుమూఁడవ శతాబ్దిప్రారంభము నుండి యాంధ్రదేశమునఁ జూళుక్యచోడ చక్రవర్తుల యధికారము నశించిపోయి కాకతీ యాంధ్రచక్రవర్తుల యధికారము నానాముఖముల వ్యాప్తిజెందు చుండె నని చెప్పవచ్చును. చాళుక్యచోడ చక్రవర్తి యగు మూఁడవరాజరాజచోడునకును, మూఁడవ రాజేంద్రచోడునకును సింహాసనమును గూర్చి పోరాటములు జరుగు చుండెను. ఈ పోరాటములలో ద్రావిడాంధ్రకర్ణాటకు లేదేని యొకపక్షమునఁ జేరి రెండవపక్షముతోఁ బోరాడు చుండిరి. మనుమసిద్దితండ్రి యగుతిక్కరాజు కర్ణాటకులను ద్రావిడులను జయించి రాజరాజచోడుని రాజ్యమున నిలిపి కొంతకాలముఁ బరిపాలనము చేసెను గాని వాని మరణానంతరము రాజేంద్రచోడుఁడు విజృంభించి పాండ్యులను కర్ణాటులను జయించి రాజరాజును జంపి కాంచీపురసింహాసన మాక్రమించుకొని పరిపాలనము సేయు చుండెను. క్రీ. శ. 1299 -వ సంవత్సరమున నేకశిలానగరమునఁ బట్టాభిషిక్తుఁ డై గణపతిదేవచక్రవర్తి 1240 వ సంవత్సరమునాటికే వెలనాడు, పొత్తపినాఁడు, రేనాడు, ములికినాడు, గండికోట మార్జవాడిసీమలను జయించి ద్రావిడకర్ణాట రాజులతోఁ బోరాడుచుండెను. ఆకాలమున దక్షిణహిందూ స్థానమునఁ దమ సామ్రాజ్యములను స్థాపింపఁ బూని దేవగిరి యాదవులును, ఓరుగంటి కాకతీయులును, హలెవీటి , హెయిసనులును, మధురాపుర పాండ్యులును, కాంచీపుర చాళుక్యచోడులును హోరాహోరిగఁ బోరాడుచుండిరి. చాళుక్యచోడ సామ్రాజ్యము నశింపగాఁదత్సింహాసనమునకై చోడులలోఁ జోడులకు నంతఃకలహములు పుట్టి తమలోఁ దాముపోరాడుచు నన్యుల సహాయమునువేడుచు నేతన్మూలమునఁ గ్రమక్రమముగా స్వాతంత్ర్యములను గోలుపోవుచు ననేక కష్టములంబడుచుండిరి. పూర్వము పశ్చిమచాళుక్యులు పరిపాలించిన కుంతలదేశము యొక్క ప్రాగ్భాగమును గాకతీయాంధ్రులును ఉత్తరభాగమును దేవగిరియాదవులును, దక్షిణపశ్చిమభాగములను హోయిసలకర్ణాటులు నాక్రమించుకొనిరి. కావున మనమసిద్దిభూపాలుని కాలమున రాజకీయవాతావరణములో దెలుఁగుచోడు లసుఖస్థితి యందున్న వారని చెప్పవలసియుండను. మనుమసిద్దిభూపాలుఁడు గొంతకాలము చాళుక్య చోడచక్రవర్తి యగు మూఁడవరాజేంద్రచోడునకు సామంతుఁడుగ నున్నట్లే గానంబడుచున్నాఁడు. అయినను యుద్ధములు వచ్చినప్పుడు తోడ్చడుట తక్క తదితరవిషయములలో స్వతంత్ర పరిపాలనమునే చేయు చుండెను. ఎట్టులయినను మనుమసిద్ది రా జిరువదిసంవత్సరములు రాజ్యపరిపాలనము చేసినట్లు గనం బడుచున్నది.

