తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 62


రేకు: 0062-01 శ్రీరాగం సం: 01-316 వైరాగ్య చింత


పల్లవి:
ఎంతగాలమొకదా యీ దేహధారణము
చింతాపరంపరలఁ జిక్కువడవలసె

చ.1:
పడిగొన్న మోహంబువలలఁ దగులైకదా
కడలేని గర్భనరకము లీఁదవలసె
నడిమిసుఖములచేత ననుపుసేయఁగఁగదా
తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలసె

చ.2:
పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా
ఆపదల తోడిదేహము మోవవలసె
చూపులకులోనైన సుఖము గానక కదా
దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలసె

చ.3:
హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా
పత్రిలేని నరకకూపమునఁ బడవలసె
అతనికరుణారసంబబ్బ కుండఁగఁగదా
బతిమాలి నలుగడలఁ బారాడవలసె


రేకు: 0౦62-02 నాటు సం: 01-317


పల్లవి:
తెలిసినఁ దెలియుఁడు తెలియనివారలు
తొలఁగుఁ డు బ్రహ్మదులె యెరుఁగుదురు

చ.1:
వరదుఁ డఖిలదేవతల కు వంద్యుఁడు
గరదుఁడసురలకుఁ గంటకుఁడు
పరమాత్ముఁడంబుజ భవశివాదులకుఁ
బరులకెల్ల మువ్వరలో నొకఁడు

చ.2:
దేవుఁడు సనకాదిమునులకునుఁ, బర-
దైవ మఖిలవేదములకును,
కైవల్యమొసఁగుఘననిధి, విధికిమ-
హవిధి, జడులకు యూాదవకులుఁడు

చ.3:
ఆద్యుఁడచలుఁడు మహభూత మితఁడ-
భేధ్యుఁడ సాధ్యుఁడు భీకరుఁడు
సద్య: ఫలదుఁడు సకలమునులకును
వేద్యుఁడితఁడె పో వేంకటవిభుఁడు


రేకు: 0062-03 సామంతం సం: 01-318 అధ్యాత్మ


పల్లవి:
ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన
నిక్కమెరిఁగిన మహా నిత్యుఁడే ఘనుఁడు

చ.1:
వేదములు చదివియును విముఖుఁడై హరిభక్తి
యాచరించని సోమయాజికంటె
యేదియునులేని కులహీనుఁడైనను విష్ణు_
పాదములు సేవించు భక్తుఁడే ఘనుడు

చ.2:
పరమగువేదాంతపఠన దొరికియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటె
సరవి మాలిన యంత్యజాతికులజుఁడైన_
నరసి విష్ణునివెదకు నాతఁడే ఘనుఁడు

చ.3:
వినియుఁ జదివియును శ్రీ విభునిదాసుఁడుగాక
తనువు వేఁపుచునుండుతపసికంటె
యెనలేని శ్రీవేంకటేశుప్రసాదాన్న_
మనుభవించినయాతఁ డప్పుడే ఘనుడు


రేకు: 0062-04 శ్రీరాగం సం: 01-319 అధ్యాత్మ


పల్లవి:
కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగినను
ఆనవరతవిభవంబు లప్పుడే రావా

చ.1:
విసుగ కెవ్వరినైన వేఁడనేర్చన నోరు
దెసలకును బలుమారుఁ దెరచు నోరు
వసుథాకళత్రుఁ దడవదుగాక తడవినను
యెసఁగఁ గోరికలు తన కిప్పుడే రావా

చ.2:
ముదమంది యెవ్వరికి మొక్కనేర్చిన చేయి
పొదిగి యథముల నడుగఁబూను చేయి
ఆదన హరిఁ బూజసేయదుగాక సేసినను
యెదురెదురఁ గోరికలు యిప్పుడే రావా

చ.3:
తడయకేమిటికైనఁ దమకమందెడి మనసు
ఆడరి యేమిటికైన నలయు మనసు
వడి వేంకటేశుఁ గొలువదుగాక కొలిచినను
బడిబడినె చెడనిసంపద లిట్లు రావా


రేకు: 0౦062-05 ముఖారి సం: 01-320

పల్లవి:
జనులు నమరులును జయలిడఁగా
ఘనుఁడదె వుయ్యాలగంభముకాడ

చ.1:
వదలక వలసినవారికి వరములు
యెదురెదురై తానిచ్చుచును
నిదురలేక పెనునిధినిధానమై
కదలఁ డదే గరుడగంభముకాడ

చ.2:
కోరినవారికి కోరినవరములు
వోరంతప్రోద్దు నొసఁగుచును
చేరువయై కృపసేసీ నిదివో
కూరిముల పడిమిగోపురమాడ

చ.3:
వడి వేంకటపతి వరములరాయఁడు
నుడుగఁగాళ్ళుఁగన్నులు సుతుల
బడిబడి నొాసఁగుచు బ్రాణచారులకు
కడిమి నీడ దిరుగని చింతాడ


రేకు: 0062-06 బౌళి సం: 01-321 వైరాగ్య చింత


పల్లవి:
కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన
బండాయ సంసారబంధము

చ.1:
వెలయఁ జిత్తంబునకు వేరుపురువై బుద్ధిఁ
గలఁగించె మోహవికారము
కలకాలమునకు లింగము మీఁది యెలుకయై
తలకొనియె నాత్మ పరితాపము

చ.2:
అరయఁ జంచలముచే నాలజాలంబువలెఁ
దిరుగదొరకొనియెఁ దనదేహము
తిరువేంకటాచలాధిపుని మన్ననఁగాని
పరిపాటిఁ బడదు తనభావము