తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 39
రేకు: 0039-01 శంకరాభరణం సం: 01-237 వేంకటేశ్వరౌషధము
పల్లవి:కొనరో కొనరో మీరు కూరిమిమందు
వునికిమనికి కెల్ల నొక్కటే మందు
చ.1:ధ్రువుండు గొనినమందు తొల్లియుఁ బ్రహ్లాదుఁడు
చవిగాఁ గొనినమందు చల్లనిమందు
భవరోగములు వీడిపారఁగఁ బెద్దలు మున్ను
జవకట్టికొనిన నిచ్చలమైనమందు
చ.2:నిలచి నారదుఁడు గొనినమందు జనకుఁడు
గెలుపుతోఁ గొని బ్రదికిన యామందు
మొలచి నాలుగుయుగములరాజులు ఘనులు
కలకాలముగొని కడగన్నమందు
చ.3:అజునకుఁ బరమాయువై యొసగినమందు
నిజమై లోకములెల్ల నిండినమందు
త్రిజగములు నెఱఁగ తిరువేంకటాద్రిపై
ద్వజమెత్తెఁ గోనేటిదరినున్నమందు
రేకు: 0039-02 సామంతం సం: 01-238 వైరాగ్య చింత
పల్లవి:పాయపుమదముల బంధమా మము
జీయని యిఁకఁ గృపసేయఁగదో
చ.1:ధనథాన్యములై తనులంపటమై
పనిగొంటివి నను బంధమా
దినదినంబు ననుతీదీపులం బెను-
గనివైతివి యిక గావఁగదో
చ.2:సతులై సుతులై చలమై కులమై
పతివైతివి వోబంధమా
రతిఁ బెరరేఁపుల రంతులయేఁపుల
గతిమాలితి విఁక గావఁగదో
చ.3:పంటై పాఁడై బలుసంపదలై
బంటుగ నేలితి బంధమా
కంటి మిదివో వేంకటగిరిపై మా-
వెంటరాక తెగి విడువఁగదో
రేకు: 0039-03 సామంతం సం; 01-239 వైరాగ్య చింత
పల్లవి:కటకటా యిటుచేసెఁ గర్మబాధ
యెటువంటివారికిని నెడయ దీబాధ
చ.1:దినదినముఁ బ్రాణులకు దీపనమువే బాధ
తనుపోషణములు కందర్పబాధ
మనసుశాంతికి సదా మమకారములబాధ
తనివోనికోర్కులకు దైవగతిబాధ
చ.2:వెడయాసచూపులకు వేడుకలవే బాధ
కడువేడ్కలకు వియోగములబాధ
తొడవైనయెఱుకలకు దురితబుద్దులబాధ
జడియుఁబరచింతలకు సంసారబాధ
చ.3:ఆరిది నిశ్చయమతికి ననుమానములబాధ
సరిలేని జీవులకు జన్మబాధ
తిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచు-
వెరవుచేతనె కాని వీడ దీబాధ
రేకు: 0039-04 శ్రీరాగం సం: 01-240 ఉపమానములు
పల్లవి:ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు
తెచ్చిన సంబళ మెల్లఁ దీరుఁబో లోలోనె
చ.1:దప్పముచెడినవాని తరుణి కాఁగిటఁ జేరి
అప్పటప్పటికి నుస్సు రనినయట్టు
వొప్పయిన హరిభక్తి వొల్లనివాని యింటి-
కుప్పలైన సంపదలు కుళ్లుఁబో లోలోనె
చ.2:ఆఁకలి చెడినవాని అన్నము కంచములోన
వోఁకిలింపుచు నేల నొలికినట్టు
తేఁకువైన హరిభక్తి తెరువుగానని వాని-
వేఁకపు సిరులు కొంపవెళ్లుఁబో లోలోనె
చ.3:వొడలుమాసినవాని వొనరుఁజుట్టములెల్ల
బడిబడినే వుండి పాసినయట్టు
యెడయక తిరువేంకటేశుఁ దలఁచనివాని-
ఆడరుబుద్ధులు పగలౌఁబో లోలోననె
రేకు: 0039-05 శ్రీరాగం సం: 01-241 అధ్యాత్మ
పల్లవి: అంగడి నెవ్వరు నంటకురో యీ -
దొంగలఁ గూడిన ద్రోహులను
చ.1: దోసము దోసము తొలరో శ్రీహరి -
దాసానదాసుల దగ్గరక
ఆసలనాసల హరినెఱఁగక చెడి
వీసర పోయిన వెఱ్ఱులను
చ.2: పాపము పాపము పాయరో కర్మపుఁ-
దాపపువారము దగ్గరక
చేపట్టి వేదపు శ్రీహరికథలు
యేపొద్దు వినని హీనులము
చ.3: పంకము పంకము పైకొనిరాకురో
కొంకుఁగొసరులకూళలము
వేంకటగిరిపై విభునిపుణ్యకథ
లంకెల వినని యన్యులము
రేకు: 0039-06 బౌళి-జంపెతాళం సం: 01-242 ఉపమానములు
పల్లవి:సాగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలు
పగవానివలెనె లోపల దాఁగుఁగాక
చ.1:దక్కునా పేదకును తరముగానిధనంబు
చిక్కి యెవ్వరికై నఁ జేరుఁగాక
వెక్కసంబైన గోవిందునిఁ దలఁపు బుద్ధి
తక్కిన పరులకెల్లఁ దలఁపేల కలుగు
చ.2:అరగునా దుర్భలున కరుదైన యన్నంబు
కరుచబుద్ధులను సరమిగొనుఁగాక
తొరలునా హరివినుతి దుష్టునకు నది నోరఁ
దొరలెనా యతనినే దూషించుఁగాక
చ.3:చెల్లునా యమృతంబు సేవించ నధమునకు
వొల్లనని నేలపై నొలుకుఁగాక
వెళ్లి గొనుమందునకు వేంకటేశుస్మరణ
చల్లనౌనా మనసు శఠియించుఁగాక