తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 237


రేకు: 0237-01 ధన్నాసి సం: 03-210 అధ్యాత్మ

పల్లవి:

ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు
పదిలానఁ గొలువఁగా ప్రత్యక్షమయ్యేవు

చ. 1:

యెదలో నుండుదువని యిన్ని వేదాలు చెప్పగా
వెదకి ధ్యానము సేతు వెస గనుఁగొంట లేదు
చెదర కందే మరి జీవుఁడు నున్నాఁ డందురు
పదిలముగాఁ జూతు భావించరాదు

చ. 2:

అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా
చింతించి పట్టఁదలఁతు చేతికిఁ జిక్కుట లేదు
సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు
మంతనానఁ బిల్తు నొకమాట వినఁబడదు

చ. 3:

రవిలో నుందువని సురలు నిన్నుఁ గొలువఁగా
తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుట లేదు
యివల శ్రీవేంకటాద్రి నిరవై నీవున్నాఁడవు
తివిరి సేవించితిమి ద్రిష్టమాయ మాకు


రేకు: 0237-02 దేసాక్షి సం: 03-211 అధ్యాత్మ

పల్లవి:

ఇట్టె జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే
పుట్టుగులు మరి లేవు పొందుదురు మోక్షము

చ. 1:

అతిసూక్ష్మ మీయాత్మ అందులో హరి యున్నాఁడు
కతలే వినుటగాని కానరాదు
క్షితి దేహాలు ప్రకృతిఁ జెందిన వికారములు
మతి నిది దెలియుటే మహిత సుజ్ఞానము

చ. 2:

లోకము శ్రీపతియాజ్ఞలో తత్త్వా లిరువదినాల్గు
కైకొని సేఁతలు సేసీఁ గర్తలు లేరు
సాకిరింతే జీవుఁడు స్వతంత్రుఁడు దేవుఁడు
యీకొలఁది గని సుఖియించుటే సుజ్ఞానము

చ. 3:

కాలము దైవము సృష్టి కలి మన్యుల భాగ్యము (?)
వాలాయించి యెవ్వరికి వచింపరాదు
యీలీలలు శ్రీవేంకటేశునివి ఆచార్యుఁడు
తాలిమిఁ జెప్పగా విని తలఁచుటే సుజ్ఞానము


రేకు: 0237-03 భూపాళం సం: 03-212 అధ్యాత్మ

పల్లవి:

పరమయోగీశ్వరుల పద్ధతి యిది
ధరణిలో వివేకులు దలపోసుకొనుట

చ. 1:

మొదల నాత్మజ్ఞానము దెలిసి పిమ్మట
హృదయములోని హరి నెరుఁగుట
వుదుటైన యింద్రియాల నొడిసి పంచుకొనుట
గుదిగొన్నతనలో కోరికె లుడుగుట

చ. 2:

తన పుణ్యఫలములు దైవము కొసగుట
పనివడి యతనిపై భక్తిచేసుట
తనివితో నిరంతర ధ్యానయోగపరుఁడౌట
మనసులోఁ బ్రకృతిసమ్మంధము మరచుట

చ. 3:

నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట
చిడుముడి నాచార్యసేవసేయుట
యెడయక శ్రీవేంకటేశుపై భారమువేసి
కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట


రేకు: 0237-04 శుద్ధవసంతం సం: 03-213 అధ్యాత్మ

పల్లవి:

లే దందువల్లఁ దెలివి యెన్నటికిని
నీదయ నాపై నించినఁ గాని

చ. 1:

అరయఁగఁ బ్రపంచ మలవడినటువలె
అరుదగు వై రాగ్య మలవడదు
తరుణులరతి మతిఁ దలఁచినయటువలె
ధర నీ సాకారము దలఁచదు మనసు

చ. 2:

గొనకొన్న యర్థము గోరినయటువలె
కొనయగు మోక్షము గోరదు
తనుభోగములకుఁ దగిలినయటువలె
తనిసి నీకథలకుఁ దనియదు మనసు

చ. 3:

చలమును బాపము చవియైనటువలె
సలలితపుణ్యము చవిగాదు
సులభ శ్రీవేంకటేశుఁడ నీమహిమిది
గలిగితివి నాకుఁ గలఁగదు మనసు


రేకు: 0237-05 ముఖారి సం: 03-214 అధ్యాత్మ

పల్లవి:

పామరుల కెంతైనా ఫలియించనేరదు
శ్రీమాధవ నీవు దయసేసితే నీడేరును

చ. 1:

అన్నిటా దైవముఁ దమ్ము నందరు నెరుఁగుదురు
యెన్నుక వావివర్తన లెరుఁగుదురు
పన్ని జననమరణభయము లెరుఁగుదురు
వన్నెల నెరిఁగెరిఁగి వలలఁ జిక్కుదురు

చ. 2:

విందురు పురాణాలు విందు రుపదేశాలు
విందురు తొల్లిటివారి విచారాలు
విందురు స్వర్గనరకవిభవము లన్నియును
మందలించి వినివిని మాయకు లోనౌదురు

చ. 3:

నడతు రాచారమున నానాదానాలుఁ జేతురు
విడువక తీర్థయాత్ర వెసఁ జేతురు
యెడయక శ్రీవేంకటేశ నీవుండఁగఁ దప-
మడవులఁ జేసిచేసి అలయుచుండుదురు


రేకు: 0237-06 నాగవరాళి సం: 03-215 అధ్యాత్మ

పల్లవి:

ఎట్టు వేగించీ జీవుఁ డిన్నిటిలోనా చే-
పట్టి రక్షింతువుఁ గాక పరమేశ్వరా

చ. 1:

బల్లిదుఁడై వైరాగ్యాన పదార్థము లన్నియును
వొల్లనంటేనే నోరూరించును
వొల్లనే కావలెనని వొడిసి పట్టఁజూచితే-
నల్లంతనుండి యాసల నలయించును

చ. 2:

యించుక మొదలువెట్టు యిచ్చాద్వేషాలు ముందు
మించు రాఁగా రాఁగా బెట్టిమీఁదఁ గప్పును
పొంచి యంతలోఁ దెలిసి పొంగణఁగి వుండితేను
వంచించొక్క కారణాన వచ్చి ప్రవేశించును

చ. 3:

వేసరి యడవినున్నా వెంటనే సుఖదుఃఖాలు
పాసిపోక కొంత యనుభవింపించును
రోసి పాయలే రెవ్వరు రుచులయ్యే తోఁచు నివి
శ్రీసతీశ కనుఁగొను శ్రీవేంకటేశ్వరా