తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 93


రేకు: 0093-01 గుండక్రియ సం: 01-459 వైరాగ్య చింత


పల్లవి:
నే నేమి సేయుదును నీవు నాలోపలనుండి
శ్రీనాథుడవు నీచేఁత లింతేకాక

చ.1:
తనువేమిసేయును తనువులోపలనున్న-
చెనఁటియింద్రియములచేఁతఁలుగాక
మనసేమిసేయును మనసులోపలనున్న-
నినుపు గోర్కులు చేసే నేరములుగాక

చ.2:
జీవుఁడేమి సేయును జీవునిఁ బొదుగుకున్న
భావపుప్రకృతి చేసేపాపముగాక
చేవదేరఁ బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి-
దైవపుమాయలోనిధర్మ మింతేకాక

చ.3:
కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశుఁ -
డేలి మన్నించేమన్నన యిదియేకాక
యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు
మేలిమి నినుఁ దలఁచి మెచ్చుటేకాక


రేకు: 0093-02 బౌళి సం: 01-460 దశావతారములు

పల్లవి:
పొడవైన శేషగిరి బోయనాయఁడు
విడువ కిందరిఁ గాచు వెడబోయ నాయఁడు

చ.1:
పాలసి మీసాల పెద్దబోయ నాయఁడు
మలిగి వీఁపునఁ గట్టేమంకుబోయ నాయఁడు
పొలమురాజై తిరిగేబోయ నాయఁడు
వెలయ మోటుననుండేవేఁటబోయ నాయఁడు

చ.2:
పొట్టిపాట్టియడుగులబోయ నాయఁడు యెందు
బుట్టుపగసాధించేబోయ నాయఁడు
బొట్టులమెకమునేసేబోయ నాయఁడు
పట్టపునెమలిచుంగబలుబోయ నాయఁడు

చ.3:
పొంచి శిగ్గెగ్గెఱగనిబోయ నాయఁడు
మించి రాలమీఁదదాఁటేమెండుబోయ నాయఁడు
అంచెల శ్రీవేంకటేశుడనేబోయ నాయఁడు
పంచఁ గాలవేలములబలుబోయ నాయఁడు


రేకు: 0093-03 ముఖారిసం: 01-461 నామ సంకీర్తన


పల్లవి:
వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులు నేల
పుడమిధరుఁడు మాఁకు భువనౌషథము

చ. 1:
హరి యచ్యుతాయంటే నణఁగుఁ బాపములు
నరసింహ యనియంటే నాఁటినదుఁఖములు మాను
పురుషోత్తమాయంటేఁ బుండ్లు బూచులు మాను
పరమౌషధ మీతఁడే పాటింప మాకు

చ. 2:
వాసుదేవ యనియంటే వదలు బంధములెల్లా
వాసికి గృష్ణాయంటే వంతలరోగాలు మాను
శ్రీసతీశ యనియంటే చింతలిన్నియును మాను
గాసిదీర నితడేపో ఘనదివ్యౌషధము

చ. 3:
గోవిందా యనియంటేఁ గూడును సంపదలు
యీవల మాధవయంటే నిహముఁ బరముఁ జేరు
దేవ నారాయణయంటే దేహము సుఖియై యుండు
శ్రీవేంకటేశుఁడే మాకు సిద్దౌషధము


రేకు: 0093-04 రామక్రియ సం: 01-462 అంత్యప్రాస


పల్లవి:
మహి నింతటివారువో మనవారు
బహుమహిమలవారు ప్రపన్నులు

చ.1:
జయమంది జననపుజరామరణముల-
భయములేనివారు ప్రపన్నులు
క్రియలెల్ల నుడిగి మూఁగినకర్మపుటడవి
బయలుచేసినవారు ప్రపన్నులు

చ.2:
ధీరులై మాయంధకారంబు నెదిరించి
పారఁదోలినవారు ప్రపన్నులు
సారమయ్యినసంసారసాగరము
పారముగన్నవారు ప్రపన్నులు

చ.3:
అండ నిన్నిటాయఁ దనిసి యాసలెల్లాఁ దెగఁగోసి
పండినమనసువారు ప్రపన్నులు
దండిగా శ్రీవేంకటేశుదాసులై పరముతోవ
బండిబాట చేసినారు ప్రపన్నులు


రేకు: 0093-05 దేవగాంధారి సం: 01-463 వైష్ణవ భక్తి


పల్లవి:
సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింపగనొల్లను
సర్వజ్ఞుండును నాచార్యుండే సర్వశేషమే నాజీవనము

చ.1:
యెఱఁగఁగనొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటుసోదించి
యెఱిఁగి యితరులను బోధించెదమను యీపెద్దరికము నొల్లము
యెఱిఁగేటివాడును యాచార్యుండే యెఱుకయుసర్వేశ్వరుఁడే
యెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మావిజ్ఞానము

చ.2:
చదువఁగనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకు సోదించి
చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లము
చదివేటివాఁడును నాచార్యుండే చదువును నాయంతర్యామే
చదువుకుఁ జదువమికియు దొలఁగుటే నానాసాత్వికభావమే నాతెలివి

చ.3:
అన్నిటికిని నే నధికారినవెడియహంకారము నొల్లను
కన్నులజూచుచు నందరితో నేఁ గాదని తొలఁగానొల్లను
మన్నన శ్రీవేంకటేశ్వరుకరుణను మాయాచార్యుఁడే అధికారి
వున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నాతలఁపు


రేకు: 0093-౦6 బౌళి సం: 01-464 వైరాగ్య చింత


పల్లవి:
ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁ డింతే
బందెలకర్మములాల పట్టుకురో మమ్మును

చ.1:
యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలే
యెఱగక చేసినది యీ తనిమాయే
తెఱఁగొప్ప రెంటికిని తెడ్డువంటివాఁడ నింతే
పఱచుఁగర్మములాల పట్టకురో మమ్మును

చ.2:
కాయములోపలివాఁడు ఘనుఁ డొక్కఁ డితఁడే
కాయ మీతనిప్రకృతికల్పిత మింతే
తోయరాక రెంటికిని తోడునీడైతి నింతే
బాయటికర్మములాల పట్టకురో మమ్మును

చ.3:
యేలినవాఁడు శ్రీవేంకటేశుఁ డితఁ డొక్కఁడింతే
యేలికసానై పెంచేది యీతనిసతే
సోలి నే వీరిఁ గొలిచేతసూత్రపుబొమ్మ నింతే
పాలుపుగర్మములాల పట్టకురో మమ్మును