తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 38

రేకు: 0038-02 సామంతం సం: 01-232 అధ్యాత్మ


పల్లవి: నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు
        నీవనుచుఁ గనుఁగొన్న నిజమెల్ల నీవే

చ. 1: తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల -
        ననయంబుఁ గనుఁగొన్నయతఁడే నీవు
        తనుఁగన్న తల్లిఁగా తగనితరకాంతలను
        ఆనఘఁడై మదిఁజూచునతఁడే నీవు

చ. 2: సతతసత్యవ్రతాచారసంపన్నుఁడై
        ఆతిశయంబుగ మెలఁగునతఁడే నీవు
        ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు-
        హతకాముకుఁడైనయతఁడే నీవు

చ. 3: మోదమున సుఖదుఃఖములు నొక్క రీతిగా
        నాదరింపుచునున్న యతఁడే నీవు
        వేదోక్తమతియైన వేంకటాచలనాథ
        ఆదియును నంత్యంబు నంతయును నీవే

రేకు: 0038-03 ముఖారి సం; 01-233 వైరాగ్య చింత


పల్లవి:ఎవ్వరికైనను యీవ్రాఁత నను
       నవ్వులు సేసెఁబో నావ్రాఁత

చ.1:తొలిజన్మంబున దోషకారియై
      నలుగడఁ దిప్పెను నావ్రాఁత
      యిల దుర్గణముల కీజన్మంబున-
      నలఁకువ నేనెఁబో నావ్రాఁత

చ.2:పురుషునిఁజే శల్పుని ననిపించుట
      నరజన్మమునకు నావ్రాఁత
      తరుచయ్యినపాతక మరుపెట్టుక
      నరకము చూపెంబో నావ్రాఁత

చ.3:పామఱితనమున బహువేదనలను
      నామన సెనసెఁబో నావ్రాఁత
      కామితఫలు వేంకటపతినిఁ గొలిచి
      నామతి దెలిపెఁబో నావ్రాఁత

రేకు: 0038-04 ఆహిరి సం: 01-234 వైరాగ్య చింత


పల్లవి:కూడులేక యాఁటికిఁ గూరఁ దిన్నట్లు
       ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య

చ.1:దుండగపుఁ బగవారు దోఁచఁగానే తమకాన
      కొండలెక్కినట్లు సిగ్గు గొల్లఁబొఁగాను
      దండువెళ్లేమదనునిదాడికి సతులచన్ను-
      గొండలెక్కి సారెసారె గోడనేరయ్య

చ.2:పొదిగొన్న యలపుతోఁ బొదలుతీగెలక్రింద
      తుదలేనిభయముతోఁ దూరినట్లు
      మృదువైనతరుణుల మెఱఁగుబాహులతల.-
      పాదలెల్లఁ దూరితూరి పుంగుడయ్యేరయ్య

చ.3:వలసగంపలమోపువలె లంపటము మోఁచి
      తలఁకుచుఁ బారలేక దాఁగినయట్లు
      యిల వేంకటేశ నిన్నెఱఁగ కింద్రియముల
      తలవరులిండ్లనే దాఁగేరయ్య

రేకు: 0038-05 శ్రీరాగం సం; 01-235 అధ్యాత్మ

పల్లవి: వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి-
       కుఱుచబుద్దుల నెట్టు గూడుదునయ్య

చ.1: దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడు
      ద్రొహిగాక నేఁడు దొరయట
      ఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నే
      సాహమున నెట్టు చాలుదునయ్య

చ.2: తోడఁబుట్టినవాని తొడరి చంపెడువాఁడు
      చూడ దుష్టుఁడుగాక సుకృతియట
      పాడైనయిటువంటిపాపబుద్దులుసేసి
      నీడ నిలువ నెట్టు నేరుతునయ్య

చ.3: కొడుకు నున్నతమతిఁ గోరి చంపెడువాఁడు
      కడుఁబాతకుఁడుగాక ఘనుఁడట
      కడలేనియటువంటికలుషవ్రిత్తికి నాత్మ
      వొడఁబరపఁగ నెట్లోపుదునయ్య

చ.4: తల్లిఁ జంపెడువాఁడు తలఁప డుష్టుఁడుగాక
      యెల్లవారల కెల్ల నెక్కుడట
      కల్లరియనుచు లోకము రోయుపని యిది
      చెల్లఁబోనే నేనేమి సేయుదునయ్య

చ.5: యింటివేలుపు వేంకటేశ్వరుఁ దనవెంట-
      వెంటఁదిప్పెడువాఁడు విభుఁడట
      దంటనై యాతనిదాసానుదాసినై
      వొంటినుండెద నేమి నొల్ లనోయయ్య

రేకు: 0038-06 దేవగాంధారి సం: 01-236 అధ్యాత్మ


పల్లవి: ఏమిఫలము దా నిన్నియునుఁ దెలిసినను
        సామునేసిన ఫలము జయశీలుఁడౌట గాక

చ. 1: తానుగలిగిన ఫలము దయ సేయఁగలుగుట
        మేనుగలిగిన ఫలము మేలెల్ల గనుట
        మానుషముగల ఫలము మంచివాఁడౌట తనుఁ
        దానె తెలిసినఫలము తత్వపరుఁడౌట గాక

చ. 2: పదిలమగు కులము గల ఫలము తాఁజదువుట
        చదివినఫలం బర్ధసారంబు గనుట
        పొదలి శాస్త్రర్థంబు పొడగన్న ఫలము మతి
        దలఁకకిటు వేంకటేశుదాఁడౌట గాక