రేకు: 0276-01 రామక్రియ సం: 03-436 వైరాగ్య చింత
పల్లవి : |
ఎంత గాలమైనాను హెచ్చీ నాసలు శ్రీ-
కాంతుఁడ వింతటనై నాఁ గరుణించరాదా
|
|
చ. 1: |
పచ్చితనానఁ దిరిగి పండవద్దా చిత్తము
గచ్చులఁ దాఁ గనుఁగాయే కలకాలము
చచ్చి చచ్చి పుట్టి పుట్టి జారవద్దా కర్మము
కొచ్చి కొచ్చి సేసి సేసి గోరపడీఁ గాక
|
|
చ. 2: |
రోఁత గడుపున నించి రోయవద్దా దేహము
కూఁతలతో రుచులెల్లాఁ గోరీఁగాక
చేఁతలు యీగుణమైన సిగ్గుపడవలదా
బాఁతిపడి విషయాలఁ బరచయ్యీఁ గాక
|
|
చ. 3: |
నానాఁడే విరతిఁబొంది నవ్వు నవ్వవలదా
మానక యీ జీవుఁ డనుమానించీఁ గాక
మోనాన శ్రీవేంకటేశ మొక్కి నీదాసుడఁ గాఁగా
అనిన విన్నియుఁ బరిహరమయ్యీఁ గాక
|
|
రేకు: 0276-02 లలిత సం: 03-437 ఉపమానములు
పల్లవి : |
సొమ్ము గలవాఁడు తన సొమ్ము చెడనిచ్చునా
కమ్మి నీ సొమ్మను నేను కాపాడవే హరి
|
|
చ. 1: |
పసుర మడవిఁ బడ్డ పసురము గలవాఁడు.
దెసలు వెద కింటికిఁ దెచ్చు కొన్నట్టు
వసగా నాసల లోన వడిఁబడ్డ నా మనసు
యెసగ మళ్లించవే నన్నేలిన గోవిందుఁడా
|
|
చ. 2: |
గొందిఁ బంట సేయువాఁడు కొలుచులు పరకళ్లఁ
జిందకుండా గాదెఁ బోసి చేరి కాచీని
కందువ మమ్ముఁ బుట్టించి కన్నవారి వాకిళ్లఁ
జెంది కావనియ్యకువే జీవునిలో దేవుఁడా
|
|
చ. 3: |
కడుపులోని శిశువు కన్నతల్లి(?) దన్నితేను
బెడగు లెంక కని పెంచీనటా
యెడమీక శ్రీవేంకటేశ నీకుక్షిలో నేను
తడవి తప్పుసేసినా దయఁ గావవే
|
|
రేకు: 0276-03 ధన్నాసి సం:03-438 నామ సంకీర్తన
పల్లవి : |
మెచ్చుల దంపతులార మీరే గతి
మెచ్చితి నిన్నిట మిమ్ము మెరసె మీచేఁతలు
|
|
చ. 1: |
తమ్మిలోని మగువా వో ధరణీధరుఁడా
మిమ్ము నే నమ్మితి నాకు మీరే గతి
నెమ్మది నో యిందిరా నీరజలోచనుఁడా
కమ్మి యే పొద్దును మీరే కలరు నాపాలను
|
|
చ. 2: |
పాలజలధి కూఁతుర భక్త వత్సలుఁడ హరి
మేలిచ్చి రక్షించ నాకు మీరే గతి
కేలి నో శ్రీమహాలక్ష్మి కేశవదయానిధి
తాలిమి మీరే నాకు దాపు దండ యెపుడు
|
|
చ. 3: |
చెన్నగు రమాకాంత చెందిన వో మాధవ
మిన్నక యేపొద్దు నాకు మీరే గతి
చిన్ని యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడా
యెన్నికె కెక్కించి నన్ను నేలుకొంటి రిదిగో
|
|
రేకు: 0276-04 శంకరాభరణం సం: 03-439 అధ్యాత్మ
పల్లవి : |
దైవంబవు కర్తవు నీవే హరి
యీవల నావల నెవ్వఁడనయ్యా
|
|
చ. 1: |
తలఁచిన తలఁపులు దైవయోగములు
కలిగిన చేఁతలు కర్మములు
వెలసిన దేహము విషయాధీనము
యిలనౌఁ గాదన నెవ్వఁడనయ్యా
|
|
చ. 2: |
జిగి నింద్రియములు చిత్తపు మూలము
తగులమి (ము?) మాయకుఁ దనుగుణము
జగతిఁ బ్రాణములు సంసారబంధము
యెగదిగ నాడఁగ నెవ్వఁడనయ్యా
|
|
చ. 3: |
శ్రీతరుణీశ్వర శ్రీవేంకటపతి
ఆతుమ యిది నీయధీనము
యీతల నీవిఁక నెట్టైనఁ జేయుము
యే తలపోఁతకు నెవ్వఁడనయ్యా
|
|
రేకు: 0276-05 దేసాక్షి సం: 03-440 మనసా
పల్లవి : |
ఎన్నఁ డిఁక యేది గొలఁదిపాటు
వున్నతపు మాయలకే వొడిగట్టవలసి
|
|
చ. 1: |
చీ చీ మనసాచీ మనసా
కాచేటి పూచేటి వో ఘనజన్మమా
నీచు యెండమావులెల్లా నీళ్లంటా నమ్మినట్టు
చూచి చూచి యింద్రియాలే సుఖమనవలసె
|
|
చ. 2: |
కట్టా జీవుఁడా కటకటా జీవుఁడా
తొట్టిన పంచభూతాలతోడి దేహమా
వెట్టిఁ జెఱకుపోలికి వెదురు నమలినట్టు
కట్టిన యీ కనకమే బ్రహ్మమనవలెసె
|
|
చ. 3: |
బాపు బాపు దైవమా భావపు శ్రీవేంకటేశ
చూపుల నాయాతుమలో సుజ్ఞానమా
దోపుచుఁ బూవులవల్ల తుంగ దల కెక్కినట్టు
దాపగు నాలికె నిన్నుఁ దలఁచఁగవలసె
|
|
రేకు: 0276-06 దేవగాంధారి సం: 03-441 శరణాగతి
పల్లవి : |
పొందినవెల్లా భోగ్యములే
అందరిలో నిఁక ననుమానమేలా
|
|
చ. 1: |
హరి నీ సంకల్ప మన్నిట నుండఁగ
గరిమల మా సంకల్పము లేఁటికి
దురితము లణఁచీ దొర నీ నామము
సొరిది విధికిఁగా సుడివడనేలా
|
|
చ. 2: |
జిగి నీ ధ్యానము చింతలు మాన్పఁగ
వెగటున మా కిఁక వెడ చింతేఁటికి
తగు నీ తత్త్వము తపఃఫల మొసఁగ
అగడుఁ గోరికల ఆసలిఁ కేలా
|
|
చ. 3: |
కమ్మి నీ శరణుగతి యిటు చూపఁగ
కమ్మర నుద్యోగము మాకేఁటికి
యిమ్ముల శ్రీవేంకటేశ్వర మా పాల
నెమ్మదిగలవిఁక నే నాడనేలా
|
|