తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 277

రేకు: 0277-01 రామక్రియ సం: 03-442 అధ్యాత్మ


పల్లవి :

రాతిరిఁ బగలనేటి రెంటి నడుమనుఁ జిక్కి
వూఁత గాన వెళ్లనీరో వో యాసలాల


చ. 1:

దైవ మెప్పుడు గలఁడు తలఁచఁగలేము గాని
కైవసమై జీవుఁడుండు కానరాదు గాని
పూవు పిందెవంటి పాపపుణ్యములఁ జిక్కినాఁడ
తోవచూపరో మాకు తొలుజన్మములాల


చ. 2:

లోకము మాయామయమై లోనుఁ గాకుండుఁ గాని
జోక పరమాత్మలోనే సోదించము గాని
కైకొని మూసితెరచే కనురెప్పలనుఁ జిక్కి
వాకిలిఁ గనేఁ జూపరో వద్దనున్న కాలమా (?)


చ. 3:

రూపము విజ్ఞానమే రూఢి కెక్కనైతిఁ గాని
కాపు శ్రీవేంకటేశుఁడే గతి గంటిఁ గాని
యీవారి నేనై తే నిహపరాలకుఁ జిక్కి
పైపూఁత లేమి గానఁ బాలించవో గురుఁడా

రేకు: 0277-02 సామంతం సం: 03-443. శరణాగతి


పల్లవి :

ఇంతటఁ గావఁగదే ఇందిరానాయక నన్ను
పంతానఁ గాకాసురునిఁ బాలించినట్లు


చ. 1:

దించని పంచభూతాల దేహము మోచితిఁ గాన
నించిన యజ్ఞానమున నిన్ను నెరఁగ
పంచేంద్రియములచేఁ బట్టువడ్డవాఁడఁ గాన
యెంచరాని పాపములే ఇన్నియు జేసితిని


చ. 2:

మిన్నువంటి జఠరాగ్ని మింగివున్నవాఁడఁ గాన
కన్నవెల్లా వేఁడి వేఁడి కష్టపడితి
పన్నిన సంసారపు భ్రమ బడ్డవాఁడఁ గాన
అన్నిటా దేవతలకు సరిగాఁపనైఁతి


చ. 3:

ఆతుమలో నీ వుండే భాగ్యము గలవాఁడఁ గాన
చైతన్యమున నీకు శరణంటిని
నీతితో శ్రీవేంకటేశ నీ పాలివాఁడఁ గాన
బాతితో సర్వము నీ కొప్పనము సేసితిని

రేకు: 0277-03 లలిత సం: 03-444 శరణాగతి


పల్లవి :

తనిసితి మిన్నిటి తగులేలో
మినుకుల దినముల మెచ్చేమయ్యా


చ. 1:

మనసూ రోసితి మరులూఁ బాసితి
తనువేలో పైతరవాయ
వెనకాఁ దెలిసితి మునుపూఁ జూచితి
నను నేనే యిఁక నవ్వేమయ్యా


చ. 2:

మాయల వెడలితి మమతల బడలితి
పాయంబేలో పదరీని
దాయల గెలిచితి ధర్మముఁ బిలిచితి
పోయిన జన్మముఁ బొగడేమయ్యా


చ. 3:

శరణఁ జొచ్చితి జయముల హెచ్చితి
దురితములెందో తొలఁగీని
గరిమల శ్రీవేంకటపతిఁ గొలిచితి
తరతర మిందే దక్కితిమయ్యా

రేకు: 0277-04 శ్రీరాగం సం: 03-445 శరణాగతి


పల్లవి :

నీవు నట్ల నేరుపు నేరమి నేఁడు నా యెడకుఁ జూడకుమీ
సేవలయెడ తృణము మేరువుగఁ జేసుకోఁగలవు నీమహిమలను


చ. 1:

తప్పు లెరంగము వొప్పు లెరంగము దైవమనేనిను నుతియించేదా
నెప్పున వేదము సకలశబ్దము నీవేయని చాటఁగ వినుచు
ఇప్పుడు ద్రిష్టాంత మొకటి చెప్పెద నిందుకు సముద్రుఁ డిటు తనలో
చిప్పలు గుల్లలు బహురత్నంబులు చేకొని గర్భీకరించుఁ గదా


చ.2:

కర్మ మెరంగ నకర్మ మెరంగను కరుణానిధి నినుఁ బూజించేదా
నిర్మల వేదము చైతన్యంబిది నీవేయని చాటఁగ వినుచు
అర్మిలి ద్రిష్టాంత మిందుకు నొకటె అన్నియు గర్భీకరించుకొని
ధర్మాధర్మపు మనుజులనెల్లాఁ దగ నీ భూకాంత మోచుఁ గదా


చ. 3:

జ్ఞాన మెరఁగ నజ్ఞాన మెరఁగను సారెకు నిను నేఁ దలఁచేదా
ఆనిన వేదము శ్రీవేంకటేశ్వర అంతరాత్మ నినుఁ జాటఁగను
పూని ద్రిష్టాంతము మీ కిటు సరిగాఁ బోలుపరా దిఁకనైనాను
తానే సూర్యుఁడు రాత్రి గల బయట తన గుణము వేగి నెరపుఁ గదా

రేకు: 0277-05 లలిత సం: 03-446 శరణాగతి


పల్లవి :

కలదందే పో సర్వముఁ గలదు కామితార్ధమునుఁ గలదు
కలదు గలదు శరణాగతులకు హరికైంకర్యంబున మోక్షము గలదు


చ. 1:

ఆకాశంబున మోక్షము వెదకిన నందులోపలా లేదు
పైకొని తానెంత వెదకి చూచినా పాతాళంబున లేదు
యీకడ ధరలో మూలమూలలను యెందు వెదకినా లేదు
శ్రీకాంతుని మతిఁ జింతించి యాసలఁ జక్కక తొలఁగిన నందే కలదు


చ. 2:

కోటిజన్మములు యెత్తిన ముక్తికి కొనమొదలేమియుఁ గనరాదు
వాటపు సంసారములోఁ గర్మపువార్ధి యీఁదినాఁ గనరాదు
కూటువతో స్వర్గాది లోకములఁ గోరి వెదకినాఁ గనరాదు
గాఁటపు కేశవభక్తి గలిగితే కైవల్యము మతిఁ గానఁగవచ్చు


చ. 3:

సకలశాస్త్రములు చదివినాఁ బరము చక్కటి మార్గము దొరకదు
వికటపు పలువేల్పుల నెందరిఁ గడువెదకి కొలిచినా దొరకదు
అకలంకుఁడు శ్రీవేంకటగిరిపతి అంతరంగమున నున్నాఁడనుచును
ప్రకటముగా గురుఁ డానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకు