తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 21

రేకు: 0021-01 ఆహిరి సం: 01-125 దశావతారములు


పల్లవి :

పెక్కులంపటాల మనసు పేదవైతివి నీకు
నెక్కడా నెవ్వరులేరు యేమిసేతువయ్యా


చ. 1:

కన్నుమూయఁ బొద్దులేదు, కాలు చాఁచ నిమ్ములేదు
మన్నుదవ్వి కిందనైన మనికి లేదు
మున్నిటివలెనే గోరుమోపనైనఁ జోటు లేదు
యిన్నిటా నిట్లానైతి వేమి సేతువయ్యా


చ. 2:

అడుగిడఁగ నవ్వల లేదు, అండనైన నుండలేదు
పుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదు
వెడఁగుఁదనము విడువలేదు, వేదమైనఁ జదువలేదు
యెడపఁదడప నిట్ల నీకు నేమిసేతువయ్యా


చ. 3:

వుప్పరములు మానియైన నుండలేదు లోకమందు
నిప్పుడైన నీవిహర మిట్ల నాయను
చెప్పనరుదు నీగుణాలు శ్రీవేంకటేశ యిట్ల-
నెప్పుడును ఘనుఁడ వరయ నేమిసేతువయ్యా

రేకు: 0021-02 శ్రీరాగం సం: 01-126 కృష్ణ


పల్లవి :

ఇతఁడు చేసిననేఁత లెన్నిలేవిలమీఁద
యితఁడు జగదేకగర్వితుఁడౌనో కాఁడో


చ. 1:

కుడువఁడా ప్రాణములుగొనుచుఁ బూతకిచన్ను
తుడువఁడా కపటదైత్యులనొసలి వ్రాలు
అడువఁడా నేలతో నలమి శకటాసురుని
వడువఁడా నెత్తురులు వసుధ కంసునివి


చ. 2:

పెట్టఁడా దనుజారిబిరుదు లోకమునందు
కట్టఁడా బలిదైత్యు కర్మబంధముల
మెట్టఁడా కాళింగు మేటిశిరములు, నలియఁ-
గొట్టఁడా దానవులఁ గోటానఁగోట్ల


చ. 3:

మరపఁడా పుట్టువులు మరణములుఁ బ్రాణులకు
పరపఁడా గంగఁ దనపాదకమలమున
చెరుపఁడా దురితములు శ్రీ వెంకటేశుఁడిదె
నెరపఁడా లోకములనిండఁ దనకీర్తి

రేకు: 0021-03 సామంతం సం: 01-127 వేంకటగానం


పల్లవి :

ఆదిదేవుఁడై అందరిపాలిటి
కీ దేవుఁడై వచ్చె నితఁడు


చ. 1:

కోరిన పరమ యోగుల చిత్తములలోన
యేరీతి నుండెనో యీతఁడు
చేరవచ్చిన యాశ్రితులనెల్లఁ బ్రోవ
యీరీతి నున్న వాఁడీతడు


చ. 2:

కుటిల దానవుల కోటానఁగోట్ల
యెటువలెఁ ద్రుంచెనో యీతఁడు
ఘటియించి యిటువంటి కారుణ్యరూపుఁడై
యిటువలె నున్న వాఁడీతడు


చ. 3:

తక్కక్క బ్రహ్మాండ తతులెల్ల మోచితా-
నెక్కడ నుండెనో యీతఁడు
దిక్కుల వెలసిన తిరువేంకటేశుఁడై
యిక్కడ నున్న వాఁడీతఁడు

రేకు: 0021-04 గుండక్రియ సం: 01-128 దశావతారములు


పల్లవి :

తానే తెలియవలె తలఁచి దేహి తన్ను
మానుపువారలు మరి వేరీ


చ. 1:

కడలేని భవసాగరము చొచ్చినతన్ను
వెడలించువారలు వేరీ
కడుబందములచేతఁ గట్టుపడిన తన్ను
విడిపించువారలు వేరీ


చ. 2:

కాఁగినినుము వంటికర్మపు తలమోపు -
వేఁగు దించేటివారు వేరీ
మూఁగిన మోహపుమూఁకలు తొడిఁబడ
వీఁగఁ దోలేటివారలు వేరీ


చ. 3:

తిరువేంకటాచలాధిపునిఁ గొలుపుమని
వెరపు చెప్పెడువారు వేరీ
పరివోని దురితకూపములఁ బడకుమని
వెరపు చెప్పెడివారు వేరీ

రేకు: 0021-05 శ్రీరాగం సం: 01-129 అంత్యప్రాస


పల్లవి :

బయలు వందిలి వెట్టి పరగఁ జిత్తముగలిగె
దయమాలి తిరుగ నాత్మజుఁ డొకఁడు గలిగె


చ. 1:

కనుచూపువలన నుడుగనికోరికలు గలిగె
తనుకాంక్షవలనఁ బరితాపంబు గలిగె
అనుభవనవలన మోహంధకారము గలిగె
తనివి దీమివలన తలపోఁత గలిగె


చ. 2:

అడియాసవలన పాయనిచలంబునుఁ గలిగె
కడుమమతవలన చీఁకటి దవ్వఁగలిగె
కడలేని తమకమునఁ గాఁతాళమునుఁ గలిగె
నడుమ నంతటికి మాననిప్రేమ గలిగె


చ. 3:

తరితీపు వలన చిత్తభ్రాంతి తగఁ గలిగె
విరహంబువలన పురవేదనలుఁ గలిగె
తిరువేంకటాచలాధిపుని కరుణామృతము
పరిపూర్ణమైన యాపద నీఁదఁ గలిగె

రేకు: 0021-06 కేదారగౌళ సం: 01-130 అధ్యాత్మ


పల్లవి :

పరమాత్ముని నోరఁబాడుచును యిరు -
దరులు గూడఁగఁ దోసి దంచీ మాయ


చ. 1:

కొలఁది బ్రహ్మాండపు కుందెనలోన
కులికి జీవులను కొలుచు నించి
కలికి దుర్మోహపు రోఁకలివేసి
తలంచి తనువులను దంచీ మాయ


చ. 2:

తొంగలి రెప్పలు రాత్రులుఁ బగలును
సంగడి కనుఁగవ సరిఁ దిప్పుచు
చెంగలించి వెసఁ జేతులు విసరుచు
దంగుడు బియ్యముగా దంచీ మాయ


చ. 3:

అనయముఁ దిరు వేంకటాధీశ్వరుని
పనుపడి తనలోఁ బాడుచును
వొనరి విన్నాణి జీవులనెడి బియ్యము
తనర నాతనికియ్య దంచీ మాయ