తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 235
రేకు: 0235-01 సామంతం సం: 03-198 శరణాగతి
పల్లవి:
ఏడ ధర్మ మేడ కర్మ మిన్నియు నీ సేవేకాక
యీడనే యిందుకు సాక్షి ఇట్టే నిలిపితివి
చ. 1:
తెగువసేసి నీకుఁ దెచ్చిరి బోనములు
మగండ్లమాటదోసి మౌనిసతులు
తగ నిన్నుఁ జేపట్టుటే ధర్మముగా నిలిపి
జగ మెరఁగఁగ వేదసమ్మతి సేసితివి
చ. 2:
బల్లిదాన నిన్నుఁ బొందే బలుసాహసము సేసి
తల్లిదండ్రిమాట దోసి తానే రుక్మిణి
యెల్లగా నీకు మోహించు టెక్కుడుతగవు సేసి
వెల్లవిరి నాపె నీవు వీధుల నేఁగితివి
చ. 3:
శ్రీవేంకటేశ నిన్ను సేవించవచ్చితేఁ జాలు
భావించి రక్షింతువు నీపరుషలను
యీవల నీకు మొక్కుటే యిన్ని పుణ్యములూ జేసి(?)
కావించి హీనుల మమ్ము ఘనులఁ జేసితివి
రేకు: 0235-02 లలిత సం: 03-199 నామ సంకీర్తన
పల్లవి:
నమో నారాయణ నా విన్నప మిదివో
సమానుఁడఁ గాను నీకు సర్వేశ రక్షించవే
చ. 1:
మనసు నీ యాధీనము మాటలు నీ వాడేటివే
తనువు నీపుట్టించిన ధన మిది
మును నీపంపున నిన్ని మోచుకున్నవాఁడ నింతే
వెనక నన్ను నేరాలు వేయక రక్షించవే
చ. 2:
భోగములెల్లా నీవి బుద్దులు నీవిచ్చినవి
యీగతి నాబతుకు నీ విరవైనది
చేగదేర నీవు నన్నుఁ జేసిన మానిసి నింతే
సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే
చ. 3:
వెలి నీవే లో నీవే వేడుక లెల్లా నీవే
కలకాలమును నీకరుణే నాకు
యిల శ్రీవేంకటేశ నీవేలుకొన్నబంట నింతే
నెలవు దప్పించక నీవే రక్షించవే
రేకు: 0235-03 ఆహిరి సం: 03-200 శరణాగతి
పల్లవి:
ఏమి సేయఁగలవాఁడ నిదివో నేను
నీమరఁగు చొచ్చితిఁగా నీచిత్త మిఁకను
చ. 1:
పుట్టినవాఁడను నేను భోగించేవాఁడను నేను
గట్టిగా నిప్పుడు నాకుఁ గర్తవు నీవు
పట్టరాదు జవ్వనము పాయరాదు సంసారము
యిట్టి వెల్ల నీమాయ యేమీ ననరాదు
చ. 2:
కడుఁగాంక్షలు నాసొమ్ము కర్మములు నాసొమ్ము
నడమ నంతర్యామివి నాకు నీవు
వుడివోవు కోరికలు వొదుగదు కోపము
కడదాఁకా నీమహిమ కాదనరాదు
చ. 3:
భావించలేనివాఁడను ప్రకృతిలోనివాఁడను
శ్రీవేంకటేశ దయ సేసితివి నీవు
తోవదప్పదు జ్ఞానము తొలఁగదు వివేకము
దేవుఁడవు నీమర్మము తెలియఁగరాదు
రేకు: 0235-04 కాంబోది సం: 03-201 శరణాగతి
పల్లవి:
ఏమి సేయఁగలవార మెందుకు నౌదుము నేము
శ్రీమాధవ నీవే దయఁ జిత్తగించు మమ్మును
చ. 1:
వేసరక పుణ్యాలు గావించేదే యరుదుగాని
సేసేనంటే పాపములు చేతిలోనివే
గాసిలక చూచితేఁ జీఁకటైనా వెలుఁగౌఁగాని
వీసమంత మఱచినా వెలుఁగైనాఁ జీఁకటే
చ. 2:
తెలివితో మోక్షము సాధించేదే యెక్కుడుగాని
అలయించే లోకములెన్నైనా గలవు
తలఁచితే నీరూపము తానే యెదుటనుండు
యిలఁ బరాకై వుండితే నెచ్చోటాఁ జిక్కదు
చ. 3:
యీవల నీ దాఁసుడయ్యేది ఘనముగాని
దావతి రాజసాలంతటా నున్నవి
శ్రీవేంకటేశ్వర నీ సేవే ధ్రువపదము
దేవతాంతరమెల్లా దిగ్గుడుకు దిగ్గుడు
రేకు: 0235-05 నాట సం: 03-202 వేంకటగానం
పల్లవి:
కాదనేటి వారెవ్వరు కడలనుండి
సేద దేరిచి నీవేమి సేసినానుఁ జెల్లును
చ. 1:
తక్కక బ్రహ్మాది దేవతలకు నాయకుఁడవు
మక్కువ శ్రీసతికి మగఁడవు
చక్కనివాఁడవు మరి చంద్రసూర్యనేత్రుఁడవు
వుక్కు మీరి నీ వెట్లానుండినా నమరును
చ. 2:
కామునిఁ గన్నతండ్రివి కడుఁ జక్కఁదనమున
ఆముకొన్నయట్టి చక్రాయుధుఁడవు
కామించి యెందుఁ జూచినా గరుడవాహనుఁడవు
వేమరు నీవెటువలె వెలసినా నమరును
చ. 3:
అందరి లోపలనుండే అంతర్యామివి నీవు
చందమైన పరబ్రహ్మస్వరూపుఁడవు
యెందును శ్రీవేంకటాద్రి నిరవైనవాఁడవు
అంది మమ్ము నేలితేను అన్నిటా నమరును
రేకు: 0235-06 లలిత సం: 03-203 అధ్యాత్మ
పల్లవి:
తెగక పరమునకుఁ దెరువులేదు
పగయెల్లా విడువక భవమూఁ బోదు
చ. 1:
కన్నుల యెదుటనున్న కాంచనముపై మమత
వున్నంతదడవు మోక్ష మొనగూడదు
అన్నముతోడి రుచుల యలమట గలదాఁకా
పన్నిన సుజ్ఞానము పదిలము గాదు
చ. 2:
పక్కనున్న కాంతల భ్రమగల కాలము
మిక్కిలి శ్రీహరిభక్తి మెరయలేదు
వెక్కసపు సంసారవిధి నున్నంతదడవు
నిక్కి పరమధర్మము నిలుకడ గాదు
చ. 3:
చిత్తము లోపలి పలుచింతలు మానినదాఁకా
సత్తుగా వైరాగ్యము సమకూడదు
యిత్తల శ్రీవేంకటేశుఁ డేలిన దాసులకైతే
హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు