రేకు: 0022-01 నారణి సం: 01-131 అధ్యాత్మ
పల్లవి : |
పరగు బహుసజ్జన్మపరిపక్వ హృదయుఁడై
మరికదా వేదాంతమార్గంబు గనుట
|
|
చ. 1: |
కలుషహరమగువివేకమ్ము గలిగినయట్టి-
ఫలముగాదా కృపాపారీణుఁడౌట
తలపోసి సకలభూతదయా విశేషంబు
కలిగికాది గుణవికారంబు గనుట
|
|
చ. 2: |
యెదిరిఁ దనవలెనె తా నెఱఁగనేర్చినఫలము
అదిగదా ద్రవ్యమోహంబు గడచనుట
పదిలమగు నాశానుభవము పాపినయట్టి-
తుదగదా తాను సంతోషంబు గనుట
|
|
చ. 3: |
రతిపరాఙ్ముఖమహరాజ్యమబ్బినఫలము -
మతిగదా తాను కర్మత్యాగియౌట
తతితోడ ఫలపరిత్యాగి చిత్తవ్యాపి-
ధృతిగదా వేంకటాధిపు దాసుఁడౌట
|
|
రేకు: 0022-02 ముఖారి సం: 01-132 వేంకటేశ్వరౌషధము
పల్లవి : |
చలపాదిరోగ మీసంసారము నేఁడు
బలువైనమందు విష్ణుభక్తి జీవులకు
|
|
చ. 1: |
కీడౌట మది నెఱింగియు మోహ మెడల దిది
పాడైన విధికృతము బలవంతము
యీడనే ఇది మాన్ప హితవైన వజ్రాంగి
జోడువో హరిఁ దలంచుట జీవులకును
|
|
చ. 2: |
హేయమని తెలిసి తా నిచ్చగించీ యాత్మ
పాయ దీరతిసుఖము బలవంతము
మాయ నుగ్గులుసేయ మాధవునిదంచనపు-
రాయివో వైరాగ్యరచన జీవులకు
|
|
చ. 3: |
పొలయుదురితంపు రొంపులు దన్ను వడి ముంచ
పలుమారుజన్మ మీబలవంతము
నెలవుకొని సకలంబు నిర్మలముగాఁ గడుగు-
జలధివో వేంకటేశ్వరుఁడు జీవులకు
|
|
రేకు: 0022-03 వరాళి సం: 01-133 వేంకటగానం
పల్లవి : |
చూడఁజూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
యీడులేని కన్నులవె యిన చంద్రులు
|
|
చ. 1: |
కంటిఁగంటి వాఁడెవాఁడె ఘనమైన ముత్యాల
కంటమాలలవే పదకములు నవె
మింటి పొడవైనట్టి మించుఁ గిరీటంబదె
జంటల వెలుఁగు శంఖచక్రా లవె
|
|
చ. 2: |
మొక్కుమొక్కు వాఁడెవాఁడె ముందరనే వున్నాఁడు
చెక్కులవే నగవుతో జిగిమో మదె
పుక్కిట లోకములవె భుజకీర్తులును నవె
చక్కనమ్మ అలమేలు జవరాలదె
|
|
చ. 3: |
ముంగైమురాలును నవె మొలకఠారును నదె
బంగారు నిగ్గులవన్నె పచ్చబట్టదె
యింగితమెరిఁగి వేంకటేశుఁడిదె కన్నులకు
ముంగిటి నిధానమైన మూలభూతమదె
|
|
రేకు: 0022-04 ముఖారి సం: 01-134 అంత్యప్రాస
పల్లవి : |
ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు-
నంతవానిని భిక్షమడుగు కొనఁ జేసె
|
|
చ. 1: |
కోరి చంద్రునిఁ బట్టి గురుతల్ప గునిఁ జేసె
కూరిమలరఁగ నింద్రుఁ గోడిఁ జేసె
ఘోరకుడువఁగఁ ద్రిశంకుని నంత్యజునిఁ జేసె
వీరుఁడగునలుఁ బట్టి విద్రూపుఁ జేసె
|
|
చ. 2: |
అతివ నొడ్డుగఁ జూదమాడ ధర్మజుఁ జేసె
సతి నమ్ముకొన హరిశ్చంద్రుఁ జేసె
కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగఁ జేసె
మతిమాలి కురురాజు మడుఁగుచొరఁ జేసె
|
|
చ. 3: |
పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోఁజేసె
తొడరి కాలునికాలు దునియఁ జేసె
ఆడర నీవిధికి విధియగు వేంకటేశుకృప
పడయకుండఁగ భంగపడకపోరాదు
|
|
రేకు: 0022-05 కాంబోది సం: 01-135 అంత్యప్రాస
పల్లవి : |
ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము నొక-
మాటమాత్రమున నటమటమైన సుఖము
|
|
చ. 1: |
కొనసాగుదురితములె కూడైన సుఖము
తనువిచారములలో దాకొన్న సుఖము
పనిలేనియాసలకుఁ బట్టయిన సుఖము
వెనుకముందరఁ జూడ వెరగైన సుఖము
|
|
చ. 2: |
నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబుపుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచుసుఖము
పందివలె తనుఁదానె బ్రదికేటి సుఖము
|
|
చ. 3: |
ధృతిమాలి యిందరికి దీనుఁగడు సుఖము
మతిమాలి భంగములు మఱపించు సుఖము
పతివేంకటేశుకృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీపాటి సుఖము
|
|
రేకు: 0022-06 శ్రీరాగం సం: 01-136 వైరాగ్య చింత
పల్లవి : |
దేహము దా నస్థిరమట దేహి చిరంతనుఁడౌనట
దేహపు మోహపు నేఁతలు తీరుట లెన్నఁడొకో
|
|
చ. 1: |
కన్నులఁబుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధల
కన్నులు మనసునుఁ దనియక గాసిఁబడిరి జనులు
తన్నిఁక నెరుఁగుట లెన్నఁడు తలఁపులు దొలఁగుట లెన్నఁడు
తిన్నని పరవశములచేఁ దిరుగుట లెన్నఁడొకో
|
|
చ. 2: |
సిగ్గులు దొలఁగనియాశలఁ జిక్కికదా దుర్మానపు-
సిగ్గుల యెగ్గులచేతను చిక్కువడిరి జనులు
సిగ్గులు దొలఁగుట యెన్నఁడు చిత్తము లోనౌటెన్నఁడు
తగ్గుల మొగ్గుల నేఁతలు తలఁగుట లెన్నఁడొకో
|
|
చ. 3: |
మనసు బుట్టిన యాతఁడు మనసునఁ బెనగొని తిరుగఁగ
మనసే తానగు దైవము మరచిరి యుందరును
అనయము తిరువేంకటపతి యాత్మఁదలఁచి సుఖింపుచు
ఘనమగు పరమానందము కలుగుట లెన్నఁడొకో
|
|