తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 49
రేకు: ౦౦49-01 కన్నడగౌళ సం: 01-298 అథ్యాత్మ
పల్లవి:కాలాంతకుఁడనువేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడును
కాలంబనియెడితీవ్రపుగాలివెర వెరిఁగి
చ.1:పరమపదంబు చేనికి పసిగొనునర మృగములకు నును
తరమిడి, సంసారపుటోఁదములనె యాఁగించి,
వురవడిఁ జేసినకర్మపుటరులు దరిద్రంబనువల
వొరపుగ మాయనుపోగులు వొకవెరవున వేసీ
చ.2:కదుముకవచ్చేటిబలురోగపుఁగుక్కల నుసికొలిపి,
వదలక ముదిసినముదిమే వాకట్టుగఁ గట్టి.
పాదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడఁగ.
పదిలముగా గింకరులనుచొప్పరులఁ బరవిడిచీ
చ.3:ఆవోఁదంబులఁ జిక్కక, ఆవురులనుఁ దెగనురికి,
ఆవేఁటకాండ్ల నదలించాచేనే చొచ్చి ,
పావనమతిఁ బొరెవొడిచి పరమానందముఁ బొందుచు
శ్రీ వేంకటపతి మనమునఁ జింతించీ నరమృగము
రేకు: 0౦49-02 భూపాళం సం: 01-299 వైరాగ్య చింత
పల్లవి:ఏలవచ్చీ యేలపోయీ నెందుండీఁ బ్రాణి
తోలుతి త్తిలోనఁ జొచ్చి దుంక దూరనా
చ.1:పుట్టులేక నరకాలపుంగుడై తా నుండక యీ-
పుట్టుగున కేల వచ్చీ పోయీఁ బ్రాణి
పుట్టుచునే కన్న వారిఁ బుట్టినవారి నాసలఁ
బెట్టిపట్టి దుఃఖములఁ బెడరేఁచనా
చ.2:భూతమై యడవిలోఁ బొక్కుచుఁ దా నుండక యీ-
బూతుజన్మమేల మోఁచెఁ బుచ్చిన ప్రాణి
రాతిరిఁబగలు ఘోరపుఁబాటు వడిపడి
పాతకాలు చేసి యమబాధఁబడనా
చ.3:కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ-
చేటువాటుకేల నోఁచె చెల్లఁబో ప్రాణి
గాటమైనసంపదల కడలేనిపుణ్యాల-
కోటికిఁ బడగెత్తక కొంచెపడనా
రేకు: 0049-03 నాట సం: 01-300 వైరాగ్య చింత
పల్లవి:
అయ్యా మానువఁగదవయ్య మనుజుఁడు తన-
కయ్యపుఁగంగఁ గానఁడు
చ. 1:
పాపపుణ్యలంపటుఁడైనా దష్ట-
రూపుడూ జన్మరోగి యటుగాన
పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి
యేపొద్దు వొడలెరఁగఁడు
చ. 2:
నరకభవనపరిణతుఁడైనా కర్మ
పురుషుఁడు హేయభోగి యటుగాన
దురితపుణ్యత్రిదోషజ్వరము పట్టి
అరవెరమాట లాడీని
చ. 3:
దేహమోహస్థిరుఁడైనా ని-
ర్వాహుఁడు తర్కవాది యటుగాన
శ్రీహరి వేంకటశ్రీకాంతునిఁ గని
వూహలఁ జేరనొల్లఁడు
రేకు: 0౦49-04 నాట సం; 01-301 అధ్యాత్మ
పల్లవి:
ఏదియునులేని దేఁటిజన్మము
వేదాంతవిద్యావివేకి గావలెను
చ.1:
పరమమూ ర్తిధ్యానపరుఁడు గావలె నొండె
పరమానందసంపద లొందవలెను
పరమార్థముగ నాత్మభావింపవలె నొండె
పరమే తానై పరగుండవలెను
చ.2:
వేదశాస్త్రార్థకోవిదుఁడు గావలె నొండె
వేదాంతవిదుల సేవించవలెను
కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె
మోదమున హరిభక్తి మొగి నుండవలెను
చ.3:
సతతభూత దయావిచారి గావలె నొండె
జితమైనయింద్రియస్థిరుఁడు గావలెను
అతిశయంబగు వేంకటాద్రీశుసేవకులె
గతియనుచు తనబుద్ధిఁ గలిగుండవలెను
రేకు: 0049-05 గుండక్రియ సం: 01-302 అధ్యాత్మ
పల్లవి:
కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికై
పడనిపాట్ల నెల్లఁబడి పొరలనేలా
చ.1:
పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయఁ
బరితాపకరమైనబ్రదుకేలా
సొ రిది నితరుల మేలుచూచి సైఁపఁగలేక
తిరుగుచుండేటి కష్ట దేహమిదియేలా
చ.2:
యెదిరి కెప్పుడుఁ జేయుహితమెల్లఁ దనదనుచు
చదివిచెప్పనియట్టి చదువేలా
పాదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబు
సదమదంబై పడయుచవులు దనకేలా
చ.3:
శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాక
జీవనభ్రాంతిఁ బడుసిరులేలా
దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు
త్రోవ లేఁగిన దేహి దొరతనంబేలా
రేకు: 0౦49-06 సామంతం సం; 01-303 అథ్యాత్మ
పల్లవి:
ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగాని
జనుల కెప్పుడు నాత్మసౌఖ్యంబు లేదు
చ.1:
ప్రతిలేనిధైర్యంబు పదిలపరచినఁ గాని
మతిలోనిపగవారిమద మణఁపరాదు
మితిలేనిశాంతమనుమేఁటికైదువఁ గాని
క్రితకంబువిషయముల గెలుపెరఁగరాదు
చ.2:
సొ రిది నిర్మోహమనుజోడు దొడిగినఁ గాని
వెరపుడిగి మమతవే వెళ్లఁబడరాదు
యిరవైన విజ్ఞానపింట నుండినఁ గాని
అరసి జగమెల్ల తానై యేలరాదు
చ.3:
యిన్నియునుఁ దిరువేంకటేశుఁ డిచ్చినఁ గాని
తన్నుఁదానెరిఁగి యాతనిఁగొలువరాదు
కన్నులను వెలి లోను గలయఁజూచిన గాని
సన్నంబుఘనమనెడిజాడ గనరాదు