తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 255

రేకు: 0255-01 లలిత సం 03-314 కృష్ణ


పల్లవి :

ఏల వెట్టిసేయించే విందున నీకేమివచ్చె
కాలముఁ గర్మముచేతఁ గప్పేవు లోకులను


చ. 1:

బద్దుల మాటలాడి భ్రమయించి రేపల్లెలో
ముద్దులు చూప వెన్నలు ముచ్చిలినట్టు
కొద్దిమాలిన కర్మము కొంత మాకు గడియించి
వద్ద నిన్నుఁ గానివాని (?) వలె దాఁగవలెనా


చ. 2:

మఱి పాండవులకు నెమ్మది వావులటు చెప్పి
మొఱఁగి యిందరిలోన మొక్కినయట్టు
కుఱకుఱ దైవాలఁ గొందరను గడియించి
యెఱిఁగి నెఱఁగనట్టే యేమి సేసేవయ్యా


చ. 3:

వరమడుగఁగఁ బోయి వడి ఘంటాకర్ణునికి
యిరవుగ మోక్షవరమిచ్చినయట్టు
తిరమై శ్రీవేంకటాద్రిఁ దిరువారాధన గొని
వరుస నీదాసులకు వరమిచ్చేవయ్యా

రేకు: 0255-02 ధన్నాసి సం: 03-315 నామ సంకీర్తన


పల్లవి :

తగు మునులు ఋషులు తపములు సేయఁగ
గగనము మోచియుఁ గర్మము దెగదా


చ. 1:

ధరణీధర మందరధర నగధర
చిరకౌస్తుభధర శ్రీధరా
కరిఁగాచితి కాకముఁ గాచితి నీ-
కరుణకుఁ బాత్రము గలదిదియా


చ. 2:

భవహర మురహర భక్తపాపహర
భువనభారహర పురహరా
కవిసిన పురుతను గద్దను మెచ్చితి-
వివల నీదయకు నివియా గురుతు


చ. 3:

శ్రీవేంకటపతి శేషగరుడపతి
భూవనితాపతి భూతపతి
గోవుల నేలితి కోఁతుల నేలితి
పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా

రేకు: 0255-03 శంకరాభరణం సం: 03-316 కృష్ణ


పల్లవి :

ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనెనట్టె
పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె


చ. 1:

ఘనయోగీంద్రుల మతిఁ గట్టువడనట్టివాఁడు
పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు
మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె


చ. 2:

అమృతము చేతఁ దెచ్చి అందరికిచ్చినవాఁడు
తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టే
గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు
భ్రమసి గోపికల పాలఁ జిక్కినాఁ డట్టె


చ. 3:

యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు
అందమై రేపల్లెవాడ నాడీనట్టె
అంది కృష్ణావతారమయినట్టి దేవుఁడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచెనట్టె

రేకు: 0255-04 రామక్రియ సం: 03-317 వైరాగ్య చింత



పల్లవి :

పెరిగి పెద్దఁ గాను మరి పిన్నవాఁడఁ గాను
యిరవుగ నే బుద్దెరిఁగెడి దెపుడు


చ. 1:

కంకిగ బహునరకంబులు చొచ్చితి -
నింకా భయమది యెరఁగను
జంకెనలనే పలుచదువులు చదివితి
మంకుఁదనం బిది మానదు


చ. 2:

తియ్యక కడుఁ బెనుదేహాలు మోచితి-
నయ్యో యింకా నలయను
నెయ్యపు హేయము నిచ్చలుఁ గడిగెద
చియ్యని రోయను సిగ్గూఁ బడను


చ. 3:

ధర్మము సేసితి దానము లొసఁగితి
కర్మములింకాఁ గడవను
అర్మిలి శ్రీవేంకటాధిప నీకృప
నిర్మలమైతిని నే నిపుడు

రేకు: 0255-05 బౌళి సం: 03-318 అధ్యాత్మ


పల్లవి :

కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో
నన్నుం గానను నిన్నుం గానను నడుము బట్టబయలు


చ. 1:

నీమాయమహిమో నే నేరని కడమో
భూమిలోన నీవున్నాఁడవు నా పుట్టుగులుఁ గలవు
యేమి గాఁగలనో యింకా మీఁదట నిటకతొల్లి యేమైతినో
సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను నేను


చ. 2:

జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో
నీనామంబులు అనంతకోట్లు నిలుకడగాఁ గాను
కానఁగల యీ ప్రపంచమెల్లా కలయో యిది నిజమో
కానరాని యీ ముక్కున నూర్పులు కాలముఁ గొలచేటి కుంచములు


చ. 3:

 నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యునినమ్మితినో
కైకొని నాయంతర్యామివి నినుఁ గంటినిపుడే నేను
శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వర శ్రీవైకుంఠమే యీజగము
యేకడ చూచిన నీదాసులు నాయెదుటనే వున్నారు.

రేకు: 0255-06 దేసాక్షి సం: 03-319 కృష్ణ


పల్లవి :

కానరు నాలుగు కరములవానిని
శ్రీనాథుండని చేరఁగవలదా


చ. 1:

ఘనచక్రముతో గరుడనినెక్కుక
కినిసి మెరయు నలకృష్ణునిని
ఘనులై ఇప్పటికాలపు మనుజులు
మునుప విష్ణుఁడని మొక్కఁగవలదా


చ. 2:

పలుదేవతలకు భయములు మాన్పుచు
అల విశ్వరూపమైనపుడు
చలము మాని యచ్చటికౌరవులును
తెలిసి దేవుఁడని కొలువఁగవలదా


చ. 3:

చెప్పిన యితఁడే శ్రీవేంకటమున
యెప్పుడు వరములు ఇయ్యఁగను
తప్పక యీతని దాసులవలెనే
యిప్పటివారలె యెరఁగఁగవలదా