మనుమసిద్ది శత్రురాజులను జయించుట

తిక్కన తననిర్వచనోత్తర రామాయణమున మనుమసిద్ది భూపాలుని విజయములను బేర్కొని యుండెను. అందు మొదటి పద్య మిట్లున్నది.

"మ. ద్రవిడోర్వీపతి గర్వముం దునిమి, శౌర్యం జొప్పఁ గర్ణాటద
     ర్పవిఘాతంబు నొనర్చి వైరిమనుజేంద్రశ్రేణికిం గొంగనా
     నవనిం బేర్కొని యున్నయట్టి విజయక్ష్మాధీశ్వరుం గాసిగా
     నెవిచెం జోళనమన్మసిద్ధి యనిఁ బ్రాయేటం బ్రగాడోద్ధతిన్."

ఈపైపద్యమున విజయక్ష్మా ధీశ్వరుని జయిం చె నని చెప్పఁ బడియున్నది. ఇందలి విజయక్ష్మాధీశ్వరుఁ డెవ్వఁడో తెలిసికొన సాధ్యము గాక యున్నది. విజయక్ష్మాధీశ్వరుఁడు మనుమసిద్ధి దాయాదుఁ డేమోయని సంశయము గలుగుచున్న ది. విజయగండగోపాలుఁడు 1260 వ సంవత్సరము మొదలుకొని 1292 వఱకుఁ గాంచీపురముండలమును బరిపాలించి నట్లు గనంబడుచున్నది. ఇతనిశాసనములు కాంచీపురమండలముననేగాక నెల్లూరు, గూడూరు, సుళ్లూరుపేట తాలూకాలలోఁ గానుపించు చున్నవి. ఇతనికి త్రిభువనచక్రవర్తి యను బిరుదము గలదు. ఇతఁడు చాలకాలము బ్రదికియున్నవాఁడు గావున వయస్సున మనుమసిద్ధి కంటెఁ జిన్నవాఁడై యుండును. ఇతఁడు మూఁడవ రాజేంద్రచోడునకుఁ బిమ్మట స్వతంత్రుఁ డై కాంచీపురమండల మేలె నని తోఁచుచున్నది. ఇతఁడు మొదట రాజేంద్రచోడుని పక్షమునఁ గాని లేక జటవర్మసుందరపాండ్యుని పక్షమునఁ గాని చేరి మనుమసిద్దిరాజుతో యుద్ధముచేసి యోడిపోయి యుండవచ్చును. ఇందునుగూర్చి యాంధ్రుల చరిత్రమం దిట్లు వ్రాయఁ బడియెను. "తిక్కరాజు మరణానంతరము పాండ్యరాజులు తమతొంటి పూనికను విడనాడక కాంచీపురము మొదలుకొని యుత్తర భూమిని జయింపఁ గోరి పలుమాఱు దాడి వెడలి వచ్చి నెల్లూరునకు దిగువ నున్న దేశమును గల్లోలపెట్టు చుండిరి. వారిలో జటవర్మ సుందరపాండ్య మహారాజు ప్రముఖుఁడుగా నుండెను. కీ. శ. 1249-వ సంవత్సరమునఁ గాకతీయగణపతిదేవ చక్రవర్తి యాంధ్రదేశము నుండి పాండ్యరాజులను బాఱఁద్రోలి కాంచీపురమున నొకదేవాలయములో నొకదానశాసనమును [1] వ్రాయించెను. అయినను జటవర్మ సుందరపాండ్య మహారాజు మఱుసటి సంవత్సరమునం దనఁగా 1250-దవ సంవత్సరమునఁ గాంచీపురమార్గమున నాంధ్రదేశముపై దండెత్తివచ్చి, తెలుఁగుచోడరాజులను జయించి మనుమసిద్దిరాజును నెల్లూరునుండి పాఱఁ ద్రోలి సిద్ధిరాజునకు శత్రువు లైన వీరులను పట్టాభిషిక్తులను గావించి నెల్లూరిలోని పళ్లికొండ పెరుమాళ్ళదేవునకు మండనాటిలోని మావడికుండ గ్రామమును దానము చేసె నని తెలిపెడిశాసన మొకటి రంగానాయకస్వామి దేవాలయములో నొక స్తంభము పై వ్రాయించెను. [2] ఆ సంవత్సరముననే విజయగండ గోపాలదేవుఁడు కాకతీయుల సాహాయ్యమును బడసికాని పడయకకాని జటవర్మసుందరపాండ్యదేవుని వానిసైన్యములను నెల్లూరిమండలమునుండి పాఱఁద్రోలి యుండవలయును. ఈవిజయగండగోపాలునినే తరువాత మనుమసిద్ది యెదిరించి పోరాడి విజయమును గాంచి యుండవచ్చును, విజయక్ష్మాధీశ్వరుఁడు జయించిన ద్రవిడోర్వపతి జటవర్మ సుందరపాండ్యుఁడుగాక కాంచీపురాధిపతియైన మూఁడవవీర రాజేంద్ర చోడచక్రవర్తియే యైన యెడల 1250-వ సంవత్సరమునకుఁ బూర్వముననే మనుమసిద్ధి వానిని జయించి యుండవలయును. పైనఁ జెప్పినదే వాస్తవమైనయడల 1250 వ సంవత్సరము తరువాతనే నిర్వచనోత్తర రామాయణము రచింపఁ బడి యుండవలయును. ఈ త్రిభువన చక్రవర్తి విజయగండ గోపాలుఁడు మనుమసిద్ధికి సమకాలికుఁడు."

