తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 64


రేకు: 0064-01 వరాళి సం: 01-328 వైరాగ్య చింత


పల్లవి:
ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధా
కాముకపు మనసునకు కడ మొదలు లేదు

చ.1:
వత్తిలోపలి నూనె వంటిది జీవనము
విత్తుమీదటి పొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పాత్తుల సుఖంబులకు పారలుటలుగాక

చ.2:
ఆకాశ పాకాశ మరుదైన కూటంబు
లోకరంజకము తమలోనిసమ్మతము
చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు
చేకొనిననేమి యివి చెదిరిననునేమి

చ.3:
గాదెఁబోసినకొలుచుకర్మి సంసారంబు
వేదు విడువనికూడు వెడమాయబదుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట


రేకు: 0064-02 శ్రీరాగం సం: 01-329 అధ్యాత్మ


పల్లవి:
కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁదలఁచు
పంచమహపాతకుఁడే బ్రహ్మణోత్తముఁడు

చ.1:
వేదములుచదివియును విముఖుఁడై హరికథల
నాదరించనిసోమయాజికంటె
యేదియునులేనికులహీనుఁడైనను విష్ణు
పాదసేవకుఁడువో బ్రహ్మణోత్తముఁడు

చ.2:
పరమమగువేదాంతపఠన దొరకియు సదా
హరిఁదలఁచలేని సన్న్యాసికంటె
మరిగి పసురముఁదినెడిమాలయైనను వాఁడె
పరమాత్ముఁ గొలిచినను బ్రహ్మణోత్తముఁడు

చ.3:
వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథా
తనువు వేఁపుచుఁ దిరుగతపసికంటె
చనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁ
బనిదిరుగునధముఁడే బ్రహ్మణోత్తముఁడు


రేకు: 0౦64-03 జౌళి సం: 01-330 అధ్యాత్మ



పల్లవి:
తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁ
దెలియఁగఁగోరేటి తెలివే పో తెలివి

చ.1:
వలచినసతి దన్ను వడిఁ గాలఁదన్నిన
అలరి యెట్లా నుబ్బు నటువలెనే
తలఁక కెవ్వరు గాలఁదన్నినా మతిలోన
అలుగక ముదమందునదివో తెలివి

చ.2:
అరిది మోహపు వనిత ఆలిపైఁ దిట్టిన...
నరవిరై చొక్కినయుటవలెనే
పరులు దన్ను వెలుపల నిట్లఁ బలికిన
ఆరలేక రతిఁ జొక్కునదివో తెలివి

చ.3:
తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన...
ననయమును నటు గోరునటువలెనే
తనర వేంకటపతిదాసుల ప్రసాదంబు
ఆనిశము ను గొనఁగొరునదివో తెలివి


రేకు: 0064-04 గుండక్రియ సం; 01-331 ఉపమానములు


పల్లవి:
పారాక పోయి తలఁపుననున్న దైవంబుఁ
జేరనొల్లక పరులఁజేరఁదిరగెదము

చ.1:
వడిఁబారు పెనుమృగము వలలలోపలఁ దగులు
వడి వెడల గతిలేక వడఁకుచున్నట్లు
చెడనికర్మములలోఁ జిక్కి భవములబాధఁ
బడియెదముగాక యేపనికిఁ దిరిగెదము

చ.2:
నీరులోపలిమీను నిగిడి యామిషముకై
కోరి గాలము మ్రింగి కూలబఁడినట్లు
జారిపోయిననేల సంసారసాఖ్యవి-
కారంపుమోహములఁ గట్టువడియెదము

చ.3:
శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకుని
భావింప దేవతాపతియైనవాని
సేవించుభావంబు చిత్తమొడఁబడక నే-
మీవలావలిపనుల నిట్లఁ దిరిగెదము


రేకు: 0064-05 శ్రీరాగం సం: 01-332 దశావతారములు


పల్లవి:
సకలసందేహమై జరగుచున్నది యెకటి
ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని

చ.1:
వసుదేవుజఠరమనువననిధికిఁ జంద్రుఁడై
అసమానగతిఁ బొడమినాఁ డీతఁడు
వసుధఁ జంద్రుఁడు నీలవర్గుఁ డేఁటికినాయ
కసరెత్తి ననుఁగందు గలయఁగొనుఁబోలు

చ.2:
ఇనవంశమున లోకహితకల్పభూజమై
అ నఘఁడై జనియించినాఁ డీతఁడు
ననుపై నసురతరువు నల్లనేఁటికినాయ
పెనుఁగొమ్మలో చేఁగ పెరిగిరాఁబోలు

చ.3:
తరువేంకటాద్రిపైఁ దెలియఁ జింతామణై
అరిదివలెఁ బొడచూపీనాఁ డీతఁడు
గరిమె నది యిపుడు చీఁకటివర్ధమేలాయ
హరినీలమణులప్రభ లలమికొనఁబోలు


రేకు: 0064-06 ముఖారిసం: 01-333


పల్లవి:
చిరంతనుఁడు శ్రీవరుఁడు
పరమం భవ్యం పావనం

చ.1:
వేదమయుఁడు కోవిదుఁడమలుఁడు పరుఁ-
డాది పురుషుఁడు మహామహుఁడు
యేదెస నేమని యేది దలఁచిన న-
ఖేద మవాద మఖిల సమ్మతం

చ.2:
నిఖిలనిలయుఁడు మునివరదుఁడధికుఁడు
మఖముఖ శుకాభిమతరతుఁడు
శిఖరం శివం సుశీలన మతిశయ-
ముఖరం ముఖ్యం మూలమిదం

చ.3:
అనేకప్రదుఁ డనాది నిధనుఁడు
ఘనుఁడీ తిరువేంకటవిభుఁడు
దినం దినం సముదిత రవికోటి భ-
జనం సిద్దాంజనం ధనం