తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 236


రేకు: 0236-01 వరాళి సం: 03-204 అధ్యాత్మ

పల్లవి:

ఎన్నఁడు వివేకించే దీడేరె దెన్నఁడు
యెన్నిలేవు జీవిపాట్లేమి చెప్పే దిఁకను

చ. 1:

నరజన్మమునఁ బుట్టి నానాభోగాలు మరిగి
హరి నెరఁగక మత్తుఁడై వుండును
సురలోకము చొచ్చి సుకృతి ఫలములంది
గరిమ విజ్ఞానమార్గము విచారించఁడు

చ. 2:

పెక్కుగాలము బ్రతికి పెనుఁగోరికలే కోరి
అక్కడ విష్ణుఁ గొల్వక అలసుఁడౌను
మిక్కిలిఁ దపముచేసి మించైనఘనత కెక్కి
తక్కక పరమమైన తత్త్వము దెలియఁడు

చ. 3:

వేవేలుబుద్దులు నేర్చి వేడుక సంసారియై
శ్రీవేంకటేశుఁ జెందక చింతఁ గుందును
దైవ మాతఁడే దయదలఁచి మన్నించుఁగాని
భావించి తనంతనైతే భవములఁ బాయఁడు


రేకు: 0236-02 దేసాక్షి సం: 03-205 శరణాగతి

పల్లవి:

నీవొక్కఁడవే యిత్తువు నిన్నుఁ గొల్చినవారికి
శ్రీవల్లభుఁడవు రక్షించవే నారాయణా

చ. 1:

పెక్కుజీవులు భువినిఁ బెరిగేరు మోక్షము
వొక్కరునుఁ దెచ్చి యియ్యనోప రెవ్వరు
అక్కజపుధనరాసు లంగళ్లలోనున్నవి
గక్కనఁ గొనేమంటే మోక్షము గొనరాదు

చ. 2:

వున్నవి పుణ్యకర్మాలు వొడ్డి యందే మోక్షము
మిన్నక యెక్కేమంటే మెట్లు గావు
యెన్నఁగ సంసారధర్మ మిదివో మోక్షము చూప
చన్నమన్నవారికెల్లా సాధనము గాదు

చ. 3:

పదునాల్గులోకములు పన్నివున్నవి మోక్షము
తుదకెక్కించ నవైనాఁ దోడుగావు
యిదివో శ్రీవేంకటేశ యిహపరము లొసఁగి
హృదయములో నున్నాఁడ వింకనేల చింత


రేకు: 0236-03 ఆహిరి సం: 03-206 అధ్యాత్మ

పల్లవి:

అక్కటా నీమాయ కగపడె జీవుఁడు
యెక్కువతక్కువ లివి యేమీఁ దలపోయఁడు

చ. 1:

గొందినున్న స్వర్గము గోరి పుణ్యము సేయును
యెందో తన వ్రాతఫల మెరఁగడు
సందడించి మరునాఁటి చవులకే కూడపెట్టు
పొంది మింగిన కళ్ళపులుసర మెంచఁడు

చ. 2:

అప్పటి దేహసమ్మంధపాలికే మనసు పెట్టు
తప్పిపోయినవారలఁ దగులఁడు
కప్పుకొనే కోకలకే కడఁగి చేతులు చాఁచు
చిప్పిలఁ దొల్లి చించివేసినవెన్నో యెంచఁడు

చ. 3:

యెదిటిగృహారామాలివే తనకాణాచను
చెదరి కలలోనివి చేపట్టడు
వెదకు వైకుంఠపు విష్ణుమూ ర్తిఁ గనేనని
హృదయములో శ్రీవేంకటేశుఁ జూడనెంచఁడు


రేకు: 0236-04 దేవగాంధారి సం: 03-207 శరణాగతి

పల్లవి:

నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు
జీవుఁడ నింతే నేను శ్రీమన్నారాయణా

చ. 1:

నిను నామనసుఁ గొని నేఁ దలఁచేనంటినా
మన ప్రకృతిఁ బుట్టె మరి నిన్నెట్టు దలఁచీ
తనువుఁ గొని నీసేవ తగిలి సేసేనంటినా
తనువు కర్మాధీనము తగిలీనా నిన్నును

చ. 2:

గరిమ నర్థమిచ్చి నీగతి గనేనంటినా
హిరణ్య మజ్ఞానమూల మెట్టు నీకు నియ్యనిచ్చీ
సిరుల నాజన్మము నీసెలవు సేసేనంటినా
సరిఁ బుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా

చ. 3:

యిలఁ బుణ్యఫలము నీకిచ్చి మెప్పించేనంటినా
ఫలము బంధమూల మేర్పడనియ్యనిచ్చీనా
నిలిచి శ్రీవేంకటేశ నే నీశరణు చొచ్చితి
యెలమి నీకరుణ నన్నెడయనిచ్చీనా


రేకు: 0236-05 సామంతం సం: 03-208 శరణాగతి

పల్లవి:

మాయామయములివి మాయకు నీ వేలికవు
చాయకుఁ దెచ్చేనంటే స్వతంత్రుఁడ నయ్యేనా

చ. 1:

తెగని కోరిక తానే తీఁగెవలె నల్లుకోఁగా
తగదని మానుప నా తరమయ్యీనా
వగలఁ గోపము పామువలె నాలుక చాఁచఁగ
పగటు తోడఁ దొడికి పట్టఁగ నేరుతునా

చ. 2:

వయసు తానే మేఘమువలె సోన గురియఁగా
జయించి నే దాని నణఁచఁగ నోపేనా
లయించక లోభము జలఁగవలెఁ బీరుచఁగా
నియమించి మట్టుపెట్ట నేఁడు నాకు వసమా

చ. 3:

యేపున గర్వము దానే యేనుగవలె మీరఁగా
చేపట్టి చిక్కించుకో నాచేత లోనౌనా
యేపొద్దు శ్రీవేంకటేశ యివి వాని స్వభావాలు
కాపాడవే నన్ను నే నెక్కఁడా నీ దాఁసుడను


రేకు: 0236-06 సామంతం సం: 03-209 శరణాగతి

పల్లవి:

చిత్తగించవే దేవ శ్రీపతి నావిన్నపము
హత్తి నీదాఁసుడనైతి నపరాధాలున్నవా

చ. 1:

జగములు నడచేటి సహజ మింతే కాక
వెగటు నాచేఁతలు వేరే వున్నవా
జిగిఁ గర్మమిలఁ జేయించే కాఁపురమే కాక
నిగిడి నావల్ల వేరే నేర్పు నేరాలున్నవా

చ. 2:

పంచ మహాభూతాల స్వభావము లింతే కాక
అంచెల నాకు వేరే జన్మాదులున్నవా
కొంచక పనిగొనేటి గుణత్రయమింతే కాక
పంచివేయ నాకు వేరే పాపపుణ్యాలున్నవా

చ. 3:

సరిఁ గౌమారయవ్వనజరాల చందాలే కాక
గరిమ నాకు వేరే వికారాలున్నవా
యిరవై శ్రీవేంకటేశ యింతా నీకల్పితమే
కరుణించు మీయాత్మ కౌఁగాము లిఁక నున్నవా