తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 47

రేకు: 0047-01 ముఖారిసం: 01-286 అథ్యాత్మ


పల్లవి:ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము
       తామసుండఁజుమ్మీ ముందరునున్న దైవమా

చ.1:పాతకపుఁజేతులనే పట్టి నిన్నుఁ బూజించు-
      ఘాఁతుకుఁడ నాకు నెక్కడి పుణ్యము
      చేతనముఁ బోదిసేయుచిత్తము నీదేకాన
      రాతిబొమ్మఁజుమ్మీ భారము నీది దైవమా

చ.2: వూనినయెంగిలినోర నొప్పగునిన్నుఁ బొగడు-
      హీనజంతువునకు నా కేఁటిపుణ్యము
      తేనెవూసీ నీ విట్లాఁ దిప్పఁగానే తిరిగేటి-
      మానిబొమ్మఁజుమ్మీ నామతిలోనిదైవమా

చ.3: జాలిఁబడి సంసారజలధిలో మునిఁగేటి
      కూళఁడ నాకేఁటితేఁకువపుణ్యము
      పాలువోసిపఫైంచిననాపాలి వేంకటేశనే
      తోలిబొమ్మఁజుమ్మీ కాతువుగాని దైవమా

రేకు: 0047-02 దేవగాంధారి సం; 01-287 అథ్యాత్మ


పల్లవి:భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను
       తీరని చేఁదేకాక తియ్యనుండీనా

చ.1:పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి
      చాయ కెంత గట్టిగాను చక్కనుండీనా
      కాయవు వికారమిది కలకాలముఁ జెప్పినా
      పోయిన పోకలేకాక బుద్ది వినీనా

చ.2:ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నా
      మించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా
      పంచమహాపాతకాల బారిఁబడ్డ చిత్తమిది
      దంచిదంచి చెప్పినాను తాఁకి వంగీనా

చ.3:కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
      సారెసారెఁ గుట్టుగాక చక్కనుండీనా
      వేరులేని మహిమల వేంకటవిభుని కృప
      ఘోరమైన ఆస మేలుకోర సోఁకీనా

రేకు: 0047-03 భూపాళం సం: 01-288 భక్తి



పల్లవి:ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా
       శ్రీకాంతు భజియించు సేవకులకు

చ.1:పాతాళమడ్డమా బలిమథను దాసులకు
      భూతలం బడ్డమా పుణ్యులకును
      సేతు కైలాసములు చిరభూములిన్నియును
      పై త్రోవలట పరమ భాగవతులకును

చ.2:అమరావతమడ్డమా హరి దాసులకు మహా
      తిమిరంబులడ్డమా దివ్యులకును
      కమలాసనుని లోకంబదియు నడ్డమా
      విమలాత్ములై వెలుఁగు విష్ణు దాసులకు

చ.3:పరమపద మడ్డమా బ్రహ్మాండధరుఁడైన
      థర వేంకటేశ్వరుని దాసులకును
      యిరవైన లోకముల నిన్నిటా భోగించి
      వరుసలను విహరించు వరవైష్టవులకు

రేకు: 0047-04 దేవగాంథారి సం; 01-269 నామ సంకీర్తన


పల్లవి:ఆదిదేవ పరమాతుమా
       వేద వేదాంతవేద్య నమో నమో

చ.1:పరాత్పరా భక్తభవభంజనా
      చరాచర లోకజనక నమోనమో

చ.2:గదాథరా వేంకటగిరి నిలయా
      సదానంద ప్రసన్న నమో నమో

రేకు: ౦౦47-05 ఖైరవి సం: 01-290 భక్తీ


పల్లవి:హరిఁ గొలిచియు మరీ నపరములా
       తిరముగ నతనినే తెలియుటగాకా

చ.1:పంకజనాభునిపాదములు దలఁచి
      యింకా మరి యొకయితరములా
      అంకెల నతనినే అతనిదాసులనే
      కొంకక నిజముగఁ గొలుచుటగాకే

చ.2:పన్నగశయనునిబంట్లకు బంటై
      కొన్నిటిపై మరి కోరికెలా
      యిన్ని కోరికలు యిదియే తనకని
      కొన్నది కోలై కోరుటగాకా

చ.3:వీనుల వేంకటవిభునామామృత -
      మూనిన మతి మరియును రుచులా
      తేనెలుగారెడితీపు లతనిమతి
      నానారుచులై ననుచుటగాకా

రేకు: ౦౦47-06 అలిత సం: 01-291 అధ్యాత్మ



పల్లవి:దైవమా పరదైవమా
       యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో

చ.1:పాపకర్మునిఁ దెచ్చి పరమియ్యఁదలఁచిన
      మేపులకే పోక మెయుకొనీనా
      తీపులు రూపులుఁ దివిరి నా వెనువెంట-
      నేపొద్దు నీ వేఁడఁ దెచ్చేవో

చ.2:అధమాధమునిఁ దెచ్చి యథికుని జేసేనంటే
      విధినిషేధములు వివరించునా
      నిధినిధానములు నిచ్చనిచ్చలుఁ బెక్కు-
      విధముల నెటువటె వెదచల్లెదవో

చ.3:అతికష్టుఁడగునాకు నలవిగానియీ-
      మత మొఁసగిన నేను మరిగేనా
      ప్రతిలేని వేంకటపతి నీదునామా-
      మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక

రేకు: 0౦47-07 భూపాళం సం: 01-292 భగవద్గీత కీర్తనలు



పల్లవి:ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి
       ఆకడ నాఁతడె హరి నెఱిగిన వాఁడు

చ.1:పరగినసత్యసంపన్నుఁడైనవాఁడే
      పరనిందసేయఁ దత్పరుఁడుగాని వాఁడు
      అరుదైన భూతదయానిధియగువాఁడే
      పరులుదానేయని భావించు వాఁడు

చ.2:నిర్మలుఁడై యాత్మనియతి గలుగువాఁడే
      థర్మతత్పరబుద్ధిఁ దగిలిన వాఁడు
      కర్మమార్గములు గడవనివాఁడే
      మర్మమై హరిభక్తి మఱవని వాఁడు

చ.3:జగతిపై హితముగాఁ జరియించు వాఁడే
      పగలేక మతిలోన బ్రతికిన వాఁడు
      తెగి సకలము నాత్మ దెలిసివాఁడే
      తగిలి వేంకటేశుదాసుఁడయిన వాఁడు