మఱియు మన్మజనపాలుఁడు గంగయసాహిని నోడించి తన యాశ్రితవత్సలవృత్తి తేటపడు నట్లుగా బల్విడి నాచికొన్న రాజ్యాంగము లన్నియు నిచ్చి పదముఁ గైకొనఁ బంచెనని నిర్వచనోత్తరరామాయణమున నీక్రిందిపద్యములో వక్కాణింపఁ బడి యున్నది.

"ఉ. రంగ దుదారకీర్తి యగు రక్కెసగంగనిఁ బెంజలంబు మై
     భంగ మొనర్చి మన్మజనపాలుఁడు బల్విడి నాఁచికొన్నరా
     జ్యాంగము లెల్ల నిచ్చి తనయాశ్రితవత్సలవృత్తి యేర్పడ౯
     గంగయసాహిణిం బదముఁ గైకొనఁ బంచెఁ బరాక్ర మోన్నతి౯."

ఈగంగయసాహిణీ కాకతీయాంధ్రచక్రవర్తి యగుగణపతి దేవుని, సైన్యమున కధ్యక్షుఁడును, రాజప్రతినిధి యై నిజామురాష్ట్రములో నిప్పుడు చేరి యున్ననల్లగొండసీమలోని పానగల్లు మొదలుకొని మార్జవాడి (కడపమండలములోని వల్లూరు రాజధాని) వఱకుఁ గల దేశము నంతయుఁ బరిపాలించు చుండిన యొక యున్నత రాజకీయాధికారిగాని సామాన్యుఁడు గాఁడు. ఇతనికి బ్రహ్మరాక్షసుఁ డనుబిరుదుగలదు గనుకనే రక్కెసగంగని పేర్కొనఁ బడియున్నాఁడు. ఈగంగయసాహిణి కాయస్థకులస్థుఁ డని పుష్పగిరిలోని యొకశాసనమువలనఁ దెలి యుచున్నది.[3] ఈగంగయసాహిణిం గూర్చి యాంధ్రుల చరిత్రమునం దిట్లు వ్రాయఁ బడియున్నది.

"ఇట్టి మహాపరాక్రమవంతుఁ డైన గంగయసాహిణి వొకమండలాధిపతిగనున్న మనుమసిద్ధి యెట్లు జయించి యతని రాజ్యాంగములెల్ల నాఁచికొనియెనో, ఎట్లాతఁ డాశ్రితుఁ డై యితనిం బ్రార్థించెనో, ఎట్లీతఁడాశ్రితవత్సలవృత్తి యేర్పడు నట్లుగా నాఁచికొన్న రాజ్యాంగము లెల్ల నిచ్చి పదముఁ గైకొనC బంచెనో, ఎంతమాత్రమును బోధపడకున్నది.” అని యీ చరిత్రముయొక్క రెండవప్రకరణములో మనుమసిద్ధిరాజుల గూర్చిన ఘట్టమున వ్రాసి యున్నాఁడను. ఇటీవల స్థానికచరిత్రములం బరిశీలింపఁగా గంగయసాహిణీయొక్క పూర్వవృత్తాంతము గొంతవఱకు దెలియవచ్చినది. గంగయసాహిణి మొట్టమొదట గణపతిదేవ చక్రవర్తి కొల్వులో లేఁడనియు, మనుమసిద్ధిరాజు తండ్రియైన తిరుకాళచోడమహారాజునకు (తిక్కరాజు) అగ్రసేనాధిపతిగ నుండె ననియు సిద్దపటముసీమ లోని యోగూరు స్థానిక చరిత్రమునఁ జెప్పఁబడినది. ఇతఁడు మొదట తిక్కభూపాలునకు సేనాధిపతిగ నుండి యతిని యనంతరమున కలుకడపురవరాధీశ్వరుం డైన శ్రీమన్మహా మండలేశ్వర త్రైలోక్యమల్ల భుజబల వీరనారాయణ రాయదేవ మహారాయల సైన్యాధీశుఁడై మోదుకూరు నందుండి ములికినాటిని బరిపాలనము సేయునపుడు తిక్కరాజు కొడుకైన మనుమసిద్దిరాజుతో యుద్ధము చేసి యుండవచ్చును. ఆయుద్దమునం దోడిపోయి మనుమసిద్ధిని నాశ్రయించి నందువలన నతఁడు తన యాశ్రితవత్సలవృత్తి యేర్పడు నట్లుగా యథాస్థానమునకుం బంచెనని స్పష్టమగుచున్నది. కాకతిగణపతి దేవ చక్రవర్తి గండికోట, ములికినాడు, రేనాడు, పెనదాడి, సకిలినాడు, ఏరువనాడు, పొత్తపినాడు మొదలగుసీమల నెల్ల జయించి గంగయసాహిణిఁ దనకు సైన్యాధ్యక్షునిగా నియమించి యాతఁడు తనకుఁ బ్రతినిధిగ నుండి పైసీమలఁ బరిపాలించు నటు లనుజ్ఞ నొసంగెను. కాఁబట్టి యప్పటి నుండియు గంగయసాహిణి సర్వాధికారి యై సైన్యాధ్యక్షుఁ డై బాహత్తరినియోగాధిపతి యై ప్రతినిధిపరిపాలకుఁ డై మిగుల వాసి గాంచెను. మాండలికరాజుల నెల్లరను గణపతిదేవ చక్రవర్తికి లోఁబడఁజేసి యెల్లరను శాసించి యదుపులోనుంచి కప్పములు గైకొనుచుఁ బ్రఖ్యాతుఁ డైనందున గంగయసాహిణికి మాండలిక బ్రహ్మరాక్షసుఁ డనియు, రక్కెసగంగనియుఁ బేరులు గలిగెను. .........గంగయసాహిణి చేసిన డాపధర్మములను గూర్చి శాసనము లనేకములు కడప, కందవోలు మండలములలోఁ గానవచ్చుచున్నవి. ఇతఁడు దేవతా బ్రాహ్మణభక్తి గలవాఁడగుటచేత ననేక శివాలయములకును, బ్రాహ్మణులకు ననేక భూదానములను గావించి ప్రఖ్యాతుఁ డయ్యెను."

మఱియు మనుమసిద్ధిరాజు మహారాష్ట్రసామంతుఁ డైనసారంగుని జయించె నని నిర్వచనోత్తర రామాయణమున నీక్రిందిపద్యములోఁ జెప్పఁబడి యున్నది.

