తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 65
రేకు: 0౦65-01 సామంతం సం: 01-334 దశావతారములు
పల్లవి:
ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి
కందువగు మంచి బంగారు చేయి
చ.1:
వెలలేనివేదములు వెదకితెచ్చిన చేయి
చిలుకుగుబ్బలికిందఁ జేర్చు చేయి
కలికియగు భూకాంతఁ గాఁగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళవాఁడి చేయి
చ.2:
తనివోక బలిచేత దానమడిగిన చేయి
వొనరంగ భూదానమొసఁగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి
యెనయ నాఁగేలు ధరియించు చేయి
చ.3:
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబుఁ బరపెడిదొడ్డ చేయి
తరువేంకటాచలధీశుఁడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్లఁదెలిపెడి చేయి
రేకు: 0065-02 పాడి సం; 01-335 గురు వందన, నృసింహ
పల్లవి:
అందరిబ్రదుకులు నాతనివే
కందువెల్ల శ్రీకాంతునిదే
చ.1:
వేమరుఁ జదివెడి విప్రుల వేదము
సోముకవైరి యశోవిభవం
శ్రీమించున మరల జీవనమెల్ల సు-
ధామథనునిసంతత కరుణే
చ.2:
హితవగు నిలలో నీసుఖమెల్లను
దితి సుతదమనుఁడు దెచ్చినదే
తతి తల్లి దండ్రి తానై కాచిన
రతి ప్రహ్లాదవరదుని కృపే
చ.3:
ఆలరినయమరేంద్రాదుల బ్రదుకులు
బలిబంధనుకృపఁ బరగినవే
బలసి మునుల యాపదలు వాపుటకు
బలునృపభంజను పరిణతలే
చ.4:
పూని యనాథుల పాందుగఁ గాచిన-
జానకీవిభుని సరసతలే
నానాభూభరణంబులు నందుని-
సూనుఁడు చేసినసుకృతములే
చ.5:
తలకొని ధర్మము తానై నిలుపుట
కలుషవిదూరునిగర్వములే
నిలిచి లోకములు నిలిపినఘనుఁడగు.-
కలియుగమున వేంకటపతివే
రేకు: 0౦65-03 కన్నడగౌళ సం: 01-336 అథ్యాత్మ
పల్లవి:
పాయక మతినుండి పరగ మేలుఁగీడును
సేయించి కర్మిఁ దాఁ జేయు టెవ్వరిది
చ.1:
వెలయఁ జరాచర విఁభుడైన విభునాత్మఁ
దలఁచుఁగాక ప్రాణి దానేమి నేయు
తెలిపి నిర్మలభక్తి దీపించి తనుఁజేరఁ
గొలిపించు కొనలేమి కొరత యెవ్వరిది
చ.2:
కొందరు సుఖులై కొదలేక మెలఁగఁగ
కొందరి దుఃఖపు కొరత యెవ్వరిది
అందరి మతి వేంకటాద్రివల్లభ నీవు
చెంది కర్మములఁ జేయుచేఁత యెవ్వరిది
రేకు: 0౦65-04 ఆహిరి సం: 01-337 అంత్యప్రాస
పల్లవి:
ఎండలోనినీడ యీమనసు
పండు గాయసేయఁబనిలేదు మనసు
చ.1:
వానచేతకములవలెనాయ మనసు
గోనెఁబట్టినబంకగుణమాయ మనసు
మానఁజిక్కినకోలమతమాయ మనసు
తేనెలోపలియీఁగ తెఱఁగాయ మనసు
చ.2:
గడిరాజుబదుకాయ కడలేని మనసు
నడివీది పెసరాయ నయమైన మనసు
గడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసు
అడుసులోపలికంబమై తోఁఁచె మనసు
చ.3:
తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసు
మరుగఁజేసినచోట మరుగు నీ మనసు
తిరువేంకటేశుపైఁ దిరమైన మనసు
సిరిగలిగినచోటఁ జేరు నీమనసు
రేకు: ౦065-05 భూపాళం సం; 01-338 భక్తి
పల్లవి:
అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము
చ.1:
సేయరో మనుజులార చింత హరినిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్టిరము యీకలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁగాకపోయఁ గాలము
చ.2:
మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలము
చ.3:
కనరో వేంకటపతిఁ గన్నులుదనియఁగా
వినరో యీతనిస్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతిమన్ననలు మీరు
తనమీఁదిమది బుద్ధి దాఁచీనిఁ గాలము
రేకు: 0065-06 ధన్నాశి సం: 01-339 అధ్యాత్మ
పల్లవి:
చదివెఁబో ప్రాణి సకలము యీ-
చదువుమీఁది విద్య చదువఁడాయఁగాని
చ.1:
సిరులు చంచలమని చేఁతలధ్రువమని
పరగుసంసారము బయలని
తొరలిన సుఖమెల్ల దుఃఖమూలమని
యెరిఁగి లోభమువీడ నెరఁగఁడాయఁగాని
చ.2:
తలకొన్న ధర్మమే తలమీఁది మోఁపని
వలసీనొల్లమి దైవవశమని
కలిమియు లేమియుఁ గడవఁగ రాదని
తెలిసి లోభము వీడఁ దెలియఁడాయఁగాని
చ.3:
యేచిన పరహితమెంతయుఁ దమ దని
వాచవులిన్ని నెవ్వగలని
యీచందమున వేంకటేశుచేఁతలని
చూచి లోభమువీడఁ జూడడాయఁగాని