తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 92
రేకు: 0092-01 నాట సం: 01-453 నృసింహ
పల్లవి:
నవనారసింహ నమో నమో
భవనాశితీర యహోబలనారసింహ
చ.1:
సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ
వితతవీరసింహవిదారాణా
అతిశయకరుణ యోగానంద నరసింహ
మతి శాంతపు కానుగుమాని నారసింహ
చ.2:
మరలి బీభత్సపుమట్టెమళ్ల నరసింహ
నరహరి భార్లోటి నారసింహ
పరిపూర్ణ శృంగార ప్రహ్లద నరసింహ
సిరుల నద్భుతపు లక్ష్మీ నారసింహ
చ.3:
వదనభయానకపు వరాహ నరసింహ
చెదరని వైభవాల శ్రీనరసింహ
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి
పదివేలురూపముల బహునారసింహ
రెకు: 0092-02 శంకరాభరణం సం: 01-454 దశావతారములు
పల్లవి:
అంగనలాల మనచే నాడించుకొనెఁగాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే
చ.1:
వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁగాని
తడయక పురుషాత్తముఁ డితఁడే
బడబాగ్ని జలధికిఁ బాయకల్లుఁడాయఁగాని
వెడలించె నమృతము విష్ణుఁ డితడే
చ.2:
పులిగూడుదిన్న వానిపాం దొక్కటే సేసేఁగాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివానిసరుస బావాయఁగాని
పలుదేవతలకెల్ల ప్రాణబంధుఁ డితఁడే
చ.3:
యెక్కడో గొల్లసతుల కింటిమగఁడాయఁగాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁగాని
తక్కక వేదము చెప్పే దైవమీతఁడే
రేకు: 0092-03 అలిత సం: 01-455 వేంకటగానం
పల్లవి:
నీ వేలికవు మాకు నీదాసులము నేము
ఆవల నితరుల నే మడుగఁబొయ్యేమా
చ.1:
పసురమై వుండి యిచ్చీఁ బక్కన గామధేనువు
యెసఁగి మానై వుండి యిచ్చీఁ గల్పవృక్షము
వెస రాయైవుండి యిచ్చీ వేడుకఁ జింతామణి
మసలనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా
చ.2:
గాలి యావటించి యిచ్చీఁ గారుమేఘము మింట
వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత
కాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ
మైలలేనిశ్రీపతివి మాకు నిచ్చు టరుదా
చ.3:
అండనే కామధేనువ వాశ్రితచింతామణివి
పైండినకల్పకమపు భక్తులకెల్లా
నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి
దండిగా నమ్మితే నీవు దయఁజూచు టరుదా
రేకు: ౦౦92-౦4 ముఖారిసం: 01-456 అధ్యాత్మ
పల్లవి:
అక్కరకొదగనియట్టియర్థము
లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే
చ.1:
దండితోఁ దనకుఁ గాని ధరణిశు రాజ్యంబు
యెండెనేమి యది పండెనేమిరే
బెండుపడఁ గేశవునిఁ బేరుకొననినాలికె
వుండెనేమి వుండకుండెనేమిరే
చ.2:
యెదిరిఁ దన్నుఁ గానని యెడపుల గుడ్డికన్ను
మొదలఁ దెఱచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతిసేవ వేడుకఁ జేయనివాఁడు
చదివెనేమి చదువు చాలించెనేమిరే
చ.3:
ఆవల నెవ్వరులేనిఆడవిలోనివెన్నెల
కావిరిఁ గాసెనేమి కాయకున్న నేమిరే
శ్రీవేంకటేశ్వరుఁ జేరనిధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలఁగినేమిరే
రేకు: 0092-05 లలిత సం: 01-457 అంత్యప్రాస
పల్లవి:
పట్టినదెల్లా బ్రహ్మము
దట్టపుజడునికి దైవంబేలా
చ.1:
ఘనయాచకునకు కనకమే బ్రహ్మము
తనువే బ్రహ్మము తరువలికి
యెనయఁ గాముకున కింతులే బ్రహ్మము
తనలో వెలిఁగేటి తత్వం బేలా
చ.2:
ఆకటివారికి నన్నమే బ్రహ్మము
లోకమే బ్రహ్మము లోలునికి
కైకొని కర్మికి కాలమే బ్రహ్మము
శ్రీకాంతునిపై జింతది యేలా
చ.3:
భువి సంసారికి పుత్రులె బ్రహ్మము
నవ మిందరి కిది నడచేది
యివలను శ్రీవేంకటేశు దాసులకు
భవ మతనికృపే బ్రహ్మము
రేకు: 0092-06 గుండక్రియ సం: 01-458 అథ్యాత్మ
పల్లవి:
రూకలై మాడలై రువ్వలై తిరిగీని
దాకొని వున్నచోటఁ దానుండ దదివో
చ.1:
వొకరి రాజుఁజేసు నొకరి బంటుగఁ జేసు
వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు
వొకచోటనున్న ధాన్య మొకచోట వేయించు
ప్రకటించి కనకమే భ్రమయించీ జగము
చ.2:
కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు
కొందరికి పుణ్యులఁజేసుఁ గొందరి పాపులఁజేసు
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు
పందెమాడినటువలెఁ బచరించు పసిఁడీ
చ.3:
నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
తగిలి శ్రీవేంకటేశు తరుణియై తా నుండు
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు
నగుతా మాపాల నుండి నటియించు బసిఁడీ