తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 23

రేకు: 0023-01 ధన్నాశి సం: 01-137 సంస్కృత కీర్తనలు


పల్లవి :

భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేయం సదా


చ. 1:

కటిఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా-
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పదఘటిత సంకుల శింజితే నతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం


చ. 2:

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది-
సుర నికర భావనా శోభితపదం
తిరు వేంకటాచల స్థిత మనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం

రేకు: 0023-02 ధన్నాశి సం: 01-138 ఆరగింపు


పల్లవి :

పంకజాక్షులు సొలసిపలికి నగఁగా
నింకా నారగించు మిట్టనే ఆయ్యా


చ. 1:

కలవంటకములు పులుఁగములు దుగ్ధాన్నములు
పలుదెరఁగులై న అప్పములగములు
నెలకొన్న నేతులును నిరతంపు చక్కెరలు
గిలుకొట్టుచును నారగించవయ్యా


చ. 2:

పెక్కువగుసైఁ దంపుపిండి వంటల మీఁద
పిక్కటిలు మెఱుఁగు బొడి బెల్లములును
వొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడ
కిక్కిరియ నిటు లారగించవయ్యా


చ. 3:

కడుమధురమైన మీఁగడ పెరుగులను మంచి-
అడియాల వూరుఁగాయల రుచులతో
బడిబడిగ నవకంపుఁ బళ్లెరంబులతోడ
కడునారగించు వేంకటగిరీంద్రా

రేకు: 0023-03 భూపాళం సం: 01-139 మేలుకొలుపులు


పల్లవి :

భోగి శయనమును బుసకొట్టెడిని
యోగనిద్ర పాయును మేల్కొనవే


చ. 1:

కన్నులు దెరవక కమలబాంధవుఁడు
వెన్నెల రేణువు వెలయ దిదే
అన్నున మలసీ నరుణోదయ మిదే
మిన్నక నీవిటు మేలుకొనవే


చ. 2:

తెల్లనికన్నులు దెరవక విరియఁగ
నొల్లక జలజము లున్నవివే
కల్లనిదుర నినుఁ గవియఁగ నియ్యక
మెల్లనాయ నిటు మేలుకొనవే


చ. 3:

తెరవగు రెప్పలఁ దెల్లవారవలె
తెరవక చీఁకటి దీరదిదే
తెరఁగు వేంకటాధిప నీవెఱుఁగుదు
మెఱుఁగులు చల్లుచు మేలుకొనవే

రేకు: 0023-04 శ్రీరాగం సం: 01-140 దశావతారములు


పల్లవి :

ఏది చూచిననుఁ గడు నిటువంటి సోద్యములే
మేదినికిఁ గిందుపడి మిన్నందనేలా


చ. 1:

కరిరాజుగాంచినకరుణానిధివి నీవు
అరిది నరసింహరూపైతివేలా
వురగేంద్రశయనమున నుండి నీవును సదా
గరుడవాహనుఁడవై గమనించనేలా


చ. 2:

పురుషోత్తమఖ్యాతిఁ బొదలి యమృతము వంప
తరుణివై వుండ నిటు దైన్యమేలా
శరణాగతులకు రక్షకుఁడవై పాము నీ౼
చరణములకిందైన చలముకొననేలా


చ. 3:

దేవతాధివుఁడవై దీపించి యింద్రునకు
భావింప తమ్ముఁడనఁ బరిగితేలా
శ్రీవేంకటాచలస్థిరుఁడవై లోకముల౼
జీవకోట్ల లోనఁ జిక్కువడనేలా

రేకు: 0023-05 మలహరిసం : 01-141 దశావతారములు


పల్లవి :

కోరుదు నామది ననిశముగుణాధరు నిర్గుణుఁ గృష్ణుని
నారాయణు విశ్వంభరు నవనీతాహారు


చ. 1:

కుండలిమణిమయభూషణు కువలయదళవర్ణాంగుని
నండజపతివాహనుని నగణితభవహరుని
మండనచోరకదమనుని మాలాలంకృతపక్షుని
నిండుకృపాంబుధిచంద్రుని నిత్యానందునిని


చ. 2:

అగమపుంజపదార్థుని ఆపత్సఖసంభూతుని
నాగేంద్రాయతతల్పుని నానాకల్పునిని
సాగబ్రహ్మమయాఖ్యుని సంతతగానవిలోలుని
వాగీశ్వరసంస్తోత్రుని వైకుంఠోత్తముని


చ. 3:

కుంకుమవసంతకాముని గోపాంగనకుచలిప్తుని
శంకరసతిమణినుతుని సర్వాత్ముని సముని
శంకనినాదమృదంగుని చక్రాయుధవేదీప్తుని
వేంకటగిరినిజవాసుని విభవసదాయినిని

రేకు: 0023-06 సామంతం సం: 01-142 అధ్యాత్మ


పల్లవి :

అటు గుడువు మనస నీ వన్నిలాగులఁ బొరలి
ఇటు గలిగె నీకు నైహితవిచారములు


చ. 1:

కోరికలకునుఁ గలిగె ఘెరపరితాపంబు
కూరిమికిఁ గలిగె ననుకూలదుఃఖములు
తారతమ్యమములేనితలపోఁతలకుఁ గలిగె
భారమైనట్టి లంపటమనెడి మోపు


చ. 2:

తనువునకుఁ గలిగె సంతతమైన తిమ్మటలు
మనువునకుఁ గలిగె నామని వికారములు
పనిలేని సంసారబంధంబునకుఁ గలిగె
ఘనమైన దురిత సంగతి తోడిచెలిమి


చ. 3:

దేహికినిఁ గలిగె నింద్రియములను బోధింప
దేహంబునకుఁ గలిగె తెగనిసంశయము
దేహత్మకుండయిన తిరువేంకటేశునకు
దేహిదేహాంతరస్థితిఁ జూడఁగలిగె