"శా. శృంగారంబు నలంగ దేమియును బ్రస్వేదాంకురశ్రేణి లే
     దంగంబుల్ మెఱుగేద వించుకయుమాహారాష్ట్రసామంతుసా
     రంగుం దోలి తురంగముం గొనిన సంగ్రామంబునం దృప్తస
     ప్తాంగ స్ఫారయశుండు మన్మవిభు పంపై చన్న సైన్యంబునన్."

ఇందునఁగూర్చి యాంధ్రుల చరిత్రము నందు వ్రాయఁ బడి యున్న వాక్యములనే యిం దుదాహరించు చున్నాఁడను.

“ఇందుఁ బేర్కొనఁ బడినసారంగుఁడు, అతివిషమ హయారూఢ ప్రౌఢరే ఖావంతుఁడును, పరబల కృతాంతుఁడును, శరణాగత వజ్రపంజ రుఁడును, మండలీకరవందోలియు, జీవరక్షచక్ర నారాయణుఁడును, అగు శ్రీమన్మహామండలేశ్వర శ్రీసారంగపాణి దేవరాజేగాని యన్యుఁడు గాడని తోఁచుచున్నది. ఇతఁడు కాకతీయగణపతిదేవునకు సామంతుఁడుగ నుండి అద్దంకిసీమకుఁ బరిపాలకుఁడుగ నుండెను. ఇతనితండ్రి మాధవదేవరాజు. ఇతఁడు మనుమసిద్దికి సమకాలికుఁ డై యుండెను. గోవిందనాయకుఁ డీతనికి మంత్రిగనుండెను. ఇతని పూర్వులు మహారాష్ట్రములోని శౌణదేశమునుండి వచ్చినటులు దెలియుచున్నది. కాఁబట్టి నిర్వచనోత్తరరామాయణమునఁ బేర్కొనఁ బడినసారంగుఁ డితఁడే యనుటకు సందియము లేదు."

అని వ్రాసి యున్నాఁడను గాని మహారాష్ట్రదేశము నుండి మఱియొక సారంగుఁడు పశ్చిమపాకనాడు పై దండెత్తి వచ్చి దోఁచుకొనఁ బ్రయత్నించు నపుడు మనుమసిద్ది వానిని పాఱఁద్రోలెననియుఁ దెలియుచున్నది. భావి పరిశోధనమునఁ గాని యిదమిత్థ మని నిర్ణయింపఁ జూలము.

