తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 94


రేకు: 0094-01 కన్నడగౌళ సం: 01-465 వైరాగ్య చింత


పల్లవి:
బోధకు లెవ్వరు లేక భోగినైతిని
శ్రీధరుఁడే మాకు దిక్కు చింతింప నిఁకను

చ.1:
పట్టి దిగంబరినై పాలే యాహరముచేసి
తొట్టినపంచేంద్రియములతోవ విడిచి
పుట్టితి సన్యాసినై బుద్దెఱిఁగీనెఱగక
అట్టె నడుమ సంసారినైతి నేనూ

చ.2:
గచ్చుల నన్నీ మఱచి గాలే ఆవటించుకొని
అచ్చపుఁబరమయేకాంతసమాధి
నిచ్చలు నిద్రాభ్యాసనిర్మలయోగినైతి
కచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మినైతి

చ.3:
భావము పారవిడిచి బ్రహ్మండమెల్ల నిండి
వేవేలు గోరికల వేడుకతోడ
జీవన్ముక్తుఁడనైతి శ్రీవేంకటేశ్వరుఁ జేరి
ధా వతు లిన్నియు మాని తన్మయుఁడనైతి


రేకు: 0౦94-02 ఖైరవి సం: 01-466 శరణాగతి


పల్లవి:
మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల
యెదలో నీవుండగా నితరములేలా

చ.1:
నిగమమార్గముననే నడచేనంటే
నిగమములెల్లను నీమహిమే
జగములోకులఁ జూచి జరగెదనంటే
జగములు నిమాయజనకములు

చ.2:
మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటే
మనసుకోరికలు నీమతకాలు
తనువు నింద్రియములు తగ గెలిచేనంటే
తనువు నింద్రియములు దైవమ నీమహిమ

చ.3:
యింతలోనిపనికిఁగా యిందు నందుఁ జొరనేల
చెంత నిండుచెరువుండ చెలమలేలా
పంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటి
సంతకూటాలధర్మపుసంగతి నాకేలా


రేకు: 0౦94-03 బౌళి సం; 01-467 వైరాగ్య చింత


పల్లవి:
చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా
వాచవికి బతిమాలి వడఁ బడ్డబదుకా

చ.1:
ఆసలకుఁ జోటు గడ్డు అంతరంగాన నెంతైన
వీసమంతాఁ జోటు లేదు విరతికీని
యీసున సంసారమున కెందరైనాఁ గలరు
వోసరించి మోక్షమియ్య నొకరు లేరు

చ.2:
భోగించ వేళ గద్దు పాద్దువాడపుఁగుంకును
వేగమే హరిఁదలచ వేళలేదు
వోగులలంపటమున కోపి కెంతైనాఁ గద్దు
యోగపుసత్కర్మాన కొకయింత లేదు

చ.3:
యెదుట ప్రపంచాన కెఱు కెంతైనాఁ గద్దు
యిదివో యాత్మజ్ఞానమించుకా లేదు
మది శ్రీవేంకటేశుఁడు మమ్ము నిట్టి కాచెఁగాని
ఎదరి నానేరములు పాప మఱి లేరు


రేకు: 0094-04 దేసాక్షి సం: 01-468 వేంకటేశ్వరౌషధము


పల్లవి:
సకలజీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు

చ.1:
మూఁడులోకము లొక్కట ముంచి పెరిగినది
పోఁడిమి నల్లవికాంతిఁ బొదలినది
పేఁడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది
నాఁడే శేషగిరిమీద నాఁటుకొన్నమందు

చ.2:
పడిగెలు వేయింటిపాము గాచుకున్నది
కడువేదశాస్త్రముల గబ్బు వేసేది
యెడయక వొకకాంత యెక్కువ వుండినది
కడలేనియంజనాద్రిగారుడపుమందు

చ.3:
బలుశంఖుజక్రములబదనికె లున్నది
తలఁచినవారికెల్లఁ దత్వమైనది
అలరినబ్రహ్మరుద్రాదులఁ బుట్టించినది
వెలుఁగుతోడుత శ్రీవేంకటాద్రిమందు


రేకు:0౦94-05 గుండక్రియ సం: 01-469 వైరాగ్య చింత


పల్లవి:
ముందటిజన్మములెల్లా ముంచెఁ బారుబడివడ్ణి
యెందు చొచ్చినానుఁ బోనియ్య దీరుణము

చ.1:
నుదుట వ్రాసినవ్రాలు నూరేండ్లపత్రము
పొదలు నాకర్మమే పూఁటకాఁపు
వెదకి సంసారము వెంటఁ బైతరవు
యిది యెందుచొచ్చినాఁ బోనియ్య దీరుణము

చ.2:
పుట్టినప్పుడే తనువు భోగ్యమై నిలిచెను
జట్టిఁ గామినులపొందు సరియాఁకలు
నెట్టన యాహరములు నిచ్చినిచ్చ లంచాలు
దిట్టనై యెందు చొచ్చినాఁ దీర దీరుణము

చ.3:
యెక్కువైనశ్రీవేంకటేశుమఱఁగు చొచ్చి
తెక్కుతోడ సలిగెల దిరుగఁగను
అక్కరతో నప్పులెల్లా నవి మాకుఁ దామచ్చి
చిక్కి యెందు చొచ్చినాఁ జేరు నీరుణము


రేకు: 0094-06 దేసాళం సం: 01-470 ఉపమానములు


పల్లవి:
అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు
పన్నినలోకులకెల్ల ప్రకృతి కారణము

చ.1:
తలఁపు గారణము తత్వవేత్తలకును
చలము గారణము సంసారులకును
ఫలము గారణము పరమవేదాంతులకు
కలిమి గారణము కర్ములకును

చ.2:
తనయాత్మ గారణము తగినసుజ్ఞానులకు
తనువే కారణము తగ జంతువులకు
ఘనముక్తి గారణము కడగన్నవారికెల్లా
కనకమే కారణము కమ్మినబంధులకు

చ.3:
దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా
జీవుడు గారణము చిల్లరమనుజులకు
దేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే
పావన మాతనికృప పరమకారణము