తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 63


రేకు: 0063-౦1 భైరవి సం: 01-322 కృస్ణ


పల్లవి:
వీఁడివో యిదె వింతదొంగ
వేఁడిపాలు వెన్న వెరఁజినదొంగ

చ.1:
వెలయ నీటఁ జొప్పువేనేటి దొంగ
తలగాననీక దాఁగు దొంగ
తలఁకక నేలదవ్వేటిదొంగ
తెలసి సందెకాడఁ దిరిగేటి దొంగ

చ.2:
అడుగుకింద లోకమడఁచేటి దొంగ
అడరి తల్లికినైన నలుగుదొంగ
అడవిలో నెలవైయున్న దొంగ
తొడరి నీలికానెతో నుండు దొంగ

చ.3:
మోస మింతుఁల జేయుముని ముచ్చుదొంగ
రాసికెక్కిన గుఱ్ఱంంపు దొంగ
వేసాల కిటు వచ్చి వేంకటగిరిమీఁద
మూసినముత్యమై ముదమందు దొంగ


రేకు: 0063-02 శ్రీరాగం సం; 01-323 కృస్ద


పల్లవి:
త్వమేవ శరణం త్వమేవ శరణం
కమలోదర శ్రీజగన్నాథా

చ.1:
వాసుదేవ కృష్ణ వామన నరసింహ
శ్రీసతీశ సరసీజనేత్రా
భూసురవల్లభ పురుషోత్తమ పీత-
కౌశేయవసన జగన్నాథా

చ.2:
బలభద్రానుజ పరమపురుష దుగ్ద-
జలధినిహార కుంజరవరద
సులభ సుభద్రాసుముఖ సురేస్వర
కలిదోషహరణ జగన్నాథా

చ.3:
వటపత్రశయన భువనపాలన జంతు
ఘటకారకరణ శృంగారాధిపా
పటుతర నిత్యవైభవరాయ తిరువేం-
కటగిరినిలయ జగన్నాథా


రేకు: 0063-03 కాంబోదిసం: 01-324 దశావతారములు


పల్లవి:
ఆదిదేవుఁడనఁగ మొదలు నవతరించి జలది సొచ్చి
వేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతఁడు

చ.1:
వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల
మూలమూలఁ ద్రోసి ముసుఁగుపాలు సేసె నీతఁడు
వేలంఖ్యలైనసతుల వేడుకలలరఁజేసి వొంటి
నాలిమగనిరీతిఁ గూడి యనభవించె నీతఁడు

చ.2:
కడుపులోని జగములెల్లఁ గదలకుండఁ బాఁపరేని-
పడుక నొక్కమనసుతోడఁ బవ్వళించె నీతఁడు
అడుగుకింద లోకమెల్ల నడఁచఁదలఁచి గుఱుతుమీర
పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతఁడు

చ.3:
కోడెవయసునాఁడు మంచి గోపసతుల మనములెల్ల
ఆడి కెలకు నోప కొల్లలాడి బ్రదికె నీతఁడు
వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుఁ
జూడుఁడనుచు మోక్షపదము చూరవిడిచె నీతఁడు


రేకు: 0063-౦4 ముఖారిసం: 01-325 సంస్కృత కీర్తనలు


పల్లవి:
మాదృశానాం భవామయ దేహినాం
యీదృశం జ్ఞానమితి యేపి న వదంతి

చ.1:
వాచామ గోచరం వాంఛాసర్వత్ర
నీచ కృత్యైరేవ నిబిడీకృతా
కేచిదపి వా విష్ణుకీర్తనం ప్రీత్యా
సూచయంతో వాశ్రోతుం న సంతి


చ.2:కుటిల దుర్భోధనం కూహకం సర్వత్ర
విట విడంబన మేవ వేద్మ్య ధీతం
పటు విమల మార్గ సంభావనం పరసుఖం
ఘటయితుం కష్టకలికాలే న సంతి

చ.3:
దురిత మిదమేవ జంతూనాం సర్వత్ర
విరస కృత్యైరేవ విశదీకృతం
పరమాత్మానాం భవ్య వేంకటానామ-
గిరివరం భజయితుం కేవా న సంతి


రేకు: 0063-05 శ్రీరాగం సం: 01-326 భక్తీ


పల్లవి:
కాకున్న సంసారగతులేల
లోకకంటకములగు లోభంబులేల

చ.1:
వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికి
వినికివేసిన నదియె వేదాంతబోధ
మనికిగనవలసినను మధువైరిపై భక్తి
వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు

చ.2:
చదువు గనవలసినను శౌరినామము దిరుగఁ
జదువుటే సకలశాస్త్రముల సమ్మతము
నిదుర గనవలసినను నీరజాక్షునికిఁ దన-
హృదయసమర్పణ సేయుటిది యోగనిదుర

చ.3
ఆస వలసిన వేంకటాధీశ్వరుని కృపకు-
నాససేయుటే పరమానందసుఖము
వాసి గనవలసినను వైష్ణవాగారంబు
వాసి సేయుట తనకు వైభవస్ఫురణ


రేకు: 0063-06 దేశి సం: 01-327 అధ్యాత్మ


పల్లవి:
జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తన
దైవికము గడవ నెంతటివాఁడు దాను

చ.1:
విడిచిపోవని యాస విజ్ఞానవాసనలఁ
గడచి మున్నాడె నెక్కడివివేకములు
వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్ధముల
మెడవట్టి నూకె నేమిటికింక నెరుక

చ.2:
పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతో
రాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగు
మాయనియ్యనికోపమహిమ కరుణామతిని
వాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పుదము

చ.3:
సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని-
నెరఁగనియ్యదు దనకు నేఁట్టిపరిణతలు
తి రువేంకటాచలాధిపునిమన్ననఁగాని
వెరసి యిన్నటి గెలువ వెరవు మఱిలేదు