బ్రాహ్మణులకు వెలమలకును వివాదము

పూర్వకాలమున ముక్కంటికాడు వెట్టి యను పల్లవరాజొకఁడు శ్రీశైలమునకుఁ దూర్పున నుండుదేశమున డెబ్బది యగ్రహారములను గల్పించి బ్రాహ్మణులకు దానముచేసి యుండెనఁట. అధిరాజేంద్ర చోళమండల మనియెడు పశ్చిమ ప్రాజ్ఞ్నాటిలోని పేరంగండూ రనుగ్రామము వానిలో నొకటిగా నుండెను. ఈగ్రామము నేఁబదిరెండు భాగములుగా విభాగించి ముక్కంటికాడువెట్టి బ్రాహ్మణులకు ధారపోసి యుండెను. అప్పటినుండియు నా బ్రాహ్మణులు పుత్త్రపౌత్ర పారంపర్యముగా నిరాతంకముగా ననుభవించు చుండిరి. ఇట్లుండ సకలికోడూరులో నుండు వ్యవసాయదారులు తమ దేశమునందు గొప్పకలహము జనించుటచేత తమదేశమును విడిచి వలసవచ్చి యీ గ్రామములోని చెఱువున కుత్తరభాగమున వసతు లేర్బఱచుకొని నివసించు చుండిరి. మఱియును ఇనం బ్రోలు గ్రామవాసులైన వెలమలు కొందఱు తమగ్రామమున మహామారి జ్వర మంకురించి ప్రజానాశముఁ గలిగించుచుండుటచేత నాగ్రామమును విడిచిపెట్టి యీబ్రాహ్మణా గ్రహారమునకుఁ జనుదెంచి తా మాక్రమించుకొనెడు పొలములలో నెంతపంటపండునో యంత మొత్తమును బన్నుగాఁ జెల్లించు పద్ధతి పై నొడంబడికఁ జేసికొని గుడిసెలు గట్టుకొని కాపుర ముండుచు వచ్చిరి. తరువాత నొకప్పుడు మీనరాశి యందు శని ప్రవేశించుట చేత దేశమునఁ గాటకము సంభవించెను. ఆకారణముచేత బ్రాహ్మణు లాగ్రామమును విడిచి పెట్టి పోయిరి. కాటకము గడచిపోయిన కొంతకాలమునకు బ్రాహ్మణులు మరల స్వగ్రామములోఁ బ్రవేశించిరి. తమ యొడంబడిక ప్రకారము వెలమలు తమకట్టుబడులను బ్రాహ్మణులకుఁ జెల్లింప రైరి. ఇంతియగాక యాయగ్రహారము పరిపాలనము చేయు నట్టి ప్రభు వైన మనుమసిద్దిరాజు పా లయ్యెను. అందు పై నాబ్రాహ్మణులు పరిపాలనము చేయు నట్టి మనుమసిద్ది రాజుకడకుఁ బోయి తమ కష్టములను గూర్చి మొఱపెట్టుకొనిరి. అతఁడు సదయ హుృద యుఁ డై యినంబ్రోలువాసులైనవెలమలకు వర్తమాన మంపి పాక నాటిలోని ప్రజల సాహాయ్యమును బడసి వారివివాదమును గూర్చి విమర్శ జరిపెను. ఆవిమర్శలో నాభూములు బ్రాహ్మణుల వైనటులు దేలినందున వీరరాజేంద్ర చోడచక్రవర్తి యొక్క పదుమూఁడవ సంవత్సర పరిపాలనకాలమున అనఁగా శా. శ. 1179 (క్రీ. శ. 1257-58) దవ సంవత్సరమునఁ దనతండ్రి తిరుకాళ దేవమహారాజు పుణ్యముకొఱకు మనుమసిద్దిరాజు కోడూరు గ్రామమును బ్రాహ్మణులకు దానము చేసెను. ఈ విషయములు కడపమండలములోని నందలూరి యఱవశాసనములలో నొకదాని వలనఁ దేటపడుచున్నవి.[4] దీనిం బట్టి పదుమూఁడవశతాబ్దికిఁ బూర్వము పాకనాటిలో మహామారిజ్వరము (ప్లేగు) గాని, అటువంటిదే మఱియొక యంటువ్యాధిగాని వ్యాపించి యుండె ననియు, అట్టి స్వగృహములను విడిచిపెట్టి పొలములలో గుడిసెలు వేసికొని కాపుర ముండుట క్షేమకర మని ప్రజలు తెలిసికొని యున్నా రనియు బై శాసనములలోని విషయములు స్పష్టముగఁ దెలుపుచున్నవి. ఈశాసనములో నుదాహరింపఁ బడినకోడూరు గ్రామము కడపమండలము లోనిపుల్లంపేట తాలూకాలో నున్నది. పేరం గండూరు గ్రామ మిప్పుడు గానరాదు. పైశాసనములో మనుమసిద్దిరాజు వీరరాజేంద్రచోడ చక్రవర్తికి సామంతుఁడుగ నున్నటులు గనం బడుచున్నను స్వతంత్రుఁ డై పరిపాలనము చేయుచుండెనని మన మూహింప వచ్చును.

  1. Indi Ant. Vol. XXI. p. 202; Ep-Ind. Vol. VII. No. 588, Kielhorn's. List of inscriptions of Southern India.
  2. 2 Nellore Inscriptions, Vol. II. No. 61.
  3. "యోగండ పెండేరక నామధేయః
     కాయస్థ వంశోద్భవ కర్ణధారః
     శ్రీగంగ సేనాపతిరస్యకాన్తా
     కాన్తిర్హిమాం శోరివకౌబలాయః"

  4. Annual Report on Epigraphy of 1907 No. 580