తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 48
రేకు: ౦౦48-01 ముఖారి సం; 01-293 వేంకటగానం
పల్లవి:సేవింతురా యితనిఁ జెలఁగి పరు లిట్లనే
కావించె మమ్ము నెక్కడి దైవమితఁడు
చ.1:పాలచవి యితఁడెఱుఁగు పాలఁబవళించ గో-
పాలుఁడని నేమితని భజియించఁగా
పాలుపడి తల్లి చనుఁబాలు సహితంబు నే-
కాలమునుఁ బాపె నెక్కడి దైవమితఁడు
చ.2: పుట్టిపఁ దానె మఱి పురుషోత్తముఁడు మంచి-
పుట్టు వొగిననుచుఁ బూజించఁగా
పట్టుకొని మముఁ దెచ్చి బలిమిఁ బుట్టువులెల్లఁ
గట్టిపెట్టించె నెక్కడి దైవమితఁడు
చ.3: కర్మకర్తారుఁడని కడలేనిపుణ్యముల ...
కర్మఫలములు దనకుఁ గైకొలుపఁగా
కర్మగతిఁ దెచ్చి వేంకటవిభుఁడు మావు భయ.....
కర్మములఁ జెరిచె నెక్కడి దైవమితఁడు
రేకు: ౦౦48-02 ముఖారిసం: 01-294 దశావతారములు
పల్లవి:అరిది నేఁతలే చేసి తల్లాడ నిల్లాడ
సరిలేక వుండితివి జలరాశికాడ
చ.1:పాలీయఁ బీర్చితి వొకతిఁ బురిఁటి మంచముకాడ
నలఁచితి వొకని గగనంబుకాడ
బలిమిఁ దన్నితి వొకని బండిపోతులకాడఁ
దులిమితివి యేడుగురఁ దోలి మందకాడ
చ.2:తడవి మోదితి వొకని తాటిమాఁకులకాడ....
నడిచితివి వొకనిఁ బేయలకాడను
పిడిచివేసితి వొకని బృందావనముకాడ
వొడిసితివి వొకని నావులమందకాడ
చ.3:పటపటన దిక్కులు పగుల బగతులఁ దునిమి
నటియించితివి మామనగరికాడ
కుటిలబహుదైత్యాంతకుఁడవు వేంకటరాయ
పుటమెగసితి జగంబులయింటికాడ
రేకు: 0౦48-03 పాడి సం: 01-295 కృష్ణ
పల్లవి:బలువగుఁ దనరూపము చూపె
కలదింతయుఁ దనఘన తెఱిఁగించెన్
చ.1:పాండవరక్షణపరుఁడై నరునకు
నండనే తెలిపె మహమహిమ
దండి విడిచి తనదయతో నర్జునుఁ-
డుండఁగ మగటిమి నొడఁబడఁ బలికె
చ.2:మగుడఁగ కులధర్మములుఁ బుణ్యములు
తెగి పార్టున కుపదేశించె
నగుచు నతనితో నానాగతులను
నిగముమునియమమునిజ మెరిఁగించెన్
చ.3:వెరపుమిగుల నావిజయునిమనుమని
పరీక్షిత్తుఁ దగఁ బ్రదికించె
తిరువేంకటగిరిదేవుఁడు దానై
గరిమల భా రతకథ గలిగించెన్
రేకు: ౦౦48-04 సామంతం సం: 01-296 వైరాగ్య చింత
పల్లవి:బలువగుకర్మము లివివో జీవులప్రారబ్దంబులు సంచితంబులును
బలిసి తీర వివి పెరుగనేకాని బ్రహ్మలబహుకల్పంబులదాఁక
చ.1:పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవుల ప్రారబ్ధములై
యేయెడఁజూచిన నెదిటికొలుచులై యిచ్చల నిటు భజియించఁగను
కాయపుఁ బెడతటిగండఁడు విధి, దనుఁగడ తేర్చిన తనకడకర్మములు
పోయి సంచితంబులఁ గలసిన, నవి పాదలుచుఁ గొండలపొ డవై పెరుగు
చ.2:పొదలి సంచితంబులు వడిఁబెరుగును పాలియును జీవునిపుణ్యముఁ జాలక
యెదిగినపుణ్యం బిగురును కాఁగినయినుముమీఁదిజలములవలెను
పదిలములై కడుఁబాపకర్మములే బరువై పరగఁగఁ బ్రాణికి నెన్నఁడు
తుదయు మొదలు నెందును లేక, వడిఁ దొలఁగక భవములతొడవై తిరుగు
చ.3:తలఁపులో నవయఁదలఁచినజంతువు, కలుషహరుఁడు వేంకటగిరిపతి దను
దలఁచుభాగ్య మాత్మకు నొసగినఁ, జిత్తము పరిపక్వంబై యెపుడు
జలజోదరుదలఁచఁగఁబ్రారబ్దంబులు సంచితంబులుఁ బొలసి పుణ్యులై
చెలువగునిత్యానందపదంబునఁ జెలఁగి సుఖించగఁ జేరుదు రపుడు
రేకు: ౦౦48-౦4 భై రవి సం: 01-297 వైరాగ్య చింత
పల్లవి:చాల నొవ్వి నేయునట్టిజన్మమేమి మరణమేమి
మాలుగలపి దొరతనంబు మాన్సు టింత చాలదా
చ.1:పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు
కడపరానిబంధములకుఁ గారణంబులైనవి
యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి
మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి
చ.2:చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడుఁ దనకు
అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టిది
యెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు
ములుగ ములుగఁ దొలితొలి మోఁదు టింత చాలదా
చ.3:కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు
కర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదా
మర్మ మెరిఁగి వేంకటేశుముహిమలనుచుఁ దెలిసినట్టి
నిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా