తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 256

రేకు: 0256-01 బౌళి సం: 03-320 భక్తి


పల్లవి :

నిండుమనసే నీ పూజ
అండఁ గోరకుండుటదియు నీపూజ


చ. 1:

యిందు హరి గలఁడందు లేఁడనేటి-
నిందకుఁ బాయుటే నీపూజ
కొందరు చుట్టాలు కొందరు పగనే-
అందదుకు మానుటదియే నీపూజ


చ. 2:

తిట్టులు గొన్నని దీవెనె గొంతని
నెట్టుకోనిదే నీపూజ
పెట్టిన బంగారుపెంకును నినుమును
అట్టే సరి యనుటదియు నీపూజ


చ. 3:

సర్వము నీవని స్వతంత్రముడిగి
నిర్వహించుటే నీపూజ
పర్వి శ్రీవేంకటపతి నీదాసుల-
పూర్వమనియెడి బుద్ది నీ పూజ

రేకు: 0256-02 రామక్రియ సం: 03-321 విష్ణు కీర్తనం


పల్లవి :

పలుదెరువులు నీకుఁ బాటించఁజెల్లును
వొలిసి మీదాసులవుటొక్కటే మాతెరువు


చ. 1:

హరి నీకు జీవరాసులందరును సరియే
సురల కెక్కుడు నీవు చూడ మాకైతే
యిరవులు గలవు నీ కెక్కడ చూచినను
అరిది నీ శ్రీపాదాలందె మాయిరవు


చ. 2:

నందగోపాదులకెల్ల నందనుఁడవు నీవు
యిందరికిఁ దండ్రివి మా కిటు నీవైతే
అందిన శబరివిందు అఖిలభాగ్యము నీకు
చిందిన నీ ప్రసాదమే సిరులిచ్చె మాకును


చ. 3:

అచ్చుగ మునులు రు(ఋ?)షులందరును నీబంట్లే
తచ్చిన యేలికలు నీదాసులు మాకు
యిచ్చల శ్రీవేంకటేశ యిహపరమెల్లా నీవు
చొచ్చితిమి నీమరఁగు సూదివెంట దారమై

రేకు: 0256-03 శుద్ధవసంతం సం: 03-322 భక్తి


పల్లవి :

భక్తి నీపైదొకటె పరమసుఖము
యుక్తి చూచిన నిజంబొక్కటే లేదు


చ. 1:

కులమెంత గలిగె నది కూడించు గర్వంబు
చలమెంత గలిగె నది జగడమే రేఁచు
తలఁపెంత పెంచినాఁ దగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు


చ. 2:

ధన మెంత గలిగె నది దట్టమౌ లోభంబు
మొనయుఁ జక్కందనంబు మోహములు రేఁచు
ఘనవిద్య గలిగినను కప్పుఁ బైపై మదము
యెనయఁగఁ బరమపద మించుకయు లేదు.


చ. 3:

తరుణు లెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు
యిరవయిన శ్రీవేంకటేశ నినుఁ గొలువఁగా
పెరిగె నానందంబు బెళకు లిఁకలేవు

రేకు: 0256-04 లలిత సం: 03-323 వైరాగ్య చింత


పల్లవి :

ఇంతగాలమాయ నన్ను యేమీ నన్నవారు లేరు
చింత సంసారపుమాయఁ జిక్కించనే కాని


చ. 1:

యెందరు బ్రహ్మలో నన్నుయిటు పుట్టించినవారు
యెందరు యములో హరియించినవారు
యిందుకు నందుకేకాని యిల నేఁ జేసిన పాప-
మంది వహించుక కాచినట్టివారు లేరు


చ. 2:

 తల్లిదండ్రులెందరో తనువు వెంచినవారు
కొల్లగా సతులెందరో కూడినవారు
చిల్లర పనికే కాని చేరఁబిలిచి వైకుంఠ-
ముల్లసాన నిచ్చేవారు వొకరూ లేరు


చ. 3:

కాలమును వీటిఁబోయె కర్మమునుఁ దెగదాయ
మూలనుండి యెవ్వరికి మొరవెట్టేను
అలించి శ్రీవేంకటేశ అంతరాత్మవై నన్ను-
నేలితివి యింతపని కెవ్వరును లేరు

రేకు: 0256-05 సాళంగనాట సం: 03-324 వైరాగ్య చింత


పల్లవి :

పంచేంద్రియములనే పట్టణ స్వాములాల
తెంచి బేరమాడుకొని దించరో బరువు


చ. 1:

తగిన సంసారసముద్రములోనఁ దిరిగాడి
బిగువుదేహపు టోడబేహారివాఁడ
జగతిఁ బుణ్యపాపపు సరకులు దెచ్చినాఁడ
దిగితి బూతురేవునఁ దీరుచరో సుంకము


చ. 2:

అడరి గుణత్రయములనేటి తెడ్డుల చేత
నడుమ నిన్నాళ్ళదాఁకా నడపినాడ
కడుఁజంచలములనే గాలిచాప లెత్తినాఁడ
వెడమాయపు సరకు వెలకియ్యరో


చ. 3:

ఆతుమయనేటి కంభ మంతరాత్ముఁ డెక్కియుండి
నీతితో మమ్ముఁగాచుక నిలుచున్నాఁడు
ఆతఁడే శ్రీవేంకటేశుఁ డటు మాకు మీకుఁ గర్త
ఘాతమాని ఇఁక మాకు కడుగుణ మియ్యరో

రేకు: 0256-06 పాడి సం: 03-325 వైరాగ్య చింత


పల్లవి :

ఏడే జేనలు యీదేహంబును
యేడా నిఁకమరి యెరఁగము నేము


చ. 1:

నిండును జలధులు నిమిషమాత్రమున
నిండియు నిండదు నెఱి మనసు
పండును భువిఁగల పంటలన్నియును
పండదు నాలోఁ బాపపు మనసు


చ. 2:

 పట్టవచ్చు నల పారేటి పామును
పట్టరాదు నాపాయము
అట్టే ఆరును అనలము నీటను
యెట్టెన నారదు యీకోపంబు


చ. 3:

 కానవచ్చు నదె ఘనపాతాళము
కానరాదు నాకాలము
శ్రీనగవిహార శ్రీవేంకటేశ్వర
సోనలఁ బుట్టిన సుద్దులు నివిగో