తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 234


రేకు: 0234-01 సాళంగనాట సం: 03-192 అన్నమయ్య స్తుతి

పల్లవి:

నేనింత సేసినయట్టి నేరమి మరవవయ్య
ఆనుకొని తాళ్లపాక అన్నమయ్యఁ జూచి

చ. 1:

నావొళ్లి యపరాధా లెన్నక నిన్ను సారెసారె
వేవేలు దూరితి విచారించక
కావించి కన్నులలోని కళంకు దెలియలేక
ఆవలఁ జందురు నలుపణఁకించినట్లు

చ. 2:

పాయక నేఁ జేసినట్టి పాపము లెంచుకొనక
ఆయాలు మోవనాడితి నదివో నిన్ను
మాయల నాదేహమిది మలినమే తలఁచక
చాయ లేదని యద్దము సారెఁ దోమినట్లు

చ. 3:

మదమత్సరాలు నాలో మానకిట్టే వుండఁగాను
అదియే నీచేఁతంటా నాడుకొందును
యెదలో శ్రీవేంకటేశ యిరవై నీ వుండఁగాను
వెదకి వెదకి నీకే వెఱ్ఱిగొన్నయట్లు


రేకు: 0234-02 లలిత సం: 03-193 కృష్ణ

పల్లవి:

ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా

చ. 1:

చందురునుదయవేళ సవరేతిరికాడ
కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటి వాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా

చ. 2:

వసుదేవుని యెదుట వైకుంఠనాథుఁడు
సిసువై యవతరించి చెలఁగీనమ్మా
ముసిముసి నవ్వులతో మునులకు బుషులకు
యిసుమంత వాఁడభయమిచ్చీనమ్మా

చ. 3:

కన్న తల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూఁక లణఁచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
పన్ని నిచ్చకల్యాణాలఁ బరగీనమ్మా


రేకు: 0234-03 సామంతం సం: 03-194 కళ్యాణ కీర్తనలు

పల్లవి:

పసిఁడి యక్షంత లివె పట్టరో వేగమే రారో
దెసలఁ బేరటాండ్లు దేవుని పెండ్లికిని

చ. 1:

శ్రీవేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి
దైవికపుఁ బెండ్లిముహూర్తము నేఁడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని

చ. 2:

కందర్పజనకునికిఁ గమలాదేవికిఁ బెండ్లి
పందిలిలోపలఁ దలఁబ్రాలు నేఁడు
గందమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని

చ. 3:

అదె శ్రీవేంకటపతి కలమేలుమంగకును
మొదలి తిరుణాళ్లకు మొక్కేము నేఁడు
యెదుట నేఁగేరు వీరె యిచ్చేరు వరములివె
కదలి రారో పరుష ఘనుల పెండ్లికిని


రేకు: 0234-04 బౌళి సం: 03-195 దశావతారములు

పల్లవి:

ఇందుకే కాలమందే యీతని శరణంటిమి
ముందుముందే దయఁజూచి మొగిఁ గాచుఁగాక

చ. 1:

పుడమి గుంగిన నెత్తె పురుషోత్తముఁ డితఁడు
యెడసి కొండ గుంగితే నెత్తె నితడు
అడరి సంసారవార్ధి నడగిన దాసులను
యిడుముల బొందకుండా యెత్తి కాచుఁగాక

చ. 2:

పట్టి ప్రహ్లాదు బాధలు పాపిన దేవుఁ డితఁడు
రెట్టిగా వేదము లుద్ధరించె నితఁడు
వట్టి దుష్టులలో సహవాసమైతే దాసులను
దిట్టయై వెళ్లఁదీసి తా దిక్కై కాచుఁగాక

చ. 3:

లంకలో సీతఁ దెచ్చిన లావరి తానే యితఁడు
మంకు అహల్యశాపము మాన్పె నితఁడు
అంకెల శ్రీవేంకటేశుఁ డతిభీతిఁ బాపి మమ్ము
గొంకక తన దాసులఁ గూడి కాచుఁగాక

Î


రేకు: 0234-05 దేసాళం సం: 03-196 అధ్యాత్మ

పల్లవి:

ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు
గోడ గడుగ నడుసే కురిసీనో మనసా

చ. 1:

చిత్తము లోపలనున్న చింతామణి యీహరి
యిత్తలఁ గోరినవెల్లా నియ్యఁగాను
తత్తరించి తలఁచక దవ్వువోయి పరులకు
దెత్తివై యేల నోళ్లు దెరిచేవో మనసా

చ. 2:

కన్ను లెదుటనే హరి కల్పవృక్షమై యుండి
మన్నించి లోకమెరఁగ మనుపఁగాను
యెన్ని వలసిన మరి యీతనినే యడుగక
కన్నవారి నేలడుగఁ గటకటా మనసా

చ. 3:

శ్రీవేంకటేశుఁడే మనచేతి పరుసమై యుండి
తావున నిహపరాలు తానియ్యఁగాను
భావించి మొక్కక వేరే బద్దులైన జీవులను
దావతిపడుచు నేల తగిలేవో మనసా


రేకు: 0234-06 లలిత సం: 03-197 అధ్యాత్మ

పల్లవి:

మంగళసూత్ర మొక్కటే మగనాలికిఁ గట్టేది
అంగవించే మీఁదిపన్నులన్నియు విభునివే

చ. 1:

తలఁపు లోపల నిన్నుఁ దలఁచినానుఁ గలవు
తలఁచకున్నా నంతరాత్మవై కలవు
పలుపూజ లిఁకనేల భక్తిసేయనేల నీవు
గలవని నమ్మేదొక్కటే బుద్ధిఁ గాకా

చ. 2:

మొక్కినా రక్షింతువు మొక్కకున్నా జగములో
యిక్కువతో రక్షింతువు యెపుడు నీవు
పెక్కు విన్నపాలేల పిలిచి యలయనేల
తక్కక నమ్మేటిది నీదాస్య మొక్కటే

చ. 3:

కడు సుజ్ఞానినైనా నీగర్భవాసమే వునికి
వెడ నజ్ఞానినైనాను విడిదక్కడే
బడినే శ్రీవేంకటేశ పలునా వుద్యోగాలేల
నిడివి నిన్ను నుతించే నేమమే నాది